రా, పో, ఆగు, తిండి, బట్టలు, కొడుకు, కూతురు, దారి, ఇల్లు, ఆకాశం, భూమి, రాత్రి, పగలు – అన్నీ ఒకందుకు సులువుగానే వచ్చేశాయి. నేను తమిళంలో ఆ మాటలు చెప్తుంటే ఆమె వాటి ఇంగ్లీషు మాటలు చెప్పేది. నేను ప్రశ్నలు ఒకే వరసలో అడగడం వల్ల, నేను ‘కో’ అని పదం పూర్తి చేయక ముందే ఆమె హెన్ అన్నది. అందుకని నేను వరుసను మార్చాను. అయితే పెద్దమ్మ నా ముఖకవళికలు చూడగానే చెప్పేసేది. నేను ఆ జంతువులను చూపించి అవేంటని అడిగాను. ఆమె తమిళంలో కుక్క, పిల్లి, కోడి అని వెంటనే వాటిని తర్జుమా చేసింది. వంద ప్రాథమిక పదాలకు సంబంధించి ప్రశ్నలు పూర్తికాకముందే ఆమె జవాబు చెప్పడం మొదలుపెట్టాక నేను భావాలను ఇంగ్లీష్‌లో ఎలా వ్యక్తపరచాలి అన్నది నేర్పించడం మొదలుపెట్టాను. అక్కడే మొదలయ్యింది సమస్యంతా!
పెద్దమ్మ నాకు వరసకు పెద్దమ్మ కాదు. మా ఊళ్ళో అందరూ ఆమెను అలానే పిలిచేవాళ్ళు. వాళ్ళ ఇంటిని అందరూ పెద్దిల్లు అనేవాళ్ళు. ఊరి మధ్యన ఉన్న పెద్ద కోటలాంటి ఆ ఇంటిని పెద్దమ్మవాళ్ళ తాతగారు తిరువడియా పిళ్ళైగారు నూటయాభై ఏళ్ళ క్రితం కట్టారు. బెల్జియంనుండి అద్దాలు, బర్మానుండి టేకు కర్రలు, ఇటలీనుండి చలువరాళ్ళు, ఇంగ్లాండ్ నుండి ఇనుము ప్రత్యేకంగా తెప్పించినట్టు చెప్తారు. ఆ ఇంటికి సున్నాలు వెయ్యడానికి వచ్చినవాళ్ళు ఇక్కడే స్థిరపడిపోవడం వల్ల మా ఊళ్ళో సున్నపువారి వీధి ఏర్పడింది. వడ్రంగులు అప్పుడు వచ్చినవాళ్ళే. పెద్దమ్మకు ఆ ఇంట్లోనే పెళ్ళయింది. మా ఊర్లో మోటారు కారు మొట్టమొదటిసారి అడుగు పెట్టిందప్పుడే. ఆ ఫోర్డ్ కార్లోనే ఊరేగింపు. ఆ తర్వాత ఎప్పుడూ పెద్దమ్మ ఆ కారెక్కలేదు.
పెద్దమ్మ భర్త చనిపోయి నలభై ఏళ్ళు దాటాయి. ఒక్కగానొక్క కొడుకు ఆఱుముగపిళ్ళై మదురైలో వకీలుగా చేసి మరణించాడు. అతని నలుగురు కొడుకులూ చెన్నైలోను, కలకత్తా, ఢిల్లీలోనూ ఉండేవారు. ఇప్పుడు ఎవరూ ప్రాణాలతో లేరు. పెద్ద మనవడి కూతురు ఒకామె అమెరికాలో డాక్టర్‌గా ఉంది. ఆమె ఒక్కదానికే పెద్దమ్మతో మాటామంతీ ఉన్నాయి. ఈ ఊరిలోని నాలుగో తరం జనాలకు పెద్దమ్మ ఒక చారిత్రక చిహ్నం లాంటిది. పూర్వం వాళ్ళకు వెయ్యి ఎకరాల పొలం ఉండేది. అది క్రమేణా తగ్గుతూ వంద ఎకరాలు మిగిలాయి. ఆ వంద ఎకరాలను ముప్ఫై ఏళ్ళక్రితమే వారసులు భాగాలు పంచుకుని అమ్మేసుకున్నారు. ఇప్పుడు పెద్దమ్మకు మిగిలి ఉన్నవి ఆ ఇల్లు, ఇంటి చుట్టూ ఉన్న రెండు ఎకరాల భూమి, బ్యాంకులో ఒక పెద్ద మొత్తం, నగలు మాత్రమే. అయితే ఆమె పూర్వ వైభవంతోను, దర్పంతోనూ బతకడానికి అవే సరిపోయాయి.
మా అమ్మకు ఊహ వచ్చినప్పటినుండే పెద్దమ్మ ఆ కోటలాంటి ఇంటిలో ముగ్గురు పని వాళ్ళతో ఒంటరిగా వుండేది. తెల్లవారుజామునే వాకిట్లో నిల్చుని పెద్ద గొంతుతో పనివాళ్ళను పురమాయిస్తూ, పనులు చేయిస్తూ వుంటుంది. ప్రతిరోజూ సాయంత్రం వాళ్ళ ఇంట్లో ఉన్న కర్ర గుంజలతో నిర్మించిన చిన్న గుడిలో పురాణ పారాయణం జరుగుతుంది. పెద్దమ్మకు చదివి వినిపించడానికి ముత్తుస్వామి పండితులు వస్తారు. అంతకుముందు ముత్తుస్వామి వాళ్ళ నాన్న వస్తూ ఉండేవారు. వాళ్ళ తాత కూడా అక్కడ పారాయణం చేసినవారే. పారాయణం అయిపోగానే గుగ్గిళ్ళు, చక్కెర పొంగలి, అరటి పళ్ళు, బొరుగులు అంటూ ఏదో ఒకటి ప్రసాదంగా పంచుతారు. నా చిన్నతనంలో ఒక్కరోజు కూడా ఆ ప్రసాదాన్ని వదులుకునేవాడిని కాను.
