ఒక వోర!

రాత్రంతా ఒక్క కునుకైనా తీస్తే ఒట్టు.

టెన్షన్… టెన్షన్. ఎప్పుడూ లేనంత ఉద్వేగం. యామిని నించి ఏ క్షణాన ఏ కబురొస్తుందో అని భయం. గుండె దడ.

ఏదో జరగరానిదే జరిగుంటుందని మనసు పదే పదే సూచిస్తోంది. లేకపోతే ఇంటికెళ్ళగానే ఫోన్ చేయమని చెప్పినా, చేయలేదంటే అర్థం? రాత్రంతా అది కూడా నాలానే మానసిక క్షోభననుభవించి వుంటుంది.

కోపంతో శ్రీధరన్నయ్య యామిని మీద చేయిచేసుకోలేదు కదా? ఆపైన అదీ ఎదురు తిరిగివుంటే? విషయం ఎంతవరకైనా వెళ్ళి వుండొచ్చు.

‘మీ అన్నయ్యకీమధ్య బుర్రతక్కువ చేష్టలెక్కువైనాయే ఇందూ, విడాకులిచ్చేస్తా!’ అని బెదిరిస్తున్న యామిని ఈసారి ఈ చేదు సంఘటనతో నిజంగానే విడాకులకి సిద్ధమౌతుందా?

అదే నిజమైతే, అందుకు ‘మూల కారణం నువ్వే’ అని ఆ ఇద్దరూ నా వైపు చూసే చూపులకి నేను తలొంచుకోక తప్పదా? ఈ జన్మంతా ఒక జంటని విడదీశాననే పశ్చాత్తాపంతో బ్రతకాల్సొస్తుందా? ప్రాణస్నేహితురాలి కాపురం ఛిద్రమైతే తట్టుకోగలనా నేను?

ఆ ఆలోచనకే నాగుండె వేగంగా కొట్టుకుంది. ఎప్పుడు తెల్లవారిందో ఏమో నేను గమనించనేలేదు.

కాలింగ్ బెల్ మోగింది. మెట్లమీద పేపర్ జర్రుమన్న శబ్దం వినిపించింది. ఆ వెనకే గేటు తీసుకుని పనమ్మాయి వచ్చినట్టు చీపురు చప్పుడూ.

బెడ్ మీంచి మెల్లగా లేచి కుర్చుని, అలవాటుగా అరచేతిలోకి చూసుకున్నా. రోజూ నేను కళ్ళు మూసుకుని దర్శించుకునే ముగ్గురమ్మలకు బదులు, మిన్నీనే కనిపించింది. మామూలుగా కాదు. జుట్టంతా ముఖం మీద కమ్ముకొని రెండు చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తూ…

మనసు చెదిరింది. జుట్టు సవరించుకుని, ముడి వేసుకున్నా. అదాటుగా పక్క బెడ్ మీదకి చూశాను చూడొద్దనుకుంటూనే. ఊలురగ్గు కింద వెచ్చగా పడుకున్నారు హాయిగా నిద్రపోతూ. చేసిందంతా చేసి ఎలా నిద్రపోగల్గుతున్నాడీయన? జరిగింది గుర్తొచ్చి కోపం నషాళానికంటింది. టేబుల్ మీదున్న నీళ్ళ జగ్గు తీసుకుని గుమ్మరించాలనేంత కోపమొచ్చింది. తమాయించుకున్నా.

త్వరత్వరగా ఇంటి పనంతా చుట్టేశాను. ఆయనతో ఒక్క మాటైనా మాట్లాడలేదు. ఆయన ఆఫీస్‌కెళ్ళిపోయారు. నేనూ నా టూ-వీలర్ మీద ఆఫీస్‌కి బయల్దేరా.

మనసంతా ఆగమాగంగా వుంది. యామిని ఎలా వుందో? తను క్షేమంగా వుంటే చాలు.

