ఎవరున్నా లేకున్నా

కవిత్వాన్నీ,ఉల్లిపాయనీ ఎవరు పోల్చారో గానీ ఎంత నిజమో కదా అనిపిస్తుంది. పొరలు పొరలు గా ఒలిచేస్తే రెండిటిలోనూ చివరికి మిగిలేదు ఒక మహా శూన్యం ,మన కళ్ళల్లో నీళ్ళు. అలాంటి ఆర్ధ్రత నిండిన కవిత్వం పుష్కలం గా ఉన్న శ్రీ ముకుంద రామా రావు గారి మూడవ సంకలనం “ఎవరున్నా లేకున్నా” పై ఒక సమీక్ష..

జీవితాన్ని ప్రత్యక్షం గా తాకే అనుభవాల్నే రామా రావు గారు కవితలు గా మలుస్తారని ఆయన మొదటి సంకలనం “వలసపోయిన మందహాసం” , రెండవ సంకలనం “మరొక మజిలీ కి ముందు” చదివిన వాళ్ళకి ఇట్టే తెలిసిపోతుంది.ఐతే జీవితం లో ఎదురయ్యే అనుభవాలకి కవి ప్రతిస్పందన ఒక్కో దశలో ఒక్కోలా ఉంటుందనడానికి ఈ “ఎవరున్నా లేకున్నా” సంకలనమే నిదర్శనం. మొదటి సంకలనం లో కేవలం అనుభవాల్ని అనుభవాలుగా వ్యక్తీకరించగా రెండవ సంకలనం లో సామాన్య జీవితానుభావాల ద్వారా తాత్విక సత్యాల అన్వేషణ మనకి కనిపిస్తుంది.ఈ మూడవ సంకలనం లో ఆయన తాత్విక దృష్టి మరింత పరిపక్వమైందని చెప్పవచ్చు..

పుస్తకం ఆఖర్లో ఆయన ఇలా అంటారు..

“తీరాన్ని తాకినా తాకకపోయినా
నాలోని నదికి అలలు కవిత్వం”

పాఠకుడి మనసే కవితా తీరమైతే మాత్రం ఈయన కవిత్వం మౌనంగా సుతిమెత్తగా తాకుతుందనడం లో సందేహం లేదు.చిట్టిపొట్టి ఆనందాలు,అనుబంధాలు, ప్రేమలు,దిగుళ్ళు,స్నేహాలు ,ప్రకృతి,అన్వేషణ కలబోసుకున్న చిక్కని కవిత్వం 30 కవితలున్న ఈ పుస్తకమంతటా పరుచుకుంది.

అనివార్యమైన వృద్ధాప్యం , తల్లితండ్రుల మరణాన్ని దగ్గర గా చూడటం ఈయన కవిత్వం పై ప్రభావం చూపాయేమో అనిపిస్తుంది… “ముసలి మొహం” ,”ఎవరున్నా లేకున్నా”,”ఔను”,”వాళ్ళు లేని ఇళ్ళు” ,”రాత్రి పగలు లేని”,”సాయంత్రం” , “దారిబత్తెం” మొదలైన కవితల్ని చదివితే…

“వాళ్ళు లేని ఇళ్ళు” కవితలో అంటారు..

బహుశా ముసలితనం
వాయిదాల మరణం
ఎవరేమిటో
లోతు గా తెలుసుకునే సమయం

జీవన సంధ్య గురించి తెలిపే “సాయంత్రం” అన్న కవితలో

“సాయంకాలపు చీకటి లోయలోకి దొర్లుకుపోతున్న పగలు
ఎన్ని పగళ్ళని మింగిందో ఈ లోయ” అంటారు తాత్వికంగా..

సున్నితమైన మానవ సంబంధాల మీద ఎక్కువ కవితలే ఉన్న ఈ సంకలనం లో వీడ్కోలు మీద చక్కని కవిత ఉంది..మిత్రమా సంజాయిషీలు లేవు అంటూ ప్రారంభమయ్యే ఆ కవిత లో

బహుశా వెలితి
జ్ఞాపకాల గుప్త నిధి కి
తాళం చెవి

అన్న అద్భుతమైన వాక్యాలున్నాయి..

