[ఈ వ్యాసం మొదట రామస్వామి 1829లో రాసిన Biographical Sketches of Dekkan Poets పుస్తకానువాదాన్ని ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ ఈ ఏడు ప్రచురిస్తున్నప్పుడు ఆ పుస్తకానికి ముందుమాటగా రాశాం. దురదృష్టవశాత్తు ఈ వ్యాసాన్ని ప్రచురణకు ముందు చివరి ప్రూఫ్ మేము చూడలేకపోవడంతో తప్పులేమీ దిద్దలేకపోయాం, మరీ ముఖ్యమైన రెండు సవరణలు కూడా చెయ్యలేకపోయాం. 1. ఈ వ్యాసకర్తృత్వం వెల్చేరు నారాయణరావు, పరుచూరి శ్రీనివాస్ ఇద్దరిదీని. 2. 17వ ఫుట్‌నోట్‌లో రిఫరెన్స్ తప్పుగా ఇవ్వబడింది. ఈ రెంటినీ ఈమాట ప్రచురణలో సవరించాం.]
కల్నల్ మెకంజీకి (Colonel Colin Mackenzie) సహాయకులుగా పనిచేసిన కావలి సోదరులని గురించి దక్షిణ భారతదేశపు 19వ శతాబ్దపు చరిత్రలో గొప్పగా చెప్పుకుంటారు. కావలి సోదరులు మనకి తెలిసినవాళ్ళు అయిదుగురు; కావలి వెంకట నారాయణప్ప, వెంకట బొర్రయ్య, వెంకట లక్ష్మయ్య, వెంకట రామస్వామి, సీతయ్య[1]వీళ్ళకు లక్ష్మీదేవమ్మ అనే ఒక సోదరి కూడా వుంది. ఈ అయిదుగురు సోదరుల్లో నారాయణప్ప, సీతయ్యల పేర్లు అంత తరచుగా కనిపించవు. వీళ్ళలో ఎవరు పెద్ద, ఎవరు చిన్న అన్న విషయంలో సందిగ్ధత ఉంది. మెకంజీకి నలుగురే తెలుసు. లక్ష్మయ్య రాతల్లో ఒక సోదరుని పేరు నరసింహులుగా చెప్తాడు.
C.V. Ramachandra Rao. 2003. The Kavali Brothers, Col. Colin Mackenzie and the Reconstruction of South Indian History and Cultural Resurgence in South India, Nellore: Manasa Publications. (p. 24, Footnote 1.)
Mantena, Rama Sundari. January 2013. The Origins of Modern Historiography and Indian Intellectual History. In A special issue on the work of Professor Velcheru Narayana Rao, in eemaata webzine. //eemaata.com/em/issues/201301/2048.html.. వీళ్ళు ఏలూరులో పుట్టారు. వీళ్ళు నియోగులు. ఈ నియోగులు పుట్టుకతో బ్రాహ్మణులే అయినా బ్రాహ్మణ వృత్తులు ఏమీ చేసేవారు కాదు. బ్రాహ్మణ వృత్తులు అంటే పౌరోహిత్యం, పెళ్ళిళ్ళు చేయించడం, పెద్ద కులాల వాళ్ళ ఇళ్ళల్లో పూజలు చేయించడం, దానాలు పుచ్చుకోవడం మొదలైనవి. ఈ బ్రాహ్మణ వృత్తులు చేసేవారిని దరిమిలా వైదికులు అనేవారు. వైదికులు కాని వాళ్ళు నియోగులు. ఈ నియోగులు లౌకిక వ్యవహారాలలో, రాజకీయ రంగంతో సహా, అన్నింటిలోను నిష్ణాతులు. ఊరి వ్యవహారాలని సమర్ధంగా చక్కపెట్టటం, పదుగురిలో పెద్దవాడనిపించుకోవటం యుక్తియుక్తంగా మాట్లాడటం, వీళ్ళకి బాగా అలవాటైన విద్యలు. వీళ్ళు చాలా భాషల్లో సమర్థులు. ఆయా భాషల్లో చక్కగా ముత్యాలకోవలాంటి అక్షరాలతో రాయగల నేర్పు వీళ్ళకి ఉండేది.
నియోగులని చారిత్రకంగా చూస్తే రెండు రకాలుగా కనిపిస్తారు. ఒకరు స్వయంగా రాచరికం నెరపి కొన్ని గ్రామాలకు అధిపతులై ధనవంతులుగా ఉండేవారు. వీళ్ళ పేర్ల చివర మంత్రి, అమాత్య, ప్రెగ్గడ ఇలాంటి బిరుదులుండేవి. ఉదాహరణకి భీమేశ్వరపురాణాన్ని అంకితం తీసుకున్న బెండపూడి అన్నయమంత్రిని గురించి శ్రీనాథుడు రాసిన పద్యాలు చూడండి. అలాగే కంకంటి పాపరాజు ఉత్తరరామాయణంలో ఆరువేల నియోగులను గురించి గొప్పగా చెప్తాడు[2]శ్రీనాథుడు. శ్రీ భీమేశ్వర పురాణము, మదరాసు: క్రొత్తపల్లి వేంకట పద్మనాభశాస్త్రి, 1901.
ఏమంత్రి కులదైవమిందుశేఖరుడు దక్షారామభీమేశుడఖిలకర్త
యేమంత్రి యేలిక యిక్ష్వాకుమాంధాతృరామసన్నిభుడైన వేమనృపతి
యేమంత్రి సితకీర్తి యేడువారాసుల కడకొండయవులచీకటికిగొంగ
యేమంత్రి సౌభాగ్య మిగురుఁగైదువజోదు లాలిత్యలీలకు మేలుబంతి (1-20)
యతఁడు కర్ణాటలాటబోటాంగవంగకురుకుకురుకుంతలావంతిఘూర్జరాది
నృపసభాస్థానబుధవర్ణనీయసుగుణమండనుఁడు బెండపూఁ డన్నమంత్రివరుడు
అరబీభాష తురుష్కభాష గజకర్ణాటాంధ్రగాంధారఘూ
ర్జరభాషల్ మళయాళభాష శకభాషా సింధు సౌవీర బ
ర్బరభాషల్ కరహాటభాష మఱియుం భాషావిశేషంబుల
చ్చెరువై వచ్చు నరేటియన్ననికి గోష్ఠీసంప్రయోగంబులన్ (1-72)
అన్నయమంత్రిశేఖరుఁడ హమ్మదుసేనువదాన్యభూమిభృ
త్సన్నిధికిన్ మదిన్సముచితంబుగ వేమమహీంద్రసురేంద్రరా
జ్యోన్నతి సంతతాభ్యుదయ మొందఁగఁ బారసిభాష వ్రాసినం
గన్నులపండువై యమరుఁ గాకితమందలి వర్ణపద్ధతుల్ (1-73)
కంకంటి పాపరాజు. ఉత్తర రామాయణము, 1951. మదరాసు: సి.వి. కృష్ణా బుక్‌డిపో. (పీఠిక, 27వ పద్యము.)
అఖిలరాజాధిరాజాస్థానజనహృద్యవిద్యావిహారు లార్వేలవారు
కల్పకబలికర్ణకలశార్ణవోదీర్ణవితరణోదారు లార్వేలవారు
సజ్జనస్తవనీయసతతనిర్వ్యాజపహారిపరోపకారు లార్వేలవారు
ఘనదుర్ఘటస్వామికార్యనిర్వహణప్రవీణతాధారు లార్వేలవారు
విమతగర్వాపహారు లార్వేలవార లట్టి యార్వేలవారిలో నలఘుకీర్తి
వెలయు శ్రీవత్సగోత్రారవింద హేళి మహితగుణశాలి వల్లభామాత్యమౌళి.
