సత్యం

[అమెరికాకు చెందిన రాజకీయవేత్త, న్యాయవాది, రచయిత, మహోపన్యాసకుడు అయిన రాబర్ట్ ఇన్గర్‌సాల్ (Robert G Ingersoll, 1833-99) స్వేచ్ఛాలోచనకు స్వర్ణయుగం అని పిలవబడిన 19వ శతాబ్ది మధ్యకాలంలో మతాన్ని, మతాచారాలను ప్రశ్నిస్తూ ఎన్నో వ్యాసాలు రాశాడు, ఎన్నో ప్రసంగాలిచ్చాడు. అజ్ఞేయవాదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చి ‘ది గ్రేట్ అగ్నాస్టిక్’గా పేరు పొందాడు. ఈతని వ్యాసాలు, ఆలోచనలు ఇప్పటికీ పాతపడలేదు సరికదా ఇప్పటి సమాజానికి మరింతగా వర్తిస్తాయి. నౌడూరి మూర్తి తెలుగులోకి అనువదించిన కొన్ని ఇన్గర్‌సాల్ వ్యాసాలు ఈమాటలో ప్రచురిస్తున్నాం. – సం.]


లక్షల సంవత్సరాలుగా, తన కోర్కెలనూ ఆవేశాలనూ తీర్చుకుందికి చెప్పలేనన్ని మార్గాలను అన్వేషించే క్రమంలో మనిషి నెమ్మదిగా తన మెదడు పదును పెంచుకుంటూ వచ్చాడు. తన ముందు రెండు పాదాల్ని చేతులుగా మార్చుకున్నాడు. చీకటిమయమైన తన మెదడులోకి వివేకమనే రవంత వెలుగు జొప్పించగలిగేడు. అజ్ఞానం, భయం, తప్పిదాలు అతన్ని అవరోధిస్తున్నా, సత్యం తెలుసుకునేకొద్దీ ముందుకి సాగేడు. ఆ సత్యాలు తిరుగులేని సత్యాలు. చీకట్లో తడుముకుంటూ, పడిపోతూ, లేస్తూ, పాకుతూ ఎన్నో వేల సంవత్సరాలు నానా అవస్థలూ పడుతూ వెలుతురువైపు ప్రస్థానం సాగించేడు. దారిలో మతాధికారులు, పురోహితులు, జోస్యులూ అతన్ని అడ్డుకుని, నిరోధించి, మోసగించి లక్ష్యాన్ని చేరుకోవడం ఆలస్యమయ్యేలా చేశారు. అతన్ని దేవదూతలు మోసగించేరు. క్రీస్తు, అతని శిష్యులూ దారి తప్పించేరు. దయ్యాలూ భూతాలూ భయపెట్టేయి. రాజులూ నియంతలూ బానిసగా చేసుకున్నారు. పూజాపీఠాలూ సింహాసనాలూ నిలువుదోపిడీ చేశాయి. చదువు పేరుతో, అతని తలనిండా అసత్యాలు, అసంగతాలూ అసందర్భాలు, గర్హనీయమైన విషయాలూ నింపేరు. మతం పేరుతో, అణకువ-అహంకారం, ప్రేమ-ద్వేషం, క్షమాభిక్ష-ప్రతీకారం బోధించేరు.

కానీ ప్రపంచం మారుతోంది. అనాగరికమైన బైబిళ్ళనుండి, ఆటవిక మతవిశ్వాసాలనుండీ విసుగెత్తిపోయింది. జీవితంలోని పొరబాట్లు, చీకట్లలో నుండి మిలమిలా మెరిసే సత్యాన్ని కనుగొనడం కన్నా గొప్పదీ ముఖ్యమైనదీ మరొకటి లేదు.

సత్యమే ఈ మానవాళి బౌద్ధిక సంపద. సత్యాన్వేషణే అన్ని వ్యావృత్తులలోనూ ఉత్తమోత్తమైనది. అభివృద్ధికి సత్యమే పునాది, సత్యమే నిర్మాణం, సత్యమే గోపురం.

సత్యం మనిషికి సభ్యత నేర్పుతుంది, మనిషిని సంస్కరించి ఉదాత్తుణ్ణి చేసుంది. మనిషి మనసులో జొరబడగలిగిన అత్యున్నత కాంక్ష సత్యాన్వేషణ. సత్యమే ఆత్మ తాలూకు పవిత్రమైన వెలుగు. సత్యాన్ని కనుగొనగలిగిన వ్యక్తి ఒక కాగడాని వెలిగించగలుగుతాడు.

సత్యాన్ని కనుగొనడం ఎలా?

పరిశోధన, ప్రయోగం, వివేచనల ద్వారా.

ప్రతి మనిషికీ అతని శక్తి మేరకు, కోరిక మేరకు, సత్యాన్ని అన్వేషించే అవకాశం ఇవ్వాలి. ప్రపంచంలోని పరిజ్ఞానమంతా అతనికి అందుబాటులో ఉండాలి. దేన్నీ నిషేధించడం గాని, గోప్యంగా ఉంచడం గాని, మరుగుపరచడం గాని చెయ్యకూడదు. ఏ విషయమూ ముట్టుకోకూడనంత పవిత్రమైనది కాదు. తనవైన నిర్ధారణలకు నిలబడేందుకు, నిజాయితీగా ఆలోచనలను ప్రకటించేందుకు ప్రతి వ్యక్తికీ అవకాశం ఉండాలి.

