కొవ్వుపుంజి

అందరూ ఆయనకి నమస్కరించి బయట పడ్డారు. మధ్యాహ్నం అందరికీ చిరాకు పుట్టుకొచ్చింది. చేసేదేమీ లేక అందరూ వంటగదిలో దూరి జర్మను అధికారిని శాపనార్ధాలు పెట్టారు. ఎందుకు తమ మీద కక్ష బూనాడో అన్నది మాత్రం వాళ్ళ ఊహకందలేదు. బహుశా డబ్బు కోసమేమో! ఆ ఆలోచనతోటే అందరికీ ముచ్చెమటలు పుట్టయి. తమలో అందరికంటే ధనవంతులకి ఆపద ఎక్కువ, అలాగైతే. డబ్బు సంచులతో గుమ్మరించాల్సి వస్తుంది, ఆ జర్మను అధికారిని వదిలించుకోవటానికి. ఒకవేళ అలాటి సందర్భమే వస్తే ఏం చెప్పి తప్పించుకోవాలా అన్న ఆలోచనలు సాగాయి అందరికీ. ఎందుకైనా మంచిదని, లూసో తన ఖరీదైన గడియారాన్ని తీసి దాచేసాడు. రాత్రి దగ్గరవుతున్నకొద్దీ అందరి నిరాశా నిస్పృహలూ పెరగసాగాయి.

భోజనాలకి ఇంకా రెండు గంటల వ్యవధి వుండటంతో శ్రీమతి లూసో పేకాడదామంది. కోర్నుడెట్ కూడా తన పైపు ఆర్పివేసి ఆటలో చేరాడు. ఆటలో అందరూ కాసేపు తమ దిగులునీ, భయాన్నీ మరచిపోయారు. అయితే లూసో, అతని భార్యా తోడు దొంగలని కోర్నుడేట్ కనిపెట్టేసాడు.

సరిగ్గా రాత్రి భోజనానికి ఉప్రక్రమించబోతుండగా ఫోలెన్వీ వచ్చాడు. తన బొంగురు గొంతుతో, “ఎలిజబెత్ తన మనసు మార్చుకుందా అని జర్మను అధికారి అడుగుతున్నాడు,” అని ప్రకటించాడు. ఎలిజబెత్ మొహం పాలిపోయింది. అంతలోనే కోపంతో ఎర్రబడింది.

లేచి నిలబడి, ” ఆ దరిద్రుడు, ఆ కుక్క, ఆ నీచుడితో చెప్పు. నేను చచ్చినా ఒప్పుకోనని! అర్ధమైందా? ఎప్పటికీ! ప్రాణాలు పోయినా సరే!” అని అరిచింది.

ఫోలెన్వీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అందరూ ఆశ్చర్య పోయి, ఎలిజబెత్ చుట్టూ చేరారు. ఏం జరిగిందో చెప్పమని వేడుకున్నారు. ఆమె మొదట నిరాకరించింది. కానీ కోపం పట్టలేక పోయింది!

“వాడికేం కావాలా? ఇంకా ఏం కావాలి? ఒక్క రాత్రికి నాతో పడుకుంటాడట!”

అందరూ నిర్ఘాంతపోయారు. కోర్నుడెట్ అక్కడున్న జగ్గు తీసి నేలకేసి కొట్టాడు. అందరూ హాహాకారాలు చేసారు. కౌంటు మనుషుల్లో ఇంత నీచులుంటారా అని ఆశ్చర్యపోయాడు. ఆడవాళ్ళు ఎలిజబెత్ పరిస్థితికి సానుభూతి ప్రకటించారు. ఆమె నిర్ణయాన్ని హర్షించారు కూడా. ఆఖరికి మాటలు చాలించి అందరూ భోజనం చేసారు. ఆడవాళ్ళు తమ తమ గదుల్లోకెళ్ళి పోయారు. మగవాళ్ళు పైపు కాలుస్తూ మళ్ళీ ఏదైనా ఆడుకోవాలనుకున్నారు. ఆటలోకి వాళ్ళు ఫోలెన్వీని కూడా ఆహ్వానించారు. చిన్నగా మాటల్లో పెట్టి అతన్నించి ఏదైనా సమాచారం రాబట్టాలనుకున్నారు. కానీ అతను తన పేక ముక్కల మీద తప్ప ఇంకే ఇతర విషయాల మీదా ధ్యాస పెట్టలేదు. ఏ ప్రశ్నలకీ జవాబివ్వలేదు. ఇక అతనితో ఎంత సేపు పేకాడినా ఏమీ లాభంలేదని అందరూ ఆట ముగించి లేచారు.

