బేతాళ కథలు: కథన కుతూహలం – 6

పట్టుదలకి సినానిముడయిన విక్రమార్కుడు, బేతాళుడు దాక్కున్న శవం ఉన్న చెట్టు సమీపంలోకి మళ్ళీ తన కారు తీసుకొచ్చి ఆపాడు. ముందు సీటు పక్కనున్న త్రాగు నీరు సీసా మూత తీసి నాలుగు గుక్కల మంచినీళ్ళు ఒక్క గుక్కలో తాగి, సీసాని యథాస్థానంలో ఉంచి కారు తలుపుల తాళాలు వేసేశాడు.

చుట్టుపక్కల నిశీధం, నిరాశాజీవి హృదంతరాల్లో ఘనీభవించిన విషాదంలా భయం గొల్పుతోంది. ఆ భయాన్ని నిర్భయంగా చూడలేక, నింగి నిలువెల్లా వొంగి, చిల్లుల దుప్పటి కప్పుకొంది. చుక్కల్లోంచి నేలవైపు రహస్యంగా తొంగిచూస్తోంది. తెగిన బంధం తెరలుతెరలుగా తలపుకు వస్తున్నట్లోంది, ఎవరి దుఃఖమో ఏడుపుగా మారి గుండెలు జలదరించేలా కూతవేటు దూరంలోంచి వినపడుతోంది. తాగి తూగుతూ ఒక మద్యపానమత్తుడు గొంతెత్తి పాడుతున్న, ‘తోలుతిత్తి ఇది తూటులు తొమ్మిది,’ అనే పాట ఊగులాడుతూ గాలిలో వ్యాపిస్తోంది. రేపటి తప్పనిసరి సన్నివేశాన్ని నేడే దృశ్యమానం చేస్తోంది. ఇంతెందుకు? పరిసరాల్లో ప్రకృతి మనసును పరిపరివిధాలుగా కకావికలం కావిస్తోంది.

స్థితప్రజ్ఞుడయిన విక్రమార్కుడు వీటికి వేటికీ చలించకుండా, కారు వెలుతుర్లో నెమ్మదిగా చెట్టు ఎక్కి, శవంతో పాటు క్రిందకు దిగాడు. తానేదో మోయలేని బరువుని మోస్తున్నానన్న భావనని దరికి రానీయకుండా, భుజం మీద ఉన్న బరువుని మనసుతో తేలిక చేసుకుంటూ కారు దగ్గరకి నడిచాడు. తలుపు తెరిచి కారు ముందు సీట్లో శవాన్ని ఆసీనుడ్ని కావించాడు. ఆ సీను మరోసారి తనివితీరా చూసి తన చతుర్చక్రప్రయాణవాహనాన్ని చతురతతో కదిలించాడు.

విక్రమార్కుడి ముఖకవళికలని అతడికి తెలియకుండా పరీక్షగా చూసిన బేతాళుడు తనలో తాను నవ్వుకున్నాడు. అతడి శరీరం ఉన్నది ఇంకొకరి కళేబరంలో. కనక, అతడు నవ్విన విషయం ఇంకెవరికీ తెలీదు.

“రాజా! నీ ముఖకవళికలు చూస్తుంటే, వెలిగి వెలిగి అలసి సొలసి కొడిగట్టిన దీపకళిక గుర్తొస్తోంది. అంతేకాదు. ఈ మధ్యన పాఠకరావు ఒక కథలసంపుటి తెరిచినప్పుడు, నీకులాగే అతడు ప్రదర్శించిన హావభావాలు నేను కనులవిందుగా దర్శించిన వైనం సైతం బలంగా గుర్తొస్తోంది. నీకు శ్రమ తెలియకుండా ఉండటం కోసం దాన్ని పూస గుచ్చినట్లు వినిపిస్తాను విను.