పరిశోధకుణ్ణి దండనతో బెదిరించే వ్యక్తి ఈ లోకంలోనైనా పరలోకంలోనైనా మానవాళికి శత్రువే. స్వర్గాన్ని అందిస్తానని అన్వేషకుడిని ప్రలోభపెట్టే వ్యక్తి సాటి మనిషికి ద్రోహం చేస్తున్నట్టే. సాటి మనుషులనుండి, దేవుళ్ళనుండీ నిర్భయంతో కూడిన స్వేచ్ఛలేకుండా ఏ నిజమైన పరిశోధనా జరుగదు. కనుక, అన్ని అన్వేషణలు, ప్రయోగాలూ తర్కానికి లోబడి జరగాలి. ప్రతివ్యక్తీ తనకు, తనలోని జ్ఞానజ్యోతికి నిజాయితీగా ఉండాలి. బుద్ధి అనే ప్రయోగశాలలో, ప్రతి మనిషీ తనకు తాను, ఈ ప్రపంచం విశ్వసిస్తున్న అన్ని సిద్ధాంతాలను లేదా సత్యాలను ఒంటరిగా పరీక్షించాలి. అతని వివేచన ద్వారా వ్యక్తమైన సత్యమే అతనికి మార్గదర్శకుడూ, యజమానీ కావాలి.

ఆ విధంగా దర్శించిన సత్యం బుద్ధికి ఒక సుగుణం. అకళంకమైన మేధస్సుకి సూచిక. అదే మనిషితనం. అదే స్వేచ్ఛ.

బుద్ధిని, వివేకాన్నీ చర్చీలు, మతాధికారులు, కొన్ని వర్గాలు, రాజులు, దేముళ్ళూ ఇచ్చే ఆదేశాలకు లోబడి పక్కనబెట్టడం దాస్యంతో బానిసత్వంతో సమానం.

ఎవరికి వారు సత్యాన్ని అన్వేషించడం వారి హక్కే కాదు, అది వారి విద్యుక్త ధర్మం కూడా. భయపెట్టీ, అధికారం ప్రదర్శించీ దాన్ని ఆచరణలో పెట్టకుండా నిరోధించడానికి ప్రయత్నించే ప్రతివ్యక్తీ, సాటి మనిషిని కించపరిచి, బానిసగా మలుచుకుందికి ప్రయత్నిస్తున్నట్టే లెక్క. ప్రతివ్యక్తీ మనఃపూర్వకంగా నిజాయితీగా ఉండాలి. నిష్కళంకమైన తన ఆత్మని ఒక అమూల్య ఆభరణంగా కాపాడుకోవాలి. పరీక్షకై మనసు ముందున్న ప్రశ్నలను పక్షపాతం గాని, రాగద్వేషాలు, భయము, వ్యక్తిగత ప్రయోజనాలు గాని లేకుండా పరిశీలించాలి. అతని లక్ష్యం, అతని ఏకైక లక్ష్యం సత్యాన్వేషణ కావాలి. అతను తన వివేకానికి లోబడి ఉన్నంతసేపూ తను చేసే పొరపాటు కంటే సత్యం ప్రమాదకారి కాదని గ్రహించాలి. ఎదురుగా ఉన్న ఋజువులని, అనుకూల ప్రతికూల వాదనలనని, రాగద్వేషాలూ ప్రలోభాలూ ప్రభావితం చెయ్యలేని నిజాయితీ అనే త్రాసులో బేరీజు వెయ్యాలి. అతని వివేకం ఏది సత్యమని చెబితే దానిని తప్ప, అధికారానికి, పేరుప్రఖ్యాతులు, సంప్రదాయాలు, నమ్మకాలకి అతను విలువ ఇవ్వకూడదు.

మనిషి తన సామ్రాజ్యంలో తానే ఎదురులేని చక్రవర్తి. అతని మనసు ఆ కేతనాన్ని నిర్భయంగా ఎగురవెయ్యాలి. అతని రాజ్యంలోంచి బెదిరించి భయపెట్టేవారిని తరిమికొట్టాలి. అతను వివేకవంతమైన ఆలోచనలను ఆహ్వానించాలి.

పక్షపాతం, అహంకారం, ద్వేషం, జుగుప్స, అసహనం, సత్యానికీ అభివృద్ధికీ బద్ధశత్రువులు.

నిజమైన సత్యాన్వేషి, పాతది కదా అని ప్రతిదాన్నీ అంగీకరించడు; కొత్తదిగదా అని ప్రతిదాన్నీ స్వీకరించడు. కీర్తిశేషులని సమ్మానించడంగాని, సమకాలీనులని వ్యతిరేకించడంగాని చెయ్యడు. ఎవరు చెప్పారన్నదానితో నిమిత్తం లేకుండా, చెప్పినదానిలోని తర్కమే ప్రాతిపదికగా, సత్యమే ప్రామాణికంగా తీసుకుంటాడు. చెప్పిన వ్యక్తి రాజా-దాసుడా, తాత్త్వికుడా-సేవకుడా అన్నదాన్నిబట్టి చెప్పినదానిలోని సత్యానికీ తర్కానికీ విలువ ఆపాదించడమో, తిరస్కరించడమో చెయ్యడు. సత్యపు విలువకి, సత్యాన్ని అందించిన వ్యక్తి కీర్తిప్రతిష్టలతోనూ, హోదాతోనూ సమసంబంధం ఉండదు.

