ఇద్దరు దుర్మార్గులు

అసలు నాకే ఇలా అవుతుందో, లేక అందరికీ ఇలానే అవుతుందో తెలియదు. ఎన్నో సార్లు అనిపిస్తుంది,ఇలా ఇంకెవ్వరికీ జరగదేమో, కేవలం నా జాతకంలోనే ఇలా ఉందేమో అని. లేకపోతే తెలుగు ఎమ్మే చదవడవేవిటీ,కంప్యూటర్‌కంపెనీలో మేనేజరు ఉద్యోగవేవిటి? ఎక్కడన్నా పొంతన ఉందా? ఎక్కడో అగ్గురారంలో పుట్టి, ఎగిరొచ్చిహైదరాబాదులో స్థిరపడడవేవిటి? నాలాంటి స్థిరం తక్కువ వాడికి డాక్టర్‌దీప లాంటి భార్య దొరకడవేవిటి?కారూ, ఇల్లూ, కొడుకూ..ఏవిటో, ఇవన్నీ నాకే జరిగాయా?

నా జీవితంలో అన్నీ అనుకోని మార్పులే. ఎప్పుడో, ఏజన్మలోనో చేసుంటాను రవ్వంత పుణ్యం. పాపం దేవుడు ఋణం తీర్చేసుకుంటున్నాడు కావాల్ను. ఎంతటి శ్రోత్రీయమైన కుటుంబం? శాస్తుర్లు గారి లాంటి ఘనాపాటీ కోనసీమలో మరొహడు లేడని చెప్పుకునేవారు నాన్న గురించి. ఆ ఇల్లో తులసి వనం,నేనో నిగమ శర్మ. అసలు నాకు ఈ తిరుగుడు ఎలా అలవాటయ్యిందో? మొదట్లో తప్పు చేసినప్పుడు ఇంటికి వెళ్ళి దీపకి మొహం చూపించడానికి భయం వేసేది. పిల్లాణ్ణి దగ్గరకి తీసుకోవాలంటే తెలియని భయం, చేతులు వణికేవి. రాను రాను అలవాటైపోయింది. నా తిరుగుడు బహుశా దీపకి తెలుసునేమో. తెలిసీ నాతో కాపురం చేస్తోంది. అందుకే ఆవిడ దేవత. ఆవిడ దేవత ఐతే, మరి నేను? బహుశా దెయ్యాన్నేమో? మరీ అంత వెధవనా? అంత వెధవనైతే గోపిక ఎందుకు రానిస్తుంది..ఎందుకు రానివ్వదూ? డబ్బులు చేదా? వెళ్ళిన ప్రతిసారీ ఐదువేలు ఊడగొడుతుందిగా, దొంగపీనుగ. ఛా..పాపం దొంగపీనుగ కాదులే. చాలా పద్ధతైన మనిషి. కన్యాశుల్కంలో మధురవాణి అంతటి మంచి మనిషి. ఎవర్ని చేరదియ్యాలో, ఎవర్ని దూరంగా అట్టేపెట్టాలో తెలిసిన మనిషి. రసికత తెలిసిన జాణ. నాకు స్ఫూర్తి నిచ్చే దేవత. ఏవిటో అందరూ దేవతలే…ఎటొచ్చీ నేనే…”

ఆలోచించగా అలోచించగా తన రూపం మరీ అష్టావక్రంగా కనిపించసాగింది మోహన్‌కి. ఎందుకో నవ్వొచ్చిందతనికి.

