మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు – 2

సాహిత్యంలో కవులను గురించి మాట్లాడేటప్పుడు ఇంతకు ముందు వ్యాసంలో వాళ్ళు వాళ్ళ పాఠకుల వల్ల పొందిన జీవిత స్వరూపాల గురించి చెప్పాను. ఈ దృష్టితో చూస్తే కవులు వాళ్ళ పాఠకుల చేత రూపొందించబడతారు అని సూచించాను. ఇప్పుడు, కవి తనను గురించి తానేమనుకున్నాడో ఆ సమాచారం గురించి మాట్లాడతాను.

వ్యాసుడు, వాల్మీకి, వాళ్ళను గురించి వాళ్ళు ఏమనుకున్నారో మనకు తెలియదు. వాళ్ళు మామూలు మనుషులు ఎలాగూ కారు. వాళ్ళకి దేవతలతో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. వాళ్ళు చెప్పే కథలో వాళ్ళు పాత్రలు కూడా. అందుచేత వాళ్ళను గురించి వేరే రకంగా చర్చించాలి. కాని, తెలుగు సాహిత్యంలో చరిత్రకు అందే కాలంలో జీవించారని, వాళ్ళు మనలాటి వ్యక్తులే అని, గొప్ప శక్తిమంతులు కావచ్చు కాని, వాళ్ళకీ మనలాంటి చావు పుట్టుకలు ఉన్నాయని, తెలిసిన వాళ్ళ గురించి మాట్లాడదాం.

ఈ కవులందరికీ తాము రాసిన కావ్యాలకి తామే కర్తలమని తెలుసు. వాళ్ళు ఆ మాట స్పష్టంగా చెప్పుకున్నారు కూడా. నన్నయ మొదలుకొని ఆ మార్గంలో రచనలు చేసిన వారందరూ కావ్యాదిని, ప్రతీ ఆశ్వాసానికి చివర, తాము గద్య ఒకటి రాసుకున్నారు. ఈ పద్ధతికి మార్గం పెట్టినవాడు నన్నయే. ఆయన ప్రతీ ఆశ్వాసాంతంలోను రాసుకున్న గద్య ఇది:

ఇది సకలసుకవిజనవినుత నన్నయ భట్ట ప్రణీతంబైన శ్రీమహాభారతంబునందు…

ఇదే గద్య తిక్కన దగ్గర కొచ్చేసరికి ఆయన తనను గురించి మరి కాస్త ఎక్కువ చెప్పుకున్నాడు:

ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధనవిరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబైన…

నన్నయ తన తల్లిదండ్రుల పేర్లు చెప్పుకోలేదు. తిక్కన తన తండ్రి పేరు చెప్పుకున్నాడు. ఆయన కొమ్మనామాత్యుడట. ఇక్కడ నుంచి మొదలు పెట్టి క్రమక్రమంగా ఈ సంప్రదాయం లోనే రాసిన కవులను గురించిన గద్యలు చూస్తే తరువాతి ప్రతివాళ్ళూ తమను గురించి మరి కొంచెం ఎక్కువ చెప్పుకున్నట్లు కనిపిస్తుంది.

ఈ వరసలో ఒక పెద్ద మార్పు తిక్కనే నిర్వచనోత్తర రామాయణంలో చేశాడు. నన్నయ భారతంతో మొదలు పెట్టి తిక్కన భారతం లోను, ఇంకా తరువాత గాను, ఏర్పడిన పద్ధతి ఏమిటంటే కవి తన గ్రంథాన్ని ఒక కృతిభర్తకు అంకితం ఇవ్వడం. ఆ కృతిభర్త కవిని తన ఆస్థానానికి పిలిపించుకొని (లేదా తిక్కనకు జరిగినట్టుగా కలలో కనిపించి) తన పేర ఫలానా పుస్తకం రాయమని పురమాయించి, తాంబూల జాంబూనదాలు (అంటే బంగారం) ఇచ్చి సత్కరిస్తాడు. కవి అదే పరమార్థమనుకొని ఆ తాంబూలం గ్రహించి ఇంటికి వెళ్ళి ఒక సుముహూర్తంలో తన కావ్య రచన ప్రారంభిస్తాడు. ఆ కావ్య రచనకు ముందు ఉపోద్ఘాతంగా కృతినాయకుని వంశావతారం వర్ణిస్తాడు. ఆ వరసలో కావ్యాన్ని కృతినాయకునికి వినిపిస్తున్నట్టుగా రచిస్తాడు. అంటే మొదట్లో కృతినాయకుణ్ణి సంబోధించి తన కథ వినమని చెప్పి, ప్రతి ఆశ్వాసం చివర మళ్ళా ఆయనను సంబోధించి ఆశ్వాసం అయిపోయిందని చెప్పి, తరవాతి ఆశ్వాసం మొదలు పెడతాడు.

