(అడగ్గానే బొమ్మలు గీసి ఇచ్చిన అన్వర్‌కు
బోలెడన్ని కృతజ్ఞతలు బోలెడంత ప్రేమతో – సం.)
ఈ సంచిక ఈమాట ఇరవయ్యవ జన్మదిన సంచిక. ఈమాట ఇన్నేళ్ళుగా కేవలం నడవలేదు. ఇరవై ఏళ్ళుగా ఇంతింతై ఎదిగింది. రెక్కలుగట్టుకు ఎగిరింది. అమెరికా తెలుగువారికోసం ప్రాణం పోసుకున్న ఒక చిన్న ప్రయత్నం ఈరోజు ఎల్లలు లేని ప్రపంచపు తెలుగు పత్రికగా మూర్తిమంతమయింది; ప్రపంచవ్యాప్తంగా పాఠకుల సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ తెలుగు సాహిత్యరంగంలో తనకంటూ ఒక ఉనికిని, ఒక గౌరవాన్ని సంపాదించుకుంది. ఇందుకు కారణం మా శ్రమ మాత్రమే కాదు. అంతకు ఎంతో ఎక్కువగా మీ ప్రోత్సాహసహకారాలు, ఆదరాభిమానాలే అన్నది సుస్పష్టం. మీ అండ ఇలా ఉన్నంత కాలం ఈమాట నిరాఘాటంగా ప్రయాణిస్తూనే ఉంటుంది. ఇది మా నమ్మకమే కాదు. మామాట కూడా. తెలుగు సాహిత్యానికి ఒక మూలకేంద్రంగా ఈమాట ఉండాలన్న కోరికతో సాంకేతిక భాషాసాహిత్యాల పరంగా నవతరాలలో పరిణమిస్తున్న అభిరుచులకు అనుగుణంగా పాతకొత్తల మేలుకలయికగా ఈమాటను తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం. కాలానుగుణంగా మారుతూ వస్తున్నా, ఈమాట ఆశయాలలో కాని, సాహిత్యం పట్ల, పరిష్కరణ-ప్రచురణ పద్ధతుల పట్ల ఉన్న శ్రద్ధ, ఆచరణలలో కాని ఏ మార్పూ లేదు. ఇది ముందుముందు కూడా ఇలాగే కొనసాగుతుందని, ఏ రచననైనా నిరపేక్షంగా సాహిత్య పరిధులలోనే పరిశీలిస్తూ, రచయితలకు విమర్శ, పరిష్కరణల అవసరం తెలియజేస్తూ, వారికి వెన్నుదన్నుగా నిలబడి ప్రోత్సహించే మా ధోరణిలోనూ ఏ మార్పూ రాదని హామీ ఇస్తున్నాం. ఈ ప్రయత్నంలో మేము కొందరి మనసులు నొప్పించి, మరికొందరిని నిరాశపరచి ఉండేవుంటాం. అది ఈమాట పట్ల, సాహిత్యం పట్ల మాకున్న అభిమానాన్ని, గౌరవాన్ని నిలుపుకొనే ఉత్సాహంలో మేము తెలియక చేసిన పొరపాటే కాని తెలిసి చేసిన తప్పిదం కాదని సవినయంగా మనవి చేస్తున్నాం. తప్పులుంటే మన్నించి ఈ సాహిత్యప్రయాణంలో తోడు రమ్మని, తోడు కమ్మని, ప్రపంచం నలుమూలలా ఉన్న రచయితలనూ పాఠకులనూ మరొక్కసారి మనసారా ఆహ్వానిస్తున్నాం. రండి, అందరం కలిసి సాగుదాం. ఈమాటను మరిన్ని పదుల మైలురాళ్ళు దాటిద్దాం.
ఈ సంచికలో:
- కథలు: బురద – చంద్ర కన్నెగంటి; తడిబల్ల-పొడిబల్ల – పూడూరి రాజిరెడ్డి; జీవనసంధ్య – బండ్లమూడి స్వాతికుమారి; చిత్తం – వేగోకృప; అడ్డగాడిద – ఆర్. శర్మ దంతుర్తి; పిలుపు (అనువాదాలు) – అవినేని భాస్కర్ (సుందర రామస్వామి); బేతాళ కథలు: కథన కుతూహలం-6 – టి. చంద్రశేఖరరెడ్డి.
- కవితలు: ఏడు కవితలు – వేలూరి వేంకటేశ్వర రావు, వెనిగళ్ళ బాలకృష్ణ రావు; ఇరవైయేళ్ళ పైమాటే – మూలా సుబ్రహ్మణ్యం; ఆనందం – విన్నకోట రవిశంకర్; మాగ్నెట్ – మానస చామర్తి; కాళీపదములు 4 – పాలపర్తి ఇంద్రాణి; శిథిలరాజ్యం – పాలపర్తి ఇంద్రాణి; ఒక్క క్షణమైనా నీలా – విజయ్ కోగంటి.
- వ్యాసములు: నేనొక చిత్రమైన చిక్కుముడి: 1. ఆఖరి కథతో ఆరంభం! – భైరవభట్ల కామేశ్వరరావు; కేనాపారా – జయతి లోహితాక్షన్; ఒక మరిచిపోలేని వాక్యం – రామారావు కన్నెగంటి; కలుపుకొంటే కలుపుకొన్నంత – స.వెం. రమేశ్.
- ఇతరములు: అడవినుండి అడవికి (పుస్తక పరిచయం) – దాసరి అమరేంద్ర; బుద్ధ చరితమ్ (సమీక్ష) – జెజ్జాల కృష్ణమోహన రావు; నాకు నచ్చిన పద్యం: హృదయాన్ని తాకే మొల్ల కవిత్వం – చీమలమర్రి బృందావనరావు; గడి నుడి 25 – విజయాదిత్య, భైరవభట్ల కామేశ్వరరావు; రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ రేడియో ప్రసంగం (శబ్ద తరంగాలు) – పరుచూరి శ్రీనివాస్; గాయకులుగా సంగీత దర్శకులు (శబ్ద తరంగాలు) – పరుచూరి శ్రీనివాస్; ప్రకటనలు – TAGS ఆధ్వర్యంలో శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ.