మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు – 2

సాహిత్యంలో కవులను గురించి మాట్లాడేటప్పుడు ఇంతకు ముందు వ్యాసంలో వాళ్ళు వాళ్ళ పాఠకుల వల్ల పొందిన జీవిత స్వరూపాల గురించి చెప్పాను. ఈ దృష్టితో చూస్తే కవులు వాళ్ళ పాఠకుల చేత రూపొందించబడతారు అని సూచించాను. ఇప్పుడు, కవి తనను గురించి తానేమనుకున్నాడో ఆ సమాచారం గురించి మాట్లాడతాను.

వ్యాసుడు, వాల్మీకి, వాళ్ళను గురించి వాళ్ళు ఏమనుకున్నారో మనకు తెలియదు. వాళ్ళు మామూలు మనుషులు ఎలాగూ కారు. వాళ్ళకి దేవతలతో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. వాళ్ళు చెప్పే కథలో వాళ్ళు పాత్రలు కూడా. అందుచేత వాళ్ళను గురించి వేరే రకంగా చర్చించాలి. కాని, తెలుగు సాహిత్యంలో చరిత్రకు అందే కాలంలో జీవించారని, వాళ్ళు మనలాటి వ్యక్తులే అని, గొప్ప శక్తిమంతులు కావచ్చు కాని, వాళ్ళకీ మనలాంటి చావు పుట్టుకలు ఉన్నాయని, తెలిసిన వాళ్ళ గురించి మాట్లాడదాం.

ఈ కవులందరికీ తాము రాసిన కావ్యాలకి తామే కర్తలమని తెలుసు. వాళ్ళు ఆ మాట స్పష్టంగా చెప్పుకున్నారు కూడా. నన్నయ మొదలుకొని ఆ మార్గంలో రచనలు చేసిన వారందరూ కావ్యాదిని, ప్రతీ ఆశ్వాసానికి చివర, తాము గద్య ఒకటి రాసుకున్నారు. ఈ పద్ధతికి మార్గం పెట్టినవాడు నన్నయే. ఆయన ప్రతీ ఆశ్వాసాంతంలోను రాసుకున్న గద్య ఇది:

ఇది సకలసుకవిజనవినుత నన్నయ భట్ట ప్రణీతంబైన శ్రీమహాభారతంబునందు…

ఇదే గద్య తిక్కన దగ్గర కొచ్చేసరికి ఆయన తనను గురించి మరి కాస్త ఎక్కువ చెప్పుకున్నాడు:

ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధనవిరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబైన…

నన్నయ తన తల్లిదండ్రుల పేర్లు చెప్పుకోలేదు. తిక్కన తన తండ్రి పేరు చెప్పుకున్నాడు. ఆయన కొమ్మనామాత్యుడట. ఇక్కడ నుంచి మొదలు పెట్టి క్రమక్రమంగా ఈ సంప్రదాయం లోనే రాసిన కవులను గురించిన గద్యలు చూస్తే తరువాతి ప్రతివాళ్ళూ తమను గురించి మరి కొంచెం ఎక్కువ చెప్పుకున్నట్లు కనిపిస్తుంది.

ఈ వరసలో ఒక పెద్ద మార్పు తిక్కనే నిర్వచనోత్తర రామాయణంలో చేశాడు. నన్నయ భారతంతో మొదలు పెట్టి తిక్కన భారతం లోను, ఇంకా తరువాత గాను, ఏర్పడిన పద్ధతి ఏమిటంటే కవి తన గ్రంథాన్ని ఒక కృతిభర్తకు అంకితం ఇవ్వడం. ఆ కృతిభర్త కవిని తన ఆస్థానానికి పిలిపించుకొని (లేదా తిక్కనకు జరిగినట్టుగా కలలో కనిపించి) తన పేర ఫలానా పుస్తకం రాయమని పురమాయించి, తాంబూల జాంబూనదాలు (అంటే బంగారం) ఇచ్చి సత్కరిస్తాడు. కవి అదే పరమార్థమనుకొని ఆ తాంబూలం గ్రహించి ఇంటికి వెళ్ళి ఒక సుముహూర్తంలో తన కావ్య రచన ప్రారంభిస్తాడు. ఆ కావ్య రచనకు ముందు ఉపోద్ఘాతంగా కృతినాయకుని వంశావతారం వర్ణిస్తాడు. ఆ వరసలో కావ్యాన్ని కృతినాయకునికి వినిపిస్తున్నట్టుగా రచిస్తాడు. అంటే మొదట్లో కృతినాయకుణ్ణి సంబోధించి తన కథ వినమని చెప్పి, ప్రతి ఆశ్వాసం చివర మళ్ళా ఆయనను సంబోధించి ఆశ్వాసం అయిపోయిందని చెప్పి, తరవాతి ఆశ్వాసం మొదలు పెడతాడు.

ఈ పద్ధతి తిక్కన తన నిర్వచనోత్తర రామాయణంలో మార్చాడు. అందులో ఆయన తన కృతిభర్తను సంబోధించడు. అంటే ఆయనకు తన కావ్యాన్ని వినిపించడు. ప్రతి ఆశ్వాసం మొదట్లోనూ తన కృతిభర్త పేరు చెప్తాడు ఒక పద్యంలో. మళ్ళా ఆశ్వాసం చివర కృతిభర్త గురించి ప్రథమ పురుషలో కొన్ని పద్యాలు రాస్తాడు. అంటే తన కావ్యం కృతిభర్తకు వినిపించడం లేదన్న మాట.

