“మీ కోసం ఏ.సి. ఫ్రిడ్జ్ తీసుకొచ్చాను మామా. కనియల్ ఎస్టేట్ ఓనర్ పీరు మొహమ్మదును సవేరా హోటలుకు వెళ్ళినప్పుడు చూసాను. ఆయన కొత్తగా ఇల్లు కట్టి పాలు పొంగించబోతున్నట్లు చెప్పారు.”
“ఆయనతో నీకు పరిచయం ఉందా?”
“లేదు. మీ పేరు చెప్పి ఆయన మేనల్లుడివా అని అడిగారు. ఏం చేస్తున్నావని అడిగినప్పుడు బహారైన్లో పని చేస్తున్నానని చెప్పాను. గృహప్రవేశానికి పిలిచారు. వట్టి చేతులతో వెళ్ళగలమా మామా? ఎస్టేట్ యజమాని కదా? ఆయన అంతస్తుకు తగినట్లుగా ఏదైనా ఉండాలి కదా. ఏ. సి. ని, ఫ్రిడ్జ్ ని ఆయన ఇంటి గృహప్రవేశానికి బహుమతిగా ఇచ్చి ఇప్పుడే అక్కడి నుంచి వస్తున్నాను.”
“చెయ్యాల్సిందే.”
“వెళ్ళగానే మామ కోసం పంపిస్తాను. నజీబు కోసం వాచ్ కొని పంపిస్తాను.” వేలకి వేలు మూల్యమైన వస్తువులను పంపిస్తానని చెబుతున్న వాడి దగ్గర చిన్న సహాయం కోరి వచ్చిన విషయాన్ని ఎలా చెప్పాలన్న సందేహం నా మనస్సులో. నా మౌనాన్ని చూసి అతను అంగలార్చాడు.
“ఏంటి మామా ? మౌనంగా ఉన్నారేం? మిమ్మల్ని చూడడానికి రాలేదని కోపమా?”
“లేదు బాబూ. కోపం ఉంటే నిన్ను చూడడానికి వచ్చే వాడినా?”
“వ్యాపారం ఎలా ఉంది? ఏదైనా ఎక్స్ పోర్ట్ చేస్తున్నారా?” అతని ముఖం చూస్తూ చెప్పడానికి జవాబు లేకపోవడం వల్ల మెల్లిగా చూపులు తిప్పుకున్నాను.
“ఏం? ఏదీ మాట్లాడరేం?”
“ఇప్పుడు ఏ వ్యాపారమూ లేదు బాబూ. పెద్ద ఎత్తున నష్టం వచ్చేసింది. అప్పులు తీర్చడానికి ఇంటిని, దుకాణాన్నిఅమ్మేశాను. ఏ ఆదాయం లేక ఊరికే ఉన్నాను.”
“అంత నష్టమా?”
“తలెత్తుకోలేని నష్టం.” మేనల్లుడి ముఖంలో ఉత్సాహమంతా మాయమై పోవడాన్ని చూడకుండా చూపును నేలమీదికి తిప్పాను.
“దివాలా తీసేసారా?” ప్రశ్న వెక్కిరిస్తున్నట్లుగా అనిపించినా, జవాబు చెప్పకుండా ఉండ లేకపోయాను.
“నిండా మునిగి పోయాను.”
వసారాలో చెల్లెలు నిలబడి ఉంది. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. వాళ్ళ వాళ్ళ మనస్సుల్లో ఏదేదో భావాలు పొంగుతున్నట్లు ఉంది ఆ వాతావరణం.
“మామ వచ్చిన పని?” గొంతులో ముందు ఉన్న మార్దవం ఎండి పోయినట్లనిపించిది. రాకలో గల నిజమైన ఉద్దేశాన్ని దాచిపెట్టి ఊరికే వచ్చానని చెప్పడానికే నాలిక పైకి లేచింది. మనసులో పొంచి ఉన్న మాట అదాటున నాలుక మీది నుంచి జారింది.
“చిన్న సహాయం కోసం..”
“ఏమిటా సహాయం?” ఇప్పుడు గొంతులో గరుకుతనం నిర్మొహమాటంగా కనబడింది.
“నజీబుకు రేపు ఫీజు కడితే గాని పరీక్షలు రాయలేడు. ఆఖరు ఏడు. డబ్బు కట్టక పొతే అతని చదువు పాడై పోతుంది. అతను చదివి ఏదైనా ఉద్యోగానికి వెడితే తప్ప..”
“చదివి ఏం చేస్తాడు? అతన్ని ఏదైనా దుకాణంలో పనికి పెట్టొచ్చు కదా?” ఏమని చెప్పాలో తెలియని దిగ్భ్రమలో అలాగే నా తల క్రుంగి పోయింది. అతనికి చదువు చెప్పించిన అపరాధానికి కోర్టులో విచారణ ఖైదీలాగా తలదించుకుని కూర్చున్నాను.
“ఏం సహాయం కావాలి?” ఒక పోలీస్ అధికారి యొక్క గద్దింపు లాగే వినబడింది.
“ఒక 725 రూపాయలు దొరికితే ..”