ఈ పద్ధతి తిక్కన తన నిర్వచనోత్తర రామాయణంలో మార్చాడు. అందులో ఆయన తన కృతిభర్తను సంబోధించడు. అంటే ఆయనకు తన కావ్యాన్ని వినిపించడు. ప్రతి ఆశ్వాసం మొదట్లోనూ తన కృతిభర్త పేరు చెప్తాడు ఒక పద్యంలో. మళ్ళా ఆశ్వాసం చివర కృతిభర్త గురించి ప్రథమ పురుషలో కొన్ని పద్యాలు రాస్తాడు. అంటే తన కావ్యం కృతిభర్తకు వినిపించడం లేదన్న మాట.

ఈ పద్ధతి 16వ శతాబ్దిలో పింగళి సూరన వరకూ ఎవరూ మళ్ళా అనుసరించలేదు. అంటే ఆ రకంగా అంకితం ఇచ్చే పద్ధతి తిక్కన కాలానికి ఎవరికీ అనుకూలం కాలేదు. దీనికి కారణాలు తరువాత వెతుకుదాం. కాని పింగళి సూరన్న ఈ పద్ధతిని అనుసరించడంలో ఒక కొత్త మార్గాన్ని కూడా మొదలు పెట్టాడు. తన పుస్తకానికి పీఠికలో ఆయన రాసిన ఈ పద్యం చూడండి.

జనముల్మెచ్చగ మున్రచించితి నుదంచద్వైఖరిన్ గారుడం
బును శ్రీరాఘవపాండవీయముఁ గళాపూర్ణోదయంబున్మఱి
న్దెలుఁగున్ గబ్బము లెన్నియేనియును మత్పిత్రాది వంశాది వ
ర్ణనలేమిన్ బరితుష్టి నా కవి యొనర్పంజాల వత్యంతమున్

(నేను పూర్వం గరుడపురాణం, రాఘవపాండవీయం, కళాపూర్ణోదయం ఇంకా చాలా తెలుగు పుస్తకాలు జనం మెచ్చేటట్లుగా రాశాను. కానీ వాటి వేటిలోనూ మా వంశం గురించి నేను ఏమీ చేప్పుకోలేదు. అందుచేత నాకవి తృప్తిగా లేవు.)

అంతకు ముందు పుస్తకాలలో కవులెవరూ తమ కుటుంబాన్ని గురించి చెప్పుకోలేదు. తమను గురించీ తాముగా ఎక్కువ చెప్పుకోలేదు. వంశ వర్ణనంతా కృతిభర్త వంశాన్ని గురించే. అంటే కవి ఒకరకంగా తెర వెనుక ఉండిపోయాడు. అందుకే వాళ్ళ తల్లితండ్రుల గురించి వాళ్ళ జీవితాలని గురించి మనకు చాలా తక్కువ తెలుసు. ఆ పద్ధతిని మారుస్తున్నాడు పింగళి సూరన్న.

సూరన్న ప్రభావతీప్రద్యుమ్నం తన తండ్రికి అంకితం ఇచ్చాడు. అధ్యాయం మొదట వాళ్ళ తండ్రి గురించి ఒక మాట ఉంటుంది. అది సంబోధన కాదు. అధ్యాయం చివర మళ్ళా మరొక మాట ఉంటుంది. అదీ సంబోధన కాదు. అంటే సూరన్న తన కావ్యాన్ని అతని తండ్రికి వినిపించలేదు. ఆయన పేరు మొదట్లోనూ, చివర్లోనూ రాశాడు, అంతే. ఒక రకంగా చూస్తే ఈ కాలంలో కవులు, రచయితలు తమ పుస్తకాలని అంకితం ఇచ్చే పద్ధతి సూరన్నే మొదలు పెట్టాడన్నమాట. ఇప్పుడు, పుస్తకం లోపల పేజీలో కవి తన గురువుగారికో, భార్యకో, భర్తకో, ప్రియురాలికో, స్నేహితుడికో, ఇంకా మేలు చేస్తే వేంకటేశ్వరస్వామికో అంకితం ఇస్తున్నట్టు ఒక మాట ఉంటుంది. పింగళి సూరన్న చేసిందీ ఇదే.

ఇది నా పుస్తకం సుమా! నా పేరుతో గుర్తు పెట్టుకోండి! నా జీవిత చరిత్ర ఇది. ఇలాంటి పింగళి సూరన్న ఈ పుస్తకం రాశాడు. నా జీవితానికి మీరు చిలవలు పలవలు చేర్చి కథలు కల్పించకండి — అని చెప్పాడన్నమాట. కవి చరిత్ర నిర్మాణంలో ఇది పెద్ద మార్పు. కవి కథగా కాకుండా, కవి వ్యక్తిగా గుర్తుంచుకోబడాలని కోరుకుంటున్నాడన్నమాట. కాని, సూరన్న ఊహ వాస్తవంగా అమలు లోకి వచ్చే అవకాశం అప్పట్లో రాలేదు. సూరన్న గురించి చాటుప్రపంచంలో కథలూ పద్యాలు ఏర్పడ్డాయి.