స్వయంగా రాజకీయ అధికారాన్ని నెరపకపోయినా ఒక చిన్న రాజు దగ్గర పెద్ద మంత్రిగా పనిచేసి కాకతి గణపతిదేవుడి దగ్గర తన రాజుకి ప్రాముఖ్యం సంపాదించి పెట్టిన తిక్కన, తరవాతి కాలంలో అబ్దుల్ హసన్ కుతుబ్ షా దగ్గర మంత్రులుగా పనిచేసి రాజకీయ వ్యవహారాలు నడిపిన అక్కన్న, మాదన్నలు – ఈ కోవలో వాళ్ళే[3]చాటుపద్య మణిమంజరిలో ప్రభు-మంత్రి-ప్రశంసా స్తబకము చూడండి. తెలుగు బ్రాహ్మణులలో ఈ నియోగి, వైదిక భేదాలు ఎప్పుడు ఏర్పడ్డాయో నిక్కచ్చిగా చెప్పడం కష్టం కాని ఇంచుమించుగా కాకతీయుల కాలం నుంచి ఈ భేదాలు ఉన్నట్టు చారిత్రకులు ఊహిస్తున్నారు. [వేటూరి ప్రభాకరశాస్త్రి (సం). 1988. చాటుపద్య మణిమంజరి; రెండవ భాగము, హైదరాబాదు: మణిమంజరి ప్రచురణము, వేటూరి ప్రభాకరశాస్త్రి మెమోరియల్ ట్రస్ట్.]
కొమర్రాజు లక్ష్మణరావు ఈ విషయమై ‘ఆంధ్ర బ్రాహ్మణుల లోని నియోగివైదికిభేద కాల నిర్ణయము’ అని ప్రామాణికమైన వ్యాసం రాశారు (1923). గురజాడ శ్రీరామమూర్తి రాసిన బెండపూడి అన్నమంత్రి చారిత్రము (1906), రాయన భాస్కరమంత్రి చరితం, (1900); కె.వి. భూపాలరావు రాసిన మహామంత్రి మాదన్న (1982) కొందరు ప్రముఖ నియోగి మంత్రుల చరిత్రలు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాయి.
కొమర్రాజు లక్ష్మణరావు. 1923. లక్ష్మణరాయ వ్యాసావళి (ప్రథమసంపుటము), చెన్నపట్టణము: విజ్ఞానచంద్రికామండలి.
గురజాడ శ్రీరామమూర్తి. 1906. బెండపూడి అన్నమంత్రి చారిత్రము, కంతేరు: దేశోపకారి ముద్రాక్షరశాల.
గురజాడ శ్రీరామమూర్తి. 1900. రాయన భాస్కరమంత్రి చరితం, కాకినాడ: సుజనరంజని ప్రెస్.
భూపాలరావు, కె.వి. 1982. మహామంత్రి మాదన్న, హైదరాబాదు: సావిత్రీ సదనము..
నియోగులు మంత్రులుగా, సామంత రాజులుగా, ప్రభువులుగా, రాజ్యం చిన్నదయినా రాజ గౌరవాన్నంతటినీ కల్పించి పొగిడే కవులని ఆదరించి, వాళ్ళ పుస్తకాలు అంకితం పుచ్చుకొని, వెలిగిన రోజులు బ్రిటిష్‌వాళ్ళు రాగానే ఆగిపోయాయి.
రెండవ రకమైన నియోగులు మంత్రి, ప్రెగ్గడ లాంటి బిరుదులతో దాదాపుగా రాజుల్లాగా వ్యవహరించలేదు. కాని, పల్లెటూళ్ళలో వ్యవహారాలు చూడటంలో గట్టి పట్టు సాధించారు. వీళ్ళు రాజదర్పం కనిపించేట్టు ఉండేవారు కాదు. వీళ్ళు ఏ ప్రభువుకో, రాజుకో సేవకులుగా చేరి ఆయన సమీపంలో అణకువగా శరీర భంగిమల్లో కనిపించే వినయంతో తల వంచుకుని ఉండేవాళ్ళు. 19వ శతాబ్దిలో బ్రిటిష్‌వాళ్ళు అధికారంలోకి వచ్చాక వాళ్ళ సేవకులుగా వాళ్ళకు కావలసిన పనులు చేసిపెట్టేవాళ్ళు. సూక్ష్మగ్రాహులు కాబట్టి ప్రభువుగారి అభిప్రాయం ఏమిటో ఆయన మాటల్లో చెప్పక్కరలేకుండా ఆయన ముఖకవళికలని బట్టి, శరీరపు భంగిమలని బట్టి, గొంతులో హెచ్చుతగ్గుల్ని బట్టి గ్రహించి వారికవసరమైన పని పరమ సమర్థంగా నిర్వహించేవారు. నిర్వహించి ఆ పని తాము చేసినట్టు ఎక్కడా చెప్పుకునేవారు కాదు.
ఈ రెండవ రకమైన నియోగులు కావలి సోదరులు[4]ఈ సందర్భంలో రామస్వామి తాము మామూలు లేఖకులుగా పనిచేసే నియోగులం కాము అని విజయనగర సామ్రాజ్యంలో మంత్రులుగా, రాయబారులుగా పనిచేసినవారమని చెప్పుకుంటాడు. (Ramaswami, 1829, p. 154.). తన దగ్గర పనికి కుదిరిన కావలి సోదరులు పరమ సమర్థులని గ్రహించడానికి మెకంజీకి ఆట్టే కాలం పట్టలేదు[5]మెకంజీ 01 ఫిబ్రవరి 1817న జాన్‌స్టన్‌కు రాసిన ఉత్తరం:
Hill, D. 1834. Biographical Sketch of the Literary Career of the late Colonel Colin Mackenzie, Surveyor-General of India; […] contained in a letter addressed by him to the Right Hon. Sir Alexander Johnston, V.P.R.A.S &c., Journal of the Royal Asiatic Society, Vol. 1, No. 2, pp. 333-364.
Mackenzie, W.C. 1952. Colonel Colin Mackenzie: First Surveyor-General of India, Edinburgh: W. & R. Chambers Ltd.. మెకంజీకి రాని అనేక భాషలు ఈ సోదరులకి వచ్చు. వీళ్ళు శాసన లిపుల్ని సమర్థంగా చదవగలరు. పాత తాటాకు కవిలెల్ని క్షుణ్ణంగా విశదీకరించగలరు. ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామ సమాచారం సర్వమూ కూలంకషంగా గ్రహించగలరు. బ్రాహ్మణులు కాబట్టి ఆ ఊరి కరణంతో (కరణం కూడా నియోగే) తగు రీతిలో పరిచయం పెట్టుకుని అతన్ని దగ్గర చేసుకోడానికి కావలసిన యుక్తులన్నీ వాడగలరు[6]మెకంజీ సహాయకులలో ఎక్కువ భాగం నియోగులు కావటం, ముఖ్యంగా మెకంజీ దగ్గర పనిచేసిన నారాయణరావు గురించి Wagoner (2003) చేసిన చర్చను చూడండి.
Wagoner, Phillip. 2003. “Precolonial Intellectuals and Production of Colonial Knowledge”, Comparative Study of Society and History, Vol 45, No. 4, pp. 783-814.. ఈ కావలి సోదరులు ఎక్కడ చదువుకున్నారో, భారతీయ భాషల్లో, లిపుల్లో ఎక్కడ తర్ఫీదు పొందారో సరి అయిన సమాచారం లేదు. ఏదో ఒక రోజున చారిత్రకులు వీళ్ళ జీవితాల్ని సమగ్రంగా పరిశీలించి వీళ్ళ వల్లే (అందులో ముఖ్యంగా బొర్రయ్య వల్ల) మెకంజీ అంతవాడయ్యాడని మనకి వివరంగా చెప్తారని ఆశిద్దాం. ఒక్క రమ మంతెన మాత్రం వివరంగా బొర్రయ్యను తొలి చరిత్రకారుడిగా వర్ణించి గౌరవించింది[7]Mantena, Rama Sundari. 2012. The Origins of Modern Historiography in India: Antiquarianism and Philology 1780-1880, New York: Palgrave Macmillan..
