తొలి అయిదు దశాబ్దాలలో, అంటే 1981-82 వరకు, వచ్చిన హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ, బెంగాలీ సినిమాలతో పోలిస్తే తెలుగు సినిమారంగానికి రెండు ప్రత్యేకతలున్నాయి. చాలా మంది పాటల రచయితలు ప్రథమంగా పేరొందిన కవులు కావడం, అలాగే సంగీత దర్శకులు మంచి గాయకులు కూడా కావడం. ఈ గాయకులైన సంగీత దర్శకులలో భానుమతి, నాగయ్య, సాలూరి రాజేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎ. ఎం. రాజా, ఎం. ఎస్. రామారావు, సుసర్ల దక్షిణామూర్తి, గురజాడ (జి.కె.) వెంకటేశ్, రమేష్ నాయుడు పేర్లు అందరికీ బాగా తెలిసినవే. ఈ సంచికలో సి. ఆర్. సుబ్బురామన్, పామర్తి వెంకటేశ్వరరావు, కె. ప్రసాదరావు, మాస్టర్ వేణు, బి. గోపాలం పాడిన కొన్ని పాటలు విందాం. ఇంకా బి. ఎన్. ఆర్ (భీమవరపు నరసింహరావు), బాలాంత్రపు రజనీకాంతరావు, టి. వి. రాజు, జె. వి. రాఘవులు, ఆకుల నరసింహారావు, అద్దేపల్లి రామారావు, అప్పారావు (ఇంకా ‘చక్రవర్తి’ పేరుతో పేరు గడించకముందు)… చాలా మంది ఉన్నారు కదా అంటే, నిజమే, వారి పాటలు మరొక సంచికలో విందాము. అప్పటి వరకు ఈ పది పాటలు.
మొదటి రెండు పాటలు: పాపులలో కడు పాపి, విరజాజుల వలపు, పెళ్ళికూతురు (1951) చిత్రంలోనివి. ఈ సినిమాకు సంగీత దర్శకుడైన సి. ఆర్. సుబ్బురామన్ ఈ రెండు పాటల్ని ఎం. ఎల్. వసంతకుమారితో కలిసి పాడారు. ఈ రెండు పాటల గురించి సినీ సంగీత విమర్శకుడు వి. ఎ. కె. రంగారావు చాలా సార్లు వివరంగా రాసి వున్నారు కాబట్టి నేను మరల కొత్తగా వీటి గురించి మరొక సారి చెప్పనవసరం లేదనుకుంటున్నాను. సుబ్బురామన్, చెంచులక్ష్మి (1943) చిత్రంలో నాయకుడి పాత్ర వేసిన సి. నారాయణరావుకు ప్లేబ్యాక్ పాడారని అంటారు కానీ నాకు ఆ రికార్డు(లు) ఇంతవరకు దొరకలేదు. తరువాతి రెండు పాటలు పామర్తి వెంకటేశ్వరరావు, కె. ప్రసాదరావు పాడినవి. పామర్తి సుమారు 70-80 సినిమాలకు (ఎక్కువగా డబ్బింగు సినిమాలు, ఉదా. గాంధారీ గర్వభంగం, దేసింగురాజు కథ, శ్రీశైల మాహాత్మ్యం సినిమాల్లో గొప్ప పాటలున్నాయి.) సంగీతం నిర్వహించినా ఆయనను ముఖ్యంగా ఘంటసాలకు సన్నిహితుగాడుగాను, సహాయకుడుగానే ఎక్కువమంది భావిస్తారు. పామర్తి పాడిన పాట ఏ సినిమాలోనిదో నేను ఒకసారి సరి చూసుకోవలసి వుంది. పామర్తి గొంతును పెళ్ళిచేసి చూడు (1952) సినిమాలో కూడా వినవచ్చు. కె. ప్రసాదరావు 1950-54 మధ్య కాలంలో నాలుగయిదు సినిమాల్లో పాడారు, ఉదాహరణకి ధర్మదేవత, దీక్ష సినిమాల్లో. ఇక్కడ మీరు వింటున్న పాట నవ్వితే నవరత్నాలు (1951) సినిమా లోనిది. ఈయన కూడా ఎక్కువమందికి పెండ్యాల నాగేశ్వరావుకి సహాయకుడిగానే తెలుసు.
మాస్టర్ వేణు సంగీత దర్శకుడిగా నిలదొక్కుకొనక ముందు రెండు ప్రైవేటు పాటలు పాడారు. ఆ రెండు పాటలు ఇక్కడ. చివరిగా బి. గోపాలం పాడిన నాలుగు ప్రైవేటు పాటలు. ఎక్కువ మందికి ఆయన ప్రజానాట్యమండలి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ తానే బాణీ కట్టి పాడిన ‘చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా’ (పల్లెటూరు సినిమాలో ఘంటసాల ఈ బాణీనే వాడుకున్నారు), ‘శాతవాహన తెలుగు చక్రవర్తుల … పలనాడు వెలలేని మాగాణిరా’ (పులుపుల శివయ్య రచన. కేవలం ఈ పాటపైన చేకూరి రామారావు తన చేరాతలులో ఒక వారం రాశారు. ఇదే పాటను బి. గోపాలం గళంలో పల్నాటి యుద్ధం (1966) సినిమాలో వినవచ్చు.) లాంటి ఉత్తేజ పూరిత గేయాలే తెలుసు. కానీ ఆయన విజయవాడ రేడియో స్టేషన్ తొలిరోజుల్లో, అంటే 1948-1950 ప్రాంతంలో, పాడిన ఎంకి పాటలు, దేవులపల్లి ధనుర్దాసు నుండి పాడినవి, చివరి రోజుల్లో పాడిన వేమన పద్యాల వరకు ఆయన పాటల విస్తృతి చాలా పెద్దది. ఇక్కడ మీరు వినబోయే వాటిలో ‘అంతేలే పేదల గుండెలు’ అన్న పాట శ్రీశ్రీ రచన. ‘చూపులో సిరి చిందు రేడా’ పాట కొనకళ్ళ వెంకటరత్నం రచన. ఎ. పి. కోమలతో కలిసి శాస్త్రీయ బాణీలో పాడిన ‘మరుకేళి తేలించరా’ పాట రచన ఎవరిదో తెలియదు.