వాళ్ళ ఇల్లు నేలమట్టం నుండి ఎత్తుగా ఉంటుంది. మనిషి నిల్చుంటే తల కంటే ఎత్తులో ఉంటుంది ఇంటి గుమ్మం. ముంగిట్లోనూ, పెరటి వాకిట్లోనూ రాళ్ళతో మలచబడ్డ ఎనిమిది పెద్ద మెట్లు ఉంటాయి. పెద్దమ్మ ఒకసారి చేయి కడుక్కోడానికి వెళ్ళినప్పుడు కళ్ళు తిరిగి కిందపడి దెబ్బలు తగిలి ఎనిమిది నెలలు మంచం పట్టింది. అమెరికాలోని మునిమనవరాలు ఏర్పాటు చేసిన డాక్టర్లు, నర్సులు ఎప్పటికప్పుడు వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు. కొన్నాళ్ళకు కుంటుతూ నడవగలిగింది కానీ మునుపటిలా ఇంక నడవలేక పోయింది. ఆ ఘటన తర్వాత పెద్దమ్మ మనసు మారింది. అప్పటివరకు ఇల్లు వదిలి కదలకూడదు అన్న పట్టుదలతో ఉన్న పెద్దమ్మ అమెరికా వెళ్ళి మునిమనవరాలితో వుండటానికి ఒప్పుకుంది.
మునిమనవరాలి భర్త అమెరికాలోనే పుట్టి పెరిగిన తెల్లవాడు. వాళ్ళకు ఇద్దరు ఆడపిల్లలు – తెల్లవాళ్ళే. నిజానికి ఆ మునిమనవరాలికి తమిళం రాదు. నేను కరెస్పాండెన్స్ ద్వారా ఎమ్.ఎ. ఇంగ్లిష్ ముగించి ఊళ్ళోనే చిన్న స్కూల్లో టీచర్‌గానూ, ఆఫీసు అసిస్టెంట్‌గానూ పని చేస్తున్నాను. పెద్దమ్మకు చిన్న చిన్న ఇంగ్లీష్ మాటలు నేర్పించడానికి వీలవుతుందా అని మునిమనవరాలు నాకు ఈమెయిల్ రాసింది. ఈ ఊళ్ళో ఆమెకు దగ్గరి పరిచయస్తుణ్ణి నేనొక్కణ్ణే. ఆ లంకంత ఇంటిని కొనుక్కుని, కూలగొట్టడానికి దళారీల ద్వారా ఎంతోమంది వచ్చిపోతున్నారు. మరోవైపు వీసా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
నాకు మూడు నెలల గడువు ఇచ్చారు. మొదటి రెండు నెలల్లోనే చాలా ఇంగ్లీష్ మాటలు పెద్దమ్మకు నేర్పించాను. దోమ అన్న చిన్న కీటకానికి ఇంగ్లీషులో మస్కిటో అనే భయంకరమైన జంతువులాటి పేరుండడం పెద్దమ్మను ఆశ్చర్యానికి గురి చేసింది. దానిమ్మ అన్నమాట తమిళంలో అమ్మాయిలా నెమ్మదిగా సుకుమారంగా ఉండగా పొమొగ్రనేట్ అన్న మాట గంభీరంగా, మగటిమితో ఉందనీ భావించింది. అయితే గొడుగుకంటే అంబ్రెల్లా నచ్చింది. ఎందుకంటే అంబ్రెల్లాను మరిచిపోకుండా ఉండటానికి పెద్దమ్మకు నేను సిండ్రెల్లా కథను అంతకుముందే చెప్పున్నాను. బనానా అన్నమాట ప్రశ్నార్థకంగానూ, మ్యాంగో అన్నది స్వాగతించే మాటగాను, పొటాటో అన్నది విసుక్కునేందుకు వాడే మాటగాను ఆమెకు అనిపించింది. అలాంటి చిన్ని చిన్ని వింతల కోసం ఎంతో ఉత్సాహంతో పెద్దమ్మ ప్రతిరోజు తెల్లవారుజామునే స్నానం అవీ ముగించి రవిక లేని తెల్లచీరకట్టుతో, నుదుటన విభూతి బొట్టు పెట్టుకొని ఎనిమిది గంటలకల్లా నా కోసం చూస్తూ ఉండేది.
ఇంగ్లీష్ చదువు ఇచ్చినంత ఆనందం, జీవితంలో ఇంకేమీ ఇవ్వలేదని ఆమెకు అనిపించింది. ఎందుకంటే పెద్దమ్మ ఎప్పుడూ బడికి వెళ్ళింది కాదు. ఆ రోజుల్లో పైకులాల స్త్రీలు దేన్నైనా నేర్చుకోవడం అంటే, ఆచారాన్ని అతిక్రమించి గుమ్మం దాటి బయటకు వచ్చి వీధిలో నిలబడినంత నీచకార్యంగా భావించేవాళ్ళు. భర్త చనిపోయి తెల్లచీర కట్టుకోవడం మొదలుపెట్టిన తర్వాతే పెద్దమ్మ పురాణాలు చదివించుకుని వినడం మొదలుపెట్టింది. ఇప్పుడు రోజుకొక కథ చెప్పగలిగేటన్ని పురాణగాథలు తెలుసామెకు. అదే కాకుండా పురాణాల్లో నుంచి తను కొన్ని కథలను సృష్టించి మరీ చెప్పేది. చెప్పిన కథను ఇంకోసారి చెప్పేటప్పుడు అది ఎన్నో తరాలుగా చెబుతూ వస్తున్న కథే అన్నట్టుగా ఆమె భావించేది.
