ఇంట్లో ఒక వారంగా మౌనం ఆవరించుకొని ఉంది. ఎవరి ముఖంలోనూ సంతోషం కనబడలేదు. నజీబుకి ఆఖరు సంవత్సరం. పరీక్ష ఫీజు ఎలా కట్టాలి అన్న ప్రశ్న అందరి ముఖంలోనూ. 725 రూపాయలు కట్టాలని నజీబు కాలేజీనుంచి వచ్చి చెప్పిన సాయంత్రమే మనసు క్రుంగిపోయి నట్లయింది.
ఇంత పెద్ద రొక్కాన్ని ఎలా ప్రోగు చేయగలను?
డబ్బు సమకూర్చే ప్రయత్నంలో ఓడిపోయి, ఒక వారంగా రాత్రిళ్ళు నిద్ర పోలేదు. ప్రొద్దున్న లేవగానే బయటికి వెళ్ళి ఎవరెవరినో అప్పు అడిగి, తిరిగి తిరిగి వేసారి ఇంటికి వచ్చి చేరి, ఉసూరుమంటూ కూర్చునే అవకాశం కూడా దొరకలేదు. భార్య పెట్టే నస భరించలేక ఇంట్లోనుంచి బయలు దేరి ఎప్పుడూ వెళ్ళే సందులో నుంచి నడవసాగాను. పోగొట్టుకున్న వాటిని గురించిన ఆలోచనలు ఎప్పటిలాగే. భార్య మాటల్ని విని భరించి, కాస్సేపు కూర్చుని ఉండలేకపోయానే అన్న బాధ ఒకటి. చేపలు కొని తెమ్మని ఒకటే సణుగుడు. బజారులో చేపలు విచ్చలవిడిగా దొరుకుతున్నాయట. ధర కూడా చాలా తక్కువేనట. చేపలు వండి చాలా రోజులయ్యిందట. రూపాయికి ఇరవై ఇస్తున్నారట!
ఎండ అంత తీవ్రంగా లేదు. ఎప్పుడూ తీసుకునే గొడుగును కూడా తీసుకోలేదు. కావాలనే తీసుకోలేదని కాదు. నస భరించలేక మరిచిపోయిన కొన్ని విషయాల్లో గొడుగు కూడా ఒకటి. ఎలాగైనా ఆమె నుంచి తప్పించుకుంటే చాలని బయట పడటం.
సముద్రపు తీరానికి వెళ్ళే సందు కొస తిరగగానే చాలు బాబోయ్ అన్నట్లు సుగంధ పరిమళం వచ్చి ముక్కు పుటాలని తాకింది. నిలబడి ఆఘ్రాణించకుండా అడుగు ముందుకు వెయ్యడానికి మనస్సు అంగీకరించలేదు. ఏ వైపు తిరిగినా విదేశానికి చెందిన పరిమళం వల్ల ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉన్నట్లు అనిపించింది. ఈ ఉక్కిరిబిక్కిరి అంతా ఈమధ్యనే వచ్చి చేరింది: ఊళ్ళో పనీ పాటా లేకుండా ఉన్న వాళ్ళంతా సముద్రాన్ని దాటడం ప్రారంభించిన తరువాతనే. భార్యకీ, పిల్లలకీ ఒక ఫారిన్ సబ్బుగానీ, సెంటు బాటిల్ గానీ ఎవరైనా ఇస్తే బాగుండు అన్న వాళ్ళ కోరికకు వెనక డబ్బు ఇచ్చి కొనలేని పేదరికపు ఆలోచనలు వాళ్ళకి లేకపోలేదు.
“పెర్షియా సబ్బుతో స్నానం చేయాలని నా కోరిక.” భార్య అన్నప్పుడల్లా మౌనమే జవాబు. నస మరీ భరించలేక మౌనం చెదిరి వెలువడే మాటలు ఆమెను సమాధాన పరచడానికి చాలేవి కావు.
“కాస్త ఓపిక పట్టు. మన బంధువులెవరైనా ఊళ్ళోకి వస్తే తప్పకుండా ఇస్తారు.”
“మీ మేనల్లుడికి ఒక కాగితం ముక్క రాయండి. ఆరు సబ్బు బిళ్ళలు, మూడు సెంటు బుడ్డీలు తెచ్చి పెట్టమని.”
“ఇంకా?”
“నాకొక హేర్ డై బాటిల్.”
“ఎవరికీ ఏదీ తెచ్చిపెట్టమని ఉత్తరం రాసే అలవాటు నాకు లేదు. కాస్త ఓపిక పట్టు. మేనల్లుడు వచ్చినప్పుడు తెచ్చి ఇస్తాడు.”
