ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్యాబోధన ఆంగ్ల మాధ్యమంలో జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక పెద్ద దుమారాన్నే లేపింది. ప్రస్తుత ప్రపంచంలో ఎదగడానికి, ఆర్థికంగా ఉన్నతమైన వర్గాలతో విద్యావుద్యోగాలలో పోటీ పడడానికి బడుగు వర్గాలవారికి ఉపయోగపడుతుందని ఈ నిర్ణయాన్ని సమర్థించే వారొకపక్క, విద్యాబోధన మాతృభాషలోనే ఉండాలని ఆవేశంతో ప్రతిఘటిస్తున్న భాషాభిమానులొకపక్క, తమ తమ కులమతవర్గ వాదాలకనుగుణంగా దీనికి రకరకాల రంగులలుముతున్న మరికొందరొకపక్క, తలో వైపు నుండి కూడి విషయాన్ని ఫక్తు రాజకీయం చేశారు. వీళ్ళ నినాదాలన్నీ తమ లబ్ధి కోసమూ, తమ అత్యుత్సాహమో, అజ్ఞానమో ప్రదర్శించడం కోసమూ తప్ప నిజంగా ప్రభుత్వ పాఠశాలలు తప్ప గతిలేని పిల్లల బాగోగుల గురించి కాదు. వాళ్ళకు ఎలాంటి చదువు కావాలి, అది ఎలా చెప్పచ్చు, వారికీ ఎలా సమానావకాశాలు కల్పించచ్చు అని కాదు. ఉద్వేగపూరిత విశ్వాసాలను దాటి, తెలుగు బోధన కావాలనేవారు దానివల్ల విద్యార్థులకు ఏం ప్రయోజనం కలుగుతోంది అని ఆలోచించటంలేదు. ఆంగ్ల బోధనను సమర్థించేవారు అసలు మన పాఠశాలల్లో ఆంగ్లం చక్కగా నేర్పగలిగే ఉపాధ్యాయులెంతమంది ఉన్నారు, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా అమలు చేయగలదు అన్నవి ఆలోచించటంలేదు. ఒక భాష మాట్లాడగలగడం వేరు. ఆ భాషలో ఆలోచించగలిగే సామర్థ్యం తెచ్చుకోవడం వేరు. కనీసం తను చెప్పదలచుకున్నది స్పష్టంగా చెప్పగలిగేంతగా, రాయగలిగేంతగా తర్ఫీదునివ్వగలిగిన ప్రభుత్వ పాఠశాలలు ఎన్నున్నాయి? ఉపాధ్యాయులెందరున్నారు? ఇప్పటికే తెలుగు ఆలోచననిచ్చే భాషగా కాకుండాపోయింది. అందువల్ల ప్రాథమిక విద్య మాతృభాషలో ఉంటే ప్రస్తుత తెలుగు సమాజాల్లో విద్యార్థులకు ఏ మేలు జరుగుతుంది అనేది చర్చనీయాంశమే. అదేవిధంగా అరకొర ఆంగ్లబోధన వల్ల విద్యార్థులకు భావిజీవితంలో ఉపయోగపడేంత భాషాసామర్థ్యం వస్తుందన్నదీ అనుమానాస్పదమే. గత ముప్ఫై నలభై ఏండ్లలో తెలుగు ఇంగ్లీషు మీడియాలలో చదివిన విద్యార్థులెందరిని చూసినా మాధ్యమం వారి భాషను కాని, ఆలోచనను కాని ప్రభావితం చేసినట్టు కనిపించదు. మరోపక్క, గత కొన్ని దశాబ్దాలుగా తెలుగుదేశంలో విద్యాబోధన స్థాయి క్షీణిస్తూ వచ్చిన మాటా రహస్యమేం కాదు. ఈ స్థితిలో, విద్యాబోధన ఏ మాధ్యమంలో అన్న చర్చకు ముందు, ఏ విద్య? ఏ రకమైన బోధన? అన్న ప్రశ్నలు వివరంగా చర్చించబడాలి. కేవలం ఉపాధి కోసమే విద్య అనుకున్నప్పుడు అది ఏ మాధ్యమంలో ఉండాలి అనేది ఆర్థిక సామాజిక కారణాల బట్టే ఉంటుంది. కానీ విద్య కేవలం మనుగడ కోసం మాత్రమే కాదు. భాష మనిషికీ మనిషికీ మధ్య ఉన్న సంభాషణ అంతరించకుండా ఉండేందుకే కాదు. ఏ తరానికాతరంలో బుద్ధిజీవులను పెంచేదే విద్య అని, అందుకు తోడ్పడే భాష అవసరమని, మర్చిపోకూడదు. ఇప్పుడు మన తెలుగుదేశంలో జనం వెంపర్లాడుతున్న భాష, అది తెలుగైనా ఇంగ్లీషైనా, ఒక స్వంత ఆలోచననిచ్చే భాషగా ఉందా? మనం పిల్లలకు ఏ రకమైన విద్య నేర్పించాలనుకుంటున్నాం, నేర్పిస్తున్నాం, ఎందుకు, ఎలా నేర్పిస్తున్నాం? అన్న చర్చలు మొదవలవ్వాలి. మాధ్యమాల మార్పుకన్నా, శిక్షణలోనూ, శిక్షకులలోనూ మార్పు ముఖ్యమన్న ఎరుక అన్ని చర్చల్లోనూ ప్రధానంగా వినపడనంతకాలం, అవి ఎంతకాలం, ఏ స్థాయిలో నడిచినా ఏ లాభమూ లేదు.