ఉరుము ఉరిమి…

రెండ్రోజుల్నుంచి రాని పనమ్మాయి గురించి – నేనూ, మా అత్త గారూ ఒకటే బెంగ పడిపోతున్నాం. మా ఇద్దరి మనసుల్లోనూ ఒకటే దిగులు. అది ఇక రాదని!

“మానేసిందంటావా? చెప్పా పెట్టకుండా?” అడిగారు మా అత్తగారు బేలగా.

“ఏమో..ఏవేడ్సిందో! ఎవరికి తెల్సు?” నాగమ్మ మీద కోపమంతా నా మాటల్లోకి దూసుకొచ్చింది.

“మొన్ననేగా ఇంట్లో పాత బట్టలన్నీ మూట కట్టి మరీ దానం చేశాం! ఏమొచ్చిందట మానేయడానికి?” మా అత్తగారిక్కూడా వొళ్ళు మండిపోతోంది పాపం!

“బట్టలేం ఖర్మా… వర్షాకాలమని పాత గొడుగు, రెయిన్ కోట్ కూడా ఇచ్చాం. త్వరగా వంట చేసుకుని తగలడుతుంది కదాని పాత కుక్కర్ ఇచ్చాం. పోన్లే కదా, మనసు పడుతోందని కొత్త హాండ్ బాగ్ కూడా కొనిచ్చాం. అంతెందుకు మొన్నటికి మొన్న పిల్లోడ్ని స్కూల్ లో వేశామని చెప్తే డబ్బు సాయం కూడా చేశాం. ఔనా? ఇహ ఇంత కంటే ఏం చేసి చస్తాం చెప్పండి?”

“అవునవును. ఎంత చేసినా అంతే! వీళ్ళ బుధ్ధులు మారవు. ఓ యాభై ఎక్కువిస్తామంటే చాలు. పాతిల్లు వొదిలేసి కొత్తిల్లు పట్టుకుంటారు. మనుషుల్లో విశ్వాసం వుండేడిస్తేగా? ఛీ! పని వాళ్ళంటేనే విరక్తి పుడ్తోంది.” అన్నారు బాధగా . అంతలోనే ఆవిడ గాలి నా మీద వీచింది, ఋతు పవనాలు కేరళ నుంచి ఆంధ్ర లోకి జొరబడ్డట్టు.

“అంటున్నానని కాదు కానీ, దానికసలు భయం భక్తీ లేకుండా చేసింది నువ్వే” అన్నారు అక్కసంతా నా మీద వెళ్ళబోస్తూ. అత్త మీద కోపం దుత్త మీద చూపటం అంటే… ఇదే మరి!

నాగమ్మ పని మానేయడానికి నన్ను కారణం చేస్తున్నందుకు నాకైతే భలే మండుకొచ్చింది. శాసన సభలోలా, ఈ సంసారంలో – ఈవిడ ఎప్పుడు ప్రతిపక్షమౌతుందో, ఎప్పుడు మిత్రపక్షం వహిస్తుందో తెలీదు. తను నాకు అత్తగారన్న సంగతి ఆర్నెల్లకో సారి ఇదిగో ఇలా గుర్తు చేస్తూ వుంటుంది. సుర్రుమంది మనసు. పీకల దాకా వచ్చిన కోపాన్ని నిభాయించుకోవాల్సొచ్చింది. ఎందుకంటే – నన్ను హోం మినిస్టర్ని చేస్తూ, కుటుంబ శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యతను మా ఆయన నాకప్పచెప్పినందుకు కావొచ్చు! పైకి శాంత స్వభావాన్ని నటిస్తూ…

“మీరు భలే వారండి అత్తయ్యగారూ! నన్నేదో అనాలని అంటమే కానీ, మధ్యన నేనేం చేశానూ?” అని అన్నాను, నాకు సాధ్యమైనంత పరిధిలో నవ్వడానికి ప్రయత్నిస్తూ.

“ఏం చేసానంటావేమిటీ? ఎప్పుడడిగితే అప్పుడు లెఖ్ఖా పత్రం లేకుండా డబ్బులిచ్చి దాన్నిచెడగొట్టలేదూ?”

నాకు తిక్క రేగింది. పీకలోనే ఆడశివుడిలా ఆపిన కోపం ఎగతన్నుకొచ్చింది.

