అది నాది

ఒప్పుకున్న సమయానికే వెళ్ళాడు. ఆమె ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూంది “అయితే నువు వచ్చేసరికి ఇంకో రెండు గంటలన్నా పడుతుంది!” …”ఎన్నిసార్లు చెప్పాను నీకు! సరేలే!” అని విసుగ్గా ఫోన్ పెట్టేసింది.

ఎక్కడ్నుంచి మొదలెట్టాలో తెలియలేదు. బహుశా ముందు పెద్దవి. ఆమే అంది “వాషింగ్ మెషీన్ నేను తీసుకుంటాను. ఫ్రిజ్ నువ్వు తీసుకుంటావా?” “సరే.” వాటికి రెండు రంగుల స్టిక్కర్స్ అంటిస్తూంది గుర్తుగా. పద్ధతిగా అనుకున్నట్టు జరగాలామెకు.

బెడ్స్, సోఫా, టేబుల్స్, టీవీ, వాటి మీద పేరుకున్న ఉదయాలు, సాయంత్రాలు, రాత్రులు, మాటలు, నవ్వులు, భోజనాలు, తిట్లు. ఆ జ్ఞాపకాల బరువుకు అన్నీ కుంగిపోతున్నట్టు ఉంది. అంతా బరువుగా ఊపిరి తీయనివ్వకుండా ఉంది. తేలికపరిచే మాటేదయినా అందామనుకున్నాడు కానీ తట్టలేదు.

ఇద్దరి మధ్యా దూరం తరగకుండా ఉండేలా తిరుగుతూంది ఆమె. అన్నిసార్లు తల నుంచి పాదం దాకా నగ్నంగా దగ్గరయిన ఆమెను ఇప్పుడు తాకను కూడా లేడు.

పెద్ద వస్తువుల పంపకాలయ్యాయి. ఎదురుగా ఉన్న హార్డ్ డ్రైవ్ చేతిలోకి తీసుకున్నాడు. “అది నాది” అందామె. కొన్నది ఆమే. ఇద్దరికీ నచ్చిన పాటలు ఎక్కడెక్కడినుంచో సంపాదించి కాపీ చేశాడు. అవి వింటూ తెల్లారిందాకా చెప్పుకున్న కబుర్లు ఇద్దరివీ. అక్కడే పెట్టి ఆమె వంక చూసి తల తిప్పుకుని అన్నాడు “సరే, తీసుకో.”

ఏటవాలు ఎండకి సోఫా కాలు పక్కన గాజు ముక్కొకటి మెరుస్తూ కనిపించింది. సోఫా అంచున ఒక నడివేసవి మధ్యాహ్నపు తడివాసన జ్ఞాపకపు మరక. వెళ్ళి గాజుముక్క చేతిలోకి తీసుకుని చెప్పాడు “అన్నీ నువ్వే తీసుకో.”

“ఊఁ?”

“అన్నీ నువ్వే తీసుకో. కోపంగా కాదు, ఉక్రోషంతో కాదు, మామూలుగానే చెప్తున్నాను.”

“తర్వాత మళ్ళీ పేచీ పెడతావు. నీతో గొడవ నాకు అనవసరం!”

“అదేం ఉండదు.” ఒక ఆరెంజ్ లేబుల్ లాగి కింద పడేస్తూ చెప్పాడు. ఆమె దాన్ని తీసి చెత్త బుట్టలో పడేసింది.

“వెళుతున్నా.”

“ఊఁ” అంది. ఇంకా ఏమయినా అంటుందేమోనని చూశాడు. ఆమె సోఫాలో కూచుని ఫోన్లో చూసుకుంటూంది. తలుపు నెమ్మదిగా వేస్తున్నప్పుడు వినిపించింది “నీ పుస్తకాలు…”

బయటికొచ్చి రోడ్ మలుపు వద్దకు చేరాడు. అప్పటిదాకా ఆమె గురించే ఆలోచిస్తున్నట్టు తెలుస్తూంది కానీ ఏం ఆలోచిస్తున్నాడో తెలియలేదు. రానున్న దుర్భరమైన రోజులు తనకోసమే రోడ్‌కు అటువైపు వేచి ఉన్నట్టు దాన్ని దాటడానికి తటపటాయిస్తూ ఎడతెగని ట్రాఫిక్ వంక చూస్తూ ఆ సాయంత్రంలోనే నిలుచుండిపోయాడు.


రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...