‘ఈ చల్లని రేయి తిరిగి రానేరాదు’ అన్న పాటను గతంలో ఒకసారి ప్రస్తావించాను. ఆరుద్ర ఈ పాట రచనా కాలం గురించి, రిహార్సల్స్ ఎలా జరిగాయో, చివరకు విడుదల కాని సినిమా గురించి తన సినీ మినీ కబుర్లు వ్యాస శీర్షికలో చాలా వివరంగా చెప్తారు. రమేష్ నాయుడు సంగీత దర్శకత్వంలో రావు బాలసరస్వతి పాడిన బాణీ బాగా ప్రాచుర్యం పొందినా రికార్డుగా బి. గోపాలం పాటే ముందుగా వచ్చింది.
బి. గోపాలం సినిమాల్లో పాడిన పాటలు సుమారు ఒక పదిహేను ఉంటాయి. ప్రైవేటు పాటలు, రికార్డులపై వచ్చినవి కూడా దాదాపు అదే సంఖ్యలో ఉంటాయి. ఎప్పటికయినా బి. గోపాలం గురించి సమగ్రంగా ఒక వ్యాసం రాయాలనే కోరికైతే ఉంది. ఆయన చివరి రోజుల్లో (1995-2005 మధ్యల్లో) మంగళగిరిలో వుంటున్నప్పుడు ఒక గంట సేపు సంభాషణ రికార్డు చేసుకునే అవకాశం కలిగింది.
ఇది ఈమాట 20 ఏండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భం కాబట్టి బోనసుగా ఒక రెండు అరుదైన పాటలు. పుట్టిల్లు (1953) చిత్రం నుంచి. ‘ప్రజానాట్య మండలి’ సినిమాగాను, జమున తొలి చిత్రం గాను అందరికీ తెలిసినా సినిమా వ్యాపార పరంగా విజయవంతం కాకపోవటంతో ఎన్నో మంచి పాటలున్నా (ఉదా. మనది భారత దేశమమ్మా – ఎ.పి.కోమల – అయ్యపు వెంకటకృష్ణయ్య రచన, జోజో లాలీ జోజో కుమారా సుందరాకారా – జిక్కి, నాజర్ చెప్పిన బుర్రకథ) అవి మూలన పడిపోయాయి. కనుమోయి నెలరాజా అన్న పాట బాణీ బహు జనాదారణ పొందిన ‘ఘర్ ఆయా మేరా పర్‌దేశి’ (ఆవారా, 1951) పాటకు పూర్తిగా అనుకరణ అని తెలిసిపోతుంది. కానీ ఈ రికార్డుపైన అనూహ్యంగా సినిమాలో లేని ఒక పాటను జోడించారు. అదేమిటో కూడా వినండి.
మాస్టర్ వేణు, బి. గోపాలం పాటల రికార్డులు జె. మధుసూదనశర్మగారివి. ‘పుట్టిల్లు’ పాటల రికార్డు మన్నం (మనసు) రాయుడుగారు సేకరించింది.
- పాపులలో కడు పాపి (పెళ్ళికూతురు, 1951) – సి. ఆర్. సుబ్బురామన్, ఎమ్. ఎల్. వసంతకుమారి.
- విరజాజుల వలపు (పెళ్ళికూతురు, 1951) – సి. ఆర్. సుబ్బురామన్, ఎమ్. ఎల్. వసంతకుమారి.
- ఏమిటో ఈ జగతి (అదృష్టదీపుడు, 1950) – పామర్తి వెంకటేశ్వరరావు.
- టిక్కు టిక్కుల నడకల (నవ్వితే నవరత్నాలు, 1951) – కె. ప్రసాదరావు, ఎ. వి. సరస్వతి.
- ఓహో సుందరి ఆనందరూపిణి – మాస్టర్ వేణు.
- రావోయి రావోయి రా చందమామ – మాస్టర్ వేణు.
- అంతేలే పేదల గుండెలు – బి. గోపాలం.
- చూపులో సిరి చిందు రేడా – బి. గోపాలం.
- మరుకేళి తేలించరా (స్వామి) – ఎ. పి. కోమల, బి. గోపాలం.
- ఈ చల్లనిరేయి తిరిగి రానే రాదు – బి. గోపాలం, ఆరుద్ర.
- కనుమోయి ఓ నెలరాజా (పుట్టిల్లు) –
- ఆత్మబలిదానం (పుట్టిల్లు) –