ఈ పద్ధతి 16వ శతాబ్దిలో పింగళి సూరన వరకూ ఎవరూ మళ్ళా అనుసరించలేదు. అంటే ఆ రకంగా అంకితం ఇచ్చే పద్ధతి తిక్కన కాలానికి ఎవరికీ అనుకూలం కాలేదు. దీనికి కారణాలు తరువాత వెతుకుదాం. కాని పింగళి సూరన్న ఈ పద్ధతిని అనుసరించడంలో ఒక కొత్త మార్గాన్ని కూడా మొదలు పెట్టాడు. తన పుస్తకానికి పీఠికలో ఆయన రాసిన ఈ పద్యం చూడండి.

జనముల్మెచ్చగ మున్రచించితి నుదంచద్వైఖరిన్ గారుడం
బును శ్రీరాఘవపాండవీయముఁ గళాపూర్ణోదయంబున్మఱి
న్దెలుఁగున్ గబ్బము లెన్నియేనియును మత్పిత్రాది వంశాది వ
ర్ణనలేమిన్ బరితుష్టి నా కవి యొనర్పంజాల వత్యంతమున్

(నేను పూర్వం గరుడపురాణం, రాఘవపాండవీయం, కళాపూర్ణోదయం ఇంకా చాలా తెలుగు పుస్తకాలు జనం మెచ్చేటట్లుగా రాశాను. కానీ వాటి వేటిలోనూ మా వంశం గురించి నేను ఏమీ చేప్పుకోలేదు. అందుచేత నాకవి తృప్తిగా లేవు.)

అంతకు ముందు పుస్తకాలలో కవులెవరూ తమ కుటుంబాన్ని గురించి చెప్పుకోలేదు. తమను గురించీ తాముగా ఎక్కువ చెప్పుకోలేదు. వంశ వర్ణనంతా కృతిభర్త వంశాన్ని గురించే. అంటే కవి ఒకరకంగా తెర వెనుక ఉండిపోయాడు. అందుకే వాళ్ళ తల్లితండ్రుల గురించి వాళ్ళ జీవితాలని గురించి మనకు చాలా తక్కువ తెలుసు. ఆ పద్ధతిని మారుస్తున్నాడు పింగళి సూరన్న.

సూరన్న ప్రభావతీప్రద్యుమ్నం తన తండ్రికి అంకితం ఇచ్చాడు. అధ్యాయం మొదట వాళ్ళ తండ్రి గురించి ఒక మాట ఉంటుంది. అది సంబోధన కాదు. అధ్యాయం చివర మళ్ళా మరొక మాట ఉంటుంది. అదీ సంబోధన కాదు. అంటే సూరన్న తన కావ్యాన్ని అతని తండ్రికి వినిపించలేదు. ఆయన పేరు మొదట్లోనూ, చివర్లోనూ రాశాడు, అంతే. ఒక రకంగా చూస్తే ఈ కాలంలో కవులు, రచయితలు తమ పుస్తకాలని అంకితం ఇచ్చే పద్ధతి సూరన్నే మొదలు పెట్టాడన్నమాట. ఇప్పుడు, పుస్తకం లోపల పేజీలో కవి తన గురువుగారికో, భార్యకో, భర్తకో, ప్రియురాలికో, స్నేహితుడికో, ఇంకా మేలు చేస్తే వేంకటేశ్వరస్వామికో అంకితం ఇస్తున్నట్టు ఒక మాట ఉంటుంది. పింగళి సూరన్న చేసిందీ ఇదే.

ఇది నా పుస్తకం సుమా! నా పేరుతో గుర్తు పెట్టుకోండి! నా జీవిత చరిత్ర ఇది. ఇలాంటి పింగళి సూరన్న ఈ పుస్తకం రాశాడు. నా జీవితానికి మీరు చిలవలు పలవలు చేర్చి కథలు కల్పించకండి — అని చెప్పాడన్నమాట. కవి చరిత్ర నిర్మాణంలో ఇది పెద్ద మార్పు. కవి కథగా కాకుండా, కవి వ్యక్తిగా గుర్తుంచుకోబడాలని కోరుకుంటున్నాడన్నమాట. కాని, సూరన్న ఊహ వాస్తవంగా అమలు లోకి వచ్చే అవకాశం అప్పట్లో రాలేదు. సూరన్న గురించి చాటుప్రపంచంలో కథలూ పద్యాలు ఏర్పడ్డాయి.

