సుమారు పదిహేడేళ్ళ క్రితం మాట, అంటే 2002 ప్రాంతాలు. ప్రముఖ సంగీత విశ్లేషకులు వి. ఎ. కె. రంగారావుగారు రాసిన వ్యాసాల సంకలనం ఆలాపనని ఒక పుస్తకరూపంగా తీసుకురావాలనే ఆలోచన చేశాం మిత్రుడు డా. గురవారెడ్డీ నేనూ. పుస్తక ప్రచురణ రంగంలో యేమాత్రం అనుభవం లేని నేను యెవరైనా సాయంచేస్తే బాగుండని అనుకుంటుంటే, వి. ఎ. కె. రంగారావుగారూ, కె. చంద్రశేఖరరావుగారూ (రిటైర్డ్ లెక్చరర్, వుయ్యూరు) నవోదయా రామ్మోహన్రావుగారి పేరు సూచించారు. అప్పుడు విజయవాడలో ‘నవోదయ’ ఎక్కడుందో వెతుక్కుంటూ బయలుదేరాను నేను.
అంతకుముందు నాకు నవోదయ అంటే గుంటూరులో నవోదయానే. మెడికల్ కాలేజ్‌లో చదువుకునేటప్పుడు క్రమం తప్పకుండా నవోదయా పుస్తకాల షాపు దర్శించేవాళ్ళం. ఆ షాపుతో పెనవేసుకున్న మధురమైన జ్ఞాపకాలెన్నో! నా లైబ్రరీలోకి చేరిన మొదటి పుస్తకం చలం మ్యూజింగ్స్, సోమర్సెట్ మామ్ ఆఫ్ హ్యూమన్ బాండేజ్ అక్కడ కొన్నవే. ఇంకా యెన్నో ఇంగ్లీషూ తెలుగూ పుస్తకాలు అక్కడ కొన్నవే. ఆ షాపు పక్కనుండి ముక్కులు పగిలేట్టు వచ్చే మురికి నేతివాసనను కూడా లెఖ్ఖ చెయ్యకుండా, అరండేల్ పేట అయిదో లైన్‌కి అక్కడ దొరికే కొత్త పుస్తకాల వాసన కోసం పరిగెత్తేవాళ్ళం. అయితే అది విజయవాడలోని షాపుకి అనుబంధంగా వెలిసిందనీ, అక్కడ పనిచేసే రమేశ్ రామ్మోన్రారావుగారి బంధువనీ తర్వాత తెలిసింది.
సరే! అలా విజయవాడ నవోదయకు, ఒక జిరాక్స్ తీసిన వ్యాసాల బైండింగ్ గుండెల మీద పెట్టుకుని, షాపు మెట్లెక్కి రామ్మోహన్రావుగారెవరని అడిగి, నన్ను నేనే పరిచయం చేసుకుని, విషయం చెప్పి సాయమర్థించాను. ఆయన నన్ను ఆ పక్కనే వున్న స్టూలు మీద కూచోమని, నేను చెప్పిందంతా విని, ఒకింత ఆశ్చర్యపోయి (ఆశ్చర్యం రంగారావుగారి పుస్తకం వేస్తున్నందుకు) సరేనన్నారు. నాకు ఏనుగెక్కినంత సంబరమేసింది. (ఆ స్టూలు మీద యెప్పుడు కూచున్నా అలాగే అనిపిస్తుంది, అది వేరే సంగతి. అప్పుడప్పుడూ తన తోకనే చుట్టగా చుట్టి సింహాసనం చేసుకుని కూచున్న ఆంజనేయుడిలాగా కూడా అనిపిస్తుంది.)
అప్పటికి నాకాయన గురించి ఆట్టే తెలియదు. ఆయనకు బాపు, రమణ, నండూరి రామ్మోహన్రావు, శ్రీరమణ లాంటి గొప్ప వ్యక్తులతో సన్నిహిత స్నేహసంబంధాలున్నాయని గాని, నాణ్యతా ప్రమాణాలున్న పుస్తకాలు ప్రచురించడంలో నవోదయది ఒక చెరగని సంతకం అని గాని, ప్రతి సంవత్సరం విజయవాడలో జరిగే పుస్తకాల పండగ సంకల్పించి, నిర్వహించడం మొదలెట్టింది ఆయనే అని గానీ మొదట తెలియదు, పరిచయమయ్యాక క్రమేణా తెలుసుకున్నాను.
