గాయక గంభీరుడు ఉస్తాద్ అమీర్ ఖాన్

ఆ రోజు 1974 ఫిబ్రవరి 11. ఘంటసాల చనిపోయిన వార్త తెలిసి బొంబాయిలోని మా తెలుగు బృందమంతా ఎంతో విచారంలో మునిగిపోయింది. మరొక రెండు రోజుల్లోనే, 13న కలకత్తాలో ప్రముఖ హిందుస్తానీ గాయకుడు ఉస్తాద్ అమీర్ ఖాన్ (Ustad Amir Khan) మరణించారు. (సరిగ్గా అదే రోజున మరొక సంగీతజ్ఞుడు రాతన్‌జంకర్ (RatanJankar) కూడా చనిపోయాడు). మొత్తం మీద 1974 కళాప్రపంచానికి మంచి ఏడాదిగా పరిణమించలేదు. ఎందుకంటే జులైలో ఎస్.వి. రంగారావు, అక్టోబర్ 30న ప్రముఖ గజల్ గాయని బేగం అఖ్తర్ ( Begum Akhtar) కూడా కాలం చేశారు. వీరందరిలోనూ తెలుగువారికి తక్కువగా తెలిసిన వ్యక్తి ఉస్తాద్ అమీర్ ఖాన్. ఆయన సంగీతాన్ని పరిచయం చేసే ప్రయత్నమే ఈ వ్యాసం.

1970లలో బొంబాయిలో ఉద్యోగాలు చేస్తున్న నాకూ, నా మిత్రుడు అన్నంరాజు రామకృష్ణ తదితరులకూ హిందుస్తానీ సంగీత “పిచ్చి” బాగా ఉండేది. ఒకవంక ఘంటసాల మరణం పట్ల విచారిస్తూంటే ఆ వెంటనే మేము ఆరాధించే అమీర్ ఖాన్ చనిపోవడం, అదీ ఒక కారు ప్రమాదంలో అని తెలిసినప్పుడు చాలా బాధగా అనిపించింది. మమ్మల్ని చూసి, “ఎవరా అమీర్ ఖాన్?” అని అడిగిన ఇతర తెలుగు మిత్రులకు “ఝనక్ ఝనక్ పాయల్ బాజే” సినిమాలో టైట్‌ల్ సాంగ్ పాడినాయన” అని సమాధానం చెప్పాం.


[కలకత్తాలో ఒక కచేరీకి ముందు తంబురా శ్రుతి చేస్తున్న అమీర్ ఖాన్.
రెండో తంబురాతో విలాయత్ ఖాన్, కుడివేపు వెనకగా ఇమ్రత్ ఖాన్]

ఉస్తాద్ అమీర్ ఖాన్ మనదేశంలో స్వాతంత్ర్యానంతరకాలంలో హిందుస్తానీ సంగీత ప్రపంచంలో సుప్రసిద్ధుడుగా వెలిగిన గాయకుడు. అగ్ర గాయకుడైన బడేగులాం అలీఖాన్ కు దాదాపు సమ ఉజ్జీగా ఆయన పేరు పొందాడు. బడేగులాం పాడే శైలి అనితరసాధ్యమూ, అనుకరించరానిదీ కావడంతో ఎక్కువమంది యువ గాయకుల మీదా, వాద్యకారుల మీదా అమీర్ ఖాన్ ప్రభావమే అధికంగా ఉండేది. సితార్ విద్వాంసుల్లో అత్యుత్తములైన సోదరులు విలాయత్ ఖాన్, ఇమ్రత్ ఖాన్ (Vilayat Khan, Imrat Khan) లిద్దరి మీదా ఇది కనబడుతుంది. అలాగే మరొక ప్రసిద్ధ సితార్ విద్వాంసుడు నిఖిల్ బెనర్జీ (Nikhil Banerjee), సరోద్ నిపుణుడు బుద్ధదేవ్ దాస్ గుప్తా కూడా అమీర్ ఖాన్ అంటే ఎంతో గౌరవాభిమానాలు కలిగి ఉండేవారు. అమీర్ ఖాన్ ఒక మహా సంగీతజ్ఞుడు కనకనే ఇందరి అభిమానాన్ని ఇంతగా పొందగలిగాడు.