“ఏం! మీరు మాత్రం తక్కువా? అదేదో మీకు చుట్టమైనట్టు ‘ నాగీ, వొసే నాగీ ‘ అంటూ ముద్దుగా పిల్చుకోలేదా? నేను చూస్తున్నప్పుడో సారి, చూడకుండా రెండో సారి దానికి పీకల్దాకా కాఫీలు తాగించింది ఎవరట? అహ! అంటున్నానని కాదు. రాత్రి మిగిలిన అన్నం మీరు తిని, వేడి వేడి టిఫినీలు చల్ల చల్లగా కూల్‌డ్రింకులూ దాని మొహాన దిమ్మరించిందీ, దాని అడుగులకు మడుగులొత్తి, ఇంతెత్తు బ్రహ్మరథం పట్టిందీ, మీరు కాదూ? దాన్ని ఎక్కడుంచాలో అక్కడుంచకుండా చనువిచ్చి, నెత్తి నెక్కించుకుంది మీరా? నేనా అంష?” నిర్మొహమాటంగానే అడిగేశా. కాదు, కడిగేశా. అప్పుడు కాని శాంతించలేదు.

అవును మరి. ఎంత మా ఆయనకి తల్లైతే మాత్రం నా ఆత్మ శాంతి కంటే గొప్పదేమిటీ, అత్తగారు!

ఆవిడ అవాక్కయ్యారు. ఏదో సాఫ్ట్ వేర్ పిల్లనుకుంది కానీ, ఇంత హార్డ్ వేలో కదం తొక్కుతానని ఆవిడా పాపం అనుకుని వుండదు. అనుకోనిది జరగడమేగా జీవితం!

నాకు తెలీకుండా తను చేసిన పన్లనీ నాకు తెల్సిపోయాయని తెల్సుకున్న ఆవిడ – నీళ్ళు నముల్తూ, నా వైపు అసహాయంగా చూసింది.

“అదేమిటే అలా అంటావ్? నేనేం చేసినా ‘నీ సుఖం కోసమే’ అని నీకు తెలీదుటే శ్యామూ?! అది పని మానేస్తే ఇంటా బయటా నువ్వెక్కడ కష్ట పడతావోననేగా నా బాధంతా..” అంటూ ఆవిడ కళ్ళొత్తుకుంటుంటే నాకూ నీళ్ళు తిరిగాయి.

వెంఠనే నేనూ కరిగిపోయాను. ఆవిడ కాబట్టి ఆ ఒక్క డైలాగుతో – ఇంట్లో సునామీని తప్పించింది. అంతే కాదు. నన్ను గొప్ప స్పృహలోకి కూడా తీసుకొచ్చి పడేసింది. ‘ఛ! అశాశ్వతమైన పనమ్మాయి కోసం, శాంత కుమారి లాంటి అత్తగార్ని ఎంత అపార్ధం చేసుకున్నాను!’ పశ్చాత్తాపంతో గుండె కలుక్కుమంది. బరువెక్కిపోయింది. దీనికంతటికీ కారణం నాగమ్మ! అవును. నా… గ… మ్మ…!’ తలచుకోగానే తెలీని ఆవేశం కట్టలు తెంచుకుంది. వూపిరి సెగలవుతుంటే, పూనకం వచ్చిన దానిలా ఊగిపోతూ…

“అత్తయ్యగారూ! మనల్నింతగా క్షోభ పెట్టిన నాగమ్మకిక మనింట్లో స్థానం లేదంతే. ఈ సారి తిరిగొస్తే చూడండి నేనేం చేస్తానో నాకే తెలీదు. దానికి – మనింటి చీపురు పుల్ల సైతం తాకే అర్హత లేదని చెప్పేస్తాను. ఇప్పుడే దాని జీతం డబ్బులు లెఖ్ఖ కట్టి, దాని మొహాన విసిరి కొ…”

“అమ్మగోరు!”

ఇద్దరం గిరుక్కున వెనక్కి తిరిగి చూశాం. ఎదురుగా నాగమ్మ!

చూసి వులిక్కిపడ్డాం. దాన్ని చూసీ చూడ్డంతోనే మా ఇద్దరి కోపాలూ నిప్పుల మీద నీళ్ళు జల్లినట్టు చప్పున చల్లారి పోయాయి. హమ్మ! రాదనుకున్న నాగమ్మ వచ్చేసింది! మా మొహాలు పెట్రొమాక్స్ లైట్లకి మల్లే వెలిగిపోయాయి.

నాగమ్మ వులుకూ పలుకూ లేకుండా తలొంచుకు నిలబడింది. దాని దీనవదనం చూసి “అయ్యో! అయ్యో! అదేమిటే నాగీ! అలా అయిపోయావ్?” అంటూ మా అత్తగారు తెగ హడావుడి పడిపోయారు.