శ్రీధరన్నయ్య కొకసారి ఫోన్ చేయనా పోనీ? ఏమని అడగను – చేసి? జవాబు దొరకలేదు. మరో గంట ఆగి అప్పుడు ఫోన్ చేస్తాను. ఆ టైముకి ఆఫీసుకొచ్చేసుంటుంది. వివరంగా మాట్లాడొచ్చు అని సరిపెట్టుకున్నా. కాబిన్‌లోకి వెళ్ళి లాప్‌టాప్ తెరవగానే బస్తాలకొద్దీ ఈమెయిళ్ళు. మన్‌డే అంటే మంటెక్కించే వర్క్‌డే. బలవంతంగా పనిలో జొరబడిపోయాను.

వంచిన తలెత్తి చూసేసరికి లంచ్ అవర్ దాటింది. టెరేస్ మీద ఉన్న క్యాంటీన్ వైపు నడిచాను. ఎక్కువమంది లేరు. ఒక కార్నర్‌లోకెళ్ళి యామినికి కాల్ చేశాను.

ఒకటి, రెండు, మూడు… నాలుగు… ఐదు రింగులు…

“హలో!”

ప్రాణం లేచొచ్చినట్టైంది నాకు. “హలో, మినీ? నేనేనే! ఎలా వున్నావు? అదేమిటీ గొంతు అలా వుంది?” అడిగాను. అరిచి అరిచి గొంతు పోయుంటుంది. ఏడ్చి ఏడ్చి కూడా అయ్యుండొచ్చేమో. జాలేసింది.

“ఏం లేదే, బాలేదు వొంట్లో. సెలవు తీసుకున్నా…” గొంతు బరువుగా భారంగా వినిపిస్తోంది.

“అయ్యో! అలానా. నీకు ఐస్‌క్రీమ్ పడదన్నా ఇచ్చానే…” నొచ్చుకుంటూ అన్నాను.

“నువ్విస్తే మాత్రం తినేదాన్ని నాకుండాలిగా. ఎవరో వచ్చినట్టున్నారే, మళ్ళా చేస్తాలే…” అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేసింది.

నేనడగాల్సింది ఇంకా అడగనే లేదు. ఎందుకు డిస్కనెక్ట్ చేసింది? రాత్రి బాగానే వున్న మనిషి తెల్లారేసరికల్లా ఆఫీసుకి సెలవు పెట్టేంత సిక్ అయిందా? నేను నమ్ముతానా? కాదు. నా దగ్గర ఏదో దాస్తోంది. బాధని దిగమింగుకుంటోందని తెలుస్తూనే వుంది. రెండ్రోజులు పోనీ. మెల్లగా అడిగి తెలుసుకుందాం అని ఊరుకున్నా.

ఆ రెండ్రోజులూ కూడా నేను మా ఆయనతో మాట్లాడలేదు. ఇంత వండి అక్కడ పెడుతున్నానంతే. నాలో నేననుభవిస్తున్న టెన్షన్‌కి అసలు మూలకారణం తానన్న స్పృహే ఆయనకి లేదంటే ఎంత అన్యాయపు మనిషనుకోవాలి. ఆ రోజుకారోజుకీ ఆ యేటికాయేటికి… ఇంట్లో ఇల్లాలు ఒక ఎలక్ట్రానిక్ పరికరం అన్నట్టుంటుందేమో ఈ మగాళ్ళకి. లేకపోతే? అలా వున్నావేం అని అడగనైనా అడగొద్దూ? ఊహు. జడుడు! తిట్టుకున్నా కోపంగా.

సరిగ్గా రెండ్రోజుల తర్వాత మళ్ళా ఫోన్ చేశా యామినికి. “ఏమిటే, సిగ్నల్ దగ్గరున్నా. చెప్పు చెప్పు. 50 సెకన్ల టైముంది” చెప్పింది.

“ఏమీ లేదే. ఎలా వున్నావో కనుక్కుందామని…”

“బానే వున్నానే. నౌ ఐ యామ్ ఆల్రైట్.”

