తీరా అక్కడికెళ్ళి చూస్తే ఏముంది?
తెరలు దించేశారు. ఇంక నాటకం ఆడేది లేదు పొమ్మన్నారు.
నువ్వు బిచ్చగాడు ముద్దకోసం అరిచినంత దీనంగా అరిచావు. పిచ్చోడు గరుకు రాళ్ళేరుకుని మూట కట్టుకున్నంత శ్రద్ధగా అడిగావు. జ్వరం తగిలిన పిల్లాడికి వళ్ళు తుడుస్తూ దేవుళ్ళకి మొక్కుకునే తల్లిలా, కేవలం మనిషివి తప్ప మరేం కాకుండా మోకరించావు వాళ్ళ ముందు.
“ముసలోన్ని బాబూ, చేతికర్ర పోటేసుకుని పొగులంతా నడిసొస్తన్నా నాయనా, ఇదొక్కపాలి నాకోసం ఆడండి తండ్రుల్లారా! పోనీ ఆ చివరాకర తెరదించే ముందు వొస్తదిగా. ‘ఈ సుకదుక్కాల్ని యిస్మరించి, చాస్వతానంద కారకమైన సత్తేన్ని అనువేచించి… ఆ మాటల్నోసారి చెప్పించరాదా అయ్యా!’ అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నావు.
వాళ్ళందరూ స్టేజీ సర్దేశారు. మొహాలకి పూసుకున్న రంగులు తుడిచేసుకున్నారు. తళుకుల బట్టలు మార్చి అతుకులేసిన పాతచొక్కాలు తొడిగేసుకున్నారు. పొట్లాల్లో ఆరిపోయి బిగుసుకుపోయిన అన్నం సయించక పాడుబడ్ద పెంకుటింటి వసారాలో చింకిచాపో తలగుడ్డో వేసుకుని నిద్రరాక పొర్లుతున్నారు. కథానాయకుడున్నాడుగా, నువ్వడిగిన మాటలు మహబాగా చప్పట్లమధ్య మళ్ళీ మళ్ళీ చెప్పి గొంతుజీరబోయిన వాడు, వాడు మాత్రం నల్లవిగ్గు తీసేసి ఎర్రజుట్టు దువ్వుకున్నాడు, సీసా మూత తెరుచుకు కూచుని, అప్పుడప్పుడూ ఏదో గుర్తొచ్చి అమ్మలక్కలు లంకించుకుని శివాలెత్తుతున్నాడు.
వాళ్ళ దగ్గర, వాళ్ళకన్నా హీనంగా చతికిలబడి దణ్ణాలు పెట్టి అడుక్కుంటున్నావు నువ్వు. ఆ వూర్నుంచి ఈ వూరిదాకా కాళ్ళీడ్చుకొచ్చేసరికి ఈవేళయింది. నువ్వొచ్చేసరికే నాటకం ఐపోయింది. ఇప్పుడు నువ్వు తిరిగెళ్ళలేవు. నువ్వడిగిన ఆ నాలుగు మాటలు వినటానికే ఈ జీవుడు ఇంకా నిలిచిపోయింది.
