పుస్తకాల గుళ్ళో ధ్వజస్థంభం ‘నవోదయ’

[‘నవోదయ’ రామమోహనరావుగా చిరపరిచితులైన అట్లూరి రామమోహనరావుగారిది పుస్తక ప్రపంచంలో ఆరు దశాబ్దాల ముద్ర. అట్లూరి 1-8-1934న, కృష్ణాజిల్లా ఉంగుటూరులో జననం. భార్య ఝాన్సీలక్ష్మి. వీరికి ఇద్దరుసంతానం, కుమార్తె శోభ, కుమారుడు సుధాకర్. 400కు పైగా పుస్తకాలు ప్రచురించిన ‘నవోదయ’ సంస్థ అధినేత ఆయన. విజయవాడ గవర్నర్ పేట ఏలూరు రోడ్డులో ప్రసిద్ది చెందిన ఈ నవోదయ పుస్తక విక్రయ రంగంలోంచి తనను తాను ఉపసంహరించుకుంది. ఎనిమిది పదుల వయసులో, పుస్తక ప్రచురణకర్తగా షష్టిపూర్తిచేసుకున్న రామమోహనరావుగారిలో ఇంకా పుస్తక ప్రచురణా జిజ్ఞాస రగులుతూనే ఉంది. ప్రముఖ రచయిత డా. జి.వి. పూర్ణచందు ఆయన్ను పలకరించినప్పుడు తన ఆత్మకథను వివరించారు. నవోదయ ప్రచురణ సంస్థ కొనసాగుతుందన్నారు. అనేక మంది రచయిత్రుల పుస్తకాలు కుప్పగా ఉన్నవి చూపించి ఇవన్నీ పునర్ముద్రించాలని ఉందన్నారు.]


పనులెన్నికలిగియున్నను
దినదినమునవిద్యపెంపుధీయుక్తుడవై
వినగొనుముసత్కథలను
కవివిబుధులుసంతసించుగతినికుమారా!

కుమార శతకం లోని ఈ పద్యం అక్షరాలా నాకు వర్తిస్తుంది. నేను ఎంచుకున్న వ్యాపారం అక్షరానికి సంబంధించింది. మహాకవులు, మేధావులు, సమాజానికి దారి దీపాలనదగిన వారి గొప్ప రచనలను సమాజానికి అందచేయటం నా వృత్తి. అనుక్షణం చదువుకున్నవారితోనే గడపవలసి ఉంటుంది. ప్రతీ రచయిత, ప్రతీ పాఠకుడు నాకు పాఠాలు నేర్పారు. ఈ లోకాన్ని చదవటానికి నా వృత్తి నాకు ఎంతగానో తోడ్పడింది. నేను చదువుకోగలిగింది ఆనాడు పదోతరగతి మాత్రమే! కానీ, ప్రతిరోజూ చదువుని పెంచే పనులే చేశాను. పెద్దలు చెప్పిన సత్కథలే విన్నాను. వాటిని లోకానికి అందించాను. నా వలన కవులు సంతోషించారు. విబుధులైన పాఠకులు సంతోషించారు. నాకదే తృప్తి.


కృష్ణాజిల్లా గన్నవరం తాలూకా ఉంగుటూరు నా స్వగ్రామం. కమ్యూనిస్టు నేపథ్యం ఉన్న పేద రైతు కుటుంబం మాది. అమ్మానాన్న అభ్యుదయ భావాలు పుణికి పుచ్చుకున్నవాళ్ళు! రెండో అక్కకు వర్ణాంతర వివాహం చేశారు. సంస్కరణవాదం మాకొక నినాదం, విధానం అన్నట్టుండేది. అప్పటికి నేను చాలా చిన్నకుర్రవాణ్ణి. కానీ, లోకజ్ఞానం ఉంది.

మా చిన్నక్కని కృష్ణాజిల్లా గుడివాడ దగ్గర జొన్నపాడుకు చెందిన రాఘవరెడ్డిగారికిచ్చి వర్ణాంతర వివాహం చేశారు. ఆయన రాఘవరావుగానే ప్రసిద్ధులు. కమ్యూనిస్టు పార్టీకి హోల్‌టైమర్లుగా పనిచేసేవారు.

