తనవారంటూ ఎవరూ లేని రుద్రప్రతాప్కు చిననాటినుండీ నాట్యమంటే ప్రాణం. నాట్యానికి సంబంధించి తన కలలూ, ఆశలూ, ఆదర్శాలూ, అనుభవమూ అన్నీ రంగరించుకుని అర్ధనారీశ్వరం అన్న రూపకం తయారు చేసుకుంటాడు. దానిలో పార్వతి పాత్రను అభినయించగల ఊర్వశి కోసం దేశాన్ని జల్లెడ పడుతుంటాడు. ఉమ రూపంలో ఆమె ఒకనాటికి తారసపడుతుంది. మిత్రుడి ఆకతాయి మాటలకు చలించిన రుద్ర మనసులో, ఆమె నృత్యరూపకంలోకే కాక జీవితంలోకీ రానున్నదేమోనన్న ఊహ లీలామాత్రంగా తొణికిసలాడుతుంది. అయితే ఆమె అప్పటికే వివాహిత. భర్తకు ఈమె నాట్యం పట్ల ఉన్నతాభిప్రాయమేమీ ఉన్నట్టు కనపడదు. తన మనసులో చొరబడ్డ రుద్ర స్థానమేమిటో, ఉమ కూడా ఇతమిత్థంగా తేల్చుకోలేదు. ఈర్ష్యా ద్వేషాలు పొటమరించిన హృదయంతో నలిగే ఆ భర్త, వీళ్ళిద్దరూ కలిసి చేయబోయే రూపకానికి అడ్డు తొలగుతాడా? ఉమ తొలగించుకుంటుందా? లౌకిక బంధానికి అలౌకిక అనుభూతులను ప్రభావితం చెయ్యగలిగిన శక్తి ఉంటుందా? రుద్ర రూపకం ఎలా, ఎవరితో ప్రదర్శితమవుతుంది? అన్నది అర్ధనారీశ్వరమ్ కథ. ఇతనికి తొలినాళ్ళలో స్ఫూర్తినిచ్చిన శివాని, అద్భుతంగా నర్తించగలిగి పార్వతి పాత్ర తానే వేయాలని ఆరాటపడే నర్తకి దేవి, ప్రమథగణాల్లాంటి మిగతా శిష్యులు, రూపకానికి సంగీతం అందించే శుభ, చిననాటి నుండీ రుద్ర మనసెరిగి మసలుకునే స్నేహితుడు మదన్, ఇందులో కనపడే మిగతా పాత్రలు.
దుఃఖార్తానాం శ్రమార్తానాం శోకార్తానాం తపస్వినామ్
విశ్రాంతిజనం కాలే నాట్యమేతద్భవిష్యతి
దుఃఖితులకు, శ్రామికులకు, శోకార్తులకు, తపస్విజనులకు, నాట్యం విశ్రాంతినిస్తుందంటాడు శాస్త్రకారుడు. ఈ మాటలు నాట్యాన్ని చూసేవారికే కాదు, చేసేవారికీ వర్తిస్తాయి. ఎవరు ఎలా ఆ సాంత్వన వైపుకు అడుగులేశారో చెబుతూ సాగిన అక్షరయాత్ర ఈ అర్ధనారీశ్వరం నవల.
ముక్కోణపు ప్రేమకథేమోనన్న భ్రమను కలిగించే ఈ కథావస్తువు, నిజానికి దానికి ఆమడ దూరంలో నడుస్తుంది. ప్రేమ వీళ్ళందరి హృదయాల్లోనూ ఉంది. ప్రేమతో పాటు అసూయ, అభద్రత, కోపం, కన్నీళ్ళు, కరుణ కూడా ఉన్నాయి. కానీ, వీటన్నింటి కంటే ముఖ్యంగా కళ ఉంది. కళ తనకు తానుగా నిలుపుకున్న గౌరవం, ఒక శక్త్యావరణలా మారి ఇందులోని పాత్రలను బంధించిన తీరు, మార్చిన తీరు, విముక్తులను చేసిన తీరు అసలు కథ. కథలో కళకే సమున్నత స్థానమని నిరూపితమయ్యేందుకు అడుగడుగునా కథలో ఇమిడిపోయే సందర్భాలతోనే, మాటలతోనే రచయిత దారి వేస్తూ వచ్చారు.