నా దగ్గర ఉన్న వస్తువునేదో తాను అడిగి నేను ఇవ్వనట్లు ముఖం తిప్పి వెళ్ళి పోయింది. నేను దేనికీ లొంగే మనిషిని కానని అర్థం అయ్యింది కాబోలు. ఉత్తరం రాయమని వెంటబడి అడగకుండా ఉండడం, నాకు కాస్త ఉపశమనంగానే అనిపించిది. ఏ స్త్రీ అయినా కళ్ళు జిగేలుమనేటట్లు చీర కట్టుకున్నా, ఆమె వంటి నుంచి సెంటు పరిమళం వచ్చినా, పెదాలకు పూసుకున్న లిప్ స్టిక్కు, కళ్ళకి మస్కారా గాని కంట బడినా ఆమె గొంతు గురగురమని శబ్దం చేయక మానదు.
“నాకూ ఒక తోబుట్టువు విదేశాల్లో ఉండి ఉంటే…”
ఆమెకు తోడ పుట్టిన వాడు లేని కొరతను ఒక్కొక్క సారి ఒక్కో విధంగా వినీ వినీ నా చెవులు చిల్లులు పడిపోయాయి. ఇదంతా వినడానికి, విన్న తరువాత మనసులో వ్యాపించే బాధను తట్టుకుని మూగజీవిగా నడుచుకునేటట్లు చేసిన ఆర్ధిక సమస్యలను మరిచిపోవాలనుకున్నా మరిచిపోలేక పోతున్నాను. ఇలా మరిచిపోలేక పోవడం, పేదరికంలో మగ్గుతున్న వారికి ఒక అదనపు శిక్ష కదా అని కూడా కొన్ని సార్లు అనిపిస్తుంది.
సందు మొనలో ఉన్న ఇల్లు బంధువులదే. ఇంటాయన కువైత్ లోనో, బహరిన్ లోనో. ఆ ఇంటికి వెనక వైపు బావి. బావి నీళ్ళు బైటికి వెళ్ళడానికి తూము లేదు. ఇంటి ప్రహరీ గోడలో ఇటుక లేని సందు ద్వారా స్నానం చేసిన నీళ్ళు బైటికి కొండ చిలువలాగా ప్రవహిస్తున్నాయి. ఆ నీళ్ళలో కూడా పరిమళం ఉంది. ఆ నీళ్ళను తొక్కకుండా దాటడానికి వీలులేదు. నీళ్ళను తొక్కకుండా ఎలా దాటడం అని ఆలోచిస్తూ నిలబడి ఉన్నప్పుడు, ప్రహరీ గోడను దాటి భుజాల మీద వచ్చి పడింది, ఫారిన్ సబ్బు రేపర్. ధగ ధగమని మెరిసే కేమే సబ్బు పేపర్. ఇంకా నయం, నీళ్ళల్లో పడలేదు. తీసి చూసినప్పుడు ఆఘ్రాణించాలనే కోరికను అణచుకోలేక పోయాను. భార్యా పిల్లలు ఆశ పడ్డారంటే అందులో అర్థం లేక పోలేదు. కోరికల గురించిన ఆలోచనలు కూడా ఉండడానికి అర్హత లేని వాడినన్న ఆంతర్యంతో, రేపటి భోజనానికి దారి వెదికే స్థితిలో ఉన్న తననే ఈ పరిమళం ఇంతగా ఆకర్షించిందంటే?
అంతరంగపు చీకటి మూలనుంచి కంటికి కనిపించని వేలు ఒకటి శాసించినట్లు ఆ రేపర్ని తీసి చేతి సంచీలో పెట్టుకున్నాను. ఇకపై ఆక్కడ నిలబడకుండా కొండచిలువను తొక్కకుండా, కాలి వేళ్ళను ఆనించి ఎలాగో ఆ సందును దాటేను. సముద్రపు తీరానికి వెళ్ళే దారిలో ఆ రేపర్ని తీసి నడుముకు పంచెలో చుట్టుకున్నపుడు, అది ఒక చెయ్యకూడని పనిగా, నీచమైనదిగా ఇప్పుడు అనిపించిది.
భార్య చెప్పింది అబద్దం కాదు. విస్తారంగా చేపలు కంటికి కనబడ్డాయి. అడిగిన వాళ్ళందరి నుంచీ ఒకే జవాబు. “రూపాయికి ఇరవై సాలైచేపలు.”
ఇంత చవకగా దొరుకుతున్నప్పుడైనా చేపలను రుచి చూడాలని జిహ్వ చాపల్యం కలిగింది. రాసులుగా పోసి ఉన్న చేపలను చూసి ధర అడిగాను. ధర చెప్పడానికి ముందు చేపలమ్మే అమ్మి నా ముఖాన్ని తేరిపారి చూసింది. ఆమె ముక్కు పుటాలు పెద్దగా అవడం గమనించాను. ధర చెప్పింది. “రూపాయికి ఒకటి.”
వణికి పోయాను. చవకగా, విస్తారంగా దొరుకుతున్నట్లు అందరూ చెబుతుంటే ఈమె ఇలా దోపిడీ రేటు చెబుతోందేమిటీ?
“ఏటీ ఆలోచన? డబ్బుకి వెనకాడకుండా కొని తీసుకెళ్ళి వేయించి తిను మరి.”
