పిలుపు

ఒక పిలుపు అంత ఉగ్రంగా అదివరకెప్పుడూ నా మనసుని హడలెత్తించలేదు. ఆవేళ, క్రీడామైదానంలో ఉండుండి వినిపించే ఆర్భాటం ఆకాశాన్ని ముట్టడించినట్టు, ఆ పిలుపు నా మనోవీధిలో మోగింది. చల్లటి జలపాతం తలని తొలిచేస్తున్న ఆ సమయంలోనే, నరాలలో వేడినీళ్ళు ఎక్కించినట్టు రక్తం వెచ్చబడుతూ… ఆ నిముషం గడిచిపోకుండా నా మదిలో నిలిచిపోవాలని ప్రార్థించాను. పొత్రాల్లాంటి వృషణాలున్న మంచి కోడెగిత్త రంకెలాంటి ఆ పిలుపు విన్న తర్వాత, నా మనోవీధిలో అగుపించిన దృశ్యాలు… వాటిని వివరించడం అతి కష్టం.

నేనీ అనుభూతికి లోనైంది ఈమధ్యకాలంలోనే. తలని పెకలించేస్తుందేమో అన్నంత భయం కలిగించే ఒక రాక్షస జలపాతం. దానికింద నిలుచుని ఉండగా జరిగింది. ఆనాడు ఆ పల్లెటూరి దారుల్లో, ఊరి పొలిమేరల్నీ ఎదురుపడిన పరిచయంలేని వ్యక్తుల్నీ దాటుకుని వెళ్తున్నాను. అదివరకు విన్నవేగానీ ఎప్పుడూ చూడని ఊళ్ళు. ఆ ఊళ్ళ పేర్లకు నేను కల్పించుకున్న చిత్రాలకు ఏమాత్రం పోలికలేని దృశ్యాలను చూస్తూ వెళ్తున్నాను. నేను వెళ్ళాలనుకున్న ఊరు నేననుకున్నదానికంటే దూరంగా ఉంది. మదిలో చిత్రించుకున్న చిత్రాలన్నీ తప్పులని కళ్ళముందు కనపించే దృశ్యాలు నిరూపిస్తున్నాయి. ఆగి విచారించగా ‘ఇక్కడే’ అని చేయి చూపించారు. ఈ దూరాలు వడివడి అడుగులకి లొంగిపోయినట్టున్నాయి. నడిచి నడిచి మోకాళ్ళదాకా ఎర్రమట్టి దుమ్ము మేజోళ్ళలా పేరుకుపోయింది. చివరి దూరం మాత్రం మనసులో వేసుకున్న అంచనాకంటే దగ్గరగానే ఉంది. జలపాతపు హోరు వినిపించింది. దగ్గరకు వెళ్తున్నకొద్దీ ఆ మోత అంతరిక్షపు శిఖరాలను తాకగలదేమో అన్నట్టు ఉంది. ఆకాశంనుండి దూకే క్షీరధారలా గోచరిస్తోంది ఆ జలపాతం. నీటి తుంపర్ల పొగ గాలిలో ఒక మహా సర్పాకారంతో మెల్లగా మెలితిరుగుతూ పైకి పాకుతోంది. ఎక్కడా జీవరాసుల ఉనికే లేదు. చెట్లమీద ఉడతల కదలిక కానీ, పిచ్చుక రెపరెపలకి లేచే ఎండుటాకుల చప్పుడు కానీ లేదు. సున్నతి చేయబడిన లింగాల్లా మాంసపు రంగు నున్నటిరాళ్ళు నిక్కబొడుచుకునున్న ఆ ఎర్రమట్టిలో, చెప్పుల టపటపకి భయపడి పంచెని అసభ్యంగా మరింత పైకి మడిచి చుట్టుకుని, దిగి నడిచాను. ఒక పల్లం దాటుకుని పైకెక్కగానే జలపాతమూ దాని నేపథ్యమూ రంగస్థలపు తెర ఆకాశంనుండి వేలాడుతున్నట్టు దర్శనమిచ్చాయి.

