కొన్ని అపురూపమైన గొంతుకలు

[పరుచూరి శ్రీనివాస్ కొన్ని ఎంతో అపురూపమైన అలనాటి తెలుగు ప్రముఖుల గొంతులను సేకరించి మనకందిస్తున్నారు. ఏ కోణం నుంచి చూసినా ఈ ప్రముఖుల మాటలు వినగలగడం ఒక అనిర్వచనీయమైన అనుభవం. ఆడియో అంతగా బాలేకపోయినా వినడానికి ఇబ్బంది కలిగేంతగా లేదు. ఈ సేకరణ ఈమాట పాఠకులకు ప్రత్యేకం. ఈ ఆడియోలలో పరిచయ వ్యాఖ్యాత(లు) ఎవరో గుర్తు పట్టగలరా? – సం]

1. గుఱ్ఱం జాషువా

పీడిత జనజీవనానికి అద్దం పట్టిన యుగకవి గుఱ్ఱం జాషువా స్వీయ కవిత. (నిడివి 2ని.)

2. పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు

పురావస్తు పరిశోధనలో విశేషమైన కృషి చేసిన పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు బర్మా, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో నిక్షిప్తమైన హిందూ సంస్కృతీ చిహ్నాలపై చేసిన ఆంగ్ల ప్రసంగం నుండి (నిడివి 2ని).

3. పింగళి లక్ష్మీకాంతం

ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధిపతి, పింగళి కాటూరి జంటకవులలో ఒకరు అయిన పింగళి లక్ష్మీకాంతం భాస నాటకానికి చేసిన పరిచయం (నిడివి 1ని 50క్ష.).

4. ఆచంట లక్ష్మీపతి

ఆయుర్వేదంలో ప్రముఖులైన ఆచంట లక్ష్మీపతి ఆంగ్ల ప్రసంగం నుండి (నిడివి 1ని.).

5.మునిమాణిక్యం నరసింహారావు

కాంతం కథల సృష్టికర్త మునిమాణిక్యం నరసింహారావు ఒక పిచ్చాపాటిలో (నిడివి 50క్ష.).

6. దామోదరం సంజీవయ్య

కవి, ప్రజానాయకుడు అయిన దామోదరం సంజీవయ్య మద్యనిషేధంపై చేసిన ప్రసంగం నుంచి (నిడివి 1ని. 45క్ష.).

7.జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి

జరుక్ శాస్త్రిగా పేరెన్నిక కన్న కవి, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి పద్య నిర్మాణంలో వ్యావహారిక భాష వినియోగం గురించి చేసిన చర్చ నుండి (నిడివి 2ని. 36క్ష.).

8. జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి

ఆంగ్లభాషాకోవిదుడు, వక్త అయిన జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి తెలుగు భాషపై చేసిన ఆంగ్ల ప్రసంగం నుండి (నిడివి 3ని 5క్ష.).

9. టంగుటూరి ప్రకాశం పంతులు

ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 1954లో తమ కాశ్మీర్ పర్యటన అనంతరం చెప్పిన ముచ్చట్లు (నిడివి 2ని 20క్ష.).

10. వేదుల సత్యనారాయణ శాస్త్రి

గౌతమీ కోకిల వేదుల సత్యనారాయణ శాస్త్రి తమ గురువైన శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గురించి మాట్లాడుతూ… (నిడివి 2ని 20క్ష.).

11. మొక్కపాటి నరసింహ శాస్త్రి

బారిస్టర్ పార్వతీశం రచయిత మొక్కపాటి నరసింహ శాస్త్రి గోదావరి తీరంలో స్నేహితులతో గడిపిన సాయంకాలాల గురించి సరదాగా చెప్పిన కబుర్లు (నిడివి 2ని 15క్ష.).

12. తల్లావజ్ఝల శివశంకర శాస్త్రి

నవ్యసాహిత్యానికి కేతనమెత్తిన కవి, పద్యనాటికకు ఆద్యుడు స్వామి శివశంకర్ యోగవాశిష్ట గ్రంథం గురించి చెప్పిన విషయాలు కొన్ని (నిడివి 2ని 28క్ష.).

13. దేవరకొండ బాలగంగాధర తిలక్

వచనకవితకి వన్నెలద్దిన కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ స్వీయ కవితా పఠనం (నిడివి 3ని 48క్ష.).

14. విస్సా అప్పారావు

వస్తుతహా వైజ్ఞానికుడైనా మనోధర్మ రీత్యా సంగీతానికి అంకితమయిన విస్సా అప్పారావు క్షేత్రయ్య గురించి మాట్లాడిన మాటలు కొన్ని (నిడివి 1ని 48క్ష.).