1.
సరిగ్గా నన్నెవరో అనుభవం లేని
నీ అమాయకపు కళ్ళముందుకు తీసికెళ్ళినట్లే,
నిన్నూ నేను తీసుకువెళ్ళాలనుకున్న
ఆ సముద్రం ఎంతో దూరంగా వుంది.
సూర్యుడస్తమించకపోతే మన కౌగిలి
ఆ సమయంలో వట్టిపోవటం
సముద్రం చూసుంటుందా?
ఇవాల్టికి బహుశా నేను అన్ని అభావాలకూ
వడిదుడుకులకూ లొంగని పరిస్థితి దాటొచ్చాను.
నువ్వు ఏ సుఖం యిప్పటి దాకా తెలుసుకోలేదో
తప్పనిసరిగా దాన్ని నా సొంతం చేసుకోవటం
నేను ఎక్కడినుండి నేర్చుకున్నాను?
నిప్పునుండీ, నీళ్ళనుండీ, ఆకాశంనుండీ, కాదు
కోయిల పిలిచే మామిడి కొమ్మనుండో, మెరుపునుండో!
ఏదో ఒక రోజు నేను నిన్ను తీసుకెళ్తాను
ఆకలి అవతలి పక్కన దాగున్న కొండ మొదట్లోనున్న మంచెభూమికి;
ఏమో, నీ రాతి పెదాలు కొద్దిగా చలించి మేలుకోవచ్చు
భయంతో, నెమలిని చూసే అవకాశంతో.
నెమలి కూడా సముద్రం లాటిదే,
రెంటినీ చూడటం, అర్థం చేసుకునే పద్ధతీ వేరు తప్ప;
మెరుస్తున్న నీలి రంగులో ఒకవేళ నేను మునిగిపోతే,
నా నిష్క్రమణం నాట్యం చేస్తూ ముందుకు పోతుందా నీవద్దకు?
2.
ఒకరోజు మొత్తం ఇచ్చేశా నీకు
ఏం చేశావు? నిరీక్షణ, నిరీక్షణ, నిరీక్షణలో గడిచిపోయిందా?
ఎవరికోసం నిరీక్షణ? నీకు తెలీదని చెపుతున్నావు.
కాని నువ్వు తయారవుతున్నావు.
జాపిన నా చేతినుంచి మరో రోజు పొందటానికి.
పిట్టల అజ్ఞానంలో విత్తనాల సృష్టి అవుతుంది;
ఒకసారి వెనుదిరిగి చూద్దామని కోరినా కుదరదు.
నువ్వు నీ చుట్టపక్కాలతో నీ సుఖదుఃఖాలు చెప్పుకో,
నేను ముందుకు పోతాను, నీతీనియమాల సంపద వేపు.
రకరకాల పూలు చుట్టుముట్టుతాయి పాట నలువేపులా!
ఇప్పుడు నా కోరిక, ఆఖరి పాట పాడుకోవాలని,
విభ్రాంతితో ఆఖరి పువ్వుని తాకాలని.
కాదు కాదు, చెపుతున్నా, రక్తం, వంగవన్నె దిగంతం, సూర్యుడూ,
చాలా శతాబ్దాలపూర్వమే నేను గుర్తించాను, నాకు తెలుసు,
వాళ్ళు నా గుప్పెట నింపుతారు, కనీసం నీ స్మృతితో.
3.
అద్దం ముందు నువ్వు నిలబడే రీతి ఎలా వుందంటే
నిజంగా అద్దం నిన్ను చూస్తూ వుండిపోయింది, చిరకాలం వుండిపోతుంది.
నేను పుడుతూ వుంటాను, తండ్రినౌతుంటాను, మరణిస్తుంటాను.
నువ్వు తిరిగి చూడవు గడ్డిలో పడున్న చెవిపోగుని.
ఇసుకదిబ్బ శిఖరంపై నించొని నువ్వు తల దువ్వుకుంటూంటావు,
కొప్పులో పూలు ముడుచుకుంటూంటావు తుఫానులో;
ఈమాత్రపు నీ పరాక్రమం పృధివి సహిస్తుంది,
కారణం, నువ్వే ఆ పృధివివి. నేను నిరాకారి అద్దాన్ని.