ఎన్నేళ్ళనాటి మాట! ఏ కాలం నాటిదీ నాటకం? ఇరవయ్యేళ్ళేమో నీకప్పుడు. ఎన్ని ఊర్లలో ఎంత ఘనంగా ఆడిన నాటకం! ఏవూర్లో ఆడినా ఎంత పెద్ద స్టేజీ మీదైనా వేషగాళ్ళ మొహానికి నువ్వే రంగులు పూసేవాడివి. విగ్గులు పెట్టి, వాళ్ళ చొక్కాలమీద మెరుపు కాయితాల పూలు అంటించేవాడివి. ఆట మొదలవగానే పరిగెత్తి జనంలో చేరి చూసేవాడివి. ఇకంతే, నీకు వొళ్ళు తెలిసేది కాదు. చివరికంటా చూశాక, ఆఖర్లో కథానాయకుడు ఇల్లొదిలి వెళ్ళిపోతూ ‘ఈ సుఖదుఃఖాల్ని విస్మరించి, శాశ్వతానంద కారకమైన సత్యాన్ని అన్వేషించి…’ అనే మాటలు గంభీరంగా చెప్తుంటే వొళ్ళంతా పులకరించి పూనకమెత్తేవాడివి. నీకా అక్షరమ్ముక్క రాదు. ఆ మాటలన్నీ ఏంటో, వాటి అర్థమేంటో నీ ఊహకి కూడా అందలేదు. అవేవో గొప్పమాటలని మాత్రం నీకు తెలుసు, వాటి ప్రకారం నడిస్తే ఏడుపుండదని, బతుకంతా అట్లా ఆ నాయకుడిలా గంభీరమైన మొహంతో గొప్పోడిలా బతకొచ్చని నీకు నికరంగా తెలుసు. ఈ చదువుకున్నోళ్ళకంటే చాలా బాగా నీకొక్కడికే తెలుసు ఆ సంగతి. ఎవర్నో అడిగి బతిమాలి ఆ మాటల్ని ఓ కాయితమ్ముక్కమీద రాయించుకుని నీ ఇంట్లో మట్టిగోడ మీద మైదాపిండి రాసి అంటించుకున్నావు కూడా.
మాయదారి జబ్బేదో వచ్చి నీ అయ్య పోయాడు. పెద్దోడివి, నాటకాలని ఊళ్ళు పట్టుకు తిరిగితే ఈ సంతకి కూడుబెట్టే దిక్కేదని కావల్సినోళ్ళు నాలుగు చివాట్లేసి నిన్ను కూలిపనికి కుదిర్చారు. నీ అయ్య పోతే నువ్వేడవలేదు. దిక్కుమాలినోడు, పెట్టిందానికన్నా కొట్టిందే ఎక్కువ పాపిష్టోడు అని మీ అమ్మ లోపల, నువ్వు పైకే అనుకున్నారు. కానీ, నువ్వు లేకుండా జీవనసంధ్య నాటకం పక్కూర్లో ఆడిన రోజు మాత్రం ఏడ్చావు. గోడకంటించిన కాయితమ్ముందు కూర్చుని ఎక్కిళ్ళతో పేగులు నెప్పెట్టేలాగా ఏడ్చావు. నాటకం పూర్తయ్యే జాముకి ఆ కాగితాన్ని తడుముకుని, దాన్లో మాటలు గుర్తు తెచ్చుకుని, ‘ఇట్లా ఏడవకూడదని కదా, బాగా పెద్దరికంగా, మొకం దైర్నంగా ఉంచుకుని బతకమని కదా దీన్లో ఉంది,’ అనుకుని మొహం కడుక్కుని పడుకున్నావు.
తర్వాత్తర్వాత ఏడుపు మర్చిపోయావు గాని, నాటకాన్ని గానీ నాయకుణ్ణి, అతని మాటల్ని గానీ మర్చిపోలేదు. ఎట్లా కనిపెట్టిందో గాని సుగుణమ్మ కాపురానికొచ్చినరోజే అడిగింది. ‘ఒక్క దేవుడి బొమ్మా లేదుగా ఇంట్లో వాసనకడ్డీ యెలిగిద్దామంటే! ఈ కాగితమ్ముక్కకి దణ్ణం బెట్టుకోడం ఎవరు నేర్పారోగాన్నీకూ…’ అని. బయటికి ఎవర్తో చెప్పుకోకపోయినా నీ పెళ్ళానికి తెలుసు నువ్వు మిగతా వాళ్ళలాగా కాదని. సాయంకాలం పూట పొయ్యి దగ్గర చేరి దాకలో పులుసు కలబెడుతూ ఆకాశంలోకి అట్లా చూస్తూ ఉంటావు కదా, అప్పుడది నిదానంగా సణుక్కునేది. ‘ఏం విడ్డూరం మనిషమ్మా! చుట్టకనో, చుక్కకనో బజాట్టోకి పోకండా పెళ్ళాం చేతికి అడ్దం పడతాడు. ఇంకేవన్నా అంటే అట్టా పైకంటా సూత్తాడు. ఏవయ్యో! ఏవుంటదాడ?’ అట్లా పైకంటుంది గానీ నీకు తెలీదు, దానికి లోపలెంత కులుకో, ఏం టెక్కో, దాని మొగుడు బలే మర్యాదగల్లోడు, వివరం తెలిసినోడు అని.
