మంటో కథలు: వంకర గీత

దారి తిన్నగా… అంటే మరీ తిన్నగా ఉంటే వాడి పాదాలు బరువెక్కిపోయినట్టు అయ్యేవనుకోండి. వాడంటూ ఉండేవాడు: “తిన్నగా ఉండడమనేది జీవితానికి వ్యతిరేకం. జీవితం చిక్కుపడిపోయి ఉంటుంది కదా. ఎన్నో మలుపులుంటాయి దాంట్లో.”

మేమిద్దరం కలిసి షికారుకి వెళ్ళేటప్పుడు వాడెప్పుడూ తిన్నగా ఉన్న దారుల్లో నడిచేవాడు కాదు. పార్క్‌లో చెట్ల మధ్యగా మలుపులు తిరిగివుండే కాలిబాట వాడికి బాగా నచ్చేది.

ఒకసారి పార్క్‌లో తన మోకాళ్ళని గుండెలకు అంటిపెట్టుకొని కూర్చుని ఎంతో ఆర్తితో నాతో అన్నాడు: “అరే అబ్బాస్, నాకు ఇంకేం పని చేయాల్సిన అవసరం లేకపోయుంటేనా, నా జీవితం మొత్తం కశ్మీరులో కొండదారులు ఎక్కుతూ దిగుతూ గడిపేవాడిని… ఏం మలుపులవి… ఒక క్షణం కనబడతావు, మరుక్షణం మాయమైపోతావు… ఎంత వేరుగా ఉంటుంది అక్కడ… తిన్నగా ఉన్న దారిలో ఎదురొచ్చే ప్రతీదీ నీకు ముందే తెలిసిపోతుంది, కానీ అక్కడ ఎదురుగా వచ్చే ప్రతీది అమాంతంగా నీ ముందుకొస్తుంది, చావులాగా అకస్మాత్తుగా… అందులో ఎంత మజా ఉంటుందో!”

వాడి వయసు తక్కువే కాని బక్కపల్చగా ఉంటాడు. చెప్పలేనంత బక్కదనం అది. ఎంతో బలహీనంగా కనపడే వాణ్ణి చూసినప్పుడల్లా, ఏదో భయంకరమైన రోగంతో ఆసుపత్రిలో ఉండి ఉన్నట్టుండి మంచం మీద నుంచి లేచి వచ్చేసిన ఎవరో రోగి గుర్తొస్తాడు. వాడి వయసు మహా అయితే ఇరవై రెండేళ్ళు ఉంటుంది. కానీ మిగిలిన లక్షణాలు చూస్తే అంతకన్నా ఎక్కువ వయసేమోనని అనిపించేట్టు ఉంటాడు. ఇంకో వింతేంటంటే కొన్నిసార్లు వాణ్ణి చూస్తే చిన్నపిల్లవాడిని చూసినట్టు ఉంటుంది నాకు. వీడిలో ఈ మార్పు ఎంతలా ఉన్నపళాన వచ్చేదంటే నాకు నా దృష్టి మీదే అనుమానం కలిగేది.

ఒకసారి ఏం జరిగిందో వివరంగా చెప్తాను. వాడు నాకు అనుకోకుండా బజారులో కనిపించాడు. నేను కాస్త ఆశ్చర్యపోయాను వాణ్ణక్కడ చూసి. వాడి చేతిలో ఒక పెద్ద ఆపిల్. దానిని ఎంతో ఇష్టంగా కొరికి కొరికి తింటున్నాడు. బాగా ఇష్టమైనది దొరికినప్పుడు చిన్నపిల్లల్లో కనిపించే ఒక చెప్పలేని ఆనందంతో వాడి మొహం వెలిగిపోతోంది. ఆ ఆపిల్ ఎంత రుచిగా ఉందో వాడి మొహమే చెప్తోంది.