శాస్త్రీయ సంగీతం పాడి మెప్పించడానికి ప్రతివారికీ తియ్యని కంఠం ఉండనవసరంలేదు. దక్షిణాదిన వోలేటి వెంకటేశ్వర్లు, మదురై మణీయ్యర్ తదితరులకూ, హిందుస్తానీలో కుమార్ గంధర్వ (Kumar Gandharva) మొదలైనవారికీ అభిమానులు ఎందరో కనిపిస్తారు. సినిమాలో కారెక్టర్ ఆక్టర్ ముఖకవళికల్లాగా గాంభీర్యం కూడా ఎంతో ఆకర్షణీయంగా అనిపించవచ్చు. అమీర్ ఖాన్ అటువంటి గాయకుడు.

1912లో జన్మించిన అమీర్ ఖాన్ చిన్నతనంలో ఇందోర్ లో సారంగీ విద్వాంసుడైన తన తండ్రి షామీర్ ఖాన్ వద్దనే సంగీతం నేర్చుకున్నాడు. అమీర్ తల్లి అతని రెండోఏటనే చనిపోవడంతో కుటుంబ బాధ్యత అంతా తండ్రి మీదనే పడింది. ఆయన అమీర్ కూ, అతని తమ్ముడు బషీర్ కూ గాత్రం, సారంగీ నేర్పసాగాడు. అంతేకాక వీలున్నప్పుడల్లా వారిని సంగీతంలో ప్రవేశమున్న బంధుమిత్రుల ఇళ్ళకు తీసుకెళుతూ ఉండేవాడు.

ఒక సందర్భంలో ఎవరింటోనో “మేరుఖండ్” గాత్రపద్ధతి గురించి ఆయనకు తెలిసింది. అందులో పరిమిత సంఖ్యలో స్వరాలను తీసుకుని క్రమభేదం (పెర్మ్యుటేషన్-permutation), సంయోగం (కాంబినేషన్-combination) పద్ధతుల్లో రకరకాల వరసల్లో పాడి, అభ్యాసం చేస్తారు. ఉదాహరణకు స, రి అనే రెండే స్వరాలు తీసుకుంటే సరి, రిస అనే రెండు రకాల ప్రస్తారమే వీలవుతుంది. అదే మూడు స్వరాలయితే సరిగ, సగరి, రిగస, రిసగ, గరిస, గసరి అని ఆరు రకాలుగా పాడవచ్చు. స్వరాల సంఖ్య పెరిగినకొద్దీ క్రమభేద అవకాశాలు విపరీతంగా పెరిగిపోతాయి. వీటన్నిటినీ గాత్రంలో అభ్యాసం చెయ్యడం కష్టమైన పని. షామీర్ పనిగట్టుకుని అమీర్ కు ఇది నేర్పసాగాడు.


[యువగాయకుడుగా అమీర్ ఖాన్]

మొదటి అయిదారేళ్ళూ అమీర్ ఇదే పద్ధతిలో అభ్యాసం చేసి, ఆ తరవాత ఖయాల్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఆ రోజుల్లో ప్రతి శుక్రవారమూ వాళ్ళ ఇంట్లో సంగీతకచేరీలు జరుగుతూ ఉండేవి. గాయకుడు రజబ్ అలీ ఖాన్ , సుర్ బహార్ (Surbahar) నిపుణుడూ, విలాయత్ ఖాన్ కు పినతండ్రీ అయిన వహీద్ ఖాన్, వీణ విద్వాంసులూ, అనేకమంది ప్రసిద్ధ గాయకులూ వినిపించిన సంగీతాన్ని అమీర్ శ్రద్ధగా విని ఆకళించుకోవడం మొదలుపెట్టాడు.