పెళ్ళయ్యేదాక ఎవరూ సుగుణమ్మతో ‘నువ్వు చక్కనిదాని’వనలేదు. బక్కపలచటి మనిషి. కాయకష్టం చేసుకున్న చామనచాయ ఒళ్ళు. ఎప్పుడూ ఏదోక పని చేస్తానే ఉండేది. తిన్నగా చతికిలబడి నేలమీద కూచోగా చూడలేదు ఎవరూ. మోకాళ్ళ మీద గొంతు కూర్చునే అన్నమొండటం, కోళ్ళకి గింజలెయ్యడం, కత్తిపీటతో కాయగూరేదో తరిగేటప్పుడు కుక్క గానీ అటువైపొస్తే దానికో రెండు ముక్కలిసరడం, గిన్నెలు తొలిపిన నీళ్ళు అట్లా మొక్కల్లోకి జల్లడం, అంతే దానికి తెలుసు. చీలమండల పైకి చీర, ఎప్పుడన్నా నాలుగు నిత్యమల్లి పూలో కనకాంబరాలో జుట్టుముడిలో దోపుకోడం, అదీ దాని అలంకారం. పని చేసుకునేటప్పుడు, కూర్చుని లేచేటప్పుడు టకటకమని మొటికల చప్పుడు పైగా.
అప్పటిదాకా ఎన్ని మొహాలకి రంగులేసినా అవి నీకు ఒట్టి మొహాలే. సుగుణొచ్చేదాకా ఆడవాళ్ళంటూ ప్రత్యేకంగా ఉన్నట్టు ఎప్పుడూ అనిపించలా నీకు. అదొచ్చాక ఇంకెవరూ ఆడోళ్ళలాగా కనపళ్ళేదు. ఎందుకు? అదేమన్నా అందగత్తా? రంగా రూపమా కళ్ళా ఒళ్ళా? అవేం లేవు. నీతోపాటు ఉండిపోడానికి వచ్చేసిందిగా, నీతో చెప్పుకునే మాటలు ఇంకెవరితో చెప్పుకోదుగా. సంతోషంగా ఉండటమంటే ఇదీ అని నీకెప్పుడూ దేని గురించీ అనిపించలేదు కానీ సుగుణ ఉన్నప్పుడు అంతా మాములుగా ఉన్నట్టు, అదింట్లో లేనప్పుడు వెలితిగా ఉన్నట్టూ మాత్రం అనిపించేది. అదేం చేసినా నచ్చుతుందని కాదు, దాని పెడసరం మాటలు కొన్ని, పాడలవాట్లు కొన్నీ చికాకు పెట్టవనీ కాదు. మనుషులమీద కోపమెట్లా తెచ్చుకోవాలో నీకు చేతగాక, కోపం రాని మొగుణ్ణి సాధించడమెట్లాగో దానికి తోచక, అట్లా గడిచిపోయేది. ఒకవేళ నువ్వెందుకన్నా మనసు కష్టపెట్టుకుని మాట్లాడకుండా ఉంటే ‘ఓయబ్బ! నీలిగింది చాల్లే, పోయి తిను పో’ అని సుగుణ అటు తిరిగి ఆవులించినట్టు నాటకమాడటం, ‘ఏదో మాట జారాన్లేవే గుణమ్మా! మనసులో పెట్టుకోమాక,’ అని నువ్వు దాని భుజం పట్టుకు ఊపి దొంగనిద్ర చెడగొట్టడం, ఇదే మోస్తరు నడిచింది చాన్నాళ్ళు.