‘మాటలు దాటి వాక్యాల దాకా వెళతాం’ అని నేను ముందుగా అనుకోలేదు. మాటలు నేర్చుకుని పెద్దమ్మ వాటిని ఉపయోగించటానికి ప్రయత్నించినప్పుడు వాక్యాలు అవసరం అయ్యాయి.
“ఇదిగో ఇక్కడ నిల్చునుందే… ఈ కుక్క… డాగ్. విశ్వాసం కలది. విశ్వాసాన్ని ఇంగ్లీషులో ఏమంటారు?” అని అడిగింది.
నేను ‘ఒబీడియంట్’ అన్నాను.
‘ఈజ్’ చేర్చడం ఆమెకు వచ్చు. “డాగ్ ఈజ్ ఒబీడియంట్” అని అన్నాక “ఒబీడియంట్ అంటే విశ్వాసం కదా?” అడిగింది.
నేను “కాదు, ఒబీడియంట్ అంటే వినయం అని అర్థం” అన్నాను.
“ఒరేయ్, ముదనష్టపోడా, ఇదెక్కడ విశ్వాసంగా ఉంది? ఇదిగో! అని పిలిస్తే ఐదు నిముషాలకు గానీ వెనక్కి తిరిగి చూడదు. దీన్ని పోయి విశ్వాసం/వినయం గలది అంటున్నావు?” అని ప్రశ్నించింది.
నేను వెట్టుమణి వైపు చూశాను. ఆమె చెప్పేది నిజమే. వెట్టుమణి తనను తానొక వృద్ధచక్రవర్తినని భావిస్తూ ఉంటుందన్న విషయం దాని ప్రతి కదలికలోనూ కనిపిస్తూనే ఉంటుంది. ‘ఫెయిత్‌ఫుల్’ అని మార్చాను. ఆ పదం గురించి చెప్పినప్పుడు “సరిపోయింది సంబడం… దీన్ని నమ్మి ఓ చేప ముక్కను కూడా ఇంట్లో వుంచలేం. కొనుక్కొచ్చిన ఎండు చేపలను, తీసి జాగర్త చేసే లోపే ఎత్తుకెళ్ళిపోతుంది… దరిద్రపుగొట్టుది!” అంది.
నేను మరింత ఆలోచించి డొమెస్టిక్ అనొచ్చు అని అన్నాను. “అదేంటి?” నేను వివరించాను.
“ఒరేయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా? అది తిండి తినడానికి మాత్రమేగా ఈ ఇంటికి వచ్చేది…?”
నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు. థాంక్‌ఫుల్ అనొచ్చా? కుక్కలను అలా అంటారా? లేక గ్రేట్‌ఫుల్? అవన్నీ నిజానికి కుక్క లక్షణాలేనా? ఆ మాటలన్నీ నేను అర్జీలు పెట్టుకునేటప్పుడు తరచూ వాడేవి.
అలా కాసేపు తర్జనభర్జన పడి ఒక నిర్ణయానికి వచ్చాను. గ్రీకు పురాణగాథ ‘ఆడిసీ’లో యులిసిస్ ఇరవై ఏళ్ళు వనవాసం ముగించుకుని తిరిగి వచ్చిన కథను చెప్పాను. జబ్బుచేసి, బక్కచిక్కిన భిక్షగాడిలా తిరిగి వస్తాడు యులిసిస్. అప్పడు తనవారైన స్నేహితుడు, భార్య కూడా అతన్ని గుర్తుపట్టలేకపోతారు. అయితే యులిసిస్ పెంచిన ఆ అపురూపమైన కుక్క ఆర్గోస్ మాత్రం అతన్ని గుర్తించి తోకను ఊపుతూ ఆహ్వానిస్తుంది. అలానే ఆర్గోస్ ప్రాణాలు కోల్పోతుంది. అది చూసి యులిసిస్ కళ్ళనీళ్ళపర్యంతమవుతాడు. అప్పుడు అందరూ అతనే యులిసిస్ అని గుర్తిస్తారు. అలా అతను తన భార్య, కొడుకులను చేరుకుంటాడు. తన దేశాన్ని మళ్ళీ సొంతం చేసుకుంటాడు.
పెద్దమ్మ కళ్ళలో నీళ్ళు పెట్టుకుని “అదే విధి వైపరీత్యం అంటే. ఎంత చమురు రాసుకుని పొర్లాడినా అంటాల్సినంత మట్టేగా అంటుకుంటుంది… ధర్మరాజు స్వర్గారోహణం వెళ్ళినప్పుడు ఒక కుక్క కూడా వెంటవెళ్ళిందిగా?” అన్నది. ఐదుగురు తమ్ముళ్ళు, పాంచాలితో కలిసి ధర్మరాజు హిమాలయాలు ఎక్కి స్వర్గానికి వెళ్తాడు. వాళ్ళను ఒక కుక్క కూడా వెంబడిస్తుంది. దారిలో ఒక్కొక్కరు అలసిపోయి పడిపోతూ ఉండగా తిరిగి చూడని పట్టుదలతో ధర్మరాజు ముందుకు సాగిపోతాడు. కుక్క మాత్రం వెంబడిస్తుంది. అతనూ కుక్క మాత్రం శిఖరానికి చేరుకుంటారు. స్వర్గలోకపు రథం అక్కడికి వస్తుంది. ధర్మరాజును రథం ఎక్కమని చెబుతారు. తనతో పాటు వెంట వచ్చిన కుక్కను కూడా ఎక్కించుకోవాలి అని అంటాడు ధర్మరాజు. కుక్కలకు స్వర్గలోకపు ప్రవేశం లేదు అని అంటారు. అలా అయితే నాకు కూడా స్వర్గలోకం అక్కర్లేదు, నన్ను అనుసరించి నాతో పాటు ఇంత దూరం వచ్చిన కుక్కను వదిలిపెట్టి నేను రాను అని అంటాడు. కుక్క అప్పుడు రూపం మార్చుకుని లేచి ధర్మదేవతగా వస్తాడు. నీ ధర్మనిరతిని శోధించడానికి వచ్చాను అని ధర్మరాజుతో చెప్పి తమ్ముళ్ళకు, పాంచాలికి ప్రాణం పోసి వాళ్ళను రథంలో ఎక్కించుకుని దేవలోకానికి తీసుకువెళ్తాడు యమధర్మరాజు.