ఈ లోపున మెకంజీ గురించి మనకి కొంత తెలియాలి. మెకంజీ స్వయంగా ప్రాచీన కాలపు వస్తువులు, సమాచారం సంపాదించి ప్రాచీన జ్ఞానవేత్తగా పేరు తెచ్చుకోవాలనే ఆశ కలవాడు. కాని క్రమక్రమంగా అతను చారిత్రక సమాచారం మీద దృష్టి పెట్టాడు. చారిత్రకంగా యథార్థం అని చెప్పదగ్గ విషయాలని, వాటితో కలిసి పోయి వున్న పౌరాణిక కథలు, మత విశ్వాసాలు ఇలాటి వాటినుంచి విడదీసి సంగ్రహించాలనే పట్టుదలతో పనిచేశాడు. ఈ పనిలో అతనికి కావలి సోదరులు (ముఖ్యంగా బొర్రయ్య) అపారంగా తోడ్పడ్డారు. కావలి సోదరులని చుట్టుపక్క గ్రామాలకి చారిత్రక సమాచారం కోసం పంపబోయేటప్పుడు మెకంజీ వాళ్ళకి వివరంగా కొన్ని సూచనలు చేసి అవి కాగితం మీద రాసి పంపించేవాడు. ఈ సూచనలని అవసరాన్ని బట్టి మళ్ళా మళ్ళా సవరించేవాడు కూడా[8]Hints or Heads of Inquiry for Facilitating our Knowledge of the More Southerly Parts of the Deckan, 1800, OIOC, MSS Eur F 128/213, pp. 3–6 మెకంజీ తన సహాయకులకోసం తయారుచేసిన ఈ సూచనల జాబితాను ఒకదాన్ని మాకందించిన ఫిలిప్ వాగొనెర్‌కు మా ధన్యవాదాలు.. దీనిని బట్టి మెకంజీకి చారిత్రక యథార్థం మీద పట్టుదల వుందని బోధపరచుకొని దాన్ని పురాణ కథలనుండి, మత విశ్వాసాల నుండి వేరు చేసి అందించేవారు కావలి సోదరులు. ఈ యథార్ధాలు కావలి సోదరులు–ముఖ్యంగా బొర్రయ్య, లక్ష్మయ్య–తమ భాషలో రాశారని, స్థానిక కరణాలు చెప్తుండగా లేదా ఇతర స్థానికులు చెప్తుండగా వాటిని విని తమకు కావలసినట్లు పరిష్కరించి రాసి మెకంజీకి ఇచ్చేవారని చెప్పడానికి కావలసిన ఆధారాలున్నాయి. ఈ దృష్టి తోటే కరణాలని ప్రథమ చారిత్రకులుగా వర్ణించడానికి అవకాశం వుంది. మెకంజీ సోదరులకు సమాచారమిచ్చే కరణాలే స్వయంగా తమ దగ్గరున్న సమాచారాన్ని చారిత్రక అవసరాలకి అనుకూలంగా తిరగ రాసి కావలి సోదరులకి ఇచ్చేవారు కూడా. మొత్తం మీద కావలి సోదరులు, వాళ్ళతో పనిచేసిన గ్రామ కరణాలు అప్పటి చారిత్రక అవసరాలకు అనువైన వచనాన్ని తయారు చేశారు. దీని వెనకాతల ప్రధాన స్ఫూర్తి మెకంజీదే అయినా దాన్ని అమలు పరచడంలొ నేర్పు కావలి సోదరులది, ఆనాటి కరణాలది.
బొర్రయ్య చాలా చిన్న వయసులో చనిపోయాడు. ఆ తర్వాత లక్ష్మయ్య, రామస్వామి మెకంజీతో పని కొనసాగించారు. మెకంజీ చనిపోయిన తర్వాత కలకత్తానుంచి లక్ష్మయ్య తిరిగి వచ్చి మద్రాసులో ‘హిందూ లిటరరీ సొసైటీ’ అధ్యక్షుడిగా గౌరవకరమైన స్థానంలో వుండేవాడు. ఈ సందర్భంలో లక్ష్మయ్య ఉదరపోషణకోసం తెల్ల దొరసానులకు తమిళ పాఠాలు చెప్పే మున్షీగా నెలకు అయిదు వరహాల జీతం చొప్పున వృత్తి స్వీకరించాడు అని ఆరుద్ర రాశాడు. ఈమాట ఆరుద్ర ఏ ఆధారంతో రాశాడో కాని నిజానికి లక్ష్మయ్య చాలా గౌరవంగా బతికాడు. లక్ష్మయ్య జూలియా థామస్‌కి (Julia Thomas) తమిళ పాఠం చెప్పిన మాట నిజమే. చాలా అణకువగా, ఆవిడకు కుదరకపోతే బయట కూర్చుని తన పని సావకాశంగా చేసుకుంటూ ఆవిడకు వీలు కుదిరినప్పుడు పాఠం చెప్పిన మాటా నిజమే. కాని ఈ పని ఉదరపోషణ కోసం చేసిన పని కాదు. అతనికి అప్పటికే తగినంత డబ్బు వచ్చే జాగీరు, దానితో పాటు పెద్ద ఎత్తులో (300 రూపాయిలు) పెన్షన్ వచ్చేవి. నిజానికి లక్ష్మయ్య మద్రాసులో అడుగుపెట్టగానే తనకీ, తన సోదరుడు రామస్వామికీ జోడు శాలువలు, ఒక పల్లకీ, వెండికర్రలతో ముందు నడిచే ఇద్దరు చోపుదార్లు, గొడుగు పట్టుకుని నడిచే మనిషి మూడు తరాల పాటు కావాలి అని మద్రాసు బోర్డ్ ఆఫ్ రెవెన్యూ వారిని అడిగాడు. ఈ కోరికను కలకత్తా నుంచి కుంఫిణీ ప్రభుత్వం సమర్థించింది కూడా. అయితే రామస్వామికి మద్రాసు బోర్డ్ ఆఫ్ రెవెన్యూ వారు పల్లకీ ఇవ్వలేదు. కేవలం జోడు శాలువలు మాత్రం ఇచ్చారు. అయినా అతనికి 60 రూపాయిలు పెన్షన్ ఇచ్చేవారు.[9]India Office Records and Private Papers: IOR/E/4/939, p176: 1830-1835, IOR/E/4/945, p1420: 1830-1835.
Mantena, Rama Sundari. 2012. The Origins of Modern Historiography in India: Antiquarianism and Philology 1780-1880, New York: Palgrave Macmillan. p.97.
మెకంజీ వదిలి పెట్టిన అనేక రికార్డులు, కైఫీయత్తులు పరిష్కరించడం కోసం అప్పటి కుంఫిణీ ప్రభుత్వం వారు చేసిన ప్రకటన చూసి ఆ ఉద్యోగం కోసం లక్ష్మయ్య అర్జీ పెట్టుకున్నాడు. నిజానికి ఆ పని చేయడానికి ఏకైక సమర్ధుడు లక్ష్మయ్యే. అయినా కుంఫిణీ వారు విలియం టేలర్‌కి (William Taylor) ఆ ఉద్యోగం ఇచ్చారు[10]IOR/E/4/954, p32: 1838-1842, IOR/E/4/760, p511: 1839-1842.
Also see: Prinsep, James. 1836. Report of the Committee of Papers on Cavelly Ventaka Lachmia’s proposed renewal of Col. Mackenzie’s investigations, The Journal of The Asiatic Society of Bengal, Vol. 5, pp. 511-513. ఈ టేలర్‌కి భారతీయ భాషల్లో అక్షరజ్ఞానం లేదు. భారతీయులంటే ఇంచుకంత కూడా గౌరవం లేదు[11]టేలర్ రాతల్లో అతనికి జాత్యహంకారం, భారతీయులంటే చిన్న చూపు స్పష్టంగా కనపడుతుంది.
“The alancarum, or rhetoric of poetry, must never be mistaken for truth. It is far more chaste, as far as I know, than the Persian style; but it is nevertheless monstruous and absurd. From the prevalence of poetry in Hindu composition, the simplicity of truth is almost always disguised. The painful result is that the Hindu mind has become familiarized with lying. Truth is insipid. Evidence loses its force. A brilliant comparison is deemed proof. It must not be forgotten that the phrenological construction of the Hindu skull is of the lower order of the Celts, and very inferior to the broad Saxon. […] Besides it would seem that there is more development of the cerebellum, and greater sensuality, than in the Anglo-Saxon formation. The poetry of the Hindus runs rampant on sexualities. […] The Hindu mind cannot go beyond itself; […] it is probably defective as to the higher degrees of intellectual power.
