పుస్తక పరిచయం: సుదర్శనం గారికి…

చక్కని ఉత్తరాల సమాహారం ఈ పుస్తకం; తెలుగు సాహిత్యాకాశంలో ప్రకాశించి మాయమైన తారలు- చలం, కొ.కు., మహీధర, చండీదాస్, ఇస్మాయిల్, శేషేంద్ర, రాళ్ళపల్లి, శివలెంక, వాకాటి లాంటి రచయితలు, కవులు, విమర్శకులు, సంపాదకులు ఉత్తరాల ద్వారా మనకు మరింత ఆత్మీయంగా పరిచయమవుతారు. వీరిలో కొందరి దస్తూరి చూడగల అరుదైన అవకాశం మనకు లభిస్తుంది.

సుదర్శనం గారికి మనకు స్వాతంత్య్రం వచ్చే నాటికి దాదాపు రెండు పదుల వయసు. చదివింది, బోధించింది ఆంగ్ల సాహిత్యం, అన్ని ప్రక్రియల్లో అందె వేసిన చేయి, విమర్శకులుగా అగ్రగణ్యులు. అప్పటి కవులు, రచయితలు ఆయన అభిప్రాయాలను ఔదల దాల్చారు. అర్ధ శతాబ్దంపైబడి సాహిత్యాన్నే శ్వాసించి, కొంత వరకు శాసించి ఆయన తమ జ్ఞాపకాలను మనకు వదిలి వెళ్ళారు.

వారి సతీమణి, స్వయానా పేరుపొందిన రచయిత్రి వసుంధరాదేవిగారు శ్రమకోర్చి ప్రేమతో పూనుకొని ఉత్తరాలన్నీ పద్ధతిగా పోగు చేసి, తగిన వివరాలు పొందుపరిచి ప్రచురించారు. గతాన్ని తెలుసుకొని భవిష్యత్ నిర్మాణంలో పాలుపంచుకునే జిజ్ఞాసువులందరూ ఓపికగా ఒకటికి రెండు సార్లు తిరగేయవలసిన పుస్తకం.

చందమామ సంపాదకులుగా పిల్లలను, పెద్దలను సమానంగా ప్రభావితం చేసిన కొడవటిగంటి కుటుంబరావు సరళంగా నిరాటంకంగా వ్రాయడంలో సిద్ధహస్తులు. ఆయన ఉత్తరాల్లో అదే ముద్ర కనిపిస్తుంది.

ముఖ్యంగా నేను artist కాదనడానికి నా argument, art must basically create beauty, Purposeful writersలో అది చేతకాని వాళ్ళు ఉన్నారు. ఉదా కందుకూరి వీరేశలింగం పంతులు. గురజాడ quite opposite. కన్యాశుల్కంలో depict చేసిన జీవితంగాని పాత్రలుగాని ఈనాడు లేవు. సమస్యలూ మారిపోయాయి. కాని, దాని impact terrific. చలం social outlookతో నేను చాలా కాలంగా ఏకీభవించడం లేదు. కాని, చలం impact కూడా terrific గానే ఉంటుంది. నాలుగో తరం వాళ్ళు చలం stuff చదువుతున్నారు. నేను రాసేది ఎవరికయినా appeal అయితే contentని బట్టి కావాలి. దాని survival గురించి పెద్ద ఆశలు నాకు ఏనాడూ లేవు. నేను రాసింది కీర్తి కోసంగాని, survival కోసంగాని కాదు.” — (వసుంధరాదేవి గారికి రాసిన లేఖ. తేది. 6/1/78, పుట 127.)

తెలుగులో ఇంతకన్నా స్పష్టంగా ఎవరూ రాయలేరు అనుకుంటాను. చివరి వరకూ పరిశీలనకు వీలుగా తమ ఆలోచనలను, నమ్మకాలను నిజాయితీగా నలుగురితో పంచుకోవడం కొ.కు. ప్రత్యేకత.