కవులు,రచయితలు తమ రచనలకి ఎన్నుకునే వస్తువుల్లోనే వారి గొప్పతనం దాగుందేమో అనిపిస్తుంది.బాల్యం లో ఎవరో అమ్మాయి “నన్ను గురించి కథ వ్రాయవూ” అని అమాయకం గా అడిగిన ప్రశ్నని అదే పేరుతో మంచి కథ గా మలిచిన బుచ్చి బాబు గారు గుర్తొస్తారు ఈ సంకలనం లోని “రాయని పద్యం” కవిత చదివినప్పుడు.నేను మాత్రం మీకు పద్యం కాలేకపోయానన్న కూతురి మీద రాసిన ఈ కవిత ఆఖర్లో

నువ్వు కాదనుకున్నా సరే
నన్ను నేను గా తెలుసుకునే
నీ మీద పద్యం కూడా ఒకటి.

అంటారు.కవిత్వం అంటే కవి తనను తాను తెలుసుకోవడమే కదా! అలా ఆయన తమని తాము తెలుసుకునే ప్రయత్నం లో సృజించిన కవితల్లో వాడిన పదాలు కూడా అత్యంత సున్నితంగా ఉంటాయి.గుండె భాషతో గొంతు పలికితే శబ్దాడంబరం అక్కరలేదు.. అందుకే “విత్తనాలు” కవిత ఆఖర్లో ఆయన గొంతు మృదువుగా ఇలా పలుకుతోంది..

“అర్ధం కాని అక్షరాలు
వాక్యాంత విరామాలు
విచిత్ర శబ్ద విన్యాసాలు

గుండె భాష లో గొంతు

అనుభవమైనాక
ఏ భాషైనా
మన భాషే!”

అనుభవజ్ఞులైన తాత్వికులు మాత్రమే రాయగల వాక్యాలు ఈ పుస్తకం నిండా ఉన్నాయి…

“ప్రతి ఉదయం” కవితలో

తలుపుతియ్యకుండా
ఎవరొచ్చారో
ఎలా తెలుస్తుంది

అని ప్రశ్నించినా

“ఎవరున్నా లేకున్నా” కవితలో

ఎవరున్నా లేకున్నా
పూచే పూలు
పూస్తూనే ఉంటాయి

అని ప్రవచించినా

ఆ వాక్యాల్లో అంతర్లీనంగా ఉన్న తత్వం మనల్ని చకితుల్ని చేస్తుంది.

ఆయన అన్నట్లుగానే ఎవరున్నా లేకున్నా కవితా కుసుమాలు వికసిస్తునే ఉంటాయి.పుస్తకం తెరిచి వాటి పరిమళాల్ని తనివితీరా ఆఘ్రాణించండి.

ప్రతులకు –

Nishita publications
1-7-23/1
Street number 8
Hubsiguda
Hyderabad -7

and

navOdaya book house
Praja Sakti book house
viSaalaaMdhra book house
Telugu book house

— ——————————– * —————————————–


రచయిత మూలా సుబ్రహ్మణ్యం గురించి: 2002 లో కవిత్వం రాయడం ప్రారంభించి, వందకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలు రాశారు. "ఏటి ఒడ్డున" కవితా సంపుటి (2006), "ఆత్మనొక దివ్వెగా" నవల (2019), "సెలయేటి సవ్వడి" కవితా సంపుటి (2020) ప్రచురించబడిన పుస్తకాలు. పదకొండేళ్ళు బెంగుళూరు Intel లో డిజైన్ ఇంజనీర్ గా పనిచేసిన తర్వాత ఖరగ్‌పూర్ ఐఐటీనుంచి ఎలెక్త్రానిక్స్ లో PhD చేసి, ప్రస్తుతం ఐఐటి పాలక్కాడ్‍లో ఫేకల్టీగా పని చేస్తున్నారు. ...