నాన్నగారి వ్యవసాయం అంతంతమాత్రం. ఉన్న కొద్దిపాటి పొలాలూ అమ్ముకుని వెంకట రాఘవాపురం అనే గ్రామానికి కుటుంబం తరలి వెళ్ళిపోయింది. నా చదువు చట్టుబండలయ్యింది. చిన్నబావగారే తన దగ్గర పెట్టుకుని హైస్కూల్లో చేర్పించారు. కథ అలా సాగుతుండగా పులిమీద పుట్రలా కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం వచ్చింది. పార్టీ హోల్‌టైమర్లుగా ఉన్న మా అక్కాబావ కూడా అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయారు. అఘాయిత్యం భయంతో నన్నూ అజ్ఞాతంలోకి తీసుకెళ్ళారు.

పార్టీ మీద నిషేధం తొలిగాక వెలుతురులోకి వచ్చాం. చిన్నబావ రాఘవరావుగారిని కైకలూరు ఆర్గనైజరుగా ఉండాలని పార్టీ ఆదేశించింది. వాళ్ళతోపాటు నేనుకూడా కైకలూరు వెళ్ళాను. అక్కడ హైస్కూల్లో పదవ తరగతి చదివాను. నా చదువంతే! పై చదువులు నేర్పించే స్తోమత మా వాళ్ళకు లేదు. చివరికి పార్టీ అనుబంధ సంస్థ అయిన విశాలాంధ్ర పబ్లికేషన్స్‌లో గుమాస్తాగా చేరాను. అలా మొదలైంది ప్రచురణరంగంలో నా ప్రస్థానం.


నేను మనసా వాచా కర్మణా నాస్తికుణ్ణి. అభ్యుదయవాదిని. కమ్యూనిస్టు పార్టీ పరంగా ఆదర్శ వివాహం చేసుకున్నాను. అట్లూరి పూర్ణ చలపతిరావుగారి పౌరోహిత్యంతో పెళ్ళి జరిగింది. కట్నకానుకలేమీ లేవు. చెరొక 75 రూపాయలిస్తే ఆ డబ్బుతో మేమిద్దరం కొత్త బట్టలు కొనుక్కున్నాం. మా పిల్లలిద్దరికీ రిజిస్టర్ పెళ్ళిళ్ళే చేశాను. అభ్యుదయ వాదం నా జీవితంలోనే కాదు నా ప్రచురణల్లో కూడా ప్రతిఫలించాలని ఆకాంక్ష. ఆ రోజుల్లో అలాంటివి చేయగలిగాను గానీ, ఈ రోజుల్లో అలా చేయగలనా?


ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టులు పరాజయం చెందారు. హోల్‌టైమర్‌గా ఉన్న మా బావ రాఘవరావుగారు నిరుద్యోగి అయ్యారు. ఉపాధికోసం 1957లో గుడివాడలో ‘నవోదయ ప్రచురణ సంస్థ’ స్థాపించి, యేడాది తర్వాత బెజవాడ తరలించారు. టర్జనీవ్ భగ్నహృదయం, మకరెంకో విజయ ధ్వజం, కారల్ మార్క్స్ జీవిత సంగ్రహం, ఆధునిక వ్యవసాయ పద్ధతులు మొదలైన సోవియట్ అనువాద రచనలు ప్రచురించారు. వాటితో కుటుంబ పోషణ అసాధ్యమైంది. ఆదిలాబాద్ జిల్లాలో కాంటాక్టులు దొరకటంతో ‘నవోదయ’ను నా చేతుల్లో పెట్టి ఆయన ప్రచురణరంగ నిష్క్రమణ చేశారు.

ఆ రోజునుండి నేను ప్రచురణకర్తగా మారాను. అప్పటిదాకా విశాలాంధ్ర పబ్లికేషన్సులో నేను చేసిన పని వేరు. ఇప్పుడు ప్రచురణకర్తగా నా బాధ్యతలు వేరు. పాఠకుల అవసరాలకు తగ్గ పుస్తకాలు ప్రచురించి, నవోదయ ఒక ప్రత్యేకత కలిగిన సంస్థ కావాలనేది నా సంకల్పం. మనోబలం ఒక్కటే నాకు తోడు.