అసత్యాలకి మాత్రమే కీర్తి, అధికారం, ఘనమైన ఉడుపులు, వేషధారణలు, కిరీటాల తోడ్పాటు అవసరమౌతుంది.

విజ్ఞానులూ నిజాయితీపరులూ మేధావులూ- వీరికి సంఖ్యాబలంతో- ఎక్కువమంది ఏది నమ్ముతున్నారన్న దానితో- సంబంధమూ లేదు, దానిని బట్టి వాళ్ళ నిర్ణయాలు మారనూ మారవు. వారు నిజంగా ఏది సత్యమని నమ్ముతారో దాన్నే అంగీకరిస్తారు. తార్కికంగా వారిని సంతృప్తిపరచనంతవరకు పూర్వీకుల అభిప్రాయాలనైనా, మతవిశ్వాసాలు, సిద్ధాంతాలు, ప్రకటనలనైనా, ఎంతమాత్రం లక్ష్యపెట్టరు. వాళ్ళు అన్ని దిక్కులా సత్యాన్వేషణ మాత్రమే కొనసాగిస్తారు. సత్యాన్ని గుర్తించినప్పుడు, అంతకుముందు వాళ్ళకు ఆ విషయం పట్ల వేరే అభిప్రాయం, రాగద్వేషాలూ ఉన్నా, వాటిని పక్కన బెట్టి ఆనందంతో సత్యాన్ని స్వీకరిస్తారు.

విజ్ఞులూ నిజాయితీపరులూ అనుసరించే మార్గం ఇదే. వారికి వేరే మార్గం తెలీదు.

మనిషి కృషిచేసే అన్ని రంగాలలోనూ సత్యాన్ని, లేదా యదార్థాన్ని తెలుసుకుందికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఒక రాజకీయ శాస్త్రజ్ఞుడు ప్రపంచ చరిత్రని చదివి, అన్ని దేశాల గణాంకాలూ ఎందుకు సేకరిస్తాడంటే, తన దేశం ఇతరదేశాలు గతంలో చేసిన పొరపాట్లని తిరిగి చెయ్యకుండా చూసేందుకు. ఒక భూభౌగోళిక శాస్త్రవేత్త ఈ భూమి చరిత్ర తెలుసుకుందికి రాతిపొరలలో వెతుకుతాడు, మహాపర్వతాలు అధిరోహిస్తాడు, శాంతించిన అగ్నిపర్వత బిలాల్ని దర్శిస్తాడు, ఖండాలూ, దీవులూ తిరుగుతాడు. అతనికి కావలసిందీ సత్యమే. ఒక రసాయనశాస్త్రవేత్త ప్రకృతిసిద్ధంగా తయారైన అనేక పదార్థాల లక్షణాలను బహిర్గతం చెయ్యడానికి లోహాల్ని కరిగించే ఆవర్తనిని (మూసని), ప్రయోగనాళికని ఉపయోగిస్తూ కొన్ని వేల ప్రయోగాలు చేస్తాడు. యంత్రశాస్త్రం వాస్తవప్రపంచంలో శక్తులమధ్య జరిగే సంఘర్షణల గురించి, జరిగే మార్పులూ అవినాభావ సంబంధాల గురించి సత్యాన్ని తెలుసుకుందికి ప్రయత్నిస్తుంది. వైద్యులూ శస్త్రవైద్యులూ పరిశీలన, ప్రయోగం, వివేకం మీద ఆధారపడతారు. మానవశరీరం, అందులోని ప్రతి కండరం, రక్తం, నరంతోనూ, మెదడుచేసే అద్భుతాలతోనూ పూర్తి పరిచయం కలిగి ఉంటారు. వాళ్ళకి కావలసింది సత్యం తప్ప మరొకటి కాదు.

తక్కిన శాస్త్రాలలోని విద్యార్థులందరూ చేసే పని కూడా అదే. అన్ని సందర్భాలలోనూ సత్యాన్ని కనుక్కుందికీ, కనుక్కున్న సత్యాన్ని ప్రపంచానికి తెలియజేయడానికీ అత్యంత ప్రాధాన్యాన్నిస్తారు. వాళ్ళ సాహసం వాళ్ళ తెలివితేటలకి సమాన స్థాయిలో ఉండాలి. గతంలో గొప్పవాళ్ళు ఏది చెప్పినా, ఇప్పటివారు ఏది విశ్వసిస్తున్నా, వాటితో ప్రమేయం లేకుండా వాళ్ళకు తెలిసిన సత్యాన్ని వాళ్ళు చెప్పగలిగి ఉండాలి. అటువంటి బౌద్ధిక సాహసం వాళ్ళలో ఉండాలి.

