కొంచెం అది కొంచెం ఇది

ఉన్నట్టుండి
నిండు కుండల
మబ్బులు
చుట్టుముట్టి

తడి తడి
చలి చలి
ఆవిరి పెదవుల
తడిమి ఒంటిని

దాహాన్ని
నిలువెల్ల
నిప్పు కణికల
మోహాన్ని
పొంగి పొర్లించి

వర్షం కురిసి
వణికి తనువు
జ్వరం వచ్చి
మంచం పట్టాలని
తహ తహలాడితే
మనసు

పుస్తకాల దొంతరల
గొడుగు నీడ కింద
ఒక్క చుక్క వాన రాదు.

పేజీల కుచ్చిళ్ళలో
పెనవేసుకు పోయిన
అక్షరాలను చూస్తుంది
కన్నీళ్ళజోడు.