కళ నా నుండి రాలేదు, నా ద్వారా వచ్చిందని రుద్ర చెప్పడం సుప్రసిద్ధ రూమీ కవితను జ్ఞప్తికి తెస్తుంది. అలా అన్నప్పుడు, అది అతని ప్రాణాలను తోడ్కొని వచ్చిన మరొక ప్రాణం లాంటిదన్న ధ్వని పాఠకహృదయాలను తడుతూనే ఉంటుంది. తొలి పరిచయంలోనే ఉమ భర్త మహేశ్, కళలు శక్తిని హరిస్తాయంటుంటే, ఇష్టం నిష్ట లేనివే తప్ప కళలు నూతనోత్తేజాన్ని నింపుతాయని రుద్ర తిప్పికొడతాడు. అందుకు రుద్ర జీవితమే నిలువెత్తు సాక్ష్యం. అతని జీవితానికి పసినాట నుండీ ఆశ నిలిపింది, ముందుకు నడిపిందీ నాట్యమే; విపత్కర పరిషితుల్లో కూడా అతను మహోత్తేజంతో చిందులేసింది నాట్యం అండతోనే. పిళ్ళై వంటి గురువు వద్ద తాను ప్రాణసమానంగా భావించే విద్య నేర్చుకుంటున్నానన్న అనిశ్చితితో తానిక నాట్యానికి దూరమవ్వాలని అనుకున్నవాడే, అసలు సాయం అతనిది కాదని తెలిసి తాండవమాడతాడు. ఇష్టానిష్టాలు కళకు అద్దే రంగులివని చెప్పకనే చెబుతాడు.
నాట్యాన్ని మానసిక వికారాలకు, వ్యక్తిగత సమస్యలకు బలి చెయ్యడం సరికాదు. మన అహంకారం వదలగలగాలి అని తీర్మానిస్తాడు రుద్ర. ఊరికే నాలుక చివరి మాటల్లా జారవిడవడం కాదు. దేవి గురించి ఆలోచిస్తూ ఈ మాటలు మననం చేసుకుని తన గురించీ పునరాలోచనలో పడటం, రూపకంలో శివుడితో సమానంగా నర్తించగల పార్వతి కోసం వెదికానా? తన పక్కన నాట్యమాడే మనిషి కోసం వెదికానా? అని మీసం తడుముకోవడం, అతనిలోని అహాన్ని గుర్తించిన క్షణాన్ని అద్భుతంగా పట్టుకొచ్చాడు రచయిత. ఈ అంతర్దృష్టీ, అంతర్యానం మొదలయ్యాక, రుద్ర మరొక మనిషి. తరువాతది మరొక జీవితం. 62వ పేజీలో ఆగిన ఈ ఘట్టం, పుస్తకానికి ఒక రకంగా ఇంటర్వల్ బేంగ్ లాంటిది.
అలాగే, ఎన్నాళ్ళగానో పార్వతి పాత్రను తాను వెయ్యాలని ఆరాటపడిన దేవిని, నాట్య ప్రదర్శనకు తీసుకోకపోవడమెందుకో వాచ్యంగా ఏమీ చెప్పడు రుద్ర. కానీ, ఎదుటివాళ్ళకు నచ్చేలా చెయ్యడం కాదు, మనకు మనకుగా నచ్చేలా చెయ్యడం ముఖ్యమన్న మాట ఆమెకు అర్థమయ్యేలా శుభ తాపత్రయాన్ని నడిమిలో నిలిపి చూపించాడు. ‘రూపకం రుద్ర సొత్తు కాదు’ అన్న మాట నవల్లో ఒకటికి రెండు సార్లు రావడమూ యాదృచ్ఛికమని అనిపించదు. ఒక కళాకారుడు అహోరాత్రాలు కష్టపడి, కలలు కని రూపొందించుకున్న ఒక రూపకం అతను ఏదో విధంగా ప్రదర్శించుకోవడంతో ఈ తరహా నవలలు సాధారణంగా ముగుస్తాయి.