జీవనసంధ్య నాటకంలో ఒకచోట నాయకుడు ప్రియురాలితో అంటాడు, ‘నా అనురాగం కళంకం లేనిది. హృదయపూర్వకంగా నీ ప్రేమని అర్థిస్తున్నాను,’ అని. ఆ మాట అనేటప్పుడు ఆ పిల్ల అరచేతిని తన చేతుల్లోకి తేసుకుని క్షమాపణగా, ఆరాధనగా, నిస్సహాయంగా ఆమె వైపు చూస్తాడు. అప్పట్లో నీకా భాగం అంతగా నచ్చేది కాదు. పెద్దగా అర్థమయ్యేది కూడా కాదు. కానీ సుగుణతో పేచీ పడ్దప్పుడు, ఏదో ఆలాపనలో ఉండి అది పిలిస్తే కసురుకున్నప్పుడు, అది రుసరుసలాడితే ఓర్చుకోలేక విసిరికొట్టినప్పుడు, అట్లా విసిరికొట్టాక అది అలిగి మూగమొద్దులాగా పనిచేసుకుంటున్నప్పుడు, నీకనిపించేది గుండెలోంచి ఏదో తన్నుకొస్తున్నట్టు, ఏవో మాటలు లోపల్నించి ఊపిరాడకుండా ఒకదాంతో ఒకటి పురిపడుతున్నట్టు. చింతచెట్టు కింద ఒక్కడివే బాసింపట్లేసుకుని ఆ ‘అనురాగం, కళంకం’ వాక్యాలు పెద్దగా నీతో నువ్వు చెప్పుకునేవాడికి. మళ్ళీ చుట్టూ ఎవరన్నా చూస్తారేమో అని మెల్లగా గొణుక్కునేవాడివి. పదాలు నోరు తిరగనప్పుడు బుర్ర మీద నీకు నువ్వే ఒక మొట్టికాయ వేసుకునేవాడివి. పదిసార్లు నీకు నువ్వు చెప్పుకుని, తప్పులేం లేవని తీర్మానించుకుని, తీరా సుగుణ దగ్గరకెళ్ళాక చెప్పటానికి మాట పెగిలేది కాదు. అక్కడక్కడే తల గోక్కుంటూ, చొక్కా అంచులు లాక్కుంటూ దాని చుట్టూ తిరిగేవాడివి. అదెట్లానో కనిపెట్టేది నీ వాలకం. ‘మళ్ళీ వచ్చా? ఆ కాగు ఇటందియ్యి. నీళ్ళకి పోతా,’ అని పట్టీ పట్టనట్టుగా మాట్లాడి మళ్ళీ నిన్ను మాటల్లో కలిపేసుకునేది. ఎన్ని సంవత్సరాలు గడిచినా నీకా ‘అనురాగం’ మాట సుగుణతో చెప్పే ధైర్యం రాలేదు.
మూడు సార్లు కడుపు పోయి మోయలేనన్ని మొక్కులు మొక్కుకుని దాదాపు నడివయసు మీదపడ్డాక దక్కిన ఒక్కగానొక్క పిల్లాడికి దేవుడి పేరు పెట్టకుండా జీవనా అని పిలుస్తావని ఊరోళ్ళతో పాటు సుగుణ కూడా తిట్టిపోసేది. కానీ, ఆ పేరువల్లే వాడివ్వాళ ఇంత తెలివిగల్లోడయ్యడని నీకు తెలిసినట్టు వాళ్ళకి తెలీదుగా. సుగుణ మాత్రం వాణ్ణి జీవుడూ అని కేకేస్తే నీకెంత కచ్చిగా ఉండేదో. ‘నా అంటే ఉన్నంత మెత్తంగా డూ అంటే ఉండదే యెర్రిదానా!’ అన్నువ్వు చెబితే అది కోరగా ఓ చూపు చూసి ‘ఏవోనయ్యో, ఆ సోపలన్నే నాకు తెలవదు. మొక్కు ఎగ్గొట్టిన మొనగోడివి, ఏ మొహం బెట్టుకుని చెబుతున్నా?’ అని తిరుగులేని నెపంతో తెగబడేది.