మరి చలం impact ఎందుకు terrificగా ఉంటుంది? అన్న ప్రశ్నకు సమాధానం చలం మాటల్లోనే:

“ఇంతకీ మీ నవల నాకు నచ్చలేదు. నా అభిరుచి వేరు, నా దృష్టిలో కళకి రసం, emotion ముఖ్యం. ఈనాటి అన్ని రకాల కళలనీ పరిపాలిస్తున్న Dry intellect ఏ మీ నవలనీ నడిపించింది. అది personalగా నాకు పడదు.” — (సుదర్శనం గారు తమ నవల మీద అభిప్రాయం కోరుతూ వ్రాసిన లేఖకు చలం బదులు ఉత్తరం. తేది. 23/7/61, పుట 22.)

తర్వాతి ఉత్తరాల్లో మరింత విడమరిచి చెబుతూ-

“ఎక్కడో ఒకటి రెండు చోట్ల passing references తప్ప, వెన్నెలలు, ఎండలు, వానలు, మంచు- ఎంత దూరమో- వాటికి referenceగా వున్నా అవి stage effects లాగున్నాయి.

మీ పాత్రలు intellectతో ఓ impulseని , emotionsని struggle చేసి అణుచుకున్నట్లూ లేరు. ఎంత woodenగా ఉన్నారో మనుషులు. వాళ్ళకి, అసలు instincts emotions ఉన్నట్లు కనపడరు –so unnatural. ఒక్క మాధవ్ and the two elder sisters తప్ప తక్కినవాళ్ళు నాకు flesh and blood ఉన్నవాళ్ళనిపించలేదు. Character outlines clearగా లేవు. Shadowyగా వున్నారు, disembodied spirits లాగు. ఒక శుభ్రమైన భోజనం కూడా చేసినట్టు లేదు.

ఈ లోకపు భిన్న తత్త్వాలలో అసంభవం అనే సంఘటన లేనే లేదు. Artలో మనం dare చెయ్యలేనివన్నీ ఈశ్వరుడు జరిపించి astonish చేస్తోనే వున్నారు. కాని, ఏ సంఘటన అయినా, ఇది probable అనిపించేలా రాయాలి రచయిత.

నా దృష్టిలో నవల గానీ, కథగానీ భారంగా నడవకూడదు. మీ నవల easily readable కాదు.”

భాషలోనూ భావంలోనూ చలం మార్గాన్ని ఎంచుకొని తెలుగు సాహిత్యాన్ని ఒక్క కుదుపు కుదిపిన రచయిత వడ్డెర చండీదాస్ ఉత్తరంలో సుదర్శనం గారి నవల మీద అభిప్రాయం:

“ఓ పాఠకుడిగా నాకు ప్రత్యేకం యెలాగూ అనిపించలేదు. ఫిలసోఫిక్ థీమ్ మేధ స్థాయిలో సాగిందనీ, హృదయాంతర్గతమై వ్యక్తులుగా అంతగా రూపించలేదని నాకు అనిపించింది.”

గురజాడకు, చలానికి అర్థమైన కళారహస్యం తెలుగులో తదుపరి రచయితల్లో అనేకులు అంతగా పట్టించుకోలేదు. అందుకే, హృదయాన్ని తాకేలా రచనలు చేయడంలో విఫలమయ్యారు. ‘తాదూర కంత లేదు మెడకో డోలు’ అన్నట్టు సామాజిక స్పృహ, మతంగా మారిన ముతక మార్క్సిజం పేరిట నానా చెత్త పోగు చేసి కథాసాహిత్యాన్ని దారి తప్పించారు. మొన్నటి వరకు అటువంటి కథలకే కథా సంగ్రహాల్లో పెద్ద పీట వేసి సంకలనకర్తలు తమ అభిరుచి లోపాన్ని, దృష్టి దోషాన్ని చాటుకున్నారు. కథకు వాతావరణ కల్పన ప్రాణం. చలాన్ని, గురజాడని ఇంతెత్తున నిలబెట్టేది వాతావరణ కల్పనలో వారికి గల అపార ప్రతిభే. అదే కథలో రసాన్ని, ఉద్వేగాన్ని పట్టి నిలిపేది. ఆ ఎఱుక కలుగనంత వరకు అర్థం పర్థం లేని కథలు వండి వారుస్తూనే ఉంటారు కథకులు.


