ఆకాశవంతెన 2

4

నేను తెల్లగుర్రపు సరస్సుకి బయల్దేరేసరికి, నాకు సైన్యంలో చేరుతున్నట్టనిపించింది. నేను కూర్చున్న పెట్టె నిండా నాలాగే లేబర్ ఎడ్యుకేషన్‌కి వెళ్తున్న వాళ్ళున్నారు. అందులో చాలామంది పడుచువాళ్ళే. దాదాపూ నా పరిస్థితిలోవాళ్ళే. కొంతమంది పేకాడుతుంటే మిగతావాళ్ళు పాటలు పాడుతున్నారు. బహుశా, వాళ్ళు కూడా నాలానే మేము వెళ్తున్నది కొన్ని సంవత్సరాలు పొలం పని చేయడానికి అనుకునుంటారు. మాతో పాటు వచ్చిన పోలీసు ఆఫీసర్ పెట్టెలో ఒక చివర కూర్చుని మా ఉత్సాహానికి ఆటంకం కలిగించలేదు.


తియన్ చియావ్ (Sky bridge)

ఒకచోట రైలాగింది. కొత్త పోలీసులొచ్చి అప్పటిదాకా ఉన్నవాళ్ళని రిలీవ్ చేశారు. వాళ్ళు మమ్మల్ని లారీలెక్కించారు. ఈ కొత్త అధికారులు మాతో కఠినంగా ఉన్నారు. మమ్మల్ని అరుస్తూ, అదిలిస్తూ చాలా అధికారం ప్రదర్శించారు. అయితే నేను వాళ్ళని పెద్దగా పట్టించుకోలేదు. దారి పొడుగునా కనబడుతున్న పల్లెల్ని చూస్తూ నా చిన్నప్పటి రోజులు గుర్తు తెచ్చుకున్నాను.

లారీల్లో దాదాపు ఆరు గంటలపాటు ప్రయాణించిన తరువాత మేము సరస్సుని చేరుకున్నాం. మమ్మల్ని ఒక ఖాళీ మైదానంలో ఓ లైన్‌లో నుంచోపెట్టారు. ఆ మైదానం ముందు ఇటుకలతో కట్టిన ఇళ్ళున్నాయి. ఆ ఇళ్ళలోంచి ఒకతను మా దగ్గరకి వచ్చేడు. అతను కమిసార్ [1] For the most part, law and order is a military responsibility in China. While there is a police force, it’s employees tend to be ex- military personnel. Similarly, the prison system in China including the labor education/reform camps is run by the military. A commissar is a (communist) party official in charge of a military unit.అని మాకు తర్వాత తెలిసింది.

“మీరిప్పుడు తెల్లగుర్రపు సరస్సులో ఉన్నారు. మీరంతా ఒకటవ ప్రొడక్షన్ టీమ్‌గా పని చేస్తారు. ఈరోజునించీ మీరు మీ సూపర్‌వైజర్ చెప్పినట్టు చేయ్యాలి. రూల్సన్నీ పాటించాలి. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా చేసినా కుదరదు! ఇక్కడ మీకు మూడే పనులు–పని చేయడం, చదవడం, మీ బుర్రల్ని దారిలోకి తెచ్చుకోవడం. తరువాత చెప్పలేదనుకోకండి. అతి తెలివితేటలకి పోకండి. ఈ పొలం చుట్టూ వందలకొద్దీ మైళ్ళు అడవులూ కొండలూ తప్ప మరేమీ లేవు. ఉన్న ఒక్క రోడ్డు మీదా, మీరెటువెళ్ళినా సెక్యూరిటీ గార్డులుంటారు. ఇంతవరకూ ఇక్కడ్నుంచి ఎవరూ పారిపోలేదు. మీకు నమ్మకం లేకపోతే, అదుగో వాళ్ళనడగండి.” దూరంగా ఉన్న గుంపుని చూపెడుతూ అన్నాడతను. అతను చూపెట్టినవాళ్ళు వాళ్ళ వెకిలి నవ్వులాపుకోలేకుండా ఉన్నారు. అయినా వాళ్ళు అతడి మాటలన్నీ నిజమేనన్నట్టుగా వెంటనే తలూపేరు.

