మలయాళ ఛందస్సు – ఒక విహంగ వీక్షణము

పరిచయము

సుమారు మూడు కోట్లకన్న ఎక్కువ మంది భారతదేశములో మలయాళ భాషను మాట్లాడుతారు. భారతీయ భాషలలో దీని స్థానము తొమ్మిదవది. గడచిన సంవత్సరము దీనికి ప్రాచీన భాష హోదాను కూడ కేంద్ర ప్రభుత్వము ఇచ్చినది. కేరళ రాష్ట్రములో 90% కన్న ఎక్కువ మందికి ఇది మాతృభాష. ద్రావిడ భాషలలో ఇది అర్వాచీనమైనది. ఈ భాషాచరిత్రకు ఆధారములు సుమారు తొమ్మిదవ శతాబ్దమునుండి ఉన్నవి. మొట్టమొదట ఇది తమిళ భాష నుండి పుట్టినా, ఒక రెండు శతాబ్దములలో తనదైన ప్రత్యేకతను కలిగించుకొన్నది. మలయాళ భాష జనించక ముందు ఈ ప్రాంతము నుండి తమిళములో శిలప్పదికార రచయిత ఇళంగో అడిగళ్, సంస్కృతములో ఎన్నో గ్రంథములను, స్తోత్రములను రచించిన అద్వైతమత ప్రవక్త ఆది శంకరులు సుప్రసిద్ధులు.

తెలుగువారికి సంస్కృత ఛందస్సుతో ఎక్కువ పరిచయము, పటిమ గలదు. సోదరభాషయైన కన్నడములోని ఛందస్సు కూడ పరిచితమే. ఈ రెండు భాషలలో అక్కరల, రగడల వంటి బంధములు గలవు. అది మాత్రమే కాక కందములో, ఖ్యాత వృత్తములయిన మాలావిక్రీడితములలో వ్రాయబడిన కావ్యములు ఈ రెండు భాషలలో ఉన్నాయి. తమిళ ఛందస్సు ప్రత్యేకముగా మఱొక భిన్న రీతిలో పుట్టి పెరిగినది. చాల తక్కువ మంది తమిళ ఛందస్సులోని మెళకువలను ఎఱుగుదురు. మలయాళ ఛందస్సును గుఱించి నేనెఱిగినంతవఱకు ఒక్క ప్రస్తావన మాత్రమే గలదు. అది సర్వోత్తమరావు వ్రాసిన దాక్షిణాత్య దేశి ఛందోరీతులు పుస్తకములో 15 పుటలు. ఈ విషయములు కూడ ఒక సంక్షిప్త రూపములో నున్నవి. అంతేకాక అందులోగల ఛందోబంధములకు ఉదాహరణములు తక్కువ, తెలుగులో అసలు లేవు. కావున మలయాళ ఛందస్సులోని విశేషములను వివరిస్తూ వాటికి తెలుగులో ఉదాహరణములను ఇచ్చి, చివరకు వాటినుండి నేను క్రొత్తగా నేర్చుకొన్న విషయములను కూడ ఈ వ్యాసములో చర్చిస్తాను. ఈ కారణములవల్ల ఈ వ్యాసము తెలుగు పాఠక జనానికి అతి నూతనమైనది అని చెప్పడములో సందేహము లేదు.

మలయాళ సాహిత్యము

మలయాళ ఛందస్సును గుఱించి చర్చించడానికి ముందు మలయాళ సాహిత్యమును గూర్చి సంక్షిప్తముగా తెలిసికొనుట అవసరము. ఏ భాష చరిత్రైనా మొట్టమొదట పాటలు, గేయములు మొదలైన వాటితో ప్రారంభమవుతుంది. మలయాళ భాష దీనికి మినహాయింపు కాదు. కాళీపూజ చేయునప్పుడు పాణత్తోట్రం అనే పాటలను 6-9 శతాబ్ద కాలములలో పాడేవారని అంటారు. అట్టి ఒక పాట లేక పద్యము –

ఆదియే అఖిల నాథే అరిపొరుళాయ దేవీ
వేదియే విమలే విద్యే విణ్ణవర్ తోట్రుం పెణ్ణే
చోదితా ణుడిచ్చ పోలే సుందరత్తోడు కూడి
నీదియిల్ కథయు నీడేళి ఞరుళ్గ వాణీ

(ఇది సరస్వతిని స్తుతించుచు కావ్యారంభములో వ్రాసినది. అన్నిటికి ఆదియైన అఖిలనాయకీ, వస్తువు కునికియైన దేవీ, వేద రూపిణీ, విమలా, విద్యాస్వరూపిణీ, దేవతలు పొగడుదానా, సౌందర్యవంతమైన పదములతో నీతితో చెప్పునట్లు నన్ను ఆశీర్వదించు తల్లీ)

తమిళ సంస్కృతముల ప్రభావము ప్రారంభదశలో మలయాళము పైన ఎక్కువగా నుండినవి. అందువలన మణిప్రవాళము అను కొత్తదైన భాష గోచరించినది. మణిప్రవాళము పైన వ్రాయబడిన లక్షణగ్రంథము లీలాతిలకములో మొదటి సూత్రము ‘భాషా సంస్కృతయోగో మణిప్రవాళం.’ దేశభాష, సంస్కృతపు కూడికయే మణిప్రవాళము అని అర్థము. ఇక్కడ మణి అంటే మలయాళము, ప్రవాళము అంటే సంస్కృతము. మణిప్రవాళ భాషలో లీలాతిలకము నుండి వసంతతిలక వృత్తములో ఒక పద్యము –

వసంతతిలకము –
పొన్నోలయుం వళయుమారమువెన్ఱివెల్లా
మల్లాగయిల్ల కళభాషిణి భూషణాని
ఎల్లోర్కుమే రసకరం సతతం నిబద్ధం
సౌజన్య మెన్ఱిదు విభూషణమంగనానాం — (లీలాతిలకము 16)

(బంగారు కమ్మలు, గాజులు, హారములు ఇవన్నీ నగలే, అందులో సందేహము లేదు కలభాషిణీ, కాని అన్నిటికంటె మిన్నయైన విశేష ఆభరణము అందఱికి రసవంతమగునట్లు ఎప్పుడు సౌహార్ద భావంతో నుండడమే కదా!)

ఆరంభ కాలములో మణిప్రవాళ భాషలో ఉణ్ణియచ్చిచరితం, ఉణ్ణియడి చరితం, ఉణ్ణి చిరుదేవి చరితం, రామాయణము, భారతము వంటి చంపూకావ్యములు వ్రాయబడ్డాయి. మలయాళములో నేటికి కూడ చీరామకవి వ్రాసిన రామచరితం కావ్యమునే మొట్టమొదటి ఉత్తమ సాహిత్య గ్రంథముగా పరిగణిస్తారు. దీని కాలముపైన కూడ తర్జనభర్జనలు ఇంకా జరుగుతున్నాయి. కొందఱు ఇది 12వ శతాబ్దము నాటిదంటే మఱి కొందఱు ఇది 14వ శతాబ్దము నాటిదంటారు. 1814 పద్యములతో (పాట్టుగళ్ లేక పాటలు), 164 పరిచ్ఛేదములతో నుండే ఈ కావ్యములో ఎక్కువ పాలు తమిళమే, ఛందస్సు కూడ ద్రావిడ ఛందస్సే. రామచరితము నుండి ఒక ఉదాహరణము –

ద్రుతకాకళి –

వణ్ణమేలుం మరామరం కొండాన్
తణ్ణయాక్కి యకంపనన్ మెయ్యెల్లాం
ఎణ్ణిలాయిరం కూఱిడు మాఱుపోయ్
మణ్ణిల్ వీళవన్ మారుతి తళ్ళినాన్ — (రామచరితం, 21.2)

(ఇది యుద్ధ కాండ లోనిది. అకంపనుడనే రాక్షసుని హనుమంతుడు ఒక చెట్టుతో నేల కూల్చాడు.)

ముందే చెప్పినట్లు రామచరితము లోని భాష తమిళము, సంస్కృతము, మలయాళము కాదు. దక్షిణ కేరళలో నిరణం అను గ్రామములో 1350-1450 కాలములో మాధవ పణిక్కర్ (భగవద్గీత), శంకర పణిక్కర్ (భారతమాల), రామ పణిక్కర్ (రామాయణ, భారత, భాగవత, శివరాత్రీమాహాత్మ్యము) అనే ముగ్గురు కవులు జీవించారు. వీరు వ్రాసిన కావ్యములే పూర్తిగా మలయాళములో వ్రాయబడిన మొట్ట మొదటి కావ్యములు. వీరు బ్రాహ్మణ కులమునకు చెందకపోయినా, సంస్కృతములో వీరి భాషాపటిమ నంబూదిరి బ్రాహ్మణులకు ఏ మాత్రము తీసిపోదు. క్రింద ఒక రెండు పంక్తులు –

మేదినియిలెవనిన్ను వేదమూర్తియాయెణ్ణుం
బోధరూపనాం నినక్కు పూజ చెయ్దిడున్నదుం

(మేదినిలో నిన్ను వేదమూర్తిగా తలచి బోధరూపుడైన నీకు పూజ చేయుటయు…)

తఱువాత చెఱుస్సేరి (1446-1475) కృష్ణగాథను రచించెను. ఇది మలయాళములో ఒక మహోన్నత గ్రంథముగా పరిగణించబడినది. మలయాళ సాహిత్యములో పితృస్థానమును ఆక్రమించుకొన్న కవి తుంజత్తు ఎళుతచ్చన్ (1475-1575). ఇతడు ఆధ్యాత్మ రామాయణమును కిళిప్పాట్టుగా రచించెను, అనగా రామాయణ గాథను ఒక చిలుక నోటిలో చెప్పించెను. ఆధ్యాత్మరామాయణమునుండి ఒక పద్యము –

కేక –

కారణనాయ గణనాయకన్ బ్రహ్మాత్మకన్
కారుణ్యమూర్తి శివశక్తిసంభవన్ దేవన్
వారణముఖన్ మమ ప్రారబ్ధ విఘ్నఙ్గళె
వారణం చెయ్దీడువానావోళం వందియ్కున్నేన్ — (బాల, పంక్తులు 15-18)

(మూలకారణుడైన గణనాయకుని, బ్రహ్మస్వరూపుని, దయామూర్తిని, శివపార్వతులకు పుట్టిన దేవుని, గజముఖుని, నా ప్రారబ్ధముచే కలిగిన అడ్డంకులను పూర్తిగా తొలగించుమని ప్రార్థించుచున్నాను.)

