1808-1843 నాటి నిజాం రాజ్య చరిత్రలోని చిత్రకథలు 4

ఆంధ్రుల చరిత్రలో వెలుగు చూడని కొన్ని ఘట్టాలు 4: నిజాం రాజ్యంలో వాణిజ్య పరిశ్రమలు, రాకపోకలు, రవాణాలు

ఇంగ్లీషువారీ దేశములో వర్తకము చేయుటకు వచ్చినప్పటికి దేశమున రవసెల్లాలు జిలుగు వలువలు తయారగుచుండెను. ఈ దేశపు పారిశ్రామికులు తయారుచేయు వస్తువులు చాలా అందముగానుండి మన్నికగలవై పాశ్చాత్యదేశములందు చాలా విలువలకమ్ముడుపోవుచుండెను. అందువలన పాశ్చాత్య వర్తకులు బంగారమునిచ్చి మన వస్తువులు వస్త్రములు కొని ఎగుమతి వ్యాపారం చేయుచుండిరి. మనదేశములోని రాజులను నవాబులను నాశ్రయించి, తామొక్కరు మాత్రమే వ్యాపారము చేసికొను హక్కును పొంది తమకు చౌకగా వస్తువులు నిచ్చునట్లు దేశీయ పారిశ్రామికులను నిర్భంధించుచు పీడింపసాగిరి.

ఈ దేశములోని సైనికులకు క్రమశిక్షణము లేనందున 1757లో జరిగిన ప్లాసీ యుద్ధములోను ఇతర యుద్ధములలోను క్రమశిక్షణముగల ఇంగ్లీషు సైనికులు సులభముగా మనసేనల నోడించగలిగిరి. అదిగాక మన రాజులు నవాబులు ఒండొరులతో పోరాడుకొనుచున్నందున ఇంగ్లీషువారు మన సైనికులనే తర్ఫీదుచేసి రాజులను నవాబులను ఒకరిపైనొకరిని ప్రేరేపించి సులభముగ రాజ్యాక్రమణచేసి తమ వ్యాపారము మరింత లాభకరముగా చేసికొను మార్గములవలంబించిరి.

వర్తకలాభములతోపాటు ఉద్యోగుల జీతముల వలనను లంచములద్వారా దోపిడి చేయుట వలనను కోట్లకొలది సొమ్ము ఇంగ్లాండుకు తరలింపసాగిరి. వారి అదృష్టవశముచేత ఆ సమయముననే ఆవిరి యంత్రములు ఇంగ్లాండులో వెలసి అనేక పరిశ్రమలకు ఉపయోగపడినవి. అంతట హిందూదేశపు చేతిపనివాండ్రకు పోటీగా ఇంగ్లీషు యంత్రములపైన తయారైన వస్తువులను ఇంగ్లీషువారీదేశమునకు తెచ్చి విక్రయించు పోటీవ్యాపారమును ప్రారంభించిరి. తమ రాజ్యాధికారములను పలుకుబడిని ఈ దేశ పరిశ్రమలను నాశనము చేసి తమ పరిశ్రమలను వ్యాపారమును అభివృద్ధి చేసుకొనుటకే ఉపయోగింపసాగిరి. ఇట్లొక్కమారుగా ఆర్థికవ్యవస్థ తారుమారైనది. ఉదాహరణమునకు 1816 నాటికి కూడా భారతదేశములో తయారైన వస్త్రములు దేశములోని ప్రజలందరికి సరిపోవుట అటులుండగా ఆ సాలున మిగిలిన సరుకులో 1659438 నవరసుల విలువగల వస్త్రములు ఎగుమతియైనట్లు ఇంగ్లీషువారి లెక్కలవలన తెలియుచున్నది. 1825 నాటికి ఢాకా మజిలీనుల ఎగుమతి వ్యాపారము పూర్తిగా ఆగిపోయినది. మధ్యభారతములో పొలిటికల్ ఏజంటుగానుండిన కెప్టెన్ విల్కిన్‌సన్‌గారు హైదరాబాదు రెసిడెంటుగానుండిన ఫ్రేజరుగారికి 1838లో వ్రాయుచు ‘నేతగాండ్రు బిచ్చగాండ్ర స్థితికి దిగిపోయినారు. మనము యంత్రములపైన నేసిన నూలుబట్టలను యీదేశములోనికి తెచ్చి ముంచెత్తివేసినందువలన ఈ నేతగాండ్రు నోటి అన్నమును మనము పడగొట్టినాము’ అని ఆ పరిస్థితి స్పష్టముగా వివరించినాడు. (Hyderabad Residency Records Vol. 394 పుట 73)