“చూశారు కదా? నేను మీకు చెప్పేదొక్కటే. కష్టాలు కొని తెచ్చుకోవద్దు. ఇప్పుడు మీరీ పాత ఖైదీలతో వెళ్ళండి. వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. రేపుదయం ఆరు గంటలకల్లా పని మొదలవ్వాలి. మీకే సందేహాలున్నా ఈ పాత ఖైదీలనడగండి.”

అంతవరకూ దూరంగా గుంపుగా నుంచుని చూసిన పాత ఖైదీలు మా దగ్గరకి పరిగెత్తుకొచ్చారు. కొత్తగా వచ్చినవాళ్ళం కూడా చెల్లా చెదరయ్యాం. ఒక భారీకాయం నా పెట్టె పట్టుకోగా ఇంకొకతను నా సంచీ తీసుకున్నాడు. నేను వాళ్ళ వెనుక నడిచేను. నా సంచి పట్టుకున్నతను దాన్ని తడిమి చూడ్డం నన్ను దాటిపోలేదు.

నడుస్తూనే వాళ్ళక్కడకి రావడానికి కారణమడిగేన్నేను.

నా సంచీ పట్టుకున్నవాడు చిన్నగా నవ్వి, రెండో వాణ్ణి చూపెడుతూ, “వీడు మంచివాడు కాదు. రేపు కేసులో ఇక్కడకు వచ్చాడు. ఇక నేనంటావా, నాకు అప్పుడప్పుడూ చేతులకి కొంచెం దురదేస్తుంది” అన్నాడు.

ఆ సాయంత్రానికల్లా నా అనుమానాలన్నీ తీరిపోయినై. నేను ఈ మానభంగాలూ, దొంగతనాలూ చేసి వచ్చినవాళ్ళతో సమానమని పూర్తిగా అర్థమయింది.


నేను బాంపూఁ స్టేషన్ చేరేసరికి సాయంత్రం అయిదైపోయింది. రైల్వే ఆఫీసుకు వెళ్తే అక్కడి గార్డు ‘ఇప్పుడెవ్వరూ లేరు, తరువాతి రోజు’ రమ్మన్నాడు. గత్యంతరం లేక నేను ఆఫీసుకు ఎదురుగా ఉన్న చిన్న హాస్టల్లో గది తీసుకున్నాను.

నేను తీసుకున్న గదిలో ఇంకో ముగ్గురున్నారు. నేను గదిలోకి అడుగు పెట్టేసరికి అప్పటివరకూ మత్తుగా పడుకునున్నవాళ్ళు కాస్తా ఒక్క ఉదుటున లేచికూర్చుని “పేకాడతావా అన్నా?” అని మీద పడ్డారు.

వాళ్ళలో కొంచం వయసు మీరినవాడి పేరు లియు అట. చిన్నవాడి పేరు హూ. కొంచెం భారీ ఆకారం సన్. ముగ్గురూ ఎప్పట్నుంచో ఎరిగున్న వాళ్ళలాగా, అన్నా వాంగ్ అని పిలవడం మొదలుపెట్టారు.

నాలుగు రౌండ్లయిన తర్వాత చిన్న హు సిగరెట్టందిస్తూ అడిగేడు “ఏమన్నా వాంగ్! నీ దగ్గిరేమైనా ఉన్నయ్యా?” అని.

అతనడిగింది నాకర్థం కాలేదు.

ముసలి లియు వివరించాడు. “షాంగ్‌హాయ్ నుంచి వచ్చేవు కదా. నువ్వు ఇక్కడ అమ్ముకోడానికేం తీసుకురాలేదా?”

నా దగ్గిరేం లేవని చెప్పేను.

“పోనీ, కొనాల్సినవేమన్నా ఉన్నాయా?”

వాళ్ళంతా వ్యాపారస్తులన్న సంగతి అప్పటికి బోధపడింది నాకు. వాళ్ళు నేను కూడా వర్తకానికి ఇక్కడకొచ్చాననుకున్నట్టున్నారు.