అతని భార్యకి ఇల్లు ఒక ఆలయం. దేవుడు నడి రాత్రి కొండదిగి వెళ్ళినా, ఆలయంలో ఉన్నప్పుడు పవిత్రంగా వుంటే చాలు అనుకునే మనస్తత్వం ఆమెది. ఇల్లాంటి పాత్రలు కేవలం పాత సినీమాల్లోనే చూసి ఎరుగును మోహన్‌.అందుకే అతనికి ఆమె అంటే చాలా గౌరవం, కొంచెం భయం కూడా. తప్పుచేస్తున్నవాడు సత్యపీఠమెక్కడానికి ఎలా భయపడతాడో, అతను ఆమె దగ్గర అలా భయపడతాడు. కానీ తను బైటపడటంలేదని అనుకుంటూ ఉంటాడు. ఆమెకి విషయం ఏవన్నా చూచాయగానన్నా తెలిసిందేమోనని అప్పుడప్పుడూ పరీక్షిస్తూ ఉంటాడు, పొంతనలేని ప్రశ్నలడిగి. ఆవిడ ఎప్పుడూ బయటపడదు. అందుకే ఆమె అతనికి అర్థం కాలేదు. ఆమె, భర్త కోరినది ఇస్తుంది, అతను కోరితే. లేకపోతే లేదు. అది అతనికి నచ్చదు. అతనో భావుకుడు, పిపాసి. అతనికి సృజనాత్మకత కావాలి, కొత్తదనం కావాలి. అమెకి తెల్లని పూలంటే ఇష్టం. అతనికి ఇంద్రధనుస్సంటే ప్రాణం. అందుకే అతనికి కావలసినది బహుశా గోపిక దగ్గర దొరుకుతుందేమోనని అపుడప్పుడూ వెడుతూంటాడు.

“సార్‌.”

చేతన్‌పిలుపుతో మళ్ళీ ఈలోకంలోకి వచ్చాడు మోహన్‌. ఏమిటన్నట్టు చూసాడు.

“ఇంకో అరగంటలో కాన్ఫరెన్సు కాల్‌ఉంది. ఈలోపులో మీరు ఈ ప్రెజెంటేషను రివ్యూ చేస్తే, మన టీమ్‌పని పూర్తి అవుతుంది సార్‌”

“ఓ.కే. లెట్‌మీ సీ…” అంటూ పేపర్లు అందుకున్నాడు.

“గోపీ పీన పయోధర మర్దన..”

అబ్బా, ఏవిటిది? పొద్దున్నించీ ఇదే పాట వేళ్ళాడుతోంది బుర్రలో. ఏవిటో. ఒక్కోరోజు అంతే. మొన్నటికి మొన్న ఇంకేదో పాట “కూడ బలుక్కుని కన్నారమ్మో నీయమ్మా, నాయమ్మా నా అత్త నీయమ్మో, నీ అత్త నాయమ్మో” అంటూ. ఇంట్లో అదే పాట, కారులో అదేపాట. ఆఖరికి లిఫ్టులో కూడా అదేపాట. పెదాలమీదకొచ్చేసింది అనుకోకుండా. అంతే, ఆ బిజినెస్‌ఎనలిష్టు లిడియా చూసిన చూపు ఇంకా గుర్తుంది. ఛీ ఛీ…ఏవిటో.

“గోపీ పీన పయోధర మర్దన…”

అబ్బా…జయదేవుడు గారూ. మీరు కాస్త ఊరుకుంటే, నేను ఈ పేపర్లు చూసుకుంటాను. “గోపీ…” .ఇంక వళ్ళు మండి పేపర్లు మొక్కుబడిగా తిరగేసి అవతల గిరాటెట్టాడు.

“గోపీ..”

ఆ వాక్యం గురించే ఆలోచన. నిజంగా ఎంతల్లా రాసేశాడు జయదేవుడు? సంస్కృతంలో రాసాడు కాబట్టి సరిపోయింది, అదే తెలుగులో రాసుంటే, మోతెత్తిపోయేదేమో. అది అమలిన శృంగారమని చెప్పేవారు సుబ్బారాయుడు మేష్టారు. నిజమే, అసలు శృంగారం ఎప్పుడూ అమలినమే. మనం చూసే దృష్టిని బట్టి, మన ఆలోచనని బట్టి అది మలినమైపోతూ ఉంటుంది. మంచి పాట వినడం, విందు భోజనం చెయ్యడం ఎలా తప్పుకాదో, అలాగే శృంగారాన్ని ఆనందించం, అనుభవించడం కూడా తప్పు కాదు.

అది ఈ సమాజం ఒప్పుకోదు. దాని కట్టుబాట్లు దానికున్నాయి.

అతని అవసరాలు అతనికున్నాయి.