అంతలోనే మళ్ళా అనుమానం. “రోజూ మీ ఇద్దరూ కలిసెళ్ళి కలిసొస్తారు కదా, ఇవాళ నువ్వొక్కదానివే వెళ్తున్నావ్?”

“అంటే… పెద్ద గొడవొకటొచ్చిపడిందిలే. అదంతా తర్వాత చెబుతా… అదిగో సిగ్నల్ పడింది. ఓకె. బై.” త్వరత్వరగా బై చెప్పేసింది.

వీళ్ళు కలిసి వెళ్ళడం లేదా ఆఫీసుకు? భార్యని ఆఫీసు దగ్గర దింపడం అన్నయ్యకి ఒక సెంటిమెంట్. ఎంత బిజీ వున్నా సరే తప్పదంటాడు. గొడవ అంటోందేమిటీ? మళ్ళా మొదలైంది నాలో నాకే తెలీని గందరగోళపు ఆందోళన.

యామిని కంఠాన్ని గుర్తుచేసుకున్నా. ట్రాఫిక్ రొద వల్లనా కాస్త డల్‌గా వినిపించిందీ? కాదు. కాదు. శ్రీధర్ అన్నయ్యతో ఖచ్చితంగా గొడవ పడుంటుంది.

భార్యాభర్తలన్నాక సవాలక్ష గొడవలుంటాయి. వానలా వస్తాయి పోతాయి. అందుకు కాదు నా బాధ. ఆ గొడవ నా వల్ల. నేను ఇంటికి పిలవడం వల్ల. మా ఆయన అగ్గిపుల్లేయడం వల్ల! ఈ పాపం మీది- అనే మాటొస్తుందనీ… నింద మిగులుతుందనీ… నా బాధ. అదీ కాకుండా, ప్రాణ స్నేహితురాలైన యామిని స్నేహానికి దూరమౌతానేమో అని కూడా మరో బాధ.

ఏదేమైనా కానీ సాయంత్రం ఇంటికెళ్ళాక, తీరిగ్గా దాంతో మాట్లాడాలి. నా తప్పుకి క్షమించమని అడగాలి. జరిగిన సంఘర్షణలో శ్రీధర్ అన్నయ్య ఏమైనా ఒక మాట అన్నా, ఒక తిట్టు తిట్టినా, నా మొహం చూసి వూరుకోమని వేడుకోవాలి. కాపురం జాగ్రత్తలు చెప్పాలి. నా కళ్ళంట నీళ్ళు తిరిగాయి.

ఆ సాయంత్రం ఇంటికొచ్చాక, మా ఆయన నా చేతికందించిన అల్లం టీని మౌనంగా అందుకుని, గదిలోకొచ్చాను. ఇప్పట్లో ఆయనతో మాట్లాడదలచుకోలేదు. మిన్నీకీ శ్రీధర్ అన్నయకి మధ్యన ఆ రాత్రి ఏం గొడవజరిగిందో అనే విషయం తేలేదాకా, నేను నా మొగుడితో మాట్లాడనని గట్ఠిగా శపథం చేసుకున్నా. ఈ సారి గట్టిగానే నిర్ణయించేసుకున్నా. నా మాటంటే మాటే. తెగ పట్టుదలగల మనిషినన్న సంగతి ఆయనకీ తెలుసు. మంచిది. నా గురించి తెలిసిందానికంటే ఇంకా తెలియాల్సిందే ఎక్కువని కూడా తెలియచెబుతా. అదీ ఎప్పుడంటే, యామిని కాపురంలో గొడవలేమైనా రావాలీ, అప్పుడు.

టైమ్ చూశాను. మిన్నీ ఇంటికొచ్చే సమయమే అది. మనసు విప్పి నా స్నేహితురాలితో మాట్లాటం కోసం తలుపు గడి వేసుకుని బెడ్ మీద వాలాను. ఆఖరి రింగ్‌కి లిఫ్ట్ చేసింది. “ఏమిటే…” అంటూ. నూతిలోంచి వినిపిస్తోంది కంఠం.