నేను పరిచయం చేసుకున్న మరుసటి రోజే, నా పుస్తక ప్రచురణకు సహాయపడతాయనుకున్న పుస్తకాలు ఆయన దగ్గరనుండి కొరియర్లో వచ్చాయి. నాకు చాలా ఆశ్చర్యమనిపించింది, ఆయన నిబధ్ధతకి.
అది మొదలు నాకే సందేహమొచ్చినా, విజయవాడ నవోదయలో వాలిపోయేదాన్ని. రంగారావుగారు పుస్తక ప్రచురణకి అనుమతి పత్రం పంపడానికే చాలా జాప్యంచేస్తూ, ‘లాయర్నడిగి పంపుతా’ అంటుంటే దిగాలుపడిపోయే నన్ను చూసి ‘ఆయన లాయర్ని సంప్రదిస్తే, మనమూ లాయర్ని సంప్రదిద్దాం’ అని ధైర్యం చెప్పేవారు. అలా అనుమతి పత్రం రావడానికి సుమారు ఆర్నెల్లు పట్టింది. ఈ లోపు వి. ఎ. కె.తో నా తరఫున సమాచారమంతా వివరిస్తూ ఉత్తరాలు రాసి, చెయ్యవలసిన పనుల గురించి హెచ్చరిస్తూ వుండేవారు. ఫోనులు రాజ్యమేలే ఈ రోజుల్లో ఉత్తరాలేమిటండీ అంటే, ‘ఉత్తరమే నా ఆయుధం. చూస్తూ వుండండి రిప్లయ్ వస్తుంది.’ అనేవారు. ఆశ్చర్యం! అలాగే సమాధానాలు కూడా వస్తూ వుండేవి.
చాలా కొద్దికాలంలో నేను వారింటి మనిషినయిపోయాను, ఝాన్సీ అమ్మకు కూతుర్నయి కూచున్నాను. ఇంటిల్లిపాదీ నన్నభిమానించేవారు. బహుశా నా జీవితంలో ఒలికిన విషాదానికీ, వారమ్మాయి జీవితంలో సంభవించిన విషాదానికీ దగ్గర సంబంధం వుండటం ఒక కారణం అనుకుంటా. నాలుగురోజులు కాంగానే ఝాన్సీ అమ్మ దగ్గరనుండి ఫోన్ వచ్చేది ‘అమ్మాయ్ యేం చేస్తున్నావ్? ఊరికినే నీ గొంతు విందామని ఫోన్ చేశా!’ అనేవారు. మామిడికాయల రోజుల్లో మామిడావకాయ, కాలీఫ్లవర్ రోజుల్లో కాలీఫ్లవరావకాయ సీసాలకొద్దీ రౌడీమామూలుగా మా ఇల్లు చేరుతుండేవి.
మధ్యమధ్యలో ఆయన ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పుస్తక ప్రచురణ గురించి నన్ను హెచ్చరిస్తూ వుండేవారు. ఈ పనిలో వున్న కష్టనష్టాల గురించి వివరించి, ఈ పుస్తక ప్రచురణ ఆలోచన మానుకోవాలంటే ఏమీ సందేహించవద్దు అనంటే, ఏది ఏమైనా నేను ముందడుగే వేస్తాననే నన్ను చూసి, ‘ఈ భూప్రపంచంలో మీరు తప్ప వేరే ఇంకెవరూ వేయలేరీ పుస్తకం!’ అనేవారు. ఎప్పుడయినా ఒకోసారి ఈ పని నేను చేయలేనేమో అని నిస్పృహకు లోనయినప్పుడు ఝాన్సీ అమ్మ ‘నీ పట్టుదలే నీకు జయమమ్మా!’ అని ప్రోత్సహించేవారు.
ఇక పుస్తకం విషయానికొస్తే ప్రూఫులు చూడడమూ, పేజ్ మేకప్పూ, డిటిపీ చేయించడమూ, వి. ఎ. కె.తో నేను చేసిన ఇంటర్వ్యూ రికార్డు చేయించడమూ, కళాజ్యోతి ప్రెస్‌లో ప్రింటింగ్‌కి ప్రూఫులివ్వడం… ఇలా ప్రతి దశలోనూ ఆయన సహాయముంది.