పెద్ద సన్ తను వేరుశనక్కాయలు, మొక్క జొన్నలు, కుందేలు బొచ్చు అమ్ముతానని అన్నాడు. అయితే, తనకి అర్జెంటుగా స్టీలు కావాలట. ఏ రకందైనా ఫర్వాలేదన్నాడు. మేకులైనా తీసుకుంటానన్నాడు.

నా దగ్గర అమ్మాల్సినవీ, కొనాల్సినవీ ఏం లేవనీ, కుటుంబ వ్యవహారంలో ఇలా వచ్చాననీ చెప్పాన్నేను. వాళ్ళు వివరాలడిగేసరికి నేను నా కథంతా చెప్పాల్సి వచ్చింది.

కథంతా విని, హూ, సన్‌లు తలలు విదిలిస్తూ “ఆట సంగతి చూడండి. ఆట సంగతి చూడండి,” అన్నారు.

ముసలి లియు మట్టుకు ఆసక్తిగా, “అన్నా వాంగ్! మీ అమ్మ సమాధి కనబడింతర్వాత ఏంచేస్తావ్?” అనడిగేడు.

“కనబడుతుందో లేదో భగవంతుడికెరుక. కనబడితే మాత్రం ఆ సమాధిని అక్కడ్నుంచి మార్చడానికి ప్రయత్నిస్తాను.”

“అది మంచి పని. ఖచ్చితంగా మార్చు,” ఒక క్షణమాగి మళ్ళీ తనే, “నాకు తెలిసి ఇక్కడికి కొంచెం దక్షిణాన షిమెంగ్ కొండల్లో ఓ సమాధి స్థలం ఉంది. అక్కడికి ప్రయాణం చాలా తేలిక. ప్రశాంతమైన చోటు. నీకు అంతకన్నా మంచి ఫెంగ్ ష్వే[2]Feng Shui is something similar to our వాస్తు. Currently popular in the West as well. కనబడదెక్కడా. ధర కూడా ఫర్వాలేదు. శాశ్వతమైన స్థలం, సిమెంట్ ఫ్రేమూ, సమాధి రాయీ, అన్నీ కలిపి వంద రూపాయలు. ఇంతకు మించిన స్థలం దొరుకుతుందా?”

దొరకదని జవాబిచ్చేన్నేను.

“అంతేనా? అక్కడ శుభ్రం చేయడానికి మనుషులుంటారు. ప్రతీ సంవత్సరం, పెద్దల పండక్కి ప్రతీ సమాధికీ ఒక పూల గుత్తిస్తారు. అబ్బో, చాలా బాగుంటుంది అన్నా వాంగ్!”

ఖచ్చితంగా బాగుంటుందన్నాన్నేను.

మా అమ్మ సమాధి దొరికితే, ఉత్తర జాన్‌సూలో మా స్వస్థలానికి తీసుకువెళ్ళి మా నాన్న సమాధితో కలపాలని నా తపన.

తర్వాత రోజు పొద్దున్న నేను హాస్టల్నించి బయల్దేరటప్పుడు ముసలి లియు తన బిజినెస్ కార్డు ఇచ్చి నేను మనస్సు మార్చుకుంటే కాంటాక్ట్ చెయ్యమని చెప్పాడు. బిజినెస్ కార్డు వంక చూసేన్నేను. షిమెంగ్ హిల్స్ సమాధి వాటిక, యి తాలూకా, షిమెంగ్ హిల్స్, ఆన్ హీ, చైనా, అనుంది. వెనుక పక్క, చిన్నక్షరాలతో, ‘ప్రశాంత వాతావరణం, అందమైన ప్రకృతి, మీ బంధుమిత్రులకి చక్కటి విశ్రామ స్థలం’ అని రాసుంది.

తెల్లగుర్రపు సరస్సుని ఎవరన్నా ఎడ్వర్‌టైజ్ చెయ్యాలనుకుంటే, వాళ్ళకింతకన్నా మంచి స్లోగన్ దొరకదనిపించింది. చుట్టూరా కొండలు, మధ్యన చిన్న సరస్సు. ఒక్క చిన్న కదలిక కూడా లేని పచ్చటి నీళ్ళు. చుట్టూ ఉన్న కొండల్ని చూపిస్తున్న పెద్ద అద్దంలా ఉంటుందా సరస్సు. నేను మొదటసారి ఆ సరస్సుని చూసినప్పుడు, నాకు తెలీకుండానే కూనిరాగమందుకున్నాను. ఎంత అందమైన ప్రదేశమో అనుకున్నాను.

