లిటిల్‌సైంటిస్టు

“నాన్నా, నెక్స్ట్‌వీక్‌నించీ సైన్సులాబ్‌ మొదలు పెడతారు, నాకో కోటు కొను అర్జెంటుగా.” గబుక్కున వెనక్కి తిరిగి చూసాను. పైన ఎవరూ కనబడలేదు. కిందకి చూసాను. భూమికి జానెడు లేదు, దీనికప్పుడే సైన్సులాబులూ, స్కైలాబులూ ఎందుకు? దానికోసం మళ్ళీ కోట్లూ, కొమ్మచ్చులూనా? దోచేస్తున్నారు దొంగపీనుగులు. చెప్పి చఛ్ఛేదేవీ లేదు గానీ, ఈ హంగులకేం తక్కువలేదు. అసలు వీళ్ళ సైన్సు టీచర్ని చూడడానికి నిజంగానే రెండు కళ్ళూ చాలవు. ఇంకో రెండు కళ్ళు అప్పు తెచ్చుకుంటేనే గానీ ఆ “అప్పూ” ని సాంతం చూడలేము. ఆ గుమ్మం నించి ఈ గుమ్మందాకా వుంటుంది పాపం. ఆవిడే చెట్టయ్యి వుంటే రెండిళ్ళకి సరిపడా చెక్క అన్న మాట. “ఏవిటీ మాట్లాడవు?” అన్నట్టు చూసింది నా కూతురు. “సరే, వీకెండు కొందాంలే, అమ్మ బయల్దేరుతోంది, పదా స్కూలుకి” అని పంపించేసాను. వచ్చి ఆఫీసు రూమ్‌లో కూర్చున్నాను, ఆట్టే పని లేదు. వచ్చేవారం కొత్త ప్రాజెక్టు మొదలు. అప్పటిదాకా వర్కింగ్‌ ఫ్రం హోమ్‌.

వేలెడంత లేరు, వీళ్ళకి సైన్సు లాబులా? మేము ఇంటరుమీడియెట్‌లో మొట్టమొదటిసారి చూసాం, అసలు లాబ్‌ అంటే ఏవిటో. అప్పటి వరకూ సైన్సు పాఠవైనా, తెలుగు పాఠవైనా ఒకటే పట్టు. వేదంలాగ విని, వల్లించడవే, శ్రుతి అన్నమాట. ఉత్సాహం కాస్త ఎక్కువై, పూనుకుని మొదలెట్టిన ప్రతీ ప్రయోగమూ ఓ ప్రహసనంలా తయారయ్యేది.

జీవితంలో మొట్టమొదటి సారి మూడో క్లాసులోనో,నాలుగులోనో చేసాం సైన్సు ప్రయోగం. ‘ఒక గాజు బీకరు తీసుకొనుము. నీళ్ళతో నింపుము. ఒక పుల్లకు పైన వొకటీ, మధ్యన వొకటీ, కిందన ఒకటీ చిక్కుడు గింజలు కట్టుము. మధ్య గింజ సగము ములుగునట్లుగా పుల్ల బీకరునందుంచుము. రెండ్రోజుల తరవాత చూడుము. పైగింజ ఎండి చఛ్ఛును. లోపలి గింజ ఉబ్బి చఛ్ఛును. మధ్యది మాత్రము మొలకెత్తును. నీ గమనికలు, తీసుకోవలసిన జాగ్రత్తలు వివరింపుము’ అని వుండేది. “గాజు బీకరుకు బదులు ప్లాస్టిక్‌చెంబు వాడ వచ్చును. పుల్లకోసము కొండ చీపురు వాడునప్పుడు అమ్మకు తెలియకుండా జాగ్రత్త పడవలెను. మిఠాయి పొట్లమునకు ఉన్న దారముతో సరిపెట్టుకొనవలెను. అమ్మ డబ్బాలో వున్న ట్వైను దారము తీయరాదు. లేనిచో ప్రమాదము” అని రాసాను. అది చూసి మా సైన్సు మేష్టారు ఒకటే నవ్వు. అన్నట్టు రెండో క్లాసులోనే ఒక చిన్న పరిశోధన చేసాను గానీ కారణాంతరాల వల్ల అది సగంలోనే ఆగిపోయిందికాబట్టి లెక్కలోకి రాదు.