ఆమె ముక్కు పుటాలు పెద్దగా అవడానికి అర్థం ఏమిటని ఆలోచిస్తూ నిలబడి ఉండగా ఆమె పెద్దగా బాంబు ఒకటి పేల్చింది. “పోసియావాల్లెవరూ చేపల ధరను అడగరు.”
నా వడిలో నుంచి సువాసనను వెదజల్లుతున్న రేపర్ నన్ను ఆమె కళ్ళకి పెద్ద మనిషిగా చూపించింది. ఆమె ముందు నేను కుంచించుకు పోయినట్లుగా నిలబడ్డాను. ఆమె చెప్పిన ధర ఇచ్చి కొనే స్థోమత లేని బ్రతుకు నాది. ఎప్పటిలాగే ఈ రోజు కూడా చారు పచ్చడి మెతుకులే. వెనుతిరిగి రావడం తప్ప వేరే దారి లేదు.
నిన్నటి దాకా చూసినా చూడనట్లు వెళ్ళే వాళ్ళంతా కోరికలు అడుగంటి వెనుతిరిగి వస్తున్న నన్ను, వాళ్ళను దాటిన క్షణంలోనే చప్పట్లు చరిచి పిలిచి, కొడుకు పోసియాలో ఉన్నాడా అని కుశల ప్రశ్నలు వేసారు. దాని అంతరార్థం నాకు బోధ పడలేదు. ఏదో ఒక అర్థం కాని భావం నా చుట్టూ ఆవరించుకుని ఉన్నట్లు అనిపించింది. వట్టి చేతులతో, ఊపుకుంటూ మెట్లు ఎక్కుతున్నప్పుడు, భార్య చీర కొంగును నడుములో దోపింది. యుద్ధంలో కత్తిని దూయడానికి సమమైన చర్య అది. ఆమె లోపలి లంగా అంచు కాలి పిక్కల దాకా పైకి లేచింది.
“ఏంటీ? వట్టి చేతులతోనే వస్తున్నారే?” గద్దిస్తున్నట్లుగా, కాలుతో తన్ని తొక్కుతున్నట్లుగా వెలువడింది ప్రశ్న. దూకుడుగా వచ్చిన ఆమె ముఖంలో నుంచి కోపం తొలగడం, వెంటనే ఆమె చిరునవ్వు నవ్వడం – క్షణంలో ఆమెలో చూసిన ఈ అద్భుతమైన మార్పు నాకు ముందు ఆశ్చర్యంగానే అనిపించింది.
“ఇలా ఇవ్వండి.” చెయ్యి సాచింది.
“కొనలేదు. ధర చాలా ఎక్కువ.”
“ఫరవాలేదు. పెర్షియా సబ్బు ఇలా ఇవ్వండి.”
“సబ్బా?”
వడిలో ఉన్న రేపర్ గుర్తుకు వచ్చింది. ఎలా చెప్పాలని అయోమయంగా అనిపించిది. వట్టి రేపర్ని తీసి నప్పుడు ఆమె ముఖంలో రంగులు మారాయి. నిప్పులు కక్కుతునట్లు నా వైపు చూసింది. ఆ చూపుల వేడికి శరీరం మీద బొబ్బలు లేచాయి. స్త్రీ ముఖానికి ఇంత ఆకర్షణని, ఇంతగా వణికించే కోపాన్ని ఇచ్చిన ఆ సృష్టికర్త యొక్క నైపుణ్యాన్ని కొనియాడకుండా ఉండలేకపోయాను.
“ఈ రోజు కూడా వట్టి అన్నం మెతుకులే తినండి.”
దోపుకున్న చీర చెంగును తీసి వేసి వెళ్ళిన ఆ పోకడ ప్రపంచాన్నే ద్వేషిస్తున్నట్లుగా కనబడింది. ఏదైనా బావిలోనో, చెరువులోనో వెళ్ళి దూకుతుందేమో నని అనిపించింది. ఇటువంటి ప్రతి చర్యలను చూసిన తరువాత కూడా సబ్బు రేపర్ను పారేయడానికి మనసు అంగీకరించలేదు. మడతలను సరి చేసి సబ్బు ఆకారంలో ఉండేటట్లు తెచ్చి, అద్దం పగిలిపోయిన, ఏ బొమ్మలూ లేని షోకేసులో భద్రంగా ఉంచాను. సబ్బుకి చుట్టబెట్టిన రేపర్ని అయినా వాసన చూసుకోవచ్చని ఆశ.
చెల్లెలి కొడుకు బహరిన్‌కు వెళ్ళే ముందు చెప్పడానికి వచ్చినపుడు రకరకాలుగా కుర్చీలు, అద్దపు టీపాయ్ అన్నీ అలంకారంగా ఉండేవి, ముందు ఉన్న పెద్ద ఇంటి హాలులో. ఇప్పుడు ఈ చిన్న అద్దె ఇంట్లో పాత నులక మంచమే వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి ఆసనం. దాని మీద కూరున్నప్పుడల్లా కోల్పోయిన ఐశ్వర్యాన్ని, అది ఇంట్లో నుంచి వెళ్ళి పోయిన పోకడని, ఇప్పుడు ఉన్న పేదరికంలో ఒక రోజును నెట్టడానికి పడే దుర్భరాన్ని, నజీబును చదివించడానికి పడుతున్న కష్టాలని గురించిన ఆలోచనలు పగలును రాత్రిగా, రాత్రిని పగలుగా మారుస్తున్నాయి.