17వ శతాబ్దములో ఆట్టకథలు (రామనాట్టం, కృష్ణనాట్టం) అవతరించాయి. ఇవి రామాయణ, భాగవత గాథలను నృత్యరూపములో చూపించునప్పుడు వ్రాసిన పాటలు. తఱువాత కుంజన్ నంబియార్ (1705-1770) ఓట్టన్ తుళ్ళల్ అని చిందులను ప్రవేశ పెట్టినాడు. ఇది ప్రదర్శనలకు కథకళిలా అనువైనది. మృదంగము, ఇడక్క వాద్యములు కూడ పాటలకు పక్కవాద్యములుగా నుండును. ఇది ఒక పురుషుని ఏకపాత్రాభినయము అని చెప్పవచ్చును. ఈ తుళ్ళల్ పదమునకు ఒక హాస్యరసపూరిత ఉదాహరణము –

అన్ననడ –

చెఱియ పప్పడం, వలియ పప్పడం
కుఱియ చోరుమ క్కఱియు మద్భుతం

(చిన్న అప్పడాలు, పెద్ద అప్పడాలు, అన్నము, మాంసపు కూర ఇవ్వన్నీ బాగు బాగు.)

19వ, 20వ శతాబ్దములో కుమారన్ ఆశాన్ వంటి కవులు మలయాళ సాహిత్యములో ఆంగ్ల భాషా ప్రభావము ననుసరించి నూతన మార్గములలో తీసికొని వెళ్ళినారు. ఆశాన్ పద్యము నొకదానిని మత్తకోకిల వ్యాసములో తెలిపియున్నాను.

మలయాళ ఛందస్సు

కన్నడ, తెలుగు ఛందస్సులలో కాలపరిభ్రమణములో ఎక్కువ మార్పులు లేవు. కన్నడములో అంశ లేక ఉపగణములతో నిర్మించబడిన జాతులు కాలక్రమేణ మాత్రాగణ నిర్మితమైనవి. తెలుగు ఛందస్సులో గడచిన పది శతాబ్దులలో మార్పులు చాల తక్కువ. కాని మలయాళ ఛందస్సులో మనము ఛందశ్శాస్త్రము ఏ విధముగా ఒక ఘట్టమునుండి మఱొక ఘట్టమునకు చేరుతుందో అనే విషయాన్ని బాగుగా గమనించవచ్చును. మలయాళ ఛందస్సులో సంస్కృత వృత్తములు ఉన్నాయి, కాని అందులో కొన్ని సౌలభ్యము కోసము మాత్రావృత్తము లయ్యాయి. మలయాళ దేశి ఛందస్సు ప్రారంభ దశలో తమిళ ఛందస్సునుండి ఎన్నియో వృత్తములను గ్రహించుకొన్నది. కాలక్రమేణ అవి కూడ మార్పుకు లోనయ్యాయి. ఈ మార్పులకు ముఖ్య కారణము మలయాళములో పద్యములు పాటలు. అవి గానయోగ్యములు, తాళబద్ధములు. తమిళములో కూడ తేవారము, తిరుప్పుగళ్ లోని వృత్తములను నేడు కూడ విరివిగా పాడుతారు. కన్నడములో షట్పదలలో, సాంగత్యములలో కావ్యాలనే వ్రాసినారు. అవి గాన యోగ్యములు. కాని తెలుగులో నన్నయ నుండి విశ్వనాథ సత్యనారాయణ వఱకు పద్యములు చదువుటకు మాత్రమే వ్రాసినారు. దీనికి మినహాయింపులు బహుశా ద్విపద కావ్యములు, పోతన భాగవతము అని చెప్పవచ్చును. పాటలు, పద్యాలు తెలుగులో సమాంతరముగా నడిచాయి. అవి యక్షగానములలో మాత్రమే సంధించాయి. కాని యక్షగానములను తెలుగువాళ్ళు నిర్లక్ష్యము చేసిన తీరును తలచుకొంటే కన్నీళ్ళు రాక తప్పదు!

పాట – పద్యము

మలయాళములో పాటకు పద్యములకన్న ఎక్కువ ప్రాముఖ్యము. పాటకు, పద్యానికి మధ్య ఉండే వ్యత్యాసములేమి? రెంటికీ ఛందస్సు అవసరము. సామాన్యముగా పాటలను తాళబద్ధముగా పాడుకొనవచ్చును, అన్ని పద్యాలను పాడుకొనడానికి వీలయినా, అందులో కొన్నింటిని మాత్రమే తాళయుక్తముగా పాడుకొనవచ్చును. గణబద్ధముగా నుండి, యతిప్రాసలు సరిపోయిన పక్షములో పదములను ఏ విధముగానైనా సందర్భమునకు సరిపోయే విధముగా పద్యములలో ఎన్నుకోవచ్చును. కాని పాటలకు అలా కాదు. పదమునకు పదమునకు మధ్య విరామము పాటలోని తాళగణమునకు సరిపోయే విధముగా నుండాలి, లేక పోతే పాట వినడానికి సొంపుగా నుండదు. పద్యములో కనబడే పదములను ఒకే విధముగా మాత్రమే ఉచ్చరించ వీలగును. ఉదాహరణకు ఒక గురువు, ఒక లఘువు ఉండే నీవు అనే పదమును ఆ విధముగా మాత్రమే పలుకుటకు వీలవుతుంది. కాని అదే నీవు పదమును నీవూ లేక నీఽవూఽ అని తాళమునకు సరిపోయేటట్లు పొడిగించి పాటలో పలుక వచ్చును. అంటే లఘువు లఘువుగా మాత్రమే కాక గురువుగా (రెండు లఘువుల కాలము), ప్లుతముగా (మూడు లఘువుల కాలము), కాకపదాక్షరముగా (నాలుగు లఘువుల కాలము) పలుకవచ్చును. అదే విధముగా గురువును లఘువుగా కూడ పలుకవచ్చును, ఉదా. కలలో -> కలలొ. తమిళములో ఐ అక్షరమును అ-కారాంత లఘువుగా వాడుట పరిపాటి, ఉదా. కలైయే ఎన్ వాళ్కయిన్ దిశై మాట్రినాయ్ -> కలయే ఎన్ వాళ్కయిన్ దిశయ్ మాట్రినాయ్. తెలుగు, కన్నడ పద్యములలో పాదాంత విరామమును పాటించుట ఐచ్ఛికము. ద్విపదలకు, రగడలకు ఇది నియతమైనా, సీస, గీతాదులకు కూడ దీనిని పాటిస్తారు. కాని వృత్తములలో పాదాంత విరామమును పాటించకుండ ఉండడము మాత్రమే కాదు, అదొక పద్య శిల్పము అని కూడ కొందఱు భావిస్తారు. కాని పాటలలో ఇట్టి విరామమును తప్పనిసరిగా పాటిస్తారు. అప్పుడే పాట శ్రోతలకు అర్థవంతముగా ఉంటుంది. ఇలా పాట నియమములు వేఱు, పద్య నియమములు వేఱు. అందుకే యక్షగానములలో తప్ప తెలుగులో పాటలు, పద్యములు భిన్న మార్గాలలో ప్రయాణము చేశాయి. కాని మలయాళములో (తమిళములో కూడ) గానయోగ్య ఛందోబంధములకు పాదాంతయతి, పాదము మధ్యలో విరామము, తాళగణములకు సరిపోయేటట్లు పదముల ఎన్నిక, కొన్ని సమయములలో హ్రస్వములను దీర్ఘముగా నుచ్చరించుట సర్వసామాన్యము. అంతే కాక వారు చతుష్పదులకన్నా ద్విపదలను ఎక్కువగా ఎన్నుకొన్నారు.

తమిళ సంస్కృత ఛందస్సుల ప్రభావము

మలయాళ ఛందస్సు ప్రారంభ దశలో తమిళ ఛందస్సునుండి ఎన్నో వృత్తములను గ్రహించినది. రామచరితములో తమిళ ఛందస్సు పాలు ఎక్కువ. తఱువాత సంస్కృత ఛందస్సులోని శార్దూలవిక్రీడితాది వృత్తములలో కూడ చంపూకవులు వ్రాసినారు. కొన్ని సంస్కృత వృత్తములను వారు వేఱు పేరులతో పిలుస్తారు. కొన్ని వృత్తములను మాత్రావృత్తములుగా కూడ మార్చినారు. లీలాతిలకములోని 11వ సూత్రములో పాట్టు అను ప్రయోగమునకు నిర్వచనము ఈ విధముగా చెప్పబడినది: ‘ద్రవిడ సంఘాతాక్షర నిబంధ మెదుక మోన వృత్త విశేష యుక్తం పాట్టు.’ ఎదుక అంటే ద్వితీయాక్షర ప్రాస, మోన అంటే అక్షరసామ్య యతి. ఈ రెండు నియమములు కలిగిన తమిళ వృత్త విశేషము పాట.

స్రగ్ధర, మందాక్రాంత, శార్దూలవిక్రీడితము, వసంతతిలకము, ఇంద్రవజ్ర వృత్తములు లీలాతిలకములో చదువవచ్చును. భుజంగప్రయాతము, తోటకము, పంచచామరము, స్రగ్విణీ, స్వాగత వృత్తములు కూడ మనకు మలయాళ కావ్యములలో కనిపిస్తాయి. సంస్కృతము లోని లలితగతి లేక సురభి శంకరచరితము అయినది. చర్చరీ, విబుధప్రియా లేక మత్తకోకిలను మలయాళములో మల్లికా అంటారు. శారదచంద్ర లేక కలహంసీ మదనార్త యైనది. సురనర్తకీ లేక తరంగకమును కుసుమమంజరి అంటారు. ఎన్నో వృత్తములున్నా ఇట్టి వృత్తములు మలయాళములో వాడబడుటకు కారణము ఇవి తాళవృత్తములు.

లలితగతి / సురభి / శంకరచరితము – స/న/జ/న/భ/స, యతి (1, 11) IIUII – IIUII – IIUII – IIU
18 ధృతి 126844

క్రింది పద్యములో యతితోబాటు ఆఱేసి అక్షరములకు ప్రాసయతి కూడ గలదు.

సరసమ్ముగ – హరుసమ్ముగ – స్వరరాగపు సుధలన్
వరమై పెను – సిరియై కరి – వరదా వడి నియరా
మురువై సుర-తరువై హృది – మొఱలన్ మెల వినరా
హరి రా ముర-హర రా నర-హరి రా భవహర రా

క్రింది పద్యములో ప్రాసయతి మాత్రమే.