మేనల్లుడు జవాబు చెప్పలేకనో, మాటలు రాక పోవడం వల్లనో, కుషన్ సోఫాలో కూర్చున్న వాడల్లా బూట్సు కాళ్ళని అద్దపు టీపాయ్ మీద ఎత్తి పెట్టి, గోళ్ళు కొరక సాగాడు. ఎదురు చూడని మేనమామ పతనం చెవులకి సోకిన షాక్ లో మనసు విరిగి పోయి కూర్చున్నట్లుగా అనిపించిది.
“బాధ పడకు బాబూ. కష్ట సుఖాలను ఇచ్చేది ఆ దేవుడు. ఇచ్చిన వాడు తీసుకుంటే బాధ పడడానికి ఏముంది?” అతన్ని ఓదార్చడానికి ప్రయత్నించాను.
“మామా!”
“ఏంటి బాబూ.” తలెత్తి చూసాను. అతని తల్లి కళ్ళు అతనితో మాట్లాడడం గమనించనట్లు ఉండిపోయాను. ఈ రోజు ఆ కళ్ళు ఇలా మాట్లాడడానికే కాబోలు ఆ రోజుల్లో ఆమె కళ్ళలో పడిన ధూళిని, మట్టిని ఊది తీశాను.
“మునుపటి లాగా లేదు ఇప్పుడు అరబ్బు దేశం. ఎండలో పడి కుక్క లాగా పాట్లు పడితేనే ఇంటికి కడుపుకోసం కొంచం పంపించగలం. మునుపటి లాగా జీతాలు ఇవ్వడం లేదు. జీతాలని బాగా తగ్గించేశాడు ఆ అరబ్బువాడు.”
మేనల్లుడు తన శ్రమ విషాద గాధను చెప్పి ముగించగానే చెల్లెలు గుమ్మానికి ఉన్న తెరను లాగి లోపలికి వెళ్ళి పోయింది. నా మనసులో వ్యాపించి ఉన్న చీకటి వెలుపల కూడా వ్యాపించి ఉన్నదని అప్పుడే గ్రహించాను.
“ఏమైనా తిన్నారా?”
“మీ ఉమ్మా టీ నీళ్ళు, కేకు ముక్క పెట్టింది. దాంతోనే కడుపు నిండి పోయింది.”
“8.30కి ఆఖరి బస్సు.”
“వచ్చేటప్పుడే బస్సు టైమింగ్ వివరాలు తెలుసుకుని వచ్చాను బాబూ.”
బస్సు దిగి చీకట్లో నడవసాగాను. ఇంటి కిటికీ చువ్వల గుండా మూల్గుతున్నట్లు వెలుగుతున్న బుడ్డిదీపం వెలుతురు నడవలో గడ్డి పొదరు మీద పడుతోంది.. అడుగుల శబ్దం వింటూనే నజీబు తానే స్వయంగా వచ్చి తలుపు తీసాడు. అతని వెనకాలే వచ్చిన నా భార్య ఆతృతను అణచుకోలేనట్లుగా అడిగింది.
“మేనల్లుడు ఏ ఏ వస్తువులను ఇచ్చాడేమిటీ?”
“బావ డబ్బు ఇచ్చాడా?”
ప్రశ్నలు బాణాలుగా గుండెను తాకుతున్నాయి. చేతిలో పట్టుకెళ్ళిన గొడుగు మాత్రమే ఉండటం చూసి భార్య నీరస పడిపోయినట్లుగా అయ్యింది.
“వాప్పా!” అతల పాతాళంలో నిలబడి కాపాడమని కాపాడమని దీనంగా వేడుకుంటునట్లు ఉంది నజీబు పిలుపు.
“ఆ రోజుల్లో ఆఖరి పరీక్షకి కట్టడానికి అరవై రూపాయలు ఇచ్చే వాళ్ళు లేక నీ వాప్పా చదువు ఆగి పోయింది నీకు తెలియదు. నాకూ అదే అనుభవం. ఇప్పుడు అదే నీకు. రేపు నీ కొడుకు చదువు ఇలాగే మధ్యలో ఆపేయాల్సిన సందర్భం ఎదురైనా నువ్వు అలసి పోవద్దురా. ఇదంతా కాలం చేస్తున్న ఆవర్తనం.”
భార్యా, కొడుకు నిద్రపోయారా లేక నిరాశాభారంతో కన్ను మూయకుండా అలాగే ఉన్నారా అని కూడా గమనించలేని మనస్థితి. ఏది ఎలాగైనా వాళ్ళకి తెల్లవారుతుంది. నిద్రపోని నా కళ్ళు అద్దపు షోకేసు వేపు మళ్ళాయి. అక్కడ నా శత్రువు చేతిలో ఉన్న పదునైన కత్తిలా మిలమిలా మెరుస్తూ ఉంది పెర్షియా సబ్బు రేపర్!
తోప్పిల్ మహమ్మద్ మీరాన్ 1944లో తేంగాయ్ పట్టణం అన్న గ్రామంలో జన్మించారు. మాతృ భాష తమిళమే అయినా చదువు మలయాళంలో సాగింది. జీవితపు అనుభవాలు ఆయన రచనలలో ప్రధాన ఇతివృత్తాలుగా ఉంటాయి. 1997 లో ‘సాయ్ వునార్కాలి’ (Easy Chair) అన్న నవలకి సాహిత్య అకాడమి పురస్కారం లభించింది. అంతరంగపు వ్యక్తీకరణ రచనలో ప్రతిబించడం వీరి శైలి యొక్క విశిష్టతగా పేర్కొన వచ్చు.