మడత మంచం మీద కాళ్ళు మడిచిపెట్టుకుని కూర్చున్నప్పుడు, కిటికీ ఊచల నుంచి ఇంటి ముందు ఉన్న కొబ్బరి తోట కంటికి కనిపించింది. తన నుంచి అన్యాక్రాంతం అయిపోయిన ఆ కొబ్బరి తోటలో విరగ కాచిన కొబ్బరికాయల మీద చూపు నిలబడుతున్నప్పుడు నజీబు కళ్ళ ముందు వచ్చి నిలబడ్డాడు.
“రేపు ఆఖరు తేదీ. ఫీజు కట్టలేదంటే పరీక్షలు రాయడానికి వీల్లేదు.”
నజీబు చూపులో ఏదో నిరీక్షణ, ఆశాభంగం రెండూ కలగలిసి పోయాయి. కొబ్బరి బొండాం మీది నుంచి చూపును అతని వైపు తిప్పగానే నిరాశతో నిండిన నా ముఖం అతడిని అధైర్యపరిచినట్లు అనిపించింది నాకు. అలా చాలా సేపు చూడలేనట్లు అతని ముఖం వాడి, పాలిపోయింది.
“దొరకలేదా?”
లేదని చెప్పడానికి నాలుక పెగలలేదు. తలను అడ్డంగా ఊపి సైగ ద్వారా ఓటమిని తెలియ చేసినప్పుడు అతను అలాగే శిలగా నిలబడి పోయాడు. నా గుండెను ఎవరో పిండుతున్నట్లుగా అనిపించిది.
“అడగని చోటు బాకీ లేదు. ఇంకా ఎవరిని పోయి అడగను?”
చూపును అతను నుంచి తిప్పి మునుపటి లాగే కొబ్బరి ఆకు మీదనే నిలిపాను. అక్కడ వ్యాపించిన నిశ్శబ్దాన్ని అతడే భంగపరిచాడు.
“రషీద్ బావ విదేశాలనుంచి వచ్చి ఒక వారమవుతోందట.”
“వచ్చాడా?” సంతోషంగానే అనిపించింది. కుక్కలాగా తిరిగి పాట్లు పడినందుకు ఆ భగవంతుడు ఒక దారి చూపించినట్లనిపించింది.
“బావను అడిగి చూడండి. రేపే ఆఖరి రోజు.” నజీబు ఆత్రుతను చూసినప్పుడు అలాగే ఉండడానికి మనసు ఒప్పలేదు.
“అతన్ని అడగలేదన్న కొరత ఎందుకు? వెళ్ళి అడిగి చూస్తాను.”
బయలు దేరుతున్నప్పుడు భార్య గంజి తాగి వెళ్ళమంది. త్వరగా బయలు దేరి వెళ్తే రాత్రి ఎనిమిదిన్నర బస్సుకి తిరిగి వచ్చేయొచ్చని ఆలోచన ఉండడం వల్ల గంజి తాగటానికి ఆలస్యం చేయలేదు. గొడుగు తీసుకొని బయలు దేరుతున్నప్పుడు భార్య జ్ఞాపకం చేసింది.
“సబ్బులూ, చీర, స్ప్రేలు అడిగి తీసుకోండి. మనవాడే కదా.”
తను చెప్పింది సగం వినీ వినకుండా గొడుగును తెరుస్తూ ఒంటిగంట బస్సును అందుకోవడానికి నడక వేగాన్ని ఎక్కువ చేశాను. ఎన్ని పాట్లు పడి అయినా ఈ ఏడు పరీక్షలు రాసేస్తే, నజీబుకు ఎక్కడయినా ఒక ఉద్యోగానికి ఏర్పాటు చేయవచ్చు. అతని ఆదాయం కొంచం ఆసరాగా ఉంటుంది. రోడ్డు మీద చెట్లు, ఇళ్ళూ నాకు ఎదురు దిశలో వేగంగా పరిగెత్తుతూ ఉంటే మేనల్లుడి కాలేజి చదువులకి అప్పుడప్పుడూ డబ్బు ఇచ్చింది, ప్రతి ఈద్ పండగకి కొత్త బట్టలు కొని ఇచ్చింది, ఉద్యోగం లేకుండా తిరుగుతున్నప్పుడు సహాయం చేసింది, బహరిన్ వెళ్తుంటే N.O.C.కి ఏర్పాటు చేసి ఇప్పించింది, అన్ని జ్ఞాపకాలూ ఒక్క సారిగా ముసురుకున్నాయి.
