పర్వతుడా! నీ పాదాలకు నమస్కారం

తెలియని
పాఠాలేవో చెప్పి
వాటిని పాదాక్రాంతం చేసుకున్నావో
అవి మాత్రమే సొంతం చేసుకున్న
ప్రకృతి సహజత్వానికే ప్రణమిల్లావో గానీ
వాటి శిఖరాగ్రాలపై
అవలీలగా అడుగులేసి
ఆకాశాన్ని ముద్దాడావు

ఎవరికీ పట్టని ఆ అజ్ఞాత వీరులతో
చెలిమి చేశావు
మనో నిశ్చయంలో
పర్వతాలతో సమానంగా
మరో పర్వతమై వెలుగొందావు

ఇక్కడ భూమిని చూస్తున్న కళ్ళతో
అక్కడి నీ ప్రయాణ పాటవాన్ని
ఊహించి చెబుతున్నాను

నిరాశా జీవులకు
నువ్వొక పర్వతమంతై
వెలుగు చూపించావు
సోమరులకు సైతం
ఆరోహణంలో
ఆశను రేకెత్తించావు
అలాంటివారి మనో ఆకాశంలో
చిక్కుముడులేవో విప్పే ప్రయత్నం చేశావు
కీకారణ్యాలలో బాటలేసి చూపించావు

ఆఖరికి పర్వతాలలోనే భాగమై
ప్రకృతిలో కలిసి పోయినా
నీ చరిత్రని అజరామరం చేశావు!
ఓ పర్వతుడా!
ఎప్పటికీ
పర్వత శిఖరాలమీద జెండాలై నిలబడిన
నీ పాదాలకు
శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

(మల్లి మస్తాన్ బాబు గారి స్మృతికి వినమ్రంగా)

రచయిత గరిమెళ్ళ నారాయణ గురించి: డా. గరిమెళ్ళ నారాయణ ప్రస్తుతం హెర్న్‌డన్, వర్జీనియాలో ఉంటున్నారు. వృత్తి సైంటిస్ట్.  ...