1934లో అతను బొంబాయికి వెళ్ళి, ప్రైవేట్ కచేరీల్లో పాడడమే కాక అమీర్ అలీ అనే పేరుతో అయిదారు రికార్డులు కూడా ఇచ్చాడు. తలపాగా, మీసాలతో అప్పట్లో అతని వేషం పాతపద్ధతిలో ఉండేది. అయితే “మేరుఖండ్” పద్ధతిలో పాడిన ఈ సంగీతానికి అంత గుర్తింపు రాలేదు. నిరాశతో అమీర్ ఇందోర్ కు తిరిగివచ్చాక అతని తండ్రి 1937లో చనిపోయాడు. ఇక కుటుంబ పోషణార్థం అమీర్ తన సంగీతాన్ని అభివృద్ధి చేసుకోక తప్పలేదు .


[అమాన్ అలీఖాన్, అల్లాదియాఖాన్,రజబ్ అలీఖాన్]

“మేరుఖండ్” పద్ధతి మరీ పండిత ధోరణి అనిపిస్తోందేమోనన్న అనుమానంతో అమీర్ దాన్ని పూర్తిగా విడనాడకుండానే ఇతర మార్గాలను అన్వేషించసాగాడు. అతనంటే రజబ్ అలీ ఖాన్(1874-1959) కి పుత్రవాత్సల్యం ఉండేది. అతని నుంచి అమీర్ తన దృత్ ఖయాల్ లో వేగవంతమైన సంగతులు పాడడం నేర్చుకున్నాడు. రజబ్ అలీ జైపూర్ శైలికి ఆదిపురుషుడైన అల్లాదియా ఖాన్ (1855-1946) (Alladiya Khan 1855-1946) వద్ద కొంత శిష్యరికం చేశాడు కనక ఆ ప్రభావం కాస్త అమీర్ పై పడింది. అమీర్ తన మధ్యగతి గాయకపద్ధతిని రజబ్ అలీకి బంధువైన అమాన్ అలీఖాన్ (1884-1953) నుంచి అలవరుచుకున్నాడు. బొంబాయిలో అమాన్ అలీ వద్ద సంగీతం నేర్చుకున్నవారిలో లతా మంగేశ్కర్ కూడా ఉండేది. ఇతనికి కర్ణాటక సంగీతాభిమానం కూడా ఉండేదట. ఇతని ద్వారానే అమీర్ హంసధ్వని రాగం మీద అభిమానం పెంచుకున్నాడు. అమీర్ ఖాన్ పాడిన హంసధ్వని లాంగ్ ప్లే రికార్డు అద్భుతంగా ఉంటుంది.


[అబ్దుల్ వహీద్ ఖాన్]

రజబ్ అలీ, అమాన్ అలీల శైలిలో నెమ్మదిగా సాగే విలంబిత్ ఖయాల్ పోకడలు తక్కువ. దాన్ని అమీర్ ఖాన్ ఉస్తాద్ అబ్దుల్ వహీద్ ఖాన్ ( 1882-1949) (Abdul Wahid Khan) నుంచి విని, నేర్చుకున్నాడు. కిరానా (kirana) సంప్రదాయానికి మూలపురుషుడుగా అబ్దుల్ కరీం ఖాన్ (Abdul Karim Khan)తరవాత ఈయననే చెప్పుకుంటారు. ఈయనకు కొన్ని ప్రత్యేకతలుండేవి. ఈయన దాదాపు తన జీవితమంతా రెండే రెండు రాగాలు సాధన చేసేవాడట; మొదటిది తోడీ (శుభపంతువరాళి), రెండోది దర్బారీకానడ. అదేమిటని అడిగితే “ఏం చెయ్యమంటారు? మొదటిది సాయంకాలం పాడకూడదు, రెండోది ఉదయం పాడకూడదు. లేకపోతే ఒకటే పాడి ఉండేవాణ్ణి. జీవితమంతా సాధన చేసినా ఇది తేలే విషయం కాదు” అనేవాడట. ఎప్పుడైనా రేడియోలో పాడటానికి వస్తే రికార్డింగ్ పూర్తయాక అక్కడే కూర్చుని అదే రాగం మరికొన్ని గంటలు పాడుతూ ఉండిపోయేవాడట.