విదేశానికి వెళ్ళి ఆరేళ్ళ తరువాత మొదటి సారిగా ఊరికి వస్తున్నాడు. అతనిలో ఇప్పుడు చాలా మార్పులు వచ్చి ఉంటాయి. పెళ్ళి కోసం ప్రయత్నం కూడా ఉండొచ్చు. విమానం ఎక్కిన తరువాత మేనమామకి కొన్ని ఉత్తరాలు రాసాడు. కుశల ప్రశ్నలతో బాటు ఆఫీసు ఉపయోగం కోసం ఒక ఏర్ కండిషనర్, అత్తయ్య కోసం ఫ్రిజ్, వాషింగ్ మిషిన్ కొంటున్నట్లు, వాటిని తను వచ్చేటప్పుడు తీసుకొని వస్తున్నట్లు ఆఖరి ఉత్తరంలో రాసాడు. నా ఉన్నతమైన ఆర్థిక పరిస్థితికి తగినట్లు రక రకాలైన ఆడంబరపు వస్తువులను తెస్తున్నట్లు రాసే ప్రతి ఉత్తరంలోనూ మరికొన్ని వాగ్దానాలు నిండి ఉండేవి.
ఉత్తరం వచ్చిన ప్రతిసారీ జవాబు రాయలేదు. దిగజారుతున్న ఆర్ధిక పరిస్థితులని సూచన చేయకుండా ఉన్నది తన పేదరికం తన దగ్గరే ఉండనీ అని. ఇరుకు అద్దె ఇంట్లో మేనమామ, అత్తయ్య, వాళ్ళ పిల్లలు కాళ్ళు చాపుకోవడానికి కూడా చోటు లేకుండా కుంచించుకుపోయి బ్రతుకుతున్నప్పుడు, ఫ్రిజ్, వాషింగ్ మిషిన్లకి చోటేది?
మేనల్లుడు విమానం ఎక్కి వెళ్ళిన తరువాత చిన్న గ్రామంలో ఉంటున్న తల్లి తండ్రులను బయలు దేరతీసి నగరానికి మధ్యలో రెండంతస్తుల మేడలో బసను మార్పించిన అతని మంచి స్థితి గురించి కొంచం కూడా అసూయ పడింది లేదు. అతని ఇంకా ఇంకా ఇవ్వు దేవుడా అని వేడుకోవడం కోసం నా చేతులు పైకి లేచేవి. ఆరేళ్ళ తరువాత మొదటి సారిగా ఊరుకు వచ్చాడట. వచ్చి ఒక వారమయ్యిందట. బస్సు దిగిన చోటు నుంచి ఇల్లు కాస్త దూరమే. లోకల్ బస్సులు దూరలేని పొడుగైన సందులో. ఆటోలో వెళదామంటే తిరిగి రావడానికి చిల్లర డబ్బులు ఉండని జేబు.
సూర్యుడి తీవ్రం కాస్త తగ్గినందువల్ల, వీస్తున్న గాలిలో కొంచం చల్లదనం ఉన్నందువల్ల, నడవడం ఆహ్లాదంగానే అనిపించిది. బాగా ఉన్న రోజుల్లో చీటికి మాటికి వచ్చిన నగరం అవడం వల్ల, దారులు, సందులు అన్నీ పరిచయమయినవే. చిరునామా చూపించి దారి అడగవలసిన పరిస్థితి రాలేదు.చిరునవ్వుతో ఎదురు వచ్చిన చెల్లెలి పలకరింపుతో నా మనసు చల్లబడింది అని చెప్పడానికి వీలు లేదు. ఆ సమయానికి టీ నీళ్ళు, ఒక కేకు ముక్క కాలుతున్న కడుపును కాస్త చల్ల బరిచాయనే చెప్పాలి. ఇంట్లో నిండి ఉన్న దుబాయ్ సామాన్ల వైపు చూపును మరల్చడానికి వీలు లేకున్నంతగా ఆలోచనలతో మెదడు వేడెక్కి పోయింది. కుషన్ కుర్చీలు, అద్దపు టీపాయ్ హాలులో నిండి ఉన్నాయి. ఆందులో కూర్చునే అర్హతను నేను కోల్పోయిన విషయాన్ని గ్రహించిన నా చెల్లెలు, ఒక చెక్క స్టూలు మీద టీ నీళ్ళు, కేకు ముక్క ఉన్న ప్లేటు పెట్టి, నేను కూర్చోడానికి లోపలి నుంచి ఇంకొక చెక్క స్టూలును తీసుకొచ్చి వేసినప్పుడు నా కళ్ళ ముందు నజీబు నిలబడ్డాడు. ఎన్ని పాట్లు పడినా సరి అతన్ని గట్టు ఎక్కించాలి. ముళ్ళ మంచమే అయినా పండుకోవడానికి సంశయించలేనంత ఇబ్బడి.