Taylor, William. 1857. A catalogue raisonnée of oriental manuscripts in the Library of the (late) College, Fort Saint George, now in charge of the board of examiners, Madras: Fort St. George Gazette Press (Introduction, iv).. సి. పి. బ్రౌన్ (C. P. Brown) మాటల్ల్లో చెప్పాలంటే ఈ టేలర్ ‘an ignorant illiterate man’[12]Brown, Charles Philip. 1978. Literary Autobiography of Charles Philip Brown, Tirupati: Sri Venkateswara University, P. 48.. ఈ పరిస్థితులన్నీ గమనించిన రామస్వామికి ఇంగ్లీషు ప్రభువులకి సేవకుడిగా ఉండటం కన్నా తనే స్వయంగా రచయితగా, సమాచార ప్రవర్తకుడిగా ఇంగ్లీషులో పుస్తకాలు రాసి ప్రకటించి పేరు తెచ్చుకోవచ్చు అనే అభిప్రాయం గట్టిగా కలిగి ఉండాలి.
మొదటినుంచి రామస్వామిలో ఒక స్వతంత్ర ప్రవృత్తి ఉండేది. అది ఇంగ్లీషు ప్రభువులకి పొగరుమోత్తనంగా కనిపించింది[13]Ramachandra Rao, C.V. (ed.). 1975. Kavali Venkata Ramaswami’s Biographical Sketches of the Dekkan Poets, Nellore: The Nellore Progressive Union. P. 15.. తన కాళ్ళ మీద తను నిలబడి ఇంగ్లీషు వాళ్ళను తన చందాదారులుగా చేర్చుకుని పుస్తకాలు ప్రకటించడం రామస్వామిలో ఒక విశేషమైన ప్రజ్ఞగా గమనించాలి. అంతే కాదు, ఇంగ్లీషు వాళ్ళకి ఏది అవసరమో అదే స్వయంగా రాసి ఇవ్వగల లౌక్యుడు రామస్వామి. ఇంగ్లీషు వాళ్ళకి దక్షిణదేశపు వంటకాలు ఎక్కువ ఇష్టం. అందుకని తెలుగు వంటకాల వివరాలతో ఇంగ్లీషులో పాకశాస్త్రం (1836) రాసి ప్రచురించాడు రామస్వామి. అలాగే విశ్వగుణ దర్శన (1825). ఇద్దరు గంధర్వులు ఆకాశ విహారం చేస్తూ ఒకరు చెప్పిన మాటని ఇంకొకరు కాదంటూ వాదప్రతివాదాలతో చమత్కార జనకంగా ఉన్న ఈ సంస్కృత పుస్తకం ఇంగ్లీషు వాళ్ళకి చాలా ఆసక్తికరంగా వుండి వుంటుంది. ఆ మాటకొస్తే అది ఇప్పటికీ మనకి ఆసక్తికరమైన పుస్తకమే[14]వెల్చేరు నారాయణరావు, ముందుమాట, విశ్వగుణాదర్శ చంపు, తానా ప్రచురణ, 2011.. దానిలో వుండే ఆధునికతని గుర్తించి దాన్ని అనువాదం చేసి ఇంగ్లీషు వాళ్ళకి అందించిన మేధావి రామస్వామి.
రామస్వామిలో ఆ కాలపు నియోగులకుండే అణకువ, యజమానికి ఏం కావాలో గ్రహించి తాను ఆ పని చేస్తున్నట్లు కనిపించకుండా వినయంగా ఆ పని చేసి పెట్టే నేర్పు, ఏ కోశానా లేవు. లేవు సరికదా దొరల కోసం సమాచారం సేకరించి పెట్టి ఆ సమాచారం మీద గౌరవం వాళ్ళకే అప్పచెప్పే పని చెయ్యకుండా ఆ పని తన పేరుతోనే ఎందుకు చెయ్యకూడదు అని సగర్వంగా అనుకున్న వ్యక్తిత్వం రామస్వామిది. ఈ పనిలో రామస్వామి పూర్తిగా దొరలకి కావలసిన పనే చేసిపెట్టాడు. కాని ఆ పని తన పేరుతో అది కూడా ఇంగ్లీషులో చేశాడు. అందులో ఆశ్చర్యం లేదు గానీ ఈ స్వతంత్ర ప్రవృత్తి ఆరుద్రకి, సి. వి. రామచంద్రరావుకి కూడా ఒక లోటుగా కనిపించడం ఆశ్చర్యకరమైన విషయం[15]ఆరుద్ర తన సమగ్రాంధ్రసాహిత్యంలో [ఆరుద్ర. సమగ్రాంధ్రసాహిత్యం (revised edition) మూడవ భాగం, తెలుగు అకాడమి, హైదరాబాదు, 2004. p. 102] రామస్వామి రాజా రామమోహనరాయ్ పేరు చెప్పుకుని ‘ఆంధ్రదేశంలో తెల్లదొరల దగ్గర చందాలు దండిన దాఖలాలు కూడా ఉన్నాయి’ అని రాస్తాడు. అలాగే లక్ష్మయ్య గురించి రాస్తూ ‘రామస్వామి లాగా నోరు పెట్టుకుని బతికే లక్షణాలు గలవాడు కాదు’ అంటాడు. ఇలాంటి భాష వల్ల (అంటే చందాలు దండుకోవడం, నోరు పెట్టుకుని బతకడం లాంటి భాష) ఆరుద్రకి రామస్వామి పట్ల ఎంత తక్కువ అభిప్రాయం వుందో మనకి బోధ పడుతుంది. అందులో రామస్వామి పేరు చెప్పకపోయినా ‘చందాలు దండిన రాజా రామమోహనరాయ్ గారి స్నేహితుడు రామస్వామి కావచ్చు’ అని ఆరుద్ర ఫుట్‌నోట్‌లో ఇచ్చిన భాగంలో జూలియా థామస్ (మైట్‌లాండ్) పేరు చెప్పని రామమోహనరాయ్ స్నేహితుణ్ని గురించి చాలా మర్యాదగా రాస్తుంది. ఇతను చందాలు దండిన వాడుగా ఆవిడ అనదు. ఆవిడ మాటలు ఇవి:
November 19th, 1838. […] The other day we had a visit from a very intelligent native, a friend of Rammohun Roy’s: he came to ask A— to subscribe to a book he is going to publish. He told us he had three daughters and a son, and that he was determined not to be influenced by the Hindoo prejudices against female education, so he had taught his daughters to read and write their own language, English, and Sanscrit, and that he found they learnt just as well as their brother; but he had met with a great deal of trouble and opposition from his relations on account of his innovation – especially from his wife, who for a long time allowed no peace or quiet in the house. He says the natives much wish to see some of Rammohun Roy’s suggestions adopted by the Government, and think them very useful and well adapted to their end.
 :
Maitland, Julia Charlotte. 1846. Letters from Madras during the years 1836-1839, London: John Murray, Albemarle Street.
దీనిని బట్టి రామస్వామిని గురించి జూలియా థామస్ (మైట్‌లాండ్)కి చాలా గౌరవకరమైన అభిప్రాయం వుందని రామస్వామి తను ప్రచురించబోయే పుస్తకానికి subscriptions అడగటానికే వచ్చాడు కానీ చందాలు దండుకోవడానికి రాలేదని బోధ పడుతుంది. ఈ రకమైన అభిప్రాయాలు కేవలం అశ్రద్ధ వల్లే కాకుండా అనవసరపు అగౌరవం వల్ల కూడా ఆరుద్ర ప్రకటించాడని మనం నిష్కర్షగా చెప్పాలి.
సి.వి. రామచంద్రరావు రామస్వామి పట్ల ఏమీ తక్కువ అగౌరవంగా మాట్లాడలేదు. ఉదాహరణకి ఆయన రామస్వామి తన Biographical sketches of Dekkan Poets అనే పుస్తకాన్ని ఇద్దరికి అంకితం ఇవ్వడాన్ని ‘inconstancy, duplicity’ అని మరల మరల (1975, 2003) రాశారు. నిజానికి ఆ పుస్తకం రెండు ప్రచురణల మధ్య 18 సంవత్సరాల వ్యవధి ఉంది..