అన్యమనస్కంగానే కాన్ఫరెన్సు కానిచ్చేసాడు. కిటికీలోంచి బయటకి చూస్తూ. బైట కనపడే సినీమా హాల్లో ఏదో ఇంగ్లీష్‌సినిమాలాగుంది. పోస్టర్లో కనిపించే యువతి మతి పోగొట్టేట్టుగా వుంది. అతనికి పదే పదే ఆ పాటే గుర్తొస్తోంది. ఆ యువతిలో అతనికి గోపిక కనబడింది. వెంటనే కోరిక పుట్టింది. ఎలాగూ భార్యా, పిల్లాడూ ఊరెళ్ళారు. సాయంత్రం ఓ సారి గోపిక దగ్గరికెళితే? అంతే, వెంటనే మిగితా పనులన్నీ పూర్తిచేసేసాడు. గోపికకి ఫోను చేసాడు. ఏడింటికల్లా రమ్మంది. తరవాత సమయం ఎలా గడిచిపోయిందో అతనికే తెలియదు. ఆరవుతూ ఉండగా కారు తీసి బయల్దేరాడు. ట్రాఫిక్కులో ఈదుకుని ఆమె అపార్టుమెంటుకి చేరేసరికి సరిగ్గా ఏడు. తలుపు తెరిచే ఉంది. లోపలికెళ్ళాడు. గోపిక రాత్రి భోజనం సిద్ధం చేస్తోంది. ఆమెని అలా వంటింట్లో గృహిణిగా చూస్తూంటే, పట్టరాని సంతోషం వేసింది.అరుకాసురుడు లాంటి అతని కోరిక అతణ్ణి మింగేసింది. పంటగడిలోకెళ్ళాల్సిన పావు, పామ్మింగేసి ఏ పదో గళ్ళోనో పడిపోయింది. అంతే, అమాంతం వెళ్ళి గోపికని చుట్టేసాడు. ఆతరవాత ఏమయ్యిందో అతనికి తెలియదు. ఏదో తుఫానులో కొట్టుకుపోతున్నట్టు లీలగా గుర్తుంది అతనికి. వాన వెలిసిపోయింది. అతనికేమీ గుర్తులేదు. ఆమెకి అంతా తెలుసు. అతను కళ్ళువిప్పి చూస్తే పక్కనే ఉంది గోపిక. అతని మనసులో ఇప్పుడా పాట లేదు. ఆ సినీమా యువతీ లేదు. గోపిక కూడా లేదు. ఆమె నవ్వుతోంది. “ఇప్పుడేమనిపిస్తోంది?” కొంటెగా అడిగింది. “నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తోంది, ఇంకా ఇక్కడ ఎందుకున్నానా అనిపిస్తోంది. నీ డబ్బు నీకు పారేసి, పారిపోవాలనిపిస్తోంది.” ఏ జంకూ లేకుండా నిజం చెప్పేసాడు మోహన్‌.

“నాకు తెలుసు, కానీ పూర్తిగా వెళిపోగలరా, మళ్ళీ, ఏ రెండ్రోజులకో, వారానికో రావాలనిపిస్తుంది. వస్తారు. మళ్ళీ ఇదే వ్యవహారం. పునరపి జననం, పునరపి మరణం, కదూ?”.

“అవును, ఎంత కాదన్నా నీలో ఒక శక్తి ఉంది, నాలో ఒక బలహీనత ఉంది. నా భార్యలో లేనిదేదో నీలో ఉంది. అందుకే వస్తున్నాను, పోతున్నాను, దారి తెలియక ఇలా తిరుగుతున్నాను.”

“దారులు మనకు కనిపిస్తాయి, గమ్యాలు మాత్రం కనబడవు. ఏగమ్యానికి వెళ్ళాలో ముందే నిర్ణయించుకోవాలి. మనం ఎంచుకున్న గమ్యాన్నిబట్టే దారులు నిర్దేశింపబడతాయి.”

“నా గమ్యం మంచిది కాదా?”

“అసలు మీ గమ్యమేవిటో మీకు తెలుసా?”

“…”

“మాటలతో విసిగిస్తున్నానా?”

“లేదు, నాకిలా మాట్లాడేవాళ్ళేకావాలి. నాకు నిశ్శబ్దమంటే పడదు. ఒంటరితనమంటే అంతకన్నా పడదు. జీవితంలో ప్రతీ క్షణం అనుభవించాలి, ఆనందించాలి, నేను నమ్మేవి రెండే రెండు, పుట్టుక, చావు అంతే. ఈ రెండిటి మధ్యలోనే జీవితం. ఎవరో అన్నట్టు స్వర్గం, నరకం, పునర్జన్మ..వీటిలో నాకు నమ్మకం లేదు.”