దాదాపు ఇదే సమయంలో, అంటే ఉజ్జాయింపుగా పదహారవ శతాబ్దిలో, కవులకి తమ పుస్తకాలు తమ ఆస్తి అని, అవి ఇంకెవరన్నా దొంగిలిస్తే అది గ్రంథచౌర్యం అని ఒక కొత్త ఊహ ప్రారంభమైనట్టు కనిపిస్తుంది. చౌర్యం అంటే ఒకరు విలువైనదిగా పరిగణించే వస్తువుని ఇంకొకరు అనుమతి లేకుండా తీసుకోవడం అని అర్థం. గాలికి, నీటికి ఎవరు చౌర్యం ఆపాదించలేదు – ఇప్పటి కాలం వరకూ; అవి అమ్ముకోవడానికి వీలైన వస్తువులు కావు కాబట్టి. గ్రంథచౌర్యం అనే ఊహ పదహారవ శతాబ్దంలో వచ్చిందంటే అప్పుడు కవి తన గ్రంథాల వల్ల డబ్బు చేసుకుంటున్నాడని అర్థం. ఉదాహరణకి, పెద్దన తన మనుచరిత్రలో మొదటిసారిగా గ్రంథచౌర్యం గురించి ప్రస్తావిస్తాడు.

భరమై తోఁచు కుటుంబరక్షణకుగాఁబ్రాల్మాలి చింతన్నిరం
తరతాళీదళసంపుట ప్రకర కాంతారంబునం దర్థపున్
దెరవాటుల్ దెగికొట్టి తద్‌జ్ఞ పరిషద్విజ్ఞాత చౌర్యక్రియా
విరసుండై కొఱతం బడున్ గుకవి పృధ్వీభుత్సమీపక్షితిన్

(కుకవి కుటుంబాన్ని పోషించుకోలేక, ఇంకొక దారి తోచక, తాళపత్ర గ్రంథాలు అనే అడివిలో అర్థాన్ని దొంగిలించి, రాజసభలో ఆ సంగతి గ్రహించిన పండితులు తన దొంగతనాన్ని పట్టుకుంటే సిగ్గుపడి రాజు చేత ఆయన సమీపం లోనే కొరత వేయబడి శిక్షించబడతాడు.)

పెద్దన దృష్టిలో కుకవి అంటే ఎవరంటే, ఎవరికీ తెలియని తాళపత్ర గ్రంథాల లోంచి పద్యాల అర్థాన్ని సంగ్రహించి తన పద్యాలుగా రాసుకొని పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నించేవాడు. ఇది ప్రబంధాలలో గ్రంథచౌర్యానికి మొదటి ఉదాహరణ.

ఇంతకన్నా మరీ స్పష్టంగా దాదాపు ఆ కాలం వాడే అయిన అన్నమాచార్యులు తన కీర్తనల లాటి కీర్తనలే ఇంకెవరో రాసి ప్రచారం చేసుకుంటున్నారని గమనించి వాళ్ళని చాలా తీవ్రంగా మందలిస్తాడు. వాళ్ళని ఛాయాపహారులు అంటాడు. అంటే తన కీర్తనల పద్ధతిని దొంగలించినవాళ్ళు అని అర్థం.

ఈ కాలంలో ఈ కవులు తమ పుస్తకాల వల్ల డబ్బు సంపాదించుకుంటున్నారు అని నమ్మకంగా చెప్పవచ్చు. పెద్దన కృష్ణదేవరాయల ఆస్థానంలోనూ అన్నమయ్య తిరుపతిలో దేవుడి ఆస్థానంలోనూ తగుపాటి డబ్బు సంపాదించుకున్నారని మనకు తెలుసు.

గ్రంథచౌర్యం, గ్రంథం ఆస్థిగా పరిగణించబడే కాలం జమిలిగా ముడిపడి ఉన్నాయన్నమాట. ఈ గ్రంథం నాది, అని కవి చెప్పుకోవడం కేవలం తన గొప్పతనం కోసమే కాదు, తన పుస్తకం మీద మమకారం వల్లనే కాదు, అది తన ఆస్తి కాబట్టి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అని ఇప్పుడంటున్న మాట 16వ శతాబ్దం నాటికే రాజాస్థాన కవుల్లో, డబ్బులున్న దేవస్థాన కవుల్లో ఏర్పడిందన్నమాట.