రామస్వామికి ఇంగ్లీషు సాహిత్యంతో గాఢమైన పరిచయం ఉంది. ఇంగ్లీషులో సాహిత్య విమర్శకులుగా పేరున్న ప్రాచీనులు అరిస్టాటిల్, హెర్మాజెనస్ లాంటి వాళ్ళ ఆలోచనల పట్ల అవగాహన ఉంది. దీనితోపాటు భారతీయ సాహిత్యాల తాత్త్విక నేపథ్యం వేరని అతనికి తెలుసు. అంతమాత్రం చేత ప్రపంచంలో వివిధ భాషల సాహిత్యాలని పోల్చి చూసి సిద్ధాంతాలు చేసే comparative literature అనే ఊహ అతని మనసులో వుంది అని చెప్పడానికి మనకున్న సమాచారం చాలదు.
రామస్వామి రాసిన మరో ముఖ్యమైన పుస్తకం దక్షిణ భారతదేశంలో కులాల గురించినది: A Digest of the Different Castes of India, with Accounts of Them (1837)[16]1847 నాటి రెండవ ముద్రణలో పుస్తకం టైటిల్ కూడా మారింది..
ఈ పుస్తకం ప్రతి కులంలో వుండే వ్యక్తుల బొమ్మలు వాళ్ళ కట్టూ బొట్టూ తీరూ స్పష్టంగా కంటికి కనిపించేలా రంగులతో అచ్చు వేయించాడు రామస్వామి. దక్షిణ దేశంలో కులాలని అపరిమితమైన ఆసక్తితో గమనించే తెల్లవాళ్ళకి ఈ పుస్తకం చాలా ముఖ్యంగా కనిపించింది. దానికి తగినట్టుగానే చాలా కాపీలు అమ్ముడు పోయాయి కూడా. రెండు సార్లు అచ్చయిన ఈ పుస్తకంలో రంగులు కూడా ముద్రణ ముద్రణకి మారాయి. ఈ పుస్తకంలో బొమ్మలు ఎవరు వేశారో కాని అవి చాలా చక్కగా వుంటాయి. అప్పుడప్పుడే అందుబాటులోకి వస్తున్న లితోగ్రఫి సహాయంతో మంచి రంగులతో, మంచి కాగితం మీద రామస్వామి ఈ పుస్తకాన్ని ప్రచురించాడు.
ఇదే రకమైన ప్రాముఖ్యం రామస్వామి మూలికల గురించి రాసిన Moolika Sankalitum; or, Mingling of Herbs (1835) అన్న పుస్తకానికి కూడా ఇవ్వాలి. దేశంలో దొరికే మూలికల గురించి వివరంగా రాస్తే తెల్లవాళ్ళు ఆసక్తితో కొంటారని రామస్వామి గుర్తించాడు.
1817 నాటికి Great Trigonometrical Survey (GTS) అనే పేరుతో త్రికోణమితి ఆధారంగా దేశాన్ని పటరూపంలో మొత్తం అంతా చూపించి భౌగోళిక పరిస్థితుల్ని పరిపూర్ణంగా ఇచ్చి దేశం అంతటినీ పరిపాలించడానికి కావలసిన సమాచారం ఒక చోట ఏర్పరచవచ్చు అనే నమ్మకం తెల్లవాళ్ళలో పెరిగింది. ఈ పనిలో స్థానిక దేశీయుల అవసరం కానీ వాళ్ళు ఇచ్చే సమాచారం మీద ఆధారపడవలసిన పని గానీ వుండదు. దేశీయులు ఇచ్చే సమాచారం ఎప్పుడూ నమ్మదగ్గదిగా వుండదని, వాళ్ళు వాళ్ళ స్వలాభాలకోసం సమాచారాన్ని వాళ్ళకు కావలసిన పద్ధతిలో చెప్తారని, ఒక అభిప్రాయం తెల్ల పరిపాలకుల మనస్సుల్లో నాటుకుపోయింది. ఇప్పుడు స్థానికుల సమాచారంతో నిమిత్తం లేకుండా పూర్తిగా దేశాన్ని బొమ్మలో చూపించవచ్చు. ఉదాహరణకి 1817లో గవర్నర్ జనరల్గా వున్న లార్డ్ హేస్టింగ్స్ (Lord Francis R. Hastings) ఇలా అన్నాడు:
There is no other solid basis on which accurate geography can so well be founded. The primary triangles thus spread over this vast country establish almost beyond error a multitude of points, and the spaces comprehended within these, when filled up by the details of subordinate surveyors, will afford … a map without a parallel. [as cited in Mathew Edney, 1990, p. 197][17]Edney, Mathew H. 1990. Mapping an Empire: The Geographical Construction of British India, 1765-1843, Chicago, The University of Chicago Press.
ఈ ఆలోచన ఆధారంగానే GTS ఏర్పడింది.
సరిగ్గా ఈ ఆలోచననే కాదని దేశంలో జీవించే వ్యక్తులు, వాళ్ళని పరిపాలించిన రాజులు, ఆ రాజ్యాలు, వాటి సరిహద్దులు, అంతకన్నా ముఖ్యంగా ఆ ప్రాంతంలో జీవించిన కవులు–వీళ్ళు ముఖ్యమని నిరాఘాటంగా ప్రదర్శిస్తూ 1827లో A New Map of the Ancient Division of the Dekkan అనే పటం ప్రచురించాడు రామస్వామి. ఈ మ్యాపు చాలా కాలం పాటు ఎవరికీ దొరకలేదు. అది ఉందని కూడా ఎవరికీ తెలియదు. దాన్ని వెతికి పట్టుకుని మళ్ళా ప్రచురించినందుకు లీసా మిచెల్‌ని (Lisa Mitchell) మనం మెచ్చుకోవాలి[18]Mitchell, Lisa. 2009. Knowing the Deccan: Enquiries, Points, and Poets in the Construction of Knowledge and Power in Early Nineteenth-Century Southern India, in Thomas R. Trautmann, Ed., The Madras School of Orientalism: Producing Knowledge in Colonial South India, Delhi: Oxford University Press, pp. 151-182.
ఈ విలువైన వ్యాసంలో రామస్వామి గురించి, అతను ఊహించుకున్న దక్కను గురించి, అతని ఆలోచనలకి భిన్నంగా బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన చరిత్ర గురించి మంచి చర్చ ఉంది. లీసా మిచెల్ ఇచ్చిన మ్యాపు అచ్చులో చిన్నదిగా, కేవలం తెలుపు, నలుపు రంగులలో కనిపిస్తుంది. ఈ మ్యాప్ బ్రిటిష్ లైబ్రరీలో పట్టుకోవడం అంత తేలిక కాలేదు, కాని చివరికి దొరికింది..
1827 నాటికి లితోగ్రఫి భారతదేశంలో చాలా కొత్త. ఆ ప్రక్రియని అంత తొందరగా వాడుకుని రామస్వామి ప్రచురించిన ఈ మ్యాపు గురించి వివరంగా మాట్లాడవలసిన అవసరం ఉంది. ఈ మ్యాపులో దేశాల సరిహద్దులు రంగురంగుల్లో వుంటాయి. ఇందులో ఘూర్జర, మహారాష్ట్ర, చోళ, పాండ్య, తెలుగు, కళింగ, బంగాళ మొదలైన దేశాల సరిహద్దులు ఇచ్చాడు రామస్వామి. దక్కను బహుభాషలు మాట్లాడే ప్రాంతమని ఈ మ్యాపుద్వారా స్పష్టంగా చూపించాడు. ఉదాహరణకి ఆంధ్ర, కళింగ వేరు వేరు దేశాలైనా అక్కడ మాట్లాడే భాష తెలుగే. హైదరాబాదుని భాగనగర్ (Bhaganagar) అని గుర్తిస్తూ హైదరాబాదు అనే పేరు కూడా రాశాడు. చెన్నపట్నాన్ని చనపటన (Chanapatana) అంటూ అడుగున మద్రాసు అని కూడా చూపించాడు. ఈ ప్రాంతం అనేక భాషలు మాట్లాడే ప్రాంతం అని సూచించడానికి చెన్నపట్నాన్ని ఏ దేశంలోనూ పెట్టకుండా వేరే చూపించాడు. ఇలా రకరకాల కాలాల, రాజ్యాల సరిహద్దుల్ని, ప్రాచీన ఆధునిక నగరాల స్థానాలనీ కలిపి ఈ మ్యాపు 1827లో ప్రచురించడం అతనికి దేశాన్ని గురించి, దేశంలో ఒకప్పటి రాజ్యాల సరిహద్దుల గురించి, అక్కడ మాట్లాడే వాళ్ళ వివిధ భాషల్ని గురించి, చాలా క్లిష్టమైన అవగాహన వుందని మనకి తెలుస్తుంది[19] రాజ్యానికి మ్యాపులకి ఉన్న సంబంధం దరిమిలా వచ్చిన వేడ్ డేవిస్ (Wade Davis) పుస్తకంలో ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. The British had indeed transformed the face of India, building thousands of miles of canals and railroads, bringing into being entire cities. But at a deeper level, the British presence was but an ephemeral veil over the body of a land that was more a state of mind than a national state, a civilization that had endured for four thousand years as an empire of ideas rather than territorial boundaries. (p.43)
Davis, Wade. 2011. Into the Silence – The Great War, Mallory, and the Conquest of Everest, New York: Alfred Kopf..