ఈ అన్యాయపు పరిస్థితి దాపురింపక పూర్వము నిజాము రాజ్యములోని ఔరంగాబాదు పైఠాను జిల్లాలో సరిగంచుల నేతయు నాందేడులో ఢాకా మల్‌మల్ మజిలీనులతో తులతూగు మజిలీను వస్త్రముల పరిశ్రమయు వ్యాప్తిలోనుండెను. మచిలీ బందరు నుండి కాలికోలును, ఉత్తర సర్కారుల తూర్పుకోస్తాలో తయారైన వస్త్రములను ఎగుమతి చేయబడుచుండెను. ఉన్ని కంబళ్ళు పట్టుతివాచీలు ఔరంగాబాద్‌లో నేయుచుండిరి. హైదరాబాద్ సంస్థానములో వరంగల్ జంపఖానాలు తివాచీలు ప్రసిద్ధికెక్కినవి. వానిని 1851లో లండనులో జరిగిన ప్రదర్శనమునకు పంపిరనినచో ఆనాటికి కూడా అవి ఎంతబాగుండెనో, ఎంత ప్రసిద్ధిచెందెనో తెలియగలదు. నూలును పట్టును కలిపినేసిన ‘మష్రా’ అనునొకతరహా బట్టను హైదరాబాదులోను గద్వాల సంస్థానములోను నేయుచుండిరి. ‘టస్సరు’ పట్టుబట్టలను వరంగల్లు, నారాయణపేట, మట్లాడ, హసన్‌పర్తి, కరీంనగర్ జిల్లాలలోని మాధవపురంలలో నేయుచుండిరి. ఇండోరు నిజామాబాద్ మెదక్ హైదరాబాద్‌లోను మహబూబ్‌నగర్‌కు పదిమైళ్ళ దూరములోనున్న కోయిలకొండలోను కాగితములను తయారు చేయుచుండిరి. వరంగల్లు, కూనసముద్రము, తిందుర్తి, కొమరమల్లి, నిర్మల, జగిత్యాల, అనంతగిరి, లింగంపల్లి, నిజామాబాదు మొదలగు స్థలములలో ఇనుము కరిగించి ఇనుప సామానులు తయారు చేయుచుండిరి. ఇల్లిందల, ఇబ్రహింపట్నం, కోనాపురము, చింతలపేట మొదలగు ప్రాంతములలో కూడా ఉక్కు పరిశ్రమయుండెను. హైదరాబాదు, గద్వాల, వనపర్తి, కొల్లాపురములలో 1890 వరకును కూడా కత్తులను తయారుచేయుచుండిరి. గద్వాలలోను వనపర్తిలోను మంచి తుపాకులను తయారుచేసి 20-00లు మొదలు 60-00 వరకు ఖరీదుకు అమ్ముచుండిరి. (చూడుడు చిల్‌గ్రామి, సురవరము ప్రతాపరెడ్డిగారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర పుటలు 443, 444.)

ఆ రోజులలో సామాన్యపు చీర ఖరీదు రెండు రూపాయలుండెను. మష్రుదుస్తులకు పనికివచ్చు 6-1/2 గజముల తాను 13 రూపాయలు మొదలు 45 రూపాయలు వరకునుండెను.

‘కలబట్టు’ వేసి నేసిన 15 గజముల తలపాగా ఖరీదు 5రూపాయలు ఉండగా 3 గజముల ‘కీన్‌కాబు’ నూరురూపాయలకు తక్కువకు దొరకకుండెను. ఇంగ్లీషు వర్తకులీ అపూర్వపు సరుకులను ఎగుమతిచేసి నూటికి నూరురెట్లు లాభముతో ఐరోపాలో అమ్ముకొనుచుండిరి. ఈ దేశీయ పరిశ్రమలన్నియు పైన చెప్పిన సందర్భములలో పూర్తిగా క్షీణించి నాశనములయ్యెను. ఇంగ్లీషువారికి చేతగాని కొన్ని అపురూప చేతిపని పరిశ్రమలు మాత్రము నిలిచినవి. ఉదాహరణమునకు ఉత్తర హిందూస్థానములో వలెనే తెలంగాణములో కూడా ‘చిద్రీ’ అను వెండిపూత నగిషీవస్తువులు చేయుదురు. రాగి, తగరము, తుత్తునాగము, సీసము కలిసిన పంచలోహములతో తమలపాకుల పళ్ళెములు, పాత్రలు, పీకిదానులు, మొదలైన అనేకవిధములైన సామానులు తయారుచేసి దానిమీద చిత్రచిత్రములైన నగిషీలు చెక్కుదురు. వెండిపూత పూయుదురు. ఇది అతి సున్నితమైన పని. పనివాడు తన కళాకౌశలము ప్రదర్శించి ఎంతో నెమ్మదిగా నెన్నోదినములు కష్టపడి ఒకటొక్కటిగా తయారుచేయవలసినదేగాని ఇది యంత్రములపైన వందలకొలదిగా తయారుచేసి ముంచెత్తుటకు వీలైన పరిశ్రమ కాదు. అందువలన నీపరిశ్రమ తెలంగాణములో నేటికిని నిలిచియుండినది.  