ఈ ఉత్తరాల ద్వారా మనకు తెలిసి వచ్చే మరో విషయం నిజాయితీగా సాహిత్య సృష్టి చేసే వారి మధ్య, రాజకీయాల కోసం సాహిత్యాన్ని వాడుకునే వారి మధ్య ఉన్న సంఘర్షణ:

“త్రిపురనేని శ్రీనివాస్ ఒక యేడాదినుంచి నాకు తెలుసు. త్రిపురనేని మధుసూదన రావుగారి అన్నగారబ్బాయి (మదనమోహన రావు, టిటిడి, ఇంగ్లీషు లెక్చరర్). తుపాకీ గొట్టం పిల్లడు. మదన పల్లె కోర్టు కేసులో ఉన్నాడు. విరసం సభ్యుడు, కవిత్వం బాగా రాస్తాడు. అతను రాసే విషయమూ, దృక్కోణమూ అభ్యంతరకరం కాకపోయినా, రాసే తీరు పట్ల విరసానికి అభ్యంతరాలున్నాయట. (కవిత్వం పేరున నేలబారు నినాదాలు గాక, కవిత్వమే రాస్తాడు అందుకని!)” — (వడ్డెర చండీదాస్, తేదీ 15-12-1987. పుట 96.)

“ఆంధ్ర జ్యోతి డైలీ 27th, ఆదివారం సంచిక చూశారా? మార్క్సిస్టులు ఆక్రమించుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాశారు. అంతా distortion, misrepresentation. పత్రికలో కమ్యూనిస్టుల బెడద మనకింకా వదల్లేదు. …మార్క్సిస్టులు ప్రపంచాన్నే వక్రీకరించారు, కవిత్వమనగా ఎంత?

అనుభూతి కవుల మీద మళ్ళీ వీళ్ళు దాడి ప్రకటించారు. వాళ్ళకి చేతనైంది distortion ఒక్కటే, అకవుల్ని తవ్వుకొచ్చి మహాకవులుగా ప్రకటించటం వాళ్ళకు చాతనైన విద్య.” — (ఇస్మాయిల్, తేదీ 31-12-1987. పుట 77.)

అంతేగాక, మార్క్సిస్టు మేధావుల్లో మనం ఎక్కడో పూర్తిగా దారితప్పాం అన్న భావన:

“Marxism గురించి మీరన్నది నిజం, మన Marxists ధోరణిలో నేను ఏకీభవించలేకుండా ఉన్నాను. వాళ్ళ thinking సరి చేయగల నేమోనన్న ఆశతోనే ఇటీవల కొన్ని చిల్లర వ్యాసాలు రాస్తున్నాను. నా అనుమానం మనవాళ్ళలో dialectical thinking కన్న, పాత ‘జస్టిస్ పార్టీ’ సంస్కరణ వాదం హెచ్చుగా ఉందేమోనని.” — (కొ.కు, వసుంధరా దేవిగారికి, తేదీ 6-1-78. పుట 127.)

“మన సంస్కృతిని, చరిత్రను, తాత్విక భావనలను మార్క్సిజంతో సమన్వయించడం అంటే ఏమిటి? That itself a contradiction in itself. Like Buddha and Sankara Marx also relegated to History. Let him lie peacefully in his grave. At present let us consider the fate of our people and country. — ( మహీధర రామమోహన రావు , తేదీ లేదు, పుట 57.)


అనుభూతి కవితకు సుదర్శనం గారిచ్చిన నిర్వచనాన్ని R. H. Blaith హైకూకి ఇచ్చిన నిర్వచనంతో సమంగా ఉంది అనడంలోనే ఇస్మాయిల్ గారికి సుదర్శనం గారి విమర్శక ప్రతిభ మీద అపారమైన విశ్వాసం ఉన్నట్టు తెలుస్తుంది. శేషేంద్ర ఉత్తరాల్లో అదే భావం వ్యక్తమవుతోంది. సంసారవృక్షం నవలను చదివి ఉత్తేజితులై ఉదకమండలం నుండి రాసిన ఆంగ్ల లేఖలో కొన్ని మంచి విషయాలున్నా, పరిశీలన తక్కువ, పాండిత్య ప్రకర్ష ఎక్కువయిన తీరు విశదం. అంతేగాక ఆ ఉత్తరంలో కలగాపులగపు ఆలోచనలు జాస్తి. ఆంగ్ల నుడికారం హుళక్కి. తద్భిన్నంగా, కొ.కు. ఆంగ్లంలో రాసిన ఉత్తరం (పుట 34) ఒక మణిపూస. ఆలోచనల్లో స్పష్టతను అనాయాసంగా భాషలోకి ప్రవేశపెట్టి ఎంతటి గహనమైన విషయాన్నయినా మంచినీళ్ళ ప్రాయంగా పాఠకులకు అందించడం అన్న అరుదైన కళ పట్టుబడిన అపురూప శిల్పి కొ.కు. రచయితగా తన్ను తాను తక్కువ అంచనా వేసుకోవడంలోనే ఆయన అసామాన్యత బయట పడుతుంది.