పెద్దమ్మ కళ్ళు తుడుచుకుంటూ “కుక్క విశ్వాసమైన జంతువే! అందువల్లే అంత దూరం వచ్చింది! అలాంటిదాన్ని విడిచిపెట్టి వెళ్ళడం కూడా ధర్మం కాదు కదా! అందుకే ధర్మరాజు దాన్ని వదిలిపెట్టలేదు… ఎంతయినా ఆయన గొప్ప ధర్మమూర్తి!” అన్నది.
“యులిసిస్ పెంచిన కుక్క అతనిమీద చూపించినదే నేను చెప్తున్నది కూడా” అని అన్నాను.
“అయితే ధర్మరాజు కుక్క మీద చూపించింది?” అని అడిగింది పెద్దమ్మ.
ఇద్దరం ఆలోచనల్లో పడ్డాము.
“అది చూపించిన విశ్వాసానికి బదులుగా ఆయన చూపించిన విశ్వాసం కదా అది?” అన్నది పెద్దమ్మ. నేను ఒప్పుకున్నాను. అయితే రెండువైపులనుండీ ఇద్దరూ ఒకరి పట్ల ఒకరు ఎలా ఒకేలా థేంక్‌ఫుల్‌గానో, ఫెయిత్‌ఫుల్‌గానో ఒబీడియంట్‌గానో ఉండగలరు? దీన్నెందుకు కైండ్‌నెస్ అనకూడదు అని అడిగాను. దానికేంటి అర్థం అని అడిగింది. నేను వాళ్ళిద్దరూ ఒకరిమీద ఒకరు చూపించుకున్నది అన్నాను. పెద్దమ్మ ఒప్పుకుంది.
నేను “డాగ్ ఈజ్ కైండ్” అన్నాను.
“ధర్మరాజు ఈజ్ కైండ్” అంది పెద్దమ్మ.
మరుసటి రోజు పెద్దమ్మ ఉత్సాహంగా కనబడింది. కైండ్ అయిన కోడిని, కాకిని, పనిపిల్ల కుంజమ్మను, కొబ్బరికాయల వ్యాపారి అర్జునన్ నాడార్‌ను, భిక్షం అడుక్కోడానికి వచ్చిన పచ్చతలపాగా కట్టుకున్న ఫకీరునూ వేలెత్తి ఆమె వాళ్ళు కైండ్ అన్నట్టు చూపెట్టింది. ఆ రోజు మేఘాలు కమ్ముకుని ఉండటంతో ఎండ కాయలేదు. చల్లటి గాలిలో సన్నటి నీటి చెమ్మ వ్యాపించి ఉంది. ఆకాశాన్ని కైండ్ అనొచ్చా అని అడిగింది. చెప్పొచ్చు, అయితే అనకూడదు అన్నాను. దానికి సరిపడే మాటను వెతుక్కుని ‘బ్యూటిఫుల్’ అన్నాను. దానికి అర్థం ఏంటి అని అడిగింది. తర్వాత కోడిని, కాకిని, కుంజమ్మను, అర్జునన్ నాడార్‌ను, ఫకీరునూ బ్యూటిఫుల్ అనొచ్చా అని కొంచం బెరుగ్గా అడిగింది. నేను మరింత బెరుగ్గా అలోచిస్తూ “అనొచ్చు” అన్నాను. ఆ మాటతో ఇద్దరం వెనకవైపునున్న సూరీడు వెలుతురుతో కలగలిసిపోయి మెరుస్తున్న నల్లటి మేఘాలను కాసేపు పారవశ్యంతో చూస్తూ ఉండిపోయాము. ఆ పైన ఆకాశాన్ని కైండ్ అనొచ్చు అన్న నిర్ణయానికి వచ్చాము.
తర్వాత కొన్ని రోజులకు కథల ద్వారా మేము పదాలను చాలా సులువుగా అర్థం చేసుకున్నాము.
“ఒరేయ్, తిరుచెందూర్ సుబ్రమణ్యస్వామి కటాక్షాన్ని ఇంగ్లీషులో ఎలా చెప్పాలి?” అని అడిగింది పెద్దమ్మ.
సుబ్రమణ్యస్వామి ఇంగ్లీషులో కటాక్షిస్తాడో లేడో తెలియదు మరి. కాబట్టి ఏసుప్రభువు నీటిని ద్రాక్షరసంగా మార్చిన కథను చెప్పాను. పెద్దమ్మ గడ్డం మీద చేయి వేసుకొని నిర్ఘాంతపోయింది. దాన్ని నేను కంపాషన్ అని అన్నాను. దాన్ని నేను వివరించినప్పుడు “అది మనిషి కూడా చూపిస్తాడు కదా? నేను కటాక్షం గురించి కదా అడుగుతున్నాను?” అంది పెద్దమ్మ.