మాగన్ను నిద్రలో ఏనాటివో సుగుణ మాటలు తలపుకొచ్చి నవ్వుకున్నావు. కూర్చునే నిద్రలోకి పోతున్నావు. చలికి మునగదీసుకు పడుకున్న వీధికుక్క ఒకదానికొకటి మెలిపడ్డ కాళ్ళని మత్తుగా విడదీసుకుంటూ సన్నగా కుయ్యిమంది. గోడల వెనకనుండి కీచురాళ్ళు రూరూమని రొదపెడుతున్నాయి. పందిరి గుంజ వీపుకి ఒత్తుకుని కళ్ళు తెరిచావు. నాటకం వాళ్ళంతా చింకిచాపల మీద, అరుగుల మీద, దొరికినచోట దొరికినట్టు వెర్రినిద్రలో ఉన్నారు. దిగులుగా, జాలిగా, నీ గతమ్మీద గుబులుతో వాళ్ళవైపే చూస్తున్నావు.
ఆ చివరాఖర్న మూలన ముడుచుకు పడుకున్నవాడు సుమారుగా జీవన ఈడు వాడే. ఐతే వీడు బక్కపలచన, ఎవరేం చెప్పినా చేసుకుపోయే మొహమాటపోడు. జీవనట్లా కాదు. గట్టి ఒళ్ళు, నిక్కచ్చి మనిషి. మాటలో జంకూ, బొంకూ తెలీదు. ‘నీకంతా మీ అమ్మదే వొచ్చిందిరా!’ అని మురిపెంగా విసుక్కుంటావు నువ్వు. వాడికెప్పుడూ జనం కావాలి. చేతినిండా పని కావాలి. ఎక్కడిక్కడికెళ్తాడో, ఎవరెవర్తో సావాసం కడతాడోగానీ భలే భలే పనులు నేర్చుకొస్తాడు. పాత టైర్లు, పారేసిన కొబ్బరి టెంకెలు, తెగిపోయిన చెప్పులు, పీలికలైన పాతబట్టలు, ఒకటనేంటిలే… ఏద్దొరికితే దాంతో వాడుకునే వస్తువులో, దాచుకునే బొమ్మలో ఏదో ఒకటి చేస్తాడు. వాడిచుట్టూ ఓ పదిమంది పిల్లలో, పెద్దోళ్ళో ఎప్పుడూ మూగే ఉంటారు. పాతవాళ్ళూ, పట్నంవాళ్ళూ అన్లేకుండా ఏ దూరపు వూళ్ళమ్మటో తిరుగుతూ, కొత్త పనులు చేసుకుంటా సందడిగా ఉంటాడు. వాడికి పొద్దు చాలదు, నీకు పొద్దు గడవదు. ఏ పని చెయ్యటానికీ నీ చేతుల్లో సత్తువ లేదు. సుగుణ పోయాక ఏదన్నా చెయ్యాలన్న హుషారూ మిగల్లేదు. ఈ నాటకం కోసమని ఇన్నేళ్ళకి ఇల్లు కదిలి, ఊరొదిలి కర్ర పోటేసుకుని ఇంతదూరమొచ్చావు గానీ లేకపోతే ఎవరితోటీ మాట్లాడాలని, ఎటన్నా పోయి తిరగాలనీ మొదట్నుంచి ఎట్లానూ లేదు.
