మడత మంచం మీద కాళ్ళు మడిచిపెట్టుకుని కూర్చున్నప్పుడు, కిటికీ ఊచల నుంచి ఇంటి ముందు ఉన్న కొబ్బరి తోట కంటికి కనిపించింది. తన నుంచి అన్యాక్రాంతం అయిపోయిన ఆ కొబ్బరి తోటలో విరగ కాచిన కొబ్బరికాయల మీద చూపు నిలబడుతున్నప్పుడు నజీబు కళ్ళ ముందు వచ్చి నిలబడ్డాడు.
“రేపు ఆఖరు తేదీ. ఫీజు కట్టలేదంటే పరీక్షలు రాయడానికి వీల్లేదు.”
నజీబు చూపులో ఏదో నిరీక్షణ, ఆశాభంగం రెండూ కలగలిసి పోయాయి. కొబ్బరి బొండాం మీది నుంచి చూపును అతని వైపు తిప్పగానే నిరాశతో నిండిన నా ముఖం అతడిని అధైర్యపరిచినట్లు అనిపించింది నాకు. అలా చాలా సేపు చూడలేనట్లు అతని ముఖం వాడి, పాలిపోయింది.
“దొరకలేదా?”
లేదని చెప్పడానికి నాలుక పెగలలేదు. తలను అడ్డంగా ఊపి సైగ ద్వారా ఓటమిని తెలియ చేసినప్పుడు అతను అలాగే శిలగా నిలబడి పోయాడు. నా గుండెను ఎవరో పిండుతున్నట్లుగా అనిపించిది.
“అడగని చోటు బాకీ లేదు. ఇంకా ఎవరిని పోయి అడగను?”
చూపును అతను నుంచి తిప్పి మునుపటి లాగే కొబ్బరి ఆకు మీదనే నిలిపాను. అక్కడ వ్యాపించిన నిశ్శబ్దాన్ని అతడే భంగపరిచాడు.
“రషీద్ బావ విదేశాలనుంచి వచ్చి ఒక వారమవుతోందట.”
“వచ్చాడా?” సంతోషంగానే అనిపించింది. కుక్కలాగా తిరిగి పాట్లు పడినందుకు ఆ భగవంతుడు ఒక దారి చూపించినట్లనిపించింది.
“బావను అడిగి చూడండి. రేపే ఆఖరి రోజు.” నజీబు ఆత్రుతను చూసినప్పుడు అలాగే ఉండడానికి మనసు ఒప్పలేదు.
“అతన్ని అడగలేదన్న కొరత ఎందుకు? వెళ్ళి అడిగి చూస్తాను.”
బయలు దేరుతున్నప్పుడు భార్య గంజి తాగి వెళ్ళమంది. త్వరగా బయలు దేరి వెళ్తే రాత్రి ఎనిమిదిన్నర బస్సుకి తిరిగి వచ్చేయొచ్చని ఆలోచన ఉండడం వల్ల గంజి తాగటానికి ఆలస్యం చేయలేదు. గొడుగు తీసుకొని బయలు దేరుతున్నప్పుడు భార్య జ్ఞాపకం చేసింది.
“సబ్బులూ, చీర, స్ప్రేలు అడిగి తీసుకోండి. మనవాడే కదా.”
తను చెప్పింది సగం వినీ వినకుండా గొడుగును తెరుస్తూ ఒంటిగంట బస్సును అందుకోవడానికి నడక వేగాన్ని ఎక్కువ చేశాను. ఎన్ని పాట్లు పడి అయినా ఈ ఏడు పరీక్షలు రాసేస్తే, నజీబుకు ఎక్కడయినా ఒక ఉద్యోగానికి ఏర్పాటు చేయవచ్చు. అతని ఆదాయం కొంచం ఆసరాగా ఉంటుంది. రోడ్డు మీద చెట్లు, ఇళ్ళూ నాకు ఎదురు దిశలో వేగంగా పరిగెత్తుతూ ఉంటే మేనల్లుడి కాలేజి చదువులకి అప్పుడప్పుడూ డబ్బు ఇచ్చింది, ప్రతి ఈద్ పండగకి కొత్త బట్టలు కొని ఇచ్చింది, ఉద్యోగం లేకుండా తిరుగుతున్నప్పుడు సహాయం చేసింది, బహరిన్ వెళ్తుంటే N.O.C.కి ఏర్పాటు చేసి ఇప్పించింది, అన్ని జ్ఞాపకాలూ ఒక్క సారిగా ముసురుకున్నాయి.