నేను దాన్ని గ్రేస్ అన్నాను.
“అది వేరే. నేను చెప్తున్నది కటాక్షం. కటాక్షం అంటే సుబ్రమణ్యస్వామి కురిపించే కరుణ” అంది.
కరుణ కరుణ కరుణ అని నేను నాలోనే చెప్పుకుంటూ “ఆఁ, అది మెర్సీ” అని అన్నాను.
“అది మన యేసుపాదంగాడి కూతురు పేరు కదా? నర్సమ్మగా పని చేస్తుంది చూడు.”
నేను మళ్ళీ వివరించాను.
“ఒరేయ్ పనికిమాలిన వెధవా, అది జాలి కదా? నువ్వు దేవుడికి ఏం దండం పెట్టుకుంటావో ఏంటో! ఒరేయ్, పోలీసోళ్ళు మనమీద చూపించేది జాలి. సుబ్రమణ్యస్వామి చూపించేది కరుణ… దాన్నే మనం కటాక్షం అని కూడా అంటాము” అంది పెద్దమ్మ.
నేను మెత్తని స్వరంతో “లవ్” అన్నాను. పెద్దమ్మ నన్ను అనుమానంగా చూసింది. నేను కళ్ళు పక్కకి తిప్పుకున్నాను.
“మరి మన చెల్లమ్మ కూతురు లవ్వు సినిమా అంటోంది అదేంటి?” అని అడిగింది.
“అది వేరే లవ్వు” అని నేన చెప్పగానే ముసలావిడకి కోపం కట్టలు తెంచుకుని వచ్చేసింది.
“సచ్చినోడా, చీపురుకట్టతో కొడతా!” అని అంది.
నేను దాదాపుగా ఏడ్చే స్థితికి చేరుకుని “ఇంకో కథ ఉంది” అని అన్నాను.
“చెప్పు” అని కొంచెం దిగి వచ్చింది.
నేను వాల్మీకి రామాయణంలోని శబరి తను ఉన్న అడవికి తనను వెతుక్కుంటూ వచ్చిన రాముడుకి పళ్ళు కోసి వాటిని తిని రుచి చూశాకే ఆ ఎంగిలి పళ్ళను ఇచ్చిన కథను చెప్పాను. చెప్పాక ఆ కథెందుకు చెప్పానో నాకే అర్థంకాక అయోమయంలో పడ్డాను. రెండు కథల్లోనూ తిండి గురించి వస్తుందిలే అనుకుని నాకు నేను సర్దిచెప్పుకున్నాను.
పెద్దమ్మ నిరసన ప్రకటించే చూపొకటి నామీద విసిరింది. ఆమె మెదడు వేడెక్కడం గ్రహించాను.
“ఆయన పేదలకు కదా ద్రాక్షరసం ఇచ్చారు” అని అడిగింది.
“అవును పెద్దమ్మా! అడవిలో ఉన్నప్పుడు రాముడు కూడా పేదవాడే కదా? పైగా ఆకలితో కదా వచ్చాడు?” అని చెప్పాను.
పెద్దమ్మ ఒక రకంగా నిజమేనన్నట్టు అంగీకరించింది.
నేను “కృష్ణుడు అదే చేశాడు కదా? పాండవులు అడవిలో ఉండగా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గిన్నెలో అంటుకుని ఉన్న ఒకే ఒక్క మెతుకుని తిని కడుపు నింపుకు పోయాడు కదా?” అని అన్నాను.
పెద్దమ్మ ముఖం వికసించింది. “అవును” అని అంది. క్షణం ఆలోచించి “దేవుడికి మనం ఇచ్చేది దేవుడు మనకు తిరిగి ఇస్తాడు… అంతేలే” అని అంది.
నేను వెంటనే “బాండ్” అని అన్నాను.
“అదేంటి?” అని కనుబొమ్మలు చిన్నవి చేసుకుని అడిగింది.
“బంధం… ఇప్పుడు దేవుడికి మనకు మధ్యలో ఉంది కదా? మనం దేవున్ని, దేవుడు మనల్ని ఒకరినొకరు వదులుకోలేం కదా?” అని అన్నాను.
ముసలామె నవ్వి “ఎంతయినా నువ్వు చదువుకున్నోడివిరా” అని అంది.
చివరికి ఆ మాటను ఖరారు చేశాం. భక్తి, ప్రార్థన, భజన, వేడుట, నైవేద్యం అన్నిటికీ ఆ ఒక్క మాటే నిర్వచనం అని నిర్ధారించినప్పుడు నాకు కాస్త సాంత్వన కలిగింది.
పెద్దమ్మ ఇంగ్లీష్ చదువు ఎలా సాగుతోంది అని అమెరికా నుండి గోమతి అడిగింది. “చక్కగా సాగుతోంది గోమ్స్. చాలా నేర్చుకుంటున్నారు పెద్దమ్మ” అని జవాబిచ్చాను.
ఆమె అనుమానంగా “అవునా?” అని అడిగింది.
తర్వాత “ఆమెకు కొంచం మేనర్స్ కూడా నేర్పాలి” అని చెప్పింది.
“అలాగే చేస్తాను” అని అంటూ నాకు ఇంకాస్త డబ్బులు అవసరం పడుతుంది అని చూచాయగా చెప్పాను. ఆమె దాన్ని ఖరారు చెయ్యకుండా “చూస్తాను” అని అంది.