నిజమే, రుద్రకు కళ అవసరం. అదతని ఊపిరి. అర్ధనారీశ్వర రూపక ప్రదర్శన అతని చిరకాల స్వప్నం. కానీ, ప్రదర్శనకు (కళకు) ఇతను అవసరం లేదు. అందుకే, రుద్ర ఊరు వదిలి వెళ్ళిపోయాక కూడా, ఉమ ఆ ప్రదర్శన కోసం పట్టుబడుతుంది. రూపకానికి సంబంధించిన అంత శ్రమా పడీ, అంతలా పరితపించిన మనిషి లేకుండానే, అది తొలిసారి ప్రదర్శించబడుతుంది. ఆ క్షణానికి అతడక్కడ అనామకుడే అయ్యాడు. వేరొకరు దాన్ని అందుకు ముందుకు తీసుకుపోయారు. చిట్టచివరికి అతను తిరిగి ఈ బృందంతో చేరాక కూడా, అతను ఏది చెయ్యాలో అదే చేశాడు తప్ప, ఏది చెయ్యాలనుకున్నాడో అది చెయ్యలేదు. సృజనలో అసందర్భంగానైనా, అసంబద్ధంగానైనా తాము చెప్పదల్చుకున్నది చొప్పించే కళాకారులు చుట్టూ ఉన్న ప్రస్తుత కాలంలో, కళ కళ కోసమే అన్న భావనను ఇంత బలంగా చిత్రించిన నవల రావడమే ఆశ్చర్యం. ఒకసారి సృజన నీ నుండి వేరు పడ్డాక, అదిక నీది కాబోదన్న మాటలను, రచయిత పండించుకున్న విధానమిది.
ప్రేమలో ఎన్నో ప్రశ్నలుంటాయి, నిందలుంటాయి, అపోహలుంటాయి. కానీ, జవాబులూ, ఓదార్పులూ అవతలి మనిషి ఇవ్వగల్గినవి కావు. ఎవరికి వారే పూరించుకోవలసినవి. కళ ప్రేమకు ప్రతిరూపం అనుకుంటే, దాన్ని మన అహాలకు బలి చెయ్యకూడదన్న మాట, బంధాలకూ వర్తిస్తుంది. ప్రేమ అయినా, కళ అయినా–రుద్రకైనా, ఉమకైనా, అహమూ, కోపమూ చల్లారేకే తిరిగి దగ్గరయ్యాయి. ఈ దృష్టితో చూస్తే, ఈ రెండు భావనలనూ నవలలో సమాంతరంగా నడిపిన తీరు అచ్చెరువొందిస్తుంది.
రుద్రకూ, ఉమకూ మధ్య ఉన్న బంధాన్ని, మొదటి నుండీ చివరి దాకా నడిపించిన పద్ధతి, అలా చెప్పడంలో రచయిత పొందుపరచిన సూక్ష్మమైన వివరాలు, ఈ కథను, పాత్రలనూ అతను స్వంతం చేసుకున్న విధానాన్ని పట్టిస్తాయి. మచ్చుకు మూడు సందర్భాలు తీసుకుంటే;
ఉమ రుద్రను మొదటిసారి చూసింది, ఆమె రూపకం పూర్తయ్యాక, రుద్ర తన స్నేహితుడితో ‘కుడి వైపు నాలుగో వరుసలో’ కూర్చుని ఉండగా. ఆ గమనింపులో ఉమ స్వగతంగా అనుకున్న మాట ఆ ప్రోగ్రాం కి వచ్చి తానూ అక్కడే కూర్చున్న గుర్తు. ఈ హాల్‌కు అక్కడైతేనే మంచి వ్యూ ఉంటుంది. అంత మంది ఉన్న సభలో, ఆమె చూపు అతని మీద పడి నిలవడానికి భౌతికమైన ఉనికిని గుర్తించడానికి, అంతకు మించి, అక్కడ కూర్చుంటేనే బాగా కనపడుతుంది చేర్పు ద్వారా, అతనూ నాట్యం గురించి ఆసక్తి కలిగిన వాడై ఉంటాడన్న ఒక సంకేతాన్ని తొలిచూపులోనే ఆమెకు వదిలాడు రచయిత.