నేను నీ బాహుబంధంలో కవియకపోతే, స్థిరంగా ఎదగకపోతే,
పుట్టకపోతే, లేమీ మృత్యువుల అనివార్యత తెలుసుకోకపోతే,
ఎప్పుడూ నన్ను నేను చూడలేను,
నా భాష కేవలం రెప్ప వేయలేని కళ్ళతో మౌనంగా చూస్తూండటమే.
చీకటి నలువేపులా చుట్టిముట్టి వున్నప్పుడు రా,
తామరకాడతో చుట్టుకుపోయి, యిరుకైన అగాధంలోకి జారిపోదాం,
మనం ఒకరినొకరు చూసుకోలేం,
దీపానిది కాని ఆ చిరుకాంతి దొంగిలించుకొనిపోదాం.
4.
నువ్వు పూలకు ‘వాడిపోకండ’నీ, ఉత్తరానికి ‘దారి తప్పద్ద’నీ
చెప్పటం చాలా సార్లు విన్నాను,
తేలిక శబ్దాలు వేలాడుతూండటానికి,
ఒక్క ముహూర్తకాలాన్ని తీగలాగా సాగదీయటం చాలా సార్లు చూశాను.
ఇవాళ జోరుగా గాలి వీస్తోంది, వర్షం పడింది.
ఎవరూ కోరని సుఖాలు నేను పంచుతూ వెళ్తున్నాను,
ఆగకుండా యిస్తూపోతున్నాను, యివ్వటం అయిపోయాక
ఏమయినా మిగిలితే అది నీళ్ళ బరువు.
పూలు మెరిసిపోతున్నాయి నీ తోటలో,
ఉత్తరం పిలుచుకొచ్చింది తన సమాధానం.
అయితే గాలి ఊడ్చుకొపోయే అధికారంలో కళంకం అంటలేదు.
దారిలో వర్షం తప్పిపోలేదు.
నా ఉత్తరానికి జవాబు
వస్తుందనే ఆశ నాకు లేదు. కారణం,
వాయువు సృష్టించే శూన్యత వాయువే నింపుతుంది
దాని గోదాం ఎక్కడో నాకు తెలీదు.
నీ దొంగ ముసిముసి నవ్వుల్లో,
దాని చిరునామా ఒకవేళ నాకు దొరికితే!
5.
నువ్వొచ్చి నన్ను ఎలా చూస్తావు? ఏ రూపంలో?
మబ్బుల్లేని నక్షత్రం లాగానా, లేక నీళ్ళమీద పొరలాగా
అంచెలంచెలుగా తాకుతూ పరుగెత్తే చిల్లపెంకు లాగానా?
నీకు ఏదైతే బాగుండదో నాకు తెలుసు,
కోయిల కుహూ కుహూల మధ్య నిశ్శబ్దం, నీకు బాగుంటుంది.
నాకు బాగుండే విషయాలు చాలా ఉన్నాయి — కొత్త పుస్తకం, సముద్రపొడ్డున
కూలిపోయిన ఇల్లు, స్కూలు వెనక దాక్కొని ఎండు మామిడి టెంక చీకుతున్న చెల్లి,
ఐదుబ్యాటరీల టార్చి లైటు వెల్తుర్లో మానుపడ్డ కుందేలు,
పోనుపోను క్రమంగా పెరిగిపోతూన్న నా చేతగానితనం.
నిన్న సాయంత్రం అజ్ఞాతంనుంచో, జైలునుంచో,
మరో గ్రహంనుంచో మంచులో తడిసిన గడ్డిమీద
టపటప అడుగులేసుకుంటూ తిరిగొచ్చాడు మూర్ఖపు మనిషి.
ఏంటబ్బా తన ఆకర్షణ? అయితే చూడు తన అవసరం
నిలబడి నవ్వుతున్నట్లు కనిపిస్తున్నది, నీకూ నాకూ మధ్య.
6.
నా ఉత్తరం తోడు లేని నిరపరాధి
కాకపోతే చదవగానే
ఖాళీ పోస్టుడబ్బాకిందకు పోయి తగులుతుందా?
నేను గతంలో ఎన్నడో రాసిన మాటలు
నీ వంటిసువాసనలు రుచి చూశాయి.