దాదాపు ఇదే సమయంలో, అంటే ఉజ్జాయింపుగా పదహారవ శతాబ్దిలో, కవులకి తమ పుస్తకాలు తమ ఆస్తి అని, అవి ఇంకెవరన్నా దొంగిలిస్తే అది గ్రంథచౌర్యం అని ఒక కొత్త ఊహ ప్రారంభమైనట్టు కనిపిస్తుంది. చౌర్యం అంటే ఒకరు విలువైనదిగా పరిగణించే వస్తువుని ఇంకొకరు అనుమతి లేకుండా తీసుకోవడం అని అర్థం. గాలికి, నీటికి ఎవరు చౌర్యం ఆపాదించలేదు – ఇప్పటి కాలం వరకూ; అవి అమ్ముకోవడానికి వీలైన వస్తువులు కావు కాబట్టి. గ్రంథచౌర్యం అనే ఊహ పదహారవ శతాబ్దంలో వచ్చిందంటే అప్పుడు కవి తన గ్రంథాల వల్ల డబ్బు చేసుకుంటున్నాడని అర్థం. ఉదాహరణకి, పెద్దన తన మనుచరిత్రలో మొదటిసారిగా గ్రంథచౌర్యం గురించి ప్రస్తావిస్తాడు.

భరమై తోఁచు కుటుంబరక్షణకుగాఁబ్రాల్మాలి చింతన్నిరం
తరతాళీదళసంపుట ప్రకర కాంతారంబునం దర్థపున్
దెరవాటుల్ దెగికొట్టి తద్‌జ్ఞ పరిషద్విజ్ఞాత చౌర్యక్రియా
విరసుండై కొఱతం బడున్ గుకవి పృధ్వీభుత్సమీపక్షితిన్

(కుకవి కుటుంబాన్ని పోషించుకోలేక, ఇంకొక దారి తోచక, తాళపత్ర గ్రంథాలు అనే అడివిలో అర్థాన్ని దొంగిలించి, రాజసభలో ఆ సంగతి గ్రహించిన పండితులు తన దొంగతనాన్ని పట్టుకుంటే సిగ్గుపడి రాజు చేత ఆయన సమీపం లోనే కొరత వేయబడి శిక్షించబడతాడు.)

పెద్దన దృష్టిలో కుకవి అంటే ఎవరంటే, ఎవరికీ తెలియని తాళపత్ర గ్రంథాల లోంచి పద్యాల అర్థాన్ని సంగ్రహించి తన పద్యాలుగా రాసుకొని పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నించేవాడు. ఇది ప్రబంధాలలో గ్రంథచౌర్యానికి మొదటి ఉదాహరణ.

ఇంతకన్నా మరీ స్పష్టంగా దాదాపు ఆ కాలం వాడే అయిన అన్నమాచార్యులు తన కీర్తనల లాటి కీర్తనలే ఇంకెవరో రాసి ప్రచారం చేసుకుంటున్నారని గమనించి వాళ్ళని చాలా తీవ్రంగా మందలిస్తాడు. వాళ్ళని ఛాయాపహారులు అంటాడు. అంటే తన కీర్తనల పద్ధతిని దొంగలించినవాళ్ళు అని అర్థం.

ఈ కాలంలో ఈ కవులు తమ పుస్తకాల వల్ల డబ్బు సంపాదించుకుంటున్నారు అని నమ్మకంగా చెప్పవచ్చు. పెద్దన కృష్ణదేవరాయల ఆస్థానంలోనూ అన్నమయ్య తిరుపతిలో దేవుడి ఆస్థానంలోనూ తగుపాటి డబ్బు సంపాదించుకున్నారని మనకు తెలుసు.

గ్రంథచౌర్యం, గ్రంథం ఆస్థిగా పరిగణించబడే కాలం జమిలిగా ముడిపడి ఉన్నాయన్నమాట. ఈ గ్రంథం నాది, అని కవి చెప్పుకోవడం కేవలం తన గొప్పతనం కోసమే కాదు, తన పుస్తకం మీద మమకారం వల్లనే కాదు, అది తన ఆస్తి కాబట్టి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అని ఇప్పుడంటున్న మాట 16వ శతాబ్దం నాటికే రాజాస్థాన కవుల్లో, డబ్బులున్న దేవస్థాన కవుల్లో ఏర్పడిందన్నమాట.