రాకపోకలు – రవాణాలు

టెవర్నియరు అను ఫ్రెంచి దేశపు వజ్రముల వర్తకుడు 1636-1662 మధ్య ఆరుసార్లు తూర్పుదేశములలో పర్యటనము చేసి భారతదేశమునందు కూడా ప్రయాణము చేసినాడు. అతడు సూరతునుండి షాజహాను చక్రవర్తి రాజధానియైన ఆగ్రా నగరమునకు 40 రోజులు ప్రయాణమనియు, దానికి 40 లేక 45 రూపాయలు ఖర్చు అగుననియు, సూరతునుండి గోలకొండకు కూడా అంతే దూరమనియు, ప్రయాణమునకంతే ఖర్చు అగుననియు వ్రాసినాడు. ఇంతేకాక సూరతునుండి ఆగ్రాకొక మార్గమున 339 క్రోసుల దూరమనియు, ఇంకొక మార్గమున 415 క్రోసుల దూరమనియు అతడు చెప్పియున్నాడు.

టెపర్నియరు సూరతునుండి వైరా పింపల్నారు, దౌలతాబాదు, ఔరంగాబాదు అష్టిమార్గమున గోలకొండ సుల్తానుగారి రాజధానియైన గోలకొండ – హైదరాబాదుకు 324 క్రోసుల దూరమని వివరించి పింపల్నారునుండి గోలకొండకు మరియొక మార్గమున్నదని కూడా చెప్పినాడు. ఆగ్రా నుండి దౌలతాబాదుకును, అక్కడనుండి గోలకొండకు మార్గమున్నదనియు చెప్పినాడు. అతడు గోలకొండ నుండి మచిలీబందరుకు ప్రయాణము చేసియుండెను. గోలకొండ నుండి కొల్లేరు వజ్రపుగని దగ్గరకు నూరుక్రోసుల దూరమనియు, గోలకొండనుండి మచిలీబందరుకు పోవు మార్గమధ్యమున ఎత్తయిన కొండలున్నందువలన బండ్లలో ప్రయాణం చేయుటకు వీలులేదనియు వ్రాసెను. సూరతునుండి గోవా పట్టణమునకు 61 క్రోసుల దూరమనియు, అక్కడ నుండి బిజాపురమునకు 85 క్రోసులను 9 దినములలో ప్రయాణము చేయవచ్చుననియు, బిజాపురమునుండి గోలకొండకు 100 క్రోసులున్నదనియు, అది కూడా 9 దినముల ప్రయాణమనియు వ్రాసియున్నాడు.