“అమ్మో, మన సంభాషణ ఎక్కడికో వెళిపోతోంది కదా..”

“అవునూ నిన్నొకటడుగుతాను చెప్పు, ఇందాకా నాకు నిన్ను చూస్తే అసహ్యం ఎందుకు వేసింది?”

“ఒడ్డు చేరేదాకా ఓడ మల్లన్న, ఒడ్డు చేరాకా బోడి మల్లన్న, సామెత వినలేదా?”

“..అంటే?”

“అంటే, అవసరం తీరేవరకే నేను అప్సరసలా కనిపిస్తాను. తీరిన వెంటనే ఆడ దెయ్యంలా కనిపిస్తాను, అదీ..సహజం.”

” నేను ఏ ఆనందాన్ని పొందాలని వస్తానో, అది దొరికీ దొరకకుండా మాయమౌతుంది. అందుకే మళ్ళీ మళ్ళీ వస్తున్నాను. నువ్వు చెప్పు, నాకేమిటి కావాలి, నా గమ్యమేవిటి?”

“తరవాత చెబుతాను గానీ, ముందు స్నానం చేసి రండి, హాయిగా భోజనం చేద్దాం, మీకోసం బిరియానీ చేసాను”

” నువ్వు నాకోసం ఇవన్నీ ఎందుకు చేస్తూంటావు, అందరిలాగా నా దగ్గరకూడా డబ్బు తీసుకుని తోలెయ్యచ్చుకదా?”

“తెలియదు, మీలో ఒక మొద్దబ్బాయి వున్నాడు, బహుశా నాలో ఒక అమ్మ వుందేమో, ఆ అమ్మకి వాడంటే చాలా ఇష్టం, అందుకేనేమో..”

“అర్థంకాలేదు..” అన్నాడు మోహన్‌అమాయకంగా..

“మరేం పర్లేదు గానీ..వెళ్ళి స్నానంచేసి రండి” అంది అతన్ని ముక్కు పట్టి లేపుతూ.

భోజనాలయ్యాయి.

“పోనీ ఇవాల్టికి ఇక్కడే ఉండిపోకూడదూ?” అడిగింది అతన్ని.

“నీకే నష్టం, అలోచించుకో..”

“ఆ నష్టం నాకిష్టమైతే, ఉంటారా?”

“ఇక్కడ వద్దు, ఎక్కడికైనా పోదాం, హాయిగా, మళ్ళీ రేప్పొద్దున్న నుంచీ గాడిద బతుకు మామూలేగా”

“సరే అయితే, ఐదు నిముషాల్లో రెడీ అయివస్తానుండండి” అంటూ లోపలికెళ్ళింది.

ఎవరికో ఫోను చేసింది. అలంకరించుకుని బయటికొచ్చింది. ఇప్పుడు అతన్నీ అమెనీ చూస్తే, భార్యాభర్తలంటే నమ్ముతారు.

“పదండి” అంది చెయ్యి పట్టుకుంటూ.

“గమ్యం తెలుసా?”

“ఇక్కడికి దూరంగా, ఒక ఫాం హౌస్‌కి”

“లోపలికెలా వెళ్తాం ?”

“ఇవిగో తాళాలు…” అంటూ ఒక తాళం గుత్తి చూపించింది.

“ఏవిటి పెద్ద పార్టీనా?” అడిగాడు కొంచెం అసూయగా.

“అవును, మినిస్టరుగారబ్బాయి, నాకు బర్త్‌డే గిఫ్టు”.

“ఏవిటీ, అచ్చంగానే?”

“కాదు, ఎప్పుడైనా వాడుకోడానికి”.

“బావుంది, సర్లే, నువ్వే డ్రైవ్‌చెయ్యి, నేనో చిన్న కునుకు తీస్తా అంటూ వెనక్కి వాలాడు సీట్లో.

కళ్ళు తెరిచేసరికి ఒక నిర్మానుష్యమైన రోడ్డు అక్కడోటి, అక్కడోటి గుడ్డి లైట్లు. కారు ఒకచోట కుడి వైపుకి తిరిగి ఆగింది. ఎదురుగా పేద్ద గేటు. వాచ్‌మెన్‌తో ఏదో చెప్పింది, గేటు తెరుచుకుంది.

