పుస్తక పరిచయం: స్వప్నసాకారం

శ్రీమతి వాలి ఉమాదేవి, వాలి హిరణ్మయీదేవి అనే పేరుతో 80వ దశకంలో విరివిగా కథలు రాశారు. మంచి కథల రచయిత్రిగా పత్రికా పాఠకులకు చిరపరిచితులు. హిరణ్మయీదేవి గారు ఎప్పటినుంచో రాస్తున్నా, ఇటీవలి కాలంలో రాసిన 22 కథలతో స్వప్నసాకారం అనే సంపుటం వెలువరించారు. గత 33 ఏళ్ళుగా రెండు వందల పదిహేను కథలకు పైగా రాసిన రచయిత్రికి ఇది మొదటి సంపుటేనంటే కొంచెం ఆశ్చర్యమనిపిస్తుంది.

కుటుంబ బంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు, ఆదర్శాలు, అపోహలు, పొరపొచ్చాలు, సమస్యలు, సంక్షోభాలు, పరిష్కారాలు… ఇవే కథావస్తువులు! చాలావరకు కథలు మనకి బాగా తెలిసినవాళ్ళవే అనిపిస్తాయి, మన చుట్టూ జరుగుతున్న ఘటనలనే కథలుగా మలిచారేమో అనిపిస్తాయి. ప్రతీ కథలోని వాతావరణమూ మన ఇళ్ళలోని వాతావరణం లానే ఉంటుంది. కథలలో తారసపడే వ్యక్తులు మనకి పరిచయస్తుల్లా అనిపిస్తారు. సంభాషణలు మన మాటలేననిపిస్తాయి. వెరసి మధ్యతరగతి జీవితం ఈ సంపుటిలోని అన్ని కథలలోనూ గోచరిస్తుంది. ఈ సంపుటిలోని కొన్ని కథలను పరిచయం చేస్తాను.

‘ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును’ అనే సూక్తి ఆధారంగా అల్లిన కథ ఆదర్శం. తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ప్రవర్తిస్తే, పిల్లలు కూడా తల్లిదండ్రులతో అదే విధంగా ప్రవర్తిస్తారు. తమ ఉద్యోగ బాధ్యతల వల్లనూ, గొప్ప చదువులు చదివించాలనే ఆశతోనూ పిల్లల్ని తమకు దూరంగా, ఎక్కడో హాస్టళ్ళలో ఉంచే తల్లిదండ్రులు – తమ పట్ల పిల్లలలో ప్రతికూల భావనలు తలెత్తకుండా చూసుకోవాలనీ, లేకపోతే కుటుంబంలో ఆపేక్షలు, అనురాగాలు దూరమవుతాయని చెబుతుందీ కథ. తొందరగా ఇంటికెళ్ళి చేసేదేముందని ఒక వ్యక్తి అనుకుంటే, ఇంటికి త్వరగా వెళ్ళడానికి సిద్ధమవుతాడు అతని మిత్రుడు. ఒకటి రెండు వాక్యాల్లో వారి ఇంటి వాతావరణాన్ని కళ్ళముందుంచుతారు రచయిత్రి. ఎయిడ్స్ ప్రాణాంతక వ్యాధి. కాని అదెలా సోకుతుందనే విషయంలో సామాన్యులలో ఎన్నో సందేహాలున్నాయి. విద్యావంతులలోనూ అపోహలున్నాయి. అలాంటి అపోహ వల్ల కొడుకుని దూరం చేసుకున్న ఓ వ్యక్తి – ఆ వ్యాధి సోకిన తన అన్నయ్యని జాగ్రత్తగా కాపాడుకుందామనుకున్న ఓ చెల్లెలికి సాయం చేసిన వైనాన్ని చిరంజీవులు కథ చెబుతుంది. రెండోసారీ ఆడపిల్ల అని తెలిసినా అబార్షన్ చేయించుకోనందుకు భార్యతో గొడవపడిన వ్యక్తి మనసెలా మారిందీ స్ఫూర్తి కథ వెల్లడిస్తుంది. వివాహం కాకుండానే ఓ పాపని కని పెంచి పోషించిన ‘బాలమ్’ అనే మహిళ ఈ కథలోని నాయికకి ప్రేరణగా నిలుస్తుంది.

అబద్ధాలాడకూడదు అని గట్టిగా నమ్మే ఓ వ్యక్తి పరిస్థితుల ప్రాబల్యం వల్ల ఒక్కోసారి నిజం చెప్పకపోవడమే మంచిదని గ్రహిస్తాడు – అబద్ధానికి ఆమడ దూరంలో… కథలో. జీవితాన్ని ఆస్వాదించడమంటే ఏమిటో, అసలు జీవితమంటే ఏమిటో తెలియజేస్తుంది, ఓ పచ్చని స్పర్శ అనే కథ. డబ్బు ఆశకి లొంగక విశాలమైన ఇంటిని, తోటనీ అపార్టు‌మెంట్స్‌లా మార్చకుండా అలాగే ఉంచి హరితవనంగా మార్చుకున్న ఓ కుటుంబం ఏం పొందిందో ఈ కథ చెబుతుంది.

