త్రిపురాత్రి… త్రిపురహిత పగలు…

విశాఖ ఉక్కపాదం నుండే కాక
సముద్రపు శీతల కరస్పర్శ నుండి కూడా
మీ చర్మం
ఇక మీ నుండి
వీడ్కోలు తీసుకోవాలని నిశ్చయించుకుంటోన్న
రాత్రి –
(కలలాంటి అల ఒకటి
ఇసుక ఎదురుచూపులోకి ఇక
ఆవిరైపోదాం అనుకోవడం లాంటి రాత్రి)
ఇవేమీ తెలియని నేను
గంగానది సమీపాన నిశ్చింతగా నిద్రిస్తూ ఉన్నాను.

తలపైన ఈగల్లా ముసురుకునే
జ్ఞాపకాల నుండే కాక
తలలోన పువ్వుల్లా విచ్చుకునే
స్మృతుల్నుండి కూడా
మీ కళ్ళు
మీ నుండి మూసుకుపోవాలని
నిర్ణయించుకుంటోన్న రాత్రి –
(తలపుల లోపలి తలుపులకు
అదృశ్యహస్తమేదో గొళ్ళెం పెట్టడం లాంటి రాత్రి)
నేను గంగానది సమీపంలోనే నిద్రను కావలించుకుని
నిద్రిస్తూ ఉన్నాను.

‘మీ మృత్యువుకి మీరెన్ని కిళ్ళీల దూరంలో ఉన్నారో
నా మృత్యువుకి నేనెన్ని టీకప్పుల దూరంలో ఉన్నానో
తెలియకపోవడం కూడా
జీవిస్తున్న రోజులకి సంబంధించి
గొప్ప మిస్టరీ’
అన్నప్పుడు నవ్విన మీ పెదాలు
వాటి శబ్దనిశ్శబ్దాల నుండి ఇక
సెలవు తీసుకోవాలని తీర్మానించుకుంటోన్న రాత్రి –
(తోటలోని తమలపాకుల మీదకు కూడా వంగి
వాటిని తినేవాళ్ళ పేర్లు రాసే ఆకాశం
ఒక పేరు చివర పుల్‌స్టాప్ పెట్టడం లాంటి రాత్రి)
నేను నదీ సమీపంలోనే నిద్ర మీద చేయి వేసి
నిద్రపోతూ ఉన్నాను.

కనిపించని కన్నీళ్ళతో
మనుషుల్ని ఆలింగనం చేసుకునే
మీ చేతివేళ్ళు
బిస్కెట్ల నుండీ, భూతద్దం నుండీ, క్రాస్‌వర్డ్ పజిల్స్ నుండీ
ఇక జారిపోదాం
అనుకుంటోన్న రాత్రి –
(బాధను సందర్భం – సందర్భాన్ని బాధ
ఇక దేనికి ఏదీ కాపలా కాయాల్సిన
అవసరం లేదని
అదృశ్యంగా అమ్మ అనుకోవడం లాంటి రాత్రి)
నేను గంగ సమీపంలోనే నిద్ర మీద కాలు వేసి
నిద్రిస్తూ ఉన్నాను.

కళ్యాణ్ విల్లా అపార్ట్‌మెంట్ మెట్లు దిగకుండానే
మదనపల్లికీ – బర్మాకీ
బెనారస్‌కీ – అగర్తలాకీ
నడిచి వెళ్ళొచ్చే
మీ పాదాలు
ఇక
గమ్యస్థానానికి మిమ్మల్ని అప్పగించిపోదాం
అని ఒప్పందం చేసుకుంటోన్న రాత్రి –
(హిల్ స్టేషన్ మీది పొగమంచు అంచులోంచి
పక్షి ఈకలాంటి చివరి సాయంత్రమొకటి
దూది పింజెలా లోయలోకి జారిపోతూ
ఉండడం లాంటి రాత్రి)
నేను గంగానది సమీపంలోనే
నిద్ర పక్కన నిద్రిస్తూ ఉన్నాను.


నేను నిద్ర లేచేసరికి
మీరు నిద్రపోయారని తెలిసింది.
ఏం చేయాలో పాలుపోక
వారణాసి ఒడ్డున ఒంటరి పడవ నీడ వైపు
ప్రవహించే నదీ
తీరానికి బయలుదేరాను.
ఆ రోజు మధ్యాహ్నం
హరిద్వార్ నది ఒడ్డున
రావి చెట్టు నుండి రాలిన
ఆకు చెప్పిన కవిత
ఏ శీతాకాలపు స్మాల్ టౌన్ రైల్వే స్టేషన్ రాత్రి లోనో
హఠాత్తుగా మీరెదురైతే వినిపిస్తాను.

శరీరంతో
మీరు లేని ప్రపంచంలో
నేనూ కొంతకాలం నివసిస్తాను త్రిపురా…!
మనిషి ఉన్నప్పటి ప్రపంచాన్ని
లేనప్పటి ప్రపంచంతో పోల్చుకుంటూ –
కొన్ని కాంతి సమయాల్ని తింటూ –
బూడిదరంగు ఆటలో పాల్గొంటూ…