18వ శతాబ్ది ప్రాంతాలలో యూరోపులో ఏర్పడిన చట్టం కొనసాగింపుగా భారతదేశంలో కూడా కాపీరైట్ చట్టం ఏర్పడింది. అయితే కాపీరైట్ అనేది తెలుగులో అమలు లోకి ఇప్పటికీ పూర్తిగా రాలేదు. పేరుకి కాపీరైట్ అనేది ఉన్నా, చట్టం దాన్ని రక్షిస్తున్నా, దాన్ని అనుసరించే వాళ్ళకన్నా ఉల్లంఘించే వాళ్ళే ఎక్కువ. కాపీరైట్ అంటే కాపీ చేసుకునే రైట్ అని హాస్యంగా అనే మాటకి తెలుగుదేశంలో ఎక్కువ ప్రచారం ఉంది. కానీ, ఈ కాపీరైట్‌ని పట్టుదలగా అమలు పరిచిన వాళ్ళు తెలుగుదేశంలో ఇరవయ్యపు శతాబ్దపు మధ్య కాలంలో నాటకాల కంపెనీల వాళ్ళు. వాళ్ళు, ఏదో ఒక నాటకాన్ని వాళ్ళ నాటకంగా వేసేవాళ్ళు. దాన్ని అనుసరించి ఇంకే నాటకాల కంపెనీ వాళ్ళైనా నాటకాలు వేస్తే, ఈ కంపెనీ వాళ్ళ ఆదాయం పోతుంది. అందుకే బలిజేపల్లి లక్ష్మీకాంత కవి హరిశ్చంద్ర, తిరుపతి వేంకట కవుల పాండవోద్యోగ విజయాలు — ఇలాంటి పుస్తకాల మీద, కాపీరైట్ చట్టం ప్రకారం ఈ పుస్తకాల రచయితలకు ఉండే హక్కులు, అవి ఉల్లంఘించే వారిపై తీసుకోబడే సివిల్, క్రిమినల్ చర్యలు, పెద్ద అక్షరాలలో రాసి వుండేవి. వీటిని అక్షరాలా ఎప్పుడైనా అమలు పరిచారా, ఎవరి మీదనైనా ఇటువంటి చర్యలు తీసుకోబడ్డాయా అనే విషయం పరుచూరి శ్రీనివాస్ చెప్పాలి. కానీ, ఇదే కాపీరైట్ అనేక ఇతర సందర్భాలలో నిరభ్యంతరంగా ఉల్లంఘించబడుతోంటే ఏ రచయిత, ఏ రచయిత్రి కోర్టుకు వెళ్ళిన దాఖలాలు లేవు. దీనికి బహుశా ఒక కారణం పుస్తకాల మీద డబ్బు చేసుకుంటున్న కవులు కవయిత్రులు ఎక్కువమంది లేకపోవడమే కావచ్చు.

ఈ పుస్తకం నాది అనే భావనకీ, ఈ పుస్తకం నా ఆస్తి అనే భావనకి మధ్య ముఖ్యమైన తేడా ఉంది. ఈ పుస్తకం నాది అనే భావన వెనకాతల, కవి ఆత్మతృప్తి, గౌరవం కావాలనే కాంక్ష, తనకు కీర్తి కావాలనే కోరిక – ఇవి ప్రధానమైనవి. ఈ పుస్తకం నా ఆస్తి అన్న ఊహకి, దీనివలన నాకు డబ్బు రావాలనే కోరిక ప్రధానమైనది.

పుస్తకం రాసిన కవులు తమను గురించి తాము ఏమనుకుంటున్నారు అన్న మాట, వాళ్ళకు గౌరవం కావాలి అన్న కోరికతో సంబంధించినది. అందుచేత కాపీరైట్ వ్యవహారాన్ని పక్కకి పెట్టి కీర్తి విషయాలనే ఆలోచిద్దాం. కీర్తి దృష్ట్యా కవి వ్యక్తిత్వానికి సామాజికమైన ఒక గుర్తింపు కావాలి. ఆ గుర్తింపు వల్ల కవులు ఒక గర్వాన్ని, ఒక తృప్తిని పొందుతారు. కావ్యం అజరామరమనీ, సూర్యచంద్రులూ, నక్షత్రాలు ఉన్నంత కాలం బతుకుతుంది అనే నమ్మకం దీనితో ముడిపడి వుంది. కావ్యం బతికినంత కాలం కవి పేరు కూడా బతుకుతుంది. దీన్నే ఇంకొంచెం పొడిగించి చూస్తే ఈ పేరుకీ స్వర్గసుఖానికీ సంబంధం ఉంది. భూలోకంలో మంచి పేరు ఉన్నంత కాలం, కవులు స్వర్గంలో ఉంటారు. ఈ నమ్మకాలన్నిటి వెనకాతల కవి తన పుస్తకానికి కీర్తి రావాలనే కోరిక చాలా బలమైనదని తేలికగా గ్రహించవచ్చు. ఇలాంటి కవి తన పుస్తకంతో పాటుగా తన పేరు కూడా నిలబడాలని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ, ఇంతవరకూ మనం గ్రహించిన విషయం ఏమిటంటే, ఈ పుస్తకం రచించిన కవి లోకంలో అది చదివే వాళ్ళ ఊహల్లో రకరకాలుగా మారి, కొండొకచో పేరు కూడా మారి గుర్తు పట్టడానికి వీల్లేకుండా పోతున్నాడు. ఒకవేళ ఆ కవి బతికి మళ్ళా వస్తే తన పుస్తకం పొందిన మార్పులు, తన జీవితచరిత్ర, తన పేరు పొందిన మార్పులు చూసి ఆశ్చర్యపోతాడు, బహుశా దుఃఖపడతాడు.

కవి అనే వ్యక్తి తన మనసులో తాను అనుకునే వ్యక్తిగా మనకి ఎప్పుడూ తోచడు. లోకం ఆ కవిని గురించి తనకు తెలిసిన ఆధారాలతో ఒక స్వరూపాన్ని నిర్మించుకుంటుంది. ఆ వ్యక్తిని లౌకిక వ్యక్తి అందాం. ఈ లౌకిక వ్యక్తి తనూ తన చుట్టుపక్కల వాళ్ళూ బతికి ఉన్నంత వరకూ ఉంటాడు. ఆ తరవాత అతనెవరో మనకు తెలియదు.