మానసిక ఎదుగుదల సరిగా లేని ఓ పాప చుట్టూ తిరిగే కథ స్థితప్రజ్ఞత. పుట్టబోయే బిడ్డ ఆడో, మగో – వైద్యులు తెలుసుకోగలిగే వీలున్నప్పుడు – ఆ బిడ్డకి మానసిక వైకల్యాలేవైనా ఉండబోతున్నాయా అనే విషయం కూడా తెలిస్తే, తగిన మందులు వాడి, దాన్ని మొదట్లోనే నివారించుకోవచ్చు కదా అని ఈ కథలోని ప్రధాన పాత్ర భావిస్తుంది. జీవితంలో విషాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కుని, ఉన్నంతలో సంతోషంగా ఉండడమెలాగో ఈ కథ వివరిస్తుంది. తను తనలా ఉండకుండా, వేరే వ్యక్తిలా ఉంటే – తనూ, తన చుట్టూ ఉండేవారూ మరింత సంతోషంగా ఉంటారని భావించిన ఓ వ్యక్తి పొరబడ్డాడని చెబుతుంది అలుసిచ్చావా అంతే… అన్న కథ. ప్రతీ మనిషిలోనూ సానుకూల, ప్రతికూల లక్షణాలు ఉంటాయనీ సొంత స్వభావాన్ని అణచివేసి, ఇంకొకరిలా ఉండాలని ప్రయత్నించడం అలుసవుతుందనీ, అలా చేయడం వల్ల అభాసు పాలవుతామని తెలుసుకుంటాడా వ్యక్తి.

చేసేది తప్పు అని తెలిసినా స్వార్థం కొద్దో, అవసరం కొద్దో తప్పు చేసిన వ్యక్తి కొన్నేళ్ళ తరువాత ఆ తప్పుని దిద్దుకోవాలనుకుంటాడు. కాని అప్పటికే ఆ తప్పు వల్ల ఇంటి యజమాని చనిపోయి ఓ కుటుంబం వీధిన పడుతుంది. తప్పు చేసిన వ్యక్తి ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటాడు. అయినా అతనిలో అపరాధ భావన పోదు. చివరికి అతని మనవడు పలికిన ‘బాలవాక్కు’తో అతని మనోవ్యధ తీరుతుంది.

అభాగ్య మహిళల కోసం ఓ ఆశ్రమం నడిపే లక్ష్మి భర్త నుంచి విడిపోయి, సింగిల్ పేరెంట్‌గా కూతురు దీప్తిని పెంచుతుంది. చిన్నప్పుడు బాగానే ఉన్నా, ఎదిగే కొద్దీ దీప్తి తన పట్ల ప్రవర్తిస్తున్న తీరుని జీర్ణించుకోలేకపోతుంది లక్ష్మి. ‘నాన్నని ఎందుకు వదిలేశావ్, కలిసే ఉండొచ్చుగా’ అంటూ ఎత్తిపొడిచేది దీప్తి. ఎక్కువ జీతంతో ఉద్యోగం దొరికేసరికి తల్లి మరీ లోకువైపోతుంది దీప్తికి, పీనాసిలా కనబడుతుంది. పెళ్ళి చేసుకుని భర్తతో అమెరికాకి వెళ్ళిపోతుంది. గర్భం వస్తే, అబార్షన్ చేయించుకుంటానంటుంది. అప్పుడు జరిగిన ఓ సంఘటన ఆమె మనసుని క్షాళన చేసి ఆబార్షన్ నిర్ణయాన్ని తిరగతోడేలా చేస్తుంది. తల్లి గొప్పదనం అర్థమయ్యేలా చేస్తుంది. స్వప్నసాకారం కథ ఆసక్తిగా చదివిస్తుంది.

తమ పనిమనిషికి జబ్బు చేస్తే విలవిలలాడిపోతుందా కుటుంబం. ఆమె అంత్యదశలో ఉందని, తమ కొడుకుని విదేశాల నుంచి రప్పిస్తారు. చిన్నప్పుడు తనకి పాలిచ్చిందన్న విషయం మాత్రమే తెలిసిన ఆ కొడుకుకి మరో నిజం తెలుస్తుంది. ఆ నిజాన్ని బహిరంగపరచి తల్లికి మనోవ్యధ కలిగించలేడా కొడుకు. తండ్రి గొప్పతనాన్ని గ్రహించి నిజాన్ని తనలోనే దాచుకుంటాడు. భావోద్వేగాలతో నిండిన కథ ఔన్నత్యం.

