ఆయనంటే అందమైన పుస్తకానికి చిరునామా. పుస్తక ప్రియులకి విజయవాడలో దర్శనీయ స్థలాల్లో నవోదయ ఒకటి. దాని అధిపతి రామమోహనరావంటే సీటు వదలని విక్రమార్కుడు. స్నేహానికి, పుస్తకాల ప్రచురణకి ఆయనొక అగ్ మార్కు. విశ్వనాథ నుండి సుజాత దాకా అందరికీ ఆయన ఆప్తుడు. పుస్తకం హస్తభూషణంగా తయారు చేయడంలో తెలుగునాట ఆయన ఆద్యుడు. ఆయన అక్షర బంధు. అంత గొప్పగా ప్రూఫులు దిద్దగలడు. నడుం విరక్కుండా కళ్ళు చెదరకుండా, అట్ట చావకుండా పుస్తకాన్ని బ్రతికించినవాడు. అకాలగర్భంలో కలిసిపోకుండా పేరున్న కొంతమంది రచనలను త్రవ్వి తీయించి, ప్రచురించి చదివింప చేసినవాడు. విశిష్ట ప్రచురణకర్తగా రామినేని అవార్డు అందుకున్న నవోదయతో అరమరికలు లేని సంభాషణం!
మీరు పెద్దగా చదువుకోకపోయినా పుస్తక ప్రచురణ రంగం లోకి వచ్చారు?
మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల స్కూలు ఫైనల్ పరీక్ష ప్యాసైన వెంటనే ఉద్యోగంలోకి చేరవలసి వచ్చింది. విశాలాంధ్ర ప్రచురణాలయంలో చేరడంలో ఉద్దేశ్యం నిత్యం పుస్తకాలతో సంబంధం ఉంటుందనీ, విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చనీ తోచింది.
మీ వామపక్ష భావాలు ఈ వ్యాపారంలో ఏ రకంగా ఉపయోగపడ్డాయి?
ప్రధానంగా ఆత్మ విమర్శ, నీతి నిజాయితీ, క్రమశిక్షణ అలవరచుకున్నాను.
పైకి చూస్తే మీరు మొహమాటం లేకుండా మాట్లాడతారు. కొద్ది గర్వం ఉన్నట్లు కనబడ్తుంది. గిరి గీసుకొని కూచ్చుంటారని తోస్తుంది?
నేను తక్కువ చదువుకున్నాననీ, మాటల్లో తప్పులు దొర్లుతాయనీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సు. దానితో రిజర్వుడుగా ఉండటం, ఉండాలని ప్రయత్నించడం, ఎవరితోనూ చొరవచేసి మాట్లాడలేకపోవడం జరుగుతూ ఉండేది. రచయితలలో ఒక్క బాపు, రమణ గార్లతో తప్ప మిగతా ఎవరితోనైనా సాధ్యమైనంత తక్కువ మాట్లాడేవాణ్ణి. సాహిత్యపరంగా గానీ, మరో విధంగా గానీ తప్పు మాట్లాడితే వారు నన్ను సరిచేస్తూ వుండేవారు. నాకు వారితో పరిచయమైన కొత్తలో ఏదో మాటల సందర్భంలో ‘ఎందరో మహానుభావులు’ శ్రీశ్రీ అన్నట్లుగా మాట్లాడాను. దానికి వారు వెంటనే సరిచేశారు. ఇప్పటికీ ఇతరులతో మాట్లాడటంలో నేను చాలా వెనుకబడే వున్నాను. నేను కొంచెం రిజర్వుడుగా వుండటానికి మరో కారణం నా పనికి అవాంతరం అనీ. నా టేబుల్ పైన కొంతకాలం క్రితం ఒక బోర్డు వుండేది. ‘నీ పని పూర్తి చేసుకో. నా పని నన్ను చేసుకోనియ్’ అని. ప్రతిరోజూ ఏమి చేశానో, ఆ రోజు సమీక్షించుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా సమయం వృధా అయినపుడు చాలా అసంతృప్తిగా వుంటాను. నేను నిర్మొహమాటంగా ఉండటం వలన ఏమీ పోగొట్టుకోలేదని అనుకుంటున్నాను.