లోపల కిలోమీటరు పొడవు రోడ్డు. అటు చివర పేద్ద పొలం. మధ్యలో సన్నపాటి కాలిదారులు. దానికి అవతల ఒక ఫాం హౌసు.

“దిగండి మొద్దబ్బాయిగారూ” అంది గోపిక.

ఇద్దరూ దిగారు. కారు అక్కడే పార్క్‌చేసి, నడవడం మొదలెట్టారు. చుట్టూ పంట చెక్కలు, కాలిదారిలో అక్కడక్కడా దీపాలు. పైన నిండు చందమామ. చల్లని వెన్నెల. ఇద్దరూ ఫాం హౌసు చేరారు. లోపలికెళ్ళి సోఫాలో కూర్చునారు.

అతను తదేకంగా ఆమెనే చూస్తున్నాడు. ఇప్పుడతనిలో కోరిక లేదు. కానీ ఎందుకో ఆమె బావుందనిపించింది.

“ఈ డ్రెస్సులు వద్దు, చీర కట్టుకుని రావా, ప్లీజ్‌ “అన్నాడు అమాయకంగా.

ఆమె చీర కట్టుకుని వచ్చింది.

“పదండి అలా వెన్నెల్లో నడుద్దాం” అంది. ఇద్దరూ బయటికొచ్చారు, చెయ్యి పట్టుకుని నడుస్తున్నారు. ఒక పక్కగా చిన్న కొలను కనపడింది.

“ఇలా రండి, ఈ గట్టు మీద కూర్చుందాం” అంది. ఆమె కూర్చుంది, అతను కూర్చుని ఆమె ఒడిలో తల పెట్టుకున్నాడు. ఆమె కళ్ళలోకి చూస్తూ

“నువ్వెవరు?” అడిగాడు.

“నేను మోహన్‌ని” అంది గోపిక.

“అబ్బా, అది కాదు, నాకు నీగురించి చెప్పు, తెలుసుకోవాలని ఉంది”.

“నేను బోలెడు కలలుగన్న ఓ ఆడపిల్లని. ఇంజనీరింగు చదివేదాన్ని తెలుసా?”

“మరి ఇలా ఎప్పుడయ్యావు?”

“బహుశా ఎనిమిదేళ్ళయిందనుకుంటా. నాకు సినిమాలో హీరోయిన్‌అవ్వాలని వుండేది తెలుసా? నేను బాగా పాడతాను కూడా. నాకు అవకాశమిస్తానని, హీరోయిన్ని చేస్తానని ఒకతను చెబితే, ఇంకేమీ అలోచించకుండా ఇక్కడికి వచ్చేసాను.”

“..అలా ఎవరిని పడితే వాళ్ళని నమ్మేయడమే?”

“అతను మా ఎమ్‌ఎల్‌యే గారి కొడుకు. మంచివాడే. ప్రేమించానన్నాడు.అతనితో వచ్చేస్తే నాకు కావలసింది ఇప్పిస్తానన్నాడు. నేను నా మాట నిలబెట్టుకున్నాను.”

“..అతను మోసంచేసాడు, అంతేనా?”

“లేదు. అతను నన్ను పెళ్ళి చేసుకున్నాడు. హైదరాబాదులో కాపురం కూడా పెట్టాము. కానీ పాత కక్షలతో, అతన్ని ఎవరో చంపేసారు. ఒకరోజు బైటకెళ్ళి తిరిగి రాలేదు” ఆగింది మౌనంగా ఎటో చూస్తూ.

“మరి వాళ్ళ వాళ్ళు?” అడి గాడు మోహన్‌

“వాళ్ళని చంపాకే..అతన్ని చంపేసారు, శతృ శేషం లేకుండా”.

“మరి మీ వాళ్ళు?”.

ఒక్క సారి మౌనంగా ఉండిపోయింది గోపిక. తరవాత చెప్పింది.
“ఒక సారి గడప దాటాకా, వాళ్ళకి నేను లేను, నాకు వాళ్ళు లేరు.”

“…”

“బాధగా ఉందా మోహన్‌?”