ఇంతకూ పుస్తకం రాసిందెవరు? మనం ఎరిగున్న, నిత్యమూ మనలాగా జీవించే డబ్బు సంపాదించుకునే ఇల్లు కట్టుకునే భార్యా/భర్త బిడ్డలతో కాపురం చేసే, వ్యక్తేనా అనే ప్రశ్న నిజానికి ఇంతకన్నా సూక్ష్మంగా ఆలోచించవలసిన ప్రశ్న. నేను లౌకికంగా వ్యక్తిని. నా పేరుతో సమాజం ఒక ప్రత్యేకతని ఇచ్చింది. ఆ పేరులో ఏమైనా మార్పు వస్తే, అది నేను కాదని ఇంకెవరైనా సందేహించడానికి వీలవుతుంది. ఇది చట్టం నాకిచ్చిన వ్యక్తిత్వం. నన్ను పొరపాటున నా పేరు లాంటి పేరు గలిగిన ఇతర వ్యక్తులతో కలిపేయకుండా చట్టం సవాలక్ష మార్గాలిచ్చింది. నా తండ్రి పేరు, నేను పుట్టిన ఊరు, నేను పుట్టిన తేదీ — ఇవన్నీ కలిసి ఇంకొక వ్యక్తి ఉండడానికి వీల్లేదు. ఇది నా గుర్తింపుకి ఆధారం. కానీ ఈ గుర్తింపు చట్టబద్ధంగా ఇచ్చుకున్నంత నిక్కచ్చిగా, అందరికీ లేదు. అన్ని కాలాలలోనూ లేదు. గట్టిగా రెండు వందల ఏళ్ళు వెనక్కి వెళితే, పుస్తకానికున్న రచయిత తన పేరు నాలుగైదు రకాలుగా చెప్పుకోవడం కనిపిస్తుంది. ఉదాహరణకి పాల్కురికి సోమనాథుడు అనే పేరు కనీసం ఐదు రకాలుగా వినిపిస్తుంది. మన ఆదికవి నన్నయ్య కూడా నన్నపార్యుడు, నన్నయార్యుడు, ఇలా రెండు మూడు రకాలుగా కనిపిస్తాడు. ఇక పింగళి సూరన్నని సూరపరాజు అని కూడా అంటారు. అందుచేత ఒకే ఒక వర్ణక్రమంతో మన పేరు ఉండడం ఈమధ్య కాలపు చట్టాల నిర్బంధాల వల్ల చదువుకున్న వాళ్ళలో ఏర్పడిందే. ఇకపోతే, తల్లిదండ్రుల విషయం వస్తే, మన కవులు కొందరు వాళ్ళ పేర్లు కావాలని చెప్పారు, మరి కొందరు కావాలని వొదిలేశారు. ఆ వ్యక్తుల పేర్లు కూడా నిశ్చయంగా గుర్తించడానికి వీలుగా లేవు. ఇంటి పేర్లు లేని రోజుల్లో మాదయ్య గారి మల్లన లాగా తండ్రి పేరు మీద గుర్తింపబడవలసిన వాళ్ళు తగినంత మంది కనిపిస్తారు. ఇది మామూలు మనుషులకే కాదు. పరిపాలన చేసిన రాజులకు కూడా ఇదే స్థితి. ప్రతాపరుద్రులు ఒకరికన్నా ఎక్కువమంది ఉన్నారు. దేవరాయళ్ళూ అంతే. ఈ పనిలో వ్యక్తులను నిక్కచ్చిగా గుర్తించడం ఆధునిక చరిత్రకారులకి తలకు మించిన పని అవుతోంది. ఇంతా చేస్తే, ఈ పుస్తకం నాది అని చెప్పుకున్న కవి ఆ ‘నేను’ ఎవరో కనిపెట్టడానికి కావలసిన సమాచారం ఇవ్వనూ లేదు, దాన్ని ఎలా సమన్వయించాలో మనకు తెలియడమూ లేదు. అంచేత, కవి కర్తృత్వం తాను బతికున్నంత కాలం తన ఊహ స్థిరంగా ఉన్నంతకాలం నిలబడుతుందే కాని, తరువాత దానికి తగిన గుర్తింపు వచ్చే అవసరం సమాజం కల్పించలేదు.

ఇంతకీ వ్యక్తి అనే ఊహ సమాజంలో తొలినుంచీ ఉన్నది కాదు. ఈ ఊహ క్రమక్రమంగా మారుతూ వచ్చింది. ఒకే కాలంలో రెండు రకాల ఊహలు కూడా ఉండే స్థితి సంభవించింది. ఇది దృష్టిలో పెట్టుకొని కవికి, కవి రచించిన కావ్యానికి ఉన్న సంబంధం గురించి ఆలోచిస్తే ఇదంత తేలికైన విషయం కాదని బోధపడుతుంది. కావ్యమూ స్థిరంగా లేదు, కవి పేరూ స్థిరంగా లేదు. ఈ కవి ఒకరో ఇంకా ఎక్కువమందో తెలియదు. కావ్యం ఎలా ఎప్పుడు మారిందో తెలియదు. ఈ క్లిష్టతను దృష్టిలో పెట్టుకొని కావ్యాల గురించి ఆలోచించాలి.