‘ఒక బంగాళా దుంప ఉడికించి, సగం పెరట్లో పెట్టుము, సగం ఫ్రిజ్జిలో పెట్టుము. రెండు రోజుల తరవాత చూసినచో బైట వున్న ముక్క బూజు పట్టును, దానిని ఫంగస్‌అందురు. ఫ్రిజ్జులో ఉన్నది బాగుండును, వేయించుకు తిన్నచో ఇంకా బాగుండును’ అని వుండేది. బంగాళ దుంప అంటే ఉడికించాను గానీ, ఫ్రిజ్జు ఎక్కడనించి తేనూ? అక్కడికీ అమ్మనడిగాను, “అమ్మా, ఫ్రిజ్జు కొనుక్కుందావే, లేకపోతే స్కూలుకి రావద్దన్నారే” అని. “ఇంతోటి బోడి చదువుకీ ఫ్రిజ్జులూ, విమానాలూ కొనలేంగానీ, నా మాట విని శుబ్భరంగా చదువు మానేసి, అంట్లుతోమడం నేర్చుకో, పనికొస్తుంది” అంది అమ్మ నవ్వుతూ. నేను అబద్ధవాడానని అమ్మకెలా తెలిసిపోయిందో? అక్కడికీ బాగానే చెప్పాను, మొహం జాలిగా పెట్టి. నాక్కోపవొచ్చి మొత్తం బంగాళదుంప బైట పారేసాను. సాయంత్రం మామ్మ చెప్పింది “పోనీ సగం ముక్క తెచ్చి మన కుండలో పెట్టుకో, అదీ చల్లగానే ఉంటుంది, ఫ్రిజ్జంటే బోలెడు ఖరీదు” అని. నిజమే, అప్పట్లో మావూరు మొత్తం మీద డాక్టరు వర్మ గారింట్లోనే వుండేది ఫ్రిజ్జు మరి. సరే, అలా ఆగిపోయిందా బంగాళ దుంప పరిశోధన, కాబట్టి చిక్కుడు ప్రయోగమే మా మొదటిది.

తరువాత శాస్త్రీయ నామాలతో, బోలెడంత హడావిడి చేసాను. ఓసారి, భాస్కర్రావు కొట్టోకెళ్ళి, “ఓ రూపాయి సోడియం క్లోరైడు ఇయ్యి, అమ్మ తెమ్మంది” అంటే వాడు తెల్ల మొహం వేసి “అదేటండీ?” అన్నాడు. అప్పుడు ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్‌లా ఫోజు పెట్టి, “సోడియం క్లోరైడు అంటే ఇదీ” అన్నాను ఉప్పు బస్తా చూపించి. అదే వూపులో ఇంటికొచ్చి, మామ్మ దగ్గరికెళ్ళి “మామ్మా, నీక్కొంచెం హెచ్‌టూవో కావాలా?” అని అడిగాను. “వద్దురా, ఆట్టే దాహం లేదు” అంది మామ్మ. నాకు గుండె ఆగినంత పనైంది. “మామ్మా, హెచ్‌టూవో అంటే..నీ కెలా తెలుసే..” అన్నాను నీళ్ళు నవులుతూ. “అన్న చెప్పాడు రా, వాడు నాకు చక్కగా పాఠాలు అప్ప చెబుతాడు కదా, అప్పుడు చెప్పాడు”.. వెంఠనే వెళ్ళి అన్న జామెట్రీ బాక్సు కనపడకుండా దాచేయాలనిపించేది. కానీ, జామెట్రీ బాక్సు లేకపోతే వాడి హోంవర్కు అవదు, అది పూర్తైతేనే గానీ నా హోంవర్కు అవదు. అందుకే వదిలేసేవాడిని.

ఆరో తరగతిలో గోనో మీటరో, గోదారి మీటరో ఏదో ప్రయోగం ఉండేది. జామెట్రీ బాక్సులోని “డి” తీసుకుని, దానికి రెండు స్ట్రాలు అతికించి, భవనం ఎత్తు కొలవమని. సరే, గడియార స్థంభం ఎత్తు కొలుద్దాం కదా అని, దాని ముందు నిలబడి స్ట్రా గొట్టం లోంచి చూస్తూ, పక్కకి నడుస్తూ వెళ్ళి నాగేస్రావు కూల్డ్రింకు బండిని గుద్దేసాను. వాడి రంగు సీసా ఒకటి పడి పగిలిపోయింది. ఆరోజునించీ వాడికి నేనంటే కోపం. అందరిలాగే నేనూ కప్పైస్క్రీముకి పావలా ఇస్తానా, అయినా వాడు నాకప్పెప్పుడూ పూర్తిగా నింపేవాడు కాదు.

