కోలుకోవడమే… ఇదంతా

1

మధ్యాహ్నం ఆ పిల్ల ఫోన్ చేసింది. సూర్యకిరణాల్ని షిఫాన్ చున్నీలో వడకడితే ఒంటిరంగుగా మారిన పిల్ల. అతను తర్వాత మాట్లాడదామన్నాడు. Of course, I can wait. ఒక మాట చెప్పు, Can I postpone my emotions? ఆ పిల్ల ఎక్కిళ్ళు పెడితే ఆ సన్నటి పల్చటి దేహం గుర్తొచ్చి భయమేస్తుంది. చీపురుపుల్లల్లాగా ఎముకలన్నీ కట్టగట్టినట్టు, ఉద్ధృతమైన కాంక్షాశక్తివల్ల తప్ప అవి ఒకచోట కలిసుండే వీలులేనట్టు గుమిగూడిన ఒళ్ళు తనది. బయట పడటం నా చేతుల్లో ఉందా? అనడిగింది. బ్రహ్మాండమైన చుక్కకూర వండిపెట్టిన చేతులు. మొక్కల్ని సాది, మనుషుల కణతల మీద ముద్దుచేసి మొటికలు విరిచే చేతులు. దారాలకి అద్దం బొట్టుబిళ్ళలని అతికించి గుమ్మాలకి వేలాడదీసిన చేతులు. ఏమేం ఉన్నాయి ఆ చేతుల్లో! ఆగి మళ్ళీ అడిగింది. “బయటపడటం నా చేతుల్లో ఉందా?”

2

అబ్బాయీ, పక్కనే ఉండిపోడం ఎంత ప్రమాదమో నీకెట్లా చెప్పేది?

కొత్తిమీర కట్ట కోసం కొట్లాడుకుంటాం తెలుసా మనం? నాకు అన్నీ తెలుసు, ఈమాట చెప్తే నువ్వు నమ్మవన్న సంగతితో సహా. నేను నిన్ను కన్నాను, నువ్వు నన్నెప్పటికీ కనలేవు. పిల్లాడివి కాక ఇంకేం కాదు నువ్వు. నన్నిందులోకి లాగకు. ఎంత ముద్దుచేస్తాను నిన్ను! ఎందుకు పాడుచేసుకుంటావ్?

3

ఒకటే గుండెదడగా ఉంటుంది.
జుట్టు ఊడిపోతుంది.
మందులయ్యేలోపు లావైపోతానా?
ఇంకా రాత్రుళ్ళు సరిగా నిద్ర…
……

హలో… ఉన్నావా, నీకో జోక్ చెప్పనా?
ఉన్నావా, ఉంటావా?
ఇదిగో నువ్వుండబట్టే,
ఉన్నావని ధైర్యం ఉండబట్టే,
ఇక్కడ గడియారంలో ముళ్ళు కదులుతున్నాయి,
గుండెలో ముళ్ళు మెత్తబడుతున్నాయి.
నువ్వుండబట్టే ఈ చీమలబార్లు ఇలా వరసగా, ఈ భూమి ఇలా గుండ్రంగా, ఈ గుండెదడకి మందులేసుకుంటూ నేనిలా స్థిమితంగా…

నువ్వు… ఉంటావుగా?

4

వింటర్ కేనపీల కింద చలిఖైదులో గడ్డకట్టింది నవ్వు. ఎండలో, ఆరుబయటలో మాటపెగిలి నరాలముడి సడలి కాస్త నడక, నవ్వూ… కుదురుతాయి కావచ్చు.

విడిపిస్తావా నన్ను?

ఇక్కడ రంగు, రుచి లేని మాటలు దుడ్డుకర్రలయి మోదుతున్నాయి. అడుగుదూరం నుంచి ఆరా అడిగి వెళ్ళారందరూ. ఇదిగో చెయ్యి, ఇదిగో ఒట్టి అరచెయ్యి. మనిషి స్పర్శ మర్చిపోకుండా, ఊరికే అలా తాకి చెయ్యి పట్టుకు పైకిలేపి బయటికి నడిపిస్తావా నన్ను?

5

అవును, లోకం మహా చెడ్డది. హింస వాసనైనా తగల్లేదు నీకూ నాకూ.

అయినా విషాదాన్ని మోశాం అకారణంగానే. నిరంతర దుఃఖితులుగా బతికాం ఆయాచితంగానే. ఇప్పుడీ తటస్థ బిందువు మీద నిశ్చలంగా, ఈ గాలిబుడగలో పదిలంగా ఎదురుచూస్తున్నాం. లోతుగా లోతుగా మెలాంకొలిగ్గా జీబురు జీబురుగా ఏళ్ళకేళ్ళు సాగదీశాక ఒక్కపూట, ఒక్కపూట కావాలనే, అదేంటో చూద్దామనే ఢమఢమ మెరుపుల్ని లౌడ్‌స్పీకర్లో వేసి గదిగోడలతో పిచ్చినాట్యాలు చేయించాం. మన్ని చూసి మనమే బెదిరిపోయి, మారిపోయామని మోసపోయి మనకి మనమే దూరం జరిగిపోయాం. చెక్కబడీ చెక్కబడీ తెలుసుకుని తెలుసుకొనీ, మళ్ళీ ముందులాగా గడ్డిపోచలం ఐపోదామనే కదా మనం అనుకున్నది?

6

ఉదయ మధ్యాహ్న అసురసంధ్యలన్నీ
ఒకటిగా
ఒకటిగా
ఒకటిగా
వేర్వేరుగా
క్రమశిక్షణగా ఓకేలాగా
రోజూ తిరిగి తిరిగి వచ్చేకేంద్రంలో,
కోలుకుంటున్నాం ఇక్కడే;
నొప్పి నుంచి
కోరిక నుంచి
ఖేదం నుంచి
ఛీ అనిపించడాన్నుంచి
పోన్లే అనిపించడాన్నుంచి
అసలేమీ ఆనిపించకపోవడాన్నుంచి
కోలుకుంటున్నాం ఇక్కడే
జీవనగ్రస్థత నుంచి.

మనం.