రైలు స్టేషన్లోకి ఒచ్చి ఆగింది. చీకటిలో దాక్కున్న చెట్లనుంచి రాలి పడిన తడి ఆకులు, గాలికి ఎగిరిపడి వెళ్ళి రైలు పెట్టెలకు అతుక్కుపోయాయి. స్టేషన్ మాస్టర్ చేతిలో వున్న లాంతరు పైకెత్తి ఒక్కొక్క డబ్బాలోకి చూస్తూ స్టేషన్ పేరు గట్టిగా అరిచి చెప్తున్నాడు. అతనికి వచ్చిన సమాచారం ప్రకారం ఈ రైల్లో ఒకే ఒక్క పాసెంజరు రావాలి.
ఆ వొక్క పాసెంజరూ దిగగానే, ఆమె దగ్గర టికట్టు తీసుకొని లాంతరు పైకెత్తి ఆమె మొహం లోకి చూశాడు. ఆమె కూడా అతని మొహం లోకి చూసి, అతని గొంతు గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించింది. ఒకప్పుడామెకి ఈ స్టేషన్లో అందరూ తెలిసినవాళ్ళే. స్టేషన్ మాస్టర్‌కి కూడా ఈ వూరి వాళ్ళందరూ బాగా పరిచయం. ఈమెని మాత్రం ఎప్పుడూ చూసిన జ్ఞాపకం రాలేదతనికి.
తన ఉత్తరం ఇంటికి చేరి వుంటే స్టేషన్ బయట తన కోసం ఎవరైనా గుర్రబ్బండిలో ఎదురు చూస్తూ వుండి వుండొచ్చు, అనుకుందామె ఆశగా. స్టేషన్ బయటకు వచ్చింది. అనాథలా ముడుచుకొని వణుకుతూ పడుకుని ఉన్న ఒక కుక్క తప్ప ఇంకేమీ కనిపించలేదు. వీధి చివరివరకూ చూపు సారించి చూసింది. మనుషుల అలికిడి లేదు కాని, నది ఒడ్డున వున్న చెట్లలోంచి దూసుకొస్తూ గాలి గుయ్యిమంటోంది. ఊరంతా నిద్రపోతున్నట్టుంది. ఒకవేళ స్టేషన్ మాస్టర్ దగ్గర తనకోసం వచ్చిన సందేశం ఏదైనా వుందేమో! ఆమె మళ్ళీ స్టేషన్ లోపలికి నడిచింది. ఆఖరి రైలు వెళ్ళిపోయింది కాబట్టి ఆఫీసుకి తాళం పెట్టి ఇంటికి బయల్దేరే ప్రయత్నంలో వున్నట్టున్నాడు స్టేషన్ మాస్టర్. ఆమె వంక ప్రశ్నార్థకంగా చూశాడు. అంటే అతని దగ్గర తనకోసం ఏ సందేశమూ లేదన్నమాట. వచ్చిన తరవాత ఏదో అడగాలి కాబట్టి టైం ఎంతయిందని అడిగిందామె.
మళ్ళీ స్టేషన్ బయటికొచ్చి, చలికి వొణుకుతూ కోటుని దగ్గరగా లాక్కుంది ఒంటి చుట్టూ. గాలికి వాన కూడా తోడైంది, కానీ ఆమె దగ్గరవున్న చిన్న గొడుగు గాలి ధాటికి తట్టుకోలేక ఓటమి ఒప్పుకుంది. చీకటీ, గాలీ, వానా ఆమె ముందు అనంతంగా పరుచుకొని, ఆమెని కొంచెం భయపెట్టాయి. అక్కణ్ణించి తన వూళ్ళోకి వెళ్ళాలంటే మూడు మైళ్ళు డొంకదారిలో ఈ వానలో నడవాలి. అయినా తను పుట్టి పెరిగిన ఊరు ఇది. తనకు అంగుళం అంగుళం తెలుసు.