నన్ను చూసి, చేతి మీదంతా కారిన ఆపిల్ రసాన్ని చిన్నపిల్లల్లాగే తన పాంటుకి తుడుచుకొని, నా చేతిని పట్టుకొని చాలా ఉత్సాహంగా ఊపేస్తూ అన్నాడు: “అరే అబ్బాస్, వాడు రెండు అణాలన్నాడు ముందు. కానీ చివరికి ఒక్క అణాకే బేరం ఆడి తీసుకున్నాను.” వాడి మొఖంలో ఒక గొప్ప విజయం సాధించిన నవ్వు తొణికిసలాడింది. తర్వాత జేబు లోంచి ఒక బొంగరం తీసి నా చేతిలో పెట్టాడు: “నువ్వు బొంగరాలు అయితే చాలా చూసుంటావు గానీ ఇలాంటిదెప్పుడూ నీకు కనిపించి ఉండదు… పైన బటన్ నొక్కరా… నొక్కు… అర్రె, నొక్కమంటుంటే!”

వాడి ఉత్సాహం ఏంటో నాకేమీ అర్థం కాలేదు. నా ముఖంలో అయోమయాన్ని పట్టించుకోకుండా వాడు బొంగరం బటన్ నొక్కేశాడు. బొంగరం నా చేతిలోంచి ఎగిరి కింద రోడ్ మీద పడి తిరగడం మొదలెట్టింది. నా స్నేహితుడు సంతోషం ఆపుకోలేక గంతులు వేయడం మొదలుపెట్టాడు. “దేఖ్, అబ్బాస్, దేఖ్! అరే, దీని డాన్స్ చూడ్రా.”

నేను తిరుగుతున్న బొంగరాన్ని చూశాను. అది అచ్చం నా బుర్ర తిరుగుతున్నట్టే తిరుగుతోంది. వీడి గంతులు చూసి మా చుట్టుపక్కల చాలామంది జనం గుమిగూడారు. బహుశా, మేము మందూమాకూ అమ్ముకునేవాళ్ళమని వాళ్ళు అనుకొని ఉండచ్చు.

“ఇక బొంగరాన్ని తీసుకొని పద… మనచుట్టూ తమాషా చూడ్డానికి జనం పోగవుతున్నారు.” బహుశా, నా గొంతు కాస్త కరుకుగా ఉందేమో, వాడి సంతోషమంతా అణగారిపోయింది. వాడి ముఖం మాడిపోయింది. చంటిపిల్లవాడు ఏడుపు అందుకోబోయే ముందు పెట్టే లాంటి మొహంతో నావైపు చూస్తూ అన్నాడు: “నేనేం చేయగూడని పని చేయలేదే? నన్నెందుకూ తిట్టడం?”

వాడు బొంగరాన్ని అక్కడే రోడ్ మీద వదిలేసి నాతోపాటు వచ్చేశాడు.

ఇంటి దగ్గరికి వచ్చేదాకా వాడూ నేనూ ఏమీ మాట్లాడుకోలేదు. గల్లీ మలుపు తిరుగుతున్నప్పుడు నేను వాడివైపు చూశాను. ఆ కాసేపటిలో వాడిలో పెద్ద మార్పే కనిపించింది. వాణ్ణి చూస్తే ఏదో దీర్ఘాలోచనలో మునిగివున్న ముసలివాడిలా కనిపించాడు.

నేను అడిగాను: “ఏం ఆలోచిస్తున్నావురా?”

బదులిచ్చాడు: “ఖుదా మనిషిలా బతకాల్సి వస్తే ఎలా ఉంటుందా అని.”

చూశారా, ఇదీ వాడి తత్వం. వాడు ఇలాంటి అర్థంపర్థం లేని వాటి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. కొందరు వాడు కావాలనే, తనను తాను ప్రత్యేకం అనిపించుకోడానికి ఇలాంటి ఆలోచనలు పంచుకుంటాడని అనుకుంటారు, కానీ అది తప్పు. మామూలుగానే వాడి ఆలోచనలు ఇలాంటి విషయాల గురించే ఉంటాయి, ఇంకెవరికి తట్టని ఆలోచనలవి.