“అంత రహస్యంగా మాట్లాడుతున్నావేమిటీ?” వెయ్యి అనుమానాలు నాలో.

“సినిమా చూస్తున్నా…”

“ఒక్కదానివే…”

“లేదు, ఇద్దరం వచ్చాం. మళ్ళా మాట్లాడతా. సరేనా?” ఫోన్ పెట్టేసింది.

హమ్మయ్యా. ఇద్దరూ సినిమాకెళ్ళారన్నమాట కలిసి. అంటే గొడవలేమైనా అయివుంటే సద్దుమణిగినట్టే అనుకోవచ్చు. హూ! నాక్కాస్త రిలీఫ్ అనిపించింది. నూట్నాలుగు జ్వరం నూటొకటికి దిగినట్టుగా వుంది. బెడ్ మీద అలానే కళ్ళు మూసుకున్నాను. యామినీ శ్రీధర్ మేమూ మా రోజులూ గుర్తొచ్చాయి.


యామిని, శ్రీధరన్నయ్య ఉత్తర దక్షిణ ధృవాలు. అది నిఠారుగా నీటుగా వుంటుంది మనిషి. చటుక్కున మాటకు మాట వచ్చేస్తుంది దాని దగ్గర్నుంచి. మొదటి సారి చూసేవారికి, ఆమె గురించి తెలీని వారికి అదొక గర్విష్టిలా వున్నా, దాని మనసు వెన్న. శ్రీధరన్నయ్య సినిమాలో కారెక్టర్ ఆర్టిస్టల్లే మహా నిదానం మనిషి. ఎదుటివాడు తనని తిట్టినా చలించడేమో అన్నంత ప్రశాంతంగా వుంటాడు. ఇక మా ఆయనకేమో వాళ్ళను ఇంటికి పిలవడమంటే మహ సరదా. ఈయనకేమౌతుందో ఏమో, అందరూ నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యా ఒక చిన్న పుల్ల పెట్టి తమాషా చూస్తుంటారు.

‘మీ బాంక్ దివాళా తీస్తోందని వార్తలొస్తున్నాయీ… అనో, స్టీల్ మహా మంటగా వుంటోందిట, కాష్ చేసుకుంటున్నారా…’ అనో అంటాడీయన. ఇక ఆ మాట మీద ఆ మాటా ఈ మాటా పెరిగి అన్నయ్య ఔనంటే యామిని కాదనీ, నీకేం తెలుసంటే నీకేం తెలీదని అనుకుంటూ చిన్నగా మొదలైన వివాదం చిలికి చిలికి గాలివాన అవుతున్నట్టుంటుంది. శ్రీధరన్నయ్య గొంతు పెరగకపోయినా అభిప్రాయం నేరుగా చెప్తారు. దానితో యామిని గొంతు ఇంకా పెరిగిపోతుంటుంది. సరిగ్గా అప్పుడు నాకు కంగారు మొదలవుతుంది. మా ఆయన ముఖం చూస్తే ఒళ్ళు మండుతుంది కూడా. అలాటి సందర్భాలలో నేనే చొరవ చేసి మరో టాపిక్ లోకి బలవంతంగా లాక్కెళ్ళి కాస్త నవ్వించి, ఇక శుభం అంటూ కారెక్కించి పంపేస్తుంటాను.

లోపలకొచ్చి, ముసిముసిగా నవ్వుకుంటున్న మా ఆయన్ని ఏమీ అన్లేక, ‘చిన్నపిల్లాడిలా మీకిదేం అల్లరితనం?’ అంటూ సున్నితంగా మందలిస్తుంటాను కూడా. యామినికి శ్రీధరన్నయ్య మీదున్నంత అధికారమూ చనువూ నాకు నా భర్త మీదుండదు. ఆయన మీద కోపమొస్తే లోలోన కారాలూ మిరియాలూ నూరుకోవడం తప్ప ఏమీ చేయలేను. సమాజంలో స్త్రీ ఆర్థిక స్వేచ్ఛ వేరు, ఇంట్లో పెళ్ళాం స్థానంలోని ఇల్లాలి స్వేచ్ఛ వేరు. కాపురమూ కాలమూ రెండూ సజావుగా సాగాలంటే రెండెడ్ల బండిలో ఒక చక్రం ఎదురు తిరగకూడదు. ఆ చక్రం భార్యే అవడం చాలా కాపురాల్లో కద్దు. అలా, నేనూ మినహాయింపు కాదు.