దానితో పాటు 1828లో ప్రచురించిన Descriptive and Historical Sketches of Cities and Places in the Dekkan అనే పుస్తకానికి ఈ మ్యాపు అనుబంధంగా వుండాలని చెప్పాడు. ఈ పుస్తకంలో దక్కనులో వుండే ప్రధాన నగరాలన్నిటినీ ఇంగ్లీషు వర్ణక్రమంలో రామస్వామి ప్రచురించిన విధానం మనం స్పష్టంగా గమనించాలి. అందులో ఆయా నగరాల చరిత్రలు, కథలు–అద్దంకితో మొదలుపెట్టి విశాఖపట్నం (Visagapatnam) దాకా–ఇచ్చాడు. కాని ఇందులో విశేషమేమిటంటే మెకంజీ చెప్పినట్టు చారిత్రకంగా నిర్ధారించదగిన విషయాలే కాకుండా ఆ వూళ్ళని గురించి జనం చెప్పుకునే కథలు, కావ్యాల్లో వుండే కల్పనలు కూడా స్వేఛ్ఛగా రామస్వామి చెప్పాడు. దీన్ని బట్టి రామస్వామి ఇటు మెకంజీని కాని, అటు GTS పద్ధతిని కాని అంగీకరించలేదని స్పష్టంగా తెలుస్తుంది.
అతను చేసిన పుస్తకాలలో మనం ప్రధానంగా చూడవలసింది దక్కను కవుల జీవిత చరిత్ర (Biographical Sketches of the Dekkan Poets). రామస్వామి కవుల జీవిత చరిత్రలు రాయడంలో చాలా తక్కువ మంది గమనించిన విశేషం ఒకటుంది. ప్రతి కవి జీవితంలోను చివర ఇతను ఇంట్లోనే మరణించాడు అని రామస్వామి పని కట్టుకుని చెప్తాడు. దానితో పాటు ఈ కవులు పుట్టిన ఊరు కూడా మ్యాపులో చూపిస్తాడు. పుస్తకం మొదట 1829లో అచ్చయినప్పుడు దానిలో అనుబంధంగా ఈ మ్యాపు లేదు. 1847లో రెండవ ప్రచురణలో ఈ మ్యాపు జోడించాడు. రామస్వామి కవులు పుట్టిన చోటు అని మ్యాపులో గుర్తించిన జాగా భౌగోళికంగా సరి అయినది కాదు. కాని విషయం అది కాదు. వాళ్ళకి ఒక పుట్టిన జాగా వుంది. వాళ్ళు అందరిలాగే పుట్టారు. అందరిలాగే మరణించారు అని నొక్కి చెప్పి అందుకు మ్యాపును కూడా చూపించి, కవికి ఒక జీవితాన్ని నిర్మించడం రామస్వామి చేసిన పని. ఈ రెండు విషయాల వల్ల–1. కవి జీవించిన ప్రాంతాన్ని మ్యాపులో చూపించడం, 2. అతను సొంత ఇంట్లోనే మరణించాడు అని ప్రత్యేకంగా చెప్పడం–రామస్వామి కథలుగానే మనం ఎరిగున్న కవుల్ని జీవిత చరిత్రలున్న వ్యక్తులుగా తయారు చేశాడు. ఇది ప్రధానమయిన పాశ్చాత్యీకరణం. దాన్ని అంది పుచ్చుకుని ఆంధ్రకవులచరిత్ర రాసినవాడు వీరేశలింగం. వీరేశలింగం రాసిన కవి జీవితాల వల్ల తెలుగు సాహిత్య పాశ్చాత్యీకరణం పూర్తయ్యింది. దీని మూలకంగా పుస్తకం రాసేవాడు కవి అని, ఆ కవి నుంచి పుస్తకం వస్తుందని, ఆ పుస్తకాన్ని పాఠకులు చదువుతారని నిర్ధారకంగా మన మనసుల్లో స్థిరపడి పోయింది.
ఈ నిర్ధారణ చేయడానికి, దక్కను కవుల జీవిత చరిత్రల పుస్తకం రాయడానికి ప్రధాన ప్రేరేపణ ఆ పుస్తకాలు కొనడానికి ఉత్సాహం చూపించే తెల్లవాళ్ళు. వాళ్ళకి భారతీయ సాహిత్యం పాశ్చాత్య దేశాల్లో లాగా కవులు, కవి జీవితాలతో చారిత్రకంగా ఉండవలసిన అవసరం వుంది. అది మొదలుకుని భారతీయ సాహిత్యంలో ఇప్పటికి కూడా సాహిత్య చరిత్రలు రాయడం పనిగా పెట్టుకున్నాం మనం. దీనికి తోడు దక్కన్ అనే ప్రాంతాన్ని తీసుకుని ఆ ప్రాతంలో ఉన్న కవుల చరిత్రలు రాసి ఆ ప్రాంతానికి ఒక ఏకత్వాన్ని కల్పించినవాడు రామస్వామి. అంచేత అతని దక్కను కవుల జీవిత చరిత్రల పుస్తకంలో 3-4 భాషల కవులుంటారు. ఈ పుస్తకానికి రాసిన పీఠికలో రామస్వామి సప్తాంగాలు లేని రాజ్యం యొక్క ప్రామాణికతని సూక్ష్మంగా ప్రశ్నిస్తాడు. ఆ సప్తాంగాలు ఏమిటంటే, వైద్యులు, కవులు, వందిమాగధులు, గాయకులు, విదూషకులు, నీతిశాస్త్ర నిపుణులు, ఐతిహాసికులు-వీళ్ళు. ఇందులో రామస్వామి కవులనే అతి ముఖ్యులుగా తీసుకున్నాడు. తమ రాజుని గురించి ఇచ్చే సుదీర్ఘమైన సమాచారంలోను చారిత్రక సామర్ధ్యంలోను వీళ్ళ పనే సరయిన పని అని రామస్వామి నిర్ణయించుకున్నాడు.
ఈ మూడు ప్రచురణలు–అంటే 1827లో ప్రచురించిన మ్యాపు, 1828లో ప్రచురించిన ప్రదేశాల గురించిన పుస్తకం, 1829లో ప్రచురించిన దక్కను వ్యక్తుల రేఖా చిత్రణలు–రామస్వామి దృష్టిలో కలిపి చూడాలి. భౌగోళిక దేశం, దానిలో జరిగే సాహిత్య కృషి, చరిత్ర రచన, ఈ మూడూ అవినాభావంగా కలిసి వుంటాయని రామస్వామి గాఢంగా విశ్వసించాడు. మొత్తంమీద లితోగ్రఫీ ఇంకా పూర్తిగా అమలులోకి రాని కాలంలో ఇంత విశేషమైన రంగులతో కూడిన మ్యాపులు ప్రచురించడం చూస్తే రామస్వామి ఊహలో దక్కన్ ఒక క్లిష్టమైన ప్రత్యేకమైన ప్రాంతం అని తెలుస్తుంది.