మర్నాడు మళ్ళీ ఆశతో తొందరగానే లేచి కిందకొచ్చారు. ఏదో జరిగి తమ నిర్భందం వదులుతుందేమో ననే ఆశా, ఎలాగైనా ఇకణ్ణించి వెళ్ళిపోవాలనే ఆందోళనా, ఇంకొక్క రోజు ఇక్కడే వుండాల్సి వస్తుందేమోనన్న భయమూ, అన్నీ కలిపి వాళ్ళని చుట్టుముట్టాయి.

లోపలే తిరుగుతున్న గుర్రాలనీ, కట్టేసి వున్న బగ్గీనీ చూసి హతాశులయ్యారు. మళ్ళీ అలా నడుద్దామని వూళ్ళోకి బయల్దేరారు. మధ్యాహ్నం భోజనాలు కూడ నిస్సారంగా గడిచాయి. ఎందుకో అందరికీ ఎలిజబెత్‌ని చూస్తే చిరాకొచ్చింది. రాత్రి అందరూ నిద్ర పోయాక ఆమె తన నిర్ణయాన్ని మార్చుకుని జర్మన్ అధికారిని సంతోషపెట్టి తమకి విముక్తి ప్రసాదిస్తుందని రహస్యంగా ఆశ పడ్డారు. అలా జరగక పోయే సరికి ఒక రకమైన అసహనం బయల్దేరింది అందరిలో. ఆవిడ అలా చేసి ఎవరికీ చెప్పకపోయినా పర్వాలేదు కదా! అలా చేయటం వల్ల ఆమెకొచ్చిన పరువు నష్టం కూడా ఏమీ లేదు. అటువటప్పుడు అలా చేస్తే తమ సమస్య ఎంత తేలికగా తీరిపోయి వుండేది! అలా అనుకుంటున్న కొద్దీ అందరికీ కోపం పెరిగిపోయింది. అయితే అందరూ మర్యాదస్తులు కాబట్టి ఈ ఆలోచనలను పైకి అనలేదు.

మధ్యాహ్నం అందరూ అలా నడిచొద్దామని బయల్దేరారు. వాళ్ళతో ఇద్దరు సిస్టర్లూ, కోర్నుడెట్ మాత్రం చేరకుండా సత్రం లోపలే వుండిపోయారు. అందరూ వెచ్చటి స్వెట్టర్లూ, కోట్లూ తొడుక్కుని వున్నా చలి ఎముకలు కొరికేస్తుంది. ఒంట్లోని రక్తమంతా ఘనీభవించినట్టూ, ఎముకలు విరిగిపోతున్నట్టూ అనిపించే చలి! అడుగు తీసి అడుగు వేయటమే నరక యాతన లాగుంది. కొంచెం దూరం నడిచేసరికి, నిర్మానుష్యంగా వున్న వూరు, దట్టంగా కురుస్తున్న మంచూ అసలే కృంగిపోయి వున్న వారి మనసుల్ని ఇంకా కృంగ దీసాయి.

నలుగురు స్త్రీలూ ముందు నడుస్తుండగా, ముగ్గురు మగవాళ్ళూ వెనక నడుస్తున్నారు. లూసో వున్నట్టుండి, “ఈ పునీతురాలు ఇలా చేయబట్టి మనమంతా ఇక్కడ ఇంకా ఎన్నాళ్ళు చిక్కుబడిపోతామో,” అన్నాడు. కౌంటు మాత్రం తన సహజ గాంభీర్యంతో, “ఏ స్త్రీ నించైనా ఇటువంటి త్యాగం మనం ఆశించలేం! అది ఆమె నిర్ణయానికే వదిలేయక తప్పదు. అంత వరకూ మనం చేయగలిగిందేమీ లేదు,” అన్నాడు. లామడాన్, ఒకవేళ ఫ్రెంచి వారు జర్మనులకి బుధ్ధి చెప్పాలను కున్నట్టయితే ఆ యుధ్ధం ఇక్కడ టోట్స్ నగరంలోనే జరుగుతుందని అన్నాడు. ఆ ఆలోచనకే అందరికీ ఆందోళన పెరిగింది. తాము యుధ్ధంలో చిక్కుకుంటామా?

