ఇంకొంచెం అసంబద్ధం

ఎవరో చెప్పారు, నిజమే అయ్యుంటుంది
మందు కొట్టినప్పుడు నేను దేవుడిని

నైవేద్యం పెట్టుకున్న చికెన్ నగెట్స్ నుంచి
ఒక్కక్కటి తీసి విసిరి కొట్టాలని అనిపిస్తుంది

అతడూ అమ్మాయి విడిపోయేప్పుడు పంచుకోడానికి
విడిపోయే ఆలోచన రావడానికి ముందు కొనుక్కున్న
సింగిల్ ఫ్యామిలీ హౌస్ కిటీకీలో ఏదో కదలిక

నిజమైన దేవుడు పాపాయి. ఊరికే చూస్తుంటుంది నన్నూ
ఎట్టా విడిపోవాలో మాట్టాడుకుంటున్న అమ్మా నాన్నలనీ

ఇట్టాగే మొదలవుతుంది పద్యం
మొదటి పాదం రాసేలోగా మరొకటి దాని మడమలు
తొక్కుకుంటూ వస్తుంది, చివరికవి ఒక దాన్నొకటి రద్దు చేసుకుని
కపాల సరసిలో మునకేస్తాయి

పొద్దున లేచి, లేస్తే, చూస్తాను ఇది పద్యమో కాదో, ఇప్పుడు మాత్రం
నేను వట్ఠి దేవుడిని, ఏమీ చేయలేను, ఎవరినీ కలిపి వుంచలేను
పాపాయిలాగే నేనూ కలిపి వుంచలేను పద్య పాదాలనూ, ఎవర్నీ

నైవేద్యం పెట్టుకున్న చికెన్ నగెట్స్ కిటికీలో నుంచి విసిరేస్తుంటాను
తనకెంతో ఇష్టమైన బొమ్మల్ని తీసి విరిచి విసిరేస్తున్న పాపాయిలాగే

ఎవరో పిలుస్తున్నారు ఇక నేను వెళ్తాను
ఇప్పటికీ అసంబద్ధం చాలు.