ఇప్పటిదాకా పక్కూరి గుళ్ళోనుంచి వినిపిస్తున్న భజన సద్దుమణిగింది. వసారాలో ఒక మూలన చిందరవందరగా నాటకం వాళ్ళ అరిగిపోయిన చెప్పులు, బట్టల పెట్టెలు, అలంకరణ సామాన్లూ. వాటిక్కాస్త అవతల దీపం మలిగిపోయిన మట్టి ప్రమిదెలో నూనెవాసన, నూనెలో ఇంటివాసన, ఇల్లంటే సుగుణతో పాటు కలియతిరిగే నేతచీర వాసన, ఆమె చేతుల్లో తిరిగే రకరకాల పనుల తాలూకు దినుసుల, వస్తువుల వాసన, చివర్రోజుల్లో ఆమె మంచం పక్కన గుట్టగా పడున్న మందుల వాసన. ఆ మంచం పక్కనే మట్టి మూకుడులో పాలు కతికే పిల్లి వాసన. ఆమె పోయాక పిల్లి రావడం మానేసింది. నీ ఇంట్లో చాలా వాసనలు రావటం మానేశాయి. నీకు చాలా చప్పుళ్ళు వినపడటం మానేశాయి.
అప్పుడప్పుడూ నీకు కలలొచ్చేవి. ఈమధ్య కొద్దికాలం దాదాపు ప్రతీరాత్రీ వచ్చాయి. నిద్ర పట్టడం బాగా ఆలస్యమైనా బానే పడుతుంది కానీ ఎక్కడ కుక్క మొరిగినా, గట్టిగా గాలి వీచి చెట్లు కదిలినా, ఏ పొరుగూరి నుంచి ఆలస్యంగా వచ్చినోళ్ళెవరైనా దారంట నడిచెళ్ళినా, అదే అదనుగా, ఆ వంక పెట్టుకుని లేస్తున్నావు. చేతికర్ర మంచంకోడుకేసి కొట్టి ‘ఎవురదీ?’ అని కాసేపు దిక్కులు చూసి పడుకుంటూన్నావు. తెల్లారే వేళకి కలలొచ్చేవి. ఒకటనేముండదు. చాలాకలల్లో నువ్వు ముసలోడివి కాదు. ‘ఆలీసెం జెయ్యొద్దు. తెరలెత్తాలి. తొరక్కానీ,’ అని ఎవరో పురమాయిస్తుంటారు. నువ్వు ‘ఇదుగో, ఈ విగ్గొకటీ నిలబడితే యీళ్ళని రంగమ్మీదకొదలొచ్చు,’ అని గిరగిరా గదంతా తిరిగి అందరి వేషాలు బాగొచ్చాయా లేదా అని చూస్తుంటావు. ‘వృథా పోకూడదు. బట్టలుతికిన నీళ్ళని ఇలా కాలవ తీసి మొక్కల్లోకి వదలొచ్చు,’ అనే జీవన గొంతు విని నిద్ర లేస్తావు. వాడు వూరోళ్ళెవరికో నీళ్ళవాడకం గురించి చెప్తూ ఉంటాడు. అప్పటికే తెల్లంగా తెల్లారిపోయి ఉంటది. ‘ఈసారి వారానికే వచ్చా ఊర్నించీ?’ అని వాణ్ణడుగుతూ మంచం దిగుతావు.
రాన్రానూ జీవనకి పన్లెక్కువయ్యాయి. స్థిమితంగా ఒక వూర్లో ఉండటం కుదరటల్లేదు. ఇప్పుడు నీకు కుక్కలు, చెట్టుకొమ్మలు మెదలకపోయినా మెలకువొస్తుంటుంది. ఇప్పుడు తెల్లారిపూట కలలూ రాటల్లేదు. పాతమనుషులెవరూ పెద్దగా గుర్తుకీ రారు. పగలంతా గుమ్మంలో కూర్చుని వచ్చిపోయే మనుషుల్ని చూస్తుంటావు. ఎవర్నీ పిలిచి పలకరించాలనేముండదు. వాళ్ళెవరా, ఎందుకటెళ్తన్నారా అన్న ఆరా కూడా ఉండదు. అట్లా చూస్తూ ఉంటావంతే. బాట మీద గులకరాళ్ళని, ఎద్దులు నడిచెళ్తే రేగే దుమ్ముని, వానపడినప్పుడు నానిపోయే పాత మట్టిగోడనీ ఊరకనే అట్లా చూస్తూ ఉంటావు.