అయితే, కవుల జీవిత చరిత్రలు, కవులు చెప్పుకున్న మాటలతో ఆగిపోబోవడం లేదు. అచ్చుయంత్రం, ప్రచురణ సంస్థల వ్యాపార దృక్పథం, పుస్తకాలు అమ్ముకునే వాళ్ళ ప్రాబల్యం — వీటి వల్ల కవి జీవితానికి కవి ఊహించని కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. కవి లేదా రచయిత మరణించిన తరువాత ఆయన/ ఆవిడ జీవిత చరిత్రల పేరుతో పుస్తకాలు రాసేవాళ్ళు విపరీతంగా పెరిగిపోయారు. మనకింకా మన కవుల గురించిన జీవిత చరిత్రలు బలంగా లేవు. ఏవో కవి జీవితాల పేరుతో గురజాడ శ్రీరామమూర్తి, కందుకూరి వీరేశలింగం ఇంకా తరువాత ఇతరులు రాసిన పుస్తకాలు మనం చూపించవచ్చు. కాని, కవి తనను గురించి తాను చెప్పుకోవడానికి ఇష్టం లేని, ఎవరికీ తెలియకూడదనో తెలియక్కర లేదనో, పట్టుదలగా ఒదిలేసిన విషయాలని కూడా తవ్వి తీసి పెద్ద పెద్ద పుస్తకాలు రాసి, కొంచెం మోటుగా చెప్పాలంటే బోలెడు డబ్బు చేసుకుంటున్నారు ఈ మధ్య కాలపు కవి జీవిత చరిత్రకారులు.

మరీ పాత విషయాలు తవ్వి తీసి ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు కాని ఈమధ్యకాలం లోనే ప్రచారానికి వచ్చిన ఒక సంగతి ఉదాహరణగా చెప్తాను.

Willa Cather అనే ఒక అమెరికన్ రచయిత్రి ఉంది. ఆవిడ చచ్చిపోబోయే ముందు తను రాసిన ఉత్తరాలు చాలా మటుకు తగలబెట్టేసింది. అయినా, ఏవో కొన్ని ఇంకా మిగిలిపోయాయి. ఆవిడ బతికున్న రోజుల్లో తన వ్యక్తిగత విషయాలు ఏవీ ఎప్పుడూ ప్రస్తావించవద్దనీ, అవి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించినవనీ, తను రాసిన నవలలు చదివి వాటి ద్వారానే రచయిత్రిగా తన జీవితాన్ని గ్రహించాలని మరీ మరీ చెప్పింది. విలా కాథర్ 1943లో రాసిన విల్లులో తన ఉత్తరాలనన్నిటినీ ఎవరూ చూడకూడదనని నిషేధం విధించింది. ఆ ఉత్తరాలు కనిపిస్తే వాటిని వెంటనే తగులబెట్టేయమని, వాటిని ఎవరికీ చూపించద్దని తన స్నేహితులను ప్రార్థించింది. తన రచనల ద్వారానే తను తెలియబడాలని తన జీవిత చరిత్ర ద్వారా వచ్చే కీర్తి తనకు అక్కర్లేదని మరీ మరీ చెప్పింది. అయినా వినిపించుకోకుండా ఈమధ్య కాలంలో Selected letters of Willa Cather అనే పేరుతో Andrew Jewell, Janis Stout అనే ఇద్దరు రచయితలు విలా కాథర్ రాసిన ఉత్తరాలు తవ్వి తీసి ఆవిడ గురించి 715 పేజీల జీవిత చరిత్ర రాశారు. ఈ ఉత్తరాల ద్వారా విలా కాథర్‌కి ఇతర స్త్రీలతో ఏకలింగసంపర్కం ఉండేదనే విషయాన్ని చిలవలు పలవలుగా పెంచి అందువల్ల ఆవిడ నవలలు ఎక్కువ బాగా అర్థమౌతాయనే భ్రమకి ఈ రచయితలు కారణమయ్యారు. ఆవిడ సొంత విషయాలు మనకెందుకు? అందువల్ల మనకు కలిగే లాభమేమిటి? ముఖ్యంగా ఆవిడ లైంగిక జీవితంతో మనకేం పని? (డబ్బులొస్తాయనే కోరిక తప్ప.) అనే ఊహ ఆధునిక సాహిత్య విమర్శకులకు తడుతున్నట్టు లేదు. అవకాశం ఇవ్వాలే కాని, ఇప్పటి ఆధునిక రచయితల, రచయిత్రుల జీవితాలలో ఇలాంటి సమాచారం కొల్లలుగా దొరుకుతుంది; అవి ప్రచురించి అమ్ముకునే ప్రచురణకర్తలు ఏర్పడాలే కాని. ఇలాంటి జీవిత చరిత్రలు నిజంగా రచయితల, రచయిత్రుల జీవిత చరిత్రలు కావు. పుస్తకాల ద్వారానే రచయితలు, రచయిత్రులు తెలియాలి. కానీ అందుకు అవకాశం లేకుండా చేస్తోంది ఆధునిక వ్యాపార నాగరికత.