నా అనర్హతను గ్రహించకుండా కుషన్ కుర్చీలో పొరబాటున కూర్చున్న అపరాధ భావంతో లేచి చెక్క స్టూల్ మీద కూర్చున్నాను. దాంట్లో ఉన్న మేకు పృష్ఠ భాగంలో గుచ్చుకున్నప్పుడు, పంచె చినిగి పోకుండా మెల్లగా విడతీసాను. మోకాళ్ళను, చేతులను నేల మీద ఆనించి నడిచే గుర్రంగా ఉన్నాను ఒక కాలంలో. ఆ గుర్రం మీద కుశాలుగా సవారీ చేస్తూ, ఆడుకున్న చెల్లెలి దృక్కోణంలో పరాయివాడుగా మారిన నీడలు ఆ కళ్ళలో ఉన్నట్లు అనిపించింది. నా గ్రహింపు అబద్దం అవ్వాలని దేవుడిని ప్రార్థించాను. నజీబుకు ఒక సంవత్సరం వృధా అయిపోతుంది కదా అన్న బెంగ నా గుండెలో.
పట్టణంలో ఇల్లు కట్టుకొన్న తరువాత మొదటి సారిగా వెళ్ళినందువలన చెల్లెలు క్షేమ సమాచారాలు అడిగింది. నజీబు, మిగిలిన పిల్లల చదువు సంధ్యల గూర్చి అడిగింది. ప్రాయానికి వచ్చిన కూతురికి వరుడిని వెతకడం గురించి అడిగింది. వ్యాపారాన్ని గురించి కూడా అడిగింది. జవాబు చెప్తున్నప్పుడు ధగ ధగమని మెరుస్తున్న మేనల్లుడు కారులో వచ్చి దిగిన జోరు, మంత్రి ఎవరో వచ్చినట్లు అనిపించింది. మొదట మనిషిని గుర్తు పట్టలేక పోయాను. నడకలో,దుస్తులలో, ఆకృతిలో, ధోరణిలో అంత మార్పు. సుదీర్ఘమైన ఆరు సంవత్సరాలలో కాలం తెచ్చిన కొత్త మార్పులు.
“మామా! ఎప్పుడు వచ్చారు?” వికసించిన ముఖంతో స్వాగతం చెప్పాడు. అదే గొంతు! నాదపు తీగను కాలం ఇంకా బిగించి కట్టలేదు. నవ్వుతున్నప్పుడు కూడా అదే సొట్టలు పడే బుగ్గలు.
“బాగా ఉన్నావా రషీద్?”
“బాగానే ఉన్నాను. మామను చూడడానికి రావాలని అనుకుంటూనే ఉన్నాను.”
“నువ్వు వచ్చావని తెలిసి నేనే వచ్చేసానుగా.”
“అత్తయ్య, బావలూ, మరదలు అంతా బాగున్నారా?”
“ఉన్నారులే’’
“నజీబు ఇప్పుడు మెడిసనా, ఇంజనియరింగా?”
“లేదు బాబూ. బి.ఏ. ఆఖరు సంవత్సరం.”
“ఎనిమిదో, పదో లక్షలు ఇచ్చి అతన్ని మెడిసన్లో చేర్పించి ఉండొచ్చు కదా.”
నా చిరునవ్వుకి వెనక ఉన్న మౌనానికి అర్థం అతని అర్థం అయినట్లు లేదు.
“ఇదంతా పెద్ద మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడమే కదా మామా? ఉన్న పళాన డబ్బు సమకూర్చలేకపోతే నాకు రాసి ఉంటే వెంటనే పంపించి ఉండేవాన్ని కదా.”
“పంపించి ఉంటావు.”
సాంకేతిక కళాశాలలో పేమెంట్ సీట్ దొరికిన విషయం, బి.ఎస్.సి. కంప్యూటర్ సైన్స్ కు ఐదువేలు విరాళం అడిగిన విషయం జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేక పోయాను. కంట పడితేనే ఏమైనా అడుగుతానేమోనని భయపడి దూరంగా తొలిగి పోయే మనుషుల మధ్య బ్రతుకుని వెళ్ళదీస్తున్నప్పుడు, ఎవరి దగ్గరికి వెళ్ళడం అని అర్థంకాని సంక్షోభంలో తల మునకలైన రోజులు మనస్సులో పెద్దగా అడుగుల శబ్దం చేస్తూ పరుగెడుతున్నాయి.
“మీ కోసం ఏ.సి. ఫ్రిడ్జ్ తీసుకొచ్చాను మామా. కనియల్ ఎస్టేట్ ఓనర్ పీరు మొహమ్మదును సవేరా హోటలుకు వెళ్ళినప్పుడు చూసాను. ఆయన కొత్తగా ఇల్లు కట్టి పాలు పొంగించబోతున్నట్లు చెప్పారు.”
“ఆయనతో నీకు పరిచయం ఉందా?”