శ్రీధరన్నయ్య అలా కాదు. వాదించినంత సేపు వాదించినా, చివరికి పెళ్ళానికే పట్టం కట్టి, (తాను గెలిచినా సరే) ఆమె వెంట విధేయుడైన చక్రవర్తిలా నడుచుకుపోయే శ్రీధరం అన్నయ్యంటే నాకెంతైనా గౌరవం వుంది. వాళ్ళని ఆతిథ్యానికి పిలిచినప్పుడు సరసానికైనా సరే ఆ ఇద్దరిమధ్యా ఎలాటి పుడకలూ, అగ్గిపుల్లలూ వేయకూడదని మా ఆయన చేత మాట తీసుకుని మరీ పిలిచాను మొన్న ఆదివారం రాత్రి డిన్నర్‌కి.

అన్నయ్యకిష్టమని ఆవపెట్టిన చింతపండు పులిహోర, పెరుగు వడ, ప్లెయిన్ వడ, తీపి సజ్జప్పాలు చేసుంచాను. అన్నయ్యకి ఎర్రప్పడాలు, ఊరమిరపకాయలు, బూడిదగుమ్మడి వడియాలంటే ఎంతిష్టమో! అవన్నీ నేనింట్లోనే చేస్తానని ఎంత మెచ్చుకుంటాడో నన్ను. పెరటి పంటల ఆర్గానిక్ కూరలతో వంటలనీ ఎంతో రుచిగా వున్నాయంటూ మెచ్చుకుంటాడు. మా ఆయనలా మౌనంగా తినడు. పొగడ్తలకీ ప్రశంసలకీ పొంగని వనితలెవరని!

అంతా సవ్యంగానే గడిచింది. భోజనాలయ్యాయి. డైనింగ్ లోంచి హాల్లోకొచ్చాం. నేను మేడ మీద గదిలోకెళ్ళాను సంక్రాంతికని కొన్న కంచి పట్టు చీర తీసుకొచ్చి యామినికి చూపిద్దామని. మగ్గం వర్క్ ఎక్కడ చేయిస్తే బావుంటుందో తనకి బాగా తెలుసు. అలా బీరువా తీసి, చీరని చేతిలోకి తీసుకున్నానో లేదో…

ఇంతలో యామిని కంఠం గట్టిగా అరుస్తూ వినిపించింది. నేను చీరనక్కడే వదిలేసి కంగారుకంగారుగా మెట్లు దిగుతూంటే, నాలిక తూలుతున్న మాటలు వినపడ్డాయి. “మా ఆయన ఉత్తి సుద్ద ముక్క. తెలివి లేదు. సన్నాసులకేం తెలుస్తుందన్నయ్యా ఆ స్థలం విలువ? ఈయనకసలు బుద్ధుంటే కదా!” ఇంకా ఏమనేదో కాని మొగుణ్ణి పట్టుకుని, నేను ఆ పళాన గబగబా యామిని దగ్గరకు ఒక్క దూకు దూకి ఆమె నోటికి అడ్డంగా అరచేయి పెడుతూ, శ్రీధరన్నయ్య వైపు భయంగా చూశాను. దాని నోటి దురుసుతనానికి ఆయన ఎప్పట్లా నవ్వలేదు. అదీ నా భయాన్ని రెట్టింపు చేసిన కారణం.