“పోనీ, కాలి నడకన పారిపోవటానికి ప్రయత్నిద్దామా?” లూసో అన్నాడు ఆత్రంగా. కౌంటు ఒప్పుకోలేదు! “కాలినడకనా? ఈ మంచులోనా? స్త్రీలతోనా? సాధ్యం కాదేమో! మనం ఒకవేళ బయల్దేరినా నాలుగడుగులు వేసేసరికి జర్మను సైనికులు మనని వెంబడించి పట్టుకుని, ఖైదులో వేస్తారు కూడా!” అదీ నిజమే అనిపించి అందరూ మౌనంగా వుండిపోయారు.

ఆడవాళ్ళూ ఏవో బట్టల గురించి మాట్లాడుకుంటున్నారు కానీ కొంచెం ముభావంగానే వున్నారు. వున్నట్టుండి వీధి చివర్న జర్మను అధికారి కనిపించాడు. తెల్లగా కురుస్తున్న మంచులో అతని పొడవాటి విగ్రహమూ, దుస్తులూ, బూట్లూ స్పష్టంగా అగుపించాయి. స్త్రీలకి తల వంచి అభివాదం చేసాడు. మగ వాళ్ళ వైపు నిరసనగా ఒక చూపు చూసి వెళ్ళి పోయాడు. వారూ అతనికి అభివాదం చేయలేదు.

ఎలిజబెత్ మొహం ఎర్ర బడింది. మిగతా స్త్రీలందరికీ అలాటి చవకబారు స్త్రీతో కలిసి నడుస్తూ అతని కంట బడటం వల్ల అవమానం ముంచుకొచ్చింది. కొవ్వుపుంజి వైపు జర్మను అధికారి చూసిన హేళనతో కూడిన చూపు వాళ్ళకి భయాన్ని కలిగించింది. అంతా అతని గురించే మాట్లాడుకోసాగారు. లామడాన్ శ్రీమతి, అతనెంతో వున్నత కుటుంబానికి చెందిన వాడిలాగున్నాడంది. చాలా అందగాడని కూడా ప్రకటించింది. అతను ఫ్రెంచి వాడై వుండి వుంటే తామందరూ అతన్ని ప్రేమించే వారిమని కూడా అన్నది.

మళ్ళీ అందరూ సత్రం లోపల చేరారు. ఎవరికీ ఏం చెయ్యటానికీ తోచలేదు. చిరాకులూ, విసుక్కోవటాలూ ఎక్కువైనయి. నిశ్శబ్దంగా అందరూ భోజనం ముగించి పడకలు చేరారు, మర్నాటిని గురించిన ఆశతో.

మర్నాడు అందరి కోపతాపాలు ఇంకా పెరిగిపోయాయి. ఆడవాళ్ళందరూ ఎలిజబెత్‌తో మాటలాడటమే మానేసారు. ఇంతలో చర్చి గంటలు మోగాయి, అందరినీ ఎవరిదో బాప్టిజంకి ఆహ్వానిస్తూ.

ఎలిజబెత్‌కి తన చిన్న కొడుకు గుర్తొచ్చాడు. అతను వెతోత్ నగరంలో ఒక రైతు వద్ద పెరుగుతున్నాడు. ఏడాదికొకసారి వాణ్ణి వెళ్ళి చూసొస్తుందామె. బాప్టిజం గంటలతో తన కుమారుడు జ్ఞాపకం రావటంతో ఎవరిదో అపరిచితుల బాప్టిజం చూడటానికి చర్చిలో కెళ్ళిందామె.

ఆమె బయటికెళ్ళటం కోసమే ఎదురు చూస్తున్నట్టు అందరూ తలుపులేసి ఒక్క దగ్గర చేరారు. ఏదో ఒకటి చేయకపోతే లాభం లేదని అర్ధమైంది అందరికీ. జర్మన్ అధికారిని ఎలిజబెత్‌ని మట్టుకు నిర్భంధించి మిగతా అందరినీ వదిలేయమని ప్రాధేయపడదాం, అన్నాడు లూసో. వెంటనే ఈ సందేశాన్ని ఫొలెన్వీతో చెప్పి అధికారి వద్దకు పంపారు. గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చాడతను. వీల్లేదన్నాడు అధికారి. వెంటనే కోపం పట్టలేని శ్రీమతి లూసో బూతులు లంకించుకుంది.