“అవును”.

“…”

“సరే, తరవాత ఏమయ్యింది?”

“ఏముంది, బతకడం నేర్చుకున్నాను. ఆడదాన్ని కాబట్టి, నానుంచి మగవాడు ఏమి ఆశిస్తాడో నాకు తెలుసు. అది వాడికిచ్చాను, నాక్కావలసింది తీసుకున్నాను.”

“మరి నీకు మీ ఆయన గుర్తు రాడా?”

“గుర్తొచ్చినా అతను తిరిగి రాడుగా? నేను అతని దగ్గరకి ధైర్యంచేసి వెళ్ళలేనుగా?”

” కష్టాలొచ్చిన ఆడవాళ్ళందరూ నీలాగే లేరుగా, నువ్వు వేరే పనేదైనా వెతుక్కొని ఉండచ్చుగా?”

“ఏవిటీ? సినిమాల్లో చూపిస్తారే, కుట్టుపని, చిప్స్‌అమ్మడం ఇలాంటివా? అవి చెయ్యాలంటే చాలా ఓపిక కావాలి. తీరా చేసినా, అక్కడ కూడా ఇదే సమస్య. ఒంటరిగా ఉన్న ఆడది అందరికీ కావాలి.

ఇంతమందితో వేగడం కన్నా, నేను ఎన్నుకున్న దారే సరైనదని నాకనిపించింది అప్పుడు. మోహన్‌., చిన్నప్పటినించీ నా దృష్టిలో నేనో యువరాణిని.అలాగే పెంచారు మా నాన్న. అడగకముందే అన్నీ తెచ్చి ఇచ్చేవారు. ఆయనలాంటి తండ్రి మరొకళ్ళు ఉండరేమో. అయినా కూడా నేను విదుల్చుకు వచ్చేసాను, చూసారా, కోరిక ఎంత బలమైనదో, ఎంత దుర్మార్గ మైనదో..?”

“అప్పుడు నీ గమ్యమేవిటి?”

“నాకు తెలియదు, మీలాగే, బాగున్న దారివెంట పరుగులెత్తాను, ఇంకా పరిగెడుతూనే ఉన్నాను”.

“గమ్యమంటే గుర్తొచ్చింది, నా గమ్యమేవిటో చెబుతానన్నావుగా, చెప్పు” అన్నాడు మోహన్‌ .

“ఓ..మొద్దబ్బాయ్‌ గారూ.. మీ గమ్యం ఆనందానుభవం. దానికోసం అక్కడా, ఇక్కడా పరిగెడుతున్నారు, కానీ ఆనందం మీ ఇంట్లోనే ఉంది తెలుసా?”

“ఏవి ఆనందంలే. నేను వెళ్ళేసరికి అన్నం రెడీ. తినేసరికి పిల్లాడ్ని పడుకోబెట్టి, తను వస్తుంది. నేను దగ్గరకు తీసుకుంటే సరి, లేదు, వెళ్ళి పడుకుంటుంది, ఇంక అక్కడ ఆనందం ఎలా ఉంటుంది చెప్పు?”

“మీ ఆవిడకిష్టమైన రంగేవిటి?”

“ఏమో..తెలుపో నలుపో, గుర్తులేదు, అయినా ఎందుకిప్పుడు? ”

“తనకి నచ్చిన పాటేమిటి? ”

“….”

“మీ ఆవిడ ఏ హాస్పిటల్లో పని చేస్తుంది?”

“సెంట్‌జోసఫ్‌ ”

“మీ ఆవిడకి నచ్చిన చీర ఏది?”

“….”

“మీ ఆవిడ ఏ కూర బాగా చేస్తుంది?”

“….”

“మీ ఆవిడ ఏ డ్రెస్సులో చాలా బావుంటుంది?”

“నీలం పట్టు చీరలో”

“ఒక్కసారి ఊహించుకోండి, ఆ పట్టుచీరలో మీ ఆవిణ్ణి. ఎలావుంది? నా కన్నా, మీరు చూసిన ఎంతోమంది అందమైన ఆడవాళ్ళకన్నా అందంగా ఉందా? లేదా?”