అరుణారుణ – కిరణమ్ముల – నరుణోదయ – మెరిసెన్
మరుమల్లెలు – విరజాజులు – విరిసేనుర – తరులన్
చిరకాలపు – గురు నిద్రను – హరి చాల్చర – కరుణన్
చరణమ్ముల – శరణంటిర – సురభూరుహ – సురభీ

సురనర్తకీ / తరంగకము / కుసుమమంజరి – ర/న/ర/న/ర/న/ర, యతి (1, 7, 13)
UIUIII – UIUIII – UIUIII – UIU 21 ప్రకృతి 765627

(3,5) గతి-
నీల మేఘముల – నీల పుష్పముల – నీల సంద్రములఁ జూడగా
నీలదేహు వర – నీల కేశముల – నీల పింఛ మగుపించుఁగా
నీలమోహనుని – నీలకంఠమున – నీలరత్నముల నెంచఁగా
బేల డెందమున – వేల నెమ్మిలులు – వేల నాట్యముల నాడుగా

(5, 3) గతి-
నింగిలో మొయిలు – నింగిలో పులుఁగు – నింగిలో వెలుఁగు బిల్చె నన్
నింగిలో శశియు – నింగిలో మిసయు – నింగిలో మురువు బిల్చె నన్
రంగ మీ వసుధ – రంగుతో వెలిఁగె – రంగవల్లి సురనర్తకీ
రంగులన్ బలు తె-రంగులన్ గలుపు – రంగమౌ బ్రదుకు నాయకీ

సురనర్తకి- యతి (1, 10), ప్రాసయతి (1, 13) UIU III UIU – III – UIU III UIU

నల్లనౌ తిమిర వీథిలో – నగుచుఁ – దెల్లఁగా మెఱిసెఁ దారకల్
చల్లగా నలరె వెన్నెలల్ – సరస – చల్లనౌ రజని వేళలో
హృల్లతల్ విరియ సొంపుగా – నిచట – నుల్లముల్ మురిసి పొంగఁగా
వల్లకిన్ ద్వరగ మీటవా – స్వరపు – పల్లకిన్ గులికి సాగెదన్

మలయాళములో మూడు విధములైన ఛందస్సులను గమనించవచ్చును – 1. సంస్కృత వృత్తములు, అందులోని మార్పులు, 2. పాడుటకు అనువై మాత్రాగణ నిర్మితములయిన దేశి ఛందస్సులు, 3. గురులఘువుల నియమములు తక్కువగా నుండి అక్షరసంఖ్య పైన ఆధారపడిన పద్యములు. ఈ మూడవ నిర్మాణము కొత్తది. దీనితో ఎన్నో లయలు సాధించుటకు వీలవుతుంది. కొన్ని ఛందస్సులకు ఆరంభదశ లోని లక్షణములు వేఱు, నేటి లక్షణములు వేఱు. నేను ఈ నాడు ఉపయోగములో నున్న లక్షణములనే మీకు ఇస్తున్నాను.

1.01 కేక – కేక అనునది మలయాళ భాషలో చాల ప్రసిద్ధమైన దేశి ఛందస్సు. ఇది తమిళమునుండి (ఆఱు శీరులు లేక గణములు గల వృత్తము) గ్రహించబడినది. కాని ఇప్పుడు ఇది పూర్తిగా అక్షర ఛందస్సు. కేక ఒక ద్విపద. ప్రతి పాదములో 14 అక్షరములు. ఏడేడు అక్షరములకు పదవిచ్ఛేదయతి ఉన్నది. ఈ ఏడు అక్షరములు 3-2-2 అక్షరముల గణములుగా నుండవలయును. ప్రతి గణములో కనీసము ఒక్క గురువైనను ఉండవలయును. ఎన్ని గురువులైనను ఉండవచ్చును. అనగా గణ స్వాతంత్ర్యము గలదు. కేక అర్ధ పాదమును 7.3.3 = 63 విధములుగా వ్రాయ వీలగును. మొత్తము పాదమునకు 63.63 = 3969 విధములైన అమరికలు గలవు. గణములను సరిగా ఎంచుకొంటే పాదములు లయబద్ధముగా ఉంటాయి.

3-2-2 / 3-2-2 (ప్రతి గణములో కనీసము ఒక గురువు) యతి (1, 8) పాదములో 7/7 విఱుపు

పెట్టనుఁ జూడ నెంతొ – పెద్దఁగఁ గన్ను లాయె
లొట్టలు వేసె వాఁడు – లోలను విప్పు టాయె
అమ్ముము నాకుఁ బెట్ట – నమ్ముము వేగ నాకు
అమ్మను నేను నీకు – నమ్మను నేను నీకు

(మొల్ల, తెనాలి రామకృష్ణుల చాటు కథ ఈ పద్యములకు ఆధారము; లోల = నాలుక)

1.02 అర్ధకేక – కేకలోని ఏడక్షరముల అర్ధపాదముతో అర్ధకేకను వ్రాస్తారు. ప్రాసయతితో ఒక కేక పాదము ఒక అర్ధకేక ద్విపద అవుతుంది. ఒక ఉదాహరణము –

3-2-2 అక్షరములు, (ప్రతి గణములో కనీసము ఒక గురువు)

నా జీవ పుష్ప భృంగా
రాజీవనేత్ర రంగా
రాజిల్లు నిన్నె ముందు
పూజింతు డెందమందు

1.03 కృశమధ్య – 63 విధములైన అర్ధకేకలో ఒక ప్రత్యేకత కృశమధ్య. ఏడక్షరములలో మధ్యాక్షరము లఘువైతే అది కృశమధ్య అవుతుంది. దీనిని సంస్కృత ఛందస్సులో ఇభభ్రాంతా అంటారు.

మ/య/గ UUU I UUU, 7 ఉష్ణిక్ 9

వేణూరావమై రావా
వీణానాదమై రావా
ప్రాణాధారమై రావా
ప్రాణేశా ప్రియా రావా

రెండేసి పాదాలను కలిపితే పై పద్యము ఒక కేక అవుతుంది –

వేణూరావమై రావా – వీణానాదమై రావా
ప్రాణాధారమై రావా – ప్రాణేశా ప్రియా రావా

2.01 కాకళి – మలయాళ ఛందస్సులో కాకళికి, ఆ మూసలోని మార్పులకు ఒక విశిష్ట స్థానము ఉన్నది. ఇది పంచమాత్రా బద్ధమైనది. ఎదురు నడకలేని పంచ మాత్రలు – UIU, UUI, UIII, IIUI, IIIU, IIIII. ఇందులో మూడక్షరముల పంచమాత్రలు ర-గణ, త-గణములు. పాదమునకు నాలుగు ర-గణములు ఉండే వృత్తము స్రగ్విణి. పాదమునకు నాలుగు త-గణములు గల ఛందస్సు – కామావతార లేక సారంగరూపక. ద్విపదయైన కాకళిలో ప్రతి పాదములో నాలుగు మూడక్షరముల పంచమాత్రాగణములు, అనగా ర-గణమో లేక త-గణమో అయి ఉండవలయును. రెండు గణములకు పదవిచ్ఛేద యతి కూడ ఉండవలయును. కాకళికి ఉదాహరణము –

రత – రత / రత – రత, యతి (1.1, 3.1), పాదము మధ్యగా విఱుగవలెను

గానమ్ముఁ బాడనా – గర్ణమ్ము లింపొంద
నానందసీమలో – నానందభైరవిన్
వేణుగానమ్ము లా – ప్రేమగీతమ్ములే
వీనులందెప్పుడున్ – పీయూషధారలే

స్రగ్విణీ – ర/ర/ర/ర, యతి (1, 7) UIU UIU – UIU UIU 12 జగతి 1171

రాగదీపాలతో – రమ్ము తూఁగించగా
సాఁగు నాతో కృపా-సార వేసారకన్
తూఁగు రాగాలతో – తూర్య రావాలతో
వేగ రా తోడుగా – వింత సారంగమై

కామావతార / సారంగరూపక – త/త/త/త, యతి (1, 7) UUI UUI – UUI UUI 12 జగతి 2341

కామావతారమ్ము – కల్యాణ ధామమ్ము
ప్రేమావతారమ్ము – ప్రీతించు రూపమ్ము
శ్యామావతారమ్ము – సద్రత్న దీపమ్ము
స్వామీ సదా నీవె – భావార్థ బంధమ్ము

మలయాళ కవులకు, గాయకులకు ఖండగతి అంటే చాల ఇష్టమనుకొంటాను. అందువలన నేమో ఈ కాకళికి ఎన్నో మార్పులు, కూర్పులు చేసినారు.


2.02 మంజరి – కాకళి పాదములలో ఒక వ్యత్యాసమును కల్పించుట కోసము రెండవ పాదములోని నాలుగవ గణములో ఒక అక్షరమును మాత్రమే వాడినప్పుడు అది మంజరి అవుతుంది. ఇది కూడ ద్విపదయే. అప్పుడు ఈ రెండు పాదములు పంచమాత్రగతితోడి తెలుగు సీస పాదములవలె కొన్ని సమయములలో ఉంటుంది. మంజరికి ఉదాహరణములు –

పాదము 1 – రత – రత / రత – రత, యతి (1, 7) , పాదము 2 – రత – రత / రత – గ, యతి (1, 7)

పక్కింటి యమ్మాయి – పాట నే నాలించఁ
జక్కంగ రాగమ్ము – జన్మించెనే
చెక్కిళ్ళ కెంపులా – శ్రీదేవి వంపులా
చుక్కలా శోభించి – సొక్కించెనే

జీవరాజీవంపు – చెల్వమ్ముఁ జూడఁగా
దేవ రావేలరా – దీప్తి నిండన్

(ఇందులో చివరి అక్షరములోని ద్రుతమును తొలగించినప్పుడు ఇదిసీస పాదమవుతుంది)

2.03 కల్యాణి – కల్యాణిని రెండు విధములుగా మనము కల్పించవచ్చును. వనమయూరము లేక ఇందువదనకు గణములు – UIII UIII – UIII UU. ఇందులో పక్కపక్కన ఉండే ఏ రెండు లఘువులనైనా ఒక గురువుగా చేసినప్పుడు, మనకు కల్యాణి పాదము లభిస్తుంది. మఱొక విధముగా గమనించినప్పుడు, కాకళిలోని చివరి గణములోని ఒక లఘువును తొలగిస్తే అది కల్యాణి అవుతుంది. క్రింద ఉదాహరణములు –

రత-రత / రత-గగ

కల్యాణవేళలోఁ – గన్నీళ్ళు, సీతా
కల్యాణవేళలోఁ – గన్నీళ్ళు, రామా
కల్యాణవేళలోఁ – గన్నీళ్ళు, ఆహా
మూల్యమ్ము కన్నీళ్ళె – మోదంపు వేళన్

