1.
ఎదురైన
ప్రతి హృదయాన్ని
అడిగాను
తల్లి వలే
కొంచెం ప్రేమ ఇవ్వగలరా?
ఆ హృదయాల వెనుక
వ్యాపార కేంద్రాలున్నాయని
వ్యాపార కేంద్రాలలో
హైనాలున్నాయని
తెలియక.
ఆ హైనాలు
మనుషుల్లాగే
నవ్వాయి
ఓ, అలాగే ఇస్తాం
మా కాళ్ళ మీద పడితే
మేం చెప్పినట్టల్లా ఆడితే
కుక్కపిల్లలా మా వెనకాల తిరిగితే
గొర్రెలా మమ్మల్ని అనుసరిస్తే
అలాగే ఇస్తాం
ప్రమాదాన్ని గుర్తించి
పరుగు తీయబోతే
ఆ హైనాలు వెంబడించాయి
ప్రేమ అని
స్నేహమని
బంధమని
వెంటబడ్డాయి
భయంతో
చీకటిలోకి దూకాను
కళ్ళు తెరుచుకున్నాయి
ఎదురుగా నల్లని తల్లి
ఇన్ని సంవత్సరాలుగా
ఎంత భయంకరమైన
పీడకల తల్లీ
నా మీద నాకే
అసహ్యం కలిగేంతలా
అన్నాను విచారంగా.
తల్లి
తల్లిలాగే
నవ్వింది
నన్ను
నువ్వు చూడాలనే
ఆ కల రప్పించాను
అన్నది
నిశ్శబ్దంలోంచి.
2.
ఒక్కసారి
బురదలో పడితే
కడుక్కునే వీలే లేదా?
అడిగాను దిగులుగా
మెరుపులా నవ్వి
ఆ బురదా నేనే
అన్నది తల్లి
నల్ల మబ్బుల్లోంచి
జలజల వర్షం
కురిపిస్తూ.