సాయంత్రం వేళ. జలపాతం మీదుగా పడిన సూర్య కిరణాలు కళ్ళలో గుచ్చుకుంటున్నాయి. నిలువెత్తు ఉప్పుమడిలా మెరుస్తోంది జలపాతం. ఆ వాతావరణం మదిలో రేపే కొత్త ప్రకంపనలకు చిందరవందరవుతూ నరాల్లో పందెపుగుర్రాలు పరిగెడుతున్న భావన కలిగింది. నాలుగు పెద్ద మర్రిచెట్లను తన పొట్టలో దాచుకుందా అన్నంత విస్తీర్ణంతో ఉంది జలపాతం. మనసులో భయం మొదలైంది. ఏకాంతపు నిశబ్దాన్ని మింగేస్తున్న జలపాతపు మోత. ఆకాశం కరిగి కరిగి ధారగా కారిపోతుందేమో అనిపించేలాంటి గంభీరమైన ఆకారం. ఏమిటీ ఎలా అని వివరించలేని ఒక భయంకరమైన అపాయమేదో నా వెనక పొంచి పొంచి వస్తున్నట్టు ఒక భ్రమ. స్నానం చెయ్యకుండా భయపడి వెనుతిరుగుతానేమో అన్న ఆలోచన వచ్చిన తక్షణమే, ఓడిపోవడం ఇష్టంలేక వడివడిగా చొక్కా తీశాను. నావల్లనే నేను ఓడిపోయే పరిస్థితే కాని వస్తే, ఆ క్షణమే నా ప్రాణం నా తనువుని వీడిపోవాలని ఆ రోజు ఉదయం–లక్షోసారో అంతకంటే ఎక్కువో దేవుడికే తెలియాలి–సంకల్పించుకుని ఉన్నాను. మనసనే చెత్తబుట్టను మళ్ళీ నా ఆలోచనలతో కుమ్మరించటం మొదలయింది. ఆలోచించినకొద్దీ పశ్చాత్తాపం తప్ప వేరే ఏమీ ఉండదు. సంకల్పశవగృహం–ప్రతి రోజూ వైరాగ్యంతో సంకల్పించుకునికూడా ఓడిపోయిన జ్ఞాపకాల శవాలకొట్టం. ఇలా కూడదని నిగ్రహించుకుని దాటుకుని మళ్ళీ అందులోనే యథాప్రకారం పడిపోయిన పశ్చాత్తాపాలు, అపరాధాలు. బుద్ధిని మనసూ, మనసుని దేహమూ ఓడించడంతో గాయాలపాలైన బుద్ధీ మనసూ. అల్ప సంతోషాలు… పాపాలు… పుణ్యాలు… ఆత్మశిక్షలు… జ్ఞాపకాలలో ఏ పుట తిప్పినా పాపాలే లిఖించబడినవన్న అవమానం…

జలపాతం కింద తుప్పెక్కిన కమ్మీలు. పట్టుకుంటే ఊడి వచ్చేస్తాయేమో అనిపించేలా కనిపించినా, గట్టిగానే ఉన్నాయన్నది స్నానం చేస్తుండగా అర్థం అయింది. జలపాతం దూకి ఆత్మహత్య చేసుకుంటున్న ఆ చోటు, పాచిలేకుండా గరగరలాడుతూ శుభ్రంగా ఉంది. ఇలా నిత్యం ఒక జలపాతం దూకి నా మనసుకూడా శుభ్రం కావచ్చుకదా అని వెర్రిగా ఆలోచించాను. నాలో అవాస్తవమైన భావనలే ఎక్కువగా ఉన్నాయేమో అనిపించసాగింది. హోరెత్తి, జారి, జారినందుకు కలిగిన అవమానాన్ని కుమ్మరించేస్తూ, తనను తానే నిందించుకుంటూ, గాలిగోడకి తల బాదుకుని ఆత్మనిందకూ అసహ్యానికీ లోనైన జ్ఞాపకాలు కళ్ళు తెరవగానే, మనసు మేలుకున్నది. అప్పుడు ఊటలా ఉబుకుతున్న నా మనసులో ఒక జ్ఞాననేత్రం తెరచుకుందని అమాయకంగా అనుకున్నాను. గడిచిన రోజుల జ్ఞాపకాలనే రంపం… నిర్విరామమైన చిత్రహింసలు… భవిష్యత్తు భయాలు… ఒకటి మరోదాన్ని రేకెత్తించే అపశ్రుతి జ్ఞాపకాల సరళి…