పుస్తకాలు వ్యాపారరీత్యా ప్రత్యేకమైన వస్తువులు! లాభనష్టాలు ఎలా తేల్చుకుంటారు?
ఇది బాగా ధనం సంపాదించగల రంగం కాదు కదా! నేను మొదలుపెట్టిన రోజుకీ ఇప్పటి స్థితికీ పోల్చుకుంటే ఈ పరిశ్రమ వల్లనే నేను ఇంత ఎదిగాను అని తృప్తిపడుతున్నాను. ఉన్నదాని కోసం తృప్తిపడటం నాకిష్టం. డబ్బు పెద్దగా సంపాదించలేదు. ఒక విధంగా నష్టపోయాను. అయినా తృప్తిగా వుంది. పుస్తకాలలో వున్న లాభం ధనం రూపంలో కన్పించదు. మళ్ళీ పుస్తక రూపంలోనే వుంటుంది. స్టాకు రూపంలోనే వుంటుంది. మన దగ్గర వున్న స్టాకును అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. ప్రచురించిన పుస్తకం ప్రతీదీ అన్నీ అమ్ముడుపోతాయన్న భరోసా లేదు. పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అమ్మిన పుస్తకాలు కూడా ఉన్నాయి. అప్పటికీ అమ్మని పుస్తకాలుంటాయి. ఈ పరిస్థితికి మానసికంగా సిద్ధపడాలి. అదీ వ్యాపారం. అప్పటి పాఠకుల అభిరుచి నవలలకు, అనువాద సాహిత్య రచనలకు పరిమితమై ఉండేది కదా! అది చిన్న మార్కెట్టు కదా! నేను పాఠకుల అభిరుచిని మార్చడానికి ప్రయత్నం చేశాను. పాఠకుల అభిరుచి మేరకు పుస్తకాలను నేను ప్రచురించలేదు. నేను మంచిదనుకున్న పుస్తకాన్ని ప్రచురించటం, పాఠకులను నావైపు మళ్ళించి నేను వేసిన పుస్తకాలను కొనుక్కునేలా చేశాను.
అందువలన వ్యాపారరీత్యా లాభం కల్గిందా?
పాఠకుల ధోరణులు మారిపోతాయి కదా! రావలసినంత లాభం రాలేదు కాని ఒకరకమైన గుర్తింపు వచ్చింది. ట్రెండు ఎలా మారుతూ వచ్చిందంటే మొదట రాజకీయ పుస్తకాలు చదువుతూ వున్న వాళ్ళుండేవారు. తరువాత స్త్రీలు గృహిణులుగా వుంటూ చదువుకోవాలనుకునేవారు. ఆ కాలంలో పుస్తక పఠనం పెరిగింది. సీరియల్ నవలలు, రచయిత్రులు వ్రాసిన నవలలు పెరిగాయి. డబ్బున్నవాళ్ళు డబ్బులేనివాళ్ళు కూడా వీటిని చదివారు. అలా చదువుకోడానికి శక్తి చాలక అద్దె పుస్తకాల దుకాణాలని ఆశ్రయించేవారు. చదివే అలవాటు కోసం పుస్తకాలని కొనుగోలు చేయడం ఉంది. ఎక్కువగా లేదు. ఈ మధ్య తగ్గింది.
ఈ బాగా అమ్ముడుపోయే రచయితల పుస్తకాలను ఎక్కువగా ప్రచురించాలని మీరు భావించలేదు కదా! అలా వేయక పోవటం వ్యాపార లక్షణం కాదే!
వాస్తవమే. నేను ప్రయత్నించలేదు. ప్రయత్నిస్తే వారి రచనలు ఇచ్చేవారేమో, నాకు నచ్చిన పుస్తకాలే వేయాలి. మా సంస్థ తరఫున అచ్చుకావాలని కోరుకొనే రచయితలవే ప్రచురిద్దాం అనుకొన్నాను. ఇతరులతో పరిచయం పెంచుకొని ప్రచురించడానికి సుముఖత చూపించలేదు. ఇందువలన వ్యాపార దృష్టి తగ్గి వుండవచ్చు.
కమర్షియల్‌గా విజయవంతమైన పుస్తకాలు ప్రచురించారా?
