పోయిన సంవత్సరం అక్టోబర్ 25న జెనీవా నుండి పారిస్ వెళ్తూ విమానంలో ఫోను కట్టేయబోతుంటే వెంటవెంటనే మిత్రులు తాళ్ళూరి వెంకటరావు, మాగంటి వంశీల నుండి “విశ్వనాధం గారు కన్ను మూశారు” అని వార్త. కొంత కాలంగా ఆయన ఆరోగ్యం అంత బాగా లేదని తెలుసు కాని డిసెంబరులో ఇండియా వెళ్ళినప్పుడు కలుస్తానని, ఎప్పటిలానే టి.వి.రావు గారితో కలిసి ఆయన ఇంటికి వెళ్ళి కబుర్లు చెప్పుకోవచ్చనే ఆలోచనల్లో వున్న నేను దిగ్భ్రాంతి చెందాను. నిజానికి విశ్వనాథం గారితో నా పరిచయం కేవలం గత 13-14 ఏళ్ళగానే. నేను విన్న రేడియో కార్యక్రమాలు, నాకు తెలిసిన లలిత సంగీత ప్రపంచమంతా విజయవాడ రేడియో కేంద్రం నుండి ప్రసారితమైనవి కావడంతో హైదరాబాదు కేంద్రంలో ఆయన చేసిన సంగీతసృష్టిని గురించి నాకు ఎక్కువగా తెలిసే అవకాశం లేదు.
రాలలోపల పూలు పూచిన భూధరమో సాగరమో అంజలిదే మానవోత్తమా చిరంజీవి మానవుడా, పురోగామి మానవుడా
ఆయన స్వరపరచిన — వచ్చెనోయి వసంతము (వసంత ?), గాలి పూల సరాగము (కె.బి.కె. మోహనరాజు), భూధరమో సాగరమో (మం. బాలమురళీకృష్ణ), వేదవతీ ప్రభాకర్ పాడిన కొన్ని గీతాలు, విజయవాడ కేంద్రం ద్వారా కూడా ప్రసారమవుతుండేవి. అప్పట్లో అవి ఆయన బాణీలని నాకు తెలియదు. నాకు తెలిసినదల్లా పద్మరాజు గారి సోదరుడని, బంగారు పంజరం (1968) సినిమాలో ఆయన గతంలో దేవులపల్లి గీతాలకు కట్టిన బాణీలను రెంటిని:నీ పదములె చాలు రామ నీ పద ధూళులె పదివేలు, గట్టు కాడ ఎవరొ చెట్టు నీడ ఎవరో వాడుకున్నారని, రేడియో కేంద్రంలో ప్రవేశించక ముందు అయిదేళ్ళ పాటు ఉదయశంకర్ బృందానికి సంగీత దర్శకుడైన విష్ణుదాస్ షిరాలీ దగ్గర సహాయకుడిగా పనిచేశారని (ఈ కాలంలోనే కల్పన (1948) చిత్రం తయారయ్యింది.) లాంటి అందరికీ తెలిసిన విషయాలే.
కచ్చితంగా జ్ఞాపకం లేదు కానీ 1998 లోనో, 1999 లోనో, టి.వి. రావు గారు విశ్వనాథం గారింటికి తీసుకెళ్ళి పరిచయం చేశారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం హైదరాబాదు వెళ్ళినప్పుడు రావు గారితో కలిసి విశ్వనాథం గారింటికి వెళ్ళకుండా ఊరొదలలేదు. ఆయనను కలవటానికి ముందు కొందరు ‘ఆయన రజనీకాంతరావు గారిలాగా మితభాషి’ అని చెప్పారు. ఒక దశాబ్దం పైన పరిచయం తరువాత నేను ఈరోజు ఆ మాట నిజం కాదని చెప్పగలను. (ఆ మాట రజని గారి విషయం లోను నిజం కాదు!) అంత హాయిగా, ధారాళంగా, మంచి విషయ పరిజ్ఞానంతో కబుర్లు చెప్పే మనుషుల్ని నేను చాలా తక్కువ మందిని కలిశాను. దేశ స్వాతంత్ర్యోద్యమం గురించి, 1925-1960ల మధ్య కాలం నాటి సాంస్కృతిక జీవనం గురించి, ప్రముఖ రచయితలతో – ముఖ్యంగా దేవులపల్లితో – పరిచయాల గురించి కళ్ళకు కట్టినట్లు చెప్పేవారు. ఇంక ఆ కాలం నాటి నాటక, సంగీత ప్రపంచం గురించయితే చెప్పనక్కరలేదు.
