పుస్తక పరిచయం: వేమూరి వెంకటేశ్వర రావు ‘అమెరికా అనుభవాలు’

1960 దశాబ్దంలో అమెరికా వచ్చిన వేమూరి వెంకటేశ్వర రావుగారి జీవితానుభవాలు ముచ్చటించబడ్డాయి ఈ పుస్తకంలో. అమెరికా వచ్చే ముందు భారత దేశంలోని కొన్ని స్వీయ అనుభవాలతో పుస్తకం మొదలయి, తను అమెరికా రావటానికి ఎటువంటి పరిస్థితులు తోడ్పడ్డాయి, అప్పటి అమెరికా ప్రయాణ సన్నాహాలు, ఆ ప్రయాణ అనుభవాలు, ఒక తెలుగు కుర్రాడు 1960 దశాబ్దంలో అమెరికాలో ఎదుర్కొన్న సవాళ్ళు – ఇలా సాగుతాయి ఈ పుస్తకంలోని రచనా విశేషాలు. ఇప్పటి కుర్రకారుకి మన భారత దేశాన్నుంచి అమెరికా రావటమంటే నల్లేరు మీద బండి నడకే కావచ్చు. కానీ అప్పట్లో అదొక అద్భుతమైన సాహసయాత్రే!


అమెరికా అనుభవాలు
వేమూరి వెంకటేశ్వర రావు
ఎమెస్కో ప్రచురణ 2009. వెల రూ. 90/-

ఈ పుస్తక పరిచయం సులువుగా చెయ్యాలంటే ఈ పుస్తకంలోని అధ్యాయాల పేర్లు చదివితే చాలు. ఇక్కడ ఇచ్చిన ఆ అధ్యాయాల పేర్లు చూడండి. నా పుట్టుక, అమెరికా చదువుకి ప్రయత్నం, అమెరికా ప్రయాణం, అమెరికాలో మొదటి వారం, గిరీష్, హోం సిక్నెస్, హోస్ట్ ఫేమిలీలు, రాజకీయ స్పృహ – గోవా యుద్ధం, రాజకీయ స్పృహ – చైనా యుద్ధం, ఉద్యోగాన్వేషణలో, అభిముఖ సమావేశం, ఇండియానా పొలీస్లో ఉద్యోగం, పశ్చిమ దిక్కుగా ప్రయాణం, రూట్ – 66 మీద ప్రయాణం, ఆరిజోనా నుండి నెవాడా వరకు, లాస్ వేగాస్ నుండి లాస్ ఏంజిలిస్ వరకు, లాస్ ఏంజిలిస్లో మొదటి రోజులు, ఇంటికి తిరుగు ప్రయాణం, కొత్త కాపురం, ఆడుతు – పాడుతు పనిచేస్తుంటే, లాలీవుడ్ ప్రభావం, అమెరికాలో అరవైయవ దశకం, తెలుగులో రాయాలన్న కోరిక పుట్టడం.

ఈ పుస్తకం నేనెందుకు పరిచయం చేస్తున్నాను? నేను కూడా ఒక అమెరికా తెలుగువాడిని కావటమే ఇందుకు కారణం! అంతే కాక ఒక తేడా ఇక్కడ మీ ముందుంచాలి. వేమూరివారు 1960 దశాబ్దంలో అమెరికా వలస వస్తే దాదాపు ఇరవై ఏళ్ళ తరవాత నేనూ అదే పని చేశాను. కాబట్టి అప్పట్లో తెలుగువారు అమెరికాలో ఎదుర్కొన్న ఇబ్బందులు తెలుసుకోటం నాకు ముఖ్యం. ఆ ప్రయత్నంలో ఒక భాగమే ఈ పరిచయం.

అమెరికా తెలుగు వారి అనుభావాల గురించి తెలుగులో వచ్చిన మొదటి పుస్తకం ఇది అనవచ్చు. అంతే కాక నాకు తెలిసి అమెరికా (అమెరికా సంయుక్త రాష్ట్రాలు) వలస వచ్చిన మొదటి తరం తెలుగు వారి అనుభవాలు ముచ్చటించే తెలుగు పుస్తకం ఇప్పటి దాకా ఇదొక్కటే! అమెరికాలో చాలా ముఖ్య పట్టణాల్లో దాదాపు వీధికి ఒక తెలుగు కుటుంబం ఉంటున్న ఈ రోజుల్లోలాగా కాదు అప్పుడు. అమెరికాలో 1960 దశాబ్దాల్లో ఎవరైనా అస్మదీయుడైన (అంటే తెలుగువాడే కానక్కరలేదు) ఒక భారతీయుడు అయినా లేక ఒక పాకీస్తానీ అయినా కనపడితే అనుభవించే ఆనందం ఎలాంటిదో అది అనుభవించిన అప్పటి తరానికే తెలుస్తుంది.