కొడవంటిగంటి, నార్ల, గోపిచంద్ వంటి వార్ల రచనలు ప్రచురించినప్పుడు ఇవి పేరుపొందిన రచయిత్రుల నవలలంత వేగంగా అమ్మకపోవచ్చు. కానీ మా సంస్థకు మంచి పేరు, స్థాయి వుంటుందని భావించాను. వీరివి కొన్ని ద్వితీయ ముద్రణలు కూడా వేయగలిగాను. నార్లవారి వివాదాస్పద నాటకాలు బాగానే ముద్రణలు పడ్డాయి.
కోస్తా జిల్లాల ప్రచురణకర్తలకి ఇతర ప్రాంత రచయితలు కనపడరు అని అనుకునే రచయితలున్నారు?
నాకు అలాంటి ఉద్దేశ్యం ఏమీ లేదు. ఉంటే నామిని రచనను ప్రచురించను కదా! వేశాను కదా! మనం ప్రచురణ సంస్థను ఆరంభించినపుడు మన దగ్గరకు వచ్చినవారిలో ఎంపిక చేసుకోవటం సహజం. పథకం ప్రకారం ఫలానా రచయితల పుస్తకాలు మన సంస్థ తరఫున రావాలని యోచించి తీసుకోవటం అరుదు. నాకు చొరవ తక్కువవటం వలన నేను ఎక్కువమందిని కలవలేదు. దానివలన రావలసినంత లాభం రాకపోయి వుండవచ్చు.
అప్పటికీ ఇప్పటికీ వెయ్యి ప్రతుల కంటే ఎక్కువ ప్రతులను ప్రచురణకర్త ప్రచురించలేకపోతున్నాడేమి?
వెయ్యి కంటే ఎక్కువ కాపీలు అమ్మిన సంఘటనలున్నాయి. ఒకప్పుడు కనీసం రెండువేల ప్రతులు ప్రచురించిన రోజులున్నాయి. నార్లవారివి రెండువేల కాపీలు వేశాం. గోపీచంద్‌గారి పుస్తకాలు ఏదైనా సరే రెండువేలు వేసేవాళ్ళం. రెండు మూడు సంవత్సరాలలో అమ్మగలిగే వాళ్ళం. అప్పుడు గ్రంథాలయ వ్యవస్థ కూడా పటిష్ఠంగా వుండటం ఒక కారణం.
మీరు వామపక్షేతర సాహిత్యం వైపు మొగ్గు చూపించారేం? వామపక్ష సాహిత్యం ఎక్కువగా పఠించే కాలం కదా అది?
మేము సంస్థను ఆరంభించిన రోజులలో రష్యను ప్రచురణల అనువాదాలు వేశాం. తరువాత విశాలాంధ్రకి వామపక్ష భావాల పుస్తకాల మార్కెట్టు కేంద్రీకృతమవటం వలన ఇతర మార్కెట్టులో మేము ప్రవేశించటంతో ఆ పుస్తకాల ప్రచురణ తగ్గించాము.
ఇప్పుడు కథల పుస్తకాలకి ఆదరణ ఉందా?
ఈమధ్య కాలంలో ఉన్న ఆదరణ ఏమన్నా వుంటే కథల పుస్తకాలకే. అత్యధికంగా వేయి కాపీలు అమ్మగలం. నవలలు కొనటంలేదు. కవిత్వం కొనటంలేదు. బాల సాహిత్యం, నాటకాలు, నాటికలు తక్కువే. ఇప్పుడు వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు అమ్ముడుపోతున్నాయి, తర్వాత కథల పుస్తకాలు అమ్ముడుపోతున్నాయి.
ఇప్పుడు నాటకాల పుస్తకాలకు గిరాకీ లేదేమి?
ఒకప్పుడు కొనేవారు. ప్రజా సంఘాలున్నపుడు కొనేవారు. మా భూమి, ముందడుగు వంటి నాటకాలను ప్రతి ఊరిలోనూ ఒక సాంస్కృతిక దళం వుండి వేస్తూ వుండేవారు. పుస్తకాలు అమ్ముడుపోయేవి. ఇప్పుడు చాలా తక్కువగా పోతాయి.