ఈ విధంగా అబ్దుల్ వహీద్ ఖాన్ విలంబిత్ ఖయాల్ పాడే పద్ధతిని అమీర్ ఖాన్ బాగా అవగతం చేసుకున్నాడు. నింపాదిగా, అంతర్ముఖ శైలిలో మంద్రస్థాయిలో మొదలుపెట్టి, రాగాన్ని ఒక తపశ్చర్యలాగా మథించే లక్షణం తరవాతి దశలో అమీర్ ఖాన్ కు ఎంతో ఖ్యాతిని తెచ్చింది. తన శైలిని ప్రత్యక్షంగా కాక కేవలం వినికిడి ద్వారా నేర్చుకున్నప్పటికీ అమీర్ ఖాన్ ను పెద్దాయన చాలా మెచ్చుకునేవాడట. అతనే తనకు నిజమైన వారసుడు అని అనేవాడట.

మొత్తంమీద అమీర్ ఖాన్ ఏ గురువు మీదా పూర్తిగా ఆధారపడకుండా తనకు నచ్చిన పద్ధతిలో తన శైలిని మలుచుకున్నాడు. ఇది ప్రస్తుతం ‘ఇందోర్ ఘరానా’గా ప్రజాదరణ పొందుతోంది. స్వరాలను ‘శాంతిప్రదంగా’, ‘ధైర్యవంతంగా’ పాడడం, శుద్ధమైన బాణీ, అతివిలంబితకాలంలో మొదలుపెట్టడం, తబలావాడితో కుస్తీపట్టకుండా ఉండడం మొదలైన లక్షణాలన్నీ అతనికి త్వరలోనే ఖ్యాతిని తెచ్చిపెట్టసాగాయి. ఆరడుగుల పొడుగుతో, హుందాగా, గంభీరంగా కనబడే అతని వైఖరీ, కళ్ళు అరమోడ్చి, నిటారుగా కూర్చుని ధ్యాన నిమగ్నుడిలాగా పాడే పద్ధతీ అందరినీ ఆకట్టుకున్నాయి. ఆనాటి పాత పద్ధతిలో కాక తలమీద పాగాలూ, టోపీలూ ధరించకుండా పాడటానికి వచ్చేవాడు. ఇది అప్పటి విద్వాంసులలో అరుదే. ఇతన్ని చూసే అలీ అక్బర్ (Ali Akbar), విలాయత్ ఖాన్ తదితరులంతా తమ వేషాలను అధునికంగా మార్చుకున్నారని అంటారు.

కొందరు సంగీత విద్వాంసులు పాడుతున్నంతసేపూ మనని కావాలని ఇంప్రెస్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కొద్దిమంది మాత్రం ప్రేక్షకులను పట్టించుకోనట్టే ఉండికూడా అంతర్ముఖ వైఖరితో అద్భుతమైన సంగీతాన్ని వినిపిస్తారు. ఈమని శంకరశాస్త్రిగారి వీణకచేరీలు వింటే అలాగే అనిపించేది. అమీర్ ఖాన్ కూడా అంతే. ఏదో ధ్యానసమాధిలో కూర్చున్నట్టుగా సంగీతం వినిపించేవాడాయన. అంతేకాక ఒక రాగం ముగించిన వెంటనే శషభిషలు లేకుండా రెండోది మొదలుపెట్టేవాడు. పాడుతున్నంతసేపూ రాగాన్ని గురించిన చింతనలో మునిగినట్టుగా ఉండేవాడు.


[సంగీత చింతనలో నిమగ్నుడు]

1945 తరవాత అమీర్ ఖాన్ కు మంచి ప్రజాదరణ లభించసాగింది. అంతకు ముందు దాదాపు పదేళ్ళు అతను ఇక్కడా అక్కడా తిరిగాడు. బొంబాయిలో తన మేనమామ ఇంట ఉండగా అమాన్ అలీ తోనూ, ప్రసిద్ధ సంగీతవేత్త దేవ్ ధర్ (Deodhar) తదితరులతోనూ పరిచయం ఏర్పడింది .