నేనిలా అనుకుంటుండగానే, ఏదో చప్పుడు కొండల్లో ప్రతిధ్వనించింది. సరస్సు పక్కనున్న గడ్డి పొదల్లోంచి రెండు తెల్లటి పక్షులు రెక్కలు టపటపలాడించుకుంటూ పైకెగిరిపోయినయి.

“అందమైన దృశ్యం!” అన్నాడు పొడుగు గోళ్ళు. “కానీ, ఏం లాభం? మనమీ సరస్సుని నింపి వరి పండించబోతున్నాం.[3]In China, such large scale, nature-altering projects were in vogue for a long-time and were part of the government’s effort to put every piece of land to productive use. Apparently, most such projects backfired with disastrous environmental consequences.” (4.3)

తనే అన్నాడు మళ్ళీ, “చాలా పెద్ద ప్రాజెక్టు. ముసలోళ్ళం మేమే గనుక ఈ పనంతా చేయాల్సుంటే, మేము చచ్చేట్టు పనిచేసినా పూర్తవ్వదు. మా అదృష్టం బాగుండి మీరొచ్చారు. అసలు ఈ సరస్సుని పూడ్చడానికే మీరంతా పొరపాట్లు చేసి ఇక్కడికొచ్చేరేమో!” ఆనందంగా నవ్వేడతను.

ఒక వారం తర్వాత, ప్రొద్దుటి సమావేశంలో, పొడుగు గోళ్ళని ముందుకి పిలిచేరు. కమిసార్ అతడికి మరో రెండు సంవత్సరాల అదనపు శిక్ష విధిస్తున్నట్లు చెప్పాడు.

మా పాత ఖైదీలనుంచి మేము నేర్చుకున్న మొదటి పాఠమది. తర్వాత్తర్వాత మరో రెండు విషయాలు నేర్చుకున్నాం మేము. అందులో మొదటిది–మాకు ఉత్తరాలు వ్రాసేటప్పుడు, మా వాళ్ళు స్టాంపుల మీద ఎక్కువగా జిగురు పూయాలన్నది. అలా చేస్తే, మేము ఆ జిగురుతో పాటూ తపాలా ముద్రని కూడా కడిగేసి స్టాంపుల్ని మళ్ళీ వాడ్డానికి వీలవుతుంది. రెండవది–మా వాళ్ళు సిగరెట్లని పాకెట్లోంచి తీసేసి, ఉత్తరంతో పాటూ కవర్లో పెట్టి పంపవచ్చనేది. పదహారు పైసల స్టాంపులతికించిన కవర్లో, 20 సిగరెట్లు పెట్టవచ్చు. అంటే ఒక సిగరెట్ పెట్టె మొత్తమన్న మాట. ఇరవై సిగరెట్ల బరువెంతో ఎవరికైనా తెలుసు? తెల్లగుర్రపు సరస్సులో ప్రతీ ఒక్కరికీ తెలుసు, ఎనిమిది ఔన్సులని.

5

నేను రైల్వే సెక్యూరిటీ ఆఫీసుకి వెళ్ళి కూర్చుంటే, చాలాసేపటివరకూ ఎవరూ నన్ను పట్టించుకోలేదు. ప్రతి ఒక్కరూ వాళ్ళ పనిలో నిమగ్నమై కనబడ్డారు. చివరికి నేను అటుగా వెళుతున్న ఒక యువకుణ్ణి ఆపి, సూపర్‌వైజరుతో మాట్లాడాల్సిన పని ఉందని చెప్పాను.

“ఏం పనండీ?” అడిగాడా యువకుడు.

“నేను మా అమ్మ మరణం గురించి వివరాలు కనుక్కోవాలి. అదో చాంతాడంత కథ.”

