ఆలస్యం

మంచి పనే చేశావ్ ఆలస్యంగా వచ్చి!

ముప్ఫైరోజుల ముందొచ్చుంటే
అమాంతం నన్ను నేను నీ భుజాలకెత్తుకొని
నీ దోసిట్లో మొహం దాచుకొని
నిన్నెంత కావాలనుకొని
ఏమీ కాలేని కాలాన్ని ఎట్లా గడిపానో
ఈ గాయమెంత సలిపిందో చెప్పుకొనేదాన్నేమో!

మంచి పనే చేశావ్ ఆలస్యంగా వచ్చి!

ఇరవై రోజుల ముందొచ్చుంటే
నిన్ను ఆ వసారా అరుగు మీద కూర్చోబెట్టి
ముక్కాలి పీట నీకు దగ్గరగా లాక్కొని
నీ మొహమాటపు కళ్ళలోకి చూస్తూ
నలిగిన రాత్రుల్లో మలిగిన కలల గురించి
నీ చేతులు పట్టుకొని నాలుగు కన్నీళ్ళు కార్చేదాన్నేమో!

మంచి పనే చేశావ్ ఆలస్యంగా వచ్చి!

కనీసం పదిరోజుల ముందొచ్చుంటే
నిష్టూరమాడేదాన్నేమో
నిందించేదాన్నేమో
నీకూ నాకూ మధ్య దూరాన్ని నిలదీసి
గుట్టలుగా రాలిన నా ఎదురుచూపుల ఎడారుల్లో
నిన్ను చెయ్యి పట్టుకొని చరచరా తిప్పి
అలసిపోయి నీ ఉపేక్ష ముందు ప్రాణం విడిచేదాన్నేమో!

మంచి పనే చేశావ్ ఆలస్యంగా వచ్చి!

కనీసం నిన్న వచ్చున్నా
నన్ను తీసుకుపో నీతో! అనేదాన్నేమో.
ఆ క్షణం దాటిపోయాక
ఇక దాచుకోడానికి దుఃఖం మిగల్లేదు
పంచుకోవడానికి సంతోషమూ మిగల్లేదు.

“మేం బాగున్నాం, మీరూ బాగున్నారు కదా,
అయ్యో ఎండనబడొచ్చారు,
భోజనం చేసి వెళ్ళండి.
వేపచెట్టు కింద నులక మంచం వాల్చుంది
కాసేపు నడుం వాల్చండి.
పాపం వచ్చినంత దూరం ఒంటరిగా వెనక్కి వెళ్ళొద్దూ!”