ఇప్పుడు వాటికర్థం లేదు, అర్ధం లేకపోతే
ఏ వ్యక్తీకరణం ఎప్పుడు తప్పుచేయగలదు?
ఉత్తరాలు రాసి రాసి జీవితమంతా గడిపాను.
అన్నీ ఆలశ్యంగా ఎక్కడికో పోయిచేరాయి.
సమాధినుంచి ఓ శవం లేచి తిరిగి వెళ్ళి పడుకుంది
నలువేపులా చీకటలుముకుంది, దయా క్షమల ఓడ
తుఫానులో చిక్కుకుని పైకీ కిందకీ పడుతూ తప్పిపోయింది సముద్రంలో.
తుఫానులా హఠాత్తుగా నీ మాట పడిపోయేటట్లు చెయ్యటానికి
ఇప్పుటికీ నావద్ద మమకారం లేని కఠోరమైన మాటలున్నాయి.
వేరొకరి చేతి రక్షణలో ఒకవేళ ఆసక్తి అలల్లా దోచుకోపోతే
వడ్డున చూస్తుంటావు నీకు పరిచయమైన
నానా చావులకూ రంగు పులమటానికి
వేరే మాటలతో ఈ ఉత్తరం వస్తే బాధపడకు.
దాని కఠోరకాంతి నీ కళ్ళకి మిరుమిట్లుగొల్పగలదు.
అయితే అది వచ్చి చేరుతుంది, నావద్దకు తిరిగి రావటానికి
పదునుపెట్టి తిరిగివచ్చే అస్త్రంలా, నీళ్ళు నిండిన మేఘంలా.
7.
ఇవాళ ఇంకేం చెప్పను?
అరువు తెచ్చుకున్న కలని పూలకీ, సీతాకోక చిలక్కీ, సూర్యుడికీ
తిరిగిచ్చెయ్యటానికి కూర్చున్నాను.
అనిర్మలమైన కాలం ఏం చూపించిందో గుర్తు లేదు.
నేను నిస్సహాయుణ్ణైతే ఏం చూపిస్తుంది,
మంచులో తడిసిన చతుర్దశిచంద్రుడి కాంతిలో,
వివస్త్రగా ఏకాంతంగా పార్కులో నిలబడితే.
కలువపూలతో నిండిన చెరువులా,
ఈ మనస్సు ఏమీ అర్థం చేసుకోదు.
ఉదయమే మొదటి కుళ్ళు బురదనీళ్ళలో
గర్వంగా నిలబడటం, తన ఆఖరి ఆనందం,
మధ్యలో దయా లేదు మాయా లేదు.
అవివేకపు ఉదాసీనత, జారే స్వభావంలోనే
తన రాకపోకలు.
నీ ప్రయత్నంలో పశు పక్షుల కోలాహలం వుంది,
దూడ ముట్టె పొదుగులో దూరింది;
కథ పొడవై వెళ్తోంది గడ్డి, నెమలి, మేఘం దాటి.
ఇంత మాత్రమే వుంది–కళ్ళ కింద నల్లమచ్చ,
తప్పు బండిలో ఎక్కిన సందేహం,
అనిర్దిష్టవిఫలత వలన భయం.
ఇవాళ చెప్పేదేదో తప్పు చెప్తానో, ఒప్పు చెప్తానో,
అందులో వచ్చేదేముంది, పోయేదేముంది? మేం తేలుతున్నాం
నదీముఖంలో, తీపి నీళ్ళల్లోనా, ఉప్పు నీళ్ళల్లోనా?
కళ్ళు మిరుమిట్లు గొల్పుతున్నాయి స్వర్గలోకపు కాంతిలో
వేణునాదం లేదా ఉదజనిబాంబు పేలే శబ్దం కోసం
చెవుల్లేవు మాకు, చేతుల్లేవు మాకు పరస్పరం అతుక్కుపోవటానికి.
(ఈ కవిత సౌభాగ్య కుమార మిశ్ర ఒరియాలో ప్రచురించిన ద్వా సుపర్ణా కవితా సంకలనంలోనిది.ఈ కవితా సంకలనానికి 1986లో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమానం లభించింది. ద్వా సుపర్ణా లోని కవితలన్నీ తెలుగులో పుస్తకరూపంగా త్వరలో ప్రచురించబడనున్నాయి.)