ఒక దేశము యొక్క నైసర్గిక పరిస్థితినిబట్టియు, వాతావరణ పరిస్థితులనుబట్టియు, అందు జీవించు ప్రజల మనోభావములనుబట్టియు, నీతి మత ధర్మములను గూర్చి వారికి గల అభిప్రాయములనుబట్టియు, వానిననుసరించి వారు ప్రవర్తించు విధానమునుబట్టియు ఆ దేశములోని రాజకీయార్థిక సాంఘిక మత పరిస్థితులు రూపొందును.
ప్రపంచ చరిత్రలో మానవునకు లౌకిక విషయములపైకన్న ఆధ్యాత్మిక విషయముల పైననే హెచ్చు ఆసక్తియు, గౌరవమునున్నట్లు తెలియుచున్నది. భూగోళ, ఖగోళ పరిస్థితులను, సృష్టి వైచిత్రమును చరాచర జీవకోటి అన్నింటికంటే మానవ యంత్రమును చూడగనే మానవులకు దీనికంతకు నేది మూలము? దీని పరమార్థమేమి? అను ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగితీరును. దీనినుండియే మత ధర్మములు రాజకీయార్థిక సాంఘిక మత వ్యవస్థలు రూపొందును. అందువలననే దేశ చరిత్రకు మతమే కేంద్రమని సుప్రసిద్ధ చరిత్రకారుడగు టోయిన్బిగారు వ్రాసియున్నారు.
భారతీయ మత ధర్మములకు వేదములే మూలాధారములు. పురాణేతిహాసములు, ఆగమ శాస్త్రములు, ధర్మశాస్త్రములు మొదలగునవన్నియు వేదములపైననే ఆధారపడి యున్నవి. అందువలన భారతదేశ సంస్కృతి సంప్రదాయములపైన మత ప్రభావము ప్రబలముగనున్నది.
కాల మహిమ వలన దేశము యొక్క రాజకీయ, సాంఘిక, ఆర్థిక పరిస్థితులందు మార్పులు కలిగి వేదముల ప్రామాణ్యము నంగీకరించని బౌద్ధ జైన మతశాఖలును, మ్లేచ్ఛ సంపర్కము వలన మహమ్మదీయ, క్రైస్తవ, సిక్కుమత శాఖలును మనదేశమున వ్యాపించినను ఆ మత ధర్మములు స్వీకరించిన భారతీయుల పైన కూడా సనాతన ధర్మాలయొక్క ప్రభావము కనబడుచున్నది. దేశములోని వివిధ ప్రాంతములందు వసించు ప్రజల వేషభాషలందు, ఆహార విహారములందు, ఆచార వ్యవహారములందు కొన్ని విభేదములు కనబడుచున్నను, జనసామాన్యము యొక్క చిత్తవృత్తులందు, సంస్కృతి సంప్రదాయములందు వైదిక మత ధర్మముల ప్రభావము కనబడుచునేయున్నది.
అందువలననే మన దేశములోని మహమ్మదీయులలో ఇతర దేశములలో లేని ఆచారములెన్నియో కనబడుచున్నవి. ఇట్లే మన దేశములోని క్రైస్తవులందు పాశ్చాత్య దేశములలోని క్రైస్తవులలో లేని ఆచారములు కనబడుచున్నవి. వేదశాస్త్రములను శిరసావహించు భారతీయులు కర్మసిద్ధాంతమును నమ్ముదురు. ప్రతి జీవుడును పూర్వ జన్మములందు చేసికొనిన పుణ్యపాపముల కర్మఫలములను తరువాత జన్మములందు అనుభవించవలెనని, జీవుని పాపక్షయమై తరించులోపల నిట్టి జన్మములనేకములు పొందవలసియుండునని విశ్వసింతురు. అందువలననే పాపక్షయము కొరకు, పుణ్య సంపాదనము కొరకు జపతపములు, యజ్ఞయాగములు, మంత్రతంత్రములు, అర్చనలు ఆరాధనలు, తీర్థయాత్రలు చేయుదురు. తమ కోరికలు ఫలింపవలెనని ఇష్ట దైవమును మొక్కుకొనుటయు, వ్రతములు చేయుటయు దీని పరిణామమే.