ఇప్పుడు, కవులకూ రచయిత్రులకూ రెండే మార్గాలున్నాయి. ఒకటి ఆ పుస్తకానికి పేరొచ్చి, ఆ కవికో కవయిత్రికో ప్రచారం రావడం. లేకపోతే, వాళ్ళు, వాళ్ళ పుస్తకాలు మరిచిపోబడి కాలగర్భంలో కలిసిపోవడం. ఒక వేళ మొదటి అదృష్టమే పట్టి, కవికో కవయిత్రికో పెద్ద పేరు వచ్చి ఆ పుస్తకానికి ప్రచారం ఏర్పడితే, ఆధునిక సాహిత్య విమర్శకులు వాళ్ళ జీవితాలలోని సమాచారాన్ని వీలున్నంత తవ్వి తీసి, వీలు లేనిది కల్పించి పెద్ద పెద్ద పుస్తకాలు రాస్తారు. వాళ్ళ జీవితాలలో వాళ్ళు చేసిన పనులు చేయని పనులు, ఉన్న స్నేహితులు లేని శతృవులు, వాళ్ళ శృంగార రహస్యాలు, వాళ్ళ నిజాలు, అబద్ధాలు — అన్నీ పైకి తీసుకొస్తారు. ఈ పుస్తకాలలో ఎవరికీ ఎప్పుడూ తెలియకూడదనుకున్న సంఘటనలు గురించి కూడా ప్రస్తావించి వాళ్ళ జీవితాన్ని యథార్థం కన్నా యథార్థంగా పెంచి రాస్తారు. ఇదంతా చూస్తే ఈ పని చెయ్యడానికి అవకాశం ఇవ్వని, వాళ్ళెప్పుడు పుట్టారో ఎప్పుడు చచ్చిపోయారో కూడా చెప్పని, కవులే అదృష్టవంతులనిపిస్తుంది.

ఇప్పుడు ఇక్కడ ఒక క్షణం ఆగి అసలు కవిత్వం ఎవరు రాస్తారు, ఎక్కణ్ణుంచి కవిత్వం వస్తుంది అనే ప్రశ్న కాసేపు వేసుకుందాం. కవి గాని, కవయిత్రి గాని తన మనసులోంచి వచ్చే ఊహలే కవిత్వంగా రాస్తారని కాసేపు అనుకుందాం. కానీ ఆ రాసే సందర్భంలో ఆ మనసు ఎటువంటిది, ఏ ఏ అనుభవాల రంగరింపు వలన, ఏ ఏ ఊహల గాఢత్వం వలన, తనలో ఉన్నాయని తనకే తెలియని పొరల్లోకి ప్రవేశించి ఆ వ్యక్తి, ఆడది కావచ్చు మగవాడు కావచ్చు, రచన చేస్తారు. ఆ రచన అయిపోయిన తరవాత ఆ వ్యక్తి, ఆ ప్రపంచాన్ని వదిలేసి లౌకిక వ్యక్తిగా మారిపోతారు. ఈ లౌకిక వ్యక్తికీ ఆ కవిత్వాన్ని రాసినప్పటి వ్యక్తికీ ఉన్న సంబంధం ఎవ్వరికీ ఎప్పటికీ అంతుపట్టని రహస్యం. ఆఖరికి ఆ రాసిన వ్యక్తికి కూడా. ఆ రచయిత లేక రచయిత్రి రచనా సమయంలో ఉన్న వ్యక్తిత్వాన్ని వదిలిపెట్టి లౌకిక ప్రపంచం లోకి వచ్చిన తర్వాత కూడా, ఇది నేనే రాశాను అని అనుకోడానికి కారణం, ‘నేను’ అనే ఊహ వెనకాతల, ఆ ఊహని లోకంలో వాడే అర్థాలన్నిటికీ తెలియకుండానే లంకె కలుపుకోవడం. ఇది నేనే రాశాను అనే వ్యక్తి లౌకిక వ్యక్తిగా మారిన తరువాత, ఆ రాస్తున్నప్పుడు ఉన్న నేనుగా ఉండరు. అదే గొప్ప కవిత్వంలో కవులు ఉద్దేశించారో లేదో తెలియని, తరువాత విమర్శకులకు మాత్రమే ఆర్థమయ్యే, కొత్త అర్థాలు ఉండడానికి కారణం.