అమీర్ ఖాన్ పెద్దగా చదువుకోకపోయినా హిందీ, ఉర్దూ, సంస్కృతం, పర్షియన్ మొదలైన భాషలను అధ్యయనం చేశాడు. శాస్త్రీయసంగీతం పాడుతున్నప్పుడు సాహిత్యంమీద దృష్టి పెట్టాలనేవాడు. మన తిల్లానాలను పోలిన తరానాలను పాడుతున్నవారు సామాన్యంగా వాటిలోని పదాలకు అర్థం ఉండదనుకుంటారు. అమీర్ ఖాన్ ఈ విషయంలో కొంత సమాచారం సేకరించాడు. పర్షియన్ భాషలో తనందరా అంటే ‘నా శరీరంలోకి ప్రవేశించు’ అనీ, నాదిర్ తానీ అంటే ‘నీవే అన్నీ తెలిసినవాడివి’ అనీ అర్థాలున్నాయనేవాడు. సాహిత్యంలోని ఆధ్యాత్మికభావాలను ఒంటపట్టించుకుని సూఫీ వేదాంతాన్ని అలవరుచుకున్న గాయకుడు అమీర్ ఖాన్. అందుకనే ఆయన తాదాత్మ్యం చెంది పాడుతున్నట్టుగా అనిపించేది.


[భార్య రయీసా బేగం, కొడుకు బబ్లూ ]

అమీర్ ఖాన్ మొదటి భార్య విలాయత్ ఖాన్ సోదరి జీనత్ . వారికి ఒక కుమార్తె కలిగింది. అయితే అతనికి సరయిన రాబడి లేకపోవడంతో ఆ వివాహం విఫలమయింది. 1941లో అతను బొంబాయి నుంచి ఢిల్లీ వెళ్ళి అక్కడ సంగీతం నేర్పాడు. మున్నీబేగం అనే శిష్యురాలిని పెళ్ళాడాడు. ఈమెకు ఒక కొడుకు జన్మించాడు. వీరి కాపురం చాలాకాలం కొనసాగింది. ఆ రోజుల్లో అమీర్ ఖాన్ కలకత్తాలోను, లాహోర్ లోనూ కచేరీలు చేశాడు. స్వాతంత్ర్యం వచ్చాక మళ్ళీ బొంబాయికి తిరిగివచ్చి వల్లభ్ భాయిపటేల్ రోడ్డు ప్రాంతంలో నివసించసాగాడు. వేశ్యావాటికగా పేరు పొందిన ఆ పేటలో ఎందరో నాట్యకత్తెలు సంగీతం నేర్చుకునేవారు కనక బడేగులాం, తబలా విద్వాంసుడు థిరక్వా, గాయకుడు వహీద్ ఖాన్ తదితరులు అక్కడే నివసించేవారు. 1965లో అమీర్ ఖాన్ రయీసా బేగంను వివాహం చేసుకున్నాడు కాని మున్నీబేగం అది సహించలేక వెళిపోయిందట. రయీసాకు బబ్లూ అనే కుమారుడు కలిగాడు. ఇతనే టిప్పు సుల్తాన్ మొదలైన సీరియల్స్ టీవీ నటుడు షాబాజ్ ఖాన్.

1952లో అమీర్ ఖాన్ కు ప్రముఖ సరోద్ విద్వాంసుడు అలీఅక్బర్ ఖాన్ సంగీత దర్శకత్వంలో ‘క్షుధితొ పాషాణ్’ అనే బెంగాలీ సినిమాలో పాడే అవకాశం వచ్చింది. ఎందువల్లనో అమీర్ ఖాన్ ఠుమ్రీలు పాడేవాడు కాదు. ఆయన పాడిన అరుదైన ఠుమ్రీ ఒకటి ఈ సినిమాలో ఉందట. ఠుమ్రీలకు పేరుమోసిన బడేగులాంతో తనను పోల్చుకుని అమీర్ ఖాన్ అవి పాడడం విరమించుకున్నాడని అంటారు.


[లతా మంగేశ్కర్, సంగీత దర్శకుడు వసంత్ దేశాయిలతో]

ఆ తరవాత నౌషాద్ ఆయన చేత ‘బైజూ బావ్రా’ సినిమాకు పాడించాడు. అందులో టైట్‌ల్ సాంగ్ పూరియాధనాశ్రీ (పంతువరాళి) రాగం. అదే సినిమాలోని మరొకఘట్టంలో తాన్సేన్ దర్బారీకానడ రాగాన్ని సృష్టిస్తాడు. చివరి సన్నివేశంలో దేసీ రాగంలో బైజూ (డి.వి.పలూస్కర్) తో పోటీ పాట ఉంటుంది. పలూస్కర్ పేరును అమీర్ ఖానే సూచించాడట. మేఘ్ రాగంలోని మరొక పాట రికార్డయింది కాని దాన్ని సినిమాలో వాడలేదు. 1954లో షబాబ్ లో అమీర్ ఖాన్ చేత నౌషాద్ పాడించిన మరొక పాట ముల్తానీ రాగం.