కర్మఫలానుభవమును గూర్చిన కథలును, ఉపాఖ్యానములును మన పురాణేతిహాసములందు కొల్లలుగనున్నవి. చరిత్ర ప్రసిద్ధులైన చక్రవర్తులు, మహారాజులు ఇష్టకామ్యసిద్ధికొరకు, పుణ్యసముపార్జనము కొరకు యజ్ఞయాగములు, దానధర్మములు చేసినట్లు ఆ శిలాశాసనములవలన తెలియుచున్నది. వేదముల ప్రామాణ్యము నంగీకరింపని బౌద్ధులును, జైనులును కూడా కర్మసిద్ధాంతమునంగీకరింతురు. కర్మఫలాసుభవమును గూర్చిన విశేషములు వారి గ్రంథములందు వివరింపబడియున్నవి. మనదేశము మ్లేచ్ఛాక్రాంతమై, హిందూరాజుల పరిపాలనముపోయి మహమ్మదీయుల ప్రభుత్యము వచ్చుటకును, అది పోయి ఇంగ్లీషు ప్రభుత్వమేర్పడుటకును కర్మయే కారణమని మనవారు నమ్మిరి.
సంవత్సరము పొడవునను యజ్ఞములు చేయు వేదఋషులు ఖగోళమునందలి సూర్య చంద్రాది గ్రహములయొక్కయు, నక్షత్రములయొక్కయు గమనమును పరిశీలించి నక్షత్ర విద్యను సాధించి, వేదాంగ జ్యోతిషమును వెలయించిరి. పురాణేతిహాసముల కాలమునాటికి ఫల జ్యోతిషము వెలసినది. మన పూర్వులు జ్యోతిషమును మూడు భాగములుగ విభజించిరి. గ్రహములయొక్కయు నక్షత్రముల యొక్కయు సంచారమును, గణిత సాధ్యములైన విషయములును గలట్టిది సిద్ధాంత భాగము. మానవుని ఆయర్దాయమును, యోగములు మొదలగు అదృష్ట ఫలములకు సంబంధించినది జాతక భాగము. గ్రహముల చారము, చంద్ర తారా బలములు, తిథి వార నక్షత్ర యోగకరణములు, ముహూర్తములు, ఉత్పాత లక్షణములు, వాని శాంతులు, షోడశ కర్మలు, మొదలగు అనేక విషయములు గలది సంహితా భాగము. భూమియు నందలి ప్రాణులును సప్తగ్రహముల ప్రభావమునకు లోబడినవనియు, అందువలన ఒక్కొక్క జీవుడు భూమిపై పుట్టునాటికి గల గ్రహస్థితియు తదనంతర గ్రహ సంచారమును, వాని భావమును తెలిసికొన్నచో ప్రతి దేహియొక్క జీవితమునందలి సుఖదుఃఖములు తెలిసికొన వీలగునను గట్టి నమ్మకము మనవారికి కలదు. ఈ సప్త గ్రహాదుల విద్యను మనవారు కాలజ్ఞానశాస్త్రము, లేక జ్యోతిషమనిరి.
గ్రహచారమువలన కలుగు కీడును నివారించుకొనుటకు శాంతింపజేసికొనుటకును, గ్రహశాంతిని చేసికొనుటకు జపములు, దానములు మొదలగు కార్యకలాపములొక శాస్త్రముగనభివృద్ధి చెందినవి.
జాతకచక్రములను బట్టి ఆయుర్దాయము, యోగములు తెలిసికొన వీలుకలిగినందున వధూవరుల జాతకములను చూచికాని వివాహములు చేయుటకు ఇష్టపడకుండిరి. గ్రహచార మెట్లున్నదో చూచికాని ఏ కార్యమును ప్రారంభించుటకు దైర్యము చాలనందున తిథి వార నక్షత్ర యోగ కరణములను దెలుపు పంచాంగములను చూచి, మంచి ముహూర్తము పెట్టించుకొనసాగిరి. శకునములు, స్వప్నములు, బల్లిపాటులు మొదలగు శాస్త్రములును వెలిసినవి. జాతక, ముహూర్త, శకున, సాముద్రిక, వాస్తు, కేరళ (లక్షణ) సంకీర్ణ భాగములనన్నిటినీ కలిపి ఫలితజ్యోతిషమని వ్యవహరించుచున్నారు.
