కొత్తగా వచ్చావా లోకంలోకి?
కవిత్వం కూడా వెంట తెచ్చుకున్నావా?
రా, రా!
చూడు
ఇదొక
ఊహల లోకం
ఆశల లోకం
నిరాశల నెగడు ముందు
కల్పనల్ని ఎగదోసుకుంటూ
పరచుకునే పొగమీద
పార్థివ హృదయాలను
మోసుకు తిరిగే లోకం!
అలవాటుగా నిరీక్షిస్తూ
ఆర్తిగా ఎదురైన వాటిని అలవోకగా దాటేస్తూ,
ప్రాణప్రదాల్ని పుణ్యం కోసం వదిలేసుకుంటూ
పాపపు వెఱపుతో పాషాణాల్ని హత్తుకు తిరిగే లోకం
ఎవరినీ మెచ్చి అక్కున చేర్చని లోకం
మెప్పుల కోసమే దిక్కులపట్టి పరుగులెత్తే లోకం
పదుగురున్నప్పుడు ధర్మపన్నాలు పలికి
నిఘా లేనప్పుడు నీతిమాలి మసలే నిప్పుకొలిమి
కనిపించని దేవుణ్ణీ కల్తీచేసే మాయదారి లోకం
మెలకువ మెరుపుల్ని ముసుగు కిందే దాచేసి
సుప్తావస్థలో, స్వప్నాలలో తూగే నిద్రాణపు లోకం
అంధకారాన్ని ఆలింగనం చేసుకొని
దీపాన్ని చూసి దడుచుకొనే లోకం
దయా దాక్షిణ్యం
జీవకారుణ్యం
స్వేచ్ఛ, జీవితేచ్ఛ
పుస్తకాల అట్టల అడుగునో
నాలుక చివరి మాటల అంచునో
పొడిచేతుల కరచాలనాల్లోనో
ఏమో! పొరపాటున మనుషుల్లోనో కనిపించి
అబ్బురపరిచే అగాధం, ఈ లోకం
అంతులేని ఎడారుల్ని దాచుకున్న ఆకుపచ్చని లోకం!
కొత్తగా వచ్చావు కదూ ఈ లోకం లోకి,
దీని చాపల్యం చదవగలిగినంత చదివి,
మరచిపోగలిగినంత మరచిపోయి వెనక్కి మరలిపో
ఆశలేవీ అంటనీకు, గుండె దారులు భద్రం సుమా.
నాకు తెలిసిందింతే,
మరెవరైనా ఎదురైతే
మరిన్ని మర్మాలు చెప్తారులే
కొత్తదారులు చూపుతార్లే
ఇదిగాక సొంతంగా తెలుసుకున్నది ఉంటే
ఉన్నదున్నట్టు వివరంగా రాసిపెట్టిపో,
కాలం కలిసొచ్చి
మలుపుల్లో మనం మరెప్పుడైనా ఎదురుపడితే,
అప్పటికి నీ మనసింత మెత్తగానే మిగిలుంటే
తరచి చదువుకుందాం గానీ,
కలిసి నవ్వుకుందాం గానీ!
ఇప్పటికి ఇక వెళ్ళిరా, క్షేమంగా!
—-