సత్యాన్ని కనుగొనడం మనిషికి మంచి చేస్తుందనుకుంటే, అన్వేషకుడికి బౌద్ధిక సచ్ఛీలతా యోగ్యతా ఉచితమైనవనుకుంటే, ఆ తెలుసుకున్న సత్యం తక్కినవారందరూ తెలుసుకోవడం అవసరమే.

ప్రతి మనిషికీ తన మనసులోని అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పగలిగిన ధైర్యం ఉండాలి. దానివల్ల సత్యాన్ని కనుక్కున వ్యక్తీ, దాన్ని ప్రకటించిన వ్యక్తీ మానవాళికి మేలుచేసినవారవుతారు. అటువంటి నిజాయితీతో కనుక్కున్న సత్యాన్ని అడ్డుకునేవారూ, అడ్డుకునేలా ప్రోత్సహించేవారూ, నాగరిక ప్రపంచానికీ సత్యానికీ బద్ధశత్రువులు. తన ఆలోచనలను ప్రకటించడానికి హక్కును ప్రదర్శించే వ్యక్తి, అదే హక్కును ఇతరులకు నిరాకరించడాన్ని మించిన అహంకారమూ సిగ్గుమాలినతనమూ ఉండవు.

కొన్ని ఆలోచనలు అతిపవిత్రమైనవనీ, మనిషికి తనకు తానై వాటిని పరిశోధనచేసి పరీక్షించే హక్కు లేదనీ చెప్పే వాదనలు చెల్లవు. అవి పవిత్రమైనవని ఎవరికి తెలుసు? మనిషికి నిజమో కాదో తెలియని విషయాలు పవిత్రం ఎలా అవుతాయి?

కొన్ని శతాబ్దాలపాటు స్వేచ్ఛగా తమ భావాలను ప్రకటించడం భగవంతునికి అవమానం చెయ్యడంగా భావించబడేది. వాళ్ళ దృష్టిలో నిజాయితీగా ఆలోచనలను ప్రకటించడాన్ని మించిన దైవదూషణ మరొకటి లేదు. అలా నిజాయితీగా ప్రకటించే విజ్ఞుల నోళ్ళను కొన్ని శతాబ్దాలపాటు నొక్కి ఉంచేరు. సత్యం వెలిగించిన దీపకళికలనీ, ధైర్యంగా వాటిని ఎత్తిచూపించిన వ్యక్తుల్నీ రక్తపాతంతో ఆర్పేసేరు.

సత్యం ఎప్పుడూ స్వేచ్ఛగా అభిప్రాయాలని ప్రకటించడానికి అనుకూలంగానే ఉంటుంది. అదెప్పుడూ నిజాన్ని అన్వేషించమనీ, తెలుసుకుని అర్థంచేసుకోమనీ అడుగుతుంది. స్వేచ్ఛాస్వాతంత్య్రాలూ, చర్చ, నిజాయితీ, పరిశోధన, ధైర్యం ఈ ఐదూ సత్యానికి స్నేహితులూ అనుయాయులూ. సత్యం వెలుతురునీ బహిరంగప్రదేశాలనీ ఇష్టపడుతుంది. అది మనిషి మేధస్సుకి చెందిన వివేకాన్నీ, విచక్షణనీ, వాటిని మించిన ఉన్నతమైన శక్తులన్నిటినీ ఆశ్రయించి ఉంటుంది. అది ఆవేశాలని అదుపులో ఉంచడాన్ని, పక్షపాతాన్ని తుడిచిపెట్టడాన్ని, విచక్షణాజ్ఞానమనే దీపకాంతి మరింత ఉజ్జ్వలంగా ప్రకాశించడాన్నీ కోరుకుంటుంది.

సత్యం మనిషి మోకరిల్లడాన్నీ ప్రాకులాడడాన్నీ కోరుకోదు. అది అజ్ఞానులు భయంతో చేసే ప్రార్థనలనీ ప్రస్తుతినీ కోరుకోదు. అది ప్రతి మనిషికీ ఇచ్చే సందేశం ఇదే: “నీమట్టుకు నువ్వు ఆలోచించు. భగవంతుడు ఇచ్చిన స్వేచ్ఛను అనుభవించు. నిజాయితీగా నీ మనసు నమ్మే విషయాలను ప్రకటించగల ధైర్యాన్ని కలిగి ఉండు.”

అసలు మనం ఎందుకు సత్యాన్ని అన్వేషించాలి? ఎందుకు పరిశోధించి బుద్ధితో తర్కించాలి? మానసికంగా నిజాయితీగా, యోగ్యతగలిగి ఎందుకు ఉండాలి? మనసులోని మాటలను ఎందుకు నిజాయితీగా ప్రకటించాలి? వీటన్నిటికీ సమాధానం: మానవాళి శ్రేయస్సుకి.

మన మెదడు అభివృద్ధి చెందాలి. ప్రపంచంలోని ప్రజలందరూ ఆలోచనాపరులై ఉండాలి. అందరికీ వాక్స్వాతంత్య్రం ఉండాలి. మూఢంగా ప్రతీదీ విశ్వసించడం సుగుణం కాదనీ, తర్కానికి పూర్తిగా లోబడని ఏ ప్రశ్నకీ పూర్తి సమాధానం రాదనీ ప్రపంచం తెలుసుకోవాలి.