శ్రీమద్రామాయణమునందు శ్రీరామచంద్రుని జాతకమును, భరతుని జాతకమును వివరింపబడియున్నవి. వివాహ ముహూర్తము మించిపోకుండ పాణిగ్రహణమొనరింపుమని జనకమహారాజు లక్ష్మణస్వామిని హెచ్చరించును. దుర్నిమిత్తములు, శకునములు, స్వప్నములందలి శుభాశుభములు రామాయణమున పేర్కొనబడినవి. సాముద్రికము, వాస్తు శాస్త్రముకూడ ఆ కాలమున వాడుకలోనుండినట్లు తెలియగల శ్లోకములున్నవి. దీనినిగూర్చి జ్యోతిషవిద్వాంసులగు శ్రీ పిడపర్తి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు 1924 సం. జనవరి (రక్తాక్షి సం. చైత్రమాస) భారతిలో వ్రాసియున్నారు. పురాణేతిహాసములనాటికి మనదేశమునేలు రాజులకును, ప్రజలకును జ్యోతిషమునందు గట్టి నమ్మకముండెననుటకు తార్కాణముగా మహాభారతమునందును, పురాణములందును చాల కథలున్నవి.
మహమ్మదీయులు దండయాత్రలు చేసి, భారతదేశమున తమ ప్రభుత్వమును స్థాపించువరకు హిందువుల సనాతనధర్మములో గాని, మతాచారములలో గాని, వివిధములైన నమ్మకములలోగాని పెద్ద మార్పులేదు. యావద్భారతదేశములోగల మహమ్మదీయులలో నూటికి తొంబదిమంది హిందువులలోని వివిధ కులములనుండి ఇస్లాము మతమున గలుపబడినవారే. మిగిలిన పదిమంది మాత్రమే పారశీక తురుష్క ఆఫ్గనిస్థానములనుండి వచ్చిన మహమ్మదీయులు. ఇట్టి విజాతీయ ముసల్మానులు కూడ అదివరకు వివిధ కులాచారములు కలిగి, తమ మతమున గలిసినవారితో సంబంధబాంధవ్యమును చేయుచుండినందున వారిలో కొంత మార్పు కలిగెను. మహమ్మదీయ ప్రభువుల రాజధాని నగరములందు ఉద్యోగముచేయు మహమ్మదీయులకన్న గ్రామములందు జీవించువారి సంఖ్యయే అత్యధికము. అట్టివారు హిందువులతోపాటు వ్యవసాయము, ఇతర వృత్తులు చేసికొని జీవించుచున్నందున విజాతీయ మహమ్మదీయాచారములు సడలిపోయి మనదేశాచారములు వృద్ధిచెందెను. అందువలన ఆహార విహారములందు, వేష భాషలందు హిందువులు, మహమ్మదీయులు అని విడదీయుటకు వీలులేనంతగా మార్పుచెందిరి. విదేశములందలి మహమ్మదీయులలో లేని ఆచారములెన్నో మన మహమ్మదీయులందు ప్రబలినవి. వివాహములు మొదలగు శుభకార్యములందు రాజపుత్రుల ఆచారములనే మహమ్మదీయులు అవలంబించిరి. ఇస్లాము మతములో లేని ఆరాధనలు, పూజలు, మంత్రతంత్రములు, మ్రొక్కుబడులు, ఆశీర్వచనములు, పీడా పరిహారములు మొదలైన ఆచారములును, జ్యోతిషము, శకునములు మొదలగువానియందు నమ్మకమును వ్యాపించెను.
మానవులందరును సమానులేయని బోధించు ఇస్లాము మతమునవలంబించిన మహమ్మదీయులు కులభేదములు పాటించుచున్నారన్నచో చాలమందికాశ్చర్యము కలుగవచ్చును. ఉత్తరప్రదేశ్లోని మహమ్మదీయులందలి కులభేదములను గూర్చి శ్రీ ఘౌస్ అన్సారీగారొక గ్రంథమును రచించిరి. ఉత్తరప్రదేశములోని మహమ్మదీయులలో సయ్యదు, షేకు, మొగలు, పఠాను తెగలవారు హిందువులలోని ద్విజులవంటి యున్నత కులములవారుగా పరిగణింపబడుచున్నారు. మహమ్మదీయ రాజపుత్రులు ప్రత్యేకముగానొక కులముగానున్నారు. బట్టలు నేయువారు, కుట్రపు పనివారు, కసాయి, మంగలి పనిచేయువారును హిందువులలోని సచ్ఛూద్రులవంటి కులముగా నేర్పడియున్నారు. ఇక పాకీపని మొదలగు అపరిశుభ్రములగు పనులు చేయువారింకొక కులముగానున్నారు. ఈ నాలుగు తరగతుల కులములను నిలువుగను, అడ్డముగను విభజించి దాటరాని గోడలవంటి కులభేదములు ఆచారములు విడదీయుచున్నవి. ఈ కులములవారొక్కొక్క సాంఘిక వర్గము (యూనిటు)గ నుందురు. వారికి పై చూపేగాని క్రిందిచూపు లేదు. అనగా, క్రింది తరగతులవారు పై తరగతులలో చేరుటకు విశ్వప్రయత్నము చేయుచుందురు. పై వారు వీరిని చేరనీయక అలుసుగా చూచుచుందురు. క్రింది తరగతులలోని వివిధ కులములవారు తమ కులాచారములను వదలి పై తరగతులవారివలె జీవించుటకు ప్రయత్నించుచుందురు.