నిద్రపోతున్న వీధిలో, చివరి దాకా ఎటువంటి సవ్వడీ లేదు. వీధి చివర ఒక దుకాణంలో చిన్న దీపం వెలుగుతుంది, చిన్నగా సమ్మెటలతో మోదుతున్న చప్పుడు. ఇవాళ వాళ్ళు రాత్రంతా పని చేస్తారు, ఆమె గుర్తు చేసుకుంది. ఎవరికోసం పని చేస్తున్నారో అంత శ్రమ పడుతూ? తనకు తెలుసా వారెవరో? చీకట్లో ఇప్పుడు తన నడక గుర్తొచ్చి ఆమె గబగబా ముందుకు నడిచింది. ఆమె నడుస్తున్న బాట ఒంకర టింకరగా తిరిగి మళ్ళీ రైలు పట్టాల దగ్గరకొచ్చింది. క్షణం సేపు నిలబడి, గాలినీ వాననీ చీల్చుకుంటూ పరుగు తీస్తున్న రైలు వైపు చూసింది. నిప్పుకళ్ళ రైలు వాన నీటిని ఉమ్మేస్తోంది. పరుగెడుతున్న రైలు వేగం చూసి ఆమెకి నిదానంగా భారంగా సాగబోయే తన ప్రయాణం గుర్తొచ్చి చాలా అలసటగా అనిపించింది.
రైలు వెళ్ళిపోగానే ఆమె నడక వేగం పెంచింది. తుఫాను ముందరిలాటి బరువైన నిశ్శబ్దం వేలాడుతుంది గాలిలో. పైన చెట్టు కొమ్మ మీద పక్షి తన కూనలతో ఏవో జాగ్రత్తలు చెప్తూ వుంది. గాలీ, వానా చూసి బెదిరిన కూనలు అమ్మ రెక్కల కింద మరింతగా ఒదిగిపోయాయి. ఆ కువకువలకి ఆమెకి తన బాల్యమూ, దాంతో పూర్తిగా ముడిపడ్డ కన్నతల్లి గుర్తొచ్చింది. ఎవరికైనా బాల్యమంటే అమ్మేగా మరి!
చుట్టూ ఎంత చీకటి వుంటేనేం, తోవ ఎంత పొడుగు వుంటేనేం, ఆ చివర్న అమ్మ వుంటే, అనుకుందామె. ఆమె మనసులో భయాలన్నీ వీడిపోయి, మొహం లోకి నవ్వు తోసుకొచ్చింది. తనని చూడగానే అమ్మ మొహంలో ఒచ్చే నవ్వూ, సంతోషమూ గుర్తొచ్చాయామెకి. ఆ సన్నివేశాన్ని ఊహించుకుంది. అమ్మ చేతులు జాపి పరిగెత్తుకుంటూ ఒస్తుంది.
“చిన్నారీ!”
“అమ్మా!” తను ఆమె వెచ్చటి కౌగిట్లోకి ఒరిగిపోతుంది. అమ్మ పెట్టే ముద్దుల తడి ఆమె చెంప మీద అప్పుడే పడినట్టనిపించింది ఆమెకి. అసంకల్పితంగా ఆమె అడుగులు చకచకా పడ్డాయి. కొంచెం దూరం దాదాపు పరిగెత్తింది. కానీ ఎదురుగాలి ఆమెను ఎక్కువ దూరం పరిగెత్తనివ్వలేదు. ఆయాసంతో ఒగర్చుకుంటూ కొద్దిసేపు నిలబడిపోయిందామె. ఎవరో ఆమెలోని పాపాయిని, తల్లినీ ఒకేసారి నిద్ర లేపినట్టనిపించింది. ఏదో చెప్పలేని సంతోషంతో మోకాళ్ళ మీద కూలబడిపోయి మొహాన్ని ఆకాశం వైపు తిప్పి దేవుడితో సంభాషణ మొదలుపెట్టింది. ఉన్నట్టుండి ఒక మెరుపు దేవుడి స్పర్శలా ఆమె ముఖాన్ని తడిమి ఆమెను స్పృహలోకి తెచ్చింది.