చెప్తే మీరు నమ్మరుగానీ, ఇది మాత్రం నిజం. వాడికి దెబ్బలంటే ఇష్టం. దెబ్బలు తగిలినప్పుడల్లా మహా ఆనందంగా ఉండేవాడు. నాతో ఎప్పుడూ అనేవాడు: “నాకు ఎప్పటికీ తగ్గకుండా సలుపుతూనే ఉండే దెబ్బ తగిలితే ఎంత బాగుణ్ణు… నాకు నొప్పిలో భలే మజా వస్తుంది.”

నాకు బాగా గుర్తు. స్కూలులో ఒకరోజు వాడు నా ముందే మంగలికత్తి లాంటిదానితో చెయ్యి మీద కోసుకున్నాడు, కొద్ది రోజులు చేయి నొప్పిగా ఉంటుందని. టీకాలు కూడా అంతే. అందరిలాగా ప్లేగు, మలేరియా లాంటి రోగాలనుండి కాపాడుకోవడం కోసం వేయించుకునేవాడు కాదు. అది వేయించుకుంటే జ్వరం వస్తుందని వేయించుకునేవాడు.

వాడికి తన ఒళ్ళు జ్వరంతో రెండు మూడు రోజులు కాలిపోవాలని ఎప్పుడూ కోరికగా ఉండేది. జ్వరాన్ని దావత్‌కు పిలిచినట్టు పిలుస్తుండేవాడు. అది రాబోతుంటే నాతో అనేవాడు: “మా ఇంటికి ఒక గెస్టు రాబోతున్నాడు. అందుకని నాకో రెండు మూడు రోజులు ఖాళీ దొరకదు.”

ఒకరోజు నేనడిగాను: “నువ్వు ఊరికూరికే ఈ టీకాలు ఎందుకురా వేయించుకుంటావ్?”

వాడు చెప్పింది: “అరే అబ్బాస్, టీకా వేయించుకున్నాక వచ్చే జ్వరంతో ఒళ్ళు ఎంత తీపుగా ఉంటుందో తెలుసా. నేను నీకు మాటల్లో చెప్పలేన్రా. కీళ్ళల్లో నొప్పి పుడుతుంటుంది. ఏ కాలుకాకాలు ఏ చేయికాచేయి విడిపోతున్నట్టుంటుంది. అప్పుడెలా ఉంటుందంటే నువ్వు ఎవడో మొండివాడికి అర్థమయేలా నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టుంటుంది. ఇంకా తెలుసా, జ్వరం ఎక్కువయ్యాక పలవరింతలొస్తాయి. ఒళ్ళు సలపరిస్తుంది. అప్పుడు వచ్చే కలలు, వల్లాహ్, ఎంత తలాతోకా లేకుండా ఉంటాయంటే… అచ్చం మన జీవితాల్లాగా… ఒక క్షణం నువ్వు చాలా అందమైన అమ్మాయిని పెళ్ళాడబోతున్నట్టు కలగంటుంటావ్… ఆ అమ్మాయిని వాటేసుకోగానే నీ చేతుల్లో తను ఒక పహిల్వానుగా మారిపోతుంది.”

వింతగా, విడ్డూరంగా అనిపించే వీడి మాటలకి నేను అలవాటు పడిపోయాను. అయినా కూడా వాడు నాకు కొత్తగా కనిపిస్తూనే ఉంటాడు. ఒకరోజు వీడి మానసిక ఆరోగ్యంపైనే నాకు అనుమానం వచ్చింది. ఏమయిందంటే, నేను బాగా గౌరవించే ఒక పెద్దమనిషిని వాడికి పరిచయం చేశాను.