అలాంటి అనుభవాలు వేమూరి తరానికి ఎన్నో!

మొక్కపాటివారి ప్రఖ్యాత నవల ‘బారిస్టర్ పార్వతీశం’ నవల్లోని కథానాయకుడి లండన్ ప్రయాణానికి ఏ మాత్రం తీసిపోని హంగామాగా జరిగింది వేమురి వారి అమెరికా ప్రయాణం. అలాగే స్వదేశాన్ని, జన్మభూమిని, అమ్మ – నాన్నలతో పాటు ఆత్మీయ బంధువులని విడిచి పరాయిచోటికి వెళ్ళినపుడు అనుభవించే మనోవేదన కూడా ఈ పుస్తకంలో గ్రంధస్థం చేయబడ్డది. ఈ పుస్తకంలో అమెరికా జీవితంలోని అద్భుతమైన విషయాలేమీ ఆవిష్కరించబడలేదు. ఒక మధ్య తరగతి తెలుగు వాడు ఆంధ్ర రాష్ట్రాన్నించి అమెరికా వెళ్ళినపుడు ఎదురు పడ్డ సంఘటనలు, అప్పటి అక్కడి జీవితం, ఒక విదేశీయుడిగా అమెరికాలో జీవితం ప్రారంభించటంలో ఉన్న కష్టాలు, ఎదుర్కొన్న సవాళ్ళు – ఇలా సాగుతుంది ఈ పుస్తకంలోని అనుభవాల ప్రవాహాం. నివాసాంధ్రులకి అమెరికా జీవితం పై సరైన అభిప్రాయాలు లేవని అనిపించేది నాకెప్పుడూ! అందుకు నేను వారిని తప్పు పట్టటం లేదు. ఆ నోట ఈ నోటా అమెరికా జీవితం అంటే స్వర్గప్రాప్తే అన్నట్లు మాట్లాడే కొందరు పెద్ద మనుషుల మాటలు విని జనసామాన్యం అటువంటి అభిప్రాయాలు ఏర్పరుచుకుంటారు. మరి అమెరికా జీవితం అంటే ఏమిటి అన్న ప్రశ్నలకి కొన్ని జవాబులు ఈ పుస్తకంలో దొరుకుతాయి.

ఈ 2011 సంవత్సరంలో తెలుగువారు అమెరికాలోని ప్రతి ముఖ్య పట్టణంలో కనిపిస్తున్నారన్నది ఎంత నిజమో 1960 దశాబ్దంలో వేళ్ళ మీద మాత్రమే లెక్కపెట్ట తగినన్ని అమెరికా పట్టణాల్లో తెలుగువారు ఉండేవారన్నది కూడా అంతే నిజం. కంప్యూటర్ రంగం మొలకలెత్తుతున్న దశ అది. అంటే అప్పుడు ఈ పుస్తకంలోని కథానాయకుడిలాగా పై చదువుల కోసం అమెరికా వచ్చిన వారే ఎక్కువన్న మాట. అలాంటి కుర్రాళ్ళు అమెరికాలో ఉద్యోగంలో స్థిరపడే ముందు అమెరికా విశ్వవిద్యాలయల్లో ఒక ఐదారేళ్ళు చదువులు పూర్తి చేసుకునే వారు. అలాంటి అనుభవాలకి ఇప్పటి వరకూ ఎవరూ వివరంగా తెలుగులో అక్షరరూపం ఇవ్వకపోటం వల్ల ఉన్న కొరతను ఈ పుస్తకం తీరుస్తుంది.