నీళ్ళు దూకుతున్న చోటు చుట్టూ పాచి వెల్వెట్ కార్పెట్‌లా పరుచుకునుంది. బొంత చుట్టినట్టు చుట్టేయచ్చు. కాలి బొటనవేలితో వెల్వెట్ పాచిరోమాలను నొక్కుతూ తాకాను. బొటనవేలు తీయగానే ఆ చిన్న పల్లంలో నీళ్ళు ఊరాయి. జలపాతం తలమీద పడుతుంటే ఆ వేగానికి ఒక్కసారిగా ఊపిరాడలేదు. బర్రెల శవాలు వీపున పడుతున్నట్టు ఉంది. ఆ హోరుని మనసుపెట్టి అనుభవించడం మొదలుపెట్టిన తర్వాత ఆ లయలోకి లీనమైపోయాను. నేను నిలుచునున్న భూప్రపంచపు పైపొర రాలిపోయి, కుదించబడి, పాదం దగ్గరకు ఒదిగి ఇమిడిపోతున్నట్టు తోచింది. నీటి విసురుని ఎదుర్కొంటూ సరిగ్గా ఒక అనంతమైన బయలులోకి ఎగిరిపోతున్న ఆ సమయంలోనే వినిపించింది ఆ పిలుపు. అప్పుడే, బిగుసుకుపోయిన కండరాల్లో వేణ్ణీళ్ళు చొచ్చుకుపోతున్నట్టు అనిపించింది. ఆకాశం ఒంపు నిటారుగా మారిపోయి, నేలకి దిగి, రాక్షస తెరలా అన్నిటినీ అడ్డగిస్తూ ముందు నిలిచింది. తెల్లటి ఆ ఆకాశంలో వెలిసిపోయిన రంగులు కనిపించాయి. ఆ రంగులన్నీ ఒకదాని వెంట ఒకటి కదలుతూ బ్రహ్మాండమైన చిత్రాలుగా మారుతున్నాయి. పైపైన చూడటానికి రంగులేమీ లేకుండా అశ్రద్ధగా గీయబడిన చిత్రాల్లా ఉన్నా, క్షుణ్ణంగా చూసినప్పుడు ఎన్నో ఆలోచనలను రేపేట్టుగా ఉన్నాయి.

అది ఒక ప్రాచీన శైలికి చెందిన చిత్రం. దిగంతాలు లేకుండా విస్తరించిన ఆకాశం, సముద్రం నీటిలో దిగి నిల్చున్నట్టున్న దృశ్యం. సముద్రపు ఒడ్డున భారీ పుట్టగొడుగుల్లా నల్లటి బండరాళ్ళు. ఇసుకకి ఆవల కలబంద పొదలు. ఈ మట్టిలో నాటుకోవాలని బహుదూరంనుండి ఎన్నో ఆశలను మోసుకుని వచ్చి, లోతులకంటూ వేర్లు నాటుకోకపోవడంతో నిరాశకు లోనైనా, వీలైనంత విస్తీర్ణాన్ని ఆక్రమించుకుని ఏకఛత్రాధిపత్యాన్ని చాటుకుంటూ సమృద్ధిగా ఉంది ఆ కలబంద పొదల అడవి. సముద్రపు విస్తీర్ణం, మనిషికున్న సకల కష్టాలనీ తనలో ఇముడ్చుకుని నీలం పులుముకున్నట్టు ఉంది. ఏమిటని ప్రశ్నించకుండా, ఇంతేనా అన్న ఆలోచనకైనా చోటివ్వకుండా దేన్నయినా స్వీకరించడానికి వేచి ఉందది. తీరాన కలబంద ముళ్ళు చిత్రంలో కనిపించటం లేదు. అయినా లెక్కలేనన్ని ముళ్ళు ఇసుక రేణువుల్లో కూరుకుని, నడవటానికి వచ్చే పాదాలను చవి చూడటానికి ఉచ్చు పన్నిన్నట్టు మనసులో అనుమానం మెదిలింది. అలలు లేకుండా నిశ్చలంగా పెద్ద కొలనులా ఉంది సముద్రం. ఏ దివ్యమూర్తి ఆజ్ఞకో కట్టుబడి అలలను మింగేసి మూగబోయినట్టు. తీరపు తడి ఇసుక మీద అసలు ఊహించని క్షణాలలో నీటిబుడగలు పగులుతున్నాయి. కలబంద పొద పక్కన, భూతద్దంలోంచి పెద్దగా కనిపించే తేలులా, పెళ్ళగించి తీసుకోగల సిరా మరకలా, ఒక మండ్రగబ్బ పడి ఉంది. నేను సముద్రంలోకి దిగి నడుస్తున్నాను. పాదాలు, మోకాళ్ళు, నడుము, మెడ దాక వచ్చేసింది నీరు. నన్ను తన లోపలకి లాక్కుంది.