రెండవ సందర్భంలో, ఇహనో ఈపైనో ప్రదర్శన అని రుద్ర ఊహిస్తూండగా, తానిక ప్రదర్శనలో భాగం కాలేనని, తనకు మూడవ నెల అని చెప్తుంది ఉమ, ఫోన్లో. అతనేమీ అనడు. మాట్లాడడు. నిండుమౌనం. బయటవారి దృష్టిలో రుద్రదసలు తప్పే కాదు. కానీ, ఆతని మౌనంలోని అసమ్మతి, ద్వేషం ఆమెకు అనుభవంలోకి రానే వచ్చాయి. ఆమెలో ఆ ఇబ్బంది, మూడో మనిషికి అనవసరంగా తోచే పశ్చాత్తాప ఛాయలు, కేవలం రూపక ప్రదర్శనకు రాలేకపోతున్నందుకు మాత్రమే కాదన్నది స్పష్టం. అతని కోపానికి, మౌనానికి, ఆమె ప్రేమపూరిత పిలుపుకీ, అభ్యర్థనకీ, ఒప్పుకోలునెరుగని అలౌకిక బంధమే అసలు కారణం.
మూడవ సందర్భంలో, ఆఖరు ఘట్టంలో మారువేషంలో ఉండి, రుద్ర తాను నాట్యం సరిగా చెయ్యడం లేదన్న మిషతో, ఆమెకు క్షమాపణలు చెబుతాడు. ఆమె క్లుప్తంగా ‘ఊఁ’ కొట్టి ఊరుకుంటుంది. అతనిలో చిన్నపాటి ఉలికిపాటు. అతను మాటలైతే చెప్పగలిగాడు కానీ, ఆమె ముందు దోషిలా నిలబడలేకపోయాడు. ఆమె క్షమను దోసిలి ఒగ్గి అందుకోలేకపోయాడు. ఆమె వేదన అతనిదయ్యి కృశింపజేశాక, అతని స్వప్నం ఆమె స్వంతమై సత్యమై ఋజువవుతున్నాక, ఎవరు ఎవరికి క్షమాపణలు చెప్పాలి, ఎవరు ఎవరికి కరచాలనాలతో ధన్యవాదాలందించాలి?
ఈ మూడు సందర్భాలూ పాఠకులకు చూపించినది ఈ ఉద్వేగాల పైకొసను మాత్రమే. దానిని తాకితే బద్ధలయి పొంగే లావా స్వరూపం వేరు. అతని భౌతికమైన ఉనికిని, మౌనాన్ని, మాటల వెనుక ఆంతర్యాన్ని, ఇంతలా అనుభవంలోకి తెచ్చుకోవడం, ఈ బంధం ప్రత్యేకతను ఎక్కడికక్కడ స్పష్టపరుస్తూ వస్తుంది. ప్రకృతీ పురుషుల సంయోగం కాదు, ప్రకృతీ పురుషుల అభేదత్వమే అర్ధనారీశ్వరమ్ అనడం ఎంత సమంజసం.
నాట్యం కథావస్తువైనందుకు, ఎంపిక చేసుకున్న రూపకం అర్ధనారీశ్వరం ఐనందుకు, శివానందలహరి, సౌందర్యలహరి శ్లోకాలతో కథ ముందుకు నడిపిన విధానం, ఈ నవలాశైలి పట్ల గౌరవాన్ని అమాంతం పెంచుతుంది. ఈ శ్లోకాల ద్వారా కథను ముడివేసిన విధానం, నవల స్థాయిని మరో పది మెట్లు పైకి నెడుతుంది. ప్రతీ శ్లోకంలోనూ ఒక నిగూఢమైన భావన తరచి చూసే కొద్దీ పాఠకహృదయాలను కమ్ముకుని విభ్రాంతులను చేస్తుంది. ప్రత్యేకించి, మొట్టమొదట ఇష్టం లేని నాట్యం ఎందుకు చేసావని రుద్ర ఉమను ప్రశ్నించినపుడు, ‘చెయ్యకపోయినా నా మనసు శిక్ష వేసేది’ అంటుందామె. అక్కడ సౌందర్యలహరిలోని భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వాఞ్ఛాసమధికం ప్రస్తావన ఎన్నోరకాలుగా మేటి ఎంపిక. వాంఛాసమధికం అంటే, కోరినదానికన్నా ఎక్కువ ఇవ్వడమే కదా ఆమె లక్షణం.