అమెరికాలో నివసిస్తూ తెలుగులో రాయటం అన్నది వృత్తిగా స్వీకరించినవారు ఎవరూ లేరు అన్నది ఈమాట పాఠకులకు తెలిసిన విషయమే. రాస్తున్న కొద్ది మంది కూడా ఔత్సాహిక రచయిత(త్రు)లే! తమ తమ అనుభవాలను తెలుగులో రాసి అందరితో పంచుకోటం ఈ రచనలకి ఒక మూల ప్రేరణ. ఇలాంటి సందర్భంలో అమెరికా అనుభవాలను పంచుకొనే రచనలు బహు కొద్ది మాత్రమే. ఈ నేపధ్యంలో వేమూరివారు తమ ‘అమెరికా అనుభవాలు’ పేరిట ఒక పుస్తకం రాయటం ఖచ్చితంగా ఒక ప్రత్యేకతే. అయితే ఈ పుస్తకంలో నేను గమనించిన రెండు అసంపూర్ణమైన విషయాలను మీ ముందుంచుతాను.

మొదటి విషయం కాలానికి సంబంధించినది. 60వ దశాబ్దం నుంచి అమెరికా తమ స్వదేశంగా మార్చుకున్న వేమూరివారి అనుభవాలు ఈ పుస్తకంలో 60వ దశాబ్దంతోనే ఆగిపోయాయి. అపారమైన జీవితానుభవం, సాహిత్య అనుభవమే కాక వృత్తిరీత్యా శాస్త్రీయ రంగంలో అపారమైన అనుభవం గడించిన వేమూరివారి అనుభవాలు మరిన్ని తప్పకుండా గత 40 ఏళ్ళలో ఎన్నో ఉంటాయన్నది పాఠకులు తేలికగా ఊహించగలరు. వాటి ప్రస్తావన ఈ పుస్తకంలో లేదు. వేమూరివారు ఆ అనుభవవివరాలు తమ తరవాతి పుస్తకంలో అక్షరబద్ధం చేద్దామనుకున్నా, సంక్షిప్తంగా అయినా వాటిని ఈ పుస్తకంలో ప్రస్తావిస్తే బాగుండేది.

ఇక రెండవ విషయం. ఈ పుస్తకంలో మచ్చుకి ఒక్కటైనా కానరాని ఛాయాచిత్రాలు. 60వ దశాబ్దంలో ఫొటోలు అరుదన్న విషయం నేనూ నమ్ముతాను. అయితే, వేమూరివారి వద్ద ఎక్కువ ఫొటోలు లేకున్నా వారి అనంత మిత్రబృందంలో కొందరి వద్దనైనా ఆ కాలపు ఫొటోలు ఉంటాయని నేను నమ్ముతున్నాను. బహుశా వేమూరివారు అప్పటి తరం వారి ఆలోచనలకు సమానంగా ఈ దిశలో బహుశా ఆలోచించి ఉండరు. ఆ ఫోటోలు సంపాదించి వాటిని సందర్భానికి తగ్గట్టు ఈ పుస్తకంలో నిక్షిప్తం చేసినట్టయితే ఈ పుస్తకం విలువ మరింత పెరిగేది.

ఈ పుస్తకం చదువుతుంటే, అమెరికాలో 60, 70వ దశాబ్దాల్లో అమెరికా వలస వచ్చి తమ, తమ రంగాల్లో ఉన్నత శిఖరాలు అందుకున్న తెలుగువారు చెప్పుకోతగ్గ సంఖ్యలోనే ఉన్నారు. మరి వారి అనుభవాలు (అందరివీ కాకపోయినా బహుకొద్ది మందివి అయినా) ఎవ్వరికీ తెలియకుండా కాలగర్భంలో కలసిపోవలసిందేనా? అనిపించింది. ఈ సమీక్ష చదివిన అమెరికా తెలుగు వారు ఈ పుస్తకం స్ఫూర్తిగా తీసుకొని తమ అనుభవాలను అందరితో పంచుకుంటారని ఆశిద్దాం!

[అమెరికాలో ఈ పుస్తకం కోసం రచయితను సంప్రదించండి: Rao Vemuri, 3212 Arbor Drive, Pleasanton, CA 94566. వెల: పది డాలర్లు. ఈ పుస్తకం అమ్మకాలపై వచ్చిన ధనాన్ని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో తెలుగు పీఠం ఏర్పాటుకై దానం చెయ్యాలని రచయిత నిర్ణయించటం వల్ల ఒక పది డాలర్లు రావు వేమూరి పేరున పంపిస్తే పోస్టు ఖర్చులు తనే భరించి ఈ పుస్తకం పంపగలనని రచయిత తెలిపారు.]