హఠాత్తుగా దృశ్యం కనుమరుగైంది. తలమీద మృగాల శవాలు పడుతూనే ఉన్నాయి.

ఆ రోజునుండి, అప్పుడప్పుడూ ఆ దృశ్యం, కొన్నిసార్లు దాని ప్రభావాలూ, మనసులో మెరిసి మాయమయ్యేవి. ఎడారివైపుగా ప్రవహించి, వేడి ఇసుకలో ఇంకిపోయే నీటి కాలువలా మాయమయ్యేవి. మునపటిలాగే మనసు ఇసుకలా కాగిపోయేది. దాని కాక మనసు గోడల్ని దహించేస్తూ ఉంటుంది. ఓర్చుకుని బలవంతంగా మనసుని లగ్నం చేసుకుంటే, రంగులు కోల్పోయి, నైపుణ్యంలేని ఒక చిత్రకారుడి చిత్రంలా, ఆ వెలిసిపోయిన దృశ్యాలు మనసులో కనిపించేవి.

తరువాత, ఎప్పుడు ఎలా ఆ భావన కలిగిందో తెలీడంలేదు. ఒక దీర్ఘమైన నడకకోసం మనసులో ప్రణాళిక మొదలయ్యింది. నన్ను విహారాలకు తీసుకెళ్ళే సాహసానికి తమని తాము సమర్పించుకునే నా కాళ్ళను వాత్సల్యంగా కౌగిలించుకుని డాబా మీద కూర్చుని కాలం గడుపసాగాను. ఒకరోజు సాయంకాలంవేళ, నేల కాలిపోతున్న డాబామీద చెదరిన ఇసుక నా వీపుని ఒత్తుకుంటూ ఉండగా, ఆకాశంకేసి చూస్తూ పడుకుని ఉన్నాను. మళ్ళీ మనసులో మొగ్గలు విచ్చుకున్నాయి. చెట్లూ, విశాలమైన బయలూ, ఆకాశమూ ఏదో బలమైన విషపుతాకిడికి గురైనట్టు స్తంభించిపోయున్నాయి. ఇక వీటి ముకుపుటాలలో ఊపిరాడటం సాధ్యమేకాదనిపించేంత స్తబ్ధత… శవంలా! ఏదో ఒక దుఃఖం ఆకాశంనుండి కిందకు దిగుతూ ఉంది; కమ్మేస్తుందేమో అనిపించేలా. ఆ దుఃఖం ఎక్కడ తమమీద వాలిపోతుందో, ఈలోగా గూళ్ళకి చేరుకోవాలన్నట్టు పక్షులు దక్షిణ దిశగా ఎగురిపోతున్నాయి. చివరి వరుసలోని పక్షులు వెనకబడిపోతామేమోనన్న భయంతో రెండుమూడు వరుసలు ముందుకు దాటేసే ప్రయత్నంలో ఒకసారిగా శక్తినంతా ప్రయోగించసాగాయి. వాటి భయానకమైన అశాంతి నా మనసుని తొలిచెయ్యడం మొదలైంది.

