కవిత్వం నా ‘కప్పాఫ్ టీ’ కాదు. చదవాలంటే భయం. కవిత్వాన్ని చదివి, చదివింది అర్థంకాక – అయ్యో ఈ కవిత్వాన్ని అర్థం చేసుకునే భాగ్యం నాకు లేదని బెంగపడ్డం, బెంగ బాధగా మారడం. ఒక వేళ ఏదైనా కవిత అర్థమైనట్లనిపిస్తే, అది కవిత/కవిత్వం ఎలా అయిందో ఆలోచించడం. ఎలా అయిందో అర్థం కాక మళ్ళీ భంగ పడ్డానే అని బెంగ పడ్డం, మళ్ళీ బెంగ బాధగా రూపాంతరం చెందడం – ఇదీ వరస!
ఎన్ని సార్లు భంగపడ్డా, బెంగపడి బాధ పడ్డా – కవిత్వం చదివే సాహసం చేస్తూనే ఉంటాను.
ఈ మధ్య చేసిన అలాంటి సాహసంలో రెండు కవితలు నన్ను ఆకర్షించాయి. ఆ కవితలు శ్రద్ధగా పెంచిన పూల మొక్కల్లా అనిపించాయి. వాటిలో ఒక గుబాళింపు ఉంది. అవి జాగ్రత్తగా గుచ్చిన పూల దండల్లా అగుపించాయి. లోలోపల చదువుకున్నా, బిగ్గరగా పైకి చదివినా ఒకేలాంటి ఆనందమేసింది. ఇవి కవితలే, వీటిలో ఉన్నది కవిత్వమేననిపించింది!
ఇంకొక విశేషమేమిటంటే – ఈ కవితలు వ్రాసిన కవులు ఒకరు ఆంధ్రలో, మరొకరు అమెరికాలో ఉన్నా, ఇద్దరూ కూడబలుక్కుని వ్రాసినట్లనిపించాయి. ఒకరు ‘చందవరం, ప్రకాశం జిల్లా‘లో మనల్ని ఒక రౌండ్ కొట్టిస్తే, మరొకరు అధునాతనమైన బంగళాలోకి ‘తేనీటి సమయానికి‘ సాదరంగా ఆహ్వానించారు.
ఈమాటలో వస్తోన్న ఇంద్రాణి గారి కవితలు పాఠకులకు సుపరిచితాలే. వీరి కవితల్లో ప్రత్యేకత అందమైన పద చిత్రాలు. ఏ గీతకు ఎలాంటి కుంచె వాడాలో, ఏ భాగానికి ఎలాంటి రంగులు రంగరించి అద్దాలో, ఏ చిత్రాన్ని ఎంతవరకు గీయాలో స్పష్టంగా తెలిసిన చిత్రకారిణి ఇంద్రాణి. రోజు వారి జీవితంలో ఉపయోగించే తేలికైన పదాలతో (అంటే కవిత్వ భాషలో కాకుండా), పదబంధాలతో కవిత్వాన్ని సృష్టించడం వీరిలో నాకు కనిపించిన ప్రత్యేకత!
నేను పుట్టి పెరిగింది ప్రకాశం జిల్లాలోని పల్లెటూళ్ళలోనే. ఇంద్రాణి గారు చూపించిన ‘చందవరం’ ఇదివరకు నేనెప్పుడూ చూడకపోయినా, ఈ కవిత చదివేటప్పుడు – చదివాకా – నేను పుట్టిన వూరు, పెరిగిన వూళ్ళు చాలానే గుర్తుకొచ్చాయి. ఈ కవిత చదివిన వారికి చందవరం పరిచయమైన వూరులా అనిపిస్తుందని నా నమ్మకం.