భారతదేశమును మహమ్మదీయ ప్రభువులేలుచుండగా ఇస్లాము మతధర్మముల నభ్యసించిన ముల్లాలను, మౌల్వీలను ఆ ప్రభువులాదరించి గౌరవించుచుండిరి. వారిని ఖాజీలనబడు న్యాయవిచారణాధికారులుగా నియమించుచుండిరి. సంసారమును త్యజించి తిరుగు హిందూ బైరాగుల వంటివారిని పారశీకదేశమునందు ‘దర్వీషు’లనుచుండిరి. మన దేశములోనిట్టివారిని ఫకీరులనిరి. ఫకీరులలో కొందరు పుణ్యపురుషులుండిరి. వారు నిరంతరము ఖొరాను మొదలగు మతగ్రంథములను అధ్యయనము చేయుచు పరమేశ్వరుడగు అల్లాయొక్క వేయి నామములను జపించుచుండిరి. వారిలో కొందరు కొన్ని మహత్తులుకలవారు నుండిరి. వారిని ‘వలీ’లనిరి. వారు భోగసంపదలు వదలినను వారిపట్ల గౌరవముగలవారు వారికి ధన కనక వస్తు వాహనములను సమర్పించుచుండుట వలన వారికి మన పీఠాధిపతులకు వలెనే కొన్ని వసతులేర్పడెను. కొందరు ఫకీరులు వారినాశ్రయించుకొనియుండిరి. ఈ వలీలలో కొందరు ప్రజల వ్యాధులను కుదుర్చుటకు ఖొరానులోని దివ్య నామములతో మంత్రములను జపించుట, ఆ దివ్యనామములు గల తావేదులమ రక్షరేకులను గట్టుట, మంత్ర తీర్థములనిచ్చుట మొదలగు క్రియలు చేయుచుండిరి. కొందరు దివ్యదృష్టి కలిగియుండి, జరుగబోవు సంగతులను చెప్పగలుగుచుండిరి.
ఫకీరుల పైన ప్రజలకు గల గౌరవమువలన వారెక్కడకు పోయినను వారికి ప్రజలాహారము నొసంగుచుండిరి. వారికి ధర్మముచేయుట పుణ్యముగనెంచుచుండిరి. నిజమైన దివ్యశక్తులు లేని కొందరు ఫకీరులు హస్తలాఘవమును ప్రయోగించియు; సూదంటురాయిని భాస్వరము మొదలగు పదార్థముల సుపయోగించియు; వస్తువులను మాయము చేయుట, నడిపించుట, అగ్నిని పుట్టించుట మొదలగు నింద్రజాలకృత్యములను, గారడీని చేసి, తాముచేయు విచిత్రములచే ప్రజలను మోసముచేసి ధనము సంపాదించుచుండిరి.
మహమ్ముదు ప్రవక్త విధి ప్రేరణమునంగీకరించినను జ్యోతిషమును, భవిష్యత్తును చెప్పుట, గారడి, ఇంద్రజాలము మొదలగు విద్యల పైన ఆయనకు ఆదరము లేదు. అయినను మహమ్మదీయ జనసమూహములందీ విద్యలపైన చాల నమ్మకమేర్పడెను. శకునములపైనను, జ్యోతిషముపైనను, గ్రహచారముపైనను చాలా నమ్మకముగల హిందూ ప్రజల సాహచర్యము వలన మహమ్మదీయ ప్రజలలో కూడా ఈ నమ్మకములు వ్యాపించెను. ఇంతేకాదు, కొన్ని హిందూమతాచారములు కూడా వారిలో పాదుకొనియుండెను. వారిలో చాలమంది పూర్వము హిందువులుగనుండినవారే యైనందున పూర్వవిశ్వాసములను, ఆచారములను వారు విడువలేకుండిరి. ఇట్లు మహమ్మదీయ మతవిరుద్ధములైన ఆచారములను, విశ్వాసములను కూడా మన మహమ్మదీయులలో వ్యాపించెను. మహమ్మదీయ స్త్రీలు శాన్-ఎ-వలీ నీలమేఘశ్యాముడగు కృష్ణునిగూర్చిన జోలపాటలు పాడుచుండిరి.