మళ్ళీ అడుగు ముందుకేసింది. నాలుగడుగులు వేయగానే ఏదో అనుమానం ఒచ్చి ఆగింది – తను నడుస్తోంది సరైన దార్లోనేనా! చీకట్లో దారి తప్పలేదు కదా! నిలబడి కాసేపు ఆలోచించింది. అక్కడ, పక్షులున్న చెట్టు కింద దారి రెండుగా చీలిపోతుంది. అందులో ఒకటి ఇంటికెళ్ళేదారి. రెండోది ఎవరూ వాడని మట్టి దారి. ఒకప్పుడు అది ఎద్దుబళ్ళ కూడలికి తీసికెళ్ళేది. ఇప్పుడక్కడేమీ లేదు. రైలు వచ్చి ఆ బళ్ళను మింగేసింది. ఆమె కొండగుర్తులకోసం మెదడు మూలమూలా వెతికింది. రెండు గుర్తులు ముందు గుర్తొచ్చాయి. తమ ఇంటికెళ్ళే దారిలో ‘వంకర చెట్టు’ వుండాలి. దాని తర్వాత పెనవేసుకున్నట్టున్న రెండు చెట్లు, ‘అక్కాచెల్లెళ్ళు’ గాలి వీచినప్పుడల్లా మాట్లాడుతున్నట్టుండేవి. ఆ రెండు చెట్లనీ చూసిందా? ఏమో! గుర్తు రాలేదు. రెండో దారి ఏరు వెంటే పోతుంది. దారంతా సరుగు చెట్లూ, పైన్ చెట్లూ వుంటాయి. ఏటిగట్టున బారుగా ఆపిల్ చెట్లు, వాటితోపాటే ఆవుల మందలూ ఉంటాయి. ఒక పెద్ద మెరుపు వెలుగులో ఆమెకి తానున్న దారి తప్పిందని తెలిసిపోయింది. నిట్టూర్చి వెనుదిరిగింది. కొంచెం సేపు మళ్ళీ ఆ పైన్ చెట్ల మధ్య గాలివానలో నిలబడింది. మళ్ళీ తిరిగి అడవికి అడ్డంగా నడక సాగించింది.
ఆ చీకట్లో, గాలివానలో, ఏదో తెలియని భయం జొరబడింది ఆమె గుండెలో. చేతులు జాచి చుట్టూ వున్న గాలిని తడుముతూ మెల్లిగా అడుగులేసింది. కాళ్ళకి ఏదో మెత్తగా అడ్డు పడింది. ఉలిక్కిపడి తడిమి చూసింది. ఒకటి, కాదు, బోలెడు ఆవులూ, దూడలూ. వానకి అక్కడ ఆపిల్ చెట్ల కింద తలదాచుకున్నట్టున్నాయి. మెల్లిగా లేచి నిలబడి సర్దుకుని మళ్ళీ నడవడం మొదలుపెట్టింది. మళ్ళీ మెల్లిగా ఆ పక్షులున్న చెట్టు వైపుకు నడిచింది.
ఈ దారి వెంబడి నడిస్తే కొంచెం దూరంలో ‘వంకర చెట్టు’ కనిపించాలి. అక్కడ ఒకసారి ఒక గుర్రం బెదిరి పరుగులు తీస్తూ తననెక్కిన రౌతును ఆ వంకర చెట్టుకి గుద్దేసింది. అతను పాపం అక్కడే చనిపోయాడు. ఆ తరవాత చాలా రోజులు తనకా చెట్టుని చూస్తే ఏదో భయంతో కూడిన ఆకర్షణ కలిగేది. ఉన్నట్టుండి మెరిసిన మెరుపులో ఆమె ఆ చెట్టును చూసింది. తను సరయిన దారిలోనే ఉంది. కాని, భయంతో అడుగు ముందుకు పడలేదు. చిన్నప్పటి భయం ఆమెను నిలువరించింది. ఆ వెలుగులో ఆమెకి తనవైపెవరో గుర్రంతో దూకుతున్నట్టు భ్రాంతి కలిగి ఒళ్ళు జలదరించింది. మెరుపు-మెరుపుకీ మధ్య వున్న చీకటి విరామంలో, గాలి రొదని మించి ఎవరో పెద్ద కేక పెట్టినట్టనిపించింది. మళ్ళీ పిడుగు పడ్డ శబ్దం. “దేవుడా! నన్ను రక్షించు.” కన్నీళ్ళతో కనపడని భగవంతుణ్ణి వేడుకొందామె.
భయంతో పీచుపీచుమంటున్న గుండెని చిక్కబట్టుకుని మళ్ళీ అడుగులేసింది. కొంత దూరం తరవాత ఆ బాట ఏటివైపుకు దిగుముఖం పట్టింది. ఏటి వొడ్డునంతా ఆపిల్ చెట్లు. ఏరు హోరుతో తన్ని పారుతోంది, వరదనీళ్ళతో. ఏరు దాటి వెళ్తేగాని తన వూరు చేరుకోలేదు. అది దాటటానికి ఒక చెక్క వంతెన వుండాలి. ఆమె చీకట్లో వంతెన కోసం వెతకసాగింది.