డాక్టర్ షాకీర్ మహా ఉత్సాహంగా వీడితో చేయి కలుపుతూ అన్నాడు: “మిమ్మల్ని కల్సినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.”

“అయినా కూడా, నాకు మిమ్మల్ని కలిస్తే ఏమీ సంతోషం కలుగలేదు.” అన్నాడు వీడు.

నాకు చాలా సిగ్గేసింది. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉండుంటుందో మీరే ఆలోచించండి. ఆ పెద్దమనిషి ముందు నేను సిగ్గుతో కుంచించుకు పోతుంటే, వీడేమో తీరిగ్గా సిగరెట్టు దమ్ము లాగుతూ హాల్ నుండి బయటకు వెళ్ళిపోయాడు.

డాక్టర్ షాకీర్ అతడి మాటలకు నొచ్చుకొని, తీవ్రంగా అన్నాడు: “మీ దోస్తు బుర్ర పనిచేస్తున్నట్టులేదు!”

వాడి తరఫున నేను క్షమాపణలు చెప్పుకొని ఆ సంగతిని అక్కడితో మర్చిపోయేలా చేశాను. నాకు నిజంగానే సిగ్గనిపించింది, డాక్టర్ షాకీర్ నావల్ల మాటపడాల్సి వచ్చినందుకు.

ఆ సాయంత్రమే వాణ్ణి కలవడానికి వెళ్ళాను. ఛడామడా తిట్టేసి లోపలి కోపాన్నంతా తీర్చుకోవడానికి.

వాడు నాకు లైబ్రరీ బయట దొరికాడు. దొరగ్గానే అన్నాను: “ఏరా, మంచీ మర్యాదా అన్నీ వదిలేసినట్టున్నావు. డాక్టర్ షాకీర్‌తో అలాగేనారా మాట్లాడేది. ఆయన్నెందుకు అలా ఇన్సల్ట్ చేశావ్?”

వాడు నవ్వేసి: “అర్రే… ఆ మాట వదిలేయ్ ఇంక… ఏదైనా పనికొచ్చేదాని గురించి మాట్లాడుకుందాం రా!”

నేను వాడి మీద ఇంకా అరిచాను. మౌనంగా తిట్టినంతసేపూ పడి, ఆ పైన అన్నాడు: “నన్ను కలిసినందుకు ఎవరికైనా సంతోషం కలిగితే, వాళ్ళని కలిసినందుకు నాకు కూడా సంతోషం కలగాలన్న నియమమేమీ లేదు. పైగా నేను మొదటిసారి కల్సి, చేయి కలిపినందుకే అతడి మనసులో సంతోషం కలగటమేమిటో నాకు తెలీలేదు. మీ డాక్టరుగారు ఆ రోజు కనీసం పాతిక మందిని కలిసి ఉంటారు. అందరితో ఇదే అని వుంటారు: ‘మిమ్మల్ని కల్సినందుకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని కల్సినందుకు చాలా సంతోషంగా ఉంది…’ కలిసిన ప్రతి మనిషీ ఇలా సంతోషమే కలిగిస్తార్రా? నువ్వు ఈ ఉట్టి మాటలు పక్కకు పెట్టు. పద, లోపలికి పోదాం.”

నా నోటిమాట పడిపోయింది. ఏదో మంత్రం వేయబడిన మనిషిలా వాడితోపాటు లైబ్రరీ లోపలకి వెళ్ళగానే, నా కోపాన్నంతా మర్చిపోయాను. వాడన్నది కూడా నిజమే కదా అనిపించింది. వాడు నా స్నేహితుడే అయినా, వెంటనే మనసులో వాడి మీద కొంత అసూయలాంటిది కలిగింది… ఈ మనిషికి ఇంత ధైర్యం ఎక్కడి నుండి వస్తుంది, తను అనుకున్నది అనుకున్నట్టు అనేయడానికి!