ఈ మార్గాలద్వారా ప్రకృతిలో మనిషికి ఎదురయ్యే అవరోధాలకి సమాధానం కనుక్కోవచ్చు. మనిషి అనేక రోగాలకి చికిత్స కనుగొనడమో, వాటిని తప్పించుకోడమో చెయ్యగలడు. అతను బాధలను తగ్గించుకోగలడు. తన జీవనప్రమాణాన్ని పెంచుకుని, ఉదాత్తంచేసుకుని, విలువైన జీవితాన్ని గడపగలడు. అతను తన శక్తియుక్తులని అన్నిరంగాలలోనూ పెంపొందించుకోగలడు. అతని వాంఛలని నెరవేర్చుకుని, ఇష్టాలను తీర్చుకోగలడు. కూడూ గుడ్డా, ఇల్లూ వాకిలీ, సుఖసంతోషాలూ అందరికీ అందుబాటులో ఉండేలా చెయ్యగలడు. ప్రపంచంలోని లేమినీ నేరప్రవృత్తినీ పారద్రోలగలడు. భయమనే మహా సర్పాన్నీ, మూఢనమ్మకాలనే క్రూరమృగాలనీ నాశనం చెయ్యగలడు. అతను వివేకవంతుడుగా, స్వేచ్ఛాజీవిగా, నిజాయితీపరుడుగా, ప్రశాంతచిత్తుడుగా ఉండగలడు.

ఈ సృష్టికర్తని సింహాసనం నుండి క్రిందకి దింపగలడు. నరకంలోని భీకర అగ్నిజ్వాలలని ఆర్పగలడు. పవిత్ర యాచకులందరూ నిజాయితీపరులుగా, ఉపయోగకరమైన వ్యక్తులుగా మారగలరు. ఆత్మవంచన ఏ సుంకాన్నీ వసూలు చెయ్యలేదు; అసత్యాలు పవిత్రస్థానాన్ని అలంకరించలేవు; మరొక లోకంలోని జీవితంకోసం ఇక్కడి జీవితాన్ని ఎవరూ త్యాగం చెయ్యరు; భగవంతునికి బదులు మనుషులు ఒకర్నొకరు ప్రేమించుకోగలుగుతారు; మరోలోకంలో పొందబోయే సౌఖ్యాలకోసం కాక, ఇక్కడ ఆనందంగా ఉండడం కోసం మనుషులు మంచిపనులు చెయ్యడం ప్రారంభిస్తారు. ప్రకృతి ఒక్కటే సందేశంగా, మనిషి తనకు తానుగా, తన ప్రయత్నం ద్వారా, ఈ నక్షత్రాలు, మేఘాలు, రాయి, మట్టి, సముద్రాలు, సెలయేళ్ళు, వర్షం, నిప్పు, చెట్లు, పువ్వులు, చిత్రవిచిత్రాలుగా కనిపించే జీవ వైవిధ్యం, అచేతనా ప్రకృతి, ప్రకృతి శక్తులూ చెప్పే కథలనన్నిటినీ, చూసి, చదివి, గ్రహించాలని తెలుసుకుంటాడు.

ఈ కథలనన్నిటినీ చదివిన తర్వాత, వాటిలోని అంతర్గత సత్యాన్ని గ్రహించిన తర్వాత, ప్రకృతికి అతీతమైన ఆధిభౌతికశక్తులు ఏవీ ఉండవని, మనిషి భవిష్యత్తుకి మనిషి మాత్రమే కర్త అనీ తెలుసుకుంటాడు.

మనిషి తన ఆత్మగౌరవం నిలుపుకోడానికి, నిష్కళంకమైన తన ఆత్మజ్యోతి పవిత్రతని నిలబెట్టుకుందికీ స్వేచ్ఛగా ఆలోచించగలిగిన హక్కుకి మినహా మరొక వాదనని ఊహించలేము.

సత్యం-2

నేను ఇప్పటివరకూ చెప్పినదంతా నిజమేనని, స్వయం వ్యక్తమని, ’స్వాతంత్య్రం కంటే బానిసత్వం మెరుగని ఎవరన్నారు?’ అని మీరు ప్రశ్నించవచ్చు. విశదీకరిస్తాను.

సంప్రదాయంగా వస్తున్న అనేక చర్చిలు, అక్కడి మతాధికారులు, పూజారులు భగవంతుడు వారికి సందేశాన్ని వినిపించినట్టు చెప్పుకొస్తున్నారు.

ప్రొటెస్టెంట్లు ఈ సందేశాన్ని చదవడం, అర్థం చేసుకోవడం, దాన్ని నమ్మడం ప్రతి వ్యక్తి బాధ్యత అని, మనిషి తన వివేకాన్ని ఉపయోగించాలనీ చెబుతున్నారు. కానీ, బైబిలు చదివిన తర్వాత ఒక వ్యక్తి అది భగవంతుని సందేశంలా కనిపించలేదని నిజాయితీగా భావించి, మనసులో ఆ ఆలోచనతో మరణిస్తే, అతను నరకబాధలు తప్పక అనుభవించవలసి వస్తుందని చెబుతున్నారు. ఒకప్రక్క ‘చదవమని’ చెబుతూనే, మరొకప్రక్క చదివిన తర్వాత ‘నమ్మవలసిందే! లేకపోతే, నరకంలో పడిపోతావు’ అనికూడా హెచ్చరిస్తున్నారు.