నేను అనే కవిలో ‘నేను’ ఎన్నిరకాల పొరలుగా ఉండడానికి వీలుందో అర్థం చేసుకోవడానికి అవకాశం లేదు. కవితావేశమని, భావన అని, రకరకాల మాటల్లో కప్పేసినటువంటి ఈ ‘నేను,’ ఎన్ని రకాలుగా ఉండడానికి వీలుంది? అంచేత కవిత్వం రాసింది ఎవరు? మనం ఎరిగున్న, ఒక తల్లికీ తండ్రికీ పుట్టిన ఒక లౌకికమైన పేరు ఉన్న మనందరితో కలిసి మాట్లాడుతుండే, నవ్వుతుండే, దెబ్బలాడుతుండే, చిరాకు పడుతుండే ఈ లౌకిక వ్యక్తి నేను అనే మాట ఎదురు గుండా కనిపిస్తుంటారు. కానీ కవిత్వం రాసింది ఈయన కాదు. ఈవిడ కాదు. ఆ వ్యక్తిత్వాన్ని పట్టుకోవడానికి కవిత్వం లోకి వెళ్ళడం తప్ప ఇంకో దారి లేదు. ఆ పని కవి ద్వారా చేయకుండా స్వతంత్రంగా చేసుకోగలిగితే కవిత్వం ఇంకా స్వచ్ఛంగా అర్థమవుతుంది. కానీ చదివేవాళ్ళు, వాళ్ళ మనసులో పొరలు అడ్డం పెట్టుకొని, వాళ్ళ రాగద్వేషాల దారిలో కవిత్వాన్ని చూస్తే దానికి ఇంకొక దుర్వ్యాఖ్యానం వస్తుంది. అందుకనే అచ్చమైన కవిత్వం అచ్చమైన సహృదయులకు మాత్రమే అర్థమవుతుంది. ఈ బాధ్యత ఒక్క వ్యక్తి మీద పెట్టకుండా కొన్ని తరాల మనుషులు, కొన్ని సంవత్సరాల పాటు ఆ కవిత్వాన్ని చదువుతూ ఉంటే తాత్కాలిక రాగద్వేషాలు, వ్యక్తిగత వైమనస్యాలు క్రమక్రమంగా తొలిగిపోయి కవిత్వమే మిగులుతుంది అని ఒక ఆశ. అలా తరతరాల వాళ్ళు కవిత్వాన్ని చదివి చారిత్రక స్థానిక లౌకిక రాజకీయ రాగద్వేషాలకు అతీతంగా వాళ్ళకు అర్థమైన కవిని గురించి ఒక కథగా చెప్పుకుంటారు. ఆ కథే కవికి నిజమైన జీవిత చరిత్ర. వాళ్ళు చెప్పుకుంటున్న అర్థమే కవిత్వానికి నిజమైన అర్థం.

ఐతే మనం చుట్టూ తిరిగి మొదలు పెట్టిన జాగాకే వచ్చాం. కవి జీవితం అంటే పాఠకులు కల్పించుకున్న కవి కథ. దానికి చారిత్రక ఆధారాలు, తారీఖులు, దస్తావేజులు అఖ్ఖర్లేదు. వ్యాసుడు, వాల్మీకి, నన్నయ, శ్రీనాథుడు మన మనస్సుల్లో ఉన్న కథల ద్వారానే వాళ్ళు మనకు అర్థమవుతారు. వాళ్ళ కవిత్వం మనకు అర్థమవుతుంది. ఒక్కొక్కప్పుడు మనం చెప్పుకునే కథ వాళ్ళ కవిత్వం కన్నా చిన్నది కావచ్చు. అంటే మనం వాళ్ళని పూర్తిగా గ్రహించలేదన్న మాట. కాదు, అంతకన్నా పెద్దది కావచ్చు. అప్పుడు ఆ కవిత్వాన్ని మనం భూతద్దంలో చూశాం అన్నమాట. ఈ కవిని గురించి మనం చెప్పుకునే కథ కాలక్రమాన మారవచ్చు. అప్పుడు ఆ కవిత్వం మనకు కొత్తగా అర్థమయిందన్నమాట. వ్యాసుడు, వాల్మీకి వంటి కవుల విషయంలో మన ఊహ చాలా పెద్దది. ఒక వ్యక్తి జీవితంలో ఇమడడానికి వీలు లేనంత పెద్దది. వాళ్ళ పుస్తకాల అర్థం మన ఊహకు మించినంత పెద్దది కావడమే దీనికి కారణం. వాళ్ళు అనేక వ్యక్తుల సమూహం. క్రమక్రమంగా ఆధునిక కాలానికి వచ్చేటప్పటికి ఒక వ్యక్తిని గురించిన సమాచారంలో నిబంధించబడిన వ్యక్తి, అసలు కవిత్వాన్ని మింగేస్తున్నాడు. అందుచేత ఆ చరిత్రను బద్దలు చేసి, దాని అంతరాంతరంలోకి వెళ్ళి అసలు కవి ఎక్కడున్నాడో పట్టుకునే పని సహృదయులు చెయ్యాలి. అందుచేత ఆధునిక కవి, లౌకిక వ్యక్తిలో ఒక పొర. ఒక అంతరార్థ భాగం. స్ప్లిట్ పర్సనాలిటీ అని మానసిక శాస్త్రజ్ఞులు చెప్పేటట్టు చూస్తే లౌకిక వ్యక్తిలో ఒక ఖండం, ఒక ముక్క.

ఇంతకీ కవి అంటే ఎవరూ మనకు కవిత్వం ద్వారా తెలిసే కథ మాత్రమే. అందుచేత కవులందరూ కథలే.

రచయిత వెల్చేరు నారాయణరావు గురించి: వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌‍లో కృష్ణదేవరాయ చైర్‌ ప్రొఫెసర్‌‍గా పాతికేళ్ళపైగా పనిచేశారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, పరిశోధనాపత్రాలు రాశారు. ఆయన రాసిన సిద్ధాంతగ్రంథం "తెలుగులో కవితా విప్లవాల స్వరూపం" తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఒక మైలురాయి. పాల్కూరికి సోమనాథుని సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులోని శ్రేష్టసాహిత్యాన్ని (Classicsను) అనువదించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న వెల్చేరు నారాయణ రావు  ఎమరి యూనివర్సిటీ నుంచి పదవీవిరమణ అనంతరం ఏలూరు దగ్గర నివసిస్తున్నారు. ...