మొన్నామధ్య మా ఆఫీసరు నాన్నమ్మ చనిపోయింది. నేను సంతాపం వ్యక్తం చేస్తున్నట్టు ఆయన ముందు నటించాల్సి వచ్చింది. ఆమె పోయినందుకు నాకేమీ బాధ లేకపోయినా ఆయనతో ఓ పది పదిహేను నిమిషాలు విచారంగా మాట్లాడాల్సి వచ్చింది. వాళ్ళ నాన్నమ్మ అంటే నాకేమీ ఇష్టమూ లేదు, ఆమె చనిపోవడం వల్ల నాకేమీ కష్టమూ కలగలేదు. అయినా కూడా నేను అలా వేషం వేసుకొని నటించాల్సి వచ్చింది. దీని అర్థం ఒకటే. నా దోస్తు కారక్టర్ కన్నా నాది చాలా బలహీనమని. ఈ ఆలోచనే నాలో మంటలు రేపింది. ఆ ఈర్ష్య నా బుర్రలో ఒక దారుణమైన, చాలా నీచమైన ఆలోచనని పుట్టించింది. కాని, అదీ ఒక్క క్షణంలో–గాలి ఏదో కాస్త అలా వచ్చి ఇలా పోయినట్టు–వచ్చింది వచ్చినట్టుగానే మాయమైపోయింది. కాని అలాంటి ఆలోచన వచ్చినందుకే ఆ తర్వాత నన్ను తలుచుకుని నాకే సిగ్గనిపించింది.

నాకు వాడంటే వల్లమాలిన ప్రేమ. కానీ ఈ ప్రేమలో అనుకోకుండా అప్పుడప్పుడూ ద్వేషం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఒకరోజు నేను వాణ్ణి ముక్కుసూటిగా అడిగాను: “ఎందుకనిరా నిన్ను కొన్నిసార్లు నేను ద్వేషిస్తూ ఉంటాను?” వాడు ఈ జవాబు ఇచ్చి నన్ను సమాధానపరిచాడు: “నీ మనసు, నా మీద ప్రేమతో నిండిపోయి, ఒకటే వస్తువుని మళ్ళీ మళ్ళీ చూస్తుండడం వల్ల విసుగు పుట్టి ఇంకో వస్తువు కోసం వెతుక్కుంటుంది… అయినా నువ్వు అప్పుడప్పుడూ నన్ను ద్వేషించకపోతే ఎప్పుడూ నన్నెలా ప్రేమించగలవు? మనిషి అనేక రకాల అయోమయాల పుట్ట!”

వాడూ, నేనూ దేశానికి దూరంగా ఉన్నాం. నాకు ఏరోజు చూసినా ఒక శ్మశానంలో ఉన్నట్టుండేది ఆ మహానగరంలో. కానీ వాడికి మాత్రం మేం పుట్టి పెరిగిన ఊరు కానీ, ఆ గల్లీలు కానీ, ఆ చిన్నతనపు రోజులు కానీ ఏవీ గుర్తొచ్చేవి కావు. వాణ్ణి చూస్తుంటే వాడు పుట్టింది ఇక్కడే, ఈ నగరం లోనే అనిపించేది. నా మొహం చూస్తూనే నేను ఈ ఊరివాడిని కానని ఎవ్వరైనా ఇట్టే చెప్పేయగలరు. ఆ పరాయితనం వాడిలో ఎప్పుడూ కనపడేది కాదు. వాడెప్పుడూ అనేవాడు: “దేశాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం చాలా పెద్ద బలహీనత… ఒక స్థలానికి మనల్ని మనం అతికించుకున్నట్టు. బయళ్ళలో పడి తిరిగే ఆబోతును ఒక పాకలో కట్టేసినట్టు.”