అవతలి ఒడ్డున తనకోసం ఎవరైనా ఎదురు చూస్తూ వుంటే ఎంత బాగుండు! అని ఆశపడ్డదామె. తను క్రితం సారి వచ్చినప్పుడు, ఆ రాత్రి వాతావరణం నిర్మలంగా వుండింది. స్టేషన్ దగ్గరకి పక్కింటి అబ్బాయి వొచ్చినా, కాలువ వొడ్డున అమ్మ లాంతరు పట్టుకొని నిలబడి వుంది.
చెక్క వంతెన మసక చీకట్లో లీలగా కనిపించింది. దారి ఆ వంతెన వైపుగా సాగింది. ఆ చెక్క వంతెన రెండు గట్ల మీదా ఉన్న విల్లో చెట్లకు కట్టేసి ఉంటుంది, నీళ్ళకు పైగా. కానీ ఇప్పుడది నీటిలో ఉంది. తను నీళ్ళలోకి దిగక తప్పదు. తలెత్తి చూసింది. ఆకాశం దిగులుగా నల్లగా కనిపించింది. స్థిరంగా ఉన్న ఆమె తెల్లటి మొఖంలో తప్ప ఎక్కడా వెలుగనేది లేదు. ఆ వంతెన మీదికి అడుగేసేముందు ఆమెకి ఒక్క క్షణం తననెంతో ప్రేమించే భర్తా, కూతురూ గుర్తొచ్చారు. మనసంతా నీరైనట్టయింది. ఆమెకి వంతెన మీదకి అడుగేసే ధైర్యం రాలేదు. కానీ, అంతలోనే తన కోసం కాచుకొని కూర్చున్న తల్లి గుర్తొచ్చింది. ఆ జ్ఞాపకం ముందు వాళ్ళని విడదీసిన బంధాలన్నీ కురచగా అనిపించాయి. ఆపదలతో నిండిన ఈ ప్రయాణం బహుశా తన పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తమూనా?
మళ్ళీ ఆకాశం వైపు తలెత్తి చూసింది. అమ్మ ఎప్పుడూ చేసే ప్రార్థన గుర్తొచ్చింది. “దీవించు, క్షమించు, రక్షించు, దారి చూపు, ధైర్యమివ్వు, బలమివ్వు”.
తనూ అదే ప్రార్థన చేసి, గాలినీ వాననీ ఎదుర్కోవడానికి పెదిమలు బిగించి ఆ చెక్క వంతెన మీద కాలు పెట్టింది. నీరు ముందు మడమల దాకా వచ్చింది. కాలువ వొడ్డున విల్లో చెట్ల కొమ్మలు వంతెన మీదకి వాలి వున్నాయి. గాలికి తను కొట్టుకొని పోకుండా వుండటానికి ఆ కొమ్మలను వూతంగా పట్టుకుందామె. ఎగిరిపోతున్న టోపీని గురించి పట్టించుకోలేదు. కోటును మాత్రం వీలైనంత దగ్గరగా జరుపుకొని అడుగులేయసాగింది. కొంచెం దూరం తరవాత వంతెన పైన నీటి మట్టం పిక్కలదాకా పెరిగింది. ఆసరాగా పట్టుకున్న కొమ్మల అంచులోకి వచ్చింది. బహుశా తను వొంతెన మధ్యకొచ్చి వుండాలి. ఇంకో రెండడుగులేస్తే ఇక ఈ కొమ్మలు అందవు.
అక్కడ నిలదొక్కుకొని, ఏ ఆసరా లేకుండా నాలుగడుగులు వేయగలిగితే అటువైపు వున్న చెట్ల కొమ్మలందుకోవచ్చు. కాని, గాలికి విరబోసుకున్న జడల్లా ఊగుతున్నాయవి. అందుకోవడం కష్టం. వాటి ఆసరాతో అవతలి ఒడ్డు చేరుకుంటే ఇల్లు చేరుకున్నట్టే. వెనక్కి తిరిగి వెళ్ళిపోయే ప్రసక్తి మాత్రం లేదు. నీటి చప్పుడుకి, గాలి వేగానికీ మతి పోతున్నట్టు వున్నా సరే. అసలు అమ్మని చూడడానికి చాలా యేళ్ళ కిందటే రావాల్సింది. ఇంత కాలం అమ్మని చూడడానికి ఒక్కసారి కూడా రాకపోవడమే ఒక పాపం. తనకీ మాత్రం శిక్ష పడాల్సిందే!
