మలయాళ ఛందస్సు – ఒక విహంగ వీక్షణము

5.02 నతోన్నత – నతోన్నత ఒక ద్విపద, దీనికి మొదటి పాదములో 8 రెండక్షరముల గణములు, సామాన్యముగా ఇవి త్రిమాత్రలు. రెండు లఘువులు, రెండు గురువులతో ఉండే గణములకు కూడ ఉదాహరణములు గలవు. రెండవ పాదములో ఆఱు ద్వ్యక్షరముల గణములు, చివర ఒక అక్షరము. దీనినే వాంజిప్పాట్టు అని కూడ అంటారు. గలముతో ప్రారంభమైన తీరులో ఒక వాంజిప్పాట్టును యూట్యూబులో వినవచ్చును.

పాదము 1 – త్రి-త్రి-త్రి-త్రి // త్రి-త్రి-త్రి-త్రి, పాదము 2 – త్రి-త్రి-త్రి-త్రి // త్రి-త్రి-గ

నతోన్నతమ్ము ధాత్రిపై – నరుండు సల్పు మన్కియున్
మతిన్ దలంతు నెప్పుడున్ – మహేశ్వరున్ నేన్

అందమైన చందమామ – యాకసాన తొంగిచూచె
నందమైన చందమామ – నాకు నీవెగా

యతికి బదులు ప్రాసయతిని ఉంచి వ్రాసినప్పుడు ఇది ఒక షట్పద అవుతుంది. ఈ విషయము మలయాళములో చెప్పబడలేదు.

అనంతమైన భూమిలో
ననంతమైన సృష్టిలో
ననంతమైన యాత్రలో – ననంతుఁడేగా
మనోజవమ్ముతోఁ గనున్
వినోదచిత్తగా వినున్
వినూత్న మార్గదర్శి యా – విభుండె గాదా

నీవు లేక నేను లేను
నీవు రాక నేను పోను
నీవె నాకు సర్వమౌను – నిత్య మీ భువిన్
పూవు లేక తావి లేదు
తావి లేని పూవు లేల
పూవు తావి చేరినట్లు – భూమి నుందమా
(ఇది ఒక భోగషట్పది)

5.03 ఉన్నత – ఉన్నతలో రెండు పాదములు నతోన్నతలోని మొదటి పాదమువలె 16 అక్షరములతో నుండును. త్రిమాత్ర ల-గము అయినప్పుడు ఇది పంచచామరము అవుతుంది.

త్రి-త్రి-త్రి-త్రి / త్రి-త్రి-త్రి-త్రి

మనోజవమ్ముతోడ నన్ – మదలసా కనంగ రా
మనోభవుండు నిన్ను నన్ – మహీతలమ్ముఁ జేర్చుఁగా
అనూహ్యమైన యందమం – దనంతమైన బంధముల్
సునందినీ సుఖమ్ములే – సునాదినీ శుభమ్ములే

చంద్రబింబమందుఁ జూడు – చక్కనౌ శశమ్ము నొండు
ఇంద్రచాపమందుఁ జూడు – యింపుగా సువర్ణమాల
మంద్రగానమందు నిండు – మాధురుల్ వినంగ రమ్ము
సంద్రమౌను మానసమ్ము – సాఁగు ప్రేమ నౌక నమ్ము

6.01 మాత్రాస్వాగతము – స్వాగతము అతి ప్రాచీనమైన ఒక చక్కని సంస్కృత వృత్తము. ప్రతి పాదమునకు 16 మాత్రలు, కాని అవన్నీ చతుర్మాత్రలు కావు. అవి 5,3,4,4 లేక 3,5,4,4 మాత్రలు. స్వాగత వృత్తమును అదే స్వరూపములో మాత్రమేకాక అదే లయతో గణస్వరూపమును కొద్దిగా మార్చి మలయాళ ఛందస్సులో ఉపయోగించినారు. స్వాగతవృత్తపు ఐదు విధములలో మొదటిది స్వాగతము, నాలుగవది చంద్రవర్త్మ, అయిదవది ద్రుతపదము. రెండవ, మూడవ వృత్తములకు లక్షణములు చూపబడలేదు.

UIU III – UII UU స్వాగతము
UIU IU – UII UU మాధురి
UIU III – UU UU శ్రేయ
UIU III – UII IIU చంద్రవర్త్మ
IIIU III – UII UU ద్రుతపదము

స్వాగతము – ర/న/భ/గగ, యతి (1, 7), 11 త్రిష్టుభ్ 443

నా గళమ్మునకు – నాలుక నీవా
రాగరాగిణుల – రమ్యత నీవా
వేగవంతమగు – ప్రేమకు నావా
స్వాగతమ్మిదియె – చక్కఁగ రావా

మాధురి – ర/య/స/గ, యతి (1, 6), 10 పంక్తి 203

మానసమ్ములో – మాధురి నిండెన్
గానవార్ధిలో – గంగయుఁ జేరెన్
తేనెలూరు యీ – తెల్గు పదమ్మున్
నేను వింటిగా – నేఁడు ప్రియమ్మై

శ్రేయ – ర/న/మ/గ, యతి (1, 7), 10 పంక్తి 59

శ్రేయమీయగను – జీవమ్మై రా
వ్రాయు గీతమున – రావమ్మై రా
ప్రాయమం దొలుకు – భావమ్మై రా
తీయఁగా మదికిఁ – దేవమ్మై రా
(తేవము = ఆర్ద్రత)

చంద్రవర్త్మ – ర/న/భ/స, యతి (1, 7), 12 జగతి 1979

ఇంద్రనీలమణు – లెల్లెడఁ గనఁగా
మంద్రమైన స్వర – మాధురి వినఁగా
సాంద్ర మయ్యె మదిఁ – జక్కని ముదముల్
చంద్రవర్త్మవలె – సాఁగెను పథముల్
(చంద్రవర్త్మ = చంద్రుని మార్గము)

ద్రుతపదము – న/భ/జ/య, యతి (1, 8), 12 జగతి 888

అదరిపోకు కల – లందున నీవున్
ముదము నిండఁగను – ముద్దుల కన్నా
నిదురపో త్వరగ – నీరజనేత్రా
మృదువుగా జగతి – మీలితమయ్యెన్

6.02 మదనార్త – కలహంసీ అనునది ఒక అందమైన తాళవృత్తము. దీనిని శారదచంద్ర అని కూడ అంటారు. మలయాళములో దీనికి మదనార్త అని పేరు. పాదమునకు నాలుగు మాత్రాగణములు, మొదటి మూడు ఆఱు మాత్రల గణమైన UUII. చివరి గణము రెండు గురువులు.

త/య/స/భ/గగ, యతి (1, 9) UUII UUII – UUII UU, 14 శక్వరి 3277

నీవేగద నా భాగ్యము – నీవే హృదయేశా
నీవేగద నా భావము – నీవే ప్రణయాశా
నీవేగద నా జీవము – నీవే మృదుభాషా
నీవేగద నా కెల్లయు – నీవే రసపోషా