ఇలాంటి వింత ఆలోచనల మహారాజు, ప్రతీ విషయాన్ని వంకర కళ్ళద్దాలతో చూస్తూ, ఉన్న రివాజులకి వ్యతిరేకంగా వెళ్తుండే మా కిస్మ్ ఖయాలాత్ కీ మాలిక్‌గారి పెళ్ళి సంప్రదాయబద్ధంగా, అన్ని ఆచారాలతో జరిగిందంటే మీరు ఆశ్చర్యపోరా? ఖచ్చితంగా, మీరు ఆశ్చర్యపోతారని తెల్సు.

ఒకరోజు సాయంత్రం వాడు నా దగ్గరకు వచ్చాడు. వచ్చి, చాలా గంభీరంగా తన పెళ్ళి కబురు చెప్పాడు. నమ్మండి, నమ్మకపోండి… నా ఆశ్చర్యానికి హద్దులు లేవు. కారణం, వాడు పెళ్ళి చేసుకోబోతున్నందుకు కాదు. కానే కాదు. నాకెందుకు ఆశ్చర్యం వేసిందంటే వీడు కనీసం అమ్మాయిని చూడను కూడా చూడకుండా, పాత పద్ధతుల ప్రకారం నికాహ్ ఆచారాలు పాటించేందుకు ఎలా సిద్ధపడ్డాడా అని. మేమెప్పుడూ ఆ మౌల్వీలను, అమ్మాయి అబ్బాయిలని భార్యాభర్తలనే బంధంలో బంధించేవాళ్ళని, మజాక్ చేసేవాళ్ళం. అలాంటివారిని చూసి వీడెప్పుడూ అనేమాట: “వీళ్ళను చూస్తే నాకు వయసైపోయి, జవచచ్చిన ముసలి పహిల్వాన్లు గుర్తొస్తారు. చిన్న పిల్లలను బరిలోకి దింపి వాళ్ళు కొట్టుకుంటుంటే చూసి తమ సరదాలు తీర్చుకుంటారే, ఈ మౌల్వీలూ అలానే.”

పెళ్ళిళ్ళకూ నికాహ్‌లకూ వచ్చే అతిథులన్నా, మర్యాదలన్నా కూడా మావాడికి లెక్కలేదు. అయినా… అయినా అతడి నికాహ్‌ చదివించింది, నా కళ్ళముందే, ఆ మౌల్వీయే! వీడెప్పుడూ ముసలి చిలక అని ఏడిపించే మౌల్వీయే. అతడి నికాహ్‌ చదివి, అందరూ ఆశీర్వదించారు. నేను మొత్తం తతంగాన్నంతా చూస్తూ ఉన్నాను, ఏదో కలగంటున్నట్టు.

నికాహ్‌ అయిపోయింది. వేరే మాటల్లో చెప్పుకోవాలంటే ఊహించనిదే జరిగింది. నాకు ముందు కలిగిన ఆశ్చర్యం తర్వాత కూడా ఉండిపోయింది. కానీ దాని ప్రస్తావన వాడి దగ్గర మాత్రం తీసుకురాలేదు, ఇబ్బంది పడతాడేమోనని. ఎలాగైతేనేం, వీడు కూడా అందరిలానే ఒక దారిలో పడ్డాడు కదా అని మనసులో నేను సంతోషపడ్డాను.

నికాహ్‌ అయ్యాక, మా అయ్యగారు కూడా తన వంకరటింకర మాటల మినారు మీదనుండి జారిపడి తానెప్పుడూ అసహ్యించుకునే ఈ గలీజ్‌లోనే, మా అందరి లానే తలమునకలయ్యేట్టు పడ్డాడు కదా. వాణ్ణి ఒకసారి కలిసి, ‘ఏరా, ఎలా ఉంది జీవితం?’ అని వాడిని అడిగి పొట్టపగిలేలా నవ్వాలని నాకు సరదా పుట్టింది.

నాకీ ఆలోచన వచ్చిన రోజే మధ్యాహ్నం పూట వాడు మా ఇంటికొచ్చాడు.