అలవాటు ప్రకారం, ఆ రోజు కూడా పాఠకరావు ఒక కథల సంకలనం తెచ్చుకుని చదవటానికి ఉపక్రమించాడు. ఒక కథని చదివే ముందు ఆ పుస్తకంలో ఉన్న అన్ని పేజీలని ఒకసారి అతడు తిరగేస్తాడనే విషయం ఇంతకు ముందు నీకు చాలాసార్లు చెప్పాను. పునరుక్తిదోషం అవుతుందని ఈసారి చెప్పటం లేదు. రరసంవారి పల్లెవెలుగులా ప్రతి కథ దగ్గరా ఆగాడు. ఆ ప్రయాణక్రమంలోనే ఒక మజిలీ దగ్గర ఆగి, ‘ఇలా ఉంటే ఎంత కష్టం,’ అని పైకి అన్నాడు. ఇంకో కథ దగ్గర ఆగి ‘ఇది అటూ ఇటూ కాకుండా ఉందే’ అని గొణుక్కున్నాడు. చకచకా పేజీలను తిప్పుతూ, మరో కథ ఉన్నచోట దృష్టిచక్రాలను ఆపాడు. ‘ఇదీ సరయిన పద్ధతి,’ అని ఆత్రంగా ఆ కథని చదవటం ఆరంభించాడు.

రాజా! ఇంతకు ముందు కూడా ఇలాంటి సన్నివేశాల్లో అతడు ప్రవర్తించిన విధానాలు చిత్రంగా అనిపించాయి. ప్రతిసారీ ఆ అభిప్రాయాన్ని నేను ప్రతిపక్షంలా ఉద్ఘాటించాను. ప్రభుత్వపక్షంలా నువ్వు వాటిని ఖండించావు. అయితే ఈసారి పాఠకరావు ప్రవర్తన ఇంతకు ముందు వాటిని తలదన్నేలా ఉంది. ఈ మధ్యన నేను కొత్తగా చూసిన ఒక పాత సినిమా టైటిల్ని సైతం అది గుర్తుకు తెచ్చింది.

ఇంతకీ పాఠకరావుకు వచ్చిన కష్టం ఏమిటి? ‘అటూ ఇటూ కాకుండా ఉందే’ అని అతడన్నది దేని గురించి? ఇదీ సరయిన పద్ధతి అని అతనికి అనిపించింది దేన్ని చూసి? ఈ ప్రశ్నలకి జవాబు తెలిసి కూడా చెప్పకపోయావో, కొన్ని తెలుగు కథల్లో అర్థం పర్థం లేకుండా కొందరు రచయితలు వాడుతున్న అనేకానేక రెండుమూడునాలుగు చుక్కల్లా, నీ తల కూడా వేయి ముక్కలవుతుంది.”

బేతాళుడి మాటలు విన్న విక్రమార్కుడు కూడా తానేమీ తక్కువ తినలేదన్నట్లు, తనలో తాను ఒకసారి నవ్వుకున్నాడు. నెమ్మదిగా జవాబు చెప్పటం మొదలు పెట్టాడు.

“బేతాళా! కొన్ని కథల్లో అసలు సంభాషణలు ఉండవు. వాటి గురించి మాట్లాడాల్సిందేమీ లేదు. సంభాషణలున్న కథల్ని రచయితలు సాధారణంగా మూడు రకాలుగా రాస్తుంటారు. ఒక పద్ధతి, పాత్రల సంభాషణలని మిగిలిన కథతో కలిపి రాయటం. రెండోది, కొన్ని సంభాషణలని మిగిలిన కథనంతో కలిపి, కొన్ని సంభాషణలని విడిగా రాయటం. మూడోది, ప్రతి పాత్ర సంభాషణనూ దేనికది విడి విడి పేరాల్లో రాయటం, మిగిలిన కథను దానితో కలపకపోవటం.

పాఠకరావు మొదట చూసి ఆగిన కథలో రచయిత పాత్రల సంభాషణలని ఎక్కడికక్కడ మిగిలిన కథతో కలిపి ఒకే పేరాగా రాశాడు. సంభాషణలున్న ప్రతి పేరాలోనూ కొంత కథ కలిసుండటంతో, ఏ విషయం ఏ పాత్ర చెపుతోంది? ఏ విషయం కథకుడు చెపుతున్నాడు అనే విషయంలో కొంత అయోమయం కలుగుతుంది.