ఆపైన ఏం జరిగిందో నాకు స్పష్టంగా తెలీదు. ఆ రోజు నా మనోనేత్రంలో చూసిన చిత్రమైన దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూడగలనని అనిపించింది. ఆ చోటుకి తీసుకెళ్ళే దారీ దిక్కూ నా అంతరాత్మకి మసక మసకగా కనిపించాయి. ఆ తర్వాత చేరుకోడానికి ఏం లేదనిపించింది. ఇక అప్పుడు ప్రశ్నేలేదు; బాధా లేదు. లేచి వడివడిగా నడిచాను. రాత్రంతా నడవటంతో ఎన్నో ఊళ్ళు దాటిపోయాను. బాట నా ముందు పరచుకుని ఉంది. దాన్ని జయించేయాలన్న కాంక్షతో నా కాళ్ళు పరుగులు తీస్తున్నాయి. నడుస్తున్నట్టుకాక నన్నెవరో ఎత్తుకెళ్తున్నట్టు ఉంది. దారికిరువైపులా మర్రి ఊడలు గాలిని కల్లులా తాగి చిందులు వేస్తున్నాయి.

ఏటవాలుగా ఉన్న లోయల దారుల్లో మేకలమంద, పాదాలు నిలదొక్కుకోడానికి చోటులేక క్రిక్కిరిసిపోయి, ఒకదాంట్లోకి మరోటి దూరిపోడానికి శ్రమపడుతున్నట్టుగా ఉంది. అలా నేను ఎందులో దూరిపోయి శుభ్రమవుతానో అన్న ఆలోచన రాగానే మనసు చెమ్మగిల్లింది. ఆలస్యమైనా, ఇది నా అర్హతకి తగినదేనన్న నమ్మకం నాకు కుదిరింది. అప్పుడు మనసులో ఒక కనికరమూ, కృతజ్ఞతా భావమూ కలిగి నన్ను నేను సమర్పించుకునే మార్గం తెలియక తపించసాగాను. ఆ పిలుపు వెనుకనున్న కరుణను స్వీకరించాలంటే ఏదో ఒక జత పాదాలపైన శిరస్సు వుంచి వెక్కివెక్కి ఏడిస్తే తప్ప సాధ్యంకాదనిపించింది. ఆ జత పాదాలు బండికి కట్టబడి, నాకందకుండా ముందుకు లాక్కెళ్ళబడుతున్నట్టు లోకంటికి కనిపిస్తోంది. కంచుపీట మీద పోతబోసిన లోహపు పాదాలు!

అనంతమైన విశ్వ స్వభావం అప్పుడు నా మదిలో విస్తరించడం మొదలైంది. ఆకాశాలు అంతస్తులంతస్తులుగా కనిపిస్తున్నాయి. ఒక్కొక్కదాని ఆకృతి, దూరం, వాటి గుణం, చలనం అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనసు బహుదూరం దాటొచ్చాక కూడా, దాటాల్సింది కొండంత దాటొచ్చింది చిగురంత అన్నది తెలిసింది.