పెద్దమ్మ వీసా ఏర్పాట్లు పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఆమె పేరు చెల్లతాయి, వెళ్ళకుట్టి, కాంతిమతియమ్మాళ్ అంటూ ఒక్కో దస్తావేజుల్లో ఒక్కోలా ఉండటం సమస్యగా మారింది. అంతేకాకుండా ఆమె భర్త పేరు ఏరగం పణ్ణయార్, అళగియనంబియాపిళ్ళై, వడుకప్పిళ్ళై, సొరిముత్తు, అప్పు అంటూ నాలుగు చోట్ల నాలుగు రకాలుగా ఉన్నాయి.
ముందుగా నేను మేనర్స్ అంటే ఏంటి అని వికీపీడియాలో చదివి తెలుసుకున్నాను. తెల్లవాళ్ళు ఈ విషయంలో కొంచెం కటువుగానే ఉంటారు అన్నది తెలిసింది. పెద్దమ్మతో మేనర్స్ అంటే పదిమందిలో ఎలా మెలగాలన్న నాగరికతగా వివరించాను.
“అవును, నేను ఈ వయసులో ఇంకా సిల్కుచీరలు, సోకులు చేసుకుని నడవాలా… పోరా పనికిమాలిన కుంకా” అనేసింది.
మెల్లగా నేను చెప్పొచ్చేది అది కాదు అని. ఏవేవి మేనర్స్ అనచ్చో అని నాకు తోచినవి చెప్పాను.
“మొట్టమొదటిది, గట్టిగా మాట్లాడకూడదు” అన్నాను.
“అయితే అక్కడ దొరలందరూ మూగవాళ్ళేంట్రా?” అని అడిగింది.
“అతిథులు వస్తే వాళ్ళను ఇంపుగా, మర్యాదగా ఆహ్వానించాలి” అని అన్నాను.
“మంచి కులంలో పుట్టిన మేలిమి గుణం అని చెప్తావు… అది మనకు మెండుగానే ఉందిగా!”
తర్వాత ఏం చెప్పాలో తెలియక తికమకపడ్డాను. కొన్ని ఇంగ్లీషు మాటలను చెపుతూ ఉండడమే మేనర్స్ అని నాకు అనిపించింది. థాంక్స్, వెరీ కైండ్ ఆఫ్ యూ, ప్లీజ్… అలా ఏడెనిమిది మాటలను పెద్దమ్మకు నేర్పించాను. పళ్ళూడిన పెద్దమ్మ ఎక్స్‌క్యూజ్ మీ అన్న మాటలను ఒట్టి గాలి ఈలలా మాత్రమే పలకగలిగింది.
“ఇన్నిట్నీ గుర్తు పెట్టుకుని నేను దేన్నని చెప్పను? ఒక్క మాటలో మేనర్స్ నేర్పించు” అని అంది.
నేను కాసేపు ఆలోచించి సారీ అన్న మాటను మేనర్స్ కింద నేర్పించాను. ఏది చెప్పినా దాంతోబాటు ఒక సారీ చేర్చుకుంటే చాలు అంతా మేనర్స్ అయిపోతుంది. దాని అర్థం ఏంటి అని అడిగింది. విచారం అని అన్నాను.
పెద్దమ్మ “అయితే ఎప్పుడూ విచారంతో వుండాలంటావారా…” అంది ఇబ్బందిగా ముఖం పెట్టి.
“పెద్దమ్మా, మన సీత ఎల్లప్పుడూ విచారంగానేగా ఉండేది?” అని అన్నాను.
పెద్దమ్మ అంతట్నీ ఒకే క్షణంలో అర్థం చేసుకున్నదానిలా “సీత మహరాణి కదా? రాజకుమార్తె… ఎంత వినయ విధేయతలతో ముచ్చటగా పద్ధతిగా ఉండేది! ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడేది…” అనంటూ “పాపం, ఆమె నుదుటి రాత బాలేదు… ఏం బావుకుందని!” అని జాలిపడింది.
నేను ఉత్సాహంగా “అదే నేను చెప్తున్నది. సీత మేనర్స్ కలిగినది…” అని అనగానే నాకు లోలోపల మరోటి గుర్తొచ్చింది. “అయితే అక్కడ ఉన్న అమ్మాయిలు సీతలా ఉండరు పెద్దమ్మా” అని అన్నాను.
“మరి? ఇందాకే అన్నావుగా?”
నేను మధ్యస్థంగా “సీత మాదిరిగానే. అయితే సీతలా శీలం వంటివి వాళ్ళకు ఉండవు” అని అన్నాను.
“మరి?”
“వాళ్ళకు ఉండేది వేరేది… శీలంలాంటిది. అది కొంచం తేడాగా ఉంటుంది” అని అన్నాను.
“అదేంటి?” అని అడిగింది.
పెద్దమ్మ అనేక రకాలుగా కన్ఫ్యూజ్ అయ్యిందని అర్థం అయింది. నేను దాన్ని ఎలా చెప్పాలి? ఛాస్టిటీ అని అన్నాను. ఇంకా కొంచం తేలికపరిచి పయెటీ అని అన్నాను. అన్వయం సరిగ్గా కుదరలేదు.
“అవన్నీ ఆ ఊరి శీలం” అని అన్నాను.
పెద్దమ్మ కళ్ళల్లో ప్రశ్నలరేఖలు.
మళ్ళీ కథలోకి వెళ్ళాను “సీతలా అక్కడ కూడా పురాణం ఉంది పెద్దమ్మా” అని అన్నాను.
“చెప్పురోయ్… కథ చెప్పకుండా ఎంతసేపు జంతికలు మెక్కుతున్నావు” అని కసురుకుంది.
నేను ట్రాయ్ నగరపు హెలెన్ కథను చెప్పాను. ఆమె జెయుస్ దేవుడి కూతురు అన్న విషయం పెద్దమ్మకు బాగా నచ్చింది. “దేవకుమార్తె కదా” అంటూ గడ్డం మీద చేయి పెట్టుకుంది.