అలాగే, రుద్ర ఎవరో జ్ఞాపకం వచ్చాక, ఉమ తిరిగి గ్రూప్‌లో చేరబోయినప్పుడు, ఆమె ఇక రానక్కర్లేదని, వేరే వారిని రూపకంలోనికి తీసుకున్నాననీ చెప్తాడతను. ఆ సందర్భంలో శివానందలహరి నుండి ‘గాంభీర్యం పరిఖాపదం..’, వెనువెంటనే సౌందర్యలహరి నుండి ఆమె తరఫుగా ‘హీం మూలాధారే’ స్ఫురించాయని చెప్పడం–రెండూ పట్టరాని వెలుగు నింపాయా ఘటనలో. మొదటి శ్లోకం ఆతని మనసు దుర్భేద్యమైన కోట అన్న స్ఫురణనిస్తుంది. మరుసటి శ్లోకానికి భావం ఆ తల్లి మూలాధారంలో వున్న పృథివీతత్త్వాన్ని, మణిపూరచక్రం లోని అగ్నితత్త్వాన్ని, అనాహతచక్రం లోని వాయుతత్త్వాన్ని, అంతకు పైనవుండే విశుద్దచక్రం లోని ఆకాశతత్త్వాన్ని, కనుబొమలనడుమనుండే అజ్ఞాచక్రం లోని మనస్తత్త్వాన్ని వీడి సుషుమ్నా మార్గాన్ని ఛేధించుకొని సహస్రారకమలంలోని ఆమె భర్త ఐన సదాశివుడితో కూడి రహస్యంగా క్రీడిస్తున్నదని.
అంటే, ఆమె ఏ దుర్గమాలనైనా దాటుకోగల శక్తి కలదని. ఎట్లాంటి సమన్వయం!
అద్భుతంగా వాడుకోబడిన మరొక ఘట్టం గణపతి జననం. ఉమ శివుడిగా చేసింది. ఎదుట కాపలా కాస్తున్న వినాయకుడు.
తన బిడ్డ… కడుపులోనే… ఎంత మానసిక బలం లేకపోతే త్రిశూలం ఎత్తగలదు?
రుద్రను ఆవాహన చేసుకుంది.
తన సహచరిని కలవనీయకుండా అడ్డుపడే ఈ పిండిముద్ద… నరికేయాలి!
చాలా చిన్న మాటలు. కానీ లోతు అపారం. రుద్ర మౌనానికి బలైన తన కడుపులోని పిండం. అది ఏ తల్లీ తేలిగ్గా మర్చిపోగల, క్షమించగల దుఃఖం కాదు. కారణాలు, మానసిక స్థితులు, పరిణామాలు, లోపలి దుఃఖాలు ఆమె రుద్ర అయితే కానీ అర్థం కావు. ఆమె అతనైతేనే కానీ అర్థం కావు. అర్ధనారీశ్వర తత్వం సంపూర్ణంగా చూపెట్టబడాలంటే, అతని కోపం ఆమెకూ, ఆమె వేదన అతనికీ అనుభవమవ్వాలి. ఈ ఘట్టంలో నవల ఉన్న స్థితి అచ్చంగా అదే. అంత సహజంగా, స్పష్టంగా, గణపతి ఘట్టం నేపథ్యంగా చూపించడం అనితరసాధ్యమైన నేర్పు. రచయిత చెప్పినట్టు, లోనా బయటా ఉన్న అనంతత్వాన్ని అనుభూతి చేసుకోవడానికి నాట్యం.
అట్లాగే క్షీరసాగర మథనాన్ని గురించి మాట్లాడుతూ, అమ్మవారి తాటంకామహిమను చెప్పే సౌందర్యలహరి శ్లోకాన్ని అడ్డుగా పెట్టి, వైరాగ్యానికి, ఆధారం, బలం, రాగం! అన్న మాట కథతో ఎన్నో విధాల అనుసంధానించదగినది. ప్రదర్శనకు సంబంధించీ, వారిరువురి బంధానికి సంబంధించి కూడా. ఇలా, రూపకాన్ని పేరుకు మాత్రమే కాక, కథలో ఇమిడిపోయే భాగంగా చేసి నిలబెట్టారు రచయిత.