“ఎప్పుడు జరిగిందిది?”

“పంతొమ్మిది వందల అరవైలో.”

“అబ్బో! ఇరవై ఏడేళ్ళ వెనుకటి మాట. చాలా పురాతన కాలం నాటి విషయం.” గుడ్లు తిప్పేడు.

నన్ను బయట వెయిట్ చెయ్యమని ఆఫీసులోకి వెళ్ళాడు. కొన్ని నిముషాల తర్వాత తిరిగి వచ్చి, “ఎవరికీ తెలీదట” తల అడ్డంగా ఊపుతూ అన్నాడు. “అప్పటి ఫైళ్ళన్నీ కల్చరల్ రెవల్యూషన్ టైములో పోయినై.” అలా అని, అతడు నన్ను మూడంతస్తులు, చాలా కారిడార్ల గుండా తీసుకువెళ్ళాడు. నాకు మేం ఎక్కడున్నదీ, ఎటువెళ్తున్నదీ బొత్తిగా అర్థం కాని పరిస్థితిలో, చివరికి, ఒక పెద్ద గదిలో ఒక పెద్దవయసు మనిషి ముందు ఆగేం. ఈ సారి ఆ యువకుడు నా కథ నా తరపున తనే చెప్పగా, నేనూ విన్నాను.

ఆ పెద్దతను “ఇలాంటి సంఘటనే ఒకటి గుర్తొస్తుంది. కానీ ఖచ్చితంగా చెప్పలేను. గడ్డపు సన్‌ని అడిగి చూడండి. అతనికి తెలిసుండవచ్చు,” అన్నాడు.

“గడ్డపు సన్ ఎవరు?” అడిగేడు యువకుడు.

“గడ్డపు సన్ ఎవరో తెలీదా? రెండో డివిజన్ హెడ్డు. పోయిన సంవత్సరమే, నాన్‌జింగ్ రైల్వే హాస్పిటల్‌కి ప్రెసిడెంటుగా పంపేరతన్ని.”

ఈపాటికి నాకు ఆశ పూర్తిగా సన్నగిల్లింది. బహుశా, ఆ గడ్డపు సన్‌‌కి కూడా ఈ కథ పూర్తిగా తెలిసుండదు. నన్ను తీసుకువచ్చిన యువకుడు తను ఫోను చేసి కనుక్కుంటానన్నాడు, నేను అనవసరపు ప్రయాణం చేయకుండా. అతడికి నా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఈనాటి కుర్రవాళ్ళలో ఇంత మంచితనం చూడ్డం అరుదని చెప్పేను.

“అలా అనకండి.” నేనతడ్ని వేళాకోళం చేస్తున్నాననుకున్నాడులా వుంది. “దీనికి మంచితనం ప్రసక్తెందుకు? నాకు మీ కథ చాలా విచిత్రంగా అనిపించిందంతే.”

నాకు తెలుసు నా కథ విచిత్రమైందని. అది చాలా పాతది కూడా.

బాంపూఁ నుంచి నాన్‌జింగ్‌కి లైన్ ఒక పట్టాన దొరకలేదు. నాకు సహాయం చేస్తున్న యువకుడు తిట్టుకుంటూనే మళ్ళీ మళ్ళీ డయల్ చేశాడు. ఎట్టకేలకు లైన్ దొరికింది. గడ్డపు సన్ లేడక్కడ. అవతల ఫోనెత్తిన వాళ్ళు గడ్డపు సన్ కోసం వెతుకుతుండగా, ఆ యువకుడడిగేడు నన్ను, “మీ అమ్మ మరణం గురించి తెలిసినప్పుడు మీకేమనిపించింది?”

“చాలా కాలం క్రిందటి సంగతి కదా. నాకు జ్ఞాపకం లేదు.”

ఒకసారి టీవీలో లోకల్ న్యూస్‌లో చూసేను. హాంగ్ జూ హైవే[4]A highway that connects Shanghai with Hang Zhou. మీద యాక్సిడెంట్ జరిగింది. ఒక టూరిస్ట్ బస్సూ, లారీ గుద్దుకుని బస్సు ప్రేలిపోయి ఐదుగురు చనిపోయారు. డజనుమందికి పైబడి గాయాలపాలయ్యారు. నిముషాల్లో న్యూస్ రిపోర్టర్లు హాస్పిటల్‌కి వెళ్ళారు.