కవితా సంకలనాలు?
పెద్ద రచయితలకు తప్ప కవితా సంకలనాలకు పెద్ద మార్కెట్టు లేదు. ఎప్పుడూ లేదు. అప్పుడు శ్రీశ్రీ, ఆరుద్ర, సోమసుందర్, తిలక్–ఇలాంటి కొద్దిమందివి మాత్రమే కొనేవారు.
ఒక రచయితవి ఒక ప్రచురణకర్త అతని రచనలను ప్రచురిస్తూ విదేశాలలో ప్రఖ్యాతి పొందినట్లుగా మన రాష్ట్రంలో ఎందుకు జరగటంలేదు?
అందుకు కావలసిన మూలధనాన్ని పెట్టుకొని పబ్లిషర్ అనేవాడు రంగంలోకి దిగిన దాఖలాలు ఆంధ్రదేశంలో లేవు. ఎమ్. ఎన్. రావుగారి లాటి వాళ్ళున్నారేమో! అదీ అనుమానమే. మిగిలిన వారంతా పుస్తకాలు ప్రచురించుకుంటూ దాంట్లోంచే పెంచుకుంటూ వెళ్ళడం తప్ప, బైట నుంచి పది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పుస్తకాలు వేద్దామనుకొనే పరిశ్రమ లేదిక్కడ. ఒక రచయిత రచనలను పూర్తిగా ప్రచురిద్దామంటే పెట్టుబడి జాస్తీగా కావాలి. ఏ ఒక్కరికీ ఆ శక్తి లేదు. ఎక్కువ పెట్టుబడి ఈ రంగంలోకి రాలేదు.
రచయిత్రుల కాల్పనిక సాహిత్యం విరివిగా వచ్చిన రోజులలో కూడా వారిని మీ సంస్థ ఎందుకు ఆహ్వానించలేదు?
వాళ్ళు చాలా లీడింగ్ రైటర్సుగా ఉన్నపుడు, వాళ్ళ చుట్టూ ఇతర ప్రచురణకర్తలు తిరుగుతున్నపుడు నేనెవర్నీ అడగలేదు. అడిగితే ఎలా వుండేదో తెలియదు. ఉదాహరణకు వాసిరెడ్డి సీతాదేవి గారున్నారు. ఆవిడొచ్చి మీ బానర్మీద నా పుస్తకం ఒకటి రావాలండీ అన్నారు. తప్పకుండా వేస్తానండి అన్నాను. వెంటనే ప్రచురించాను. అది నాకు ఎంతో గర్వకారణం. ఇక ముళ్ళపూడి వెంకటరమణగారి పుస్తకాలు ప్రచురించాక మా సంస్థ కొత్త మలుపు తిరిగింది. ఇది ఆనందం కల్గించిన విషయం నాకు. శ్రీశ్రీ పుస్తకం వేయమన్నపుడు క్రెడిట్ ఫీలయ్యా.
ఎమ్.ఎన్. రావుగారు ఒక ముంపులా వచ్చి పుస్తక ప్రచురణ, పంపిణీలో ఉద్యమం తీసుకువచ్చారు. కానీ మిగిలిన ప్రచురణకర్తలెవ్వరూ ఇప్పటికీ దానిని పోలిన చొరవను చూపించలేకపోయారేం?
ఆయన ప్రతీదీ సర్వే చేసి దాని ఫలితాలు అంచనా వేసి మొదటి నుంచీ వ్యాపారం చేశాడు. ఇప్పటివరకు అలా శాస్త్రప్రకారం వ్యాపారం చేసినవాళ్ళెవరూ లేరు. ఒక మోతాదులో వెళ్ళిపోవటం, ఎదురుదెబ్బ తగిలితే కాసేపు ఆగిపోవటం, మళ్ళీ వెళ్ళటం అదే జరుగుతోంది. ఆయన అలా కాదు. మొదట పంపిణీ పెట్టుకున్నాడు. ఏ పుస్తకం ఎలా పోతోందో గమనించాడు. ఎమెస్కో మొదలెట్టాడు. నాలుగు నాలుగు చొప్పున పుస్తకాలు వేశాడు. రెగ్యులర్ పుస్తకాలు వేశాడు. ఆయన బ్రతికుంటే ప్రచురణ రంగంలో అద్భుతాలు చేసేవాడు.