ఎప్పుడన్నా ఒకసారి నీ ఈడువాళ్ళో, నీ పాత సావాసగాళ్ళో వచ్చి పక్కన కూర్చుంటారు. ‘ఏవన్నా జెప్పూ, ఎంత కష్టం జేశావూ… ఆ వరదొచ్చినేడాది ఒక్కడివే నిట్టాడి నిలబెట్టి, వాసాలేసుకుని, ఈ గూడు నిలబెట్టుకోలా! ఎండాకాలం దొంగలుబడి చెంబూ, తపేలా ఎత్తుకుపోతే నువ్వూ, సుగుణమ్మా కలిసి మళ్ళీ కార్తె నాటికి సామానంతా సమకూర్చుకోలా!’ అని ఎప్పటివో మాటలు చెప్తుంటారు. నువ్వు వాళ్ళమొహంలోకే చూస్తా దీక్షగా వింటుంటావు. చివరికి ‘ఆ? ఏవోఁ! గుర్తు రాటల్లా…’ అని వేరేపక్కకి తిరుగుతావు.
అట్లాంటి నువ్వు మొన్నెవరో వచ్చి ‘తెలిసిందా? పక్కూళ్ళో నాటకవాడతన్నారంట. ఏనాటిదో పాత ఆటంట. మళ్ళీ ఇన్నాళ్ళకి ఎవరో ఆడిస్తన్నారు. అప్పుట్లో ఆ నాటకానికి నువ్వు గూడా పనిజేశావంటనే?’ అనడగ్గానే కాళ్ళూ చేతులు కూడదీసుకుని మంచంలో లేచి కూర్చున్నావు. ‘అదేనంటావా? ఎప్పుడంటా?’ అనడిగావు.
ఇకంతే, అప్పుణ్ణించీ రెండో ధ్యాస లేదు. రోజులూ గంటలూ లెక్కబెట్టుకోడమే పని. కానీ, కాలం నీకిప్పుడు ‘కూ’మని ముందుకుపోయే రైలుబండి కాదు. నిముషానికోసారి బయల్దేరిన చోటికే గుండ్రంగా తిరిగొచ్చే ఎడ్లబండి చక్రం. ఆ పాతరోజులు గుర్తు తెచ్చుకుంటూ, దారినపోయే వాళ్ళని కేకేసి ఏదోకటి చెబుతూనే ఉన్నావు. పాత రేకుపెట్టె తెరిచి మైదాపిండి అట్టగట్టిన కాగితంముక్కని చూసి పదే పదే తడుముకుని మళ్ళీ లోపల పెడ్తున్నావు. తెగిపోయిన చెప్పుకి రెండు టాకాలు వేయించుకుని, అలమర్లో దాచుకున్న తెల్లచొక్కా మడతలు సరిజేసి పెట్టుకుని తయారయావు.
తీరా నాటకమాడే రోజొచ్చింది. తెల్లచొక్కా, కుట్టిన చెప్పులు వేసుకుని చేతికర్ర పోటేసుకొని బయల్దేరావు. మా జీవనా వస్తే చెప్పండని పక్కవాళ్ళకి ఓ మాటచెప్పి, వసారాలో నులకమంచం ఎత్తి గోడకి చేరవేసి పొద్దుగుంకక ముందే బయల్దేరావు. ఇల్లు కదిలి, బజారుకెళ్ళి ఎన్నాళ్ళయిందోగానీ ఎక్కడికక్కడే కొత్తగా చూసుకుంటా వెళ్ళావు. ఊరుదాటి పొలాలమీదగా పోతుంటే నీ మాయదారి నీరసం నడవనీదు. గట్టురాయి పక్కన మర్రిమాను మొదట్లో కూలబడ్డావు. అట్లా ఎన్నిగంటలు గడిచిందో, ‘ఓ ముసలయ్యో!’ అనెవరో కుదుపుతుంటే తేరుకుని లేచావు. ‘ఈవరకాడ ఒక్కడివే యాడికెల్దామనొచ్చా?’ అని జాలిగా కసిరి ఏదో బండిలో తీసుకుపోయి నిన్ను పొరుగూర్లో వదిలిపెట్టారు.