ఒక రిపోర్టర్ గాయపడిన మనిషి ముందు మైక్రోఫోను పెట్టి, “ఆ మంటల్లో ఉండగా మీకేమనిపించిందో చెప్తారా?” అనడిగేడు.

“థూ! నేనా మంటల్లో చావబోయి బ్రతికేను. నాకేమనిపించి ఉంటుందంటావ్?” మండిపడ్డాడు గాయపడిన వ్యక్తి.

అది సాయంత్రం ఆరున్నర గంటల న్యూస్. అదే న్యూస్ తొమ్మిది గంటలప్పుడు తిరిగి ప్రసారం చేసేసరికి ఆ సంభాషణని కత్తిరించారు.


మధ్యాహ్నం పని పూర్తయింతర్వాత, కమిసార్ వెంటనే రమ్మంటున్నాడని కాలేజీ స్టూడెంట్ కబురు తెచ్చాడు. హెడ్ క్వార్టర్స్‌కి వెళ్ళేసరికి కమిసార్ ఎదురుచూస్తూ కనబడ్డాడు.

మాట్లాడ్డం మొదలుపెట్టడానికి ముందుగా ఒక సిగరెట్టందించేడు కమిసార్. నేను వెంటనే ఒక రెండు దమ్ముల్లాగి అందులో మూడో వంతు అవగొట్టాను. అప్పటికి కొన్ని రోజులుగా నేను సిగరెట్ మొహం చూళ్ళేదు. అంతకు ముందు వ్రాసిన ఉత్తరంలో సిగరెట్లు పెట్టలేదు మా అమ్మ. కొద్ది రోజుల్లో తనే నన్ను చూడ్డానికి తెల్లగుర్రపు సరస్సుకు వస్తానని వ్రాసింది.

“మీ అమ్మ కోసం ఎదురుచూస్తున్నావా?”

“ఔను. ఆవిడ కొన్ని రోజుల క్రితమే వచ్చుండాల్సింది. నేను ఆవిడ రావడానికి పర్మిషన్ తీసుకున్నాను కూడా.”

“ఇక ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ఆవిడ రావడం సాధ్యపడదు.”

అంతకు మించి ఏం చెప్పలేదు కమిసార్. అతడిక్కూడా అంతకుమించి తెలీదు. వాంగ్ బావ్ అనే ఖైదీ తల్లి ఇక్కడికి వస్తూ మరణించిందని అతడికి ఫోను వచ్చిందట.

నేను నా హాస్టల్‌కి తిరిగి వెళ్ళింతర్వాత, నా అట్టపెట్టె తెరిచేను. అందులో ఒక జత షూస్ పాత న్యూస్ పేపర్లో చుట్టున్నాయి. నేను షాంగ్‌హాయ్ వదిలివచ్చే ముందు మా అమ్మ నాకోసం కొన్న షూస్ అవి. అంతవరకూ ఒక్కసారి కూడా తొడుక్కోలేదు వాటిని. నేను వాటికి చుట్టిన కాగితప్పొరలు విప్పి లేసులు నెమ్మదిగా కన్నాల్లో దూర్చాను. కాలేజీ స్టూడెంట్ నాకెదురుగా ఉన్న మంచమ్మీద నన్ను గమనిస్తూ కూర్చున్నాడు. మా అమ్మ విషయం అతగాడికి తెలుసును.

షూస్ వేసుకుని నేను బయటకు బయల్దేరాను. బయట కటిక చీకటి. ఆ చీకట్లో మూడు మైళ్ళు నడిచి మాకు ప్రక్కనే ఉన్న నల్లకొండపల్లె అనే చిన్న పల్లెకి వెళ్ళాను. అక్కడొక రైతు కనబడితే నా షూస్ ఇచ్చి ఒక చిన్న సంచీడు వేపిన కందులు తీసుకున్నా. ఆ చీకట్లోనే ఉత్త కాళ్ళతో నడుచుకు వెనక్కు చేరాను. నడుస్తూనే, కందులు తినడం మొదలుపెట్టాను. మా హాస్టలుకి చేరేలోపలే అవగొట్టాను వాటిని.