వనమయూరము / ఇందువదన – భ/జ/స/న/గగ, యతి (1, 9) UIII UIII – UIII UU 14 శక్వరి 3823

శ్రావణములో భువియు – శ్యామలము జూడన్
జీవమయమాయె వని – చెల్వములతోడన్
ఈ వనమయూరములు – హృద్యముగ నాడెన్
గ్రీవములు రమ్యముగ – గీతికలఁ బాడెన్

2.04 ద్రుతకాకళి – ద్రుతకాకళికి, కాకళికి నడుమ ఒక చిన్న భేదము మాత్రమే. ద్రుతకాకళిలో మొదటి గణము గలముగా (UI) (అరుదుగా న-గణముగా – III) నుంటుంది. కాని ఈ చిన్న మార్పు కాకళికి ఒక క్రొత్త వైవిధ్యాన్ని కలిగిస్తుంది. మొదటి గణము తఱువాత ఒక చిన్న విరామము ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది పాడుటకు చాల చక్కగా నుండును. క్రింద ఉదాహరణము –

గల-రత / రత-రత

నీవు రాకున్న – నిప్పులే పూలురా
నీవు లేకున్న – నిద్ర రాలేదురా
నీవు పాడంగ – నిత్యకల్యాణియే
నీవు నవ్వంగ – నిత్యమ్ము వెన్నెలే

ద్రుతకాకళియందలి ప్రత్యేకతలైన గహ్వరము (ర/ర/ర/లగ), గంభారి (ర/ర/ర/గల), మేఘావళి లేక వసంత (న/ర/ర/ర) వృత్తములకు ఉదాహరణములు:

గహ్వరం – ర/ర/ర/లగ, యతి (1, 6) UI UUI – UUI UIU 11 త్రిష్టుభ్ 659

అంద మా దేవు – నానంద రూపమా
అంద మా దేవి – కానంద తానమా
అంద మీ విశ్వ – మందున్న సృష్టియా
అంద మాకాశ – మందున్న పుష్పమా

గంభారి – ర/ర/ర/గల, యతి (1, 6) UI UUI – UUI UUI 11 త్రిష్టుభ్ 1171

చాలు చాలించు – చల్లంగ నిద్రించ
వేళ వచ్చేను – వ్రేపల్లె నిద్రించె
వేల స్వప్నాల – వీక్షించ నీ కంట
లాలి రంగయ్య – రత్నాల నా పంట

మేఘావళి / వసంత – న/ర/ర/ర, యతి (1, 7) III UIU – UIU UIU 12 జగతి 1176

కదలె నింగి మే-ఘావళుల్ గుంపుగా
మదపు టేన్గులై – మంద మందమ్ముగా
మొదలు నేఁడెగా – మ్రోఁడు పుష్పించగా
నిదియె శ్రావణ – మ్మిప్పు డేతెంచెఁగా

2.05 శ్లథకాకళి – కాకళిలోని ఒక ప్రత్యేకత శ్లథకాకళి. శ్లథ అనగా సడలిన అని అర్థము. అంటే ఈ శ్లథకాకళిలో కాకళి నియమములు సడలించబడినవి అని అర్థము. ఇందులో కాకళిలోవలె పూర్తిగా పంచ మాత్రలే కాక ఒకటో రెండో ఆఱు మాత్రలు కూడ ఉంటాయి.

నాలుగు గణములు – పంచమాత్రలు, షణ్మాత్రలు

మాయింటి యందమై – మందార మరందమై
రేయిలో దీపమై – లీలామయ రూపమై
మ్రోయు సద్వీణవై – పుష్పమ్ముల వానవై
హాయిగాఁ జేర రా – హ్లాదమ్ముల ధార రా

శ్లథకాకళి లక్షణములతో పాదమునకు 13 అక్షరములు, 21 మాత్రలతో మూడు వృత్తములు నాకు పుస్తకములలో కనబడినవి. అవి – స్విన్నశరీరం, వృద్ధవామా, పృషద్వతీ.

స్విన్నశరీరం – భ/త/త/త/గ, యతి (1, 8) UIIU UIU – UIU UIU 13 అతిజగతి 2343

పూవులతో వత్తువా – మోదమున్ దెత్తువా
తావులతో వత్తువా – తార లందిత్తువా
భావములో వత్తువా – పద్యమం దుందువా
రావములో వత్తువా – రమ్య రాకేందువా

వృద్ధవామా – త/త/జ/త/గ, యతి (1, 8) UUI UUII – UIU UIU 13 అతిజగతి 2405

అందమ్ము వర్షమ్మవ – హర్షమే వర్షమౌ
ఛందమ్ము గానమ్మవ – సామమే జ్ఞానమౌ
బంధమ్ము డెందమ్ములఁ – బట్టఁగా స్నేహమౌ
నందమ్ము నర్తించఁగ – నవ్వులే పువ్వులౌ

పృషద్వతీ – త/ర/ర/జ/గ, యతి (1, 7) UUI UIU – UIUI UIU 13 అతిజగతి 2709

ఈ రాత్రి యాత్రికా – యేమి చేయుచుంటివో
కోరేను నిన్ను నా – గోర్కె లన్ని దీర్చవో
చేరంగ వేళరా – చెంత రమ్ము ప్రేమతో
హారమ్ము వేతురా – హార్దికమ్ము నిండఁగా


2.06 మావేళి – మంజరిలోని (2.02) రెండవ పాదపు లక్షణములు అన్ని పాదములకు ఉన్నప్పుడు అది మావేళి అవుతుంది. ఒక ఉదాహరణము –

మూడు ర-త గణములు, ఒక గురువు

చిత్తమ్ములో నీవు – శ్రీరూపమై
చిత్తమ్ములో నీవు – శృంగారమై
చిత్తమ్ములో నీవు – జీవాంశమై
మొత్తమ్ముగా నన్ను – ముంచేవుగా

ఎదురు నడక లేని మూడక్షరముల పంచమాత్రలు రెండు, అవి – ర-గణము, త-గణము. ఇట్టి పంచమాత్రలు మూడింటితో, చివర ఒక గురువుతో మావేళి లక్షణములతో ఒక పాదమును ఎనిమిది విధములుగా అమర్చవచ్చును. ఇవి అన్నియు పాదమునకు పది అక్షరములు గల పంక్తి ఛందమునకు చెందినవి. అవి –

  1. ర/ర/ర/గ – 145 – హేమహాస
  2. త/ర/ర/గ – 149 – రాగబిందు
  3. ర/త/ర/గ – 163 – సోమబింబ
  4. త/త/ర/గ – 165 – ఆందోళికా
  5. ర/ర/త/గ – 275 – ఆయుష్మతీ
  6. త/ర/త/గ – 277 – తోయం
  7. ర/త/త/గ – 291 – క్రొమ్మించు
  8. త/త/త/గ – 293 – విశాలాంతికం

హేమహాస – ర/ర/ర/గ, యతి (1, 6) UIU UIU – UI UU 10 పంక్తి 147

ప్రేమతోఁ బల్కు – వేదమ్ము నీవే
ప్రేమతోఁ బాడు – వేగమ్ము నీవే
ప్రేమ లందించు – పీయూష మీవే
ప్రేమతో రమ్ము – ప్రీతిన్ వరించన్

రాగబిందు – త/ర/ర/గ, యతి (1, 7) UUI UIU – UI UU 10 పంక్తి 149

రావేల రాత్రిలో – రమ్య వేళన్
భావమ్ము లెన్నియో – పాట లాయెన్
జీవింతు మింకపై – స్వేచ్ఛతోడన్
రావేల ప్రేయసీ – రాగబిందూ

సోమబింబ – ర/త/ర/గ, యతి (1, 7) UIU UUI – UI UU 10 పంక్తి 163

వ్రాయఁగా వాంఛింతుఁ – బద్యమొండున్
తీయఁగాఁ గ్రొంగ్రొత్త – తేనెలూరన్
రేయిలో నానంద – నృత్య మాడన్
వేయి తారల్ నవ్వ – వేడ్కతోడన్

అందోళికా – త/త/ర/గ, యతి (1, 7) UUI UUI – UI UU 10 పంక్తి 165

చూడంగ నత్యంత – సుందరమ్మై
యాడెన్గ నాందోళ – మంబుదమ్మై
నేడేగదా పెళ్ళి – నీకు తల్లీ
వీడేవు మమ్మిందు – వేదనాబ్ధిన్

ఆయుష్మతీ – ర/ర/త/గ, యతి (1, 7) UIU UIU – UU IU 10 పంక్తి 275

అంగముల్ పొంగఁగా – నాయుష్మతీ
రంగులన్ జిమ్మ రా – రాగాంబరీ
శృంగమున్ జేర రా – శ్రీరాగిణీ
ఉంగర మ్మందుకో – యుత్సాహిగా

తోయం – త/ర/త/గ, (1, 7) UUI UIU – UU IU 10 పంక్తి 277

సొంపైన పాటగా – స్రోతస్సుగా
నింపైన పువ్వుగా – హృద్యమ్ముగా
తెంపిచ్చు తోయమై – తీదీపిగా
కెంపైన మోవితోఁ – గ్రీడించ రా

క్రొమ్మించు – ర/త/త/గ, యతి (1, 7) UIU UUI – UU IU 10 పంక్తి 291

భామినీ నిన్ జూడ – భావమ్ములే
కామినీ నిన్ జూడఁ – గైతమ్ములే
కోమలీ నిన్ జూడఁ – గ్రొమ్మించులే
శ్యామలీ నిన్ జూడ – సౌహర్దమే

విశాలాంతికం – త/త/త/గ, యతి (1, 7) UUI UUI – UU IU 10 పంక్తి 293

ఆనంద సంద్రమ్ము-నం దీదనా
గానాబ్ధిలో గంగ-గాఁ జేరనా
మౌనమ్ములో నేను – మాటాడనా
ప్రాణామృతమ్మీయఁ – బ్రార్థించనా

2.07 మణికాంచి – మలయాళ ఛందస్సులోని కాకళిలో మొదటి పంచమాత్రాగణము సర్వలఘు గణము, మిగిలినవి ర/త గణములైనప్పుడు అది మణికాంచి యగును.