గుండ్లకమ్మ మీద ఊగే సూర్యుణ్ణి, తేలే చంద్రుణ్ణి – సూర్య చంద్రుల నడుమ కాలం కట్టిన వంతెనను చూపించిందీ కవిత. ఈ కవితలో వాడిన భాష, ప్రకాశం జిల్లా లోని పల్లెటూళ్ళలొ ప్రవహించే జీవభాష. నిద్రలేచిన దగ్గర నుంచి, నిద్రకుపక్రమించే వరకు ప్రవహించే కాలాన్ని, తేలిక పాటి పదాలతో పట్టుకున్న తీరు ముచ్చట గొలుపుతుంది. ఎండకు, వెన్నెలకు, కాలంతో నిచ్చెన వేసిన ఈ కవితలో ఒక వ్యర్థ పదం లేదు. ఏ పదాన్నీ తొలగించి వేరే పదంతో ఆ చిత్రాన్ని పూరించలేము. అంత పకడ్బందీగా అల్లిన కవిత ఇది.
ఊరిలో ఒక్కో భాగాన్ని ఒక చక్కటి చిత్రంగా గీసి, అలా గీసిన చిత్రాలన్నింటినీ ఒక పెద్ద కాన్వాసుపై అమర్చినట్లుంది. కెమెరాతో ఏదైనా ఫోటో తీసినప్పుడు, బ్లర్‌డ్ ఫోటోలను పనికిరానివిగా ఎలా పడేస్తామో, కవిత్వంలో స్పష్టత లేని చిత్రాల పరిస్తితీ అంతే! ఇంద్రాణి చిత్రాల్లో స్పష్టత ఉంది.
మెటికలు విరవడం, కాళ్ళు జాపుకుని ఆవులించడం, ఆరారగా తాగడం, ఉరికి ఉరికి పోవడం, బిత్తర చూపులు, బొడ్రాయి, పోచికోలు, చెతుర్లాడ్డం, ఎచ్చులు పోవడం – ఇవన్నీ మా జిల్లాలో విరివిగా వినిపించే పదబంధాలు. ఇంద్రాణి తేలును వదల్లేదు, కోడి పుంజును వదల్లేదు. పురుగును వదల్లేదు, నెమరేసే ఆవును వదల్లేదు. ఎచ్చులు పోయే రావి మొక్కనూ, చెతుర్లాడే ఓబులమ్మను వోదల్లేదు. వొళ్ళంతా కళ్ళుంటేనే కవులు ఇన్ని వివరాలను దర్శింపగలరు! ప్రతిభ ఉన్న కవులు మాత్రమే తాము దర్శించిన దృశ్యాలను, అక్షరాలతో పునః సృష్టి చేయగలరు.
నయనానందకరమైన పద చిత్రాలు, వీనులకు విందైన లయ మాత్రమే పద్యానికి పరిపూర్ణత్వం ఇస్తాయా? కాన్వాసు మీద నవ్వే వెన్నెల చంద్రున్ని చూసి మనం సంతోషిస్తాం. వెన్నెల నవ్వుల్ని మన మీదకు ప్రసరించే చందమామను చూసి మనం ఆనందిస్తాం. కానీ రెంటికీ తేడా ఉంటుంది. ఇది కవితంలో లోపం అనను కానీ, అనుభూతుల్ని కూడా అక్షరీకరిస్తే కవిత్వానికి అదనపు అందం చేకూరుతుంది.
కానీ ఇంత మంచి గ్రామంలో నాసి రకం పుణుగులు, పొంగణాలు – చౌక రకం తేనీరు కాస్త వెలితిగా అనిపిస్తున్నయ్యనుకుంటుండగా – వైదేహి గారు తేనీటి సమయానికి ఆహ్వానించారు.
తేనీటి దాతా సుఖీభవ!
వైదేహి గారి కవితల్లో కూడా అందమైన పద చిత్రాలుంటాయి. ఎంచుకునే కవిత్వాంశాల్లో నూతనత్వం ఉంటుంది. అంశానికి తగ్గ భావ సాంద్రత ఉంటుంది. అందించాలనుకున్న అనుభూతిని అనుసరించే ఆవిష్కరించే తీరు ఉంటుంది. వాడే ప్రతీకల్లో క్రొత్తదనం ఉంటుంది.