నేను వెనక్కి వెళ్ళేసరికి కాలేజీ స్టూడెంట్ ఇంకా మేలుకునే ఉన్నాడు. “ఎక్కడికి వెళ్ళావ్?”

“రైతులెవరన్నా కనబడతారేమోనని వెళ్ళా. నా షూస్ ఇచ్చి కందులు తీసుకున్నా.”

“నల్లకొండపల్లె కెళ్ళావా?” లేచి కూర్చున్నాడు కాలేజీ స్టూడెంట్. “బొత్తిగా లాభం లేనిపని. మూడు మైళ్ళ దూరం. నువ్వు అక్కడి నడవడానికి ఖర్చయ్యే కేలరీలకే అర సంచీడు కందులు కావాలి. మళ్ళీ వెనక్కి మూడు మైళ్ళు — ఇంకో అరసంచి. నువ్వు ఒక జత కొత్త షూస్ పోగొట్టుకున్నవ్.”

క్షణమాగి నిట్టూర్చి మళ్ళీ తనే అడిగేడు “కందులేమన్నా మిగిల్నియ్యా?”

“లేదు. అన్నీ తినేశా.”

“ఛ!”

మా అమ్మ పోయింతర్వాత నా సిగరెట్ల సప్లయ్ పోయింది. మొదట్లో మా అమ్మ ప్రతీ వారమూ మూడుత్తరాలు వ్రాసేది. అంటే అరవై సిగరెట్లు. తర్వాత్తర్వాత సిగరెట్లకి రేషన్ పెట్టడంతో దొరకడం కష్టమౌతుందని వ్రాస్తూ అతి కష్టమ్మీద, రెండు పాకెట్లు పంపేది. నేను సిగరెట్లు కాల్చడం తగ్గిస్తే నా ఆరోగ్యానికి మంచిదని బ్రతిమిలాడేది. ఆవిడకి తెలీని విషయమేంటంటే ఆవిడ పంపిన సిగరెట్లన్నీ నేనొక్కణ్ణీ కాల్చేవాణ్ణి కాదు. అందులో కనీసం మూడోవంతు కాలేజీ స్టూడెంటుకు పోయేవి.

ఆ రోజుల్లో కాలేజీ స్టూడెంట్ దాదాపూ ప్రతీ రోజూ హెడ్ క్వార్టర్స్‌కి వెళ్ళేవాడు. తనకి వెళ్ళాల్సిన అవసరం ఏ మాత్రమూ లేకపోయినప్పటికీనూ. వాడికి ఎప్పుడో గానీ ఇంటినుంచి ఉత్తరాలు వచ్చేవి కాదు. వాడు నాకొచ్చే ఉత్తరాల కోసమే వెళ్ళేవాడక్కడికి. నాకు గనుక ఉత్తరం వస్తే, “గ్రూప్ లీడర్! పాకెట్టొచ్చింది!” అని ఆనందంగా కేకలు పెడుతూ పరుగెత్తుకొచ్చేవాడు. నేను ఉత్తరం బయటకు తీస్తున్నపుడు రెప్ప వేయకుండా పెంపుడుకుక్కలా చూసేవాడు. ఇంక నేనేం చేయగలను?

వాడికి కొన్ని సిగరెట్లిచ్చేవాణ్ణి. అవి చేతపడగానే, వాడు ఒకటి నోట్లో పెట్టుకుని కొంతసేపు వెలిగించకుండా కూర్చునేవాడు, తన సిగరెట్ కోరిక పరాకాష్టకి చేరడానికి ఆగుతున్నట్లుగా. అప్పుడు వెలిగించేవాడు. దీర్ఘంగా పొగ పీల్చి మంచం మీద వెనక్కు వాలి, అడిగేవాడు “గ్రూప్ లీడర్! మీ అమ్మ ఏమని వ్రాసింది?” వాడి మనసులో, వాడు మా అమ్మను తనకూ అమ్మనే అనుకునేవాడు.