“మనమంతా ఇక్కడే ముసలి వాళ్ళమైపోయి చస్తామో ఏమో! అయినా ఈ బజారుదానికిదేం పోయే కాలం? అదేదో మహా పతివ్రత ఐనట్టు, పెద్ద నిరాకరణ. రూన్ నగరంలో అయితే బండి వాళ్ళతో సహా ఎవరినీ వదలదు కదా! నాకెలా తెలుసని అడక్కండి, నాకు తెలుసు. అక్కడ మగ పురుగుని దారంట పోనివ్వదు కానీ, ఇక్కడ పెద్ద నీతులు చెప్తుంది. కేవలం మనమీద తనకున్న శక్తి చూపించుకోవటానికే ఈ నాటకమంతా! నన్నడిగితే అసలా అధికారి చాలా మంచి వాడంటాను! మనలాటి కుటుంబ స్త్రీల జోలికి పోకుండా, అదెలాగూ బజారుదేనని దాన్నడిగాడు! మనల్నెవరైనా అడిగుంటే చచ్చేవాళ్ళం! పెళ్ళైన స్త్రీలంటే అతనికి ఎంత గౌరవమో చూడండి. మనల్నతను బలాత్కరించినా మనం చేయగలిగేదేముంది,” అంటూ ఉద్ఘాటించింది. మిగతా ఇద్దరు స్త్రీలూ వణికిపోయారు. శ్రీమతి లామడాన్ కళ్ళెందుకో మెరిసాయి. తననెవరో బలాత్కరించిన దృశ్యం ఊహించుకోవటం వల్ల కాబోలు, ఆమె మొహం ఆవిరి కమ్మింది.

మగవాళ్ళు కూడా గొంతు కలిపారు. ఎలాగైనా కొవ్వుపుంజిని కాళ్ళూ చేతులు కట్టేసైనా సరే అధికారికి అప్పగించాల్సిందేనని తీర్మానించారు. కౌంటు అలాటి మొరటుతనానికి ఒప్పుకోలేదు. తర తరాల నించీ హుందాగా బ్రతుకుతున్న రాచ వంశీయులు. వాళ్ళ పధ్ధతులన్నీ నాజూకు గానే వుంటాయి మరి!

“బలవంతం మీద పనులు జరగవు. మనం తెలివిగా ఆమెని ఒప్పించాలి,” అన్నాడాయన. అందరూ ఆలోచించి ఒక వ్యూహం పన్నారు. అందరూ గుస గుసలతో విషయాన్ని చర్చించుకున్నారు. అలాగని ఎవరూ మోటు మాటలు మాట్లాడలేదు. వాళ్ళంతా పెద్ద పెద్ద కుటుంబాల్లో పుట్టి పెరిగిన వాళ్ళు. ముఖ్యంగా ఆడవాళ్ళకి – మాటలతో సాలెగూళ్ళు అల్లటం, ఆకుకు అందకుండా, పోకకు పొందకుండా మాట్లాడటం కొత్తగా నేర్పాలా! అక్కడికెవరైనా కొత్త మనిషొస్తే వారికి ఒక పట్టాన అక్కడ చర్చిస్తున్న విషయం ఏమిటో అర్ధం కాదు. అంత జాగ్రత్తగా మాట్లాడుకున్నారు వాళ్ళు.

నిజానికి కొంత సేపయ్యాక వారికీ వ్యవహారమూ, నీతి గురించిన చర్చలూ చాలా సరదాగా అనిపించసాగింది. నేర్పరి అయిన వంట వాడు తను వండిన వంటకాలను కంటికి నదరుగా వుండేటట్టు ఎలా అమరుస్తాడో అలాగే వాళ్ళు తమ వ్యూహాన్ని అందంగా తీర్చి దిద్దుకున్నారు. ఆఖరికి అందరి మనసులూ కుదుట పడ్డవి. కౌంటు కొన్ని కొంటె వ్యాఖ్యానాలు కూడ చేసాడు. ఆయనకి లూసో వంత పాడాడు. ఆ కొంటె మాటలకి ఎవరికీ కోపం రాలేదు సరికదా, అంతా ముసి ముసిగా నవ్వారు. శ్రీమతి లూసో నిర్మొహమాటంగా, “దాని వృత్తే అది అయినప్పుడు, ఆ అధికారిని నిరాకరించటానికి దానికేం హక్కు వుందీ, అంటాను?” అని అడిగినప్పుడు అందరూ అంగీకరించారు.