ఆమె శక్తినంతా కూడ దీసుకొని అడుగు వెనక అడుగు వేసుకుంటూ ముందుకే నడిచింది. వంతెన మధ్యకి వచ్చేసరికి, నీటి మట్టమూ, వేగమూ పెరిగింది. పోనీ ఈ చెట్టు కొమ్మలని వొదిలేసి నీళ్ళల్లో కొట్టుకుపోతే, అనుకుంది ఒక్కసారి విరక్తిగా. మళ్ళీ మనసు దిటవుచేసుకొని చేతిలో వున్న కొమ్మల చివర్లను మరింత ఒడిసి పట్టుకుంది. బలంగా వూపిరి పీల్చుకొని, చిన్నప్పటిలా “అమ్మా!” అని అరిచింది.
చెట్టు కొమ్మలు పలచబడడంతో అడ్డులేని గాలి ఆమెని ఈడ్చి కొడుతూ వుంది. ఎంత అవస్థ పడ్డా అవతలి వైపు చెట్టు కొమ్మలందట్లేదు. నిరాశతో దుఃఖం వొచ్చిందామెకి. మళ్ళీ శక్తి కూడదీసుకొని చెట్టు కొమ్మలందుకునేంతలో గాలి వాటిని విడిపించింది. ఆమె పట్టులోంచి జారిపోయిన చెట్టు కొమ్మలు ఆమె మొహాన్ని గాలి విసురుకు కొరడాలలా కొట్టాయి. గాలి, చెట్టు కొమ్మలూ కలిసి ఆమె గొంతుకు ఉరి బిగించాయి.
కాలవకి రెండు వైపులా ఆ చెట్లని నాటింది అమ్మే! తనే వాటిని నీళ్ళు పోసి పెంచింది. ఇప్పుడు వాటికి తన మీద ఎందుకింత కోపం? ఆమె గాలితో పెనుగులాడుతూ నిలబడ్డంతసేపూ, నీటి మట్టం పెరుగుతూనే వుంది. నీటి చల్లదనం కంటే గాలి హోరు పిచ్చెక్కిస్తూ వుంది. విల్లో చెట్ల కొమ్మలు పిచ్చిగా ఊగుతున్నాయి. రెండడుగులు. రెండంటే రెండే అడుగులు వేయగలిగితే మళ్ళీ చెట్ల కొమ్మలు దొరకపుచ్చుకోవచ్చు, ఆశగా అనుకుందామె, జారి పడిపోకుండా నిలబడడానికి విశ్వప్రయత్నం చేస్తూ.
“అలాగా?” గాలి వికటంగా అరిచింది. ఒక పెద్ద గాలి వీచి ఆమెని అమాంతంగా లేవనెత్తి నీళ్ళలోకి విసిరేసింది. ఏ ఆధారమూ లేక ఆమె చిన్న బొమ్మలా ఎగిరి నీళ్ళలో పడింది. ఆమె పెద్ద కోటు నీళ్ళలో తెరచాపలా తెరుచుకుంది.
ఇక అన్ని ఆశలూ వొదిలేసుకున్న ఆ క్షణం ఆమెకి భర్త కోసం తను రాసి బల్ల మీద పెట్టిన వుత్తరం గుర్తొచ్చింది. అదే ఆఖరి వుత్తరమా? అప్రయత్నంగా పక్కనే తేలుతున్న విరిగిపోయిన చెట్టు కొమ్మని పట్టుకుంది. గట్టిగా అరుద్దామని నోరు తెరిచింది. కానీ, నోట్లోకి నీళ్ళు పోయి ఆమె గొంతులోంచి ఎటువంటి శబ్దమూ రాలేదు. ఇక ఆమె నిర్లిప్తంగా అన్నీ విధికి వొదిలేసింది. నీళ్ళు ఆమెని కొంతదూరం తమతో లాక్కెళ్ళాయి. అలసటతో ఆమెను ఏదో మగత కమ్మింది.