తీరా అక్కడికెళ్ళి చూస్తే ఏముంది?
తెరలు దించేశారు. ఇంక నాటకం ఆడేది లేదు పొమ్మన్నారు.
కాళ్ళూ గడ్డాలూ పట్టుకున్నా లాభం లేదని తెలిశాక, పొనీ నువ్వడిగిన నాలుగుమాటలూ చెప్పించుకోవాలన్న భ్రమకొద్దీ వాళ్ళనొదలకుండా వాళ్ళ విడిది దగ్గరే జోగుతూ కునికిపాట్లు పడుతున్నావు. చూసీ చూసీ ఏ నడిజాముకో నీకూ కన్నంటింది. నిద్రలో ఎప్పటెప్పటివో సంగతులు కలల్లాగా ఒకదాంతర్వాత వొకటి వచ్చిపోతూ ఉన్నాయి. అంతా ఇప్పుడు జరుగుతున్నట్టే, కళ్ళముందున్నట్టే, చప్పుళ్ళు, వాసనలు, మాటలు, అన్నీ.
దిగ్గున లేచావు. తెల్లంగా తెల్లారిపోయుంది. రాత్రంతా పందిరిగుంజ ఒత్తుకుపోయి భుజం నొప్పి చేసింది. చుట్టూరా వెతికావు. అక్కడక్కడా పడేసిన చెత్తాచెదారం, పనికిరాక వదిలేసిన పగిలిపోయిన సామాను తప్ప వేరే వస్తువులు, మనుషులు ఎవరూ కనపడలేదు. నాటకం వాళ్ళు సర్దుకుని తెల్లారగట్టే వెళ్ళిపోయారని తెలిసింది. వాళ్ళెళ్తున్నప్పుడు ఆ సందడి కూడా కలలోదే అనుకుని అటుతిరిగి పడుకున్నావేమో, లేదంటే మెలకువొస్తే నువ్వొదలవని వాళ్ళే చప్పుడుకాకుండా వెళ్ళారేమో. దిక్కుతోచని వాడిలాగా అక్కడే చతికిలబడి ఉండిపోయావు. ‘ఇంకేవుంది? యెళ్ళెళ్ళు,’ అని అక్కడ ఊడవడానికొచ్చినామె నిన్ను అదిలిస్తుంది. కాళ్ళు, చేతులూ కూడదీసుకుని కర్రపోటేసుకుని, మనసు దిటవు చేసుకుని నిదానంగా ఆ తెల్లవారి వెలుతురుకి ఎదురుగా నడిచి వెళ్ళిపోతున్నావు.
నువ్వా సందు మలుపు తిరిగే ధ్యాసలో చూసుకోలేదు కానీ, ఆ మూలమీద ఇంటెదురుగా పిల్లాడొకడు, వాళ్ళనాన్న పాతచొక్కాని గుండీలు పెట్టకుండా కోటులాగా వేసుకుని, నడుమ్మీద చెయ్యుంచుకుని ‘ఈ సుఖదుఃఖాల్ని విస్మరించి, శాశ్వతానంద కారకమైన సత్యాన్ని అనువేచించి…’ అని డైలాగు చెప్తున్నాడు. ఆ తమ్ముడు గట్టిగా చప్పట్లు కొడుతూ, ‘అదే, అదే, అంతే అంతే, బలే చెప్పావురా!’ అని నీళ్ళమడుగులో చిందులేస్తున్నాడు.