అంతేకాక వి. ఎ. కె.ని ఇంటర్వ్యూ చేయబోయేముందు ‘ఆయన మాట్లాడేదంతా మాట్లాడనివ్వండి, అడ్డుతగలకండి’అనే అమూల్యమైన సలహా కూడా ఇచ్చారు. పబ్లిషర్ నోట్ అనేది ఒకటి రాయాలని చెప్పి, నేనేం రాస్తానండీ నా బొంద అంటున్నా వినకుండా, ‘నెమ్మదిగా మీకేది తోస్తే అదే రాయండి. కావాలంటే తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు లేదా యాడ్ చేసుకోవచ్చు’ అని చెప్పి ఎన్నడూ యేదీ రాయని నాచేత ‘ఎవరి పిచ్చి వారికానందం’ రాయించారు.
ఇంకో కష్టమయిన పని ఆ పుస్తకానికి ఇండెక్స్ రాయడం, దానికి వి. ఎ. కె.తో ఆమోద ముద్ర వేయించుకోవడం. ఆ పని కూడా ఆయనే సాధించారు. ఇలా గండాలన్నీ గడిచి పుస్తకం బయటకురావడానికి రెండు సంవత్సరాల కాలం పైనే పట్టింది. రివ్యూలకి పంపడంలోనూ, బుక్ ఫెస్టివల్లో పుస్తకం రిలీజ్ కావడానికీ కూడా ఆయన తోడ్పాటు వుంది.
పుస్తకానికి మంచి పేరు వచ్చింది. ముళ్ళపూడిగారు ఇంటర్వ్యూని మెచ్చుకుంటూ ముందుమాటలో ఒక పేజీ రాయడంతో బాటు, పుస్తకం రాంగానే చూసి ఫోన్ చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో వుందనీ, అచ్చుతప్పులు లేవనీ అన్నారు. బాపూగారు ‘పుస్తకం తెలుగమ్మాయంత సుందరం, ఇంటర్వ్యూ డిలైట్‌ఫుల్’ అని ఉత్తరం రాశారు.
ఈ క్రెడిట్ నాకు దక్కడానికీ, సాహిత్య రంగంలో నా పేరు వినపడడానికీ రామ్మోహన్రావుగారి సహాయ సహకారాలు ఎంతో తోడ్పడ్డాయి. నవోదయాతోనే కాకుండా వారి అనుబంధ కుటుంబం నవతావారితో కూడా పరిచయం యేర్పడింది. ఆపై అందరం కలిసి అండమాన్ యాత్ర చేశాం. అది జీవితంలో మరిచిపోలేని అనుభవం. తిరుగు ప్రయాణంలో మద్రాసులో ఆగి బాపూ రమణలని కలిశాం. అలా నేను నవోదయా-నవతావాళ్ళ కుటుంబాలలో ఒక మనిషినయిపోయాను.
పుస్తకం విడుదలయిన తర్వాత రామ్మోహన్రావుగారు నాకెప్పుడు ఉత్తరం రాసినా ‘భగీరథి గారికి’ అని సంబోధిస్తూ రాసేవారు. అదేంటండీ? అంటే ‘భగీరథుడు గంగను సాధించినట్టు మీరు విఎకె నుండి పుస్తకాన్ని సాధించారు’ అనేవారు. మా అబ్బాయి పిలానీలో చదువుకునేటప్పుడు, దూరంగా ఒంటరిగా ఎలా వున్నాడో? అని నేను దిగులుపడుతుంటే, ‘మీరేం దిగులు పడకండి, నేను ఉత్తరాలు రాస్తాను ఆదిత్యకి,’ అని మా అబ్బాయికి మంచీ చెడూ వివరిస్తూ ఉత్తరాలు రాస్తే, మావాడా ఉత్తర శరపరంపర తట్టుకోలేక దాసోహం అని నాకు ఫోన్ చేసేవాడు.
వి. ఎ. కె. రంగారావుగారికి యే పుస్తకం కావాలన్నా రామ్మోహన్రావుగారినే సంప్రదించేవారు. ఆ పుస్తకం ఆయన షాపులో వుంటే సరే, లేదంటే యెక్కడుందో వెతికి సాధించి ఆయనకు అందజేసేదాకా ఒంటి కాలిమీద వుండేవారు. అందుకే వి. ఎ. కె., నవోదయ రామ్మోహన్రావుగారిని ‘పుస్తకసాయం’ అని పిలిచేవారు. ఒక్క వి. ఎ. కె. అనే కాదు, యెవరు పుస్తకమడిగినా రామ్మోహన్రావుగారు అలాగే ప్రవర్తించేవారు. ఇంక ఆయన స్వభావం విషయానికొస్తే ఆయన పరమ నిర్మొహమాటి. యేదయినా రాసింది గానీ చేసింది గానీ బాగుందని ఆయన మెచ్చుకుంటే, నిజమాండీ? అని మనం అడిగితే ‘ఇప్పుడు మిమ్మలిని మెచ్చుకోవడం వలన నాకొరిగేదేమన్నా వుందా?’ అని తిరిగి ప్రశ్నించేవారు.