టెవర్నియరు మచిలీబందరు నుండి కందుకూరు, గూడూరు పులికాట్(ప్రళయకావేరి) మద్రాసుమార్గమున గండికోటకును, అక్కడినుండి తిరుపతిమార్గమున గోలకొండకును పోవుబాటను వర్ణించినాడు. ఇట్లాకాలమున ఆంధ్రదేశమునందు పలుప్రక్కలకు రాకపోకమార్గములుండెను. అయితే అవి నేటి కాలమువలె కంకరవేసిన మంచిబాటలు కావు. సంపన్నులు పల్లకీలలో ప్రయాణము చేయుచుండిరి. కొన్నిచోట్ల ఎడ్లబండ్లు నడుచునుగాని చాలచోట్లనవి నడువవు. సరకులను వేలకొలది ఎడ్లపైనగాని కంచరగాడిదలపైనగాని రెండు ప్రక్కలకు వ్రేలాడునట్లు వీపులపై వేయబడిన సంచుల జతలయందాసరుకులను వేసి తీసికొనిపోవుచుండిరి. ఈ సంచుల జతలకు అసిమిసంచులనియు కంట్లములనియు పేర్లు. ఇట్లు వందలకొలది వేలకొలది జంతువులపైన నీసరుకులను రవాణాచేయు బిడారులు నడుపువారిదొక పెద్ద లాభకరమైన వ్యాపారముగను వృత్తిగనుండెను. అందులో లంబాడీలు సుగాలీలు బ్రింజారీలు–మొదలైన వర్ణములవారు ఉండిరి. వీరిలో ధనవంతులు, బలవంతులు నుండిరని ఒక్కొక్కప్పుడొక బిడారునకింకొక బిడారు ఎదురైనచో ఒకరికొకరు దారినివ్వక తగవులు పెట్టుకొని పోరాడుచుందురనియు ఈ తగవులను తీర్చుటకాదేశమునేలు రాజులే జోక్యము కలిగించుకొనవలసి వచ్చుచుండెననియు టెవర్నియరుగారు వ్రాసినాడు. ఒక్కొక్కరకము సరుకునొక్కొక్క బిడారువారు తీసికొనిపోదురుగాని ఇంకొక సరుకు రవాణా చేయరు. ఆ కాలమున మార్గములందు దొంగల దోపిడీ జరుగుచుండినందున నీరవాణావారికి ఆయుధపాణులైన సైనికులు సహాయముండిరి. మార్గస్థులుకూడా ఆయుధపాణులైన గుర్రపురౌతులను కాలిబంటులను సహాయము తీసికొనిగాని ప్రయాణము చేయకుండిరి.

విజయనగర సామ్రాజ్యకాలమున మన దేశమునకు వచ్చిన పోర్చుగీసు దేశీయుడగు ‘పేయసు’ విజయనగరమునకును, భక్తాలువకును మధ్యగల బాటను వర్ణించినాడు. బొల్బొవా విజయనగరము, పులికాటుల మధ్య ఒక బాటయున్నదని వ్రాసిరి. ఆ కాలపు శాసనములు దక్కనుకు తూర్పు సముద్రప్రాంతములకు రాకపోకలుండినట్లు తెలుపుచున్నవి. రోళ్ళ మడుగు శాసనము అక్కడి కొండ కనుమకుండా పోవు మార్గములను వివరించినది. అది పులివెందలగండి పెండ్లిమర్రి-మొదలగు వూళ్ళమీదుగా పోవుచుండెనట. కైఫీయతులలో కాశీ రామేశ్వరముల బాటయొకటి పేర్కొనబడినది. కడప కవిలెలో తిరుపతి రాజబాట పేర్కొనబడినది. పదునేడవ శతాబ్దమునాటి గ్రంథమైన శుకసప్తతిలో విజయనగరము నుండి కాంచీపురమునకు పోవు బాట చెప్పబడియున్నది. రాచెర్ల కైఫీయతులో గుత్తి, మునిమడుగల మధ్యనున్న బాటయొకటి, యహోబిలము, పోరుమామిళ్ళ, బద్దెవోలు, కంభములమీదుగా పోవు బాటయెకటియు వివరింపబడినది. బందరునుండి కోవిలకొండకును, కోవిలకొండనుండి కంపిలికిని బోవు బాటయున్నట్లు రఫీ అహమ్మదు షిరాజు వ్రాసియున్నాడు. (Third Dynasty of Vijayanagara Dr. N. Venkataramanayya.) 