అంతే కాదు. పాత్రల సంభాషణ, కథలో మిగిలిన భాగం; ఈ రెండిటినీ చదవటం రెండు భిన్నమయిన అనుభవాలు. రెండు విభిన్న అనుభూతుల్ని కలిగించే అలాంటి పేరాలని ఏకసమయంలో చదివి జీర్ణించుకోవటం అంతగా సులభసాధ్యం కాదు. అందుకనే, మొదటి కథని చూసి, పాఠకరావు ‘ఇలా ఉంటే ఎంత కష్టం,’ అని అనుకున్నాడు.

రెండో కథలో, రచయిత కొన్ని సంభాషణలని విడిగా, కొన్నిటిని మిగిలిన కథనంతో మేళవించి రాశాడు. వీటిని చదవటమంటే, రెండు పడవల్లో రెండు కాళ్ళని పెట్టి ప్రయాణం చేయటం. తీరం చేరటం క్లిష్టమయిన మానసిక వ్యాయామం. దాన్ని చూసి, పాఠకరావు అందుకే, ‘ఇది అటూ ఇటూ కాకుండా ఉందే’ అని గొణుక్కున్నాడు.

ఇక మూడో కథ దగ్గరకు వచ్చేసరికి, ఆ కథారచయిత తన కథలో, ఒక్కో పాత్ర మాట్లాడిన మాటల్ని ఒక్కో పేరాగా రాశాడు. అంతే కాకుండా పాత్రలు మాట్లాడుకున్న మాటల చివర పాత్రల స్పందననీ, ప్రతిస్పందననీ అక్కడక్కడ జోడించాడు. తద్వారా ఏ మాటలు ఎవరివి అన్న అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డాడు. అదనంగా, నేపథ్యంనుంచి తన కథనాన్ని పాత్రల సంభాషణనుంచి విడదీసి చెప్పాడు. ఈ ప్రక్రియనంతా చూసిన పాఠకరావు కథ చదవటం అనే తన పని బ్లాకురివరు పైన కార్టు వాకు అయిందనిపించి ‘ఇదీ సరయిన పద్ధతి,’ అని అనుకున్నాడు. ఆ కథని అమందానందకందళిత హృదయారవిందుడై చదవటం మొదలు పెట్టాడు.

అంతకుమించి, అతడి ప్రవర్తనలో ఎప్పుడో తీసిన, ఇప్పుడు నువ్వు చూసిన తెలుగు చలనచిత్రం టైటిల్ గుర్తు తెచ్చుకుని హాశ్చర్యపడాల్సినంత విశేషం ఏమీ లేదు.”

ఇలా విక్రమార్కుడికి మౌనభంగం కాగానే, పరిమిత ఊహాశక్తితో అపరిమితంగా రచనలు చేయటానికి ప్రయత్నించి విఫలం కావటంలో సఫలమైన కొందరు రచయితల్లా, బేతాళుడు అర్ధాంతరంగా మాయమయ్యాడు. విక్రమార్కుడి కారు లోంచి ‘విధి ఒక విషవలయం, విషాదకథలకు అది నిలయం!’ అనే పాట ప్రారంభమయింది.

(సశేషం)

(గమనిక: ఈ కథలో ప్రస్తావించిన అంశాన్ని అధ్యయనం చేయటం కోసం ఎన్నుకున్న 356 కథల్లో, 23 కథల్లో సంభాషణలు అసలు లేవు. 15 కథల్లో, సంభాషణలు మిగిలిన కథనంతో కలిపి ఉన్నాయి. 87 కథల్లో, సంభాషణలు విడిగానూ-కథనంతోనూ కలిపి ఉన్నాయి. 231 కథల్లో మాత్రమే, సంభాషణలు కథనంతో కలవకుండా విడివిడి పేరాల్లో ఉన్నాయి.)

టి. చంద్రశేఖర రెడ్డి

రచయిత టి. చంద్రశేఖర రెడ్డి గురించి: ఖమ్మం జిల్లాలోని వైరాలో జన్మించిన చంద్రశేఖర రెడ్డి ఉద్యోగవిరమణానంతరం వైరాలోనే విశ్రాంతజీవనం గడుపుతున్నారు. పుస్తక పఠనం, చిత్రలేఖనం, సంగీత శ్రవణం ఆయన అభిరుచులు. ...