అయినా అదంత మాటనొచ్చా మొగుణ్ణి పట్టుకుని నలుగురిలో! ‘ఇంతకీ మీరేం నిప్పంటించారు?’ అన్నట్టు ఆవేశంగా చూశాను మా ఆయనవైపు. ఆయన కూడా అనుకోని తుఫానుకి బెదరినట్టు కనిపించారు. నవ్వులు కాస్తా నువ్వులౌతాయని ఊరికే అన్నారా పెద్దలు? హాస్యానికైనా అనకూడని మాటలు, ఎంత స్నేహం వున్నా మీరకూడని హద్దులూ వుంటాయి. వయసొచ్చాక ఎవరికి వారు పెంచుకోవాల్సిన సంస్కారాలు తుంచుకుంటూ పోతే బంధాలూ బాంధవ్యాలేం మిగుల్తాయి? అవే దూరమైనప్పుడు సమాజంలో మనిషికీ అడవిలోని ముళ్ళకంపకీ తేడా ఏముంటుంది?

“ప్లీజ్ ప్లీజ్ మిన్నీ. ప్లీజ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్!” అంటూ గొణిగాను.

ఆ వాతావరణంలో ఇక వుంటం ఇష్టం లేని వాడిలా శ్రీధరన్నయ్య లేచి నిలబడ్డాడు. పులిహోర బొబ్బట్టు పాకెట్ రెడీనా, ఇలా ఇవ్వు తల్లీ- అని ఎప్పుడూ ప్రేమగా అడిగే అన్నయ్య ఈ సారి అడగలేదు. వాతావరణం ఎప్పుడు వేడెక్కినా, చల్లబరచే ప్రయత్నం చేసే నేను సయితం అక్కడ ఘనీభవించిన గంభీరతని చెదరగొట్టే సాహసం చేయలేక మిన్నకుండిపోయాను. మగవాడి మంచితనమూ, సహన సౌశీల్యమూ ఎంతవరకంటే, మొగుడిగా అతని అహం దెబ్బతిననంతవరకే. ఈ నిజం యామిని ఎందుకు గ్రహించదూ? శత్రువుని కటిక మాటల్తోనూ, భర్త మనసుని మంచితనంతోనూ గెలుచుకోవాలట.

కొన్ని క్షణాల కితం వరకూ పండగలా వున్న వాతావరణం హఠాత్తుగా విషాద సన్నివేశంలా అయిపోవడం ఎంతైనా బాధాకరం కదూ? లోలోన ఆమె ప్రవర్తనకి తలవంపులుగా వుందేమో, వంచిన తలెత్తే లోపే, అన్నయ్య కార్లో వెళ్ళి కూర్చున్నాడు. మా ఆయన హాల్ గడప లోపలే నిలబడిపోయారు. నేను మాత్రం కారు దగ్గరకెళ్ళి విండో లోంచి ముఖం దూర్చి యామిని చెవిలో రహస్యంగా చెప్పాను, వెళ్ళంగానే ఫోన్ చేయమనీ మర్చిపోవద్దనీ.

లోపలకొచ్చి విసురుగా ఆయన వైపు చూస్తూ, “ఏమిటీ, ఈసారి పుడకలెందుకని ఏకంగా పెద్దగుంజే తగలేసారా వాళ్ళిద్దరి మధ్య?” కోపంగానే అడిగాను.

“లేదు ఇందిరా! ఇక్కడి ఇళ్ళ స్థలాలు రియల్ ఎస్టేట్ వివరాలు అడిగాడు శ్రీధరం. నేను చెప్పాను. మీరు కూడా మా ఇంటి పక్క ప్లాట్ వుంచుకునుంటే బావుండేది అన్నా…”

“అన్నారా? ఇంకేం? ఇక అయింది. కొంప కొల్లేరే.” నిలువునా ముంచెత్తిన బాధతో తల పట్టుకున్నాను.