(మెల్లిగా..) “ఉంది. కాని…”

“నన్ను చెప్పనీండి మోహన్‌.పెళ్ళైన ఇన్నేళ్ళలో మీరెప్పుడైనా ఒకరినొకరు తెలుసుకునే ప్రయత్నం చేసారా? బహుశా లేదేమో. మీరామెకి భర్త. ఆమె మీకు భార్య. అంతే.. అంతకుమించి ఎవరూ ఎవరికీ ఏమీ కారు. ఇద్దరు అపరిచితుల్లా బతికేస్తున్నారు.

ఆనందం అనేది మన మనసులో ఉంటుంది మోహన్‌. ఒక మనిషిని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడు, వారిని వారికున్న లోపాలతో సహా స్వీకరించగలిగినప్పుడు, వారిమీద ప్రేమ పుడుతుంది. ఆ ప్రేమ భార్యాభర్తల మధ్య జీవితకాలం నిలబడే స్నేహానికి దారితీస్తుంది, అది శాశ్వత ఆనందాన్నిస్తుంది, ఆదే మీ గమ్యం. ఈ శృంగారం, కిందా మీదా పడడం, ఇవన్నీ పై పై మెరుగులే.”

“…”

“నేను మీకిచ్చే ఆనందం ఎలాంటిదో తెలుసా? అదిగో ఆ మిణుగురు పురుగును చూడండి. మెరుస్తుంది, ఆరిపోతుంది. అల్లాంటిదన్నమాట. మెరిస్తే ఆనందం. ఆరిపోతే అసహ్యం. అందుకే మీరు నన్ను ఇందాకా అసహ్యించుకున్నది.”

“నీకు నేనంటే ఇష్టమా?”

“చాలా. ఒక మొద్దబ్బాయంటే ఎవరికి ఇష్టం ఉండదు? మీరు చాలా మంచివారు. మీ మనసు బంగారం” అతని నుదురు ముద్దు పెట్టుకుంది.

“నువ్వు ఎంత మంచిదానివో…” అంటూ అతను ఆమె చేతిని ముద్దుపెట్టుకుంటూ.

“అవును, కానీ, దేవుడే చెడ్డవాడు, మనని వెంట్రుకవాసి పక్కదోవలో పడేసాడు” అంది నవ్వుతూ. అతనూ నవ్వాడు.

“అన్నీ తెలిసీ, నువ్వు ఎందుకిలా ఉన్నావు?” అడిగాడు.

“బతకాలిగా మరి” అంది ప్రశాంతమైన చిరునవ్వుతో చుక్కల్లోకి చూస్తూ.

తెల్లారింది. ఆతను ఆమెకి డబ్బులిచ్చి, దింపి ఇంటికొచ్చేసాడు. సాయంత్రం భార్యా, పిల్లాడు వచ్చేసారు. రాత్రైంది. ఎప్పటిలాగే పిల్లాణ్ణి పడుకోబెట్టి భార్య వచ్చింది.

” నీకు ఏ అష్టపదంటే చాలా ఇష్టం? ” అడిగాడు మోహన్‌ ,ఆమెను దగ్గరికి తీసుకుంటూ.

ఆమె అర్థం చేసుకుంది. ముందు నవ్వింది.తరవాత చెప్పింది.

వాళ్ళలా ఎంతసేపు మాట్టాడుకున్నారో తెలియదు, పడుక్కునే సరికి ఏ మూడో, నాలుగో అయ్యింది.

అతను వెతుకుతున్న ఆనందం అతనికి దొరికింది.

అతను ఇప్పుడు కూడా గోపిక దగ్గరికి వెడతాడు అప్పుడప్పుడూ, కానీ ఒక అవసరం తీర్చుకోడానికి మాత్రం కాదు, ఒక నేస్తాన్ని కలవడానికి. వీలున్నప్పుడల్లా అతనితో దీప కూడా వెడుతోంది.


శ్రీనివాస ఫణి కుమార్‌ డొక్కా

రచయిత శ్రీనివాస ఫణి కుమార్‌ డొక్కా గురించి: శ్రీనివాస ఫణికుమార్‌ డొక్కా జననం అమలాపురంలో. నివాసం అట్లాంటా జార్జియాలో. కంప్యూటర్‌ సైన్స్‌ ఫీల్డ్‌లో పనిచేస్తున్నారు. కథలు, కవితలు రాసారు. ...