ఈ బాటలు కంకర వేసినవి కావు. ఎడ్లు, గుర్రములు నడిచినందువలన, మనుష్యుల రాకపోకలవలన నలిగిన మార్గములే. ఆ కాలములో సరుకులను బండ్లపైనగాని, మనష్యుల తలపైన మూటలుగాను, మనుష్యులు మోయు కావిళ్ళలోను ఉంచి తీసుకొనిపోవుచుండిరి. ఎడ్లపైనను, కంచరగాడిదలపైనను కంట్లముల జతలో సరుకులను ఉంచి వందలు వేలకొలది జంతువుల మీద బిడారులుగా తీసికొనిపోవుటవలన సరుకుల రవాణా చాలా భారీగా జరుగుచుండెనని శాసనములవలనను, పాశ్చాత్యుల రచనలవలనను కూడా స్పష్టపడుచున్నది. శ్రీకృష్ణదేవరాయలవారు రచించిన ఆముక్తమాల్యదలో కూడా ఇట్టి బిడారులు దారిదోపిడిగాండ్రవలన బాధలుపడుట వర్ణింపబడినది. ఆ కాలమున ముఖ్యమైన పూళ్ళలో సంతలు జరిగి దేశములోని అన్నిప్రక్కలనుండి వర్తకులు తమ సరుకులను తెచ్చి విక్రయించుట ఆచారముగానుండెను. పదునెనిమిదవ శతాబ్దమునాటి హంసవింశతిలో రాయలసీమలోను, తెలంగాణములోను, ఉత్తరసర్కారులలోను, మైసూరు, తమిళనాడు ప్రాంతములలోను కూడా యిట్టిసంతలు జరుగు ముఖ్యపట్టణములు రమారమి రెండువందలు వివరింపబడియున్నవి.

1825 నుండి నలుబదేండ్లు హైదరాబాదు రాజ్యములో గొప్పయుద్యోగము చేసిన మెడోసు టెయిలరు అనునాయన 1825-29 మధ్య బొంబాయి, పూనా, అహమ్మదాబాదు నగరము, ఔరంగాబాదుల మధ్యను ఔరంగాబాదు, ఔసా, గుల్బర్గా (కలబగిరి), దండూటి, హైదరాబాదుల మధ్యను, హైదరాబాదు, పరేందా, సదాశివపేటల మధ్యను, బొంబాయి, పూనా, షోలాపూర్, నలదుర్గము, షామినాబాదు, ఏకైతీ సదాశివపేట, హైదరాబాదు మధ్యను గల మార్గములను తన స్వీయచరిత్రలో వర్ణించియున్నాడు. అతడు గుర్రము మీదను, పల్లకీలోను ప్రయాణము చేసినాడు. ఆయన రచించిన ‘థగ్గు ఒప్పుకొనిన సంగతు’లను నవలలో నాగపురము నుండి హైదరాబాదుకు రాకపోకలు జరుగుబాటలను, వాని స్థితిగతులను వర్ణించినాడు.

1830-31 మధ్య చెన్నపట్టణములోను, సుప్రీముకోర్టులో ఇంటరుప్రిటరు లేక తెలుగు తర్జుమాలు చేయు యుద్యోగము చేసిన ఏనుగుల వీరాస్వామయ్యగారు కాశీయాత్రకు బయలుదేరిరి. చెన్నపట్నమునుండి తిరువళ్ళూరు, దిగువ తిరుపతి, కడప, అహోబళము, శ్రీశైలము, హైదరాబాదు, మేడిచర్ల, యీదలవాయి నిర్మల, ఆదిలాబాదు, యిరానాగపురముల మార్గముననే కాశీ, ప్రయాగ, గయ క్షేత్రములను దర్శించి కలకత్తాకు పోయి అక్కడనుండి కటకము వచ్చి జగన్నాథయాత్ర చేసి గంజాము, బరంపురము, శ్రీకాకుళము, విజయనగరము, సింహాచలము, అనకాపల్లి, నక్కపల్లి, పిఠాపురము, పెద్దాపురము, రాజానగరము, రాజమహేంద్రవరము, వాడపల్లి, ఆచంట, ఏలూరుల మీదుగా మచిలీబందరు చేరి అక్కడనుండి కనగాల, చందవోలు, బాపట్ల, వేటపాలెం, చినగంజాము, అమ్మనబ్రోలు, కరేడు, పంటఅల్లూరు, నెల్లూరు, మనుబ్రోలు, గూడూరు, నాయుడుపేట, సూళ్ళూరుపేట, గుమ్మడిపూడి, తిరువళ్ళూరు మీదుగా చెన్నపట్టణము తిరిగివచ్చిరి. వీరు పల్లకీలలో ప్రయాణము చేసిరి. వీరు తమవెంట నూరుమందిని తీసుకొనిపోయిరి. తాము ప్రయాణము చెసిన మార్గమునందలి బాటల స్థితిగతులు తాము చూచిన వూళ్ళను ప్రజల స్థితిని వర్ణించినారు. (కాశీయాత్ర చరిత్ర 3వ ముద్రణము 1941.)