నవోదయ నా చేతుల్లోకి రాగానే గొల్లపూడి మారుతీరావుగారి చీకట్లో చీలికలు ప్రచురించాను. అప్పట్లో అదొక పెద్ద నవల. బాపూ రమణలు ప్రసిద్ధిలోకి వస్తున్నకాలం. నాకు బాపూగారితో ముఖచిత్రాలు గీయించాలని ఉండేది. ప్రఖ్యా శ్రీరామమూర్తిగారు ‘అదెంతపని, నేను చేస్తాలే’ అన్నారు. నేను ఓ పుస్తకాన్నీ, ఒక బ్లాంకు చెక్కునీ ఇచ్చి పంపాను. బాపూగారే చెక్కు మీద యాభై రూపాయలు రాసుకుని, ఆ పుస్తకానికి ముఖచిత్రం గీసిచ్చారు. ఆ తరువాత నాకు తెలిసింది, శ్రీరామమూర్తిగారికి అప్పటివరకూ బాపూగారితో అసలు పరిచయమే లేదని! మిత్రధర్మం కోసం, నానాకష్టాలు పడి, ఖర్చుపెట్టుకుని, మద్రాసు వెళ్ళి బాపూగారిని కలిసి బొమ్మవేయించి చాలా శ్రమించారు. అలా మిత్రుల ప్రోత్సాహం నాకు కొండంత అండ అయ్యింది.


బాపూ రమణలు అప్పటికే జనతా ఎక్స్‌ప్రెస్, ఇద్దరమ్మాయిలు ముగ్గురబ్బాయిలూ స్వంతంగా ప్రచురించి చేతులు కాల్చుకున్నారు. ‘రమణగారి పుస్తకాలు మీరు వెయ్యొచ్చుకదా?’ అని బాపూగారంటే, ఆనందంగా ఋణానందలహరి రెండో ముద్రణతో పాటు, గిరీశం లెక్చర్లు, విక్రమార్క సింహాసనం, రాజకీయ బేతాళ పంచవింశతి ఇలా రమణగారి రచనలన్నీ వరుసగా వేశాను. మనక్కూడా ఒక లోగో వుంటే బావుంటుందని అనగానే బాపుగారు 4 లోగోలు వేసిచ్చారు. దీన్ని ఎంచుకున్నాం. ఆరుద్ర కూనలమ్మ పదాలు, వెన్నెల వేసవి, ఇంటింటి పజ్యాలు ప్రచురించాం. రాముడికి సీత ఏమౌతుంది? పుస్తకాన్ని నవభారత్ ప్రకాశరావుగారు వేయలేనని ఇచ్చేస్తే నేను ప్రచురించాను. ఇలాంటి పుస్తకాలు ప్రచురించటంలో ఇతరులకు ఎదురైన సమస్య నాకు ఎదురు కాదని కాదు. ‘పుస్తకన్యాయం’ అనే సూత్రానికే కట్టుబడ్డాను. ప్రముఖ సాహితీవేత్త గోపీచంద్ మరణించినప్పుడు ఆయన బొమ్మతో ఒక క్యాలెండర్ ప్రచురించాను. బహుశా ఒక ఆధునిక రచయిత ముఖచిత్రంతో క్యాలెండర్ రావటం తెలుగులో అదే ప్రథమం అనుకుంటాను.

సీతజోస్యం, జాబాలి, మూడు దశాబ్దాలు, ఇలా నార్లవారి పుస్తకాలు చాలానే వేశాను. కొడవటిగంటిగారి ఆరు రచనలు ప్రచురించాను. నండూరి రామమోహనరావుగారి మార్క్స్‌ట్వైన్ అనువాదాల్ని ఆంధ్రపత్రికవారు ‘ఆంధ్ర చందమామ ప్రచురణ’ల ద్వారా వెలువరించారు. రెండో ముద్రణకి కాపీరైట్ భయంతో ఎవరూ ముందుకు రాలేదు. నేను ధైర్యం చేశాను. నరావతారం, విశ్వరూపం ఇంకా ఇతర రచనలు కూడా ప్రచురించాను. సత్యం శంకరమంచి అమరావతి కథలు నవోదయ సంస్థకు మంచిపేరు తెచ్చిపెట్టిన రచన. ఒక రోజు శ్రీశ్రీ వచ్చి ‘నా పుస్తకం కూడా వెయ్యొచ్చు కదా…’ అన్నారు. మహాభాగ్యం అని, ప్రాసక్రీడలు ప్రచురించాను.