మీకు బైబిలు ఎంత అహేతుకంగా కనిపించినా, దాన్ని మీరు నమ్మవలసిందే. అందులోని అద్భుతాలు ఎంత అవాస్తవికంగా కనిపించినా, వాటిని నమ్మాల్సిందే. అందులోని విధివిధానాలు ఎంత క్రూరంగా ఉన్నా, మీ మనసు వాటిని అంగీకరించవలసిందే. చర్చి దృష్టిలో ఆలోచనా స్వాతంత్య్రం అంటే ఇదే.

భగవంతుడు మనల్ని కొరకొరగా భయపెడుతూంటే బైబిలుని చదువుతాం. కంటికెదురుగా నరకం కనిపిస్తుంటే చదువుతాం. ఒక ప్రక్క, సైతాను మనల్ని హింసించడానికి చేతుల్లో సాధనాలతో సిద్ధంగా ఉంటాడు. మరొక ప్రక్క దేముడు మనల్ని శపించడానికి సిద్ధంగా ఉంటాడు. అప్పుడు చర్చి పాఠకుడితో: ‘మీకు నిర్ణయించుకుందికి పూర్తి స్వాతంత్య్రం ఉంది. దేముడు కరుణామయుడు. మీకు నిర్ణయించుకునే స్వేచ్ఛని ప్రసాదించాడు’ అని అంటుంది. మతాధికారులూ, పూజారులూ బీదాబిక్కీతో ఇలా అంటారు: ‘మీరు బైబిలు చదవనక్కరలేదు. మీరు దానిని అర్థం చేసుకోలేరు. అందుకనే దాన్ని భగవత్సందేశం అన్నది. మేము మీకు దాన్ని చదివి వినిపిస్తాం. మీరు మేము చదివినదాన్ని నమ్మాలి. మా దగ్గర నరకానికి తాళంచెవి ఉంది. మా మాటని ధిక్కరించారో, శాశ్వతంగా మీరు నరకంలో బందీలుగా ఉండవలసిందే.’

కేథలిక్ చర్చి చెప్పే స్వాతంత్య్రం అంటే ఇదే.

ఈ మతాధికారులూ, పూజారులూ, మనిషి వివేకంకన్నా బైబిలు గొప్పదని తర్కంతో, ఋజువులతో ఏ మాత్రం సంబంధం లేకుండా, అవి నిజమని నమ్మినా నమ్మకున్నా, మనిషి వాటిని నిజమేనని నమ్మి ఆమోదించడం అతని కర్తవ్యం అని బోధిస్తారు. మనిషి ఆత్మ మందిరంలోంచి వివేచనా దైవాన్ని విసిరిపారేసి, భయమనే సర్పానికి మోకరిల్లేలా చెయ్యడమే మతాధికారుల కర్తవ్యం.

దీనినే చర్చి సుగుణంగా ప్రచారం చేస్తుంది.

ఇటువంటి పరిస్థితుల్లో ఆలోచనలకి విలువేమిటి? వడగాడ్పువంటి దేముడి శాపానికి గురైన మనిషి మెదడు ఒక ఎడారిగా మారిపోతుంది. అంతే కాదు, మనిషి తన తార్కిక ప్రమాణాలని పరిత్యజించడానికి ఉత్తరలోకాల్లో అనుభవించవలసిన శాశ్వతమైన శిక్షలను బూచిగా చూపించి భయపెట్టడంతో సరిపుచ్చుకోక, శాశ్వతంగా కలిగే ఆనందమనే తాయిలాన్ని ఎర వేస్తుంది. దానిని నమ్మినవాళ్ళకి స్వర్గంలో అనంతమైన సౌఖ్యాలు వాగ్దానం చేస్తుంది. అది భయపెట్టలేకపోతే, లంచం ఇస్తుంది. మనిషి భయంమీదా ఆశమీదా అది ఆధారపడుతుంది.

ఒక వివేకవంతుడైన మనిషి నమ్మకాన్ని, గౌరవాన్నీ పొందాలంటే, ఏ మతమైనా, నిరూపింపబడిన సత్యాలమీద ఆధారపడి ఉండాలి. అది ఆవేశ కావేషాలు, భయపెట్టడాలు, ప్రలోభాలూ వంటివి కాకుండా మనిషి విచక్షణాశక్తిని లక్ష్యంచేసుకోవాలి. మనిషి తన మేధోశక్తులనీ ఇంద్రియ జ్ఞానాన్నీ ఒకచోట జేర్చి, యోచించి, తర్కించి, అందులోంచి నిగ్గుతీసిన ప్రతిపాదనలని ఏ దురభిమానమూ లేకుండా, నిర్భయంగా, స్పష్టంగా, ప్రశాంతతతో విశదీకరించాలి.

