(ప్రతి)ఘటన

గోడ కడుతున్నారు
ఇంతకు ముందో గోడ ఉంది
అది దేవుడి గోడ
దానిముందు ప్రార్థనలు చేస్తారు కొందరు గట్టిగా
దీని వెనకాతల ఏడుస్తారు
మరికొందరు
అది మనకు వినిపించదు

****

నాకు అరవాలని వుంది
కాని ఎవరిమీద అరవను?
అందరూ నవ్వుతూనే కనిపిస్తారు
హిట్లరే నయం

****

ఈ బండి నేను వెళ్ళాల్సిన చోటికి నన్ను తీసికెళ్ళదు.
అయినా ఈ బండిలో ఎందుక్కూర్చున్నాను?
ఇది నడిపే ఆసామీ మారి ఇంకోడు వస్తాడంటే
ఎందుకు అంత ఉత్కంఠతో ఎదురుచూస్తాను?

****

సర్పయాగం జరగబోతోందని ఎదురుచూడకు
అందులో చచ్చేవి చిన్నపాములు
తక్షకుణ్ణి ఎవరూ ఏం చెయ్యలేరు
అతన్ని ఇంద్రుడు కాపాడతాడు

****

ఇది యుద్ధంలో చచ్చిపోయిన వాళ్ళ కోసం కట్టారు.
వాళ్ళకి గుర్తుగా
ఇందులో వాళ్ళ పేర్లన్నీ రాసారు
వీళ్ళు చంపిన వాళ్ళు
వాళ్ళ పేర్లు ఎవరికీ తెలియవు

****

మీరు చచ్చిపోవడానికే పనికొస్తారు
మా తరపున కానీ అవతలవాళ్ళ కోసం కానీ
చచ్చిపోతారు కాబట్టే
మీతో మాకు అవసరం
రాజ్యం ఎప్పుడూ మాదే

****

ప్రతి కుక్కా కరవదు
ప్రతి కుక్కా ప్రతిసారీ కరవదు
ఏ కుక్క ఎప్పుడు కరుస్తుందో తెలియదు కాబట్టి
కుక్కల్ని పెంచు

****

బుద్ధుడి బొమ్మ చూడ్డానికి బావుంటుంది
తాజ్‌మహల్‌ ప్రతిరూపం కూడా బావుంటుంది
ఆరెండూ నా టేబుల్‌ మీద వున్నాయి
నేను బౌద్ధుణ్ణీ కాను ముస్లింనీ కాను
నేనెప్పుడూ గాఢంగా ఎవర్నీ ప్రేమించలేదు కూడా
ఐనా ఆ రెండూ నా టేబుల్‌ మీద ఉంటాయి
చక్కగా
బొమ్మల్లాగా

****

ఇక్కడ నేలమీద పడేసింది ఏదీ నేల్లో కలిసిపోదు
ప్లాస్టిక్‌ సంచీలు, పత్రికలు, సీసాలు
అవి వేలవేల ఏళ్ళు
నిక్షేపంగా ఉంటాయి
అప్పుడు ఎవరేనా యిక్కడ తవ్వితే
నేను రాసిన తెలుగుపద్యాలు కనబడతాయి
ఆ లిపి చదవడానికి శాస్త్రజ్ఞులు అహోరాత్రాలూ కృషి చేస్తారు
అంతరించిన ఒక మహానాగరకత అవశేషల్లో
మానవజాతి దస్తూరిని పోల్చుకుంటారు


రచయిత వెల్చేరు నారాయణరావు గురించి: వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌‍లో కృష్ణదేవరాయ చైర్‌ ప్రొఫెసర్‌‍గా పాతికేళ్ళపైగా పనిచేశారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, పరిశోధనాపత్రాలు రాశారు. ఆయన రాసిన సిద్ధాంతగ్రంథం "తెలుగులో కవితా విప్లవాల స్వరూపం" తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఒక మైలురాయి. పాల్కూరికి సోమనాథుని సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులోని శ్రేష్టసాహిత్యాన్ని (Classicsను) అనువదించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న వెల్చేరు నారాయణ రావు  ఎమరి యూనివర్సిటీ నుంచి పదవీవిరమణ అనంతరం ఏలూరు దగ్గర నివసిస్తున్నారు. ...