ఒక వ్యక్తి అంతటి విపణి పరిజ్ఞానంతో వ్యాపారం చేస్తే, మీ విజయవాడ ‘పుస్తక సంఘం’ ఏర్పడి ఇన్నేళ్ళయినా శాస్త్రీయ ధోరణిలో వ్యాపారాన్ని ఎందుకు మలచుకోలేకపోయారు?
నేను రాష్ట్రస్థాయిలో పుస్తక విక్రేతల సంఘం, ప్రచురణకర్తల సంఘం ఏర్పాటు చేసినవాణ్ణి. వీరినందరినీ ఒక త్రాటిపై తీసుకురావాలని కొన్ని పద్ధతులలో అందరినీ నడపాలని ప్రయత్నించినవాణ్ణి. ప్రభుత్వంతో రాయబారాలు జరిపి కొన్ని సాధించినవాణ్ణి. నాకర్థమయిందేమిటంటే, హక్కులు మాత్రమే చూసుకోవటం, సంపాదించుకోవటం, సాధించుకోవటం వరకే ఎవరికైనా కుతూహలం వుంటుంది కాని బాధ్యతలు మోయడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. బాధ్యతలంటే, ప్రచురణకర్తగా కొన్ని ఎథిక్సు – నీతి నియమాలుంటాయి. వాటికి లోబడి ఉండాలి. లోబడి చేయడానికి ఎవరూ సుముఖంగా లేకపోవటం, చేయాల్సి వచ్చేసరికి ఎవరి దారి వారు చూసుకోవటం జరుగుతుంది. మేము అపజయం పొందినది అక్కడ. ఏ వ్యాపార సంఘంలోనయినా ఇలాగే జరుగుతుందేమో మరి నాకు తెలియదు.
గ్రంథాలయాలకు పుస్తకాల కొనుగోలు చేసే యంత్రాంగంపై ప్రచురణకర్తల ప్రభావం ఉండటం లేదేం?
ప్రభుత్వం పాత్ర చాలా వుంటుంది. గ్రంథాలయాలను విజయవంతంగా నడపటం, అవి పనిచేయడం ప్రభుత్వ బాధ్యతల వలన సమకూరుతాయి. గ్రంథాలయాలు పుస్తకాలు కొన్నపుడే ప్రచురణకర్తల సరుకు కదుల్తుంది. గ్రంథాలయాలకు నిధులు విడుదల చేయనపుడు ప్రచురణకర్తలేమీ చేయలేరు. విడుదల చేసినంత కాలం నిధుల వలన ప్రచురణ రంగం బాగానే బాగుపడింది. గత పది సంవత్సరాలుగా గ్రంథాలయాలకు కదలికే లేకపోయింది. పెద్దగా కొనుగోళ్ళే లేవు. మనం వెళ్ళి చెప్పుకుంటే తప్ప ప్రచురణకర్తల సంఘం ఉనికినే ప్రభుత్వం గుర్తించటంలేదు. ఐక్యత లేకపోవటం వలన, ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండకపోవడం వలన ప్రచురణకర్తలు నష్టపోతున్నారని నేను అనుకుంటున్నాను.
పుస్తకాలు ఎక్కువగా అమ్ముడుపోవటం లేదు. దీనికి కారణాలేమిటి?
ప్రధానంగా తాత్కాలికంగా వచ్చిన పొంగు ఎలక్ట్రానిక్ మాధ్యమం. దీనివలన పుస్తక వ్యాపారం దెబ్బతింది. తిరిగి మళ్ళీ పుస్తకానికి గుర్తింపు వస్తుంది. భవిష్యత్తుంది అని నమ్ముతున్నవారిలో నేనొకడిని. ప్రస్తుతానికి పుస్తకాల అమ్మకం తగ్గింది. దీనికి సి.డి., టెలివిజన్ కూడా కారణాలు. పిల్లలు ఇంగ్లీషు మీడియమ్‌లో చదువుకుంటే చదువుకున్నారు. రెండవ భాషగా తెలుగు బదులు సంస్కృతం వైపు మళ్ళడం వల్ల తెలుగు మటుమాయమైపోతోంది. సంస్కృతం వలన ఇంటర్లో మార్కులు బాగా వస్తున్నాయని ఆనందిస్తున్నారు తప్ప మన పిల్లలు తెలుగు చదవలేకపోతున్నారే అని ఎవరూ బాధపడటంలేదు.