కానీ చర్చి, ‘మీరు ఏసుక్రీస్తును నమ్మండి, మీరు రక్షించబడతారు’ అని ప్రకటిస్తుంది. ఈ నమ్మకం లేకుండా వాళ్ళకి మోక్షం లభించదు. నమ్మకానికి ప్రతిఫలమే మోక్షం.

ఏ నమ్మకమైనా, ఏ కాలంలోనైనా, లభించిన ఋజువుల పర్యవసానమై ఉండాలి. ప్రతిఫలంగా ఇవ్వజూపే వాగ్దానం ఋజువు కాదు. అది వివేకానికి ఏ రకమైన మార్గదర్శనం చెయ్యదు. ఏ సత్యాన్నీ నిరూపించదు. ఏ అభ్యంతరానికీ సమాధానం చెప్పదు. ఏ సందేహాన్నీ నివృత్తి చెయ్యదు.

నమ్మకానికి బహుమానం ప్రకటించడం ఒక నిజాయితీ గల చర్యేనా?

ఒక న్యాయాధికారికి గాని, న్యాయాధికారుల సమూహానికి గాని అనుకూలమైన తీర్పుకోసం డబ్బుని ఎరజూపేవాడు అపరాధం చేస్తున్నవాడితో సమానం. ఎందుకు? అతను ఆ న్యాయాధిపతి గాని, న్యాయాధికారుల సమూహం గాని, చట్టాన్ని, ఎదురుగా ఉన్న సాక్ష్యాన్నీ ఏది సబబో దాన్నిబట్టి కాకుండా ఎరజూపే లంచం ఆధారంగా న్యాయనిర్ణయం జరిగేలా ప్రభావితం చేస్తున్నాడు గనుక. కనుక, నమ్మినవాళ్ళకి క్రీస్తు చేసే వాగ్దానం కూడా ఖచ్చితంగా లంచమే. అది వాగ్దానాన్ని సాక్ష్యంగా చూపించే ప్రయత్నం. ఈ లంచానికి ఆశపడి ఎవ్వడైతే నమ్మకాన్ని ప్రకటిస్తాడో, ఆ వ్యక్తి తన ఆత్మని అమ్ముకుంటున్నట్టే.

మాటవరసకి భూకేంద్రంలో వందమైళ్ళ వ్యాసంతో ఒక వజ్రం ఉందనీ, దాన్ని తెచ్చినవాడికి పదివేల డాలర్లు బహుమతిగా ఇస్తాననీ నేను ప్రకటిస్తే దాన్ని ఎవడు నమ్ముతాడు? అటివంటి వాగ్దానాన్ని సాక్ష్యంగా ఎన్నడైనా పరిగణించవచ్చునా?

వివేకవంతులైన వ్యక్తులెప్పుడూ బహుమతులు అడుగరు, ఋజువులు అడుగుతారు. కేవలం ఆత్మవంచకులు మాత్రమే ధనాన్ని కోరుకుంటారు.

కానీ, కొత్త నిబంధనల గ్రంథం ప్రకారం, నమ్మినవాళ్ళకి క్రీస్తు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానమే ఋజువుగా చలామణీ అవుతోంది. క్రీస్తు ఈ వాగ్దానాన్ని చేస్తున్న సమయంలో ఆత్మశుద్ధిగల, నిజాయితీపరులైన, స్వేచ్ఛగా ఆలోచించగల వ్యక్తుల నైతిక ప్రవర్తనని మరిచిపోయైనా ఉండాలి, నిర్లక్ష్యం చేసైనా ఉండాలి, లేదా తిరస్కారభావంతో చూసైనా ఉండాలి. మనిషి మానసిక స్వాతంత్య్రానికీ, విశ్వాసానికి ప్రతిఫలంగా వాగ్దానంచేసిన మోక్షానికీ, పొత్తు కుదరదు. ఋజువుకీ నమ్మకానికీ ఏమాత్రం సంబంధం లేదని తెలిసినవాడెవడూ అటువంటి వాగ్దానం చెయ్యడు. నమ్మిన ప్రతివారి ఆత్మా రక్షింపబడతాయని చెప్పిన ప్రతి ప్రార్థనా, ఒక గాయమే. అటువంటి ప్రార్థనలు నైతిక దృక్పథాన్ని పలుచన చేస్తాయి, విలువలూ బాధ్యతలూ అన్న ఊహలని ధ్వంసం చేస్తాయి.

మనిషన్నవాడు దేన్నైనా నమ్మమని అడిగినపుడు, ఋజువులు చూపించమని అడుగుతాడు; ఇతరులని నమ్మమని కోరేవాడు ఋజువులని చూపిస్తాడు.