“లేదు. మీ పేరు చెప్పి ఆయన మేనల్లుడివా అని అడిగారు. ఏం చేస్తున్నావని అడిగినప్పుడు బహారైన్లో పని చేస్తున్నానని చెప్పాను. గృహప్రవేశానికి పిలిచారు. వట్టి చేతులతో వెళ్ళగలమా మామా? ఎస్టేట్ యజమాని కదా? ఆయన అంతస్తుకు తగినట్లుగా ఏదైనా ఉండాలి కదా. ఏ. సి. ని, ఫ్రిడ్జ్ ని ఆయన ఇంటి గృహప్రవేశానికి బహుమతిగా ఇచ్చి ఇప్పుడే అక్కడి నుంచి వస్తున్నాను.”
“చెయ్యాల్సిందే.”
“వెళ్ళగానే మామ కోసం పంపిస్తాను. నజీబు కోసం వాచ్ కొని పంపిస్తాను.” వేలకి వేలు మూల్యమైన వస్తువులను పంపిస్తానని చెబుతున్న వాడి దగ్గర చిన్న సహాయం కోరి వచ్చిన విషయాన్ని ఎలా చెప్పాలన్న సందేహం నా మనస్సులో. నా మౌనాన్ని చూసి అతను అంగలార్చాడు.
“ఏంటి మామా ? మౌనంగా ఉన్నారేం? మిమ్మల్ని చూడడానికి రాలేదని కోపమా?”
“లేదు బాబూ. కోపం ఉంటే నిన్ను చూడడానికి వచ్చే వాడినా?”
“వ్యాపారం ఎలా ఉంది? ఏదైనా ఎక్స్ పోర్ట్ చేస్తున్నారా?” అతని ముఖం చూస్తూ చెప్పడానికి జవాబు లేకపోవడం వల్ల మెల్లిగా చూపులు తిప్పుకున్నాను.
“ఏం? ఏదీ మాట్లాడరేం?”
“ఇప్పుడు ఏ వ్యాపారమూ లేదు బాబూ. పెద్ద ఎత్తున నష్టం వచ్చేసింది. అప్పులు తీర్చడానికి ఇంటిని, దుకాణాన్నిఅమ్మేశాను. ఏ ఆదాయం లేక ఊరికే ఉన్నాను.”
“అంత నష్టమా?”
“తలెత్తుకోలేని నష్టం.” మేనల్లుడి ముఖంలో ఉత్సాహమంతా మాయమై పోవడాన్ని చూడకుండా చూపును నేలమీదికి తిప్పాను.
“దివాలా తీసేసారా?” ప్రశ్న వెక్కిరిస్తున్నట్లుగా అనిపించినా, జవాబు చెప్పకుండా ఉండ లేకపోయాను.
“నిండా మునిగి పోయాను.”
వసారాలో చెల్లెలు నిలబడి ఉంది. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. వాళ్ళ వాళ్ళ మనస్సుల్లో ఏదేదో భావాలు పొంగుతున్నట్లు ఉంది ఆ వాతావరణం.
“మామ వచ్చిన పని?” గొంతులో ముందు ఉన్న మార్దవం ఎండి పోయినట్లనిపించిది. రాకలో గల నిజమైన ఉద్దేశాన్ని దాచిపెట్టి ఊరికే వచ్చానని చెప్పడానికే నాలిక పైకి లేచింది. మనసులో పొంచి ఉన్న మాట అదాటున నాలుక మీది నుంచి జారింది.
“చిన్న సహాయం కోసం..”
“ఏమిటా సహాయం?” ఇప్పుడు గొంతులో గరుకుతనం నిర్మొహమాటంగా కనబడింది.
“నజీబుకు రేపు ఫీజు కడితే గాని పరీక్షలు రాయలేడు. ఆఖరు ఏడు. డబ్బు కట్టక పొతే అతని చదువు పాడై పోతుంది. అతను చదివి ఏదైనా ఉద్యోగానికి వెడితే తప్ప..”
“చదివి ఏం చేస్తాడు? అతన్ని ఏదైనా దుకాణంలో పనికి పెట్టొచ్చు కదా?” ఏమని చెప్పాలో తెలియని దిగ్భ్రమలో అలాగే నా తల క్రుంగి పోయింది. అతనికి చదువు చెప్పించిన అపరాధానికి కోర్టులో విచారణ ఖైదీలాగా తలదించుకుని కూర్చున్నాను.
“ఏం సహాయం కావాలి?” ఒక పోలీస్ అధికారి యొక్క గద్దింపు లాగే వినబడింది.
“ఒక 725 రూపాయలు దొరికితే ..”
మేనల్లుడు జవాబు చెప్పలేకనో, మాటలు రాక పోవడం వల్లనో, కుషన్ సోఫాలో కూర్చున్న వాడల్లా బూట్సు కాళ్ళని అద్దపు టీపాయ్ మీద ఎత్తి పెట్టి, గోళ్ళు కొరక సాగాడు. ఎదురు చూడని మేనమామ పతనం చెవులకి సోకిన షాక్ లో మనసు విరిగి పోయి కూర్చున్నట్లుగా అనిపించిది.