మహమ్మదీయుల పండుగలందును, శుభకార్యములందును హిందువులవలెనే మేళతాళములతో, సంగీత నృత్యములతో వేడుకలు, ఉత్సవములు జరుపుట, మహమ్మదీయ మహాత్ముల సమాధులను, పీరులను అర్చించుట, వానికి మ్రొక్కుకొనుట, మ్రొక్కుబడులు చెల్లించుట, అక్కడ ప్రసాదమును, మంత్రతీర్థమును భక్తితో స్వీకరించుట, అక్కడి మట్టిని తావేదులందు పెట్టి కట్టుకొనుట మొదలైన ఆచారములు ప్రబలెను. క్రీ. శ. 13వ శతాబ్ది నాటికి మహమ్మదీయులలో కూడా శకునములందు, స్వప్నములందు నమ్మకము, జ్యోతిష శాస్త్రములోని జాతక ఫలభాగములందు సమ్మకము, మహాత్ముల దివ్యశక్తులందు, అభిచార క్రియలయందును నమ్మకము అభివృద్ధిచెందెను.
13వ శతాబ్ది మధ్యమున దేశములో పర్యటించిన ఇబ్న్ బటూటా అనునతడు మనదేశమును చూచునాటికి మహమ్మదీయ ఫకీరులలోను, మహాత్ములలోను కొందరు చాలా పలుకుబడి కలిగి, బలవంతులై యున్నందువలన దేశమునేలు సుల్తానులకు వారు తమ్ము పదభ్రష్టులుగ చేయుదురను అనుమానము కలిగి వారిలో కొందరిని వధించుట జరిగెను. అట్లొక గొప్ప ఫకీరును పట్టుకొని వధించుట నతడు చూసి వ్రాసియున్నాడు. దివ్యశక్తులున్నట్టి చాలామంది మంచి ఫకీరులను, కొందరు మోసగాండ్రను కూడా అతడు చూచినాడు. అతడు చూచినవారిలోనొకడు తానెట్టి యాహారమును తినకుండా జీవించుచున్నాననెను. ఇంకొకడు నూరేండ్ల క్రిందట చనిపోయిన కాలీపును తానెరుగుదుననెను. అందులో మొదటి ఫకీరు బటూటా మనస్సులోని సంగతులను వెల్లడించి, భవిష్యత్తును చెప్పగలిగెను. ఇంకొక ఫకీరు తనవెంట కుక్కలపలె తిరుగు ఏడు నక్కలను, ఒక సింహమును, వానితో నిర్భయముగా వచ్చు జింకలను వెంటబెట్టుకొని తిరుగుచుండెను.
మహమ్మదీయ మతమునందేగాక అన్ని మతములందును సత్యమున్నదని నమ్మిన అక్బరుచక్రవర్తి యంతటి వేదాంతికి కూడా పైన చెప్పినవానియందు కొంత విశ్వాసముండెను. ఆయన కుమారుడైన జహంగీరునకీ విషయమున వెర్రినమ్మకముండెను. గాఢమైన మహమ్మదీయ మతాభిమానము గల ఔరంగజేబుచక్రవర్తి వీనినసహ్యించుకొనలేదు.
మొగలు చక్రవర్తుల కాలమున ఖగోళశాస్త్రమును దానిపైననాధారపడిన జ్యోతిషశాస్త్రమును రాజాదరణమును పొంది వర్ధిల్లెను. క్రీ.శ. 1530 మొదలు 1556 వరకు మన దేశమునేలిన హుమయూను చక్రవర్తి జ్యోతిషశాస్త్ర ప్రవీణుడు. 1605–1627 మధ్య రాజ్యమేలిన జహంగీరు చక్రవర్తికి జ్యోతిషమునందు గొప్ప నమ్మకముండెనని ఆకాలమున మనదేశములో పర్యటించిన టెర్రీయను ఆంగ్లేయుడు వ్రాసియున్నాడు. క్రీ.శ. 1658 మొదలు 1707 వరకు భారతదేశమునేలిన ఔరంగజేబు చక్రవర్తి కాలమున ఢిల్లీ నగరము హిందూ, మహమ్మదీయ జ్యోతిష్కులతో నిండియుండెనని బెర్నియరు వాకొనియున్నాడు.