కె.వి. రమణారెడ్డిగారి సూచన మీద జరుక్ శాస్త్రి పేరడీలు, శరత్ పూర్ణిమ, నాలో నేను ప్రచురించాను. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, శ్రీరమణ, ఇంకా ఎందరో సాహితీమూర్తుల రచనలు నవోదయ ప్రచురణలయ్యాయి. గోపీచంద్ రచన పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా ప్రచురించటం నవోదయకు ఒక కొత్త వెలుగు వచ్చినట్టయ్యింది. అది సాహిత్య అకాడెమీ బహుమతి పొందింది. బాపూగారి కార్టూన్లు శ్రీరమణ ముందుమాటతో ప్రచురించటం నవోదయ అదృష్టంగా భావిస్తాను.

రచయిత శిష్టా మరణానంతరం వారి కుటుంబం కటిక దారిద్ర్యంలో ఉందని రమణారెడ్డిగారు చెప్పారు. ఆయన సూచన మీద శిష్టా రచనలకు కాపీరైట్ హక్కులు తీసుకున్నాను. ఈ విధంగా ఒక రచయిత పుస్తకాల మీద జీవిత హక్కులకు నేను వ్యతిరేకిని. శిష్టా పుస్తకాల విషయంలోనే అలా చేయాల్సొచ్చింది. మా రచయితలకు ప్రతి ముద్రణకూ పారితోషికం ఇచ్చేవాడిని.

ఆరుద్ర, శ్రీశ్రీల మధ్య వైరం వలన నారాయణబాబుని ఆరుద్ర భుజాన వేసుకున్నారు. శ్రీ యమ్. వి. యల్. ద్వారా నన్ను కలిస్తే, నేను రుధిరజ్యోతి అచ్చువేశాను. ఆ పుస్తకం మీద చాలా చర్చలు జరిగాయి.

క్లాసిక్స్ అంటే ప్రాచీన కావ్యాలేనంటారు. కానీ, ఆధునిక సాహిత్యంలో క్లాసిక్స్ అనదగిన రచనలనే నవోదయ అసంఖ్యాకంగా ప్రచురించింది. శూన్యం నుంచి బయల్దేరి అనన్య సామాన్యం అనేంత వరకూ నవోదయను తీసుకువెళ్ళగలిగాననే సంతృప్తి ఉన్నది. కానీ, ఆధునిక క్లాసిక్స్ అనదగిన గురజాడ కన్యాశుల్కం, రావిశాస్త్రి అల్పజీవి, గోపీచంద్ అసమర్థుని జీవయాత్ర, బుచ్చిబాబు చివరికి మిగిలేది రచనలు ప్రచురించాలని ప్రయత్నించాను. నెరవేరలేదు. అందులో నా అశ్రద్ధ కూడా కొంత ఉంది.

మిత్రుల ప్రోద్బలం మీద గుంటూరు, మద్రాసు బ్రాంచీలు తెరిచే దుస్సాహసం చేశాను. వాటి జోలికి వెళ్ళి ఉండకపోతే నా జీవితం మరోలా ఉండేది.


విజయవాడలో పుస్తక మహోత్సవం ఏర్పాటుకోసం శ్రమించటంలో ఒక ప్రచురణకర్తగా నా ధర్మాన్ని నెరవేర్చానని భావిస్తున్నాను. నేషనల్ బుక్ ట్రస్ట్‌వారు ఢిల్లీ, మద్రాస్‌లలో ఏర్పాటు చేసిన బుక్ ఫెస్టివల్స్ చూశాక ఇలాంటిది బెజవాడలో కూడా జరిపితే బావుంటుందని మరికొందరు మిత్రులతో ప్రస్తావించాను. ఆ సమయంలో వారి సలహామండలి సభ్యుడిగా నేను రెండేళ్ళపాటు ఉన్నాను. ఆ అవకాశం తీసుకుని వారితో సంప్రదించాను. వారితో కలిసి పనిచేసి, మెళకువలు ఆకళింపు చేసుకున్నాం. కలకత్తా బుక్ ఫేర్‌లో సత్యజిత్ రే నాయకత్వాన పుస్తక ప్రియుల పాదయాత్ర (వాక్ ఫర్ బుక్స్) జరిగింది. విజయవాడ 4వ పుస్తక మహోత్సవంలో అదే పద్ధతిలో నిర్వహించాం. నేటికీ జనవరి 4న అది జరుగుతూనే ఉంది.