మేమిద్దరం పక్కపక్కన ఇళ్ళు కట్టుకుని వుండాలని మా కోరిక. అలానే కొన్నాం. కానీ అన్నయ్య బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం ప్లాట్ అమ్మేయాల్సొచ్చింది. ఆ అమ్మడం తన సొంత చెల్లికి అమ్మాడు. ఆవిడ ఇన్స్టాల్‌మెంట్స్‌లో చెల్లిస్తానంది. ఆమె పూర్తిగా చెల్లించక ముందే, మా ప్లాట్స్ వెనక వైపున హైటెక్ సిటీ వస్తోందని దుమారం రేగింది. అంతే! ఆ పళాన రేట్లు ఆకాశానికంటాయి. ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి, ఇచ్చిన డబ్బు వాపస్ చేసేస్తాం అంది యామిని. మాట ఇచ్చాను కాబట్టి తప్పకూడదని అన్నయ్యంటాడు. దాంతో కొంత అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయి వాళ్ళ వాళ్ళ మధ్య. కొన్నది మా చెల్లెలేగా అంటాడు ఈయన. ఈ రోజు కోట్ల రూపాయల ఆస్తి అని ఇది మండిపడుతుంది. ఇద్దరి వాదనలూ సరైనవే అనిపిస్తాయి నాకు. అలా అని ఒకరు కరెక్ట్ అని అనలేం పైకి. కాశ్మీర్ గొడవలాంటిది అది మాకు.

అలాటి బాంబులాటి మాటననేశారా! నోరు తెరుచుకుండిపోయాను. పాపం ఆయన కావాలని అన్నట్టు లేరు. ఇంతగా యామిని రియాక్ట్ అవుతుందని ఆయనా ఎక్స్‌పెక్ట్ చేసినట్టు లేరు. అయినా నాకు చాలా కోపం వచ్చింది ఆయన మీద. దానికంటే ముందు నా స్నేహితురాలు ఇక్కట్ల పాలౌతోంది కదా నా మూలాన అని బాధేసింది, కలతేసింది. మనసుకి స్థిమితంలేకుండా పోయింది.

శ్రీధరన్నయ్య అప్పుడు ఆ క్షణంలో తమాయించుకున్నా, ఇంటికెళ్ళాక ఏ భర్త కానీ తన భార్యని నానా చివాట్లు వేయడూ? ఎంత నీకు లోకువైతే మాత్రం పరాయివారింట్లో పరాయి వాళ్ళ దగ్గర నన్ను పట్టుకుని నోటికొచ్చినట్టు నువ్వంత మాటంటావా? గెటౌట్ అని అనడూ? మా ఆయన్లాంటి మగాడు అస్సలు ఊరుకుందునా? పోనీ అది మాత్రం ఊరుకుంటుందా?

మగాడి అహం సాటి మగానికే ఎరుక. అందుకే కామోసు, ఈ నాల్గురోజుల్నించీ మా ఆయనా కామ్‌గానే వుంటున్నారు. గమనించా, ఇనపచువ్వ బెండయిన ఆ డల్ వాలకాన్ని.

ఏమైనా సరే – వీళ్ళంతా కారు. నాకు నా ఫ్రెండ్ ముఖ్యం. దాన్ని క్షమించమని అడగాలి. దానికి నచ్చచెప్పాలి. దాని కాపురం ఏమీ కాకుండా చూడాలి. అప్పటిదాకా నాకు మనశ్శాంతి వుండదు.


నా ఆలోచన్లని పక్కకి తోసేస్తూ సెల్ మోగింది.

“చెప్పు ఇందూ. నువ్వు ఫోన్ చేసినప్పుడలా ఏదో ఒక బిజీపనితో మాట్లాడలేకపోతున్నా. ఏమిటి సంగతీ?” మిన్నీ గొంతు ప్రేమగా.

“ఏమీ… లే…దు.” అంటూ ఆగాను. మీ ఆయన ఆ రాత్రి తిట్టలేదు, కొట్టలేదు కదా? అర్ధరాత్రి మీ ఇద్దరి మాటల బాణాలతో ఇల్లొక రణరంగమవ్వలేదు కదా? – అని ఎలా అడగడం? నోరు పెగలడంలేదు.