నికాహ్‌ అయ్యి మూడు నెలలు కావొస్తుంది. అప్పటినుండి వాడు కాస్త ముభావంగా ఉంటున్నాడు. కాని, ఈ రోజు వాడి మొహం మునుపటి లాగానే కళకళలాడుతోంది. కొన్ని రోజుల కిందట ఒరలో దాక్కున్న కత్తిలా కనిపించిన ముక్కు, ఇప్పుడు స్పష్టంగా కనిపించింది.

వాడు నా గదిలోకి వచ్చి, సిగరెట్టు వెలిగించి, నా దగ్గర కూర్చున్నాడు. వాడి పెదాల అంచులు బిగుసుకునున్నాయి. వాడేదో పెద్ద కబురే పట్టుకొచ్చినట్టు స్పష్టంగా తెలుస్తుంది. నేను ఒళ్ళంతా చెవులు చేసుకొన్నాను. నోటిని సున్నాలా చుట్టి సిగరెట్ పొగతో ఒక రింగ్ వదిలాడు. దానిలోకి వేలు పెట్టి దాన్ని చెదరగొడుతూ, చెప్పాడు: “అబ్బాస్, నేను ఇక్కణ్ణుంచి రేపు వెళ్ళిపోతున్నాను.”

“వెళ్ళిపోతున్నావా?” నాకు మళ్ళీ బుర్ర తిరిగిపోయింది.

“అవును. రేపు వెళ్ళిపోతున్నాను. శాశ్వతంగా… నీక్కూడా చెప్పద్దనుకున్నాను. ఇప్పుడు కూడా నీకు చెప్పడానికి రాలేదు. కానీ నాకు కాస్త డబ్బు కావాలి. నేను నీకు అప్పుగా ఇచ్చినవి గుర్తున్నాయా? ఉన్నాయా నీదగ్గర?”

నేను బదులిచ్చాను: “ఆఁ… అన్నీ గుర్తున్నాయి. అది సరే కానీ నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నావురా? అది కూడా శాశ్వతంగా!”

“విషయమేమిటంటే నేను నా భార్యతో ప్రేమలో పడ్డాను. రేపు రాత్రి ఆమెను లేపుకొని పోతున్నాను. ఆమె కూడా అందుకు తయారుగా ఉంది.”

వాడి మాటలు విని నాకు ఎంత ఆశ్చర్యమేసిందంటే పిచ్చివాడిలా చాలా సేపటి వరకూ నవ్వుతూనే ఉన్నాను. వీడు తాను పెళ్ళాడిన భార్యను, ఎప్పుడంటే అప్పుడు ఆమె చేయి పట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళగలిగే భార్యను, ఎవరికీ చెప్పకుండా లేపుకెళ్ళిపోతాడట! ఎలాగంటే… ఎలాగంటే… నేనేం చెప్పను? ఆ సమయంలో ఏం అనిపించిందంటే… అప్పుడు నేనసలు ఆలోచించే పరిస్థితిలో లేను. నవ్వుతూనే ఉన్నాను.

నేను నవ్వడం చూసి వాడు నన్ను నిందిస్తున్నట్టుగా నావైపు చూశాడు: “నేను ఏం చెప్పానో, అది నిజమే. రేపు రాత్రి ఆమె ఇంటి పక్కనున్న తోటలో నాకోసం ఎదురు చూస్తుంటుంది. నాకు ప్రయాణానికి కొంత డబ్బు కావాలి. నీకేం తెల్సు, నేను ఎన్నెన్ని తంటాలు పడి ఒప్పిస్తే ఆమె దీనికి ఒప్పుకుందో!”

నాకు మళ్ళీ నవ్వాలనిపించింది గానీ, వాడి గంభీరమైన మొఖం చూసి నా నవ్వు ఆగిపోయింది. వాడు నిజంగానే, పదిమందిలో నికాహ్‌ చేసుకున్న తన భార్యనే లేవదీసుకొని పోతున్నాడని నమ్మకం కూడా కలిగింది. ఎక్కడికి? అది మాత్రం తెలియలేదు.