ప్రచురణకర్తగా మీ ప్రయోజకత్వం ఏమిటి?
పుస్తకం నేను చేసిన టెక్నిక్స్ వల్ల అమ్ముడయినదని నేనెప్పుడూ అనుకోలేదు. పుస్తకంలో రచయిత ఇచ్చిన కంటెంట్ (విషయం) పాఠకుడిని ఆకర్షించడం వలన అమ్ముడుపోయిందనే అభిప్రాయం నాది. పుస్తకాన్ని వీలయినంత వరకు అందంగా తీసుకురావటం, బైండింగ్ విషయంలో ఎంత చిన్న పుస్తకమయినా సెక్షన్ కుట్టుతో ఉండాలి, బాగా దెబ్బతినేవరకు పుస్తకం చదువుకోడానికి వీలుగా వుండాలి అని కోరుకోవటం, అందంగా గెటప్ ఇవ్వడం–ఇవి నేను శ్రద్ధగా చేసే పనులు. వీటికి రచయితతో నిమిత్తం లేదు.
తెలుగు పుస్తకం ధర ఎక్కువగా లేదూ?
అలా అంటే నాకు బాధ కల్గుతుంది. అది వాస్తవం కాదు. ఎవరూ ఇంగ్లీషు పుస్తకం ధరతో పోల్చిచూడటం లేదు. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోయే ఇంగ్లీషు పుస్తకం వంద పేజీల పుస్తకం వంద, రెండు వందల రూపాయలు పెడ్తూ వుంటే తెలుగులో వంద పేజీల పుస్తకం 50 రూపాయలు పెడితే ఎక్కువ పెట్టారని గిలగిలలాడిపోతారు.
ఎవరైనా ప్రచురణ రంగంలోకి వచ్చి వ్యాపారం చేస్తానంటే ఏ సలహా ఇస్తారు? వద్దంటారా?
డబ్బు పెట్టి ఒక పది సంవత్సరాలపాటు దీంట్లో లాభం రాకపోయినా సరే మీరు నిలదొక్కుకొనగల శక్తి వుందనుకుంటే దిగమంటాను. లేకపోతే వద్దంటాను. దీంట్లోంచి ఆశించవద్దు. మీ జీవన విధానం వేరే వనరుల మీద సాగించండి. పదేళ్ళ తర్వాత తప్పకుండా మీకు లాభం ఇస్తుందంటాను.
మీరు ప్రభుత్వ దృష్టికి తెచ్చిన ప్రచురణకర్తల సమస్య లేమిటి? సాధించినదేమిటి?
గ్రంథాలయ సంస్థలు ఏ పుస్తకాలు ప్రచురణకర్తలు ప్రచురిస్తారో వారి దగ్గరే కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. కాని కొనుగోలుపై 25 శాతం కనీసం కమీషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. దానిని 12.5 శాతానికి తగ్గించమని కోరాం. సాధించాం. తరువాత మాలో ఐక్యత లేకపోవటం వలన వెనక్కి వెళ్ళిపోయి నష్టపోయాం.
బాపు-రమణలతో పరిచయం మీకు కొత్త అధ్యాయం అన్నారు కదా ఎలా?
రమణగారి రచనల్లోని ప్రత్యేకత జనరంజకత. ఎక్కువమందిని ఆకర్షించటం మా సంస్థకు గుడ్‌విల్ నిచ్చింది. అలాగే బాపుగారు అప్పటికే అందరికీ తెలిసినవారవటం, ఆయన మా పుస్తకాలు ప్రతిదానికీ బొమ్మ వేయడం మా కంపెనీకి ‘లోగో’ చిత్రించటం మాకు అదనపు ప్రత్యేకతను ఇచ్చింది.
ఎమ్.ఎన్. రావుగారు, విశాఖపట్నం వరహాలు చెట్టిగారు మీకు గౌరవనీయులు, ఆదర్శమూర్తులు? ఎంచేత?