ఇంతటితో ఆగిపోలేదు. నరకంలో అనుభవించవలసిన బాధలగురించి చెప్పినా, శాశ్వతంగా అనుభవించగలిగిన సుఖాల ఆశ చూపించినా, అవిశ్వాసులు పెరిగిపోవడంతో చర్చిలు మరొక అడుగు ముందుకువేశాయి. అవిశ్వాసులతో, నాస్తికులతో చర్చి ఇలా అంటోంది: ‘వెళ్ళడమే తప్ప తిరిగిరాలేని మరొక లోకంలో ఎలాగూ మిమ్మల్ని భగవంతుడు శాశ్వతంగా బంధించి శిక్షించినా, మీరు నమ్మకపోతే, మీకు ఆ శిక్షలు ఇక్కడే ఇప్పుడే అమలు చేస్తాం.’ అని. చర్చిలోని మూడు విభాగాలు- పోపులు, పురోహితులు, అధికారులూ- ఈ అవిశ్వాసుల చుట్టుప్రక్కల ఉండే విశ్వాసులచే వాళ్ళని గొలుసులతో బంధించి, చీకటిగుహల్లో నిర్బంధించి, రాళ్ళపై పడుకోబెట్టి, ఎముకలు చితగ్గొట్టి, నాలుకలు తెగగోసి, కళ్ళు పొడిపించి, బ్రతికుండగా చర్మం ఒలిపించి, పాపం వాళ్ళ శరీరాలని మంటలకి ఆహుతి చేశారు. ఇవన్నీ ఎందుకు చేశారంటే, ఈ క్రిస్టియన్ ఆటవికులు నరకాన్ని విశ్వసించేరు. వాళ్ళు విశ్వాసానికి ప్రతిఫలం స్వర్గం అని నమ్మేరు. అలా నమ్మడం ద్వారా, స్వేచ్ఛగా ఆలోచించగలిగేవారికీ, మాటాడేవారికీ శత్రువులుగా మారేరు. వాళ్ళు మనస్సాక్షికీ, ఆత్మయొక్క సత్యసంధతకీ, మానవత్వానికీ అసలు విలువ ఇవ్వలేదు. అన్ని యుగాల్లోనూ ఈ మతాధికారులందరూ నిరంతరాయంగా, కర్కశంగా ప్రవర్తించేరు. వాళ్ళు అవిశ్వాసుల్ని దూషించి, అపవాదులు వేసి హింసించేరు. ఓటమిలో పాదాక్రాంతులై మూలిగేరు. గెలుపులో విచ్చలవిడిగా హత్యలు చేసేరు. వాళ్ళ హృదయాలలో, మెదళ్ళలో, జాలి అన్న కుసుమం ఎన్నడూ వికసించనేలేదు. న్యాయం వైపు త్రాసు ఎన్నడూ తూగనేలేదు.

ఇప్పుడు వారంత క్రూరంగా ప్రవర్తించడంలేదు. కారణం, ఇప్పుడు వారికి అటువంటి అధికారాలు లేవు. అయినా, ఇప్పటికీ వాళ్ళు అసాధ్యమైన విషయాలను సాధించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అగ్నిశిలని జేబులో నింపుకుని బంగారమని భ్రమిస్తున్నారు. వాళ్ళ మెదళ్ళ నిండా తప్పుడు సమాచారాన్ని నింపుకుని జ్ఞానులమని పొరపడుతున్నారు. ఇతిహాసాలతో, పురాణాలతో, తమని తాము ఓదార్చుకుంటూ, అసత్యాలపై కల్పిత కథలపై నమ్మకం పెంచుకుని, దయ్యాలూ భూతాలపై మనసు పారేసుకుని అస్తిత్వంలేని వాటి సహాయానికి ఆరాటపడుతున్నారు.

ఆకాశంలో ఒక నియంతలాంటి భయంకరాకారాన్ని విశ్వానికి అధిపతిగా నిలిపి, సాటి మనిషిని బానిసగా చేసుకుందికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు సేవాధర్మాలని విలువలుగా ప్రచారం చేస్తున్నారు. మానవత్వం ఉన్న సాహసవంతుల్ని అసహ్యించుకుంటున్నారు. ఆలోచించే మనిషంటే వాళ్ళకి గిట్టదు. ఎప్పుడూ ప్రతీకారం కోసం పరితపిస్తుంటారు. ఊహాత్మక నరకజ్వాలల్లో వాళ్ళు చలికాచుకుంటారు.

వాళ్ళకి నేను నరకం అన్నది లేనేలేదని చెబుతుంటే, వాళ్ళకి ఆ ఓదార్పుకూడా లేకుండా చేస్తున్నందుకు నన్ను గర్హిస్తున్నారు.

ప్రచారంలో ఉన్న ఒకానొక కథ ప్రకారం, హొరేస్ గ్రీలీ ఒక శీతకాలపు పొద్దున ఒక దుకాణానికి వెళ్ళి. అక్కడ ఒక పొయ్యి దగ్గరకి కుర్చీ జరుపుకుని, తొడుక్కున్న కోటు విప్పి రెండు చేతులూ బార్లాజాపి కూర్చున్నాడు. రెండు నిముషాలు పోయిన తర్వాత అక్కడ పనిచేస్తున్న కుర్రాడు వచ్చి, “మిస్టర్ గ్రీలీ! ఆ పొయ్యిలో నిప్పులేదే?” అని అన్నాడు.

“బుద్ధితక్కువ వెధవాయ్!” అని మందలించి, “నాకెందుకు చెప్పావా సంగతి? నేను ఇప్పటిదాకా వెచ్చబడుతుంటే?” అన్నాడు.