ఇలా ఈ శ్లోకాలను అర్థం చేసుకుంటూ, అనుసంధానించుకుంటూ చదవడం, ఈ పుస్తక పఠనాన్ని ఒక ఆధ్యాత్మిక, తాత్విక అనుభవంగా మార్చిందనడం అతిశయోక్తికాదు. అయితే, శివానందలహరి, సౌందర్యలహరి శ్లోకాలు తెలిసుండటం ఈ పుస్తకాన్ని చదవడానికి ముందు అవసరంగా పెట్టి ఉండాల్సింది. అది లేకపోయినా ఈ పుస్తకాన్ని చదవచ్చు కానీ, ఇందులోని సౌందర్యాన్ని పూర్తిగా ఆస్వాదించలేం. వీటితో కనీస పరిచయమైనా, ఆసక్తయినా లేకపోతే రహస్యంగా దాచిన కొన్ని అపురూప భావాలు అర్థం కాకుండా పోయే ప్రమాదమూ లేకపోలేదు. కథంతా ఒకే వరుసలో నడపకపోవడం సాధారణంగా రచనల్లో ఆకర్షణే కానీ, ఈ నవలలో గతానికీ వర్తమానానికీమధ్య కథ ఊగిసలాట సజావుగా సాగలేదు. చాలా సార్లు ఆ విరుపు సహజంగా కనపడక ఇబ్బంది పెట్టింది. ప్రత్యేకించి నాయికా నాయకుల కోసమే కాక, మిగతా పాత్రల విషయంలోనూ ఈ ముందువెనుకలుగా కథ చెప్పడం వల్ల, ఈ ముందువెనుకల ప్రయాణం లెక్కకు మిక్కిలిగా పరిణమించింది. ఈ మార్పులను పట్టుకోవడంలో ఇబ్బంది స్పష్టంగా కనపడింది. సలీం, దేవి, ఇలా ప్రతి పాత్రకూ గతాన్ని సందర్భోచితంగా చెప్పాలనుకోవడం వల్ల ఏర్పడ్డ శిల్పపరమైన ఇబ్బందిది. అలాగే చిట్టచివరి ప్రదర్శనలో స్త్రీ వేషంలో వేదికను చేరిన రుద్రను ఉమ తప్ప ఎవ్వరూ ఆఖరు దాకా గుర్తించలేదనడం, సినీమాఫక్కీ మారువేషాలను గుర్తుకు తెచ్చింది. మొట్టమొదటి నుండీ ఎంతో స్థిరంగా, బలంగా, పకడ్బందీగా సాగిన కథ నడకలో ఈ నాటకీయత ఇమడలేదు. తెలుగులో అధికశాతం రచనల లాగానే ఈ నవలకూ ఒక చక్కటి ఎడిటర్ అవసరం స్పష్టంగానే కనిపిస్తుంది.
ఈ చిన్న ఇబ్బందులను దాటుకునిపోతే వస్తువు పట్ల, వెల్లడించిన భావాల పట్ల ఈ పుస్తకం ఆసాంతమూ నిలబెట్టుకున్న నిబద్ధతకి, సాంప్రదాయకమైన వస్తువుని అధునాతన జీవితానికి, మనస్త్వత్వాలకీ అన్వయించిన తీరుకి, ‘అర్థనారీశ్వరమంటే స్త్రీపురుషుల సంయోగం కాదు, అభేదమే’నన్న మాటలకు నిలువెత్తు నిదర్శనంలా నిలబడగల ఉదాత్తమైన ముక్తాయింపునిచ్చిన ప్రతిభకి, ఈ నవల మంచి నవలగా, మంచి అభిరుచితో విలువలతో రాసిన నవలగా గుర్తుండిపోతుంది.
రచన: డా. భైరవభట్ల విజయాదిత్య
వెల: రూ 150.00
ప్రతులకు: 9448174872 (రచయిత); మెయిల్ bh.aditya369@gmail.com