మద్రాస్‌లో జరిపిన పుస్తక మహోత్సవంలో ఒక స్టాల్ అద్దెకు తీసుకుని మన ప్రచురణకర్తలందరి పుస్తకాలు అందులో ప్రదర్శనకు పెట్టాం. బొంబాయి పుస్తక ప్రదర్శనలో తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడెమీ, ప్రభుత్వ పాఠ్యపుస్తకాల సంస్థ లాంటి ప్రభుత్వ సంస్థలూ, వివిధ తెలుగు ప్రచురణకర్తలూ అందరూ కలిసి ఖర్చు సమానంగా పంచుకుని తెలుగు పెవిలియన్ పేరుతో గొప్ప ప్రదర్శన ఏర్పాటు చేశాం.

ఆంధ్రప్రదేశ్ ప్రచురణకర్తలు, పుస్తక విక్రేతల సంఘం ఏర్పడటంలో కూడా నా పాత్ర ముఖ్యమైంది. పుస్తకాల మీద కమీషనా? అని ఇందిరాగాంధీ ఎక్కడో అన్నమాట భుజాన వేసుకుని, కొనుగోళ్ళ మీద 12.5% మాత్రమే కమీషన్ తీసుకోవాలని ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చాం. 15 రోజులపాటు పుస్తకాల అమ్మకం ఆపేసి సమ్మె చేశాం. శ్రీ భాట్టం శ్రీరామమూర్తి విద్యామంత్రిగా ఉన్నారు. ఉమా సుబ్రహ్మణ్యంగారు అధ్యక్షులుగా, నేను రాష్ట్ర కార్యదర్శిగా ఉద్యమాన్ని నడిపించాం. చివరికి 12.5% సాధించాం. కానీ, ఈ అవకాశాన్ని మా ప్రచురణకర్త మిత్రులే అనారోగ్యకర పోటీలకు పోయి, దుర్వినియోగం చేసుకున్నారు. వ్యాపార సంస్థల మధ్య ఐక్యత అనేది కష్టసాధ్యం.


నేను పెద్దగా చదువుకున్నవాణ్ణి కాదు. మంచి వ్యాపారం చెయ్యాలంటే పుస్తకవిక్రేత కనీసం ఎమ్.ఏ. అయినా చదవాలని నా అభిప్రాయం. విశాఖపట్టణంలో వరహాల శెట్టిగారు, గుప్తాగారు బాగా చదువుకున్నవారు కావటానే గొప్పగా వ్యాపారం చేస్తున్నారని అనుకునేవాణ్ణి. పుస్తక విక్రేతగా వరహాల శెట్టిగారికి నేను ఏకలవ్య శిష్యుణ్ణి. అలాగే, యం. శేషాచలం & కో అధినేత యం. యన్. రావుగారిని ప్రచురణ రంగంలో నా గురువుగా భావిస్తాను. ఆయన మరణం ప్రచురణ రంగానికి గొప్ప లోటు.


మారిన పరిస్థితుల వలన పుస్తక విక్రయ శాలని (షోరూము) మాత్రమే మూసివేశాం. నవోదయ ప్రచురణ సంస్థ మూతపడలేదు. పాత స్థలం పక్కనే చిన్నఇంట్లోకి మారాం. చాలామంది రచయిత్రుల పుస్తకాలు కూడా ప్రచురించాలని ఉంది.


నవోదయలోకి వెలుతురు నింపింది బాపూ రమణలే! నవోదయలో అడుగిడిన సాహితీవేత్తలంతా వెలుగుమూర్తులే! ఆ వెలుగే ఇదంతా! మంచి పుస్తకానికి చిరునామా నవోదయ! మహోదయుల సాయంకాలపు సంగమమై 50 యేళ్ళు వెలిగింది. పుస్తకాల గుళ్ళో ధ్వజస్తంభంలా నవోదయను నిలపాలన్నది నా కల. నేనింకా ఆ కల కంటూనే ఉన్నాను. నవోదయ పుస్తకాలు తెలుగు భాష ఉన్నంతవరకూ సజీవం. తెలుగు భాష ఉన్నంతవరకూ నవోదయ సజీవం. నవోదయ చిరంజీవి!

[జులై 2016 ఆంధ్రప్రదేశ్ పత్రికనుంచి అనుమతితో పునర్ముద్రణ – సం.]