సంతానం లేని దంపతులు భారతి, నీలకంఠం చుట్టుపక్కల వాళ్ళతో సన్నిహితంగా ఉంటూ వాళ్ళ పిల్లలపై ఆపేక్ష పెంచుకుంటారు. ఉల్లాస్ అనే యువకుడిని సొంత కొడుకులా చూసుకుంటూ, అభిమానిస్తారు. చుట్టాలింట్లో చూసిన మాధవి అనే యువతి వీళ్ళకి బాగా నచ్చుతుంది. మాధవిని ఉల్లాస్‌కిచ్చి పెళ్ళి చేస్తే బాగుంటుందని భావిస్తారు. అయితే మాధవి తల్లిని చూసి భారతి, భారతిని చూసి ఆవిడ షాక్ అవుతారు. మాధవి గురించిన ఓ చేదు నిజాన్ని తమలోనే దాచుకుని వివాహానికి అంగీకరిస్తారు. మాధవికి బాల్యంలో జరిగిన దారుణం తెలిసినా, ఆమెని చేసుకోడానికి ఉల్లాస్ అంగీకరిస్తాడు. గతం రేపిన గాయాలను మరచి, వర్తమానంలో సంతోషంగా జీవించడమెంత అవసరమో ఎల్లలు లేని ప్రేమ… అన్న ఈ కథ చెబుతుంది. బ్రతికున్నంత కాలం అత్తగారిని ఈసడించుకున్న ఓ కోడలు, అత్తగారి గొప్పదనాన్ని ఆమె మరణించాక తెలుసుకుంటుంది. ఈ లోకంలో మనిషి మిగిల్చి వెళ్ళేవి ఆస్తిపాస్తులు కావు, మంచితనం మాత్రమేనని చెబుతుంది తదనంతరం అనే కథ.

నలభై ఎనిమిది గంటలు ఓ వ్యక్తి జీవితాన్ని మారుస్తాయా? ప్రభావితం చేసే వ్యక్తులు కలవాలే గానీ రెండు గంటలు కూడా జీవితాన్ని మారుస్తాయి. ‘ఏ ఇంట్లో ఆడవాళ్ళు స్వచ్ఛంగా, స్వేచ్ఛగా నవ్వగలుగుతారో, ఏ ఇంట్లో పిల్లలు పావురాళ్ళలా ఆనందంగా ఉండగలరో, అటువంటి ఇళ్ళు ఆనందానికి లోగిళ్ళు అవుతాయ’ని గౌతమ్ తెలుసుకోడానికి సత్యం అనే మిత్రుడితో 48 గంటలపాటు గడపడం కారణమవుతుంది. డబ్బుకన్నా ముఖ్యంగా సంపాదించుకోవలసిందేమిటో ఆ రెండు రోజులు… కథ చెబుతుంది.

ప్రేమానుబంధాలు బలపడడానికి రక్తసంబంధమే ఉండక్కర్లేదన్న ‘సరికొత్త పాఠం’ ఆలస్యంగా తెలుసుకుంటాడు దశరథరామయ్య. వృద్ధాప్యంలో జబ్బు చేసినప్పుడు కన్న కొడుకులు ఆదరించకపోతే, తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్ళి చేసుకుందని దూరంగా ఉంచిన కూతురు ఆదుకుంటుందతన్ని. తాను ఓ అనాథననీ, అయినా తనని సొంత కూతురిలా పెంచారన్న నిజం తెలుసుకున్న ఆమె తండ్రిని కొడుకులా చూసుకోవాలనుకుంటుంది. పరిస్థితులు తారుమారై, అన్ని రకాలుగా క్రుంగిపోయి భార్యాబిడ్డలతో తల్లిదండ్రుల వద్దకి చేరుతాడు శ్రావణ్. జీవితాన్ని పునర్నిర్మించుకోడం ఎలాగో తెలుసుకుంటాడు రేపటి ఆశ కథలో.

ఈ పుస్తకంలోని మిగతా కథలు కూడా ఆసక్తిగా చదివిస్తాయి. చాలా కథలకు బహుమతులు కూడా లభించాయి.

కథావస్తువుకి తగ్గ శిల్పంతో, పాఠకులను అక్షరాల వెంట పరుగులుదీయిస్తారు రచయిత్రి. వారిది ఆసక్తిగా చదివించే శైలి. జె.వి. పబ్లికేషన్స్ వారు ప్రచురించిన ఈ 200 పేజీల పుస్తకం వెల రూ. 150/- అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలోనూ ఈ పుస్తకం లభిస్తుంది. భారతదేశంలో తెలుగుబుక్స్ అనే వెబ్ లింక్ నుంచి ఆర్డర్ చేసి పుస్తకాన్ని ఇంటికే తెప్పించుకోవచ్చు. అమెరికాలో ఉండేవారు అజోవిభో వారి సైట్ నుంచి పుస్తకాన్ని తెప్పించుకోవచ్చు.


కొల్లూరి సోమ శంకర్

రచయిత కొల్లూరి సోమ శంకర్ గురించి: కొల్లూరి సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు. ...