తరవాత ఏం జరిగిందో స్పష్టంగా చెప్పలేం కాని, 1847లో ప్రచురించిన దక్కను కవుల జీవిత చరిత్రల పుస్తకంలో కవులని భాషాక్రమంలో విడదీశాడు. ఈ మార్పు ఎందుకు అవసరం అయిందో అతనెక్కడా స్పష్టంగా చెప్పలేదు కాని మనం ఊహించగలం. బహుశః అప్పటికే జనంలో భాషాభిమానం–ఒక భాష మాట్లాడే వాళ్ళంతా ఒకజాతి వాళ్ళు–అనే ఊహ బలపడుతూ వుండి వుండాలి. అనేక భాషలు ఉన్న ప్రాంతానికి ఒక రాజు వుండడం (ఉదాహరణకి విజయనగర సామ్రాజ్యం, ఓఢ్ర దేశం, మహారాష్ట్ర ప్రాంతం), ఆ రాజుకి అక్కడి ప్రజలందరు విధేయులై ఉండడం క్రమక్రమంగా మరుగున పడుతోంది. దేశాన్నంతటినీ కలిపి పరిపాలించిన తెల్లదొరలు మాకు రాజులు అనే ఊహ జనంలో ఏర్పడలేదు. ఆంధ్ర దేశాన్ని, తమిళ దేశాన్ని కలిపి ఒకే రాష్ట్రంగా ఇంగ్లీషు వాళ్ళు పరిపాలించినా వాళ్ళని రాజులుగా జనం గుర్తించలేదు. వాళ్ళు కేవలం పరిపాలకులు మాత్రమే. కొన్ని దశాబ్దాల తరవాత గురజాడ శ్రీరామమూర్తి భాషాభిమానం అని అన్న ఊహలోను, వీరేశలింగం ఆంధ్రకవులచరిత్ర అనే పేరుతో పుస్తకం రాయడంలోను మనకి స్పష్టంగా కనిపించేది అదే! అంచేత భాష ఒక్కటే ప్రజల ఐకమత్యానికి ఆధారభూతం అయ్యే రోజులు దగ్గర పడుతున్నాయని రామస్వామి గుర్తించి వుంటాడు. అందుకే దక్కను కవుల జీవిత చరిత్ర రెండవ ప్రచురణలో కవుల్ని భాషాపరంగా విభజించాడు.
ఎన్ని రకాలుగా చూసినా రామస్వామి మెకంజీకి అనుయాయి కాడు. తన అన్నలైన బొర్రయ్యకి, లక్ష్మయ్యకి అనుయాయి కాడు. అయినా బొర్రయ్య కవితా సామర్థ్యానికి గుర్తింపుని, తన యజమానిగా మెకంజీకి ఇవ్వవలసిన గౌరవాన్నీ ఇస్తూనే వచ్చాడు. వీటన్నిటితోపాటు తనకున్న ప్రత్యేకమైన ఊహల్ని, అప్పటికి ఎవరికీ లేని ఆధునిక భావాల్నీ ప్రకటిస్తూ, అయినా కాలం తనకు అనుకూలంగా లేదు కాబట్టి తన గొప్ప చెప్పుకోని వాడు రామస్వామి.
రామస్వామి తన కాలానికి మించిన ప్రతిభావంతుడు, ప్రయోజకుడు, వర్తక రహస్యాలు తెలిసినవాడు. బహుశా భారతదేశంలోనే మొదటి ప్రచురణకర్త. అన్నింటికన్నా ముఖ్యంగా తెలుగు సాహిత్యానికి పాశ్చాత్య స్వరూపాన్ని ఇచ్చి కథలుగా వున్న కవుల్ని, రచయితల్ని పుట్టుక, జీవించిన ప్రాంతం, మరణం వున్న చారిత్రక వ్యక్తులుగా మార్చి తెలుగు కవుల చరిత్రలు, తెలుగు సాహిత్య చరిత్ర రాయడానికి కావలిసిన ప్రాతిపదిక ఇది అని నిశ్శబ్దంగా నియమం ఏర్పరిచిన ఆధునికుడు కావలి రామస్వామి. అతను చేసిన పనిని, ముఖ్యంగా దక్కను కవుల చరిత్రతో అతను సాధించిన పెద్ద మార్పుని మనం ఇప్పటికీ సరిగా గుర్తించలేదు. ఒక జాతి సాహిత్య స్వరూపం మొత్తాన్ని పాశ్చాత్య భావాలకు అనుకూలంగా మార్చడం, అది కూడా ఏదో గొప్ప పని చేస్తున్న వాడిలాగా కాకుండా మామూలుగా చేయడం రామస్వామి చేసిన పెద్ద మార్పు. ఆ మార్పు ఫలితాన్ని ఇప్పటికీ మనం తెలియకుండానే కొనసాగిస్తున్నాం.
కావలి రామస్వామి ప్రచురణల పట్టిక
- Ramaswami, Kavali Venkata [Published under ‘Cavali Venkat Ramasswami’]. 1868. The Sapta-Shati, or Chandi Pat; Being a Portion of the Markandeya Puran; Translated from the Sanskrit into English with explanatory notes, Bombay: Frere Press. [Reprinted with 13 photographic illustrations by Janardan Ramachandraji.]
ఈ పుస్తకం దేవీ మాహాత్మ్యం అని కూడా పిలవబడే మార్కండేయ పురాణంలోని ఒక భాగం. ఇందులోని 700 శ్లోకాలని, లేక మంత్రాలని, రామస్వామి ‘సప్తశతి లేక చండీ పాట్’ అనే పేరుతో 1823లో అనువదించి ప్రచురించినట్లు 1868లో ఈ పుస్తకాన్ని పునర్ముద్రించిన ప్రచురణకర్త ముందుమాటలో వుంది. ఇప్పటికి మనకు తెలిసిన సమాచారాన్ని బట్టి ఇది రామస్వామి వేసిన మొదటి పుస్తకం అనుకోవాలి. కేవలం శ్లోకాలని అనువాదం చెయ్యడమే కాకుండా పుస్తకం చివరిలో ఈ పురాణంలోని ముఖ్యమైన పదాలకి వివరణలతో ఒక పొడవాటి జాబితాను కూడా ఇచ్చాడు. దీన్ని మద్రాసు (1809-15), కలకత్తా (1815-25) సుప్రీంకోర్టుల్లో సీనియర్ జడ్జిగా పనిచేసిన Francis Workman-Macnaghtenకి అంకితం ఇచ్చాడు.
- Ramaswami, Kavali Venkata [Published under ‘Caveli Venkata Ramasswami’]. 1825. Viswaguna darsana; or, Mirror of Mundane Qualities. Translated from the Sanscrit of Veukatachari, into English: with Appendixes and Explanatory Notes, Calcutta.
ఈ పుస్తకాన్ని కూడా Francis Workman-Macnaghtenకే, అతను పదవీ విరమణ చేస్తున్న సందర్భంలో, అంకితం చేశాడు. ఈ అనువాదానికి అనుబంధంగా కాకతీయుల గురించి, వైష్ణవుల గురించి పొడవాటి వివరణలు కూడా ఇచ్చాడు. పుస్తకం చివరిలో చందాదారుల జాబితా ఉంది.
- Ramaswami, Kavali Venkata [Published under ‘C.V. Ramaswamy’]. 1827. A new Map of the Ancient Division of the Deckan Illustrative of the History of the Hindu Dynasties with Discriptions [sic] of the Principal Places. Calcutta: Asiatic Lithographic Press.
ఈ మ్యాపుని అప్పటి ఫోర్ట్ విలియం (కలకత్తా)లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (1825-32) వున్న సర్ చాల్స్ గ్రేకి అంకితం ఇచ్చాడు. ఇది సుమారు 25 అంగుళాల పొడవు, 20 అంగుళాల వెడల్పు గల మ్యాపు. దీనిని ఒక మందపాటి కాగితం పైన అంటించి, దృఢంగా వుండటానికి దానివెనుక ఒక నారగుడ్డని జతపరచి (Linen, 35*23 అంగుళాలు) బ్రిటిష్ లైబ్రరీలో భద్రపరిచారు.
- Ramaswami, Kavali Venkata [Published under ‘Cavelly Venkata Ramaswami’]. 1828. Descriptive and Historical Sketches of Cities and Places in the Dekkan; to which is prefixed, an Introduction, Containing a Brief Description of the Southern Peninsula, and a Succinct History of its Ancient Rulers: The Whole Being to Serve as a Book of Reference to a Map of Ancient Dekkan, Calcutta.