నలల-రత / రత-రత

కనకమణికాంచితోఁ – గన్పించె దేవియున్
అనఘగను జేసి న – న్నామె దీవించుఁగా
కనకమణికాంచిగాఁ – గన్పడెన్ దారకల్
కనగ నవి మాల లే – కంఠమం దుండెనో

2.08 కళకాంచి – కళకాంచిఅనునది కాకళిలోని ఒక మార్పు. మణికాంచిలో మొదటి పంచమాత్ర ఐదు లఘువులయితే కళకాంచిలో మొదటి పాదములో రెండు లేక మూడు పంచమాత్రలు లఘుయుక్తముగా ఉండును. కాని రెండవ పాదము మాత్రము మూడక్షరముల పంచమాత్రలతోనే ఉంటుంది. పాదమధ్యములో విఱుపు, అక్షరసామ్యయతి ఉండాలి దీనికి.

పాదము 1 – రెండు లేక మూడు సర్వలఘు పంచమాత్రలు, చివర మూడక్షరముల పంచమాత్ర (16 లేక 18 అక్షరములు)
పాదము 2 – నాలుగు మూడక్షరముల పంచమాత్రలు (12 అక్షరములు)

కళలు బలు జెలఁగు నొక – కాంచితోఁ గాంచిలో
నాలోకనీయమ్మె – యా దేవి కామాక్షి

సుమలతల విరిసిరులు – సుప్రభాతమ్ములో
స్వామికై నూఁగెఁగా – బంగారు వెల్గులో

కాకళి, అందులోని మార్పులే కాక పంచమాత్రలతో మఱి కొన్ని ఛందస్సులు కూడ ఉన్నవి. అందులో కొన్నిటిని క్రింద తెలియజేయుచున్నాను –

3.01 స్తిమిత – స్తిమిత అనే వృత్తము లఘ్వంతము. ఇవి UUI, UIII పంచమాత్రలతో నిర్మితము.

త, భ, య, జ, లల, యతి (1, 8) UUI UIII – UUI UIII, 14 శక్వరి 14965

నీలమ్ము నీ కురులు – నీలమ్ము నీ పురులు
నీలమ్ము నీ కనులు – నీలమ్ము నీ తనువు
నీలమ్ము ధాత్రి యది – నీలమ్ము రాత్రి యది
నీలమ్ముగా యమున – నీలమ్ము నాదు మది

3.02 అతిస్తిమిత – స్తిమితలోని త-గణములకు బదులు IIUIను ఉపయోగిస్తే లఘ్వంతమైన అతిస్తిమిత లభిస్తుంది.

స/జ/న/జ/భ/ల, యతి (1, 9) IIUI UIII – IIUI UIII, 16 అష్టి 60396

నిదురించె నా శిశువు – నెలవంక నవ్వినది
నిదురించె నా చిఱుత – నిశితార పాడినది
కదిలేను నా నిసుఁగు – కలహంస త్రుళ్ళినది
మది పొంగె నీ రజని – మణిఘంట మ్రోఁగినది

3.03 కలేందువదన – కలేందువదన అను ఛందస్సు కూడ పంచమాత్రాయుక్తమైనదే. కలేందువదనలో ఉపయోగించబడు పంచమాత్రలు IIIII, UIII. ప్రతి పాదములో ఇట్టివి రెంటిని రెండు మారులు వాడుతారు. వీటిని పక్కపక్కన ఉంచి రెండు విధములుగా అమర్చవచ్చును, ఆ అమరికలు IIIII UIII – IIIII UIII లేక UIII IIIII – UIII IIIII.

కలేందువదన – సన్న – న/స/న/న/స/న IIIII UIII – IIIII UIII, 18 ధృతి 245728

లలితమగు భావములు – లలితమగు రావములు
లలితమగు హాసములు – లలితమగు రాసములు
లలితమగు వృత్తములు – లలితమగు నృత్తములు
లలితమగు బంధనము – లలితునికి వందనము

కలేందువదన – నాభ – భ/న/న/భ/న/న UIII IIIII – UIII – IIIII, 18 ధృతి 261631

వేణు విట హరి యనెను – వెన్నుఁ డట సరి యనెను
ధేను విట హరి యనెను – దేవుఁ డట సరి యనెను
మానసము హరి యనెను – మాధవుఁడు సరి యనెను
ప్రాణ మిట హరి యనెను – పావనుఁడు సరి యనెను

3.04 సంపుటితము – సంపుటితములో ఐదు లఘువుల పంచమాత్ర, పక్కన రెండు గురువులు పదేపదే వస్తాయి. రెండు గురువులు చతుర్మాత్రతో సమానమైనను, పాడునప్పుడు విరామమువలన అవి పంచమాత్రతో సమానమే.

న/స/భ/న/గగ IIIII UU – IIIII UU, 14 శక్వరి 4000

దశరథ కుమారా – దశముఖ విదారా
అసురజన హారీ – అమలమణి ధారీ
అసిత ఘనదేహా – అమరపురి గేహా
మసృణ మృదు గాత్రా – మహిత గుణపాత్రా

4.01 తరంగిణి – మలయాళ దేశి ఛందస్సులో తరంగిణి చాల ప్రసిద్ధమైనది. ఇప్పుడు కూడ కవులు దీని వాడుతారు. తరంగిణి ఒక ద్విపద. తరంగిణి ఒక విధముగా తెలుగులోని మధురగతి రగడను బోలినది. పాదమునకు నాలుగు చతుర్మాత్రలు. పాదము మధ్య విఱుపు ఉండవలయును. మధురగతి రగడలో అంత్యప్రాస నియమము గలదు. కాని తరంగిణిలో అది ఐచ్ఛికము. క్రింద కొన్ని ఉదాహరణములు –

చ-చ / చ-చ, యతి (1.1, 3.1)

చూడు తరంగిణి – సుందర రూపము
పాడుచు నున్నది – వర సంగీతము

నేత్రోత్సవమే – నిర్మల గగనము
చిత్రాపౌర్ణమి – చిందిడెఁ గవనము

4.02 ఊన తరంగిణి – ఈ తరంగిణిలో రెండవ పాదములో చివరి గణము పూర్తిగా లేక రెండు లఘువులు లుప్తమైనచో దానిని ఊన-తరంగిణి అంటారు. ఊనము అనగా లోపము పొందినది, తక్కువైనది అని అర్థము. క్రింద ఊన తరంగిణికి ఉదాహరణములు –

మొదటి పాదము – చ-చ // చ-చ, యతి (1.1, 3.1), రెండవ పాదము – చ-చ // చ, యతి (1.1, 3.1)

అంచలు గగనము – నందునఁ జక్కని
యంచలు నీరము – లందున
కాంచనమయమగు – కాంతుల యందము
కాంచఁగ డెందము – కదలెను

ఊనతరంగిణిని మఱొక విధముగా కూడ ఉదహరిస్తారు. ఇందులో తరంగిణి పాదములలో చివర రెండు మాత్రలను తొలగిస్తారు.

చ-చ // చ-ద్వి, యతి (1.1, 3.1)

రవి యుదయించెను – రమ్యముగా
కవి హృదయమ్మునఁ – గవితలెగా
అంబర మయ్యెనె – యరుణముగా
సంబర మయ్యె ద్వి-జమ్ములకున్

4.03 శితాగ్ర – శితాగ్ర అను ఛందస్సు ఒక ద్విపద, పాదమునకు నాలుగు చతుర్మాత్రలు. మొదటి చతుర్మాత్ర తప్పక జ-గణముగా నుండవలయును. పాదము మధ్య విఱుగవలయును. దీనిని తరంగిణి యొక్క మార్పు అని కూడ భావించ వీలగును.

జ-చ / చ-చ
శితాగ్ర మయెఁగా – చెలువపు పువులిట
నితాంత మగు వెత – నిరంతరమ్మా
ప్రతిక్షణమ్మును – బ్రభాత కాంతికిఁ
బ్రతీక్ష నుంటిని – బ్రదుకు వెలుంగఁగ

4.04 అజగరగమనము – ఇది ఒక చతుర్మాత్రాయుక్త ద్విపద. ఇందులో పాదమునకు ఆఱు గణములు ఉంటాయి, మొదటి దానికి ఆఱు మాత్రలు, మిగిలిన వాటికి నాలుగు మాత్రలు. ఎక్కువగా లఘువులతో ఉంటే ఇది సుందరముగా నుంటుంది. ఐదు, నాలుగు గణములతో కూడ దీని వ్రాస్తారు.

6-4-4 / 4-4-4, యతి (1.1, 4.1)

చూడు మచట నజగర మొకటియు – చొక్కిలి మెలమెలఁ జనెఁగా
చూడఁగ నా గమనము హృదయము – సొమ్మసిలెను భయమయమై

పాదమునకు ఐదు గణములతో నొక ఉదాహరణము –

మందముగాఁ జల్లఁగ వీఁచెను – మారుత మిక్కడ
బృందముగా భ్రమరము లాడెను – విరులం దక్కడ

పాదమునకు నాలుగు గణములతో నొక ఉదాహరణము –

కిలకిల మన్నవి కో-కిల లీ వనిలో
కలకల మన్నవి చి-ల్కలు శాఖలలో

5.01 అన్ననడ – మలయాళ ఛందస్సులో ఎదురు నడకతో త్ర్యస్రగతిలో పంచచామరమువలె సాగే ఛందస్సును అన్ననడ అంటారు. అన్నము అనగా హంస, నడ అంటే నడక. ఈ ఛందస్సు నడక హంసగమనమువలె నుంటుందని అభిప్రాయము. ఇది ద్విపద, ప్రతి పాదములో ఆఱు లగములు, మూడు మూడు గణములుగా విఱుగును.

లగ-లగ-లగ / లగ-లగ-లగ, యతి (1.1, 4.1) IUIUIU – IUIUIU

మరాళగామినీ – మదప్రహారిణీ
సురాసురేశ్వరీ – సుశబ్దశోభినీ
విరించి హృన్మణీ – వినోదవల్లరీ
పరాకుఁ జూపకన్ – వరమ్ము లీయుమా

5.02 నతోన్నత – నతోన్నత ఒక ద్విపద, దీనికి మొదటి పాదములో 8 రెండక్షరముల గణములు, సామాన్యముగా ఇవి త్రిమాత్రలు. రెండు లఘువులు, రెండు గురువులతో ఉండే గణములకు కూడ ఉదాహరణములు గలవు. రెండవ పాదములో ఆఱు ద్వ్యక్షరముల గణములు, చివర ఒక అక్షరము. దీనినే వాంజిప్పాట్టు అని కూడ అంటారు. గలముతో ప్రారంభమైన తీరులో ఒక వాంజిప్పాట్టును యూట్యూబులో వినవచ్చును.