న్యాయపరిపాలనము

హైదరాబాదులో ఉన్నత న్యాయస్థానము (హైకోర్టు) 1864లో స్థాపింపబడెను. అంతకుపూర్వము ఆ సంస్థానములోని న్యాయపరిపాలనమంతయు సుభా (నిజాము)యందు నెలకొల్పబడియుండెను. సివిల్ వ్యవహారములను తీర్మానించుటకు అధికారి సుభాగారే. క్రిమినల్ కేసులను విచారించు ప్రధాన అధికారి కొత్వాలు. ఆ సంస్థానమునందలి జిల్లాలలో క్రమమైన న్యాయస్థానము లేకుండెను. వర్తకులు తమ బాకీలను రాబట్టుకొనుటకు రోహిలాలను, అరబ్బులను నియోగించి వారిచేత బలవంతముగా బాకీలు వసూలుచేయుచుండిరి. అందుకొరకు వారు జరుపు చర్యలు చాల దౌర్జన్యపూరితములుగను, అక్రమముగనుండెను. ఆ కాలమున బలవంతులదే రాజ్యముగనుండెను. నిరపరాధులపైన రోహిలాలును, అరబ్బులును జులుము చలాయించుచుండిరి. దేశములో ఆకతాయిమూకలు విజృంభించి దోపిళ్ళు చేయుచుండిరి. జిల్లా అధికారులు కూడా వారిని చూచి భయపడుచు వారినుండి తప్పించుకొనుటకు పేరుపొందిన దోపిడిగాండ్ర నాయకులకు పెద్ద మొత్తములు లంచమిచ్చి బ్రతుకుజీవుడాయని కాలక్షేపము చేయుచుండిరి. ఈ పద్ధతిని నిజాముగారి ప్రభుత్వము హర్షించుచుండెను.

1821లో ప్రధానమంత్రియైన నవాబ్ మునీర్ ఉల్ ముల్కుగారు హైదరాబాదు నగరములో దివాని అను పేరుతో నొక క్రొత్త న్యాయస్థానమును స్థాపించిరి. అందులో హిందూపండితులు పరివేష్టించి తగవులు తీర్చుచుండిరి. తరువాత దానినే ‘దివానీ-ఏ-బుజుర్గు’ లేక హైకోర్టులని మార్చి, సివిల్ దావాలను విచారించు పద్ధతిని స్థాపించిరి. అయితే అందులో మహమ్మదీయ న్యాయాధిపతులను నియమించిరి.

1838లో రాజా చందూలాల్‌గారు దివాను పేష్కారుగానుండగా ‘అదాలత్-ఏ-ఫౌజుదారీ’ అను పేరుతో క్రిమినల్ కేసులను విచారించుటకు నగరములో నొక క్రొత్తన్యాయస్థానమును స్థాపించి తరువాత దానిపేరు అదాలత్-ఏ-ఆలియా లేక సుప్రీం కోర్టు అనియు మార్చిరి.

1845లో సిరాజ్ ఏ ముల్కుగారు మంత్రిగానుండగా న్యాయపరిపాలనా విధానమునందు కొన్ని సంస్కరణములు గావించిరి. అప్పటివరకును నేరములు చేసినవారి కాలుగాని, చేయిగాని ఛేదించు మహమ్మదీయ శిక్షావిధానమును రద్దుచేసి ఏడు మొదలుకొని పదునాలుగు సంవత్సరములవరకు కఠిన కారాగారవాస శిక్షలను విధించు పద్ధతిని స్థాపించిరి.

నవాబ్ సిరాజ్-ఏ-ముల్కుగారు ప్రధానమంత్రియైనప్పుడు 1833లో సహగమనములు నిషేధించుచూ వారొక ఫర్మానా నిజాముగారిచేత చేయించెను. అంతవరకు జరుగుచుండిన పిల్లలను బానిసలుగా విక్రయించు దురాచారమును నిషేధించుచు నిజాముగారిచేత మరియొక ఫర్మానా జారీచేయించెను. దేశములో విచ్చలవిడిగా తిరుగుచు కంఠములకురిపోసి చంపు థగ్గులను, దోపిళ్ళుచేయు బందిపోటు దొంగలను పట్టుకొని బహిరంగముగా ఉరిదీయుటవలన నాబాధ కొంత తగ్గెను.