మొదటి విషయం వారు ఇద్దరూ ఎమ్.ఏ. చదువుకొని ఈ వ్యాపారంలోకి వచ్చినవారు. నన్ను ఆశ్చర్యం కల్గించిన విషయం – సెట్టిగారు అజాతశత్రువులనీ, కొన్ని పద్ధతులు పాటిస్తారని తెలుసుకొని గౌరవించాను. అలా నేనూ ఫాలో అవాలనుకున్నాను. కస్టమర్స్‌తో ఆయనలా మర్యాదగా మాట్లాడటం నేర్చుకొన్నాను. ఎంతవరకూ నెగ్గానో తెలీదు. రావుగారి లాటి స్థాయిని అందుకోవటం కష్టం అని తెలుసుకున్నాను. ఆయనకున్నంత పరిజ్ఞానం మనకి లేదు. ఆయన రోజుకి 18 గంటలు పనిచేసేవాడు. అంతలా కాకపోయినా, అలా కష్టపడాలి అని తెలుసుకున్నాను. ఆయన వ్యాపార పద్ధతులు కొన్ని ఆకళించుకొని అమలుపరచడానికి ప్రయత్నించాను.
మీది ఆదర్శ వివాహమా?
ఆదర్శం కాదు. కాని ప్రేమ వివాహం. ఝాన్సీతో నా పెళ్ళికి అటు 75 రూపాయలు, ఇటు 75 రూపాయలు ఖర్చు అయ్యాయి. నా చిన్న వయసులో మా చిన్నక్క లోలాక్షి కులాంతర వివాహం చేసుకుంది. అది ప్రేమ వివాహం కాదు. ఇతరులు కుదిర్చిన పెళ్ళే. కులాలను అవకాశమున్నంత వరకు పట్టించుకోకూడదనే భావనతో జరిగిన వివాహం అది. మా అబ్బాయి సుధాకర్ కులాంతర వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో నేను కూడా ఒక మంచిపని చేయగలిగానని ఫీల్ అయ్యాను. పెళ్ళిళ్ళు ఆర్భాటంగా చేయడం నాకు నచ్చదు. నా ఇద్దరు పిల్లల పెళ్ళిళ్ళు రిజిస్ట్రారు ఆఫీసులో ఎవరినీ ఆహ్వానించకుండా జరిపాను. నేను మరో విధంగా నిర్వహించలేను.
మీరు జీవితంలో పోగొట్టుకున్నది?
ఒక మంచి అవకాశం పోయింది. నాకు ఫోటోల పిచ్చి. కుటుంబ సభ్యులందరికీ ఫోటోలు తీయించి గతం నెమరు వేసుకుంటూంటాను. అలాటిది ఎంతోమంది ప్రముఖులైన రచయితలు విశ్వనాథ, గోపీచంద్, శ్రీపాద, కొడవటిగంటి, మొక్కపాటి, రావిశాస్త్రి, నార్ల, హనుమచ్చాస్త్రి, ఆరుద్ర… ఇలా మా సంస్థకు వచ్చినపుడు వారితో కలిసి ఫోటోలు తీయించుకోలేకపోయానే అని ఫీలవుతూ వుంటాను.
మీ జీవితం ఇలా కొనసాగితే చాలు అనుకుంటున్నారా?
చాలు. నేను ఇప్పటివరకు కమ్యూనిస్టు భావాలతో జీవించాను. ఇక ముందు కూడా ఆ భావాలతోనే వుంటానని అనుకుంటున్నాను. నేను ఆ పార్టీలో ఏనాడూ సభ్యుడ్ని కాను. నన్ను కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడిగా చేరమని అడగలేదు. నా తదనంతరం నాకు అంత్యక్రియల పేరుతో ఏలాంటి కార్యక్రమం నిర్వహించటం నాకిష్టం లేదు. నా తదనంతరం నా శరీరంలో అన్ని భాగాలు మెడికల్ కాలేజీ విద్యార్థులు ఉపయోగించాలని నా కోరిక.
[పత్రిక, దీపావళి ప్రత్యేకసంచిక నవంబర్ 2005 నుండి అనుమతితో పునర్ముద్రణ – సం.]