మొగలు సామ్రాజ్యమునేలిన చక్రవర్తులేగాక వారి దర్బారులోని గొప్ప ప్రభువులు, దేశములోని వివిధ రాష్ట్రములనేలిన సుబేదారులును, వారి దర్బారులలోని గొప్పవారును జ్యోతిషమునందు నమ్మకము కలిగియుండగా ఇక సామాన్య మహమ్మదీయులమాట చెప్పవలెనా?
వివిధ ప్రాంతములందలి మహమ్మదీయ ప్రజలు హిందువులవలెనే జ్యోతిషమునందు నమ్మకము కలిగియుండి జాతకఫలములు చెప్పించుకొనుచు, ఏ కార్యము చేయదలచినను మంచి ముహూర్తము పెట్టించుకొనుచుండిరి. వారు, హిందువులవలెనే భూతవైద్యము చేయించుకొనుచు మంత్రతంత్రములందు నమ్మకము కలిగియుండిరి. ఇష్టసిద్ధి కొరకై దర్గాలకు పీరులకు తుదకు హిందూదేవతలకు కూడా మ్రొక్కుకొనుచుండిరి.
1761 నుండి మైసూరు రాజ్యమును పాలించిన హైదరాలీ బహద్దరుకు బ్రాహ్మణులచేత జపములు, హోమములు చేయించుటయును, శకునములు, రక్షరేకులు, పూజలు, పునస్కారములపైనను నమ్ముకముండెను. అతడనేక దేవాలయములకు మ్రొక్కుబడులు చెల్లించినాడు. ఆయన నంజనగూడులోని నంజుండేశ్వరునికి మొక్కుబడి క్రింద రత్నహారమునిచ్చినాడు. చాముండేశ్వరికి ఆభరణములు, వస్త్రములిచ్చినాడు. నంజుండేశ్వరాలయమునందు తన పేరున ప్రతిష్టింపబడిన హైదరులింగమునకు ధూపదీపనైవేద్యముల నేర్పాటుచేసినాడు. శ్రీరంగపట్నము దేవాలయ గోపురము పడిపోయినప్పుడు దానిని తన సైనికులచేత కట్టించినాడు. (కథలు, గాథలు – రెండవ భాగము. ది. వేం. శివరావు) హైదరాలీకి శృంగేరీ స్వాములవారిపైన చాలా గౌరవముండెను. అతడు వ్రాయించిన లేఖలా మఠములోనున్నవి.
1782–1799 మధ్య మైసూరునేలిన టిప్పుసుల్తానుకు హిందువుల ఆచారముల పైన అంతనమ్మకము లేకపోయినను తనపైన శత్రువులగు ఇంగ్లీషువారు దండెత్తి వచ్చినప్పుడు బ్రాహ్మణులచేత జపములు చేయించినాడని ఆంగ్ల చరిత్రకారులు వ్రాసియున్నారు. శృంగేరీస్వాములవారిని తనకు జయముకలుగుటకు ఆశీర్వాదము లంపమనియు, దేశక్షేమము కొరకు సహస్రచండీజపము చేయించినందులకు కృతజ్ఞతను తెలుపుచు వ్రాసిన లేఖలు శృంగేరీస్వాములవారి మఠములోనున్నవి.
టిప్పుసుల్తాను క్రీ.శ.1794లో కావేరీ నదిపైన నిర్మించిన కన్నంబాడి ఆనకట్ట శాసనములో, ‘పైగంబర్ మహమ్మదువారి జన్మదినము నుండి ప్రారంభమైన సౌరమాన శకముయొక్క వేయిన్ని రెండువందల తొంబదియవసంవత్సరమైన షాబాద్ శుభవర్షముయొక్క తరి నెల సోమవారము శుభదినమున సూర్యోదయాత్పూర్వము అరుణోదయ కాలమునందు శుక్రగ్రహబలయుక్తమైన వృషభలగ్నమందు’ అని వ్రాయించుటలో జ్యోతిషమునందుగల నమ్మకము వెల్లడియగుచున్నది.