ఉన్నట్టుండి ‘వంకర చెట్టు’ పెట్టిన కేక గాలిని చీల్చుకుంటూ వచ్చింది. దానితోపాటే ఎవరిదో తీయని కంఠ స్వరం కలలోలా “చిన్నారీ” అని పిలిచినట్టనిపించింది. అంతదాకా ఎదురు లేకుండా చెలరేగిన గాలి అక్కడితో నీరసించిపోయినట్టు వేగం తగ్గిపోయింది. గాలికీ ఆమెకీ మధ్య వంకర చెట్టు అడ్డుగా నిలబడి గాలి దౌర్జన్యానికి ఎదురెళ్ళింది. ఎవరివో రెండు బలమైన, వెచ్చటి చేతులు ఆమెని ఎత్తుకెళ్ళినట్టనిపించింది. ఆ నిస్సత్తువలో కరిగిపోతూ, “ఇంతసేపూ నేను యుధ్ధం చేసింది నా స్నేహితులతో కాదు కదా” అనుకుందామె కళ్ళు మూసుకుంటూ. అంతవరకూ గంగవెర్రులెత్తించిన గాలి ఆమెకి జోల పాడసాగింది.
ఒడ్డున కూలిపోయి, నీళ్ళలోకి ఒరిగిపోయిన ఒక మహావృక్షం నీటితో, “ఇక్కడితో నువ్వాగిపోవాలి” అని ఆజ్ఞాపించినట్టు, నీరు ఎంత ప్రయత్నించినా ఆమెని ఆ మహావృక్షం నించి తప్పించలేకపోయింది. విరిగిపోయిన చెట్టు కొమ్మ ఒకటి ఆమె కోటుని కొక్కెంలా పట్టుకొని నీటి ఆటలేమాత్రం సాగనివ్వలేదు. వెచ్చటి చెట్టు చేతుల రక్షణ కవచం నించి ఆమెని తప్పించలేక నీటి ప్రవాహం తోక ముడుచుకొని వెనుదిరిగిపోయింది.
మెల్లిగా కొద్ది క్షణాలు ఆ భద్రతలో సేద తీరిందామె. మెల్లిగా శక్తి కూడగట్టుకొని చెట్టు మొదటికి చేరుకుంది. ఒడ్డుకి చేరుకున్న ఆమె గొంతులోంచి ఆనందంతో చిన్న కేక! ఇది తమ ఒడ్డే మరి! ఇప్పటిదాకా పడ్డ కష్టాలన్ని మటుమాయమైపోయాయి. ఇక్కణ్ణించి తమ ఇల్లెంతో దూరం లేదు. ఇంట్లో లాంతరు వెలుగు కనపడుతూంది కూడా.
సంతోషంతో చక చకా అడుగులేసింది, కానీ పరిగెత్తలేదు. మాతృత్వం ఆడదానికి తనని తాను రక్షించుకోవడం అసంకల్పితంగా నేర్పుతుంది. మళ్ళీ గాలీ వానా మొదలైనా, ఈసారి ఆమె వాటిని పట్టించుకోలేదు. దూరంగా ఇంట్లోంచి కనిపించే చిన్నపాటి వెల్తురులో ఆమె భయాలన్నీ పారిపోయాయి. ఇంటికి వెళ్ళి ఇదంతా అమ్మతో చెప్పాలి. గాలి వానలో తను అమ్మ గొంతు విన్న విషయంతో సహా. అమ్మ నవ్వుతుంది. తన తడి జుట్టు తుడుస్తూ, “చిన్నారీ! అదంతా కల! నడుస్తూనే కల కన్నావా?” అని వేళాకోళం చేస్తుంది. అమ్మ మాత్రం, ఎన్ని కలలు కనేదనీ!
ఇల్లు చేరుకుందామె. గేటు చలికీ వానకీ బిగుసుకుపోయినట్టుంది, అతి కష్టం మీద తెరుచుకుంది. కిందటి సారిలా అమ్మ గేటు తెరిచి వుంచలేదు. బహుశా తన వుత్తరం అందనట్టుంది. కిటికీ సందుల్లోంచి సన్నని వెలుతురు కనపడుతోంది. కుక్క మొరుగుతూ వున్నా ఎవరూ తలుపు దగ్గరికి రాలేదెందుకో. అసలు లోపల అమ్మకి కుక్క మొరగడం వినిపిస్తూందా! ఇంత హోరుగా ఈ నీటి చప్పుడేమిటి ఇంట్లో!