వసంత్ దేశాయి సంగీత దర్శకత్వంలో అమీర్ ఖాన్ ఒక మరాఠీ సినిమాకు పాడాడు. దాన్ని నయ్యర్ కూడా తన రాగిణి సినిమాలో ఉపయోగించుకున్నాడు. కేవలం ఒకటిన్నర నిమిషాల పాటు కనబడే ఆ సన్నివేశాన్ని చూసి ఉస్తాద్ గారు ‘తంబురా శ్రుతి చేసినంత సేపు కూడా పట్టలేదే?’ అని ఆశ్చర్యపోయాడట.

ఆయనకు బాగా పేరు తెచ్చినది 1955లో వి.శాంతారాం తీసిన “ఝనక్ ఝనక్ పాయల్ బాజే”. ఆ సినిమాకి అడాణారాగంలో పాడిన టైట్‌ల్ సాంగ్ (“ఝనక్ ఝనక్ పాయల్ బాజే”) ఎక్కువమందికి తెలిసినటువంటిది. 1959లో వసంత్ దేశాయి ఆయన చేత ‘గూంజ్ ఉఠీ షహనాయి’ (Goonj Uthi Shehnai) సినిమాకు పాడించాడు. అందులో హీరో ఒక గాయకుడి వద్ద షహనాయి నేర్చుకుంటాడు. బిస్మిల్లాఖాన్ (Bismillah Khan) కు బాగా పేరు తెచ్చిన ఈ సినిమాలో గురువుకు ప్లేబాక్ అమీర్ ఖాన్ పాడాడు. ఆ తరవాత తన శిష్యులు కొందరు తీసిన కొన్ని డాక్యుమెంటరీలకు ఆయన పాడాడు. ఆయనమీద ఫిలింస్ డివిజన్ వారు ఒక డాక్యుమెంటరీ తయారు చేశారు.

అమీర్ ఖాన్ పాడే గంభీరమైన శైలి ఆయనకు ఎందరో అభిమానులను తెచ్చిపెట్టింది. అమర్ నాథ, సింగ్ సోదరులు, పూర్వీ ముఖర్జీ, కంకణా బెనర్జీ (Kankana Banerjee) మొదలైన శిష్యగణంతో బాటు గోకులోత్సవ్ జీ (Gokulotsvaji) అనే గాయకుడుకూడా ఆయన వల్ల ప్రభావితుడయాడు. ఇతని గొంతూ, పాడే విధానమూ అంతా అమీర్ ఖాన్ లాగే ఉంటుంది. వింత ఏమిటంటే అతను ఆయనవద్ద ఏమీ నేర్చుకోలేదు సరికదా కలుసుకోనైనా లేదు.

అమీర్ ఖాన్ పాడుతున్నప్పుడు టైమింగ్ – అంటే స్వరాల మధ్యనుండే ఎడం- కూడా చాలా ప్రాముఖ్యత కలిగినట్టనిపిస్తుంది. ఆయన పడుకుని ఏదో ఒక లయలో పాడుకుంటున్నప్పుడు కాలు మరొక లయలో కదులుతూ ఉండేదని మా గురువుగారబ్బాయి ఇర్షాద్ నాతో అన్నాడు. ఆయన రికార్డులు వింటే ఈ సంగతి తెలుస్తుంది.