విదేశానికి వెళ్ళి ఆరేళ్ళ తరువాత మొదటి సారిగా ఊరికి వస్తున్నాడు. అతనిలో ఇప్పుడు చాలా మార్పులు వచ్చి ఉంటాయి. పెళ్ళి కోసం ప్రయత్నం కూడా ఉండొచ్చు. విమానం ఎక్కిన తరువాత మేనమామకి కొన్ని ఉత్తరాలు రాసాడు. కుశల ప్రశ్నలతో బాటు ఆఫీసు ఉపయోగం కోసం ఒక ఏర్ కండిషనర్, అత్తయ్య కోసం ఫ్రిజ్, వాషింగ్ మిషిన్ కొంటున్నట్లు, వాటిని తను వచ్చేటప్పుడు తీసుకొని వస్తున్నట్లు ఆఖరి ఉత్తరంలో రాసాడు. నా ఉన్నతమైన ఆర్థిక పరిస్థితికి తగినట్లు రక రకాలైన ఆడంబరపు వస్తువులను తెస్తున్నట్లు రాసే ప్రతి ఉత్తరంలోనూ మరికొన్ని వాగ్దానాలు నిండి ఉండేవి.
ఉత్తరం వచ్చిన ప్రతిసారీ జవాబు రాయలేదు. దిగజారుతున్న ఆర్ధిక పరిస్థితులని సూచన చేయకుండా ఉన్నది తన పేదరికం తన దగ్గరే ఉండనీ అని. ఇరుకు అద్దె ఇంట్లో మేనమామ, అత్తయ్య, వాళ్ళ పిల్లలు కాళ్ళు చాపుకోవడానికి కూడా చోటు లేకుండా కుంచించుకుపోయి బ్రతుకుతున్నప్పుడు, ఫ్రిజ్, వాషింగ్ మిషిన్లకి చోటేది?
మేనల్లుడు విమానం ఎక్కి వెళ్ళిన తరువాత చిన్న గ్రామంలో ఉంటున్న తల్లి తండ్రులను బయలు దేరతీసి నగరానికి మధ్యలో రెండంతస్తుల మేడలో బసను మార్పించిన అతని మంచి స్థితి గురించి కొంచం కూడా అసూయ పడింది లేదు. అతని ఇంకా ఇంకా ఇవ్వు దేవుడా అని వేడుకోవడం కోసం నా చేతులు పైకి లేచేవి. ఆరేళ్ళ తరువాత మొదటి సారిగా ఊరుకు వచ్చాడట. వచ్చి ఒక వారమయ్యిందట. బస్సు దిగిన చోటు నుంచి ఇల్లు కాస్త దూరమే. లోకల్ బస్సులు దూరలేని పొడుగైన సందులో. ఆటోలో వెళదామంటే తిరిగి రావడానికి చిల్లర డబ్బులు ఉండని జేబు.
సూర్యుడి తీవ్రం కాస్త తగ్గినందువల్ల, వీస్తున్న గాలిలో కొంచం చల్లదనం ఉన్నందువల్ల, నడవడం ఆహ్లాదంగానే అనిపించిది. బాగా ఉన్న రోజుల్లో చీటికి మాటికి వచ్చిన నగరం అవడం వల్ల, దారులు, సందులు అన్నీ పరిచయమయినవే. చిరునామా చూపించి దారి అడగవలసిన పరిస్థితి రాలేదు.చిరునవ్వుతో ఎదురు వచ్చిన చెల్లెలి పలకరింపుతో నా మనసు చల్లబడింది అని చెప్పడానికి వీలు లేదు. ఆ సమయానికి టీ నీళ్ళు, ఒక కేకు ముక్క కాలుతున్న కడుపును కాస్త చల్ల బరిచాయనే చెప్పాలి. ఇంట్లో నిండి ఉన్న దుబాయ్ సామాన్ల వైపు చూపును మరల్చడానికి వీలు లేకున్నంతగా ఆలోచనలతో మెదడు వేడెక్కి పోయింది. కుషన్ కుర్చీలు, అద్దపు టీపాయ్ హాలులో నిండి ఉన్నాయి. ఆందులో కూర్చునే అర్హతను నేను కోల్పోయిన విషయాన్ని గ్రహించిన నా చెల్లెలు, ఒక చెక్క స్టూలు మీద టీ నీళ్ళు, కేకు ముక్క ఉన్న ప్లేటు పెట్టి, నేను కూర్చోడానికి లోపలి నుంచి ఇంకొక చెక్క స్టూలును తీసుకొచ్చి వేసినప్పుడు నా కళ్ళ ముందు నజీబు నిలబడ్డాడు. ఎన్ని పాట్లు పడినా సరి అతన్ని గట్టు ఎక్కించాలి. ముళ్ళ మంచమే అయినా పండుకోవడానికి సంశయించలేనంత ఇబ్బడి.