1749 నుండి 1795 వరకు ఆర్కాటు నవాబుగనుండి, ఇంగ్లీషువారినాశ్రయించి కర్ణాటకమునెల్ల వారికి కట్టబెట్టిన మహమ్మదాలి వాలాజానవాబు తన భోగవిలాసముల కొరకు అమితధనమును ఖర్చుపెట్టుచుండెను. ఇంగ్లీషువారిని తృప్తిపరచుటకు కోట్లకొలది రూపాయిల ఋణపత్రములు వ్రాసియిచ్చెను. ఈ నవాబు చెన్నపట్టణము గవర్నరులనేకులకు లంచములిచ్చెను. ఇతని చర్యలకు హర్షింపని గవర్నరగు లార్డు పిగట్టు అనునతనిని పరిమార్చుటకు ఇతడు అచ్చన్నయను బ్రాహ్మణునిచేత మారణహోమము చేయించెనని విల్కాక్సు అను ఆంగ్ల చరిత్రకారుడు వ్రాసియున్నాడు. పిగట్టుగారి కార్యాలోచనసభలోని కొందరాయనకు విరోధులై అతనిని పట్టుకొని ఖైదుచేయగా దీనినిగూర్చి పార్లమెంటువారు విచారించులోపల 1766లో ఖైదులోనే మరణించెను. ఇది తను చేయించిన అభిచార క్రియాఫలితమేయని నవాబు సంతోషించెను.
1824 మొదలు 1860 వరకును హైదరాబాదు సంస్థానములో సైనికశాఖలోను, సివిలు శాఖలోను పెద్దయుద్యోగములుచేసి ప్రజానురంజకుడై ప్రజల ఆచార వ్యవహారములను బాగుగా ఎరిగియుండి అనేక గ్రంథములను రచించి ప్రసిద్ధుడైన మెడోస్ టెయిలర్ తన జీవితచరిత్రలో మనదేశీయులలో హిందువులకు మహమ్మదీయులకు జ్యోతిషమునందు, మంత్రతంత్రములందు నమ్మకముండుటను గూర్చి వ్రాయుటయే గాక తనకొక మహారాష్ట్ర బ్రాహ్మణుడు చెప్పిన జాతకఫలములు తు.చ.తప్పకుండా జరిగినందుల కాశ్చర్యపడుచూ వానివివరములను వ్రాసియున్నాడు. ఇంతేగాక షోరాపూరు సంస్థానమునకు రాజగు వెంకటప్పనాయకుని మైనారిటీ కాలములో తానా సంస్థాన వ్యవహారములను చక్కబెట్టుటనుగూర్చి వ్రాసిన సందర్భములో ఆ కుర్రవాని జాతకములో అతడు 24 సంవత్సరములు నిండకమునుపే మరణించునని చెప్పబడిన ఫలితము ప్రకారమా యువకుడకాలమరణము పొందిన సంగతిని కూడా వివరించినాడు. (Story of my Life – Meadows Taylor.)
హైదరాబాదు సంస్థానములోని ఫకీరులు, దర్వీషులు దయ్యములను వదలించుటకు చేయు మంత్రతంత్రములను టెయిలరు స్వయముగా చూచియుండి దానిని ‘నోబుల్ క్వీన్’ అను నవలలో వర్ణించినాడు.
ఈ మహమ్మదీయులు భూతవైద్యము నందు మహమ్మదీయ మహాత్ముల నామములనే గాక హిందూదైవములగు నరసింహుని, హనుమంతుని పేరులను కూడా నుచ్చరించుటను వివరించి ఇటువంటి విషయాలకు హిందూ-మహమ్మదీయ సాంఘికపరిస్థితులపైన గొప్ప ప్రభావమున్నందువలననే తాను దీనినింత విపులముగా వర్ణించితినని ఆ నవలలో వ్రాసినారు. [చూడు పుట. 282] హిందువులతోపాటు మహమ్మదీయులకును శకునములందు, గ్రహస్థితిపైన, జాతకఫలములపైన, విధినిర్ణయముపైన గట్టి నమ్మకముండుటను గూర్చి టెయిలరు ఇతర గ్రంథములందు వివరించిరి. వారు ప్రయాణములకు బ్రాహ్మణ జ్యోతిష్కుల చేత ముహూర్తము పెట్టించుకొనుటను గూర్చియు, హిందూ దైవములకు నజరులు సమర్పించుటను గూర్చియు వివరించిరి.