1968 తరవాత అమీర్ ఖాన్ మున్నీబేగంకు పుట్టిన తన కుమారుడు ఇక్రం వద్దకు కెనడాకు వచ్చి పోతూ ఉండేవాడు. కొన్నాళ్ళు న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీకి విజిటింగ్ ప్రొఫెసర్ గా కూడా ఉన్నాడు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చే అవకాశం ఏర్పడింది. అయినా అనుకోని విఘాతం ఎదురయింది. కలకత్తాలో ఒక మిత్రుడింట్లో రాత్రి భోజనం తరవాత అమీర్ ఖాన్ కారులో ప్రయాణిస్తూండగా ఎదురుగా వస్తున్న మరొక కారు ఢీకొట్టింది. అందులో తీవ్రంగా గాయాల పాలైన ఉస్తాద్ గారు త్వరలోనే మరణించారు. అసంఖ్యాకులైన ఆయన అభిమానులు దేశవిదేశాల్లో హతాశులైపోయారు. ఆయన పాటంటే ఎంతో ఇష్టపడే మా నాన్నగారు (కొడవటిగంటి కుటుంబరావు) ‘సంగీతకారులు లేకపోయినా వారి సంగీతం బతికుంటుందని అనుకునేవాణ్ణిగాని ఇది చాలా దుర్వార్త. అమీర్ ఖాన్ పాట ఇంకా ఎంతో వినగలుగుతానని ఆశపడ్డాను’ అని నాకు ఉత్తరంలో రాశారు. మంచి అరోగ్యంతో జీవితం గడిపిన ఆ మహాగాయకుడు 62 ఏళ్ళకే చనిపోవడం చాలా విచారకరం.

1971లో ఢిల్లీ కచేరీలో నేను తీసుకున్న అమీర్ ఖాన్ ఆటోగ్రాఫ్ ఇప్పటికీ నా దగ్గిరుంది. అక్కడి ప్రేక్షకులు ఆయనంటే ఎంతో అభిమానం ప్రదర్శించారు.

అమీర్ ఖాన్ మరణానంతరం ఆయన పాత రికార్డింగులు ఎన్నో వెలువడ్డాయి. ఆయన ఏ రాగం పాడినా అందులో ఎంతో హుందాతనం కనబడేది. అదే రాగాన్ని ఇతరులు వినిపించినప్పుడు అలా ఎందుకుండేది కాదో అర్థమయేది కాదు. ఆ హుందాతనం నిజానికి రాగానిది కాదనీ, అమీర్ ఖాన్ దే ననీ తెలియటానికి నాకు సమయం పట్టింది. బాగేశ్రీవంటి ‘జాలి’ రాగాలనుకూడా ఆయన ‘ప్రాధేయపడుతున్న’ ధోరణిలో కాకుండా ఎంతో దర్పంగా పాడాడు. స్వరకల్పనలో ఆయన ‘మేరుఖండ్’ పద్ధతి ఊహించలేమనిపించే విధంగా మలుపులు తిరుగుతూ ఉంటుంది. ఆయనకు హంసధ్వని ఇష్టమని తెలిసినప్పుడు ఆశ్చర్యమనిపించలేదు. ఆ రాగం ఇంతమంది కర్ణాటక విద్వాంసులది విన్నాకకూడా ఆయన పాడిన పద్ధతి ఎంతో గొప్పగా అనిపిస్తుంది. గొప్ప సంగీతవేత్తలనే అలరించిన మహాసంగీతవేత్త అమీర్ ఖాన్.

ఈ వ్యాసంలో ప్రస్తావించిన పాటల ఆడియో లింకులు:

  1. ‘బైజూ బావ్రా’ సినిమాలో టైట్‌ల్ సాంగ్ పూరియాధనాశ్రీ (పంతువరాళి) రాగం(MP3 file 1.17MB )
  2. అదే సినిమాలోని మరొకఘట్టంలో దర్బారీకానడ రాగంలో పాట. (MP3 file 2.64MB)
  3. చివరి సన్నివేశంలో దేసీ రాగంలో బైజూ (డి.వి.పలూస్కర్) తో పోటీ పాట(MP3 file 1.47MB)
  4. ‘షబాబ్’ లో అమీర్ ఖాన్ ముల్తానీ రాగంలో పాడిన పాట(MP3 File 1.20MB)
  5. ఝనక్ ఝనక్ పాయల్ బాజే (MP3 file 1.09MB)
  6. అమీర్ ఖాన్ పాడిన హంసధ్వని లాంగ్ పే రికార్డు(MP3 File 7.82 MB)

కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గురించి: కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు. ...