తరవాత థర్మా మీటరు తయారు చేసే ప్రయోగం. ఈసారి ఎల్లాగైనా చేసి తీరాలని పట్టుదలతో అందరినీ అడిగాను “మీ దగ్గర పాదరసం వుందా?” అని. అందరూ నాకేసి వింతగా చూసి “అదే తగ్గిపోతుందిలే, రెండు రోజుల్లో” అనుకున్నారు. చివరికి మా మేస్టారే సలహా ఇచ్చారు “ఒరేయ్‌ సేఠ్ల దగ్గర సున్నితపు త్రాసులూ, పాదరసం గట్రా ఉంటాయి అని”. మా క్లాసులో ఇద్దరు సేఠ్ల పిల్లలుండేవారు. భరత్‌లాల్‌, భేరూ లాల్‌అని. వాళ్ళని అడిగాను, “ఒరేయ్‌,రేపు కొంచెం పాదరసం పట్రండర్రా, థర్మా మీటరు చేసుకుందాం” అని. మర్నాడు భరత్‌లాల్‌వచ్చి చెప్పాడు “మానాన్న నీతో మాట్లాడద్దన్నాడు” అని. భేరూలాల్‌గాడు అప్పటికే మానేసాడు. తరవాత అయస్కాంత రేఖలు గీసే ప్రయోగం భలే వుండేది. కాయితంపైన ఇనప రజను పోసి, కింద అయస్కాంతం పెట్టడం ఒకటీ, దిక్సూచి పెట్టి రేఖలు గీయటం ఒకటీ. అంతా గీసాకా చూస్తే, పేద్ద బొద్దింక లా వచ్చేది ఆ బొమ్మ. దిక్సూచీ, అయస్కాంతవూ ఒకే జేబులో వేసుకుని తిరిగేవాళ్ళం. దాంతో ఆ దిక్సూచి ఉత్తర దక్షిణాలకి బదులు తూర్పూ, పడమరా చూపించేది.

అయితే, ఓసారి అన్నయ్యకీ వాడి ఫ్రెండు కీ సైన్సు ఫేర్‌లో మొదటి బహుమతి వచ్చింది. వాళ్ళు విరిగిపోయిన ట్యూబులైటూ, బ్లేడూ, వైర్లూ వాడి, ఏదో చేసారు. అప్పటినించీ నాకు ఇంట్లో పోరెక్కువైపోయింది. “వెధవా, అన్న చూడు ఎంత చక్కగా చేశాడో. నువ్వూ ఉన్నావు, ఎందుకూ, తిండి దండగ” అని. నాక్కోపం వచ్చి మా క్లాసుమేటు చలపతి గాడికి చెప్పేసాను, “వొరేయ్‌వచ్చేసారి ఏదైనా చేద్దాం” అని. వాళ్ళ నాన్న పెద్ద సైంటిస్టు మరి. సరే, చివరికి వాడే కనిపెట్టాడు. యంత్ర శక్తిని విద్యుఛ్ఛక్తిగా మార్చే ప్రయోగం. స్టాండు వేసిన సైకిలెక్కి గెట్టిగా తొక్కడం నా పని. దానికి వైర్లూ గట్రా తగిలించి, నానా హంగామా చేసి, చివరికి బల్బులు వెలిగించడం వాడిపని. నాకు తెలియదు కాబట్టి, సైన్సుఫేర్లో వాడే అందరికీ అర్థమయ్యేట్టు చెప్పేసాడు. “నిన్నెవరేనా ప్రశ్నలడిగితే, కష్టపడుతూ, ఆయాసపడుతూ సైకిల్‌తొక్కుతున్నట్టు మొహం పెట్టు, అప్పుడు ఆ ప్రశ్నలకి కూడా నేనే సమాధానం చెప్పేస్తాను” అని చిట్కా కూడా చెప్పాడు. సరే అయేడాది మాకొచ్చింది బహుమతి. ఇంట్లో అందరికీ గుండె ఆగినంత పనయ్యింది. నేనేదో దారిలో పడిపోతున్నానని నాన్న బోల్డు సంబర పడిపోయారు. కానీ వాళ్ళకేంతెలుసూ, ఆ ప్రయోగం వల్ల నాకొచ్చిందల్లా సైకిలు తొక్కడవేనని !

అలా చేసిన పరిశోధనలూ, అల్లర్లూ ఆనాటితోనే సరి. ఇప్పుడు ఏదో “మూడు పాకేజిలూ, ఆరు ప్రోగ్రాములూ నేర్చేసుకుని, అటు దిటూ, ఇటు దటూ తిరగరాసేసి, ఘన, పనస, జట లాంటి వేద ప్రక్రియ లన్నీ కంప్యూటర్‌రంగంలో ప్రయోగించి, నోరుపెట్టుకుని బతికేస్తున్నాను, ఏదో, నలుగురితోటీ నారాయణా. నాలోనూ ఓ లిటిల్‌సైంటిస్టు ఉన్నాడు. కానీ వాడిప్పుడు ఆలోచించడం మానేసి, మూడంకేసి, ముసుగు తన్ని నిద్దరోతున్నాడు చాలా ఏళ్ళుగా. వాడికీ ఓ కోటు కొంటాను, బహుశా అది చూసైనా లేస్తాడేమో..


శ్రీనివాస ఫణి కుమార్‌ డొక్కా

రచయిత శ్రీనివాస ఫణి కుమార్‌ డొక్కా గురించి: శ్రీనివాస ఫణికుమార్‌ డొక్కా జననం అమలాపురంలో. నివాసం అట్లాంటా జార్జియాలో. కంప్యూటర్‌ సైన్స్‌ ఫీల్డ్‌లో పనిచేస్తున్నారు. కథలు, కవితలు రాసారు. ...