మిడిల్ డ్రాప్

కావలసిన ముక్కొకటి తగలకపోతుందా అనుకున్నావు,
కాంతానయనాల కాంతులు చూసి భ్రమపడ్డావు.
పన్నెండు ముక్కలూ పండబెట్టుకోకుండా
‘కౌంట్ ఆర్ షో’లో పెట్టుకున్నావు జీవితాన్ని,
ఎప్పుడూ ఆశ పొడుగ్గానే ఉంటుంది,
వచ్చేది జోకరనుకొని వెళ్ళు పేకలోకి.

ట్రిప్లెట్లెప్పుడూ ఉండనే ఉన్నాయి,
నాన్నా, అమ్మా, తమ్ముడులా సీక్వెన్సొకటి ఉంది,
బతుకుకోసం కావలసిన రెండో సీక్వెన్సు
పెయిర్‌లోకి ముక్క రావడం లేదు ఇప్పటికీ. 

అవసరమైన జోకరు కోసుకోవడం చేతకాలేదు,
అమ్మాయిల మనస్సుల్లా పక్కవాడి ఆట అర్థం కావడం లేదు
అరకు రాణీ వెక్కిరిస్తూ అవతలవాడి చేతిలో చిక్కింది,
అడ్రసు వెతుక్కుంటూ వచ్చేస్తున్నాయి అక్కర్లేని రాణులు.

నువ్వు సేఫనుకొని కొట్టిన ప్రతి ముక్కా
నవ్వుతూ ఎత్తుకుంటున్నాడు పక్కవాడు
ఇంక నీకు ఫెయిరయే అవకాశం లేదు
ఇప్పటికైనా మిడిల్ డ్రాప్ పడెయ్యి, నా మాట విను!
చప్పుడు చెయ్యకుండా ఆటలోంచి నిష్క్రమించు.

ఆంధ్రప్రభ (1963 ఎండాకాలం)

 
ఈ పద్యానికి ముందుకథ, వెనక కథా చెప్పాలి.

ముందు కథ:

2001 లో, నవోదయ రామ్మోహనరావు గారు, పరుచూరి శ్రీనివాస్ గారిని “ఎలాగయినా ఈ పద్యం సంపాదించి పేట్టమని” అడిగారట. శ్రీనివాస్ గారు, వెంటనే నారాయణరావు గారిని పిలిచి విషయం చెప్పారు. నారాయణరావుగారి దగ్గిర ఈ పద్యం కాపీ లేదు. ఆ విషయం రామ్మోహనరావుగారికి తెలిసిన తదుపరి, ఆయన ఒక వెయ్యిమందితో వకాబు చేసి చివరికి ఈ పద్యం కాపీ సంపాదించుకున్నారట. అంతేకాదు. దానిని చక్కగా Typeset చేయించుకున్నారట కూడా. రామ్మోహనరావు గారు, అదేకాలంలో నేను విజయవాడ వెళ్ళినప్పుడు నన్నూ అడిగారు, ఈ పద్యం గురించి. నాసమాధానం: ” నా రాతలే నాదగ్గిర లేనప్పుడు, ఇంకొకరి రాతలు నా దగ్గిరెలా ఉంటాయి స్వామీ?” అని. అంతే కాదు. ఆ రామ్మోహనరావు గారినే 1960, 1961 సంవత్సరాలలో వచ్చిన తెలుగు స్వతంత్రలు పోగుచేచేసిపెట్టమని కూడా అడిగాను; అప్పట్లో నా రాతలేవో వాటిలో వున్న గుర్తు.

వెనకకథ:

ఈ పద్యం 1963 ఎండాకాలంలో రాసిందని నా నమ్మకం. ఆ రోజుల్లో నేను కటకం నుంచి ఎండల్లో ఏలూరు వచ్చేసేవాడిని. రోజూ కాస్మాపాలిటన్ క్లబ్బులో రాత్రళ్ళు రమ్మీ ఆడే వాళ్ళం. అదో వ్యసనం. నాకు తెలిసినంతలో నారాయణరావు గారు ఎప్పుడూ జూదం ఆడలేదు. ఆయన కేవలం కిబిట్జర్‌ (kibitzer). అందుకే అంటారు, పేకాడే జూదగాళ్ళకన్నా, పక్కన కూర్చునే కిబిట్జర్‌లకి ఆట బాగా అర్థం అవుతుంది అని. ఆయన విషయంలో మరొక జగద్విదిత విశేషం ఒప్పుకోక తప్పదు. “రవి కాంచనిచో కవిగాంచునేకదా.”

నారాయణరావుగారి అనుమతి తీసుకోకుండా ఈ పద్యాన్ని ఈ మాటలో ప్రచురిస్తున్నాము. అందుకు ఆయన అభ్యంతరం చెప్పరని మా ధైర్యం. పద్యం పాతది. తెనాలిలో పుట్టిన ఈ రమ్మీ ఆట రకరకాల అవతారాలు ఎత్తింది. అయితేనేం. పై పద్యంలో వివరాణలు, వాటి సొగసు మారలేదు. అవి రమ్మీ అంత శాశ్వతం. — వేలూరి వెంకటేశ్వర రావు


రచయిత వెల్చేరు నారాయణరావు గురించి: వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌‍లో కృష్ణదేవరాయ చైర్‌ ప్రొఫెసర్‌‍గా పాతికేళ్ళపైగా పనిచేశారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, పరిశోధనాపత్రాలు రాశారు. ఆయన రాసిన సిద్ధాంతగ్రంథం "తెలుగులో కవితా విప్లవాల స్వరూపం" తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఒక మైలురాయి. పాల్కూరికి సోమనాథుని సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులోని శ్రేష్టసాహిత్యాన్ని (Classicsను) అనువదించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న వెల్చేరు నారాయణ రావు  ఎమరి యూనివర్సిటీ నుంచి పదవీవిరమణ అనంతరం ఏలూరు దగ్గర నివసిస్తున్నారు. ...