“ఏమిటే మాట్లాడవ్? ఏదో అడగాలనో, చెప్పాలనో అనుకుంటున్నావ్? లేకపోతే ఇన్నిసార్లు ఫోన్ చేయవు. చెప్పవే బాబూ… ఎలా వుంది నీ ఒంట్లో?” సానుభూతిగా అడిగింది.

“నేను బాగానే వున్నానే. నువ్వే… పాపం…” అంటూ ఆగాను. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అప్పటికే నాకు.

“నేనా?! నాకేం? నిక్షేపంలా వున్నా. అదేమిటే అంత బెంగ పడుతున్నావ్ నా గురించి! ఒక్క రోజు సిక్ అయ్యానంతే. డోంట్ వర్రీ. పోయిందిలే!”

“అది కాదే మిన్నీ. సారీ చెప్పాలి… నీకు.”

“సారీనా? ఎందుకూ?”

“అదే, ఆరోజు రాత్రి ఇంటికెళ్ళాక అన్నయ్య నిన్నేమైనా అన్నాడా అని భయం… వేసి…”

యామిని చిత్రంగా నవ్వింది. “ఔనా! అలా బాధపడ్డావా? అద్సరే ఆయన్ని నేనేమన్నానని అసలు?”

“అంటే…సన్నాసీ…బుధ్ధి…” ఆగాను పూర్తిచేయడం ఇష్టంలేక.

ఫక్కున నవ్వింది. చాలాసేపు అలా నవ్వుతూనే వుంది. నవ్వీ నవ్వీ ఇక నవ్వలేనిదాన్లా ఆగి, పాప్‌కార్న్ అనుకుంటా నోట్లో వేసుకుని నములుతూ అంది.

“నీ ముఖం. నేను రోజూ ఆయన్ననే మాటల్లో అదెన్నో వంతులే. లైట్ తీసుకో.”

అంతే. అవాక్కయిపోయా!

“మర్చిపోయా చెప్పడం…” యామిని చెబుతోంది. “ఆ రోజు కాస్త ఎక్కువ తాగారట మీ అన్నయ్య. మాట తడబడితే బావోదని నీ ముందు గౌరవం తగ్గుతుందని మాట్లాడలేదట. అందుకనే వెళ్ళి కార్‌లో కూర్చున్నాడు. పక్కరోజు పొద్దున్న ఫ్రిజ్ వెదుకుతూ పులిహోర తేలేదా అని నన్నడిగాడు. ఇదిగో కూల్ డ్రింక్స్ తీసుకొస్తున్నాడు. ఇటివ్వు. ఇదిగో శ్రీ! మాట్లాడు. మీ చెల్లెలు మన గురించి తెగ కంగారు పడుతోందిట…”

“ఏమ్మా! కంగారుపడ్డావా మా గురించి?…” అదే గొంతు. అదే వాత్సల్యం.

హమ్మయ్య! ఊపిరొచ్చింది.

యామిని క్షేమం.

అన్నయ్య గౌరవం భద్రం.

మా ఆయన మీద జాలి.

ఎటొచ్చీ ఇక నా గురించి నేను తెలుసుకోవాలి. అది మాత్రం మిగిలుంది.


రచయిత ఆర్. దమయంతి గురించి: పుట్టింది బందరు, స్థిరపడింది హైదరాబాదులో. ప్రస్తుత నివాసం - బెంగుళూరు. ఎం.ఏ సోషియాలజీ చదువుకున్న వీరు జర్నలిస్ట్ గా పని చేసారు. ఇప్పటి దాకా25 కవితలు, 50 పైగా కథలు రాసారు.ప్రస్తుతం ఒక సీరియల్ రాస్తున్నారు. "చదవడం, రాయడం రెండూ ఇష్టాలే. ఐతే, ఎక్కువగా ఇష్టపడేది మాత్రం మొదటిదే. సాహిత్య విలువల్ని ప్రేమిస్తాను. సంస్కారవంతుల్ని గౌరవిస్తాను." అంటున్నారు ఈ రచయిత్రి. ...