చిరుగాలులు సందడి చేస్తే ఈ నల్లని రాలలో ఎన్నిసార్లు అన్నాడో ఏటి దాపుల
ఒకసారి స్థానం గురించి నేను ఏదో ప్రశ్న అడిగితే స్థానంలోని గాయకుని కంటే నటకుడెంత గొప్పవాడో విశ్లేషిస్తూ ‘రోషనారా’ పాత్ర గురించి చాలాసేపు మాట్లాడారు. నాకైతే ఆ నాటకం చూస్తున్న అనుభూతి కలిగింది. నిజానికి స్థానం రోషనారా పాత్ర పుట్టుక గురించి తన ఆత్మకథ ‘నటస్థానం’లో వివరంగానే రాస్తారు. విశ్వనాథం గారి వర్ణనలో ఆ పాత్ర మనముందొచ్చి నిలబడినట్లుంది. అదే ఉత్సాహంతో నండూరి సుబ్బారావు గారి ఎంకిపాటలు, కొనకళ్ళ వెంకటరత్నం గారి బంగారి మామ పాటల గురించి, వాటిని ఆ రోజుల్లో ఎలా పాడేవారో, బి.వి. నరసింహరావు గారెలా అభినయించేవారో చెప్తుంటే కాలం తెలిసేది కాదు. ప్రతి సంవత్సరం ఇలా కబుర్లు చెప్పుకోవడం, కొత్త విషయాలు తెలుసుకోడం, జర్మనీ తిరిగి వచ్చిన తరువాత ఆ సంభాషణని రికార్డు చేసుకుని ఉంటే బాగుండేదే అని బాధపడటం జరుగుతుండేది. 2006లో మాత్రం వెల్చేరు నారాయణరావు గారితో కలిసి ‘భావ కవిత్వంలో జానపదం, జానపదంలో భావకవిత్వం’ అనే వ్యాసం రాసే ప్రయత్నంలో, ముఖ్యంగా ఎంకిపాటలు తొలినాళ్ళలో సుబ్బారావు గారే ఎలా పాడేవారో పాడి వినిపిస్తే రికార్డు చేసుకున్నాను (అలాగే రజని గారు పాడితే కూడా.) 2010-11 సంవత్సరాల్లో ఆయన జ్ఞాపకాలను వివరంగా రికార్డు చేసే ప్రయత్నం చేశాం కానీ ఆయన ఆరోగ్యం అంతగా సహకరించక పోవడంతో ఆ కార్యక్రమాన్ని విరమించుకున్నాం.
గాలి పూల పరాగం క్రొత్తదారి పక్కనుంచి శివశివయనరాదా
కలిసిన ప్రతి సారీ కొత్త ఆల్బం చేశాను వినండి అంటూ సి.డిలు ముందు పెట్టేవారు. ‘జాతీయ గేయమాల’ (6 సి.డి.లు) ఆల్బం చేతికిస్తూ, “ఈరోజు పిల్లలకి స్వాతంత్రోద్యమం గురించి మనం పాడుకున్న గొప్ప పాటల గురించి ఏమీ తెలియటం లేదు. ఆ పాటలు ఈ తరం వాళ్ళకి తెలిసేట్లు చూడండి,” అంటూ మూర్తి రాజు గారు ఒక కండువాలో మూటగా కట్టుకొచ్చిన డబ్బును ఆయన ఒళ్ళో ఎలా పెట్టారో కదిలిపోతూ చెప్పారు. చివరిగా నాకున్న మరొక గొప్ప జ్ఞాపకం మిత్రులు టి.వి.రావు గారి చిన్నబ్బాయి పెళ్ళికి తమ నాదవినోదిని బృందంతో వచ్చి రెండు గంటలకు పైగా కేవలం తెలుగు సాంప్రదాయిక పెళ్ళి పాటలతో కచేరీ చేయడం.
రసతరంగిణి – సంగీత రూపకం పదములె చాలు రామా – బాణీ 1 పదములె చాలు రామా – బాణీ 2 వచ్చెనోయీ వసంతము
విశ్వనాథంగారి సంగీత సృష్టిని వీలయినంత పదిలి పరచే కార్యక్రమంలో ఆయన శిష్యులు, మిత్రులు కొందరు ఒక వెబ్‌సైట్‌ని నిర్వహిస్తున్నారు. ఆయన రచనలు, ఆయన పాడిన, బాణీలు కట్టిన సుమారు 250 పాటలను అక్కడ వినవచ్చు. అక్కడే మరిన్ని పాటల వివరాలని కూడా చూడవచ్చు.
ఆయనకు నివాళిగా ఆయన స్వరపరచిన కొన్ని లలిత గీతాలను ఇక్కడ మీ ముందుచుతున్నాను. వీటిలో పాలగుమ్మి సమర్పించిన రసతరంగిణి, చిత్తరంజన్ పాడిన అంజలిదే మానవోత్తమా, హైదరాబాదు రేడియో స్టేషన్‌లో 26 అక్టోబర్ 2012 నాడు ప్రసారమయినవి. వీటిని ఎంతో శ్రద్ధతో రికార్డు చేసి పంపిన టి.వి.రావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.