“అవును పెద్దమ్మా అక్కడ ఉన్న కథల్లోనే మహా గొప్ప అందగత్తె ఆమె” అని అన్నాను.
పెద్దమ్మ “మరే, ఆ మాత్రం ఉండదట్రా… అసలే ఆమె గంధర్వ కన్య కదా?” అని అంది.
ఆమెను స్పార్టా దేశపు రాజు మేనిలాస్ పెళ్ళి చేసుకున్నాడని చెప్పినప్పుడు నాకు లోపల కొంచెం అలజడిగా అనిపించింది. ఆమె తర్వాత ట్రాయ్ నగరపు యువరాజు ప్యారిస్‌ను చూసిందని, అతన్ని ప్రేమించి అతనితోబాటు ట్రాయ్ నగరానికి వెళ్ళిపోయింది అనీ చెప్పాను. పెద్దమ్మ కథలో మునిగిపోయి ఎంతో ఆసక్తితో కళ్ళార్పకుండా చూస్తూ వినింది.
మైసీనియన్ రాజులు సైన్యాన్ని కూడకట్టుకుని ట్రాయ్ నగరం మీద దాడి చేశారని, అఖిలీజ్, అగమెమ్నాన్ ఇద్దరి ఆధ్వర్యంలో యుద్ధం జరిగింది అని వివరించినప్పుడు నాకే ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది.
“అక్కిలీసు మన అర్జునుడిలా ఉన్నాడు కదరా!” అని ఆశ్చర్యపోయింది పెద్దమ్మ. యుద్ధంలో హెక్టర్ చంపబడే ఘట్టాన్ని కళ్ళల్లో నీళ్ళుపెట్టుకుని మరీ విన్నది పెద్దమ్మ. “కర్ణ మారాజు నేలకొరిగినట్టు” అని ముక్కులు ఎగదీసుకుంటూ వాపోయింది. చివరికి ట్రోజన్ గుఱ్ఱాన్ని ఉపయోగించి మాయజేసి ట్రాయ్ నగరం మీద విజయం సాధించారు అని చెప్పినప్పుడు పెద్దమ్మ చాలాసేపు మౌనంగా ఉండిపోయింది.
“అటు ఇటు కానీ శిఖండిని చూపించే కదా భీష్ముణ్ణి చంపారు పాండవులు… యుద్ధం అంటే అంతే మరి. లౌక్యం తెలిసినవాడు కార్యాలను సాధిస్తాడు. యుక్తి కలిగినవాడు విజయం పొందుతాడు మరి” అంది.
నేను కుడితిలో పడ్డాను అని అర్థమయ్యింది. “కట్టుకున్న రాజు ఆమెను మళ్ళీ తీసుకొచ్చుకుని రాణిని చేసుకున్నాడు” పెద్దమ్మ తలూపింది.
“పెద్దమ్మా, ఇలాంటి ఆడమనిషి వాళ్ళకు సీత లాంటిది” అని అన్నాను.
నావైపుకు చూసి “సీతలాంటిది అని చెప్పకురా పిచ్చి వెధవా! పాంచాలి అని చెప్పు. ఆమె కూడా పతివ్రతేగా!” అని అంది.
నేను నిట్టూర్చి కొంచెం రిలాక్స్ అయ్యి “మీ మునిమనవరాలు కూడా పాంచాలి లాంటిదే. ఒకళ్ళు తక్కువంతే” అన్నాను.
“ఏంటన్నావు?” అని గట్టిగా అడిగింది పెద్దమ్మ.
“ఇప్పుడు ఆమెతో ఉంటున్నది ఆమె నాలుగో భర్త. మొదటి ముగ్గురికి కలిపి నలుగురు పిల్లలు” అన్నాను.
పెద్దమ్మ “ఆమె అక్కడి పిల్ల కదా? ఆ ఊళ్ళో ఆడవాళ్ళు మనసుకు నచ్చినవాడిని పెళ్ళి చేసుకుని పరువు ప్రతిష్టలతో గౌరవంగా సంతోషంగా బతుకుతున్నారు” అంది.
చేతిని నేలకు ఊనుకొని పైకి లేస్తూ “సెందిలాండవా, వేల్‌మురుగా” అని మూలిగి “అలాంటి ఆచారం ఇక్కడ కూడా ఉండేది కదా? కుంతికి ఆరుగురు భర్తలు కదా?” అంది.
నాకు కొంచం అసంతృప్తిగా అనిపించింది. పెద్దమ్మ మళ్ళీ “అదేమో అన్నావేంటి?” అడిగింది.
“శీలం” అన్నాను.
“పోరా, చచ్చినోడా!” అంది.
“లేదు పెద్దమ్మా, ఆడవాళ్ళకు, మగవాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కో కట్టుబాటు ఉంటుంది కదా? అది” అన్నాను. వేరే పదాలేవీ నాకు గుర్తుకు రాలేదు. “ఇప్పుడు, మగతనం అంటాం కదా అలా ఆడతనం” అని పొడిగించాను.
“అవును ఉంటాయి కదా… దాన్ని వాళ్ళు ఏమని అంటారు?” అడిగింది.
నేను ఏం తోచక ‘థింకింగ్’ అన్నాను.
ఆ మాట అనగానే “పోరా వెధవా! తిండిగోల…” అని పక్కకు నెట్టేసింది.
కొంచం ఆలోచించి బ్రేవ్ అని అన్నాను. నాకే పిచ్చిగా అనిపించింది. వెంటనే వర్జినిటీ అనబోయి ఆపుకున్నాను.
“పెద్దమ్మా, మీలాగే నేను కూడా ఒక మనిషినే అనుకుంటాం కదా అది” అని అన్నాను.