పాదము 1 – త్రి-త్రి-త్రి-త్రి // త్రి-త్రి-త్రి-త్రి, పాదము 2 – త్రి-త్రి-త్రి-త్రి // త్రి-త్రి-గ

నతోన్నతమ్ము ధాత్రిపై – నరుండు సల్పు మన్కియున్
మతిన్ దలంతు నెప్పుడున్ – మహేశ్వరున్ నేన్

అందమైన చందమామ – యాకసాన తొంగిచూచె
నందమైన చందమామ – నాకు నీవెగా

యతికి బదులు ప్రాసయతిని ఉంచి వ్రాసినప్పుడు ఇది ఒక షట్పద అవుతుంది. ఈ విషయము మలయాళములో చెప్పబడలేదు.

అనంతమైన భూమిలో
ననంతమైన సృష్టిలో
ననంతమైన యాత్రలో – ననంతుఁడేగా
మనోజవమ్ముతోఁ గనున్
వినోదచిత్తగా వినున్
వినూత్న మార్గదర్శి యా – విభుండె గాదా

నీవు లేక నేను లేను
నీవు రాక నేను పోను
నీవె నాకు సర్వమౌను – నిత్య మీ భువిన్
పూవు లేక తావి లేదు
తావి లేని పూవు లేల
పూవు తావి చేరినట్లు – భూమి నుందమా
(ఇది ఒక భోగషట్పది)

5.03 ఉన్నత – ఉన్నతలో రెండు పాదములు నతోన్నతలోని మొదటి పాదమువలె 16 అక్షరములతో నుండును. త్రిమాత్ర ల-గము అయినప్పుడు ఇది పంచచామరము అవుతుంది.

త్రి-త్రి-త్రి-త్రి / త్రి-త్రి-త్రి-త్రి

మనోజవమ్ముతోడ నన్ – మదలసా కనంగ రా
మనోభవుండు నిన్ను నన్ – మహీతలమ్ముఁ జేర్చుఁగా
అనూహ్యమైన యందమం – దనంతమైన బంధముల్
సునందినీ సుఖమ్ములే – సునాదినీ శుభమ్ములే

చంద్రబింబమందుఁ జూడు – చక్కనౌ శశమ్ము నొండు
ఇంద్రచాపమందుఁ జూడు – యింపుగా సువర్ణమాల
మంద్రగానమందు నిండు – మాధురుల్ వినంగ రమ్ము
సంద్రమౌను మానసమ్ము – సాఁగు ప్రేమ నౌక నమ్ము

6.01 మాత్రాస్వాగతము – స్వాగతము అతి ప్రాచీనమైన ఒక చక్కని సంస్కృత వృత్తము. ప్రతి పాదమునకు 16 మాత్రలు, కాని అవన్నీ చతుర్మాత్రలు కావు. అవి 5,3,4,4 లేక 3,5,4,4 మాత్రలు. స్వాగత వృత్తమును అదే స్వరూపములో మాత్రమేకాక అదే లయతో గణస్వరూపమును కొద్దిగా మార్చి మలయాళ ఛందస్సులో ఉపయోగించినారు. స్వాగతవృత్తపు ఐదు విధములలో మొదటిది స్వాగతము, నాలుగవది చంద్రవర్త్మ, అయిదవది ద్రుతపదము. రెండవ, మూడవ వృత్తములకు లక్షణములు చూపబడలేదు.

UIU III – UII UU స్వాగతము
UIU IU – UII UU మాధురి
UIU III – UU UU శ్రేయ
UIU III – UII IIU చంద్రవర్త్మ
IIIU III – UII UU ద్రుతపదము

స్వాగతము – ర/న/భ/గగ, యతి (1, 7), 11 త్రిష్టుభ్ 443

నా గళమ్మునకు – నాలుక నీవా
రాగరాగిణుల – రమ్యత నీవా
వేగవంతమగు – ప్రేమకు నావా
స్వాగతమ్మిదియె – చక్కఁగ రావా

మాధురి – ర/య/స/గ, యతి (1, 6), 10 పంక్తి 203

మానసమ్ములో – మాధురి నిండెన్
గానవార్ధిలో – గంగయుఁ జేరెన్
తేనెలూరు యీ – తెల్గు పదమ్మున్
నేను వింటిగా – నేఁడు ప్రియమ్మై

శ్రేయ – ర/న/మ/గ, యతి (1, 7), 10 పంక్తి 59

శ్రేయమీయగను – జీవమ్మై రా
వ్రాయు గీతమున – రావమ్మై రా
ప్రాయమం దొలుకు – భావమ్మై రా
తీయఁగా మదికిఁ – దేవమ్మై రా
(తేవము = ఆర్ద్రత)

చంద్రవర్త్మ – ర/న/భ/స, యతి (1, 7), 12 జగతి 1979

ఇంద్రనీలమణు – లెల్లెడఁ గనఁగా
మంద్రమైన స్వర – మాధురి వినఁగా
సాంద్ర మయ్యె మదిఁ – జక్కని ముదముల్
చంద్రవర్త్మవలె – సాఁగెను పథముల్
(చంద్రవర్త్మ = చంద్రుని మార్గము)

ద్రుతపదము – న/భ/జ/య, యతి (1, 8), 12 జగతి 888

అదరిపోకు కల – లందున నీవున్
ముదము నిండఁగను – ముద్దుల కన్నా
నిదురపో త్వరగ – నీరజనేత్రా
మృదువుగా జగతి – మీలితమయ్యెన్

6.02 మదనార్త – కలహంసీ అనునది ఒక అందమైన తాళవృత్తము. దీనిని శారదచంద్ర అని కూడ అంటారు. మలయాళములో దీనికి మదనార్త అని పేరు. పాదమునకు నాలుగు మాత్రాగణములు, మొదటి మూడు ఆఱు మాత్రల గణమైన UUII. చివరి గణము రెండు గురువులు.

త/య/స/భ/గగ, యతి (1, 9) UUII UUII – UUII UU, 14 శక్వరి 3277

నీవేగద నా భాగ్యము – నీవే హృదయేశా
నీవేగద నా భావము – నీవే ప్రణయాశా
నీవేగద నా జీవము – నీవే మృదుభాషా
నీవేగద నా కెల్లయు – నీవే రసపోషా

6.03 త్రిభంగ – మలయాళములో త్రిభంగ అని ఒక ఛందోబంధమున్నది. భంగము అంటే ఒక అల, లేక ఖండము అని చెప్పవచ్చును. తెలుగు, హిందీ భాషలలో వీటిని త్రిభంగి అంటారు. భంగి అంటె విధము అని అర్థము. త్రిభంగ లేక త్రిభంగికి మూడు విధమైన నడకలు ఉంటాయి. అందుకే ఈ పేరు. ఈ త్రిభంగికి కూడ ఎన్నో లక్షణాలు ఉన్నాయి. తెలుగులో రెండు విధములయిన త్రిభంగి, హిందిలో మఱి రెండు ఉన్నాయి. మలయాళ త్రిభంగికి పాదమునకు 32 మాత్రలు. సామాన్యముగా మలయాళములో ద్విపద ఛందస్సులు ఎక్కువ, దానికి విరుద్ధముగా త్రిభంగ ఒక చతుష్పద. దీని లక్షణములు – రెండు చతుర్మాత్రలు, ఒక పంచ మాత్ర, ఒక ద్విమాత్ర, ఒక పంచమాత్ర, తఱువాత మూడు చతుర్మాత్రలు. పంచమాత్రలకు అంత్యప్రాస గలదు. నేను అక్షరయతిని కూడ ఉంచి ఉదాహరణమును క్రింద వ్రాసినాను.

చ-చ / పం / ద్వి-పం / చ-చ-చ, మొదటి నాలుగు భాగములకు అక్షరసామ్య యతి, పంచమాత్రలకు ప్రాసయతి

వలపులఁ జిలికెడు – వదనమా – వర సదనమా – వాంఛలఁ దీర్చెడు సెలయా
చెలువము లొలికెడు – సిగరమా – సిరి నగరమా – చిఱుచిఱు నగవుల నెలవా
సులలిత దృక్కులు – సొమ్ములా – సుధ కిమ్ములా – సుందర సుమముల తరువా
తెలితెలి వెన్నెల – దీపమా – దృక్చాపమా – తీయని పదముల చెరువా

పై ఉదాహరణములోని కొన్ని పదములతో తెలుగులోని ఒక విధమైన త్రిభంగికి ఉదాహరణమును క్రింద ఇస్తున్నాను. మలయాళ తెలుగు త్రిభంగి రూపముల మధ్య ఉండే తేడాను గమనించగలరు.

నల-నల / నల-నల / నల-భ-గగ / లల-గగ / భ-గగ,
మొదటి మూడు భాగములకు ప్రాసయతి, మూడు గగములకు అంత్యప్రాస

వలపులఁ జిలుకుచు – మెలమెలఁ గులుకుచు – కిలకిల నవ్వుచు రావా – సిరి తేవా – ముద్దుల నీవా
చెలువము లొలుకుచు – తళతళ మెఱయుచు – చిలిపిగ నాడుచు రమ్మా – ముద మిమ్మా – బంగరు కొమ్మా
చెలిమికి వరముగ – నెలవునఁ గను నను – తెలితెలి వెన్నెల బాటై – విరి తోటై – తేనెల యూటై
సులలిత నయనము – లలలుగఁ దిరుగఁగ – వెలుగుల చూపుల నీవా – దరి రావా – సుందర భావా

6.04 దండిక – సంస్కృతము, తెలుగు, కన్నడములవలె మలయాళములో కూడ ర-గణ, త-గణములతో దండకములు ఉన్నాయి. కృష్ణ వారియర్ దండిక అను ఛందస్సును కూడ వివరించి యున్నారు. వీటిని ఎన్నో విధములుగా వ్రాస్తారు. అందులో ఒక దానికి ప్రతి పాదములో 69 అక్షరములు. నాకు తెలిసినంతవఱకు ఇది సుదీర్ఘమైన పాదములు గలిగిన ఛందోబంధము. ఈ దండిక ఒక ద్విపద. ప్రతి పాదములో మూడు భాగములు క్రింది విధముగా నుండును. ఇందులో ర-గణ, త-గణములు లేకున్నా, ఇవి కూడ పంచమాత్రాబద్ధమైనవే.