హైదరాబాదు సంస్థానమును పరిపాలించిన ఆరవ నిజాము మీర్ మహబూబ్ ఆలీఖాను 1869లో తన తండ్రి చనిపోవునాటికి మూడేండ్ల బాలుడు. ఆయన 18 సంవత్సరములు వచ్చువరకు విద్యాబుద్ధులు నేర్చి 1884లో నిజాముపదవి నధిష్టించిరి. ఆయన తమ దర్బారులో మొగలాయి మర్యాదలను పాటించుచుండిరి. ఆయనకు వేదాంతమునందును, జ్యోతిషమునందును నమ్ముకముండెను. ఆయన చాలా దైవభక్తి కలవాడు. ఆయనకు మంత్ర తంత్రములందు చాలా నమ్మకముండెను. ఆయన కొన్ని సిద్ధులను సంపాదించెను. భూతములు సోకినవారికిని, పాము కరచినవారికిని ఆయన పేరు చెప్పినంతనే బాధ తొలగుచుండెనని ప్రతీతి.
నవాబుగారు చాలా దయార్ద్రహృదయులు. ఆయన చాలామందికి దానధర్మములు చేయుచుండిరి. మహబూబ్ ఆలీఖాను హిందూ ప్రజలనుకూడా తన బిడ్డలవలెనే చూచుకొనుచుండిరని ఇప్పటికిని సంస్థానములోని వృద్ధజనులు చెప్పుదురు. 1908 సంవత్సరములో మూసీనది పొంగి హైదరాబాదులోని చాలా భాగములను ముంచివేసెను. అప్పుడానగరములోని బీదవారన్నవస్త్రములు లేక, నిలువనీడలేక బాధపడుచుండగా నవాబు అనేకవిధములుగా సహాయముచేసిరి. మూసీనది నిముషనిముషమునకు పొంగి నగరమును ముంచివేయునట్లుండగా సవాబు ఉపవసించి పూజాద్రవ్యములతో నది గట్టు దగ్గరకు వచ్చి పూజించి, నది తగ్గనిచో తాను ప్రాయోపవేశము చేయుదునని శపథము చేసిరని, అంతట భగవదనుగ్రహము వలన నది తగ్గినదని ప్రజలు చెప్పుదురు.
మహబూబ్ అలీఖాను 1911లో పోవగానాయన కుమారుడైన ఉస్మానాలీఖాను ఏడవ నిజామైరి. మహబూబ్ ఆలీఖాను కాలములో వారి దర్బారులోని ప్రభువులు, జాగీరుదారులు కూడా ఆ కాలమున మహాత్ముల గోరీలకు మొక్కుబడులు చెల్లించుచు, జ్యోతిషమునందు నమ్మకము కలిగి జాతకములు చూపించుకొనుచు, శకునములను పాటించుచుండిరి.
జాన్ లా అను ఆంగ్లేయుడొకడు మన దేశమున సంచరించి 1907లో ‘గ్లింప్సెస్ ఆఫ్ హిడెన్ ఇండియా’ అనునొక గ్రంథమును రచించియున్నాడు. అతడు తన గ్రంథము నందు హైదరాబాదు సంస్థానములోని సంగతులను వర్ణించుచు మహబూబ్ అలీఖాను ఆ కాలములో ఒక ముదుసలి యోగినికి శిష్యుడై ఆమెను తరచుగా దర్శించుచుండెనని ఆమె శరీర శుభ్రతలేక అసహ్యముగ నుండిన వృద్ధురాలని, అమెకు దివ్యజ్ఞానము కలదని, భవిష్యత్తును చెప్పునని, చాలామంది గొప్ప నవాబులామెను దర్శించుచు తమ గృహచ్ఛిద్రములనామెకు విన్నవించుచు ఆమె సలహాను పొంది, ఆమె యాశీర్వాదములనుబడసి పోవుచుండిరని జాన్ లా తన గ్రంథమున వ్రాసియున్నాడు.
ఆ కాలములో హైదరాబాదులో నుండిన యొక మహమ్మదీయ సూఫీ, హిందూ యోగులను మించిన దివ్యశక్తులను కలిగియుండెనని, అతడు గదిలో నున్నట్లుండి అంతర్థానమై ఇంకొక గదిలో కనబడునని, అతడు చనిపోవునపుడాయన చెప్పినట్లుగా నొక అపూర్వసుగంధము వ్యాపించుటవలన అతని నిర్యాణము దూరముననున్నవారికి తెలిసెనని తన మిత్రుడొకడు చెప్పినాడని, ఇటువంటి పూర్వకాలపు నమ్మకములీ హైదరాబాదు ప్రజలకు చాలా కలవని జాన్ లా తన గ్రంథమున వ్రాసినాడు.
(ఆంధ్రప్రభ, 1966.)