ఈ ఉత్తరాల సంపుటిని విమర్శక శ్రేష్ఠులు రాళ్ళపల్లి గారి ఉత్తరంతో ఆరంభించడం ఎంతో సముచితం. విశ్వనాథవారి ఒక ఆసక్తికరమైన ఉత్తరం ఇందులో చోటు చేసుకుంది. ఇకపోతే, సాహిత్యేతర విషయాలైనా, ప్రస్తావించ దగ్గవి కొన్ని:

ఆ రోజుల్లోనే చికెన్ గున్యా వ్యాధి తలెత్తిన విషయం శంభుప్రసాద్‌గారి లేఖల్లో కనిపిస్తుంది.

“The after effects of this new fever, it is called Chicken Gunia (sic) are very bad and continue for long time. I am still suffering from them. All the joints in the body are affected by it , including fingers.” — ( S. Sambhuprasad Dt. 26-9-64. pp 150.)

“మీ పుస్తకం మీకే విమర్శకు పంపడం పొరపాటు. అట్ట మీద మీ పూర్తి పేరు చూడలేదేమో! — (శివలెంక శంభుప్రసాద్, తేదీ. 18-6-64. పుట 143.)

“మంగాపురం గుడి బయట వదిలిన చెప్పులు -బాటా -రూ. 300 – కొని వారమే అయింది- పోయాయి. అది వేరే ప్రహసనం” — (వాకాటి పాండు రంగారావు, తేదీ 12-6-96. పుట 102.)


భారతి, ఆంధ్రపత్రిక తెలుగు జాతి సేవలో తరిస్తున్న రోజుల్లో సుదర్శనంగారికి ఆదర్శ సంపాదకులు శివలెంక శంభుప్రసాద్‌గారు రాసిన ఉత్తరాలు వారి ఆత్మను ఆవిష్కరిస్తాయి. విలువలతో కూడిన ఒక పత్రికను నడపడం ఎంత కష్టమో తెలిసివస్తుంది. పాఠకులకు, రచయితలకు మధ్య వారధి సంపాదకుడు. అటూ ఇటూ రాకపోకలు సాగడంలో ప్రముఖ పాత్ర వహించే సంపాదకుడు ఏ ఎండ కాగొడుగు పడుతూ, సత్యదూరుడై నడచుకుంటే నష్టపోయేది పాఠకలోకమే. ఎవరికైనా, అభిరుచిని మించిన ఆస్తి లేదు, మీదు మిక్కిలి సంపాదకుడికి అభిరుచిలేనిదే పూట గడవదు. సంపాదక పీఠం ఒక విచిత్ర సింహాసనం. ఒకడు నిలబడితే కూర్చునే వాడికి, ఒదిగి కూర్చోలేని వాడికి దాన్ని అధివసించగల అర్హత లేదు. అంతేకాదు, రచయితను చూసి లేచి నిలబడగల వినయం లేని వాడు సంపాదక పదవికి అనర్హుడు. తెలుగులో సంపాదకత్వం పేరు మీద తేలు పెత్తనాలే అధికం, సదరు సంపాదకులందరూ శివలెంక శంభుప్రసాద్‌గారి ఉత్తరాలు చదివితే సత్వరం సంస్కారవంతులగుటకు ఆస్కారం కలదు.