శాంతిభద్రతలు

హైదరాబాద్ రాజ్యములోని సంస్థానాధిపతులను గూర్చి ఏనుగుల వీరాస్వామయ్యగారు తమ కాశీయాత్ర చరిత్రలో కొల్లాపురము, వనపర్తి సంస్థానములవారు తరచుగా తగవులాడుచు ఒకరి గ్రామములనింకొకరు కొల్లపెట్టి రైతులను హింసించి గ్రామములను పాడుచేయుచున్నారనియు, అప్పుడు హైదరాబాద్ రాజ్యమున అధికారులుగానున్న చందూలాల్ ప్రభృతులు వీరిని వారించుట లేదనియు వ్రాసినారు. హైదరాబాద్‌లోని ప్రజలందరును ఆయుధపాణులై మెత్తనివారిని కొట్టి నరుకుచున్నారు. షహరులో చంపినా అడిగే దిక్కులేదని వ్రాసినారు.

ఉత్తర సర్కారులోని నిజాముగారి జమీందారులు చాలా దౌర్జన్యము చేసిరని పిండారీలు, మరాటీ దండ్లు దేశమును కొల్లగొట్టుచుండెనని, హైదరాబాదు రాజ్యమున ప్రతిదినము బందిపోట్లు, దొంగతనములు జరుగుచుండెనని, రోహిలాలగుంపులు, దొంగలగుంపులు గ్రామములను దోచుకొనుచుండెనని బిల్‌గ్రామీగారు తమ గ్రంథమున వ్రాసినారు.

1794లో సింధియా మరణించుటతో మహరాష్ట్రులలో అంతఃకలహములు హెచ్చెను. వారు రాజపుత్రులతో పోరాడి వారి రాజ్యమును పాడుచేయుటయేగాక తాము పాడై బలహీనులైరి. 1813 నుండి మహారాష్ట్ర సామ్రాజ్యము విచ్ఛిన్నమైపోయినది. ఆ సేనలోని సైనికులు జీవనము జరుగక దేశముపైబడి దోచుకొనసాగిరి. వీరిలో మొగలాయీసైన్యము నుండి భ్రష్టులై వెడలివచ్చినవారును, దోపిడి రుచిమరగిన మహమ్మదీయ సైనికులును చేరిరి. వారి స్త్రీలు హిందువుల స్త్రీలవలె వేషములు వేసుకొని దోపిడిగాండ్రతో బయలుదేరుచుండిరి. వీరినందరినీ పిండారీలని వ్యవహరించుచుండిరి. వీరు తెలంగాణముపైనను రాయలసీమపైనను ఉత్తరసర్కారులపైనను కూడా దండువెడలివచ్చి దురాగతములు చేయసాగిరి. 200 మొదలు 5000 వరకును గుంపులుగా బయలుదేరి గ్రామములు ధ్వంసముచేసి ఇండ్లు తగులబెట్టి, స్త్రీలను చెరచి, పురుషులను చిత్రహింసలుచేసి ధనము దోచుకొనుచుండిరి. వీరికి భయపడి గ్రామములచుట్టును గోడలు కట్టుకొని, కావలివారిని పెట్టుకొని గ్రామస్థులు బాధలు పడుచుండిరి. ప్రతిగ్రామములోను ఎత్తైన ఒక చెట్టుపైననో లేదా పెద్దమేడపైన గట్టిన బురుజులపైన స్తంభముపైననో ఎక్కియుండి ఏ ప్రక్కనుండియైనను గుర్రపుదళములు వచ్చునప్పుడు రేగు దుమ్ము కనపడినచో ఆ కావలిమనుష్యుడు గ్రామస్థులకు తెలియపరచును. తగిన సైనిక బలమున్నచో ఎదిరించుచుండిరి. లేనిచో వూరువదలి పారిపోవుచుండిరి, లేదా పిండారీ నాయకులు కోరిన సొమ్మునిచ్చి తమ మానములను, ప్రాణములను దక్కించుకొనుచుండిరి. ఆ కాలమున స్త్రీపురుషులనుభవించిన బాధలకు మితిలేకుండెను.