మా అమ్మ గురించి వాడు చాలా బాధపడ్డాడు. నాతో అన్నాడు. “నిజం చెప్పాలంటే, చనిపోయింది మీ అమ్మ కాకుండా మా అమ్మయితే బాగుణ్ణనిపిస్తుంది. నువ్వు నమ్మూ నమ్మకపో.” వాడి మాటల్లో నమ్మకపోడానికేం లేదు. వాడికి తన కుటుంబమంటే మహా మంట. నేను వాడు చెప్పగా విన్నదేంటంటే, వాడి కుటుంబానికి ఒక ఫాక్టరీ ఉన్నదనీ, వాళ్ళు చాలా ధనవంతులనీనూ. ఆ రోజుల్లో కూడా, వాళ్ళకి తినడానికీ, త్రాగడానికీ హద్దులుండేవి కాదు. అయితే వాళ్ళు బొత్తిగా పిరికివాళ్ళు. నేను వాడి తల్లిదండ్రుల్ని తప్పు పట్టను. కాలేజీ స్టూడెంట్ మిగతా ఖైదీల్లాంటివాడు కాదు. వాడు ఇరవయ్యేళ్ళ శిక్ష అనుభవిస్తున్న యాంటీ రివల్యూషనరీ. నాకే గనక ఇలాంటి కొడుకుంటే, నేను వాణ్ణి చితకబాదేవాణ్ణి[5]People are labeled as a “rightist”, an “anti-socialist”, or an “anti-revolutionary” — depending on the severity of the individual’s offense against the party and the state. Of these, the anti-revolutionary label is the most severe and could carry death penalty. (Of late, the government started trying the anti- revolutionaries under the treason law.) So, needless to say that anti- revolutionary son could get the entire family into trouble. As an aside, I read somewhere that during the anti-rightist movement newspapers used 40 different flavors of the rightist label..

మా అమ్మ చనిపోయింతర్వాత నేను టౌనుకెళ్ళడానికి అవకాశం దొరికినప్పుడు మాత్రమే సిగరెట్లు కొనగలిగేవాణ్ణి. అయితే అలాంటి అవకాశాలు చాలా అరుదుగా దొరికేవి. చాలావరకూ, నాకూ కాలేజీ స్టూడెంటుకూ సిగరెట్టు వాసన మాత్రమే దొరికేది–పక్కవాళ్ళు కాలుస్తున్నప్పుడు. ఇంక అస్సలు భరించలేని సమయాల్లో, మేము ఎండిన సోయాబీన్ ఆకుల్తో సిగరెట్లు చుట్టేవాళ్ళం. ఇది నేను ఒక ముసలి ఖైదీ నుంచి నేర్చుకున్నాను. ఆ ముసలి ఖైదీ నేషనలిస్ట్ ఆర్మీలో సోల్జర్. అతడు మత్తు పదార్థాలకు అలవాటుపడ్డవాడు. కొన్నిసార్లు బూడిద గుమ్మడి కాయల మీది ‘బూడిద’ని మత్తుమందుగా వాడతానని చెప్పేవాడు. అదెలా ఉంటుందని అడిగేనొకసారి.

“నిజం మత్తుమందుతో పోల్చలేం గానీ, తప్పనిసరి పరిస్థితుల్లో తేడా తెలీదు.” అన్నాడతను.

తరవాతొకసారి, మా వర్క్‌షాపులో కుర్రవాళ్ళకి నేను ఎండు సోయాబీన్ ఆకుల్తో సిగరెట్లు చుట్టుకు కాల్చేవాణ్ణని చెప్తే, వాళ్ళు అది ఎలా ఉంటుందని అడగడం మొదలు పెట్టేరు. “రెడ్ పియోనీకి[6]A Chinese brand of cigarettes; American cigarettes are considered are too light. సాటి రావు గానీ, మొదటసారి కాలుస్తున్నవాళ్ళకి అమెరికన్ సిగరెట్లకీ వాటికీ తేడా తెలియద”ని చెప్పేన్నేను.

(సశేషం)

అధస్సూచికలు[+]