శంభుప్రసాద్‌గారు కోరటం వల్లే భారతిలో, సుదర్శనం గారి విమర్శ మొదలయింది. సంపాదకుడు ఎంతో దూరదృష్టితో సాహిత్యంలో తన వంతు పాత్రను పోషిస్తాడు. (నా అనుభవంలో అభిరుచిగల ఈమాట వ్యవస్థాపక సంపాదకులు KVS రామారావుగారు అధునాతన యుగంలో అటువంటి పాత్రను ఎంతో సమర్థంగా పోషించారు. ఆయన కోరటం వల్లే నేను విమర్శ రాయటం జరిగింది అన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. అలాగే, ఆంధ్ర దేశంలో త్రిపురనేని శ్రీనివాస్ కవిత్వ సంపాదకుడిగా తన వంతు పాత్రను అనితర సాధ్యంగా నిర్వర్తించాడు. సాహిత్యం పట్ల నిబద్దత లేనిదే ఇవన్నీ సాధ్యం కావు.)

అంతర్జాలంలో అభిప్రాయాల ప్రకటన పేరు మీద పాఠకుల, రచయితల, సంపాదకుల మార్జాల ప్రతాపాలు చూస్తూనే ఉన్నాము. శంభుప్రసాద్ గారి ఉత్తరాలు ఈ విషయంలో సర్వులకు – మరీ ముఖ్యంగా సంపాదకులకు – మార్గదర్శకత్వం నెరపగలవు.

“విమర్శలో Factual Errors ఉంటే తప్ప (వ్యాసం గురించి ఉంటేనే) ప్రతి విమర్శ వేయము.” — (శివలెంక శంభుప్రసాద్, తేదీ. 30-6-64. పుట 144.)

“సాధారణంగా విమర్శ మీద విమర్శ వేయటం పరిపాటి కాదు. ఎందుకంటే, ప్రతి విమర్శ మీద విమర్శ వస్తూనే ఉంటుంది. మీ విమర్శలో Factual Errors లేవు కదా? మీ వ్యాఖ్యానాన్ని, అభిప్రాయాన్ని విమర్శించడం అయితే ఎవరిదయినా విమర్శించవచ్చు. దానికి అంతూ పొంతూ ఉండదు.” — (శివలెంక శంభుప్రసాద్, తేదీ. 6-7-64. పుట 145.)

(ఈ సంఘటనకు పూర్వాపరాలు: జి.వి.కృష్ణారావు రచించిన ఉదబిందువులు అనే పుస్తకాన్ని సుదర్శనంగారు భారతిలో సమీక్షించారు. ఆ సమీక్షపై త్రిపురనేని వెంకటేశ్వర రావుగారు విమర్శ రాశారు. సుదర్శనం గారు కోరిన మీదట త్రిపురనేని వారి విమర్శను, సుదర్శనం గారి సమాధానాన్ని శంభుప్రసాద్ గారు భారతిలో ప్రచురించారు.)

ఇదే పద్ధతిని, ఇప్పటికీ అన్ని ఆంగ్ల సాహిత్య పత్రికలూ పాటించడం గమనించవచ్చు.


రచయితకు నిజాయితీ ప్రాణం అని మీరు నమ్మితే ఈ పుస్తకాన్ని తెరచి చదవవలసిందే.

ఆంధ్ర దేశంలో వార్తా పత్రికలు చావు వార్తలను, రంకు భాగోతాలను పోగుచేసుకొని బ్రతుకుతున్న సమయంలో విలువలు ఎవరికి కావాలి?? తెలుగు తప్పుల్లేకుండా రాయలేని వారు కూడా సంపాదకులు ఈనాడు! తమ్ము తాము గౌరవించుకోలేని పత్రికలు రచయితలకు ఇచ్చే గౌరవం ఏపాటిది?? భవిష్యత్ మీద ఆశ కల్పిస్తున్నది – పరిస్థితిని అర్థం చేసుకొని, సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని నిజాయితీగా రచనలు చేస్తున్న నవతరం – ఈ పుస్తకాన్ని చదివి, చర్చించి దిశా నిర్దేశం చేసుకుంటే ఈ పుస్తకం పరమార్థం నెరవేరినట్టే.

(సుదర్శనం గారికి – చలం నుండి చండీదాస్ వరకు. ప్రతులకు: నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్.)


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...