చేతులూ కాళ్ళూ అలసిపోయాయి. పాదాలు బొబ్బలెక్కాయి. ఇంకాసేపటికి స్వతఃప్రజ్ఞ కోల్పోగలననిపించింది. నరాలు బిగిశాయి. అయినా హింసలను ఓర్చుకోగల ఉత్సాహాన్ని మాత్రం మనసు కోల్పోలేదు. ముందుగానే ఏర్పాటు చేయబడిన దైవపరీక్షలే అవి. ప్రపంచపు దుఃఖ వాయువుల దుర్గంధానికి మళ్ళీ కొట్టుకుపోకుండా ఉండటానికి, ఎలాంటి హింసాత్మకమైన పరీక్షలనైనా చిరునవ్వుతో అంగీకరించే మనఃస్థితిలోనే ఉన్నాను. గతించిన స్మృతులు జుగుప్సాకరంగా ఓకరించుకుంటూ వచ్చాయి. ఎన్ని తలవంపులు! ఎన్ని నిప్పు గాయాలు! జారిపడి, లేచి, ఎముకలు విరగ్గొట్టుకుని, ఆవేశపడి, సంకల్పించుకుని లేచి, మళ్ళీ పడి… చాలు శిక్షలు! నన్ను నేను సుగంధంలా పీల్చుకుని బ్రతికే సౌఖ్యమే ఇక కావలసింది. ఇకపై నా మనోవీధిలో నెలకొనే నిర్మలత, నిష్కళంకము పాత నీడల్ని కరిగించేస్తాయి. పాచి తీసి శుభ్రం చేస్తే చలమల్లో మళ్ళీ నీళ్ళూరుతాయి. బ్రతుకంటే పిల్లల్లా, పువ్వుల్లా, సుగంధంలా ప్రసరిల్లేది. పీకులాటన్నది ఇకపైన లేదు. ఆలోచనా ఆచరణా ఒకే ధారగా సాగుతుంది. బలహీనతలు కాళ్ళకి చుట్టుకుని పడదోసి వెనకనుండి నవ్వుతుంటే అవమానానికి తలబాదుకుని చచ్చిపోవాలనిపించే ఆక్రోశానికి ఇక తావేలేదు. నేను బలహీనతలకి లొంగి నేలపడి అవమానాలపాలైనవాణ్ణే, అయినా జీవితంలోని తీపినంతా జుర్రుకోవాలని ఆశతో గాఢంగా పరితపించినవాణ్ణి. తపించినందుకు ఫలం నాకు దక్కుతుంది. బతుకుతనివి గురించిన మొర నా చెవులకు వినిపించని క్షణాలు, నాకు ఊహ తెలిసిన రోజునుంచి లేవు. నేను లొంగదీసుకోబడుతున్నాను. మునిగిపోకుండా గట్టెక్కడానికి నేను ఈదిన ఈత ప్రపంచంలో ఏ శక్తినీ విశ్రాంతి పొందనివ్వదు.

మూర్ఛనుంచి తేరుకున్నాక మళ్ళీ చీకటి కమ్ముకుంది. సముద్రపు హోరు వినిపిస్తోంది. సముద్రమంతా ఎర్రమట్టి రొచ్చులా ఉంది. కెరటం మనిషెత్తుకు ఎగసి పడుతోంది. అంత జుగుప్సాకరమైన సముద్రాన్ని నేను అదివరకెప్పుడూ చూడలేదు. ఒట్టి ఇసుక ఒడ్డు. రాళ్ళో, పొదలో, కొండలో ఏమీ లేవు. ఇసుకకు అవతల విశాలమైన బాట, భవనాలు. మళ్ళీ సముద్రాన్ని చూశాను. బండలేవీ లేవు. మత్స్యకారుల పడవలు బొగ్గు గీతల్లా ఊగుతున్నాయి. ఇసుక మీద పుష్టిగా దృఢంగా ఉన్న మత్స్యకారులు కొందరు తమ పడవలకు మరమత్తులు చేసుకుంటున్నారు. పనిలో నిమగ్నమై వున్న వాళ్ళ ముఖాలలో శ్రద్ధ, ప్రశాంతత. ఎక్కడా భయం ఛాయలేదు. ఆ సమయంలో తాము చేస్తున్న పని తప్ప మరి ఏ ఆలోచనకీ మనసులో చోటు లేకుండా పనిలో నిమగ్నమైపోయున్నారు. బాధలకు కేటాయించటానికి తమలో ఏమీ మిగలలేదన్న ముఖభావాలు. వాళ్ళేం మాట్లాడుకోవట్లేదు. వాళ్ళకు మాట్లాడుకునేందుకు ఏదైనా ఉంటుందనికూడా అనిపించట్లేదు. పడవని ఇసుక మీదనుండి నీటిలోకి లాగారు. నీరు పడవని తేల్చడం జరిగిన తక్షణమే అందరూ పడవలోకి ఉరికారు. చాలా సునాయాసంగా, నేర్పుగా. పడవ సముద్రంలోకి వెళ్ళిపోతున్నకొద్దీ ఆకృతి చిన్నదవుతోంది. అది చుక్కలా మారి మాయమయ్యేవరకూ చూసి, అలసిపోయి నేను ఇసుకలో పడుకున్నాను.

[మూలం: అళైప్పు (1973). పళ్ళం(2003) అన్న కథల సంపుటినుండి.]


రచయిత గురించి: ‘ఇక్కడ చదవగలరు’