అప్రయత్నంగా ఆమె ఆ చప్పుడేమిటో కనిపెట్టింది. మళ్ళీ నీళ్ళ టాంకు నిండిపోయి పొంగి పారుతోంది మొక్కల్లోకి. అమ్మ గరాటును రెండో టాంకులోకి ఎందుకు తిప్పలేదో. ఎన్నిసార్లు తను లాంతరు పట్టుకొని నిలబడితే అమ్మ ఆ గరాటు బాగు చేయలేదు! లేకుంటే ఎండాకాలం నీళ్ళుండవు. ఏటినించి మోసుకొని తెచ్చుకోవాలి. అమ్మ ఎందుకు అశ్రద్ధ చేసిందో మరి! ఆమెకు ఉన్నట్టుండి వెన్ను జలదరించింది. ముందు అమ్మను చూడాలి. ఆపైన బైటకు వచ్చి గరాటు బాగుచేసుకోవచ్చు.
మళ్ళీ తలుపు తట్టింది, ఈసారి “అమ్మా” అని పిలుస్తూ.
లోపల అమ్మ తలుపు తెరిచేలోగా కుక్క మెడ నిమిరింది. “నేనొచ్చి ఎన్నేళ్ళయిందంటే, కుక్క కూడా నన్ను మర్చిపోయింది,” అనుకుందామె బాధగా. చలికి గజగజా వొణుకుతూ మళ్ళీ తలుపు తట్టింది. తలుపు ఉన్నట్టుండి తెరుచుకోవడంతో, వెలుతురు కళ్ళ మీద పడి, చేతులు అడ్డం పెట్టుకుంది కళ్ళకి. తలుపు తెరిచింది అమ్మ కాదు. ఎవరో తెలియని ఆవిడ, లాంతరు ఎత్తి పట్టుకుంది. అమ్మేదీ?
లోపల ఇంకొక ఆమె, హాల్లో సోఫాలో పడుకోని చిన్న పిల్ల వున్నారు. ఎవరు వీళ్ళు? ఇంట్లో ఎందుకున్నారు? ఇంతకీ అమ్మేదీ? ఎవరూ ఏమీ మాట్లాడలేదు. లాంతరు పట్టుకోని తలుపు తెరిచినామె దగ్గరికొచ్చి తనని కూర్చోబెట్టింది. నిద్రపోతున్న మనిషికి నిద్రా భంగం కలిగించకూడదు, అన్నట్టు వాళ్ళంతా మెత్తగా నడుస్తూ మెల్లిగా మాట్లాడుతున్నారు. ఎవరో తన పెదవుల దగ్గరకి వెచ్చగా వుండే ద్రవమేదో తెచ్చారు. యాంత్రికంగా తాగింది. ఆమె ప్రశ్నలన్నిటికీ వాళ్ళ చూపుల్లోనే జవాబులు దొరికాయామెకి.
ఇంతసేపటికి కుక్క ఆమెని గుర్తుపట్టి దగ్గరకొచ్చి నిలబడింది ప్రేమగా.
కొంతసేపటికి ఆమె లేచి నిలబడింది. తలుపు తెరిచిన స్త్రీ లాంతరు తీసుకొచ్చింది. ఆమె లేచి లాంతరు వెలుగులో అమ్మ గదిలోకెళ్ళింది. గది కిటికీలకున్న పరదాలు జరిపింది. ఏ కలలూ రాని నిద్రలో ప్రశాంతంగా వుంది, మంచం మీద పడుకోని వున్న అమ్మ మొహం, లాంతరు వెలుగులో.
బార్బరా బేంటన్ (Barbara Baynton) పంతొమ్మిదీ/ఇరవై శతాబ్దాల్లో జీవించిన ఆస్ట్రేలియన్ రచయిత్రి. ఆస్ట్రేలియాలో శ్వేత జాతీయుల బ్రతుకుల గురించి హెన్రీ లాసన్, బేంజో పాటర్సన్ భావుకత్వమూ సాహసమూ నిండిన కథలు రాస్తే, బార్బరా ఆస్త్రేలియాలో వలస స్త్రీల దుర్భరమైన ఏకాంతం గురించి రాసారు. ఆవిడ నిజానికి ఎక్కువగా రాసినట్టు లేదు. ఒక ఆరు కథలూ, ఒక నవలా కొన్ని వ్యాసాలు రాసి ప్రచురించారు. ఆవిడ జీవిత చరిత్ర గురించి అందుబాటులో వున్నవి చదివితే ఒక రచయిత్రి కన్నా చాలా వ్యవహార కర్తగా ప్రాక్టికల్ గా అనిపిస్తారు.