“బాధ పడకు బాబూ. కష్ట సుఖాలను ఇచ్చేది ఆ దేవుడు. ఇచ్చిన వాడు తీసుకుంటే బాధ పడడానికి ఏముంది?” అతన్ని ఓదార్చడానికి ప్రయత్నించాను.
“మామా!”
“ఏంటి బాబూ.” తలెత్తి చూసాను. అతని తల్లి కళ్ళు అతనితో మాట్లాడడం గమనించనట్లు ఉండిపోయాను. ఈ రోజు ఆ కళ్ళు ఇలా మాట్లాడడానికే కాబోలు ఆ రోజుల్లో ఆమె కళ్ళలో పడిన ధూళిని, మట్టిని ఊది తీశాను.
“మునుపటి లాగా లేదు ఇప్పుడు అరబ్బు దేశం. ఎండలో పడి కుక్క లాగా పాట్లు పడితేనే ఇంటికి కడుపుకోసం కొంచం పంపించగలం. మునుపటి లాగా జీతాలు ఇవ్వడం లేదు. జీతాలని బాగా తగ్గించేశాడు ఆ అరబ్బువాడు.”
మేనల్లుడు తన శ్రమ విషాద గాధను చెప్పి ముగించగానే చెల్లెలు గుమ్మానికి ఉన్న తెరను లాగి లోపలికి వెళ్ళి పోయింది. నా మనసులో వ్యాపించి ఉన్న చీకటి వెలుపల కూడా వ్యాపించి ఉన్నదని అప్పుడే గ్రహించాను.
“ఏమైనా తిన్నారా?”
“మీ ఉమ్మా టీ నీళ్ళు, కేకు ముక్క పెట్టింది. దాంతోనే కడుపు నిండి పోయింది.”
“8.30కి ఆఖరి బస్సు.”
“వచ్చేటప్పుడే బస్సు టైమింగ్ వివరాలు తెలుసుకుని వచ్చాను బాబూ.”
బస్సు దిగి చీకట్లో నడవసాగాను. ఇంటి కిటికీ చువ్వల గుండా మూల్గుతున్నట్లు వెలుగుతున్న బుడ్డిదీపం వెలుతురు నడవలో గడ్డి పొదరు మీద పడుతోంది.. అడుగుల శబ్దం వింటూనే నజీబు తానే స్వయంగా వచ్చి తలుపు తీసాడు. అతని వెనకాలే వచ్చిన నా భార్య ఆతృతను అణచుకోలేనట్లుగా అడిగింది.
“మేనల్లుడు ఏ ఏ వస్తువులను ఇచ్చాడేమిటీ?”
“బావ డబ్బు ఇచ్చాడా?”
ప్రశ్నలు బాణాలుగా గుండెను తాకుతున్నాయి. చేతిలో పట్టుకెళ్ళిన గొడుగు మాత్రమే ఉండటం చూసి భార్య నీరస పడిపోయినట్లుగా అయ్యింది.
“వాప్పా!” అతల పాతాళంలో నిలబడి కాపాడమని కాపాడమని దీనంగా వేడుకుంటునట్లు ఉంది నజీబు పిలుపు.
“ఆ రోజుల్లో ఆఖరి పరీక్షకి కట్టడానికి అరవై రూపాయలు ఇచ్చే వాళ్ళు లేక నీ వాప్పా చదువు ఆగి పోయింది నీకు తెలియదు. నాకూ అదే అనుభవం. ఇప్పుడు అదే నీకు. రేపు నీ కొడుకు చదువు ఇలాగే మధ్యలో ఆపేయాల్సిన సందర్భం ఎదురైనా నువ్వు అలసి పోవద్దురా. ఇదంతా కాలం చేస్తున్న ఆవర్తనం.”
భార్యా, కొడుకు నిద్రపోయారా లేక నిరాశాభారంతో కన్ను మూయకుండా అలాగే ఉన్నారా అని కూడా గమనించలేని మనస్థితి. ఏది ఎలాగైనా వాళ్ళకి తెల్లవారుతుంది. నిద్రపోని నా కళ్ళు అద్దపు షోకేసు వేపు మళ్ళాయి. అక్కడ నా శత్రువు చేతిలో ఉన్న పదునైన కత్తిలా మిలమిలా మెరుస్తూ ఉంది పెర్షియా సబ్బు రేపర్!
తోప్పిల్ మహమ్మద్ మీరాన్ 1944లో తేంగాయ్ పట్టణం అన్న గ్రామంలో జన్మించారు. మాతృ భాష తమిళమే అయినా చదువు మలయాళంలో సాగింది. జీవితపు అనుభవాలు ఆయన రచనలలో ప్రధాన ఇతివృత్తాలుగా ఉంటాయి. 1997 లో ‘సాయ్ వునార్కాలి’ (Easy Chair) అన్న నవలకి సాహిత్య అకాడమి పురస్కారం లభించింది. అంతరంగపు వ్యక్తీకరణ రచనలో ప్రతిబించడం వీరి శైలి యొక్క విశిష్టతగా పేర్కొన వచ్చు.