ఎవరైనా మార్కెట్లో తాను పబ్లిష్ చేసిన పుస్తకాలు దొరకడం లేదని చెబుతూ, ‘ఒకాయన పుస్తకం కావాలన్నాడండి! మళ్ళీ ప్రింటింగ్‌కి ఇద్దామనుకుంటున్నాను,’ అంటే, ‘బాగుంది, ఆ ఒక్క పుస్తకం ఆయన కొంటాడు. మరి మిగతా పుస్తకాల సంగతి?’ అని కళ్ళు తెరిపించేవారు.
ఆయన వ్యంగ్యం చాలా పదునైనది. ఒకరోజు ఒక రచయిత తాను రాసిన పుస్తకాలు యెన్ని అమ్ముడయ్యాయో తెలుసుకోవాలని ఆందోళనగా నవోదయా షాపుకొచ్చి ‘యేమండీ, యెన్ని సేలయ్యాయి?’ అని అడిగితే ‘లోపలికెళ్ళి బీరువాలో చూడండి, పిల్లలు కూడా పెట్టినట్టున్నాయి’ అని చమత్కరించారు.
మనుషులన్నాక చిన్న చిన్న పొరపొచ్చాలూ, మాట పట్టింపులూ సహజం. అయినా వారి మధ్య అనుబంధం స్థిరంగా కొనసాగాలంటే ఒకరంటే ఒకరికి అంతరంగంలో అభిమానం, గౌరవం వుండాలి. అందుకే ఈనాటికీ వారితో యేళ్ళ తరబడి అనుబంధం కొనసాగించేవారు చాలామంది వారి చుట్టూ కనపడతారు నాతో సహా. ఈ పదిహేడేళ్ళలో చాలా పరిణామాలు జరిగాయి, నవోదయ అనే మూలవృక్షం కూలిపోయింది, జీవిత సమరంలో ఆయన ఒంటరి యోధుడయ్యాడు. ఇంకొకరెవరన్నా అయితే జీవితం కొట్టిన దెబ్బలకు తిరిగి లేచేవారు కారేమో కానీ ఆయన కనీసం బేలగా కూడా ఎప్పుడూ కనపడేవారు కాదు. బహుశా ‘కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ’ అనే జీవిత సత్యాన్ని తెలుసుకున్నారేమో!
నా ఉమర్ ఖయ్యామ్, గీతాంజలి పుస్తకాలు వచ్చినపుడు కలిసి కొన్ని కాపీలిచ్చి నమస్కరించాను. మొన్నటికి మొన్న నా ఒక భార్గవి పుస్తకం తీసికెళ్ళి చేతిలో పెడితే మొహం నిండా సంతోషం నింపుకుని, ‘పుస్తకం అంటే ఇలా వుండాలి!’ అని మెచ్చుకుంటూ మెయిల్ కూడా పెట్టారు.
ఈ మధ్య చంద్రశేఖరరావుగారు ‘రామ్మోహన్రావుగారికి ఒంట్లో బాగాలేదు, ఒకసారి వెళ్ళి చూసి రండం’టే వెళ్ళాను. కాళ్ళూ చేతులూ ఆడలేదు ఆయన పరిస్థితి చూసి. కళ్ళు విప్పి చూడనయినా లేదు. ‘ఇవాళ బాపు పుట్టినరోజు’ అన్నా కూడా కదలిక లేదు. నేను చేసుకున్న పుణ్యం రెండు చంచాల పాలు పోయడం, డెర్మల్ పాచ్ అంటిస్తుంటే కళ్ళు మసకబారాయి. అదేరాత్రి పది గంటలకి వారమ్మాయి శోభ ఫోన్ చేసి, “రుణం తీరిపోయింది!” అంటే ఒకరకంగా విముక్తులయ్యారనిపించినా, తీర్చుకోగలిగిన రుణమా అది? లేదు రామ్మోహన్రావుగారు, మీకు నివాళిగా ఈ నాలుగు మాటలు రాయడమేగానీ, ఎప్పటికీ తీర్చలేని రుణగ్రస్తురాలిని చేశారు.