నేను ఇంక వివరాల్లోకి వెళ్ళకుండా వాడి నుండి ఎప్పుడో అప్పుగా తీసుకున్న డబ్బులన్నీ తిరిగి ఇచ్చేశాను. వెనక్కిచ్చినా వాడు ఎలానూ తీసుకోడని తెలిసే ఇన్నాళ్ళూ ఇవ్వలేదు. చేతికిచ్చిన డబ్బు తీసుకుని మౌనంగా నోట్లన్నీ లెక్క పెట్టుకొని జేబులో పెట్టుకున్నాడు.

వాడు చేయి కలపకుండానే వెళ్ళిపోబోయాడు. నేనే ముందుకెళ్ళి వాడితో అన్నాను: “నువ్వు వెళ్తున్నావు సరే… నన్ను మర్చిపోకు.” నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

వాడి కళ్ళు పొడిగా ఉన్నాయి.

“ప్రయత్నిస్తాను.” అనేసి వెళ్ళిపోయాడు. నేను ఎక్కడ నుంచున్నానో, అక్కడే బొమ్మలా నిలబడిపోయాను.

మరుసటి రోజు, వాళ్ళమ్మాయి రాత్రికి రాత్రి మాయమైపోయిందని తెలుసుకున్నాక, వాడి అత్తవారింట్లో పెద్ద గొడవ మొదలైంది. ఒక వారం వరకూ ఆమె కోసం అక్కడా ఇక్కడా వెతికారు. ఎవరికీ ఈ సంగతి గురించి తెలియనివ్వలేదు. కానీ తర్వాత, అమ్మాయి వాళ్ళ అన్నయ్య నా దగ్గరకి వచ్చాడు. అతడికి తోడుదొంగనైనట్టు మొత్తం కథ చెప్పుకు రావాల్సి వచ్చింది.

పాపం, వాళ్ళేమో వాళ్ళమ్మాయి ఇంకెవరితోనో వెళ్ళిపోయిందననుకుంటూ లజ్జతో కుమిలిపోతున్నారు. వాళ్ళ అన్నయ్య సిగ్గుతో కుంచించుకుపోతూ వాళ్ళ తరఫున ఈ విషయాన్ని నా స్నేహితుడికి చెప్పమని నన్ను అడగడానికి వచ్చాడు.

నేను అసలు సంగతి చెప్పేసరికి ఆశ్చర్యంతో అతడి కళ్ళు తెరుచుకున్నవి తెరుచుకున్నట్టే ఉండిపోయాయి. అతనికి తన చెల్లెలు వేరెవరితోనో కాదు, తన భర్తతోనే వెళ్ళిపోయినందుకు కొంత ఊరట కలిగింది. కానీ ఇలాంటి అవసరంలేని గడబిడ వ్యవహారం ఎందుకో అతడికి అర్థం కాలేదు.

“అతడి భార్యే కదా… ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వెళ్ళుండచ్చు… ఇది ఎలా ఉందంటే… అంటే… అంటే…” అతడు ఏ ఉదాహరణ ఇవ్వలేకపోయాడు. నేను కూడా అతన్ని సమాధానపరచగలిగే ఉదాహరణ ఇవ్వలేకపోయాను.

నిన్న పొద్దున్న అనుకోకుండా వాడినుంచి ఉత్తరం వస్తే, వణుకుతున్న చేతులతో తెరిచాను. కవరులో ఒక తెల్ల కాగితం మాత్రమే ఉంది, దాని మీద ఒక వంకర గీత గీసి ఉంది.


రచయిత పూర్ణిమ తమ్మిరెడ్డి గురించి: పుస్తకం.నెట్ నిర్వాహకుల్లో ఒకరైన పూర్ణిమ వృత్తి రీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీరు. ...