అమెరికాలో అధునాతనమైన ఇల్లు. నాలాంటి సాదా సీదాగాళ్ళు అడుగు పెట్టాలంటే భయమేసేలాంటి బంగళా. చుట్టూ నిటారుగా నిల్చుని ఎదురు చూసే చెట్లు. స్వాగత గీతాలు పాడే పక్షులు. అబ్బురంగా వాటిని చూసుకుంటూ బంగళాలోకి వెళితే – దారివెంట అప్పుడే ఆవులించుకుంటూ నిద్రలేచిన పూల చెట్లు. పూల సుగంధాన్ని దాటుకొచ్చామనుకుంటుండగానే, ఏలకుల సుగంధంతో పొగలు క్రక్కుతూ ఎదురు చూస్తున్న మేలురకం తేనీరు, నచ్చిన విషయాల గురించి సంభాషించుకోవడానికి ఒక మనిషి, చదువుకోవడానికి ఒక పుస్తకం, ఆస్వాదించి అనుభూతించడానికి కవిత్వం. వారాంతపు శనివారం ఉదయం ఇంతకంటే ఎవరికైనా ఇంకేం కావాలి?!
ఈ కవితలో వాడింది సాదా సీదా భాష కాదు. అచ్చమైన కవిత్వపు భాష.
ఈ పదాలను గమనించండి – స్పర్శ, వారాంతం, సుగంధం, రాజ్యాధినేతలు, సంభాషించడం, సాన్నిహిత్యం, ఆస్వాదించడం, సవ్వడి – లాంటి పదాలు ఈ కాలపు రోజు వారీ జీవితంలో అరుదుగా ఉపయోగిస్తాం.
వైదేహి చూపించిన పరిసరాలకు, పరిస్థితులకు ఈ భాష మరింత గంభీరతను సంతరించింది. ఇక్కడొక మాట చెప్పాలి – ఇప్పటి రోజుల్లో, పుస్తకాలలో తప్పించి జనాల వాడుకలో లేని భాషలో వచ్చే రచనలు ఎక్కువ కాలం నిలిచే అవకాశాలు చాలా తక్కువ.
కాని ‘తేనీటి సమయం’ స్పష్టమైన చిత్రం. కవిత పూర్తయ్యేసరికి – ఏలకుల సుగంధ భరితమైన గదిలో, పొగలు క్రక్కే తేనీటి కప్పు ఎదురుగా కూర్చున్న అనుభూతి కలుగుతుంది. అక్షరాలతో అనుభూతిని కల్పించేది మంచి కవిత్వపు లక్షణమే కదా!
ఈ రెండు కవితల్లోనూ కాల స్పృహ ఉంది. ఒకరు మెటికలు విరిచే కాలం గురించి ప్రస్తావిస్తే, మరొకరు యేరులా జారిపోయే కాలాన్ని చూపుతారు. అక్షరాలతో ఆకృతులను – కృతులను సృష్టించడంలో కవులిద్దరూ సఫలులయ్యారు.
వైదేహి గారి శైలి, ఇంద్రాణి గారి ఒరవడి భిన్నమైనవి. సాదా సీదా పలుకులు ఒకరివైతే, గంభీర గళం మరొకరిది. ఒకరు పద చిత్రాల రంగవల్లులు వేసుకుంటూ పోతే, మరొకరు గొబ్బెమ్మలు, పూలతో ముగ్గులు వేస్తారు. ఇద్దరిరి కవితల్లో కనిపించే మరో గుణం క్లుప్తత! కవితాత్మను రక్షించుకుంటూ, వ్యర్థ పదాలు లేకుండా కవితను నిర్మిస్తారిద్దరూ!
అటు చూస్తే బాదం హల్వా
ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ
లాగా – ఈ రెండు కవితలు రెండు చెవుల్లో గింగిరాలు తిరుగుతూ, రెండు కళ్ళలో నిల్చిపోయాయి.
కవులిద్దరికీ హృదయపూర్వక అభినందనలు. రానున్న రోజుల్లో మరిన్ని మంచి కవితలతో పాఠకులను అలరిస్తారని, కవిత్వమంటే భయపడే నాలాంటి వారి భయాలను పోగొడతారని ఆశ, ఆకాంక్ష!