నా అనర్హతను గ్రహించకుండా కుషన్ కుర్చీలో పొరబాటున కూర్చున్న అపరాధ భావంతో లేచి చెక్క స్టూల్ మీద కూర్చున్నాను. దాంట్లో ఉన్న మేకు పృష్ఠ భాగంలో గుచ్చుకున్నప్పుడు, పంచె చినిగి పోకుండా మెల్లగా విడతీసాను. మోకాళ్ళను, చేతులను నేల మీద ఆనించి నడిచే గుర్రంగా ఉన్నాను ఒక కాలంలో. ఆ గుర్రం మీద కుశాలుగా సవారీ చేస్తూ, ఆడుకున్న చెల్లెలి దృక్కోణంలో పరాయివాడుగా మారిన నీడలు ఆ కళ్ళలో ఉన్నట్లు అనిపించింది. నా గ్రహింపు అబద్దం అవ్వాలని దేవుడిని ప్రార్థించాను. నజీబుకు ఒక సంవత్సరం వృధా అయిపోతుంది కదా అన్న బెంగ నా గుండెలో.
పట్టణంలో ఇల్లు కట్టుకొన్న తరువాత మొదటి సారిగా వెళ్ళినందువలన చెల్లెలు క్షేమ సమాచారాలు అడిగింది. నజీబు, మిగిలిన పిల్లల చదువు సంధ్యల గూర్చి అడిగింది. ప్రాయానికి వచ్చిన కూతురికి వరుడిని వెతకడం గురించి అడిగింది. వ్యాపారాన్ని గురించి కూడా అడిగింది. జవాబు చెప్తున్నప్పుడు ధగ ధగమని మెరుస్తున్న మేనల్లుడు కారులో వచ్చి దిగిన జోరు, మంత్రి ఎవరో వచ్చినట్లు అనిపించింది. మొదట మనిషిని గుర్తు పట్టలేక పోయాను. నడకలో,దుస్తులలో, ఆకృతిలో, ధోరణిలో అంత మార్పు. సుదీర్ఘమైన ఆరు సంవత్సరాలలో కాలం తెచ్చిన కొత్త మార్పులు.
“మామా! ఎప్పుడు వచ్చారు?” వికసించిన ముఖంతో స్వాగతం చెప్పాడు. అదే గొంతు! నాదపు తీగను కాలం ఇంకా బిగించి కట్టలేదు. నవ్వుతున్నప్పుడు కూడా అదే సొట్టలు పడే బుగ్గలు.
“బాగా ఉన్నావా రషీద్?”
“బాగానే ఉన్నాను. మామను చూడడానికి రావాలని అనుకుంటూనే ఉన్నాను.”
“నువ్వు వచ్చావని తెలిసి నేనే వచ్చేసానుగా.”
“అత్తయ్య, బావలూ, మరదలు అంతా బాగున్నారా?”
“ఉన్నారులే’’
“నజీబు ఇప్పుడు మెడిసనా, ఇంజనియరింగా?”
“లేదు బాబూ. బి.ఏ. ఆఖరు సంవత్సరం.”
“ఎనిమిదో, పదో లక్షలు ఇచ్చి అతన్ని మెడిసన్లో చేర్పించి ఉండొచ్చు కదా.”
నా చిరునవ్వుకి వెనక ఉన్న మౌనానికి అర్థం అతని అర్థం అయినట్లు లేదు.
“ఇదంతా పెద్ద మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడమే కదా మామా? ఉన్న పళాన డబ్బు సమకూర్చలేకపోతే నాకు రాసి ఉంటే వెంటనే పంపించి ఉండేవాన్ని కదా.”
“పంపించి ఉంటావు.”
సాంకేతిక కళాశాలలో పేమెంట్ సీట్ దొరికిన విషయం, బి.ఎస్.సి. కంప్యూటర్ సైన్స్ కు ఐదువేలు విరాళం అడిగిన విషయం జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేక పోయాను. కంట పడితేనే ఏమైనా అడుగుతానేమోనని భయపడి దూరంగా తొలిగి పోయే మనుషుల మధ్య బ్రతుకుని వెళ్ళదీస్తున్నప్పుడు, ఎవరి దగ్గరికి వెళ్ళడం అని అర్థంకాని సంక్షోభంలో తల మునకలైన రోజులు మనస్సులో పెద్దగా అడుగుల శబ్దం చేస్తూ పరుగెడుతున్నాయి.