దండిక – ద్విపద, పాదపు
భాగము 1 – UUI UIII – UUI UIII – UUI UIII UU
భాగము 2 – IIIII UU – IIIII UU
భాగము 3 – IIIII IIIII – IIIII IIIII – IIIII IIIII UU

గోపెమ్మ మానసపు – దీపమ్ము నీవెగద – పాపమ్ముఁ బాపు గిరిధారీ
మృదుల సుమహారీ – మధువన విహారీ
వదనమును గనఁ ద్వరగ – హృదయమగుఁ గడలివలె – నుదయమగు నవపదము శౌరీ
రూపమ్ము మార్చెదవు – శాపమ్ముఁ దీర్చెదవు – తాపమ్ము నార్పు ఫణిహారీ
వ్యధల పరిహారీ – వదలను మురారీ
యదుకులపు ముదపు శశి – మదగజపు రిపువు హరి – మది నిలువు మెపుడు దనుజారీ

6.05 పల్లవిని – పల్లవిని అనే ఛందస్సుకు రెండు విధములైన వివరణములు గలవు.

(1) కేకలో సరి పాదములలో చేయబడిన ఒక మార్పు. కేకకు ప్రతి పాదములో 3-2-2 / 3-2-2 అక్షరములు, ప్రతి గణములో కనీసము ఒక గురువైనను ఉండవలయును. సరి పాదములలో మూడక్షరముల నాలుగవ గణమును తొలగించినయెడల మనకు పల్లవిని లభిస్తుంది. క్రింద ఒక ఉదాహరణము –

బేసి పాదములు కేక (3-2-2 / 3-2-2), సరి పాదములు (3-2-2 / 2-2)

పల్లవిఁ బాడు మిప్డు – వల్లకి తంత్రి మీటి
వెల్లువ పారు నింక – వేగముగా
నుల్లము డోలవోలె – నూగును నింగి నంటి
సల్లలితమ్ము గీతి – సాఁగునుగా

(2) కృష్ణ వారియర్, పల్లవినిని క్రింది విధముగా భావించినారు –

బేసి పాదములు – IxU – Ixxx // IxU – Ixxx — సరి పాదములు – IxU – Ixxx // IxU – U

ఇందులో x అనునది గురువైనా (U) కావచ్చు, లఘువైనా (I) కావచ్చు.

సుమమై వికసించు – శుభమున్ వినిపించు
హిమమై నను దాకు – హృదయేశా
భ్రమలన్ దొలగించు – ప్రణతుల్ వెలిగించు
అమలా యగుపించు – మఘనాశా

మలయాళ జానపద ఛందస్సు

సంస్కృత ఛందస్సునుండి గ్రహించిన వృత్తములు, వాటికి చేసిన మార్పులు, అక్షర వృత్తములు, మాత్రాబద్ధ పద్యములు, ఇవి మాత్రమే కాక కేరళదేశములో సామాన్య జనులచే పండుగలలో, పర్వదినములలో పాడుకొనే జానపద గేయముల ద్వారా సృష్టించబడిన ఛందస్సులు కూడ మలయాళములో ఉన్నాయి. అందులో కొన్నింటిని సోదహరణముగా వివరిస్తున్నాను.

7.01 తారాట్టు – తారాట్టు అనే ఒక ఛందస్సు లాలిపాటకు సంబంధిచినది. ఇందులో ప్రతి పాదములో రెండు ర-గణములు, రెండు గురువులు ఉండును. బేసి పాదములలో అదనముగా వంతెనవలె మఱి రెండు గురువులు ఉండును. క్రింద నా ఉదాహరణములు –

కొంటెకోణంగి నీవేగా – నా యీ –
కంటిలో పాప నీవేగా
మింటిలో తార నీవేగా – మా యీ –
యింటిలో రాజు నీవేగా

పువ్వులా పూయవా లాలీ – నాకై –
దివ్వెలా వెల్గవా లాలీ
గువ్వలా పాడవా లాలీ – నీవా
మువ్వలా మ్రోఁగవా లాలీ

నవ్వుతో నాడవా లాలీ – తారా –
చువ్వలా వ్రాలవా లాలీ
రివ్వుమం చూఁగవా లాలీ – కన్నా –
పవ్వళించంగ రా లాలీ

మలయాళములో సుప్రసిద్ధమయిన లాలి పాట ఓమనత్తింగళ్ కిడావో అనే పాట అంటే అది అతిశయోక్తి కాదు. స్వాతి తిరునాళ్ మహారాజు జన్మించినప్పుడు ఇరైయిమ్మన్ తంబి వ్రాసిన జోల పాట ఇది. దీని ఛందస్సు పంచమాత్రలైన ర-గణ, త-గణములతో నిండియున్నవి. జానకి గళములో దీనిని ఇక్కడ వినవచ్చును.

ఓమనత్తింగళ్ కిడావో- నల్ల – కోమళత్తామరప్పూవో
పూవిల్ నిఱంజ మధువో – పరి – పూర్ణేందు తన్ఱె నిలావో

పుత్తన్ పవిళక్కొడియో – చెఱు – తత్తకళ్ కొంజుం మొళియో
చాంజాడియాడుం మయిలో – మృదు – పంజమం పాడుం కుయిలో

తుళ్ళుమిళమాన్ కిడావో – శోభ – కొళ్ళున్నోర్ అన్నక్కొడియో
ఈశ్వరన్ తన్న నిధియో – పర -మేశ్వరియేందుం కిళియో

పారిజాతత్తిన్ తళిరో – ఎన్ఱె – భాగ్యద్రుమత్తిన్ ఫలమో
వాత్సల్యరత్నత్తె వయ్పాన్న్ – మమ – వాయ్చొరు కాంజన చ్చెప్పో

దృష్టిక్కు వచ్చోరమృతో – కూరి – రుట్టత్తు వచ్చ విళక్కో
కీర్తిలతయుళ్ కుళ్ళ విత్తో – ఎన్నుం – కేడు వరాతుళ్ళ ముత్తో

ఆర్తి తిమిరం కళవాన్ – ఉళ్ళ – మార్తాండదేవ ప్రభయో
సుక్తియిల్ కండ పొరుళో – అతి – సూక్ష్మమాం వీణారవమో

వన్బిచ్చ సందోషవల్లి – తన్ఱె – కొంబత్తు పూత్త పూవల్లి
పిచ్చకత్తిన్ మలర్ చెండో – నావి – నిచ్ఛ నల్కున్న కల్కండో

కస్తూరి తన్ఱె మణమో – ఏట్ర – శత్రుక్కళు క్కుళ్ళ గుణమో
పూమణమేఱ్ఱొరు కాట్రో – ఏట్ర – పొన్నిల్ తెళింజుళ్ళ మాట్రో

కాచ్చిక్కుఱుక్కియ పాలో – నల్ల – గంధమెళుం పనినీరో
నన్మ విళయుం నిలమో – బహు – ధర్మంగళ్ వాళుం గృహమో

దాహం కళయుం జలమో – మార్గ – ఖేదం కళయుం తణలో
వాడాత్త మల్లికప్పూవో – ఞానుం – తేడివచ్చుళ్ళ ధనమో

కణ్ణిను నల్ల కణియో – మమ – కైవన్న చింతామణియో
లావణ్యపుణ్యనదియో – ఉణ్ణి – క్కార్వర్ణన్ తన్ఱె కళియో

లక్ష్మీభగవతి తన్ఱె – తిరు- నెట్రియిలిట్ట కుఱియో
ఎన్నుణ్ణి క్కృష్ణన్ జనిచ్చో – పారి – లింజనె వేషం ధరిచ్చో

పద్మనాభన్ తన్ కృపయో – ముట్రుం – భాగ్యం వరున్న వళియో

7.02 కుమ్మి – జానపద నృత్యములలో నొక దానికి కుమ్మి అని పేరు. ఈ కుమ్మి నేడు కూడ తమిళనాడులో ప్రసిద్ధమైనదే. కుమ్మి ఒక చిందు, అనగా నృత్యపు పాట. బహుళ ప్రచారములో నుండే తమిళ కుమ్మిలో నాలుగు అర్ధ పాదములు ఉంటాయి. ప్రతి అర్ధ పాదములో నాలుగు గణములు. బేసి అర్ధ పాదములలోని చివరి గణమును తనిచ్చొల్ అంటారు. అనగా ఇది ఒక ప్రత్యేకమైన పదముగా నుండాలి. రెండు అర్ధ పాదములకు వడియో లేక ప్రాసయతియో ఉండాలి.

మహాకవి సుబ్రహ్మణ్య భారతి వ్రాసిన క్రింది పాట ఒక కుమ్మియే (ఇందులో మొదటి మూడు పాదములలో తనిచ్చొల్ గలదు).

శెందమిళ్ నాడెనుంబోదినిలే – ఇన్బ
త్తేన్ వందు పాయుదు కాదినిలే – ఎంగళ్
తందెయర్ నాడెండ్ర పేచ్చినిలే – ఒరు
శక్తి పిఱక్కుదు మూచ్చినిలే

(తమిళనాడు అన్నపుడు ఆనందమధువు చెవులలో పారుతుంది. మా తండ్రుల దేశము అని చెప్పినప్పుడు శ్వాసలో ఒక నూతన శక్తి పుట్టుతుంది.)

తమిళ కుమ్మిని బోలినదానికి క్రింద ఒక ఉదాహరణము –

ఆనంద మానంద – మాయేను – మన –
జానకియు వధువాయె – చక్కంగా
మానస మ్ముప్పొంగె – మారాజు – లలి –
తాననములో వెల్గు – లలరెన్గా

మలయాళములో కుమ్మి ఈ విధముగా నుంటుంది. నాలుగు (అర్ధ) పాదములు, పాదమునకు నాలుగు గణములు. అన్ని పాదములలో మొదటి మూడు గణములు పంచమాత్రలు. మొదటి, రెండవ, నాలుగవ పాదములలో నాలుగవ గణము ఒక గురువు, మూడవ పాదములో అది కూడ ఒక పంచమాత్ర.

ఆనంద మానంద – మాయేనుగా
జానకియు వధువాయె – చందమ్ముగా
మానస మ్ముప్పొంగె – మారాజు కప్పుడే
ఆననములో వెల్గు – లలరేనుగా

చల్లంగఁ జూడవా – సామి నా యీ
యుల్లమ్ముఁ జూడవా – యోపలేరా
మెల్లంగ రావయ్య – మేటి గోపాలుఁడా
యెల్ల లోకమ్ములకు – నెకిమీఁడ రా

శ్రీరామ భూపాలుఁ – జేరంగ నా
గారాల సీతమ్మ – కలఁగేనుగా
ఆ రాత్రి వెల్గెఁగా – నందాల తారలై
యా రెండు నేత్రద్వ-యమ్ము లింపై

ఒక విధముగా పరిశీలిస్తే కుమ్మి పంచమాత్రల తెలుగు ద్విపద లాటిది. బహుశా తెలుగు దేశములో కూడ ద్విపదలను పాడుకొనుచు నాట్యా లాడేవారేమో? అందుకేనేమో సోమనాథునికి ద్విపదపైన ఎక్కువ మక్కువ?