పిండారీ సైన్యము 1814లో 21,000 గుర్రపుదళము, 15,000 కాల్బలములు, 18 తోపులు కలదయ్యెను. 1816లో వారు ఉత్తర సర్కారులలో సగభాగములో పదకొండున్నర దినములపాటు దండయాత్రచేసి 339 గ్రామములను దోచుకొనిరి. 6, 7 వేలమందిని చావగొట్టి, వారు దాచిన ధనముయొక్క జాడలను తెలిసికొనిరి. వారు గుంటూరుజిల్లాలో విపరీతమైన దౌర్జన్యములు చేసిరి. వారి బాధలకు భయపడి స్త్రీలు, పిల్లలు కొందరు ఇండ్లు తగులబెట్టుకొని అందులోపడి చచ్చిపోయిరి. చెరచబడిన స్త్రీలు బావులలోపడి ఆత్మహత్యలు చేసికొనిరి. కొందరు స్త్రీలను పిండారీలు పట్టుకొని తమతో తీసుకొనిపోయి బానిసలుగా అమ్మిరి. కొందరు కృష్ణలోపడి చచ్చిరి. పిండారీలు చేయు చిత్రవధ వర్ణనాతీతములు. కొందరి చేతివ్రేళ్ళకు గుడ్డలుచుట్టి నిప్పు అంటించిరి. వేళ్ళలో గసినెలు గ్రుచ్చిరి. కారమును, వేడి బూడిదను కళ్ళకు, మూతికి కట్టుచుండిరి. ఈ సంగతులను ‘రష్‌బ్రూక్ విలియంస్’ అను ఇంగ్లీషు గ్రంథకర్తయే వ్రాసినాడు. కొంతకాలమువరకును తూర్పు ఇండియా వర్తకసంఘమువారి ప్రభుత్వము వీరిని అరికట్టలేకపోయెను.

ఈ పిండారీ దండులు నాగపురమునుండి బయలుదేరి హైదరాబాదు రాజ్యమునందలి వివిధ ప్రాంతములపైన చాలా అక్రమములు గావించెను. నిజాముగారి ప్రభుత్వము వీరిని ప్రతిఘటించలేకపోయిరి. కంపెనీ రాజ్యమునందు పిండారీలు వచ్చిపడి ఇంగ్లీషు ఉద్యోగుల ఇండ్లను తగులబెట్టి ఖజానాను తీసుకొనిపోయిరి. గుంటూరులోనే ఇది జరిగెను. తుదకు హేస్టింగ్సు ప్రభువు గవర్నరు జనరలుగా నున్నప్పుడు పిండారీలపైన యుద్ధముగావించి వీరిగుంపులను చెదరగొట్టెను.

పిండారీల బాధ తప్పినను మార్గమునందు ప్రయాణికులను మోసగించి దారిలో వారి కంఠములకురిపోసి చంపు థగ్గుల, దోపిడీదొంగల బాధ మితిమీరెను. వీరి సంగతిని కంపెనీ పరిపాలకులు చాలాకాలమువరకు కనిపెట్టలేకపోయిరి. వీరిని పట్టుకొని అణచుటకు చాలాకాలము పట్టెను. తమ రాజ్యమునందిట్టి ఘోరములు జరుగుచున్నవని ప్రతిసంవత్సరము వేలకొలది అసహాయులైన ప్రయాణికులు దుర్మరణము పొందుచున్నారను సంగతి క్రమక్రమముగా బయల్పడెను. 1831-1836 మధ్య జరిగిన విచారణ ఫలితముగా థగ్గుల ముఠాల నాయకులను పట్టుకొనగలిగిరి. వీరికిని దేశములోని జమీందారులకు జాగీరుదారులకు గ్రామోద్యోగులకును సంబంధమున్నట్టు కూడ బయల్పడెను. కొంతమంది చిన్న సంస్థానాధిపతులు కూడా వీరికి సహాయముచేసి దోపిడీసొమ్ములోనుండి లాభములు పంచుకొనుచుండిరి. ఈ థగ్గుల నాయకులను పట్టుకొని విచారించి కొందరిని ఉరితీసియు, కొందరికి యావజ్జీవమువరకు శిక్షను విధించియు యీ నేరములు జరుగకుండా కంపెనీ ప్రభుత్వమువారు తీవ్రమైన చర్యలు తీసికొనిరి. అంతట నీబాధ తగ్గెను. రాజబాటలందు ఆయుధపాణులై బహిరంగముగానే ప్రయాణికులపైనను, వర్తకులపైనను ఖజానాను తీసికొనిపోవు సైనికదళములపైననుబడి దోచుకొను ‘డాకూ’లను బలవంతులైన దోపిడీదొంగల దళములను అణచుటకై దేశములో వివిధప్రాంతములందు పోలీసు ఠాణాలనేర్పరచి సైనిక పోలీసుబలముల సహాయమున ఆ ముఠాలను పట్టుకొని శిక్షింపసాగిరి. కొంతకాలమున కీదౌర్జన్యములు తగ్గెను.
(సశేషం)