ఈ పుస్తకాన్ని ఎవరికీ అంకితం ఇచ్చినట్లుగా లేదు. అలాగే చందాదారుల జాబితా కూడా లేదు. తన ప్రచురణలన్నీ ఉద్యోగం చేస్తూనే కొనసాగించాడని ముందుమాట ద్వారా తెలుస్తుంది.
- Ramaswami, Kavali Venkata [Published under ‘Cavelly Venkata Ramaswamie’]. 1829. Biographical Sketches of Dekkan Poets, Being Memoirs of the Lives of Several Eminent Bards, Both Ancient and Modern, Who Have Flourished in Different Provinces of the Indian Peninsula, Compiled from Authentic Documents, Calcutta.
-[Published under ‘Cavelly Venkata Ramaswami’]. 1847. Bombay: Victoria Press.
-[Reprint of 1829 edition]. 1888. Madras: Higginbotham and Co.మొదట కలకత్తాలో అచ్చయిన పుస్తకాన్ని అప్పటి గవర్నర్ జనరల్గా వున్న విలియం బెంటింక్‌కు, రెండవ సారి బొంబాయిలో అచ్చయిన పుస్తకాన్ని అక్కడి సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా (1847-52) వున్న సర్ థామస్ ఎర్‍స్కిన్ పెర్రీకి అంకితం ఇచ్చాడు. పైన వ్యాసంలో చెప్పినట్లు కవులను భాషాపరంగా విడదీయటం, ఆ కవులు పుట్టిన ప్రదేశాలను చూపెట్టే ఒక మ్యాపును జతపరచడం రెండవ ప్రచురణలో జరిగినిన ప్రధానమైన మార్పులు. కలకత్తా ముద్రణలో చందాదారుల జాబితా లేదు కాని 1847 ముద్రణలో 120 మందికి పైగా ఆనాటి బొంబాయిలోని ప్రముఖుల పేర్లు కనపడతాయి. మద్రాసులోని ప్రముఖ పుస్తక ప్రచురణ, విక్రయ సంస్థ అయిన Higginbotham & Co. కలకత్తా ఎడిషన్‌ని 1888లో మరల ముద్రించింది.
- Ramaswami, Kavali Venkata [Published under ‘Cavelly Venkata Ramaswamy’]. 1835. Moolika Sankalitum; or, Mingling of Herbs: A Work on Medicine Translated from Teloogoo into English, Having the Names of the Various Medicines in Tamul, Madras: R.W. Urquhart, Circulator Press.
రసార్ణవం అన్న తెలుగు పుస్తకం ఈ మూలికా సంకలితం అన్న ఆంగ్ల అనువాదానికి ఆధారం అని రామస్వామి తన ముందు మాటలో చెప్తాడు. ఈ రసార్ణవం ధన్వంతరి సంస్కృత వైద్యశాస్త్ర గ్రంథానికి అనువాదం. దీనిలోని మందుల తయారీకి వాడబడే పదార్ధాల పేర్లన్నీ తమిళ లిపిలోను, ఇంగ్లీషులోను కూడా వుంటాయి. అంతేకాక ఇంకా మూలికల పేర్లు (Herbs and Plants) వృక్షశాస్త్ర పరిభాషలో (Botanical Names) కూడా ఇస్తాడు. ఈ పుస్తకాన్ని మద్రాసు గవర్నరైన Sir Frederic Adamకి అంకితం ఇచ్చాడు. ఈ పుస్తకానికున్న 140మంది చందాదారుల జాబితాలో A.D. Campbell, T.V. Stonehose, T.M. Lane, W. Brown లాంటి తెలుగువాళ్ళకి పరిచితమైన పేర్లు కనిపిస్తాయి.
- Ramaswami, Kavali Venkata [Published under ‘C.V. Ramaswamy’, trans]. 1836. Pakasastra, Otherwise Called Soopasastra, or the Modern Culinary Receipts of the Hindoos, Compiled in Teloogoo by Saraswate Boy, Late Zemindar of the North of the Peninsula, Madras: Church Mission Press.
తెలుగులో ఈ వంటల పుస్తకం రాసిన సరస్వతి బాయి గురించిన ఏ సమాచారం ఈ పుస్తకంలో వుండదు. దీన్ని 1825-35 మధ్యకాలంలో మద్రాసు ప్రధాన న్యాయమూర్తిగా వున్న Sir Ralph Palmerకి అంకితం ఇచ్చాడు. ఈ పుస్తకానికున్న చందాదారుల జాబితాలో C.P. Brown పేరు కనిపిస్తుంది. వంటయింటి సామానులను, కొన్ని కూరాకులను రంగుల బొమ్మల్లో చూపించడం ఈ పుస్తకంలోని ఒక విశేషం.
- Ramaswami, Kavali Venkata [Published under ‘C.V. Ramaswamy’]. 1837. A Digest of the Different Castes of India, with Accounts of Them, Madras: A. Willard, Courier Press.
-[Published under ‘C.V. Ramaswamy and Son’]. 1847. A Digest of the Different Castes of the Southern Division of Southern India, with Descriptions of Their Habits, Customes, &c., Bombay: Jeejeebhoy Byramjee, Telegraph and Courier Press.
-[Reprint of 1837 edition]. 1866. A Digest of the Revised and Enlarged by C. Ramanjooloo Naido, Artist to Honorable Walter Elliott, the Second Councilor Fort Saint George, from a Publication of C.V. Ramasawmy (sic) Pundit. Corresponding Member R.A.S of Great Britain and Ireland and Vice-President M.H.L.S. Published several years ago, Madras: Lithograped (sic) by C. Vencatrayaloo Rajoo Press No. 12, and by C. Ramangooloo.దక్షిణ భారతదేశంలో కులాల గురించి రాసిన ఈ పుస్తకం మొదటి ముద్రణ గురించి వివరంగా చర్చించవలసి వుంది. ముఖ్యంగా ఈ పుస్తకం అచ్చు వేసిన పద్ధతి గురించి. రంగులలో ముద్రణ అప్పుడప్పుడే భారతదేశంలో అడుగుపెడుతున్న కాలంలో చాలా పెద్ద సంఖ్యలో (83) రంగు బొమ్మలతో వేసిన ఈ పుస్తకం అపురూపమైనది. అప్పట్లో అది చేతి పని కావడంతో ప్రతి పుస్తకంలోను రంగులు వేరుగా వుంటాయి. (1837లో అచ్చయిన మూడు ప్రతులను మేము చూశాము – రచయితలు) పది సంవత్సరాల తరవాత రెండవ ముద్రణకి వచ్చేటప్పటికి ఈ పుస్తకం గురించి రామస్వామి ఆలోచనలు మారినట్లు తెలుస్తుంది. ఈ పుస్తకాన్ని ప్రథమంగా యూరోపియన్ల కోసం రాసినట్లుగా తన ముందుమాటలో చెప్తాడు. ఈ పుస్తకాన్ని మొత్తం ఐదు భాగాలుగా విభజించబోతున్నట్లు, ఒక్కొక్క భాగంలో యాభయి కులాల గురించిన వివరాలు వుంటాయని, ఇది మొదటి భాగమని కూడా రాస్తాడు. కాని, తక్కిన నాలుగు భాగాలు పూర్తిచేసినట్లుగా లేదు. 1847నాటి ముద్రణలో వాడిన యాభయి బొమ్మలు పూర్తిగా వేరుగా ఉంటాయి. మొదటి ముద్రణలోని కులాల వివరాలు, బొమ్మలు ఒక క్రమ పద్ధతిలో లేకుండా, కలగాపులగంగా వుంటే, రెండవ సారి ఒక పద్ధతిని పాటించినట్లు తెలుస్తుంది. ఈ పుస్తకం కూడా రామస్వామి మరణం తరవాత 1866లో అచ్చయ్యింది. దీని టైటిల్ పేజీలోను, పీఠికలోను రామస్వామి రాసిన పుస్తకానికిది revised and enlarged ప్రతి అని ఉన్నా నిజానికి చాలా చిన్న పుస్తకం. దీనిలో కేవలం 30 బొమ్మలు మాత్రమే ఉన్నాయి. కులాల గురించిన వివరం కూడా ఎక్కువగా వుండదు.
అధస్సూచికలు