“అవునండత్తయ్యగారూ! లంఖణాల బండిలా అయిపోయింది. ప్చ్… ప్చ్…” నాకూ దాన్ని చూసి బెంగ పుట్టింది.

“నీ దుంపతెగ! కళ్ళేమిటే అలా వాచాయి? బూరెల్లా?”

“వాడు దీన్ని మళ్ళీ చచ్చేట్టు బాదినట్టున్నాడండీ. అవునా నాగమ్మా?” లాలనగా అడిగా. మాకు తెలుసు. దాని మొగుడు ఒట్ఠి తాగుబోతు. కొట్టి చంపుతాడు.

“…..”

అది కళ్ళొత్తుకుంటూ పెరట్లోకి కదలబోయింది. మా అత్తగారు రెండు చేతులూ బార జాపి, దారికి అడ్డంగా తడిక కట్టింది.

“అయ్యో! ఇంత బాధ పెట్టుకునీ, పని చేస్తావుటే? పాడు పని! తర్వాత చేద్దువులే. అంత మానవత్వం లేని మనుషులమనుకుంటున్నావా ఏమిటీ మమ్మల్ని? ఆ?! ముందు అలా కూర్చో.” అంటూనే, మరో వైపు నన్ను –

“అమ్మాయ్! నువ్విలా వచ్చి కాసేపు దాన్ని వోదార్చు. రెండు నిముషాల్లో కాఫీ, టిఫినూ తెస్తాను. దానిక్కొంచెం ప్రాణం వస్తుంది” అంటూ వంటింట్లోకి ఎగిరి దూకారు. నాకాశ్చర్యమేసింది. మోకాళ్ళ నొప్పులెక్కడికి పోయాయోనని.

అత్తగారి ఆజ్ఞ మేర క్షణమైనా ఆలస్యం కాకుండా నేను స్వామిని దయానందిని పాత్రలోకి మారి పోయాను.

“ఏడవకు నాగమ్మా! అంతా నీ ఖర్మ! దేవుడు ఎలా రాస్తే అలా జరుగుతుంది. నువ్ మాత్రమేం చేస్తావ్? మా బామ్మెప్పుడూ చెబుతుండేది. మంచి అన్నంలోకి మంచి కూర దొరకదని. అంటే మంచి ఆడవాళ్ళకి చెడ్డ మొగుళ్ళు తప్పదని అర్థం. రాతలో వుంటే అనుభవించక తప్పదు నాగమ్మా! తప్పదు! ఇటు చూడు. పిచ్చి మొహమా! రెండ్రోజుల్నించీ తిండీ తిప్పలు లేకుండా ఇలాగే ఏడుస్తూ కూర్చున్నావా? ఆ!? మంచి దానివేలే! ఇదిగో, ముందు ఈ నీళ్ళు తాగు. నోట్లోంచి కాస్తంత మాటైనా వస్తుంది.”

“…”

“నీకేం భయం లేదు. మేమున్నాం. సారుకి చెప్పి మీ ఆయనకి బుధ్ధొచ్చేలా, మేమేదో ఒహటి చేస్తాంలే! ఏం చేస్తున్నారో చూసి ఆయన్నిప్పటికిప్పుడే పంపిస్తానుండసలు!” అంటూ దాని కన్నీళ్ళు తుడిచి, నోటికి మంచినీళ్ళ గ్లాసందించా.

ధబ్ మన్న శబ్దానికి వెనక్కి తిరిగి చూస్తిని కదా, మా ఆయన! నిచ్చెనాకారంలో నిగడ దన్ని, సోఫాలో పడిపోతూ కనిపించారు. పాపం! కళ్ళు తిరిగాయి కామోసు!


రచయిత ఆర్. దమయంతి గురించి: పుట్టింది బందరు, స్థిరపడింది హైదరాబాదులో. ప్రస్తుత నివాసం - బెంగుళూరు. ఎం.ఏ సోషియాలజీ చదువుకున్న వీరు జర్నలిస్ట్ గా పని చేసారు. ఇప్పటి దాకా25 కవితలు, 50 పైగా కథలు రాసారు.ప్రస్తుతం ఒక సీరియల్ రాస్తున్నారు. "చదవడం, రాయడం రెండూ ఇష్టాలే. ఐతే, ఎక్కువగా ఇష్టపడేది మాత్రం మొదటిదే. సాహిత్య విలువల్ని ప్రేమిస్తాను. సంస్కారవంతుల్ని గౌరవిస్తాను." అంటున్నారు ఈ రచయిత్రి. ...