7.03 కుఱత్తి పాట్టు (కొఱవ పడుచు పాట) – మలయాళ జానపదవాఙ్మయములో కుఱత్తి పాట్టు అని ఒక ఛందస్సు ఉన్నది. కుఱత్తి అంటే కొఱవపడుచు అని అర్థము. దీని ఒక ప్రసిద్ధ రూపము ర-గ/ర-గ / ర-గ/గగ. చివరి గగము తప్ప మిగిలిన గణములకు మత్తకోకిల లయ గలదు. అందులోని గ-ల-భ గణములకు బదులు ఇందులో గ-ల-గగ. క్రింద నా ఉదాహరణములు –

సోదె చెప్తా చిన్న పిల్లా – సోదె చెప్తానమ్మా
ఆదినుండీ రేపుదాకా – అన్ని చెప్తా గుమ్మా
బమ్మ రాసే రాత చెప్తా – భర్త పేరూ చెప్తా
బొమ్మ నీకూ తాళి గట్టే – మూర్త మెప్డో చెప్తా

7.04 చిందు – చిందులన్నవి ఒక విధమైన నృత్యములు. తమిళదేశములో కావడి చిందులు సుప్రసిద్ధమైనవి. ఇందులో భక్తి రసము ప్రధానమైనది. మలయాళములోని చిందులు చతుర్మాత్రాబద్ధమైనవి. మలయాళమునందలి ఉదాహరణముల ద్వారా దీని లక్షణములు క్రింది విధముగా నున్నవి:

పాదము 1, 3 – నాలుగు చతుర్మాత్రలు; పాదము 2 – మూడు చతుర్మాత్రలు; పాదము 4 – రెండు చతుర్మాత్రలు, ఒక గురువు.

చిందుల నెన్నియొ – చేయుదమా మన
మందఱ మిచ్చట – నహహా
బృందావనిలో – విందులుగా నతి
సుందరమై నవమై

చిత్తములో గల – చెలువము నీవే
నృత్తపు పదములు – నీవే
మత్తిలు స్వరముల – మంద్రము నీవే
తత్తర మిట రావే

7.05 వడక్కన్ పాట్టు – వడక్కన్ పాట్టు అంటే ఉత్తరాదివాళ్ళ పాట అని అర్థము. ఇక్కడ కేరళలో ఉత్తరాది అంటే మలబారు ప్రాంతము అని అర్థము. మలబారు ప్రాంతములలో ప్రచారములో ఉండే పాటను వడక్కన్ పాట్టు అంటారు. ఇది తమిళ ఛందస్సు ద్వారా మలయాళములో ప్రవేశించినది. ఇందులో పాదమునకు 10 అక్షరాలు, అవి 3, 3, 4 అక్షరముల గణములు. ఒకప్పుడు ఈ గణములు చతుర్మాత్రలుగా, పంచమాత్రలుగా ఉన్నా ఇప్పుడు ఇవి పంచమాత్రలుగా వాడబడుతున్నాయి. చివరి అక్షరమును గురువుగా ఎన్నుకొంటే ర-గణ, త-గణములతో ఎనిమిది విధములైన అమరికలు మనకు లభించును. మావేళి ఛందస్సును ప్రస్తావించినప్పుడు కూడ పై వృత్తములను తెలిపియున్నాను.

3-3-4 అక్షరముల గణములు

ప్రేయసీ కోపమా – ప్రేమ లేదా
తీయఁగ ముద్దు లం-దీయ రాదా
వ్రాయనా లేఖ నే-త్రాలతో నే
నీయనా కౌగిలిన్ – హేమమాలా

మాయింటి తారకా – మంచి పాపా
రాయంచ రూపమా – రత్నదీపా
కూయంచుఁ బాడకే – కోయిలమ్మా
నీయాట చాలులే – నిద్ర పొమ్మా

7.06 మధురమొళి – వడక్కన్ పాట్టులో మొదటి పంచమాత్రాగణమును ఐదు లఘువులుగా చేసినప్పుడు అది మధురమొళి అవుతుంది.

ఐదు లఘువులు – 3-4 అక్షరములు

హరినిఁ గన నెంతయో – హర్షమయ్యెన్
తరఁగవలె లేచి నా-దమ్ములయ్యెన్
విరులవలెఁ బూచెఁగాఁ – బ్రేమతోడన్
సిరులు వలదింక నా – శ్రీలు వాఁడే

నేను నేర్చుకొన్న పాఠములు

మలయాళ ఛందస్సునుండి నేను నేర్చుకొన్న ఒక రెండు విషయాలను ఇక్కడ నివేదించాలి. వృత్తములు, జాతులు, మాత్రాఛందస్సులు మిగిలిన భాషలలో కూడ ఉన్నాయి. కాని మలయాళ ఛందస్సులో పద్యములను పాడుటకై వ్రాయబడిన వైనములు ఎంతో హర్షనీయము. నన్ను రెండు విశేషములు ఎక్కువగా ఆకర్షించాయి. అవి – మొదటిది లయ చెడకుండా స్వాగతములాటి వృత్తములను మాత్రా ఛందస్సులో వ్రాయుట. ఈ ప్రక్రియను నేను చాలా సంవత్సరాలుగా చేయడానికి ప్రయత్నిస్తున్నాను. వాడుక భాషలో పద్యాలను వ్రాయు విధానమును గూర్చి చర్చించేటప్పుడు కూడ ఈ విషయాన్ని ప్రస్తావన చేసినాను. ఇటీవల శార్దూలవిక్రీడితమును పంచనఖమను రూపములో వ్రాయు పద్ధతిని కూడ ప్రవేశ పెట్టినాను. రెండవది కేకలాటి అక్షరసంఖ్యపైన ఆధారపడిన ఛందస్సులు. మరాఠీలో ఓవిలాటి ఛందస్సులు ఇట్టివే. అక్షరసంఖ్యపైన ఆధారపడిన రెండు తెలుగు ఛందస్సులను మీముందు ఉంచుతున్నాను. అవి (1) చిత్రగీతి, (2) స్వేచ్ఛాగీతి.

(1) చిత్రగీతి – పాదమునకు పది అక్షరములు. అవి 2-3 // 3-2 అక్షరముల గణములు. ప్రతి “గణములో” ఒక గురువైనను ఉండవలయును. మూడవ గణముపైన యతి. ప్రాస గలదు. ఒక పాదమును 3.7.7.3 = 441 విధములుగా వ్రాయ వీలగును. ఇట్టి పద్యములు గానయోగ్యములని నా భావన. క్రింద కొన్ని ఉదాహరణములు –

చిత్రగీతి – 2-3 / 3-2, ఒక్కొక్క గణములో ఒక గురువైనను ఉండవలయును. యతి (1.1, 3.1) పాదము మధ్య విఱుపు (విశ్రామ యతి)

చైత్ర రాత్రిలో – సంతస మందన్
చిత్రగీతులన్ – జిత్రమై పాడన్
గాత్ర మయ్యెనే – గంగగ రావా
చిత్రాకారుఁడా – చెల్వపు ఱేఁడా

ఎన్ని రోజులో – యీ విధమ్ముగా
నిన్ను జూడకన్ – నిద్ర లేదురా
నీవు లేనిచో – నిండు శూన్యమే
నీవిటుండఁగా – నిద్ర రాదురా

ఆకాశమ్ములో – నందమౌ తారా
నాకుఁ జెప్పవే – నా రాజెక్కడే
రాక నుండె నీ – రాత్రివేళలో
నే కారణమో – యేమో తెలుసా

(2) స్వేచ్ఛాగీతి – పాదమునకు 14 అక్షరములు. అవి 3-4 // 3-4 అక్షరముల గణములు. ప్రతి “గణములో” అన్ని అక్షరములు గురువుగానో, లఘువుగానో ఉండరాదు. ఒక పాదమును 6.14.6.14 = 7056 విధములుగా వ్రాయ వీలగును. మూడవ గణముపైన యతి. ప్రాస గలదు. ఇట్టి పద్యములు గానయోగ్యములని నా భావన. క్రింద రెండు ఉదాహరణములు –

స్వేచ్ఛాగీతి – 3-4 / 3-4, ఒక్కొక్క “గణములో” అన్ని అక్షరములు గురువుగానో, లఘువుగానో ఉండరాదు. యతి (1.1, 3.1) పాదము మధ్య విఱుపు (విశ్రామ యతి)

చిత్తమా తెలుపవే – చింతలు నీకెందుకే
మత్తుతో నటనమా – మాయలు చాలించవే
నిత్తె మీ విధముగా – నృత్యము నీకెందుకే
వత్తిగా నయితినే – వాఁడిట రాఁడెందుకే

దేవునిఁ జూచుటకై – తిరిగా నెల్లెడ నే
దేవుఁడు కనరాఁడే – దిక్కులు వెదికానే
జీవిత యామినిలోఁ – జీకటి తొలఁగేనా
యీ వసుధాతలిపై – నినుండు వెలిఁగేనా

ముగింపు

అలపై వెలుఁగులా – నందము జిందిడఁగా
మలపై వీచుచున్న – మలయానిలములా
చెలి రా యిర్వుర మా – చెల్వపు టోడలలో
నల నా కైరళిలో – నాడుచు పాడుదమా


గ్రంథసూచి

  1. హరి దామోదర్ వేళంకర్ (సం.) – జయదామన్ – హరితోష సమితి, బాంబే, 1949.
  2. పి. సుబ్రాయ భట్, బి. కె. తిమ్మప్ప (అనువాదకులు) – లీలాతిలకం – మైసూరు విశ్వవిద్యాలయము, మైసూరు, 1974.
  3. కె. సర్వోత్తమరావు – దాక్షిణాత్య దేశిచ్ఛందోరీతులు – తులనాత్మక పరిశీలన – శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి, 1986.
  4. N.V. Krishna Warrior – A History of Malayalam Metre – Dravidian Linguistics Association, Trivandrum, 1977.
  5. S. Subrahmanyan – The Commonness in the Metre of Dravidian Languages – Dravidian Linguistics Association, Trivandrum, 1977.
  6. K.M. Prabhakara Variar (Ed.) – History of Malayalam Language, University of Madras, Madras, 1985.
  7. K. Ayyappa Paniker – A Short History of Malayalam Literature – Kerala State Information and Publicity Department, Thiruvananthapuram, 2006.

జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి:

జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు.

 ...