“మలయాళపోళ్ళు ‘తండ్ఱేడం’ అని అంటారు కదా?” అంది పెద్దమ్మ.
అది సరైన మాట అని నాకు అనిపించింది. తన లోకం… మై స్పేస్. ఊహూ… ‘లోకం’ ఎందుకు తోడుగా? తాను చాలు కదా! సెల్ఫ్ అన్నాను.
“అది అలమరా కదా?” అని అంది.
“అది వేరే పెద్దమ్మా, అది షె, ఇది సె” అని అన్నాను.
పెద్దమ్మ “సరేలే” అని “సెల్ఫ్” అని మెల్లగా పలికింది. తర్వాత నా వైపుకు చూసి “మెల్లగా చెప్పాలి, కదా?” అని అంది.
“అవును, పెద్దమ్మా.”
పెద్దమ్మ పైకి వినిపించకుండా పెదవులు ముడుచుకుని చెప్పి చూసుకుంది.
“అమ్మాయిలు పౌడరు రాసుకోవడానికి దూదితో చేసిన పువ్వు లాంటిది ఒకటి పెట్టుకుని ఉంటారు కదా?”
నేను “అది పఫ్ కదా?” అని అన్నాను.
పెద్దమ్మ తల ఊపి “సెల్ఫ్” అని మళ్ళీ చెప్పి చూసుకుంది.
నేను మరో ఆరు వారాలు పెద్దమ్మకు కథల ద్వారా ఇంగ్లీష్ నేర్పించాను. లవ్ అన్నమాటలో నీచమైన అర్థమేదో దాగి ఉంది అన్న పెద్దమ్మ అనుమానాన్ని నివృత్తి చేయలేకపోయాను. కాబట్టి దాన్ని డియర్ అని చెప్పుకోవచ్చని నిర్ధారించాము. పెద్దమ్మ దాన్ని నియర్‌గా మార్చుకోవడం మరసటిరోజు గమనించాను. దాన్ని దిద్దడానికి నాకు సమయం లేదు. వీసా వచ్చేసింది. ఉన్న పొలం, ఇల్లు… అమ్మకాలు పూర్తయ్యాయి. మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి, మందులు, మాత్రలు వాటికి సంబంధించిన చీటీలు తీసుకోవడానికి పెద్దమ్మను నేనే తీసుకు వెళ్ళాను.
ఆ హడావిడిలో ఇంకా చాలా పదాలు మిగిలే ఉన్నాయని గ్రహించి సులువైన మార్గాలు, కొన్ని చిట్కాలు నేర్పించాను. పలుభావాలకు ఒకటే పదం అన్న పద్ధతిని అనుసరించాను. అవసరం లేదు, అర్థం కాలేదు, తెలియదు ఇలాంటి వాటన్నిటికీ నైస్ అని; సంతోషం, మంచిది, బాగుంది లాంటివాటికి కామ్ అని చెప్పడం ఆమెకు సులువుగా ఉంటుంది అని నాకు అనిపించింది. నచ్చలేదు, ఇష్టంలేదు వంటివాటికి వెల్… అని చెప్పమన్నాను. ఒక వారంలో అలా మరో నలభై భావాలను పన్నెండు మాటలుగా కుదించేసుకున్నాం.
పెద్దమ్మను నేనే చెన్నై విమానాశ్రయానికి తీసుకెళ్ళి సాగనంపాను. ఒంటరిగానే వెళ్ళింది. బయలుదేరేప్పుడు మనసులో పలురకాల భావావేశాలతో ఆమె సన్నగా వణుకుతూ ఉండడం గమనించాను. విమానాశ్రయంలో ఆమెను అక్కడి సిబ్బంది వీల్‌చైర్‌లో తీసుకుని వెళ్ళబోతుంటే నన్ను దగ్గరికి పిలిచి “యూ ఈస్ బాండ్” అని అంది. నేను ఆమె చేతుల్ని తీసుకుని కళ్ళకు అద్దుకుంటూ “యూ ఈస్ కైండ్” అని అన్నాను. తన గుండెలమీద చేయి పెట్టుకుని “సెల్ఫ్” అని చెప్పుకుంటూ చిరునవ్వుతో వీడ్కోలు తీసుకుంది.
ఆ రోజే నేను గోమ్స్‌కి ఈమెయిల్ రాసి నా డబ్బులు వెంటనే సెటిల్ చేసేయమని అడిగి తీసేసుకున్నాను. ‘పెద్దమ్మ మాట్లాడేది ఏమీ అర్థం కాలేదు’ అని వాళ్ళదగ్గరనుండి ఒక వారం రోజుల్లో ఈమెయిల్ వస్తుంది అని నాకు కచ్చితంగా తెలుసు.
(మూలం: పెరియమ్మావిన్ సొఱ్కళ్ , మే 7, 2015)
జయమోహన్ 1962 ఏప్రిల్ 22న కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో కన్యాకుమారి జిల్లాలో జన్మించారు. ఆయన తల్లితండ్రులు మలయాళీలు. ఇరవై రెండో ఏట వామపక్ష, సామ్యవాద సాహిత్యం మీద ఆసక్తి కలిగింది. ఆ రోజుల్లోనే రాసిన ఖైది అనే కవిత; నది, బోధి, పడుగై వంటి కథలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అప్పుడు రాసిన రబ్బర్ అనే నవల అకిలన్ స్మారక పురస్కారం అందుకుంది. ఈయన రచనలన్నీ మానసిక లోతులను వివిధ కోణాల్లో అద్దం పట్టేవిగా ఉంటాయి. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని తన సిద్ధాంతానికి విరుద్ధమంటూ తిరస్కరించారు.